kadapa steel factory
-
కడప ఉక్కు ఫ్యాక్టరీకి పూర్తి సహకారం అందించండి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు ఫ్యాక్టరీకి పూర్తి సహకారం అందించాలని మైనింగ్ శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి కేంద్రాన్ని కోరారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏపీ ప్రజల సెంటిమెంట్ అని, వైఎస్ జగన్ దీన్ని ప్రారంభించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఒడిశాలోని కోణార్క్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల మైనింగ్, పరిశ్రమల మంత్రులు, ఉన్నతాధికారులతో శుక్రవారం జరిగిన సమావేశానికి ఏపీ తరఫున ఆయన హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం గనులు, పరిశ్రమల విషయంలో తీసుకుంటున్న ప్రగతిశీల విధానాలపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు ప్రజెంటేషన్ ఇచ్చారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో అపారమైన ఇనుప ఖనిజం వనరులు ఉన్నాయని, కడప ఉక్కు రాష్ట్రానికి ఒక వరంగా మారుతుందని చెప్పారు. దేశంలోనే సుమారు 13 శాతం మ్యాగ్నటైట్ ఇనుప ఖనిజ నిల్వలు ఏపీలో ఉన్నాయని తెలిపారు. ఒక్క అనంతపురం జిల్లాలోని 6 మైనింగ్ రిజర్వుల పరిధిలోనే 110 మిలియన్ టన్నుల హైగ్రేడ్ ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయన్నారు. మ్యాగ్నటైట్ ఐరన్ ఓర్ గ్రేడ్లను కూడా బెనిఫికేషన్ చేసి, వాటిని ఉక్కు కర్మాగారానికి ముడి ఖనిజంగా వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను కేంద్రం పరిశీలించాలని కోరారు. అనంతపురంలోని ఇనుప ఖనిజం లీజులను ఏపీఎండీసీకి రిజర్వు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఏపీఎండీసీ బలోపేతానికి సహకరించాలని కోరారు. గనులకు అనుమతులు ఇచ్చే సమయంలో కనీసం 5 నుంచి 10 సంవత్సరాల కాలయాపన జరుగుతోందని, ఫలితంగా అనుకున్న లక్ష్యం ప్రకారం మైనింగ్ కార్యక్రమాలు జరగడం లేదని చెప్పారు. ఈ జాప్యాన్ని నివారించేందుకు కేంద్ర గనులు, పర్యావరణ మంత్రులు, రాష్ట్రానికి చెందిన ప్రతినిధులతో ఒక కోర్ కమిటీ ఏర్పాటు చేసి అనుమతుల జారీలో కాలయాపన లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ఆ కారణంగానే కడప స్టీల్ ప్లాంట్ పెండింగ్‌లో పడింది..
సాక్షి, అమరావతి: కడపలో ఉక్కు కార్మాగారం ఏర్పాటుపై పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి బుధవారం క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లిబర్టీ స్టీల్స్ అనే కంపెనీతో కలిసి కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించామని, అయితే ఆ కంపెనీ ఆర్ధిక పరిస్థితి అంత మెరుగ్గా లేకపోవడం వల్ల ఆ నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టామని పేర్కొన్నారు. లిబర్టీ స్టీల్స్ కు ఫండింగ్ చేసే సంస్థలు దివాళా తీశాయని, ఆ ప్రభావం లిబర్టీ స్టీల్స్‌పై పడిందని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో సదరు కంపెనీతో కలిసి కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న విషయం సహేతకం కాదని భావించి పెండింగ్‌లో పెట్టామని వివరణ ఇచ్చారు. ఈ విషయమై లిబర్టీ స్టీల్స్‌తో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, ఎల్-2గా వచ్చిన కంపెనీని పరిగణనలోకి తీసుకోవాలా లేక ప్రభుత్వమే నేరుగా చేపట్టాలా అనే అంశం పరిశీలనలో ఉందని, త్వరలో ఏ నిర్ణయం వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వానికి ప్లాన్-బి అమలు చేసే ఉద్దేశం కూడా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని పెద్ద, మధ్య తరహా పరిశ్రమలకు సుమారు రూ. 1000 కోట్లు, ఎంఎస్ఎంఈలకు రూ. 300 కోట్ల ప్రొత్సహాకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఏప్రిల్ 2న ఐటీ వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని, వివిధ సంస్థలకు చెందిన సీఈఓలు, సీఎఫ్ఓలు వర్క్ షాపునకు హాజరు కానున్నారని ఆయన వెల్లడించారు. -
ఏపీలో నవశకం మొదలవుతుంది..
సాక్షి, అమరావతి: కడప స్టీల్ ఫ్యాక్టరీతో పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్‌లో నవశకం మొదలవుతుందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు.30 వేల మందికి ఉపాధి కల్పించనున్న ఈ కర్మాగారం.. వెలుగు దివ్వెలా అభివృద్ధికి దారి చూపుతుందని తెలిపారు. కొరియన్ ఉక్కు దిగ్గజం పోస్కో ప్రభుత్వ చొరవను ప్రశంసించడం.. సీఎం జగన్ సంకల్పాన్ని బలపర్చినట్టైందని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. (చదవండి: ఏపీలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం) -
కడప : స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
-
సున్నపురాళ్లపల్లికి చేరుకున్న సీఎం
-
స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు కర్మాగారానికి ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఈ కర్మాగారాన్ని నిర్మిస్తున్నారు. అంతకు ముందు సున్నపురాళ్లపల్లెకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే నేటి నుంచి మూడు రోజుల పాటు సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలు.. ► 1.35 గంటలకు దువ్వూరు మండలం నేలటూరు గ్రామానికి చేరిక. ► 1.45 గంటలకు బహిరంగ సభాస్థలికి చేరుకుంటా రు. మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి బహిరంగసభలో పాల్గొంటారు. ► 3.40 గంటలకు కడప రిమ్స్‌కు వస్తారు. ► 3.55 నుంచి 4.05 గంటల వరకు కడప అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. ► 4.15 గంటలకు వైఎస్సార్ ఉచిత భోజన, వసతి భవనం వద్దకు చేరుకుంటారు. 4.20 నుంచి 4.25 గంటల వరకు భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ► 4.45 గంటలకు కడప–రాయచోటి మార్గంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుతారు. 4.50 నుంచి 5.00 గంటల వరకు అక్కడి రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ► సాయంత్రం 5.55 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ వద్దకు చేరుకుంటారు. 24వ తేది కార్యక్రమాలు ► ఉదయం 9.10 నుంచి 9.40 గంటల వరకు వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి ఘాట్ వద్ద నివాళులు. ► 9.55 గంటలకు అక్కడున్న చర్చి వద్దకు వెళతారు. ► 10.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరిగే ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొంటారు. ► 1.40 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి 2.00 గంటలకు రాయచోటి జూనియర్ కళాశాల గ్రౌండ్ వద్దకు చేరుకుంటారు. ► మధ్యాహ్నం 2.15 నుంచి 4.15 గంటల వరకు రాయచోటి నియోజకవర్గంలో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు నిర్వహించి బహిరంగ సభలో పాల్గొంటారు. ► 5.10 గంటలకు ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 25వ తేది కార్యక్రమాలు ► ఉదయం 9.30 గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలిప్యాడ్‌లో దిగుతారు. ► 9.45 గంటలకు సీఎస్ఐ చర్చికి చేరుకుంటారు. 9.50 నుంచి 11.10 గంటల వరకు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. ► 11.25 నుంచి 12.10 గంటల వరకు పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ► వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు ► 12.30 గంటలకు భాకరాపురంలోని నివాస గృహానికి చేరుకుంటారు. ► 2.35 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి 3.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 3.10 గంటలకు ఎయిర్‌పోర్టులో విమానంలో బయలుదేరి 4.00 గంటలకు గన్నవరం వెళతారు. -
కడపలో అభివృద్ధి పరుగులు
-
కడప ఉక్కు కల సాకారం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి కడప: రాయలసీమ ప్రజల దశాబ్ధాల కల నేడు సాకారం కానుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి కల్పించాలన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు కర్మాగారానికి సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న ఈ కర్మాగారానికి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,275.66 ఎకరాలను కేటాయించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు వడివడిగా అడుగులు వేశారు. ఇందుకోసం రూ.10 లక్షల మూల ధనంతో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట ఒక ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేశారు. విభజన హామీ చట్టం ప్రకారం వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ఉక్కు కర్మాగారానికి సంబంధించి కేంద్రంతో పలుదఫాలు చర్చించి కీలకమైన ముడి ఇనుము సరఫరా కోసం ఎన్ఎండీసీతో డిసెంబర్ 18న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రస్తుతం 4.8 మిలియన్ టన్నుల ముడి ఇనుము అవసరం కాగా, ఎన్ఎండీసీ 5 మిలియన్ టన్నులు సరఫరా చేయడానికి అంగీకరించింది. గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిని సరఫరా చేయనున్నారు. ఈ యూనిట్‌కు కేటాయించిన స్థలం నుంచే కడప–నంద్యాల రైల్వే ట్రాక్ ఉండటంతో పాటు ఏడు కిలోమీటర్ల దూరంలోనే 400 కేవీ సబ్‌స్టేషన్ కూడా ఉంది. ఇలా కీలకమైన అన్ని వనరులు సమకూరిన తర్వాతే శంకుస్థాపన చేస్తుండటం.. ఈ ప్రాజెక్టుపై సీఎంకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ఈ కర్మాగారానికి రూ.250 కోట్లు కేటాయించగా అందులో ఇప్పటికే రూ.62 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. కేంద్రం నుంచి రాయితీల డిమాండ్ ఈ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలకు అదనంగా కేంద్రం నుంచి కూడా పలు రాయితీలను కోరుతోంది. ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి తొలి ఏడేళ్లు ఐజీఎస్టీ మినహాయింపు, పదేళ్ల పాటు ఆదాయపు పన్ను మినహాయింపు, దిగుమతి చేసుకునే ముడి సరుకులపై సుంకాల మినహాయింపులను కోరుతోంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లపాటు యూనిట్ విద్యుత్ రూపాయికే ఇవ్వనుంది. స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, భూమి కొనుగోలు లేదా లీజు ఫీజుపై 100 శాతం మినహాయింపు, ఏడేళ్లపాటు ఎస్జీఎస్టీ వంటి అనేక రాయితీలను ఆఫర్ చేస్తోంది. కడపలో అభివృద్ధి పరుగులు వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే వైఎస్సార్ జిల్లాలో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, రాయచోటి నియోజకవర్గాల్లో పలు నీటి పారుదల ప్రాజెక్టులతోపాటు వైద్యశాలలు, రోడ్లు, డ్రైనేజీలు, గ్రామ సచివాలయ భవనాలతోపాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తుండటంతో జిల్లా దశ తిరిగినట్లేనని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ వల్ల స్థానికంగా వేలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలగనుంది. సీఎం శంకుస్థాపనలు, ప్రారంబోఉత్సవాలు ఇలా.. ►23వ తేదీ ఉదయం 10 గంటలకు జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ►కుందూనదిపై కుందూ – తెలుగుగంగ ఎత్తిపోతల పథకానికి, కర్నూలు – వైఎస్సార్ జిల్లాల సరిహద్దులో నిరి్మస్తున్న రాజోలి ఆనకట్ట నిర్మాణానికి, కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం జోలదరాశి వద్ద నిర్మించనున్న ఆనకట్టకు సంబంధించి దువ్వూరు మండలం నేలటూరు వద్ద శంకుస్థాపన శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ►సాయంత్రం కడపలో రిమ్స్ పరిధిలో రూ.107 కోట్లతో ఏర్పాటు చేయనున్న క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్, రూ.175 కోట్లతో నిర్మించే సూపర్ స్పెషాలిటీ విభాగం, రూ.40.80 కోట్లతో నిర్మించే మానసిక చికిత్సాలయం, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లకు శంకుస్థాపన చేస్తారు. ఇదే సందర్భంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సొంత నిధులతో నిరి్మంచిన ఉచిత అన్నదాన, వసతి భవనాన్ని ప్రారంభిస్తారు. ►రూ.20 కోట్లతో కడపలో నిరి్మంచనున్న డి్రస్టిక్ట్ పోలీసు కార్యాలయ భవనాలకు శంకుస్థాపన. ►కడప – రాయచోటి రోడ్డులో రూ.82.73 కోట్లతో నిరి్మంచిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. ►24వ తేదీ రాయచోటి ప్రాంతంలో రూ.1,272 కోట్లతో ఎత్తిపోతల ద్వారా జీఎన్ఎస్ఎస్ (గాలేరు నగరి సుజల స్రవంతి) – హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీ నీవా సుజల స్రవంతి) అనుసంధాన పథకానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం రాయచోటి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రాయచోటి జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ►25వ తేదీ పులివెందులలో రూ.347 కోట్లతో నిరి్మంచనున్న మెడికల్ కళాశాల, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రూ.17.50 కోట్లతో నిరి్మంచిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. -
అభివృద్ధే అజెండా
సార్వత్రిక సమరం ముగిసింది.. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.. ప్రజా సమస్యల చర్చలకు వేళయింది.. ఎన్నికల హామీల బరువుతో.. ప్రజాసంక్షేమం.. అభివృద్ధి బాధ్యతతో.. రా రమ్మంటూ అసెంబ్లీ ఆహ్వానిస్తోంది... నవ్యాంధ్రలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉంటూ పోరాడిన మన జిల్లా శాసనసభ్యులు ఇప్పుడు అధికార పక్ష హోదాలో జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన సమయం వచ్చింది. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీల అమలుకు అసెంబ్లీలో తమ వాణి వినిపించడానికి సిద్ధమవుతున్నారు. సాక్షి ప్రతినిధి కడప: ఏకపక్ష పాలనకు ఫుల్స్టాప్ పడింది. అర్హతతో నిమిత్తం లేకుండా పచ్చచొక్కాలకే ప్రభుత్వ పథకాలకు కాలం చెల్లింది. కొత్త పాలకపక్షం కొలువు తీరింది. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రభుత్వం అన్నట్లుగా వడివడిగా అడుగులు వేస్తోంది. బుధవారం అసెంబ్లీ వేదికగా నూతన ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆపై తొలిసారి అసెంబ్లీలో ప్రజా గొంతుక విన్పంచనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి నిర్వహించనుంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలచే ప్రొటెం స్పీకర్ చంబంగి అప్పలనాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం గురువారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది. ఆపై ప్రజా సమస్యలపై చర్చలు చేపట్టనున్నారు. కాగా పాలకపక్షంపై జిల్లా వాసులు అనేక ఆశలు పెట్టుకున్నారు. 2004–09లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం తరహా అభివృద్ధిని ఆశిస్తున్నారు. నాటి పెండింగ్ పథకాలపై సత్వర చర్యలు చేపట్టడంతో పాటు, నవ శకానికి తగ్గట్లుగా వృద్ధి సాధించాలని భావిస్తున్నారు. ఎన్నికల హామీల అమలుకు ప్రత్యేక శ్రద్ధ.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో ప్రధానంగా ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, శనగలకు గిట్టుబాటు ధర, గండికోట నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ హామీలిచ్చారు. ఆ మేరకు కార్యాచరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే జిల్లా కలెక్టర్ హరికిరణ్‌కు దిశా నిర్దేశం చేశారు. డిసెంబర్ లోపు స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇదివరకే అప్పటి టీడీపీ సర్కార్ పునాది రాయి మాత్రమే వేసింది. కాగా పునాది రాయితో పాటు అత్యంత వేగంగా స్టీల్ ప్లాంట్ నిర్మించాలనే దిశగా వైఎస్సార్సీపీ సర్కార్ రంగంలోకి దిగనుంది. 2022 నాటికి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయాలనే దిశగా అడుగులు వేస్తోంది. అలాగే బుడ్డ శనగలు రూ.6500తో కొనుగోలు చేసేందుకు కసరత్తు చేపట్టనున్నారు. ఆమేరకు జిల్లాలో ఉన్న స్టాకు, వాటిని కొనుగోలు చేయాల్సిన ప్రక్రియపై సమీక్ష చేయనున్నారు. గండికోట నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ రూ.10లక్షలు చేసే విషయమై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల హామీలతో పాటు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు సత్వరమే పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, బద్వేల్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమార్గం చూపనున్నారు. ఇప్పటికే తొలి కేబినెట్ సమావేశంలో చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణపై తీపి కబురు చెప్పారు. ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో పరిశ్రమల స్థాపనకు కృషి చేసే దిశగా ప్రజాప్రతినిధులు అడుగులు వేస్తున్నారు. ఇవన్నీ కూడా అసెంబ్లీలో చర్చకు రానున్నాయి. అర్థవంత చర్చకు అవకాశం.. గత ఐదేళ్లుగా అసెంబ్లీ సమావేశాలంటేనే ప్రతిపక్షంపై విసుర్లు, పాలకపక్షం బాకా కార్యక్రమంలా ఉండేది. ఉన్నది లేనట్లు...లేనిది ఉన్నట్లుగా ఓ మాయ ప్రపంచాన్ని సృష్టించి, భ్రమలు కల్పించే దిశగా టీడీపీ సర్కార్ వ్యవహరించింది. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ సర్కార్ ఇందుకు భిన్నంగా పనిచేయనుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా మంత్రి పదవులు కేటాయించే ముందు ఎమ్మెల్యేలకు వివరించి నిర్ణయం తీసుకోవడం, ప్రజాశ్రేయస్సు దృష్ట్యా పథకాలు అమలు చేస్తున్న తీరును విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. రాజకీయాలు, వర్గాలు, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టిన ఉదంతాన్ని సైతం పరిశీలకులు కొనియాడుతుండడం విశేషం. -
కడప స్టీల్ ప్లాంట్‌పై వారంలో ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై వారంలో అధికారిక ప్రకటన చేస్తామని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు అంశంపై చర్చించేందుకు టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్, జయదేవ్ తదితరులు శనివారం ఢిల్లీలో ఆయనను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, భాగస్వామ్య ఏర్పాటుపై ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రం ఇచ్చారు. ప్లాంట్‌ను మొత్తంగా కేంద్రం ఏర్పాటు చేయడం, లేదా ఏపీతో భాగస్వామ్యం, అదీ కుదరకుంటే మొత్తంగా ఏపీకి అప్పగించడం, ఏపీ–ప్రైవేటు భాగస్వామ్యం, పూర్తిగా ప్రైవేటుకు ఇవ్వడం.. వంటి ఐదు ప్రతిపాదనలపై చర్చించారు. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన జీ–2 లెవెల్ ఎక్స్‌ప్లోరేషన్ నివేదిక రావడానికి రెండేళ్లు పడుతుందని.. అప్పటిదాకా ఎదురుచూడకుండా మెకాన్ సంస్థ తన తుది నివేదిక ఇచ్చేలా ఆదేశాలివ్వాలని మంత్రిని కోరారు. 30 ఏళ్లపాటు ప్లాంట్‌కు ఖనిజ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఓబులాపురంలోని 8 గనుల్లో మూడింటిని 2020 నాటికి కడప స్టీల్ ప్లాంట్‌కు అప్పగిస్తామని తెలిపారు. కేంద్ర తరఫున ఏడేళ్లపాటు జీఎస్టీ మినహాయింపు, పదేళ్లపాటు ఐటీ మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఏపీ వ్యవహారాల్లో జీవీఎల్ తలదూర్చకుంటే మంచిది కేంద్ర మంత్రి మాట్లాడిన తీరు చూస్తే ప్లాంట్ ఏర్పాటు నిర్ణయం ఆయన చేతుల్లో లేనట్టు తెలుస్తోందని టీడీపీ ఎంపీలు సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. అయినా ఆయన మాత్రం సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఇక ప్లాంట్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నివేదికలు ఇవ్వకపోడంపై ట్విటర్లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేవనెత్తిన ప్రశ్నపై టీడీపీ ఎంపీలు స్పందిస్తూ.. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఎంపీగా ఎన్నికైన జీవీఎల్ ఏపీ వ్యవహారాల్లో తలదూర్చకపోతే మంచిదన్నారు. బీజేపీ ఆయన్ను ఆంబోతులా రాష్ట్రం మీదికి వదిలేసిందని విమర్శించారు. రాష్ట్రాన్ని దోచేస్తున్న ఆంబోతులెవరో ప్రజలకు తెలుసు: జీవీఎల్ నాలుగున్నరేళ్లుగా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచేస్తున్న ఆంబోతులెవరో ప్రజలకు తెలుసని టీడీపీ ఎంపీలనుద్దేశించి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. టీడీపీ ఎంపీలకు ఆర్భాటం ఎక్కువ, అవగాహన తక్కువంటూ ఎద్దేవా చేశారు. డ్రామాలు, అవినీతిపై వారికున్న శ్రద్ధ అభివృద్ధిపై ఉంటే బాగుండేదన్నారు. ఇక కేంద్రం ఇస్తున్న నిధులు, సహకారం విషయంలో చర్చకు రావాలని సవాల్ విసురుతున్న సీఎం రమేష్ కూడా సుజనాచౌదరిలా పారిపోతారా? అని ప్రశ్నించారు. చర్చకు సిద్ధమేనంటూ జీవీఎల్ శనివారం ట్వీట్ చేశారు. -
ఉక్కు కర్మాగారం అడిగితే ఉక్కుపాదమా?
సాక్షి, అమరావతి: కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణం గురించి ఆడిగిన విద్యార్థుల మీద రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా పోలీసు బలగాన్ని ప్రయోగించడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జగన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సీఎం చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు. విద్యార్థుల ఒంటి మీద పడిన ప్రతి ఒక్క దెబ్బా రాష్ట్ర ప్రజల గుండెల మీద మీరు చేస్తున్న గాయమేనని దుయ్యబట్టారు. విద్యార్థి నాయకుడు నాయక్ పరిస్థితి తనకు ఆందోళన కలిగిస్తోందని, ఆయనకు వెంటనే ప్రభుత్వం మంచి వైద్యం అందజేయాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లు కేంద్ర మంత్రివర్గంలో ఉన్న మీరు.. మీ కేసుల కోసం, లంచాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలి వేయడం వల్లే ఈ రోజు విద్యార్థులు, విపక్షాలు రోడ్డుకెక్కాల్సి వస్తోందని పేర్కొన్నారు. ‘గతంలో.. విద్యుత్ చార్జీలు తగ్గించండన్నందుకు బషీర్‌బాగ్‌లో ప్రజల గుండెల మీద కాల్పించారు. ఇప్పుడు గ్రామగ్రామానా, ప్రతి జిల్లాలో మీరు, మీ పార్టనర్లూ చేసిన వందల వంచనల మీద ప్రజలు గర్జిస్తున్నారు. చేతలతో సమాధానమివ్వలేని మీరు వారందరికీ లాఠీలతో, తుపాకులతో సమాధానం ఇస్తారా? బాబు గారు ఇది దుర్మార్గం’ అని తూర్పారపట్టారు. -
రేపు విద్యాసంస్థల బంద్
సాక్షి, వైఎస్సార్ కడప: శాంతి యుతంగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై పోలీసుల వ్యవహారశైలికి నిరసనగా రేపు(ఆగస్టు4) విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది.‘కడప ఉక్కు ఆంధ్రుల హక్కు’ అంటూ ఉక్కు పరిశ్రమ సాధన కోసం గత కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళనల్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఎస్ఎఫ్ఐ నాయకుడు నాయక్‌తో పాటు పలువురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈ మేరకు జేఏసీ బంద్‌కు సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, జనసేన పార్టీలతో పాటు కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహ్మతుల్లా మద్దతు తెలిపారు. -
‘చంద్రబాబుకు మతి స్థిమితం బాగోలేదు’
సాక్షి, అమరావతి : ప్రజల్లో టీడీపీపై వస్తున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేక చంద్రబాబు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. కడపలో ఆదివారం ఓ సమావేశంలో కన్నా మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్‌ను మోదీ తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఏపీకి ఇచ్చినా మోదీపై బురద జల్లడం ఏంటని మండపడ్డారు. ఏపీ ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలని కోరారు. రాష్ట్ర అభివృద్దికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కడప ఉక్కు పరిశ్రమకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేసిన సీఎం రమేష్ మెకాన్ అడిగిన నివేదికను ఇప్పించాలని కోరారు. ఇతర రాష్ట్రాలు రాజకీయ విమర్శలు చేస్తుంటే ఏపీ మాత్రం కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించడం తగదని అన్నారు. తెలంగాణ, ఏపీలో ఉక్కు పరిశ్రమను నిర్మించి తీరుతామని తెలిపారు. స్ర్కాప్ విషయంలో చైనాతో ఒప్పందం చేసుకునందుకే కడప ఉక్కు ఫ్యాక్టరీను చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకి భూ దాహం, ధన దాహం పట్టుకుందని, అందుకే డాట్ భూములను తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు మతిస్థితి బాగోలేదని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఎటు వెళ్తుందో కూడ బాబుకు అర్దం కావట్టేదని వ్యాఖ్యానించారు. బాధ్యత కలిగిన రాజ్యసభ సభ్యులు ఆలోచించకుండా దీక్ష ఎలా చేశారని ప్రశ్నించారు. -
రాష్ట్ర శ్రేయస్సు కన్నా బాబుకు కమీషన్లే ముఖ్యం
-
అబద్ధాల మీద టీడీపీ పాలన సాగిస్తోంది
హైదరాబాద్: ఏపీలో టీడీపీ ప్రభుత్వం అబద్ధాల మీద పాలన సాగిస్తోందని బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాయలంలో విలేకరులతో మాట్లాడుతూ..కడప ఉక్కు పరిశ్రమ విషయంలో ఏపీ ప్రజలను, ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మోసానికి పాల్పడుతోందని అన్నారు. ఉక్కు పరిశ్రమపై గతంలో నాలుగు సార్లు సమావేశం పెట్టాం..కానీ టీడీపీ ప్రభుత్వం రాయలసీమలో ఉక్కు పరిశ్రమ పెట్టకూడదని అనుకుంటుందని ఆరోపించారు. ఉక్కు పరిశ్రమ విషయంలో టీడీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి కోర్టులో కేసు కూడా వేశారు..ఈ మధ్య సీఎం రమేశ్‌తో దీక్ష చేయించారని వ్యాఖ్యానించారు. బరువు తగ్గాలంటే దీక్షలు చేయాలని ఈ నడుమ టీడీపీ ఎంపీలు కూడా ఢిల్లీలో కూడా మాట్లాడుకుంటున్నారని వెల్లడించారు. ఏపీ ప్రజల మనోభావాలను దెబ్బతీసి ఇలాంటి దొంగ దీక్షలు చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీ వేసి 10 సార్లు ఢిల్లీ వెళ్లింది.. కానీ టీడీపీ ఇప్పటి వరకు ఇలాంటి ప్రయత్నం చేసిందా అని సూటిగా అడిగారు. టీడీపీ నేతలకు నిజాయితీ ఉంటే సక్రమంగా ప్రయత్నించాలి..ఉక్కు పరిశ్రమకు కేంద్రమే రూ.20 వేల కోట్లు ఇస్తుందని తెలిపారు. కానీ టీడీపీ నేతలు తుక్కు పరిశ్రమ కోసం ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రతిపక్షాలు తిరిగే పరిస్థితి లేదని, రాష్ట్రపతి పాలన తీసుకురావాల్సిన అవసరం కనబడుతోందని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులపై ఏపీలో దాడులు జరుగుతున్నాయని, ఈ విషయమై బీజేపీ బృందం మంగళవారం గవర్నర్‌ని కలుస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సిద్ధం అవుతుంది.. కానీ ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. టీడీపీ పాలన బాగుందని చెప్పుకుంటున్నారు కదా పంచాయతీ ఎన్నికలపై ఎందుకు పారిపోతున్నారని సూటిగా ప్రశ్నించారు. -
బరువు తగ్గాలి.. దీక్షలు చేద్దాం
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ‘‘ఐదు కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నాను. ఒక వారం రోజులైతే నేను దీక్ష చేస్తా’’ ఇది ఓ టీడీపీ ఎంపీ మాట. దీక్షలు, హామీల సాధనపై ఆ పార్టీ నేతల చిత్తశుద్ధిని బయట పెట్టిన వ్యాఖ్య. కడుపుకాలిన ప్రజలు ఓ పక్కన కష్టాలకోర్చుకుని దీక్షలు చేస్తుంటే.. కడుపు నిండిన టీడీపీ నేతల వెటకారాన్ని బయటపెట్టిన సందర్భం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటిని సాధించకుండా టీడీపీ ఎంపీలు చేస్తున్న కపటనాటకాలు ఢిల్లీ వేదికగా బహిర్గతమయ్యాయి. హామీల సాధన పేరుతో చేస్తున్న డ్రామాలు, దొంగ దీక్షలు చివరికి వారి నోటివెంటే చెప్పుకున్నారు. టీడీపీ ఎంపీల సంభాషణల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ సాధన కోసం ఢిల్లీలో పోరాటం చేస్తాం, కేంద్ర మంత్రి వద్ద ధర్నా చేస్తాం అంటూ ఆ పార్టీ ఎంపీలు గత రెండు రోజులుగా ఢిల్లీలో నడుపుతున్న వ్యవహారం బూటకమని తేలిపోయింది. బుధవారం కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌తో సమావేశమైనా స్పష్టమైన హామీ సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రానికి ఇవ్వాల్సిన సమాచారంపై చర్చించేందుకంటూ టీడీపీ ఎంపీలు దివాకర్‌రెడ్డి, మురళీమోహన్, కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్నాయుడు, కేశినేని నాని, అవంతి శ్రీనివాస్ తదితరులు గురువారం ఢిల్లీలోని ఏపీ భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ.. ‘ఐదు కేజీలు బరువు తగ్గాలనుకుంటున్నాను. ఒక వారం రోజులైతే నేను దీక్ష చేస్తా’ అని అన్నారు. ఈ క్రమంలో దివాకర్‌రెడ్డి కల్పించుకొని ‘ఈయన్ను పెడదాం..డన్’ అన్నారు. ఇంతలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కల్పించుకొని.. ‘ఆయన్న మొదటి రోజే రామ్మనోహర్ లోహియా ఆస్పత్రికి తీసుకెళ్లాం (గత పార్లమెంటు సమావేశాల్లో దీక్ష పేరుతో చేసిన డ్రామా ఉదంతాన్ని ఉటంకిస్తూ). అలాంటిది మీరెందుకు ఆయన్ను అంటారు’ అని అన్నారు. వెంటనే ఎంపీ రామ్మోహన్నాయుడు స్పందిస్తూ.. ‘అదేకదా’ అని అనగానే ఎంపీలందరూ నవ్వుకున్నారు. ఈ క్రమంలో ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ..‘జోనూ లేదు.. గీనూ లేదు’ అంటూ విశాఖ రైల్వే జోన్ సాధనలో ఏ మాత్రం చిత్తశుద్ధి లేనితనాన్ని నిరూపించుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై కపట నాటకాలా?? కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు ఆడుతున్న నాటకం బయటపడటంతో ప్రజలు మండిపడుతున్నారు. టీడీపీ ఎంపీల వెటకారపు మాటలపై నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్ర ప్రజల జీవన్మరణ సమస్యలపై టీడీపీ నేతల నీతి, నిజాయితీ ఇదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగ దీక్షలు చేసి అసలు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని, కపట నాటకాలతో రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఓట్ల కోసమే దీక్షల డ్రామా మొదలుపెట్టారని భావిస్తున్నారు. గారడీలో చంద్రబాబు దిట్ట: విజయసాయిరెడ్డి సీఎం చంద్రబాబు ఇంద్రజాల దిగ్గజం పీసీ సర్కార్‌ను మించిన వాడని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు జిమ్మిక్కులపై ఆయన ట్విటర్లో మండిపడ్డారు. గాల్లో అసెంబ్లీని నిర్మించి కార్యకలాపాలు కొనసాగిస్తారని, అంకెల్లోనే అభివృద్ధి చూపుతారని, చెట్లు లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ను హరితవనం చేస్తారని, ప్రసంగాల్లోనే యువతకు ఉపాధి, ఉద్యోగాలు చూపిస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతి, అన్యాయ పాలనలో రాష్ట్రం దశాబ్దాల వెనక్కి పోయిందన్నారు. ప్రజల సంక్షేమాన్ని, ఆకాంక్షలను గాలికొదిలేశారని మండిపడ్డారు. -
టీడీపీ నేతలవి అసత్య ప్రచారాలు: పురందేశ్వరి
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తే తమ తల్లికి తామే అన్యాయం చేసినట్లు అవుతుందని బీజేపీ జాతీయ మహిళా మోర్చా కన్వీనర్ దగ్గబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది విషయంలో తమ పార్టీ వివక్ష చూపటంలేదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాలకు బీజేపీ సానుకూలంగా ఉందని తెలిపారు. ఏపీకి అన్యాయం జరిగితే తాము ఎందుకు చూస్తూ ఊరుకుంటామని ప్రశ్నించారు. టీడీపీ నేతలు కావాలనే బీజేపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారిని నమ్మవద్దని పురందేశ్వరి ప్రజలకు సూచించారు. , -
కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం 29న ఏపీ బంద్
-
ఉక్కు ఫ్యాక్టరీ సాధన: ఏపీ బంద్‌కు పిలుపు
ప్రొద్దుటూరు, వైఎస్సార్ కడప : కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఈ నెల 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి గురువారం ప్రొద్దుటూరులో ప్రకటన చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఈ నెల 23న కడప, 24న బద్వేల్, 25న రాజంపేటల్లో వైఎస్సార్ సీపీ ధర్నాలు చేస్తుందని వెల్లడించారు. 26న జమ్మలమడుగులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకూ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. 27న రహదారుల దిగ్భంధం, 29న రాష్ట్ర బంద్ చేపడతామని వివరించారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో బీజేపీ-టీడీపీలు ఉక్కు ఫ్యాక్టరీ ఊసేత్తలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి టీడీపీ మాట్లాడుతోందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ ఉక్కు ఫ్యాక్టరీని డిమాండ్ చేస్తోందని చెప్పారు. మరోవైపు చంద్రబాబు తన తప్పిదాలను బీజేపీపైకి నెడుతున్నారని పేర్కొన్నారు. -
‘విభజన హామీలపై దమ్ముంటే చర్చకు రండి’
సాక్షి, విజయవాడ : కడప స్టీల్ ప్యాక్టరీ సాధన ఉద్యమం తీవ్రతరం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయాల్సిందే అని అఖిలపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు. కడపలో స్టీల్ ప్యాక్టరీ నిర్మించే వరకు ఉద్యమం ఆగదని వారు తెలపారు. ఉద్యమానికి సంఘీబావంగా సీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ, జనసేన, కాంగ్రెస్, ఆమ్ అద్మి పార్టీల నేతలు, వివిధ ప్రజాసంఘాల నేతలు విజయవాడలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్టీల్ ప్యాక్టరీ రాయలసీమ ప్రాంత ప్రజల సమస్య మాత్రమే కాదు.. అది రాష్ట్ర ప్రజల సమస్య అని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనకబడిన రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ.. కడపలో స్టీల్ ప్యాక్టరీ నిర్మాణం చేపడతామని విభజన సమయంలో హామీ ఇచ్చారు. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు జరపాల్సిందేననని ఆయన పేర్కొన్నారు. ‘స్టీల్ ప్యాక్టరీ నిర్మాణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దు. ఇది ఇప్పటి సమస్య కాదు..13వ షెడ్యుల్‌లో పొందుపరిచిన అంశం. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి. ఇప్పుడు టీడీపీ రాజకీయ నాటకం ఆడుతుందని’ ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు 80 శాతం హామీలు అమలు జరిపామని చెబుతున్నారు. వారికి అసలు విభజన హామీలపై అవగాహన లేనట్లుందని విమర్శుల గుప్పించారు. బీజేపీ నేతలు మీడియా సమక్షంలో విభజన హామీలపై చర్చిద్దాం.. దమ్ముంటే చర్చకి రావాలని రామకృష్ణ సవాలు విసిరారు. టీడీపీ ప్రజలు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. 29వ తేదిన కడపలో జిల్లాలో జరిగే బంద్‌కు పూర్తి మద్దతు తెలుపుతామన్నారు. అంతేకాక ఆ రోజు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలిపారు. విద్యార్థులు ఉద్యమంలో పెద్దెత్తున పాల్గొనేలా ఉద్యమాన్ని నిర్మించాలని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. కడప ఉక్కు, విశాఖ రైల్వే జోన్, ఉత్తారాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ సాధించే వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తి లేదని సీపీఎం రాష్ట్ర నేత సీహెచ్ బాబురావు స్పష్టం చేశారు. అవసరమైతే మరోసారి రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామన్నారు. కడప జిల్లా బంద్‌కు పూర్తిగా సంఘీబావం ప్రకటిస్తూ ప్రత్యక్షంగా పాల్గొంటామని ఆయన తెలిపారు. బీజేపీ, టీడీపీ రాజకీయ ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రజలతో ఆటలాడితే తగిన బుద్ధి చెబుతామని బాబురావు హెచ్చరించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో గతంలో జరిగిన ఉద్యమాన్ని కడప జిల్లా సీపీఐ కార్యదర్శి ఈశ్వరయ్య గుర్తు చేశారు. అదే మాదిరి ప్రస్తుతం రాష్ట్రంలో కడప స్టీల్ ప్యాక్టరీ సాధన కోసం అలాగే ఉద్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. అనాడు 38మంది విద్యార్థుల ప్రాణత్యాగం చేశారు.. ఎటువంటి పోరాటానికైన మేము సిద్ధంగా ఉన్నామని ఈశ్వరయ్య అన్నారు. టీడీపీ నేతలు రాష్ట్రంలో నిరహరదీక్షలు కాదు.. ఢిల్లీలో దీక్షలు చేయాలని ఈశ్వరయ్య హితవు పలికారు. -
రాజీనామాలకు సిద్ధం: శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, కడప : నాలుగేళ్లుగా కడప ఉక్కు పరిశ్రమ కోసం పోరాటాలు చేసిన వారిపై అక్రమ కేసులు పెట్టిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఉక్కుదీక్ష చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. టీడీపీది చేసేది ఉక్కు దీక్ష కాదని పార్టీ ఇమేజ్ కోసం ఏర్పాటు చేసిన ఈవెంట్ అని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కడప ఉక్కు కోసం తమ పార్టీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తోదన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం రాజీనామాలకు సిద్ధమని పేర్కొన్నారు. మహానేత వైఎస్సార్ కేంద్రంపై ఆధారపడకుండా దృఢసంకల్పంతో ఉక్కుపరిశ్రమ స్థాపించి రెండు వేల కోట్ల రూపాయాల పనులు చేయించారని గుర్తుచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఎన్నికల ముందు కడపను టీహబ్ చేస్తా, హర్ట్ కల్చర్ హబ్ చేస్తామని వాగ్దానాలు చేసిన టీడీపీ ఒక్కపని కూడా చేయలేదని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధిపై టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఉక్కు పరిశ్రమ, హైకోర్టుతో పాటు రెండో రాజధానిని ఇక్కడ నిర్మించాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. -
కడప ఉక్కు ఫ్యాక్టరీకి అనుకూలత లేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలు కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం బుధవారం కౌంటర్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లో ప్రతివాదులైన ఉక్కు శాఖ, ఆదాయపు పన్ను విభాగం ఈ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఏపీలోని వైఎస్సార్ జిల్లా, తెలంగాణలోని బయ్యారంలో స్టీలు ఫ్యాక్టరీల ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తూ విభజన చట్టం అమల్లోకి వచ్చిన ఆరు నెలల్లో యోగ్యత నివేదిక ఇవ్వాలని మాత్రమే చట్టం చెప్పిందని, ఆయా ఫ్యాక్టరీల ఏర్పాటుకు అనుకూలత లేదని సెయిల్ నివేదిక ఇచ్చిందని ఉక్కు శాఖ పేర్కొంది. దీనికి సంబంధించి 2016లో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటైందని వివరించింది. 2017 డిసెంబర్ 12న ఈ కమిటీ చివరిసారిగా సమావేశమైందని, యోగ్యతపై అధ్యయనం చేస్తున్న మెకాన్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సమాచారాన్ని పంచుకోవాలని కమిటీ సూచించిందని వివరించింది. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పన్ను రాయితీల విషయంలో అదనపు డిప్రిసియేషన్‌ను సాధారణంగా ఇచ్చే 20 శాతానికి అదనంగా మరో 15 శాతం ప్రకటించామని, అలాగే అదనపు పెట్టుబడి భత్యం కింద 15 శాతం ప్రకటించామని ఆదాయపు పన్ను శాఖ తన అఫిడవిట్లో పేర్కొంది. -
కడప స్టీల్ ఫ్యాక్టరీ: టీడీపీ నేతల దీక్ష డ్రామా
-
ఉక్కు పరిశ్రమ సాధనే లక్ష్యంగా ఉద్యమం
రాజంపేట టౌన్: కడపలో ఉక్కుఫ్యాక్టరీ స్థాపనే లక్ష్యంగా ఉద్యమం సాగిస్తామని రాయలసీమ విద్యార్థి యువజన సంఘం (ఆర్‌ఎస్‌వైఎఫ్) జిల్లా కార్యదర్శి ఓబులేసుయాదవ్ తెలిపారు. ఆర్‌ఎస్‌వైఎఫ్ చేపట్టిన జీపుయాత్ర సోమవారం రాజంపేటకు చేరింది. ఈసందర్భంగా స్థానిక వైఎస్సార్ సర్కిల్ (పాతబస్టాండు)లో జరిగిన సభలో ఓబులేసుయాదవ్ మాట్లాడారు. రాయలసీమను అభివృద్ది చేయాలన్న సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి 2007వ సంవత్సరంలో జమ్మలమడుగు ప్రాంతంలో ఉక్కుపరిశ్రమకు శంఖుస్థాపన చేశారన్నారు. రాజశేఖర్‌రెడ్డి మృతి చెందిన తరువాత ఉక్కుపరిశ్రమను పట్టించుకునే నాధుడే కరవయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటైతే దాదాపు ఇరవైల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని పార్లమెంటు సాక్షిగా ప్రధాని హామీ ఇచ్చి మూడు సంవత్సరాలైనా పరిశ్రమ ఏర్పాటులో ఎలాంటి ప్రగతి లేదన్నారు. అంతేకాక ఉక్కు పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం యత్నిస్తుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌లో రాయలసీమ పరిస్థితి చాలా ఆధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజధానిలో విద్య, ఉద్యోగ అవకాశాల కేటాయింపుల్లో ప్రభుత్వం ఒక ప్రాంతానికే ప్రాధాన్యత ఇస్తుందని ఆయన ఆరోపించారు. ఇందువల్ల రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆర్‌ఎస్‌వైఎఫ్ నాయకులు డీ.నరసింహ, లక్ష్మీనారాయణ, మహేష్, రవి, వివేక్, ప్రసన్న, రాజు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
సీమ ద్రోహి చంద్రబాబు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : సీమకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తున్న చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని సీపీఎం సీమ సబ్ కమిటీ కన్వీనర్ జి.ఓబులు పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమకు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాల్సిందిపోయి మోడీ, చంద్రబాబులు దొంగనాటకాలు ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమకు అన్ని సౌకర్యాలు ఉన్నా ఫీజిబిలిటీ లేదనడం సరికాదన్నారు. చంద్రబాబు కేంద్రం చేతిలో Mీ లు బొమ్మలా మారి ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ మాత్రమే చాలని చెప్పడం సిగ్గు చేటన్నారు. కర్నూలు జిల్లాలో వ్యాగన్ల కంపెనీని నిర్మిస్తామన్నారని, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీని నెలకొల్పుతామని చెప్పి ఇంత వరకు ఆ మాటే ఎత్తడం లేదన్నారు. చిత్తూరు జిల్లాలో మన్నవరం, బీహెచ్సీఎల్ ప్రాజెక్టు తయారీ కేంద్రాన్ని రూ. 6 వేల కోట్లతో నిర్మాణం చేపట్టాల్సి ఉండగా పట్టించుకోవడం లేదన్నారు. సీమకు జీవనాధార ప్రాజెక్టులైన హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి సాగు నీరు అందించాలన్నారు. వెనుకబడ్డ రాయలసీమకు జిల్లాకు రూ 50 కోట్లు మాత్రమే నిధులు ఇలా ఐదు సంవత్సరాలిస్తే ఏఒక్క ప్రాజెక్టు పూర్తి కావన్నారు.సీమ జిల్లాలో ఉపాధి కల్పించే ఒక భారీ పరిశ్రమ కూడా లేకపోవడం బాధాకరమన్నారు. బీజేపీ రాష్ట్ర «అధ్యక్షుడు హరిబాబు ఉక్కు పరిశ్రమపై ప్రతిపక్షాలు రాద్దాంతాలు అనవసరమని చెప్పడం సిగ్గు చేటన్నారు.కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు రాయలసీమ పట్ల వివక్షత చూపుతూ అన్ని విషయాల్లో అన్యాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నారాయణ, సీపీఎం చిత్తూరు జిల్లా సెక్రటరీ కుమార్‌రెడ్డి, అనంతపురం సీపీఎం జిల్లా సెక్రటరీ వి.రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి అంజనేయులు పాల్గొన్నారు.