kharif crops
-
వాతావరణం లో అపరిచిత ధోరణులు
వాన రాకడ, ప్రాణం పోకడ తెలియదంటారు. కొన్నేళ్లుగా మన దేశంలో వానాకాలం ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పటిదాకా కొనసాగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు అకాలంలో భారీ వానలు, సీజన్ మధ్యలో విపరీతమైన ఎండలు పరిపాటిగా మారాయి. వాతావరణ తీరుతెన్నుల్లో ఈ భారీ మార్పులు భారత్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాల సీజన్ తీరుతెన్నులే మారిపోతున్నాయి. సీజనల్ వానలు సాధారణంగా జూన్ తొలి, లేదా రెండో వారంలో మొదలై సెపె్టంబర్లో తగ్గుముఖం పడతాయి. కానీ ఈ క్రమం కొన్నేళ్లుగా భారీ మార్పుచేర్పులకు లోనవుతోంది. వానలు ఆలస్యంగా మొదలవడం, సెప్టెంబర్‌ను దాటేసి అక్టోబర్ దాకా కొనసాగడం పరిపాటిగా మారింది. దాంతో ఖరీఫ్ పంటలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. సరిగ్గా చేతికొచ్చే వేళ వానల కారణంగా దెబ్బ తినిపోతున్నాయి. ప్రస్తుత వర్షాకాల సీజన్ కూడా అక్టోబర్ దాకా కొనసాగవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలు గుబులు రేపుతున్నాయి. ఇదంతా వాతావరణ మార్పుల తాలూకు విపరిణామమేనని సైంటిస్టులు చెబుతున్నారు... భారత్‌లో వర్షాకాలం రాకపోకల్లో మార్పులు ఒకట్రెండేళ్లలో మొదలైనవేమీ కాదు. పదేళ్లుగా క్రమంగా చోటుచేసుకుంటూ వస్తున్నాయి. ఏటా పలు రాష్ట్రాల్లో భయానక వరదలకే గాక తీవ్ర పంట నష్టానికీ దారి తీస్తున్నాయి. ఈ ధోరణి దేశ ఆహార భద్రతకు కూడా సవాలుగా పరిణమిస్తోంది. దీన్ని ఎదుర్కోవాలంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు పద్ధతులను మార్చుకోవడం మినహా ప్రస్తుతానికి మరో మార్గాంతరమేదీ లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ‘‘మన దేశంలో వర్షాలకు ప్రధాన కారణమైన నైరుతీ రుతుపవనాల కదలికలు కొన్నేళ్లుగా బాగా మందగిస్తున్నాయి. వాటి విస్తరణే గాక ఉపసంహరణ కూడా నెమ్మదిస్తూ వస్తోంది. మనం ఒప్పుకోక తప్పని వాతావరణ మార్పులివి. మన సాగు పద్ధతులనూ అందుకు తగ్గట్టుగా మార్చుకోవాల్సిందే’’ అని చెబుతున్నారు. అంతా గందరగోళమే... సీజన్లో మార్పుచేర్పుల వల్ల ఉత్తర, పశ్చిమ భారతాల్లో కొన్నేళ్లుగా భారీ వర్షపాతం నమోదవుతోంది. గుజరాత్, రాజస్తాన్‌లలో గత దశాబ్ద కాలంగా సగటున ఏకంగా 30 శాతం అధిక వర్షపాతం నమోదవడమే ఇందుకు తార్కాణం. ఆ ప్రాంతాల్లో గతంలో లేని భారీ వర్షాలు ఇప్పుడు మామూలు దృశ్యంగా మారాయి. ఇక గంగా మైదాన ప్రాంతాల్లో అక్టోబర్ దాకా కొనసాగుతున్న భారీ వానలు ఉత్తరాఖండ్, యూపీ, బిహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో పంటల సీజన్‌నే అతలాకుతలం చేసేస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో అక్టోబర్ తొలి వారంలో పంట కోతలు జరుగుతాయి. అదే సమయంలో వానలు విరుచుకుపడుతున్నాయి. ‘‘దాంతో కోతలు ఆలస్యమవడమే గాక పంట నాణ్యత కూడా తీవ్రంగా దెబ్బ తింటోంది. మొత్తంగా వరి, మొక్కజొన్న, పప్పుల దిగుబడి బాగా తగ్గుతోంది’’ అని కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎని్వరాన్‌మెంట్ అండ్ వాటర్‌లో సీనియర్ ప్రోగ్రాం లీడ్ విశ్వాస్ చితాలే అన్నారు. ఆహార భద్రతకూ ముప్పు వర్షాలు సీజన్‌ను దాటి కొనసాగడం వల్ల ఖరీఫ్ పంటలు దారుణంగా దెబ్బ తింటున్నాయి. ఈ ఖరీఫ్‌లో దేశవ్యాప్తంగా 408.72 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. ఈసారి వర్షాలు అక్టోబర్ దాకా కొనసాగుతాయన్న అంచనాలు ఇప్పట్నుంచే గుబులు రేపుతున్నాయి. ఇది తీవ్ర పంట నష్టానికి, తద్వారా దేశవ్యాప్తంగా బియ్యం, పప్పుల కొరతకు దారి తీయడం తప్పకపోవచ్చంటున్నారు. → ఇలా సీజన్ దాటాక కొనసాగిన భారీ వర్షాలు, వరదల దెబ్బకు 2016 నుంచి 2022 మధ్యలో దేశవ్యాప్తంగా మొత్తమ్మీద 3.4 కోట్ల హెక్టార్ల సాగు విస్తీర్ణంలో పంటలు దారుణంగా దెబ్బ తిన్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. → వాతావరణ మార్పుల దెబ్బకు 2022లో భారత్‌లో జీడీపీ వృద్ధిలో 8 శాతం క్షీణత నమోదైంది. 7.5 శాతం సంపద హరించుకుపోయింది. → సాధారణంగా సెపె్టంబర్ తర్వాత భారీ వర్షాలు కురవని పశి్చమ భారతదేశం ఈ మార్పులకు తాళలేకపోతోంది. అక్కడి నీటి నిర్వహణ వ్యవస్థ ఈ వరదలను తట్టుకోలేకపోతోంది. → ఈ సరికొత్త వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు వినూత్న పద్ధతులు అవలంబించాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. → డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడం, ఇటు వరదలను, అటు కరువు పరిస్థితులను సమర్థంగా తట్టుకునే వంగడాలను అందుబాటులోకి తేవడం, వినూత్న వ్యవసాయ పద్ధతులను అవలంబించడం తప్పదంటున్నారు.మన నిర్వాకమే...! మనిషి నిర్వాకం వల్ల తీవ్ర రూపు దాలుస్తున్న వాతావరణ మార్పులే వానల సీజన్లో తీవ్ర హెచ్చుతగ్గులకు ప్రధాన కారణమని సైంటిస్టులు చెబుతున్నారు. → సముద్రాల ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వాతావరణంలో తేమ శాతం పెరుగుతోంది. భారీ వర్షాలు, వరదలకు దారి తీస్తోంది. → ఎల్ నినో, లా నినా వంటివి పరిస్థితులను మరింత దిగజారుస్తున్నాయి. → ఎల్ నినోతో వర్షాకాలం కుంచించుకుపోయి పలు ప్రాంతాల్లో కరువు తాండవిస్తోంది. → లా నినా వల్ల వర్షాలు సుదీర్ఘకాలం కొనసాగి వరదలు పోటెత్తుతున్నాయి. → సాగు, నీటి నిర్వహణతో పాటు దేశంలో సాధారణ జన జీవనమే తీవ్రంగా ప్రభావితమవుతోంది.85 శాతం జిల్లాలపై ప్రభావం మన దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు గత పదిహేనేళ్లలో ఏకంగా ఐదు రెట్లు పెరిగిపోయాయి. ఈ ధోరణి దేశవ్యాప్తంగా ఏకంగా 85 శాతం పై చిలుకు జిల్లాలను ప్రభావితం చేస్తోంది. వరదలు, తుఫాన్లు, కరువులు, తీవ్ర వడగాడ్పులతో కిందామీదా పడుతున్నట్టు ఐపీఈ–గ్లోబల్, ఎస్రి–ఇండియా సంయుక్త అధ్యయనం తేలి్చంది. అయితే వీటిలో సగానికి పైగా జిల్లాల్లో గతంలో తరచూ వరద బారిన పడేవేమో కొన్నేళ్లుగా కరువుతో అల్లాడుతున్నాయి. కరువు బారిన పడే జిల్లాలు ఇప్పుడు వరదలతో అతలాకుతలమవుతున్నాయి! గత 50 ఏళ్ల వాతావరణ గణాంకాలను లోతుగా విశ్లేíÙంచిన మీదట ఈ మేరకు వెల్లడైంది. వాతావరణ మార్పుల వల్ల దేశానికి ఎదురవుతున్న ముప్పును ఇవి కళ్లకు కడుతున్నాయని అధ్యయనం పేర్కొంది. ఇంకా ఏం చెప్పిందంటే... → పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2036 నాటికి ఏకంగా 147 కోట్ల మంది భారతీయులు తీవ్ర వాతావరణ పరిస్థితుల ప్రభావానికి లోనవుతారు. → దేశంలోని తూర్పు, ఈశాన్య, దక్షిణాది ప్రాంతాల్లో తీవ్ర వరదలు పరిపాటిగా మారతాయి. → ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్నాటకల్లో కరువు పరిస్థితులు పెరిగిపోతాయి. శ్రీకాకుళం, గుంటూరు, కర్నూలు, కటక్ (ఒడిశా) వంటి జిల్లాల్లో ఈ మార్పులు కొట్టొచి్చనట్టు కని్పస్తున్నాయి. → ఏపీతో పాటు ఒడిశా, బిహార్, గుజరాత్, రాజస్తాన్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, అసోం, యూపీల్లో 60 శాతానికి పైగా జిల్లాలు తరచూ ఇటు కరువు, అటు వరదలతో కూడిన తీవ్ర వాతారణ పరిస్థితుల బారిన పడుతున్నాయి. → త్రిపుర, కేరళ, బిహార్, పంజాబ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కరువు ప్రాంతాల్లో వరదలు, వరద ప్రాంతాల్లో కరువులు పరిపాటిగా మారతాయి. → బెంగళూరు, పుణే, అహ్మదాబాద్, పటా్న, ప్రయాగ్‌రాజ్ వంటి నగరాలు, వాటి పరిసర ప్రాంతాలు ఈ ‘కరువు–వరద’ ట్రెండుతో అతలాకుతలమవుతున్నాయి. → గత శతాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సగటున 0.6 డిగ్రీ సెల్సియస్ మేరకు పెరిగిపోవడమే ఈ విపరీత వాతావరణ పరిస్థితులకు ప్రధాన కారణం.ఏం చేయాలి? → వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు పసిగడుతూ సాగు తీరుతెన్నులను కూడా తదనుగుణంగా మార్చుకోవడం ఇకపై తప్పనిసరి. → ఇందుకోసం సమీకృత క్లైమేట్ రిస్క్ అబ్జర్వేటరీ (సీఆర్ఓ), ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లైమేట్ ఫండ్ (ఐసీఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. → ప్రతి సీజన్లోనూ వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా పంటలను మార్చుకుంటూ వెళ్లాలి. → జాతీయ, రాష్ట్ర, జిల్లా, స్థానిక స్థాయిల్లో పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తూ అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు ప్రణాళికలను మార్చుకోవాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నీటి నిల్వలు తగ్గుతున్నాయ్..!
సాక్షి, న్యూఢిల్లీ: ఎండలు మండిపోతున్న వేళ...ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా అడుగంటుతున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ పంటలకు పెరిగిన వినియోగం, లోటు వర్షపాతం, ఎల్‌నినో ప్రభావం కారణంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పర్యవేక్షణలో 146 ప్రధాన జలాశయాలున్నాయి. వీటిల్లో నీటి నిల్వలు గత ఏడాది కన్నా 5శాతం తక్కువగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ తాజా నివేదిక వెల్లడించింది. ఈ రిజర్వాయర్ల వాస్తవ నిల్వ సామర్ధ్యం 178 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం) కాగా ప్రస్తుతం 70 బీసీఎంల నిల్వలు ఉన్నాయని, ఇవి గత ఏడాది నిల్వ 74 బీసీఎంలతో పోలిస్తే 5 శాతం తక్కువని సీడబ్ల్యూసీ వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో మొత్తం 53 బీసీఎంల నిల్వ సామర్థ్యం కలిగిన 40 రిజర్వాయర్లుండగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొత్తం ప్రత్యక్ష నిల్వ కేవలం 16.737 బీసీఎంలని వివరించింది. రిజర్వాయర్ల మొత్తం ప్రత్యక్ష నిల్వ సామర్థ్యంలో ఇది 32 శాతం కాగా, గత ఏడాది కన్నా 7% తక్కువని తెలిపింది. ఇక ఏపీ, తెలంగాణలలోని 11 ప్రధాన రిజర్వాయర్లలో 20 బీసీఎంల నీటి నిల్వలకు గాను కేవలం 5.5 బీసీఎంల నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇవి గత ఏడాది నిల్వ 8 బీసీఎంలతో పోలిస్తే 11శాతం తక్కువని వెల్లడించింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో 11.12 బీసీఎంల నిల్వలకు గానూ కేవలం 1.65 బీసీఎంల నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇవి గత ఏడాదితో పోలిస్తే 9% తక్కువని తెలిపింది. -
AP: ఉత్పత్తి అదిరింది.. ఆర్బీఐ నివేదిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ పంట పండింది. గత సీజన్‌తో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో అన్ని ప్రధాన పంటల ఉత్పత్తి, దిగుబడిలో వృద్ధి నమోదైంది. 2021–22 కన్నా 2022–23లో ధాన్యం, ముతక, చిరు ధాన్యాలు, పప్పులు, నూనెగింజల ఉత్పత్తితో పాటు దిగుబడిలోనూ పెరుగుదల నమోదైనట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. దేశంలో గత ఖరీఫ్‌లో (2021–22) వ్యవసాయ ఉత్పత్తుల నాల్గవ ముందస్తు అంచనాలు, 2022–23 ఖరీఫ్ మొదటి ముందస్తు అంచనాలతో ఆర్బీఐ ఈ నివేదికను విడుదల చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో ప్రధాన పంటల ఉత్పత్తి, దిగుబడి, విస్తీర్ణంలో ఏ రాష్ట్రంలో ఎంతమేర వృద్ధి నమోదైందో ఈ నివేదికలో ఆర్బీఐ విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం.. మధ్యప్రదేశ్ రాజస్థాన్, ఒడిశా, పంజాబ్, గుజరాత్, హరియాణా, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే ధాన్యం ఉత్పత్తి గత ఖరీఫ్ కన్నా ఈ ఖరీఫ్‌లో పెరిగింది. మిగతా రాష్ట్రాల్లో క్షీణత నమోదైంది. జాతీయ స్థాయిలో కూడా గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో ధాన్యం ఉత్పత్తిలో 6.1 శాతం క్షీణత నమోదైంది. ఈ ఖరీఫ్‌లో మధ్యప్రదేశ్‌లో అత్యధికంతా ధాన్యం ఉత్పత్తి 46 శాతం వృద్ధి నమోదైంది. ఆ తరువాత రాజస్థాన్‌లో 32.3 శాతం.. ఆంధ్రప్రదేశ్‌లో 16.2, ఒడిశాలో 5.9, గుజరాత్లో 5.1, పంజాబ్‌లో 3.8, హరియాణాలో 2.9, ఉత్తరాఖండ్‌లో 1.7 శాతం వృద్ధి నమోదైంది. ఖరీఫ్ విస్తీర్ణంలో వృద్ధి ఇలా.. ► అలాగే, దేశం మొత్తం ఖరీఫ్ విస్తీర్ణంలో 47 శాతం విస్తీర్ణం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, గుజరాత్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉంది. ► ఇక మన రాష్ట్రం విషయానికొస్తే.. వరి సాగు విస్తీర్ణం గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో ఐదు శాతం మేర పెరిగింది. ► ధాన్యం దిగుబడి 10.6 శాతం మేర వృద్ధి నమోదైంది. ► రాష్ట్రంలో ముతక, చిరు ధాన్యాల విస్తీర్ణం తగ్గినప్పటికీ ఉత్పత్తి, దిగుబడిలో భారీ వృద్ధి నమోదైంది. ► పప్పు ధాన్యాల విస్తీర్ణం, నూనె గింజల విస్తీర్ణం తగ్గినప్పటికీ ఉత్పత్తి, దిగుబడుల్లో భారీగా పెరుగుదల ఉంది. ► పత్తి విస్తీర్ణం, ఉత్పత్తి కూడా పెరిగినప్పటికీ దిగుబడి మాత్రం ఈ ఖరీఫ్‌లో తగ్గింది. నిజానికి.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్‌లో కాలువల కింద సాగుకు నీటిని ముందస్తుగా విడుదల చేసింది. అలాగే, రైతులకు అవసరమైన విత్తనాలతో పాటు, ఎరువులను రైతుభరోసా కేంద్రాల ద్వారానే సకాలంలో అందించింది. సాగు విషయంలో రైతుల అవసరాలను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. -
మన ప్రభుత్వం వచ్చాక మిల్లెట్స్ సాగును ప్రోత్సహిస్తున్నాం: సీఎం జగన్
-
ధాన్యం కొనుగోళ్లపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఖరీప్ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. మిల్లర్ల ప్రమేయంలేకుండా సేకరిస్తున్న కొత్త విధానం అమలు తీరును సీఎం సమగ్రంగా సమీక్షించారు. ఈ మేరకు అధికారులకు సీఎం పలు ఆదేశాలు ఇచ్చారు. చదవండి: ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఎందుకంత అక్కసు: మంత్రి బొత్స ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, రైతులకు కనీస మద్దతు ధర కన్నా.. ఒక్కపైసా తగ్గకుండా రేటు రావాలనే ఉద్దేశంతో కొత్త విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. దీని కోసం ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయాన్ని తీసివేశాం. ఈ కొత్త విధానం ఎలా అమలవుతున్నదీ గమనించుకుంటూ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. చేయాల్సిన ధాన్యం సేకరణపై ముందస్తు అంచనాలు వేసుకుని, ఆ మేరకు ముందస్తుగానే గోనెసంచులు అందుబాటులోకి తీసుకురావాలి. వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. ‘‘రవాణా, లేబర్ ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌లో జవాబుదారీతనం ఉండాలి. అత్యంత పారదర్శకంగా ఈ చెల్లింపులు ఉండాలి. ఈ విధానాన్ని ఒకసారి పరిశీలించి.. రైతులకు మేలు చేసేలా మరింత మెరుగ్గా దీన్ని తీర్చిదిద్దాలి. రవాణా ఖర్చులు, గన్నీ బ్యాగుల ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తోందన్న విషయం రైతులకు తెలియాలి. రైతులకు చేస్తున్న చెల్లింపులన్నీ కూడా అత్యంత పారదర్శకంగా ఉండాలి. ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో కార్పొరేషన్ నుంచి వారికి డబ్బు చేరేలా చర్యలు తీసుకోవాలి. దీనివల్ల చెల్లింపుల్లో అత్యంత పారదర్శకత తీసుకు వచ్చినట్టు అవుతుంది’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘ధాన్యం సేకరణ కోసం తయారు చేసిన యాప్‌లో.. సిగ్నల్స్ సమస్యల వల్ల అక్కడడక్కగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకుని.. సిగ్నల్ ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లగానే ఆ వివరాలన్నీ ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లోకి లోడ్ అయ్యేలా మార్పులు చేసుకోవాలి. అనేక ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఇలాంటి పద్ధతులు పాటిస్తున్నాం. ఆ శాఖల నుంచి తగిన సాంకేతిక సహకారాన్ని తీసుకోవాలి’’ అని సీఎం సూచించారు. ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై సమాచారాన్ని సమగ్రంగా తెలియజేసేలా ఆర్బీకేల్లో పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టాలని, దీనివల్ల రైతుల్లో అవగాహన కలుగుతుందన్న సీఎం. రైతుల ఫోన్లకూ ఈ సమాచారాన్ని ఆడియో, వీడియో రూపంలో పంపించాలన్నారు. ధాన్యం సేకరణకోసం అనుసరిస్తున్న సరికొత్త విధానం, ఈ ప్రక్రియలో ఏమేం చేస్తున్నామన్న దానిపై సంపూర్ణంగా సమాచారం వారికి చేరవేయాలి. దీనివల్ల రైతుల్లో అవగాహన కలుగుతుందని సీఎం అన్నారు. పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ల విధులపై ఎస్ఓపీలను తయారుచేయాలి. ఈ ఎస్ఓపీలను పాటించేలా సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండేలా చూడాలి. అవకతవకలకు, అవినీతికి ఆస్కారం లేకుండా ఈ ఎస్ఓపీలు ఉండాలి. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగుమీదకూడా రైతులకు అవగాహన కలిగించాలన్న సీఎం. అలాంటి రైతులను ప్రోత్సహించాలన్నారు. మన ప్రభుత్వం వచ్చాక మిల్లెట్స్ సాగును ప్రోత్సహిస్తున్నాం. ఎవరైనా మిల్లెట్స్ కావాలి అని అడిగితే, వాటిని వినియోగిస్తామని కోరితే పౌర సరఫరాల శాఖ ద్వారా వారికి అందించడంపైన కూడా దృష్టిపెట్టాలి. కోరుకున్న వారికి వాటిని సరఫరా చేయాలని సీఎం సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవియస్ నాగిరెడ్డి, సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్థికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి హెచ్ అరుణ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ సి.హరికిరణ్, మార్కెటింగ్‌శాఖ కమిషనర్ రాహుల్ పాండే, పౌర సరఫరాల డైరక్టర్ విజయ సునీత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చివరి దశకు ఖరీఫ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ చివరి దశకు చేరుకుంటోంది. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలకు తోడు అడుగడుగునా ప్రభుత్వం అండగా నిలబడడంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో పంటలు సాగు చేస్తున్నారు. సీజన్‌కు ముందుగానే ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచిన ప్రభుత్వం ఏ దశలోనూ రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టింది. దీంతో ఇప్పటికే 79 శాతం మేర పంటలు సాగయ్యాయి. మరోవైపు.. ముందస్తుగా సాగునీరు విడుదల చేయడంతో పాటు పుష్కలంగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ సాఫీగా సాగుతోంది. శివారు భూములకు సమృద్ధిగా సాగునీరు ఇక సీజన్ సాధారణ వర్షపాతం 556 మిల్లీమీటర్లు (ఎంఎం) కాగా, ఇప్పటివరకు 424.6 ఎంఎం వర్షపాతం కురవాల్సి ఉంది. కానీ, 429.9 ఎంఎం అధిక వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో 454 ఎంఎంకు 466.6 ఎంఎం.., రాయలసీమలో 200 ఎంఎంకు 257.5 ఎంఎం వర్షపాతం కురిసింది. సాధారణం కంటే రాయలసీమలో 28 శాతం, కోస్తాంధ్రలో 2.8 శాతం అధిక వర్షపాతం నమోదైంది. గోదావరి, కృష్ణా, పెన్నా వంటి నదులకు వరదలు పోటెత్తడంతో శివారు భూములకు సైతం సమృద్ధిగా సాగునీరు అందుతోంది. ఫలితంగా తెగుళ్లు బెడద ఎక్కడా కన్పించడంలేదు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశకు చేరుకోగా మిగిలిన పంటలు కూడా కాయకట్టే దశకు చేరుకున్నాయి. 30 లక్షల ఎకరాలు దాటిన వరి నాట్లు ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 92.04 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 72 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ప్రధానంగా.. ► వరి సాధారణ విస్తీర్ణం 38.98 లక్షల ఎకరాలు అయితే ఇప్పటికే 30 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ► అపరాలు సాధారణ విస్తీర్ణం 8.28 లక్షల ఎకరాలు కాగా, 4.75 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ► నూనెగింజల సాగు విస్తీర్ణం 17.96 లక్షల ఎకరాలు అయితే.. ఇప్పటికే 15 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ► ఇక ఇతర పంటల విషయానికి వస్తే 14.70 లక్షల ఎకరాల్లో పత్తి, 2.82 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.55 లక్షల ఎకరాల్లో మిరప, 93వేల ఎకరాల్లో చెరకు, 45వేల ఎకరాల్లో ఉల్లి, 35 వేల ఎకరాల్లో పసుపు పంట సాగయ్యాయి. పెరిగిన ఆముదం, నువ్వులు, సోయాబీన్ సాగు ఈ ఏడాది వేరుశనగ సాగు తగ్గగా, ఆ మేర ఆముదం, నువ్వులు, సోయాబీన్ రికార్డుస్థాయిలో సాగయ్యాయి. ► వేరుశనగ సాధారణ విస్తీర్ణం 16.84 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 13.42 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది ఇదే సమయానికి 15.37లక్షల ఎకరాల్లో సాగైంది. ► ఈ ఏడాది వేరుశనగ రైతులు ఇతర పంటల సాగువైపు మళ్లారు. ఫలితంగా నువ్వులు సాధారణ విస్తీర్ణం 32వేల ఎకరాలు అయితే.. ఇప్పటివరకు 42వేల ఎకరాల్లో సాగైంది. ► అలాగే, ఆముదం సాధారణ విస్తీర్ణం 59వేల ఎకరాలు కాగా, 63వేల ఎకరాల్లో సాగైంది. ► పొద్దుతిరుగుడు సాధారణ విస్తీర్ణం 9,645 ఎకరాలు అయితే ఇప్పటివరకు 15,932 ఎకరాల్లో సాగైంది. ► ఇక సోయాబీన్ సాధారణ విస్తీర్ణం 3,665 ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 22,607 ఎకరాల్లో సాగైంది. ఈ–క్రాపింగ్ కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 46.79 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 15.12 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలతో పాటు 10,427 ఎకరాల్లో మల్బరీ (పట్టు) పంటల సాగును నమోదు చేశారు. సెప్టెంబర్‌లోనూ సమృద్ధిగా ఎరువులు.. సీజన్‌కు 19.02 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇప్పటివరకు 17.21 లక్షల టన్నులు అందుబాటులో ఉంచారు. ఇందులో 9.99 లక్షల టన్నుల అమ్మకాలు జరగగా, ఇంకా 7.22 లక్షల టన్నులు (యూరియా 3.24 లక్షల టన్నులు, కాంప్లెక్స్ 2.76 లక్షల టన్నులు, డీఏపీ 67,394 టన్నులు, ఎంఓపీ 29,785 టన్నులు) అందుబాటులో ఉన్నాయి. ఆర్బీకేల్లో ప్రత్యేకంగా 1.98 లక్షల టన్నుల ఎరువులను నిల్వచేయగా, ఇప్పటివరకు 1.23 లక్షల టన్నుల ఎరువులను రైతులు కొనుగోలు చేశారు. ఇంకా 74,823 టన్నులు (యూరియా–43,478 టన్నులు, డీఏపీ–15,627 టన్నులు, కాంప్లెక్స్–11,493 టన్నులు, ఎంఒపీ–4128 టన్నులు, ఎస్ఎస్పీ–97 టన్నులు) నిల్వలు ఉన్నాయి. సెప్టెంబర్æలో 5.22 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ఆ మేరకు కేంద్రం కేటాయింపులు జరిపింది. ఈ నిల్వలు రాష్ట్రానికి రావాల్సి ఉంది. -
వరుణ.. కరుణ సుజలాం.. సుఫలాం
సాక్షి, అమరావతి: గోదావరి గలగలలు.. కృష్ణమ్మ బిరబిరలు.. పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు పోటెత్తుతుండటంతో ప్రాజెక్టులన్నీ దాదాపుగా నిండిపోయాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈదఫా ఖరీఫ్ పంటలకు ప్రభుత్వం ముందుగా నీటిని విడుదల చేసింది. నవంబర్‌లో తుపాన్లు వచ్చేలోగా ఖరీఫ్ నూర్పిళ్లు పూర్తి చేసి రెండో పంటకు నీటిని విడుదల చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. పాలకుల దూరదృష్టికి వరుణుడు కలిసి రావడంతో గోదావరి డెల్టాకు జూన్ 1న, కృష్ణా డెల్టా, గుంటూరు ఛానల్, గండికోట, చిత్రావతి, వెలిగల్లు, బ్రహ్మంసాగర్ ఆయకట్టుకు జూన్ 10న, శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్బీసీ), కేసీ కెనాల్‌కు జూన్ 30న, సాగర్ కుడి, ఎడమ కాలువలకు జూలై 30న నీటిని విడుదల చేశారు. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ(హెచ్చెల్సీ), ఎల్లెల్సీ(దిగువ కాలువ), వంశధార, తోటపల్లి సహా అన్ని ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంతో రైతన్నలు పంటల సాగులో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 35 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయగా పత్తి, మొక్కజొన్న, మిర్చి లాంటి వాణిజ్య పంటలను భారీ ఎత్తున సాగుచేశారు. సాగర్, కుడి ఎడమ కాలువలకు జూలై 30న నీటిని విడుదల చేసిన నేపథ్యంలో నారుమడులు పోస్తున్నారు. నెలాఖరుకు ఆయకట్టులో ఖరీఫ్ సాగు పూర్తవుతుందని అధికారవర్గాలు తెలిపాయి. మూడేళ్ల కంటే మిన్నగా.. రాష్ట్రంలో 104.61 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం ఉంది. భారీ ప్రాజెక్టుల కింద 65.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 31.13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఏపీ నీటి పారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్సైడీసీ) పరిధిలోని ఎత్తిపోతల పథకాల కింద 7.86 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఎన్నడూ లేని రీతిలో గత మూడేళ్లుగా ఖరీఫ్, రబీలో కోటి ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో రికార్డు స్థాయి విస్తీర్ణంలో పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో పరీవాహక ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నదులు ఉరకలెత్తుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, సోమశిల లాంటి భారీ ప్రాజెక్టులన్నీ నిండాయి. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు తదితర బేసిన్లలోని రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 983.48 టీఎంసీలుకాగా ఇప్పటికే 812.47 టీఎంసీలు చేరాయి. కృష్ణా బేసిన్లో పూర్తి సామర్థ్యం మేరకు రిజర్వాయర్లలో 560.86 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అక్టోబర్ ఆఖరు వరకు నదుల్లో వరద ప్రవాహం కొనసాగనున్న నేపథ్యంలో ఈ ఏడాది అన్ని బేసిన్లలోనూ నీరు భారీగా పెరగనుంది. రెండో పంటకూ అవకాశం.. గతంలో గోదావరి డెల్టాలో మాత్రమే రెండో పంటకు నీటిని విడుదల చేసేవారు. గత మూడేళ్లుగా వరద నీటిని ఒడిసిపట్టి జలాశయాలను నింపుతున్న ప్రభుత్వం నీటి లభ్యత ఆధారంగా రెండో పంటకూ నీళ్లందిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు ముందుగా నీటిని విడుదల చేసిన నేపథ్యంలో నూర్పిళ్లు కూడా సకాలంలోనే పూర్తవుతాయి. ప్రాజెక్టుల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉండటం, అక్టోబర్ వరకు వరద ప్రవాహం, ఆ తర్వాత సహజ ప్రవాహం నదుల్లో ఉండే అవకాశం ఉన్నందున ఈ ఏడాది నీటి లభ్యత గత మూడేళ్ల కంటే అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రికార్డు స్థాయిలో సాగు మంత్రివర్గ సమావేశంలో సీఎం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు ముందుగానే నీటిని విడుదల చేశాం. జలవనరుల శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించేలా చర్యలు చేపట్టాం. ఈ దఫా రైతులు భారీ ఎత్తున పంటలు సాగుచేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో గత మూడేళ్లుగా ఖరీఫ్, రబీలలో ఏటా కోటి ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లోనే అధిక ఆయకట్టులో పంటలు సాగుచేసే అవకాశం ఉంది. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, జలవనరుల శాఖ -
ముందస్తు ఏరువాకకు ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ముందస్తు తొలకరికి అన్నదాతలు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. సాగునీటి ప్రణాళికతో పాటు చానళ్ల వారీగా నీటి విడుదల షెడ్యూల్ ఖరారు కావడంతో అవకాశాన్ని అందిపుచ్చుకొని అదునులో విత్తుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకవైపు ఆర్బీకేల ద్వారా ప్రచారం చేస్తూ మరోవైపు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సీజన్‌కు ముందే అందుబాటులో ఉంచేలా వ్యవసాయశాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. నాడు ముక్కారు పంటలు.. ఒకప్పుడు ముక్కారు పంటలు పండిన కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టా ప్రాంతాల్లో 2 పంటలు చేతికి రావడం గగనమైపోయింది. ఆంగ్లేయుల కాలం నుంచి ఏప్రిల్–మేలో నిలిపివేసి మే–జూన్‌లో కాలువలకు నీటిని విడుదల చేసేవారు. 1980కు ముందు వరకు ఇలాగే కొనసాగింది. ఆ తర్వాత పనుల్లో జాప్యం కారణంగా నీటి నిలిపివేత వ్యవధిని 2 నెలలకు పెంచడంతో పాటు మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. డెల్టాలో వరిసాగు ప్రశ్నార్థకంగా మారడంతో ఒకదశలో సాగు సమ్మెకు సైతం సిద్ధపడ్డారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. సమృద్ధిగా నీరు మూడేళ్లుగా విస్తారంగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో రైతన్నలు ఏటా సిరుల పంట పండిస్తున్నారు. ప్రభుత్వం దాదాపు 4 దశాబ్దాల తర్వాత ముందస్తు సాగుకు సన్నాహాలు చేస్తోంది. అదనపు ఆదాయం.. భూమి సారవంతం జూన్ మొదటి వారంలో ఖరీఫ్ పంటలను విత్తుకుంటే అక్టోబర్ చివరికి కోతలు పూర్తి కానున్నాయి. మార్చి చివరికల్లా రబీ ముగించుకొని మూడోపంటగా అపరాలు సాగు చేపట్టేలా రైతులను సిద్ధం చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. తద్వారా అక్టోబర్–నవంబర్‌లో ఖరీఫ్ పంట, మేలో రబీ పంట వైపరీత్యాలు, తుపాన్ల బారిన పడకుండా కాపాడవచ్చు. మూడో పంటగా అపరాలు సాగు చేస్తే ఎకరాకు కనీసం రూ.30 వేలకు పైగా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. అపరాల కోతల తర్వాత దుక్కులు దున్నడం వల్ల భూమి సారవంతంగా మారుతుంది. సీజన్‌కు ముందే ఎరువులు, విత్తనాలు 2022 ఖరీఫ్‌లో 95,23,217 ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. సాధారణంగా ఈ సీజన్లో ఏప్రిల్–మేలో 2 లక్షల టన్నులు, జూన్–జూలైలో 3 లక్షల టన్నుల ఎరువులను కేంద్రం కేటాయిస్తుంది. ముందస్తు సాగు నేపథ్యంలో వీటిని రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం ఆమోదించడంతో సరిపడా నిల్వలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 5.8 లక్షల టన్నుల ఎరువులు సిద్ధంగా కాగా 1.50 లక్షల టన్నులను ఆర్బీకేల్లో నిల్వ చేస్తున్నారు. జూన్–జూలైలో కనీసం 6 లక్షల టన్నులు సిద్ధం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సర్టిఫై చేసిన 6.52 లక్షల టన్నుల విత్తనాలను సిద్ధం చేయగా ఇప్పటికే వేరుశనగ విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. వరితో సహా మిగిలిన విత్తనాలను జూన్ 1 నుంచి ఆర్బీకేల ద్వారా పంపిణీకి సిద్ధంగా ఉంచారు. తొలిసారిగా వాణిజ్య పంటలైన పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్నారు. మొత్తం వినియోగంలో కనీసం 20–30 శాతం ఎరువులు, 5–10 శాతం పురుగుల మందులను ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆర్బీకేల్లో విస్తృత ప్రచారం గతంతో పోలిస్తే ఈసారి 15–30 రోజులు ముందుగా సాగు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1న గోదావరి డెల్టాకు, జూన్ 10న కృష్ణా డెల్టా, పెన్నా ప్రాజెక్టు కింద, జూన్ చివరి వారంలో శ్రీశైలం ప్రాజెక్టు కింద నీటి విడుదలకు ప్రణాళిక రూపొందించారు. అందుకనుగుణంగా నీటి పారుదల సలహా మండలి సమావేశాల్లో చానళ్ల వారీగా నీటి విడుదలను, వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాల్లో పంటల ప్రణాళికలను ఖరారు చేశారు. రైతులను సన్నద్ధం చేసేందుకు ఆర్బీకేల ద్వారా పోస్టర్లు, కరపత్రాలు, టముకు ద్వారా ప్రచారం చేస్తున్నారు. పాలనకు ప్రకృతి సహకారం... సీఎం వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల నిండా సమృద్ధిగా నీళ్లుండడంతో దశాబ్దాల తర్వాత రైతులకు ముందస్తుగా నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందుబాటులో ఉంచాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి ఏర్పాట్లు పూర్తి ముందస్తు సాగుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సీజన్‌కు ముందుగానే ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
AP: ఖరీఫ్‌కు భరోసా
సాక్షి, కాకినాడ: ఖరీఫ్ ప్రారంభానికి ముందే పంట సాగుకు పెట్టుబడిగా సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వైఎస్సార్ రైతుభరోసా పథకం కింద ఒక్కో రైతుకు రూ.13,500 అందజేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే అర్హుల జాబితాను రూపొందించే ప్రక్రియలో అధికారులు తలమునకలవుతున్నారు. మే నెలలో నగదు జమ చేసే అవకాశం కనిపిస్తోంది. అన్నదాతలను అవసరానికి ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ రైతుభరోసా పథకానికి అంకురార్పణ చేసింది. దీనికింద అర్హులైన రైతులకు సాగు పెట్టుబడి నిమిత్తం ఏటా ఆర్థిక సాయం అందజేస్తోంది. తద్వారా పెట్టుబడి కోసం వారు అప్పులు చేయకూడదన్నది దీని ఉద్దేశం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 4.35 లక్షల మంది రైతులకు రూ.317 కోట్లు అందజేస్తోంది. ఖరీఫ్‌కు ముందుగానే.. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం రబీ వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. 2022–23 ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యేందుకు సుమారు మరో రెండు నెలలు పట్టనుంది. అంతకంటే ముందుగానే అన్నదాతలకు రైతుభరోసా పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 1,60,901 మంది రైతులు ఉండగా.. రూ.34.83 కోట్ల మేర లబ్ధి పొందనున్నారు. అర్హులందరికీ పథకం వర్తింపజేసే క్రమంలో కొన్ని నిబంధనలు సడలించారు. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన వారు, లబ్ధిదారులు చనిపోతే వారి కుటుంబంలో మరొకరు సాయం పొందే ప్రక్రియను సులభతరం చేశారు. పేరు మార్చుకునే వెసులుబాటు కూడా కల్పించారు. కౌలు రైతులకు.. కౌలు రైతులకు సైతం భరోసా అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పథకానికి అవసరమైన కౌలు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది. కార్డులు పొందాలనుకునే వారి నుంచి ఈ నెల 30వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నారు. మండల వ్యవసాయ అధికారి, సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్లు భరోసా పథకం సాధ్యాసాధ్యాలు, అర్హతలపై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పట్టాదారు పుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు పాసు పుస్తకం తీసుకుని సమీప రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే)లో సంప్రదిస్తే సరిపోతుంది. గ్రామ వలంటీర్, సచివాలయం, వ్యవసాయ అధికారిని సంప్రదించినా పథకంలో లబ్ధి పొందవచ్చు. పథకం కింద ఏటా రూ.13,500 నగదును మూడు విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. అర్హులందరికీ భరోసా వైఎస్సార్ రైతు భరోసా పథకంలో అర్హులెవరూ నష్టపోకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకు అనుగుణంగా అర్హుల జాబితా రూపొందించాం. అర్హత ఉండి తమకు పథకం వర్తించకుంటే సంబంధిత ఆర్బీకేలో సంప్రదిస్తే పరిశీలించి న్యాయం చేస్తారు. మే నెలలో భరోసా నగదు రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంది. – ఎన్.విజయకుమార్, జేడీ అగ్రికల్చర్, కాకినాడ జిల్లా -
AP: ఆనంద హేల.. రైతుల ఇంట కొత్త కాంతి
సాక్షి, అమరావతి: పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. అన్నదాతల లోగిళ్లు ధన ధాన్యాలతో, పండుగ శోభతో కళకళలాడుతున్నాయి. ‘వరి’ సిరులతో ధాన్యం గాదెలు నిండుగా కనువిందు చేస్తుండడంతో అన్నదాత ఇంట పండుగ సందడి నెలకొంది. ముగింట్లో మద్దతు ధరతో సంక్రాంతి సంతోషాలు విరబూస్తున్నాయి. అడుగడుగునా ప్రభుత్వం అండగా నిలవడంతో వైపరీత్యాలకు ఎదురొడ్డి రికార్డు స్థాయి దిగుబడులు సాధించిన రైతన్నలు రెట్టించిన ఉత్సాహంతో పెద్ద పండుగ వేడుకల్లో నిమగ్నమయ్యారు. భారీ వర్షాలతో గోదావరి, కృష్ణ నదులు పరవళ్లు తొక్కడంతో రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి. దీనికి తోడు రైతాంగాన్ని అన్ని విషయాల్లో ప్రభుత్వం చేయి పట్టుకుని నడిపిస్తుండటంతో వ్యవసాయం పండుగైంది. వాస్తవ సాగుదారులను వెతికి మరీ రైతు భరోసా కింద మూడేళ్లలో గరిష్టంగా 50.58 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం రూ.6899.67 కోట్ల సాయం అందించింది. ఆర్బీకేల ద్వారా సకాలంలో నాణ్యమైన విత్తనాలు, కావాల్సినన్ని ఎరువులతో పాటు సబ్సిడీపై పురుగు మందులను అందించింది. కూలీల కొరత అధిగమించేందుకు అద్దె ప్రాతిపదికన యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచింది. ఇలా అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో రైతులు గత మూడేళ్ల కంటే గరిష్టంగా 94.80 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటలు సాగు చేశారు. కోత కొచ్చిన వేళ వైపరీత్యాలు కాస్త కలవరపెట్టినప్పటికీ మొక్కవోని ధైర్యంతో సిరుల పంట పండించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన నల్ల తామర (త్రిప్స్ పార్విస్ పైనస్) వల్ల మిరప పంట దెబ్బతిన్నప్పటికీ మిగిలిన పంటల దిగుబడి బాగుండటంతో రికార్డు స్థాయిలో కోటి 74 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులను సాధించారు. ఉన్న ఊళ్లోనే పంట కొనుగోళ్లు ► ‘వరి’ పంట సిరులు కురిపించింది. 40.77 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వగా, గతంలో ఎన్నడూ లేని విధంగా 80.46 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు సాధించారు. ఇందులో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంతో 8,651 ఆర్బీకేల్లో ప్రభుత్వం పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ► వీటి ద్వారా ఇప్పటి వరకు 2.70 లక్షల మంది రైతుల నుంచి రూ.3,756 కోట్ల విలువైన 19.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. దాదాపు 1,00,283 మంది రైతులకు రూ.1470 కోట్ల జమ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 21 రోజుల్లోనే సేకరించిన ధాన్యానికి చెల్లింపులు చేస్తూ రైతులకు బాసటగా నిలిచింది. ► చివరకు అకాల వర్షాలు, తుపాన్ వల్ల దెబ్బతిని రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తూ అండగా నిలవడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఏడాది పత్తి, మిరప, మినుము, కందులు, వేరుశనగ, పసుపు, మొక్కజొన్న, టమాట తదితర ప్రధాన వాణిజ్య పంటలన్నీ కనీస మద్దతు ధరకు మించి ధర పలకడంతో రైతుల్లో కొత్త జోష్ సంతరించుకుంది. పత్తి రికార్డు స్థాయిలో క్వింటాల్‌కు రూ.10 వేల మార్క్‌ను అందుకుంది. ► ఈ నేపథ్యంలో రైతులు సంక్రాంతి పండుగను రెట్టించిన ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఇళ్లతో పాటు వ్యవసాయానికి తోడుగా నిలిచే కాడెద్దులు, యంత్ర పరికరాలను ముస్తాబు చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్న బంధువులు, కుటుంబ సభ్యుల రాకతో పల్లెల్లో కొత్త సందడి నెలకొంది. పండుగ శోభాయమానంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అన్ని విధాలా తోడుగా నిలిచాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా రైతులు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా. అడుగడుగునా ప్రభుత్వం తోడుగా నిలబడడంతో వైపరీత్యాలకు ఎదురొడ్డి సిరుల పంట పండించారు. గ్రామ స్థాయిలో ఆర్బీకేలనే కొనుగోలు కేంద్రాలుగా మార్చి, పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అందుకే మకర సంత్రాంతి పర్వదినాన్ని రైతులు శోభాయ మానంగా జరుపుకుంటున్నారు. రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. – కన్నబాబు, వ్యవసాయశాఖ మంత్రి వ్యవసాయం పండుగైంది తెలుగు వారు జరుపుకునే మకర సంక్రాంతి వ్యవసాయానికి చిరునామా. తెలుగు రాష్ట్రాల్లో పండించిన పంట ఇంటికొచ్చే వేళ జరుపుకునే ఈ పండుగ వ్యవసాయ దారులు పండుగ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం పండుగలా మారింది. ప్రభుత్వం ఇస్తోన్న తోడ్పాటుతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ 20 రోజుల్లోనే డబ్బులొచ్చాయి నేను 15 ఎకరాల్లో వరి సాగు చేశాను. ఎకరానికి 33 బస్తాల దిగుబడి వచ్చింది. డిసెంబర్ మొదటి వారంలో నేను రైతు భరోసా కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించాను. లోడును నేనే సొంతంగా తోలుకున్నాను. హమాలీ, రవాణా ఖర్చులు సైతం నాకు ఇచ్చేశారు. 20 రోజుల్లోనే నా ఖాతాలో రూ.7.80 లక్షలు జమయ్యాయి. పండగ సమయంలో ఆరుగాలం కష్టం ఫలించి డబ్బులు చేతికి రావడం చాలా సంతోషంగా ఉంది. – వల్లభనేని సురేంద్ర కృష్ణ, ఉంగుటూరు, పశ్చిమగోదావరి జిల్లా ఆలస్యం కావట్లేదు.. రైతుల నుంచి ధాన్యం సేకరించిన తర్వాత 21 రోజుల్లో నగదు చెల్లింపులు చేస్తున్నాం. బ్యాంకు ఖాతాలో సమస్యలు తలెత్తితే తప్ప ఎక్కడా ఆలస్యం కావట్లేదు. రోజువారీ ధాన్యం సేకరణ ఆధారంగా నిర్ణీత కాలానికి అనుగుణంగా చెల్లింపు ప్రక్రియ చేపడుతున్నాం. ఏప్రిల్ నాటికి మొత్తం లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. ధాన్యం సేకరణలో భాగంగా ఆర్బీకేల్లో చేస్తున్న ఐదు రకాల పరీక్షలను ఐఓటీ ఆధారంగా రియల్‌టైమ్‌లో ఒకేసారి చేసేలా చర్యలు చేపడుతున్నాం. – వీరపాండియన్, ఏపీ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ఎండీ -
ఖరీఫ్‌కు కృష్ణా జలాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ పంటల కోసం ఈనెల 15 వరకు కృష్ణా నది నీటిని వాడుకోవడానికి ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు అనుమతినిచ్చింది. రబీకి అవసరమైన నీటిపై నెలాఖరులోగా ప్రతిపాదనలు పంపాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. నెలాఖరులోగా త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమై.. వినియోగించుకున్న జలాలను పరిగణనలోకి తీసుకుని, రబీకి కేటాయింపులు చేస్తుందని పేర్కొంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటివరకు కృష్ణా జలాల వినియోగం.. సాగు, తాగు నీటి అవసరాలపై చర్చించేందుకు బోర్డు త్రిసభ్య కమిటీ గురువారం సమావేశమైంది. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్ పాల్గొన్నారు. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకూ 350.585 టీఎంసీలు వాడుకున్నట్లు ఏపీ ఈఎన్సీ చెప్పారు. తెలంగాణ 108.235 టీఎంసీలు వాడుకుందని తెలిపారు. ఖరీఫ్ కోసం ఈనెల 15వరకు సాగర్ కుడి కాలువకు 11.77 టీఎంసీలు, ఎడమ కాలువకు 2.55, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 5.22, హంద్రీ–నీవాకు 4.14 మొత్తం 23.68 టీఎంసీలు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, జూరాల, మధ్యతరహా ప్రాజెక్టుల కనీస నీటి మట్టాలకు లభ్యతగా ఉన్న జలాలు, తుంగభద్ర డ్యామ్‌లో రెండు రాష్ట్రాల వాటా నీటిని కలుపుకుంటే 331.708 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఇందులో ఏపీ వాటా 171.163, తెలంగాణ వాటా 160.545 టీఎంసీలని వివరించారు. దీనిపై తెలంగాణ ఈఎన్సీ స్పందిస్తూ.. ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కలను ఖరీఫ్ పూర్తయిన తర్వాత తేలుద్దామన్నారు. ఈనెల 15 వరకు రెండు రాష్ట్రాలు అవసరమైన మేరకు నీటిని వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి రాయ్‌పురే సమ్మతించారు. -
రబీకి నిండుగా నీరు
సాక్షి, అమరావతి: విస్తారంగా వర్షాలు కురవడంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయి. గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా నీరు సమృద్ధిగా ఉంది. ఖరీఫ్ పంటలకు పూర్తిస్థాయిలో నీరందించిన రాష్ట్ర ప్రభుత్వం.. రబీకి కూడా నీరందించేందుకు సిద్ధమవుతోంది. 2019, 2020 తరహాలోనే యాజమాన్య పద్ధతుల ద్వారా నీరందించనుంది. తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టుకు ప్రయోజనం కలిగేలా జలవనరుల శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా గోదావరి, కృష్ణా, నాగావళి, వంశధార నదులు పోటీ పడి ప్రవహించాయి. వర్షాఛాయ ప్రాంతమైన పెన్నా నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్)లో కూడా సమృద్ధిగా వర్షాలు కురవడంతో పెన్నమ్మ కూడా పరవళ్లు తొక్కింది. దాంతో ఖరీఫ్ పంటలకు సమృద్ధిగా నీళ్లందించారు. ఇప్పటికీ వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టుల్లో గరిష్ఠ స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి. అందువల్ల రబీ పంటలకూ సమృద్ధిగా నీటిని సరఫరా చేస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. మూడు డెల్టాలతోపాటు ఇతర ఆయకట్టులోనూ.. గోదావరి డెల్టాలో ఏటా రబీ పంటలకు నీటిని సరఫరా చేస్తారు. కృష్ణా డెల్టాలో 2019లో తొలి సారిగా రబీకి ప్రభుత్వం అధికారికంగా నీటిని విడుదల చేసింది. గతేడాది కూడా దాన్ని కొనసాగించింది. ఈ ఏడాదీ కృష్ణా డెల్టాలో రబీకి నీళ్లిచ్చేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో కండలేరు, సోమశిల రిజర్వాయర్లలో నీటి నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. దీంతో పెన్నా డెల్టాలో కూడా పూర్తి స్థాయిలో రబీకి నీళ్లందించనుంది. వంశధారలో గతేడాది తరహాలోనే నీటి లభ్యత ఆధారంగా ఈ ఏడాదీ సాగు నీరిచ్చేందుకు చర్యలు చేపట్టింది. తుంగభద్రలోనూ వరద కొనసాగుతుండటంతో హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ) ఆయకట్టులో నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. నీటితో కళకళలాడుతున్న ప్రకాశం బ్యారేజీ అవకాశం ఉన్న ప్రతి ప్రాజెక్టులోనూ నీటి విడుదల వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులు నిండటంతో ఖరీఫ్, రబీల్లో 2019, 2020లలో కోటి ఎకరాల చొప్పున ఆయకట్టుకు నీళ్లందించాం. ఈ ఏడాదీ అదే రీతిలో ఖరీఫ్‌లో నీళ్లందించాం. యాజమాన్య పద్ధతుల ద్వారా ఆన్ అండ్ ఆఫ్ విధానంలో నీటి వృథాకు అడ్డుకట్ట వేసి.. రబీలోనూ అధిక ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు రబీలో అవకాశం ఉన్న ప్రతి ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నాం. – సి.నారాయణరెడ్డి, జలవనరుల శాఖ ఈఎన్సీ -
Kharif Crop: ఖరీఫ్‌కు రెడీ
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల కింద ఖరీఫ్ పంటలకు నీటి విడుదలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. గోదావరి డెల్టాకు జూన్ 15న నీటిని విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. పోలవరం స్పిల్ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్ పనులు పూర్తవడం ఆధారంగా రెం డు మూడ్రోజుల ముందే అంటే జూన్ 12నే గోదా వరి డెల్టాకు నీటి విడుదల చేసే అవకాశాలను పరి శీలిస్తున్నట్లు ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. పోలవరం కుడికాలువ ద్వారా వచ్చే జలాలు, కృష్ణా వరద ప్రవాహాల ఆధారంగా కృష్ణా డెల్టా, వంశధారలో ప్రవాహాల ఆధారంగా వంశధార ప్రాజెక్టు ఆయకట్టుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోనున్నారు. మిగతా ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద, నీటి లభ్యతను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుని నీటిని విడుదల చేయనున్నారు. రెండేళ్లుగా కళకళ.. భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతలు, చిన్న నీటివనరుల విభాగం కింద రాష్ట్రంలో 1.33 కోట్ల ఎకరాల ఆయకట్టు ఉంది. 2019–20, 2020–21 నీటి సంవత్సరాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులన్నీ నిండాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో గత రెండేళ్లుగా రికార్డు స్థాయిలో ఖరీఫ్, రబీ పంటల ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. అదే తరహాలో ఈ ఏడాదీ సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనాల నేపథ్యంలో వరద నీటిని ఒడిసి పట్టి సమర్థవంతంగా ఆయకట్టుకు నీటిని విడుదల చేసేలా జలవనరుల శాఖ ప్రణాళిక రచించింది. స్పిల్ వే మీదుగా వరద మళ్లింపు.. పోలవరం స్పిల్ వే మీదుగా గోదావరి వరద మళ్లింపు పనులు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. అప్రోచ్ చానల్, స్పిల్ చానల్, స్పిల్ వే పనులు పూర్తవుతూనే వరదను పోలవరం స్పిల్ వే మీదుగానే దిగువకు విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తవుతూనే గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేయనున్నారు. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 11.70 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గోదావరి వరద మట్టం 14 మీటర్లు దాటాక పోలవరం కుడి కాలువ మీదుగా గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించడాన్ని ప్రారంభిస్తారు. పులిచింతల్లోకి వచ్చే వరద, ప్రకాశం బ్యారేజీకి తరలించే గోదావరి జలాలను పరిగణనలోకి తీసుకుని కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటలకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలన్నది నిర్ణయం తీసుకుంటారు. వంశధారలో వరద ప్రవాహం ప్రారంభం కాగానే గొట్టా బ్యారేజీ కుడి కాలువ ద్వారా వంశధార ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారు. నాగావళిలో వరద ప్రవాహం ఆధారంగా తోటపల్లి బ్యారేజీ కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. మిగిలిన ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద ప్రవాహం, నీటి లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. శివారు భూములకూ నీళ్లందేలా.. గత రెండేళ్ల తరహాలోనే ఆయకట్టు చివరి భూములకూ సమర్థంగా నీళ్లందించేలా జలవనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు కాలువలకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన 807 మరమ్మతుల పనులను కడా(ఆయకట్టు ప్రాంత అభివృద్ది సంస్థ) నేతృత్వంలో రూ.104.21 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ పనులను జూన్ 15లోగా పూర్తి చేయాలని ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు డెడ్‌లైన్ విధించారు. కాలువలోకి నీటిని విడుదల చేసేలోగా మరమ్మతు పనులు పూర్తయితే నీటి వృథాకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందన్నది అధికారుల ఉద్దేశం. తద్వారా ఆయకట్టు చివరి భూములకూ సమృద్ధిగా నీళ్లందించనున్నారు. -
ఖరీఫ్ పంటలకూ ఉచిత బీమా
సాక్షి, అమరావతి: ప్రస్తుతం సాగులో ఉన్న ఖరీఫ్ పంటలకు కూడా ఉచిత పంటల బీమాను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ–పంటలో నమోదు చేసుకున్న పంటలకే ఉచిత బీమాను పరిమితం చేయాలని నిర్ణయించింది. వ్యవసాయరంగ బీమా అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.101 కోట్ల వాటా ధనంతో ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఐసీఎల్) ఏర్పాటుకు గతంలోనే ఉత్తర్వులు విడుదల చేసింది. కొన్ని నిబంధనలు పూర్తికావాల్సి ఉన్నందున ఆ సంస్థ పెండింగ్‌లో ఉన్నప్పటికీ గత ఏడాది గుర్తించిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు బీమాను అమలు చేసింది. రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో ఏయే పంటలకు దిగుబడి, వాతావరణ ఆధారిత బీమాను అమలు చేయాలో జాబితాలను విడుదల చేసింది. జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే (జీసీఈఎస్) ఆధ్వర్యంలో నిర్వహించే నిర్దేశిత పంట కోత ప్రయోగాల ఆధారంగా దిగుబడి ఆధారిత పంటల బీమా క్లెయిమ్స్‌ను పరిష్కరిస్తారు. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద క్లెయిమ్స్‌ను ఏపీఎస్‌డీపీఎస్‌గానీ, గుర్తించిన ఐఎండీ వాతావరణ కేంద్రాలుగానీ, రాష్ట్ర ప్రభుత్వ మండల స్థాయి రెయిన్ గేజ్ స్టేషన్లుగానీ ఇచ్చే సమాచారం ఆధారంగా పరిష్కరిస్తారు. -
జలకళ.. ఖరీఫ్ భళా
సాక్షి, అమరావతి: గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ప్రవాహం ప్రారంభమైంది. దీంతో గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంటల సాగుకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 10.13 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు డెల్టా రైతులు సిద్ధమయ్యారు. నాగావళి నది నుంచి తోటపల్లి బ్యారేజీలోకి ప్రవాహం మొదలవడంతో అధికారులు ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. వంశధారలోనూ వరద ప్రవాహం ప్రారంభమైంది. నీటిపారుదల సలహా మండలి (ఐఏబీ) సమావేశాన్ని నిర్వహించి.. గొట్టా బ్యారేజీ కింద 2.10 లక్షల ఎకరాలకు సాగు నీటిని విడుదల చేయడంపై నిర్ణయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. నీటి లభ్యతను బట్టి ఇతర ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై ఐఏబీ సమావేశాలలో నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా గతేడాది గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి నదీ పరీవాహక ప్రాంతాల్లో 1,050 టీఎంసీలను వినియోగించుకుని ఖరీఫ్, రబీలలో 1.34 కోట్ల ఎకరాలకు సర్కార్ నీటిని సరఫరా చేసింది. ఇందులో ఒక్క ఖరీఫ్‌లోనే కోటి ఎకరాలకు నీళ్లందించడం గమనార్హం. దాంతో రికార్డు స్థాయిలో వరి దిగుబడులు వచ్చాయి. నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల ఈ ఏడాదీ సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసిన నేపథ్యంలో వరద నీటిని గరిష్ట స్థాయిలో ఒడిసి పట్టి ఆయకట్టుకు నీళ్లందించి, రైతులకు దన్నుగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్నీ మంచి శకునములే.. ► గోదావరి నదిలో ఈనెల 7 నుంచే వరద ప్రవాహం మొదలైంది. అదే రోజున ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేశారు. ► కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా నీటి సంవత్సరం ప్రారంభంలోనే ఆల్మట్టి జలాశయంలోకి ఈనెల 5వ తేదీన 12,761 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరింది. ఈనెల 5 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకూ 7 టీఎంసీలు ఆల్మట్టి జలాశయంలోకి చేరాయి. ► ప్రస్తుతం ఆల్మట్టిలో 35.02 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది మాదిరిగానే ఈ ఏడాదీ కృష్ణాలో వరద ప్రవాహం మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ► పులిచింతల ప్రాజెక్టులో 5.43 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీలో 2.72 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గోదావరిలో నీటిమట్టం 17 అడుగులకు చేరిన అనంతరం వరద జలాలను కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి మళ్లించి.. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని జల వనరుల శాఖ అధికారులు నిర్ణయించారు. ► నెలాఖరులోగా డెల్టాకు నీటిని విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. డెల్టాలో 13.08 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ► నాగావళి నదిలోనూ నీటి సంవత్సరం ప్రారంభంలోనే వరద ప్రారంభమైంది. తోటపల్లి బ్యారేజీలో నీటి నిల్వ 2.015 టీఎంసీలకు చేరడంతో అధికారులు పంటల సాగుకు కాలువలకు నీటిని విడుదల చేశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తోటపల్లి బ్యారేజీ కింద 1,59,822 ఎకరాల్లో పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ► ఒడిశాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల వంశధార నదిలోనూ వరద ప్రవాహం ప్రారంభమైంది. గొట్టా బ్యారేజీ బ్యారేజీ నుంచి శనివారం 624 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలారు. శాసనభ సమావేశాలు ముగిసిన తర్వాత ఐఏబీ సమావేశం నిర్వహించి.. ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీటి విడుదల.. ► శ్రీశైలం జలాశయానికి గత ఏడాది మాదిరిగానే వరద ప్రవాహం వస్తే దానిపై ఆధారపడిన తెలుగు గంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై ఐఏబీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారు. ► నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం చేరడం.. నీటి లభ్యత ఆధారంగా కుడి కాలువ, ఎడమ కాలువ ఆయకట్టుకు నీటి విడుదలపై సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ► సోమశిలలో 26.6, కండలేరులో 23.51 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కృష్ణా, పెన్నా నదుల్లో నీటి లభ్యత ఆధారంగా సోమశిల, కండేరు, పెన్నా డెల్టా కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంపై నిర్ణయం తీసుకుంటారు. ► తుంగభద్రలో వరద ప్రవాహం సుంకేశుల బ్యారేజీకి చేరాక.. ఐఏబీ సమావేశం నిర్వహించి కేసీ కెనాల్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. -
ఇది గిట్టుబాటవుతుందా?!
ఈసారి బడ్జెట్ సమావేశాలు మొదలైనరోజు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పార్లమెంటులో చేసిన ప్రసంగం రైతుల్లో ఆశలను పెంచింది. ఆహార ధాన్యాలకు మెరుగైన ధరలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని, ఇన్పుట్ వ్యయంపై 1.5 రెట్లు అధికంగా వారికి రాబడి వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నదని తెలియజేశారు. సోమవారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ఈ ఖరీఫ్ సీజన్లో పండించే 14 పంటల కనీస మద్దతు ధరలు పెంచింది. ఈ ధరలు గతంతో పోలిస్తే మెరుగ్గా వుండాలని... ఒకటిన్నర రెట్లు అధికంగా రావడం సంగతటుంచి పెట్టిన పెట్టుబడికి దీటుగా వుండాలని రైతులు ఆశించడం సహజం. కానీ ఎప్పటిలాగే వారికి అసంతృప్తే మిగిలింది. వరికి నిరుడు మద్దతు ధర క్వింటాల్ రూ. 1,815 వుండగా ఈసారి దాన్ని రూ. 1,868కి పెంచారు. అంటే గతంతో పోలిస్తే పెంచింది రూ. 53. ఏ గ్రేడ్ వరి ధరను కూడా రూ. 53 పెంచి, దాని మద్దతు ధరను రూ. 1,888గా నిర్ణయించారు. నూనెగింజలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాల ఎంఎస్పీలు గణనీయంగా పెరిగాయి. గడ్డి నువ్వులు(నైజర్ సీడ్స్, ఒడిసెలు)కి అయితే రూ. 755 మేర పెంచారు. ఈ కొత్త ధరల గురించి ప్రకటన చేస్తూ పంట ఉత్పత్తి వ్యయంపై అదనంగా 50 శాతం ప్రతిఫలం వుండేలా మద్దతు ధర వుండాలన్న సంకల్పంతోనే ఈ ధరలు ప్రకటించామని కేంద్రం తెలిపింది. కానీ ఇప్పుడు ప్రకటించిన మద్దతు ధరలను గమనిస్తే అసలు వివిధ పంటలకు ఇన్పుట్ వ్యయం స్థూలంగా ఎంతవుతున్నదోనన్న అవగాహన వుందా అన్న అనుమానం కలుగుతోంది. ఏ పంట దిగుబడికి ఎంత మద్దతు ధర వుండాలో జాతీయ వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్(సీఏసీపీ) సిఫార్సు చేస్తుంటుంది. వాటి ఆధారంగా కేంద్రం ఈ ధరల్ని నిర్ణయిస్తుంది. సీఏసీపీ వివిధ రాష్ట్రాలను సందర్శించి అక్కడి ప్రభుత్వాలు, రైతు సంఘాలు, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని... సాగు చేయడానికి అవుతున్న వ్యయం, పంట ఉత్పత్తి, మార్కెట్లో పంట దిగుబడికి వుండే ధర వగైరాలను పరిశీలించి సిఫార్సులు చేస్తుంటుంది. ఉత్పత్తి వ్యయంపై 50 శాతంకన్నా అధికంగా ఎంఎస్పీ వుండేలా చూడాలని ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ నేతృత్వంలోని జాతీయ కమిషన్ ఎప్పడో 2006లో సూచించింది. దాన్ని అమలు చేస్తామని గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రకటించినా, ఆ పని చేయకుండానే అది నిష్క్రమించింది. ఎన్డీఏ ప్రభుత్వం సైతం ఆ మాటే చెప్పింది. దాన్ని అమలు చేయడం ప్రారంభించామని ఇప్పుడంటోంది. కానీ ఆ ధరలు తమ ఉత్పత్తి వ్యయానికి 50 శాతం అధికంగా వుండటం మాట అటుంచి గిట్టుబాటు కావడమే కష్టమవుతున్నదని రైతుల ఫిర్యాదు. అసలు కనీస మద్దతు ధరల్ని జాతీయ స్థాయిలో ప్రకటించడం అహేతుకమని రైతు సంఘాలు చెబుతాయి. ఉత్పత్తి వ్యయం అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా లేనప్పుడు, దిగుబడికి ఒకే రకం ధరను ప్రకటించడం ఏవిధంగా సమంజసమన్నది ఆ సంఘాల ప్రశ్న. సీజన్లో కేరళలో రోజు కూలీ రూ. 850 నుంచి రూ. 1,000 వరకూ వుండగా, తెలుగు రాష్ట్రాల్లో అది రూ. 600–రూ. 800 మధ్య వుంటుంది. ఒడిశా వంటిచోట్ల రూ. 150–రూ. 200 మించదు. పంజాబ్‌లో కూడా తక్కువే. అసలు విత్తనాలు మొదలుకొని ఎరువులు, పురుగుమందులు, డీజిల్ వరకూ అన్నిటి ధరలూ ఆకాశా న్నంటుతున్నాయి. ఇవన్నీ తడిసిమోపెడయి ఉత్పత్తి వ్యయాన్ని విపరీతంగా పెంచుతున్నాయి. మద్దతు ధరలు జాతీయ స్థాయిలో నిర్ణయిస్తుండటంవల్ల ఒడిశా, పంజాబ్ వంటివి లాభ పడుతున్నాయి. దక్షి ణాది రైతులు నష్టపోతున్నారు. ఏ గ్రేడ్ వరికి ఈసారి నిర్ణయించిన గిట్టుబాటు ధర రూ. 1,888ని కనీసం రూ. 2,500గా ప్రకటిస్తే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమాత్రం గిట్టు బాటు కాదని రైతు నేతలు చెబుతున్న మాట. ఉపాధి హామీ పథకాన్ని సాగు పనులకు అను సంధానించాలని చాన్నాళ్లుగా వారు కోరుతున్నారు. కనీసం ఆ నిర్ణయం తీసుకున్నా సాగు వ్యయం గణనీయంగా తగ్గుతుందని, రైతుకు ఎంతో కొంత మేలు కలుగుతుందని సూచిస్తున్నారు. కానీ వినిపించుకొనేవారేరి? ఎంఎస్పీ నిర్ణయంలో సీఏసీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఎప్పటినుంచో విమర్శలున్నాయి. అది అచ్చం వ్యాపార ధోరణితో ఆలోచించి... డిమాండు, సరఫరాలను పరిగణనలోకి తీసుకుని సిఫా ర్సులు చేస్తున్నది తప్ప రైతులకు వాస్తవంగా అవుతున్న వ్యయం సంగతిని పట్టించుకోవడంలేదన్న ఫిర్యాదులు ఎప్పటినుంచో వున్నాయి. ఉదాహరణకు వరి ధాన్యం నిల్వలు మన దేశంలో సమృద్ధిగా వున్నాయి. కనుక వరి ఎంఎస్పీని నిర్ణయించేటపుడు ఆ సంగతిని సీఏసీపీ దృష్టిలో వుంచుకుం టుంది. కానీ నూనె గింజల సంగతి వచ్చేసరికి పరిస్థితి వేరు. రైతుల నుంచి కొనేదికాక దిగుమతి చేసుకోవాల్సివస్తోంది. దిగుమతులు తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది కనుక నూనె గింజలకిచ్చే ఎంఎస్పీ ఎప్పుడూ గణనీయంగానే వుంటోంది. అలాగే ఉత్తరాదిన పండే గోధుమకు ప్రతిసారీ మెరుగైన ఎంఎస్పీ లభిస్తుంది. వాస్తవానికి దానికయ్యే ఉత్పత్తి వ్యయం తక్కువ. మరి ఏ ప్రాతి పదికన దానికి ఎంఎస్పీ ఎక్కువిస్తారన్న సందేహాలు ఎప్పటినుంచో వున్నాయి. పైగా ఏటా కేంద్రం ప్రకటించే ఎంఎస్పీని బట్టి వ్యాపారులు కొంటారన్న విశ్వాసం ఎవరికీ లేదు. మార్కెట్లో ఎప్పుడూ దళారులదే పైచేయి. ఎంఎస్పీని ప్రకటించడంతోపాటు ఆ ధరకు తామే కొనడానికి అనువైన వ్యవస్థల్ని ప్రభుత్వాలు ఏర్పరిస్తేనే ఈ సమస్య తీరుతుంది. దిగుబడినంతా ప్రభుత్వాలు కొనవలసిన అవసరం ఉండదు. ప్రభుత్వ వ్యవస్థలు రంగంలోకి దిగి కొనుగోలు చేస్తే అందరూ దారికొస్తారు. కరోనా మహమ్మారి మన ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసిన వర్తమానంలో జీడీపీ ఈ మాత్ర మైనా వుండటానికి రైతాంగం కృషే కారణం. రైతులకు ఎంతో చేస్తున్నామని చెప్పుకునే బదులు, వారికి అక్కరకొచ్చే కనీస చర్యలు అమలు చేస్తే ఎంతో మేలుచేసిన వారవుతారు. -
వరికి రెండింతలు..పత్తికి మూడింతలు
సాక్షి, హైదరాబాద్: స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)లు ఉండాలని, ఆ మేరకు ప్రస్తుత ఎంఎస్పీని వచ్చే ఖరీఫ్ నాటికి సవరించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సాగు ఖర్చుకు మరో 50 శాతం అదనంగా కలిపి ఎంఎస్పీ ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ వ్యయ, ధరల (సీఏసీపీ) కమిషన్‌కు ప్రతిపాదించింది. ఆ ప్రకారం వరికి ప్రస్తుత ఎంఎస్పీకి రెండింతలు, పత్తికి దాదాపు మూడింతలు పెంచాలని వ్యవసాయ శాఖ నివేదించింది. అందులో ఖరీఫ్‌లో వివిధ పంటలకు ఎంతెంత ఖర్చు అవుతుందో వివరించింది. పంటల వారీగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంట కోత, రవాణా, కూలీ, రైతు కుటుంబ శ్రమకు ప్రతిఫలం అన్నీ కలిపి ఎంత ఖర్చు అవుతుందో సవివరంగా కేంద్రానికి నివేదించింది. ఒక వ్యాపారి తన వస్తువును అమ్ముకునేటప్పుడు ధర ఎలా నిర్ణయిస్తారో, ఆ ప్రకారమే పెట్టిన పెట్టుబడి, దానికి అయ్యే వడ్డీలను లెక్కలోకి తీసుకొని సాగు ఖర్చును నిర్ధారించారు. ఏటా ఇలాగే శాస్త్రీయంగా సాగు ఖర్చు, ఎంఎస్పీ ఎలా ఉండాలో తెలంగాణ వ్యవసాయ శాఖ ఇస్తూనే ఉంది. కానీ కేంద్రం తన పద్ధతిలో తాను ఎంఎస్పీని నిర్ధారిస్తూ పోతోందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఎకరా వరి సాగు ఖర్చు రూ. 35 వేల పైనే.. సాధారణ వరి రకం పండించేందుకు నారుమడి సిద్ధం చేయడం మొదలు విత్తనాలు, నాట్లు, ఎరువులు, కలుపుతీత, పంట కోత, కూలీల ఖర్చు, కుటుంబ సభ్యుల శ్రమ మొత్తం కలుపుకుంటే ఎకరానికి రూ.35,156 ఖర్చు అవుతున్నట్లు లెక్కగట్టింది. చివరకు క్వింటా వరి పండించాలంటే రూ.2,529 ఖర్చు అవుతుందని నిర్ధారించింది. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సాగు ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి ఎంఎస్పీ రూ.3,794 ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం వరి ఎంఎస్పీ రూ.1,815 ఉండగా, రెట్టింపునకు మించి పెంచాలని కోరింది. 2020–21 ఖరీఫ్‌లో ఈ మేరకు పెంచాలని విజ్ఞప్తి చేసింది. ఇక పత్తి పండించాలంటే క్వింటా లుకు రూ.10,043 ఖర్చు అవుతుందని వ్యవసాయ శాఖ లెక్కగట్టింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో పత్తి క్వింటాలుకు ఎంఎస్పీ రూ.5,550 కాగా, సాగు ఖర్చును లెక్కలోకి తీసుకొని స్వామినాథన్ ఫార్ములా ప్రకారం ఎంఎస్పీ రూ.15,064 ఇవ్వాలని వ్యవసాయ శాఖ సీఏసీపీని కోరింది. అలాగే మొక్కజొన్న క్వింటా పండించేందుకు రూ.2,172 ఖర్చు అవుతుందని నిర్ధారించారు. ఆ ప్రకారం ఎంఎస్పీ రూ.3,258 వేలు ఇవ్వాలని ప్రతిపాదించారు. వేరుశనగ క్వింటా పండించేందుకు రూ.5,282 ఖర్చు అవుతుండగా, ఎంఎస్పీ రూ.7,924 ఇవ్వాలని కోరారు. క్వింటా కందులు పండించేందుకు రూ.8,084 వ్యయం అవుతుండగా మద్దతు ధర రూ.12,126 కోరారు. క్వింటా సోయాబీన్ ఉత్పత్తికి రూ.4,694 ఖర్చు అవుతుండగా, ఎంఎస్పీ రూ.7,041కు పెంచాలని సీఏసీపీని సర్కారు కోరింది. -
కరువు తీరిన ఖరీఫ్!
సాక్షి, అమరావతి: నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఆగస్టులో కురిసిన వర్షాలు.. కృష్ణా, గోదావరికి పోటెత్తిన వరదలు ఖరీఫ్‌లో రాష్ట్ర రైతన్నలను ఆదుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మూడొంతుల సాగు భూమిలో విత్తనాలు జీవం పోసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా వరి సాగు వెనుకంజలో ఉండగా రాష్ట్రంలో మాత్రం బాగా పుంజుకోవడం విశేషం. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో నాట్లు పూర్తయ్యాయి. ఉత్తర కోస్తా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నాట్లు ఈ నెలలో కూడా కొనసాగే అవకాశం ఉంది. సాగర్ కుడి, ఎడమ కాలువల కింద వరి సాగు ఈ నెలలో మొదలవుతుంది. గత పదేళ్లలో తొలిసారిగా నాగార్జునసాగర్ నిండుకుండలా మారడంతో ఈసారి ఆలస్యంగానైనా కుడి కాలువ కింద దాదాపు 11 లక్షల ఎకరాలకు పైగా మాగాణుల్లో నాట్లు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తున్నారు. అన్నదాతలకు ఇవీ సూచనలు... - సాధ్యమైనంత వరకు లేత నారు అంటే 25– 30 రోజుల లోపల ఉన్న వరి నారు నాటుకోవాలి. - ముదురు నారు నాటాల్సి వస్తే నాట్లు దగ్గర దగ్గరగా వత్తుగా ఉండేలా చూడాలి. - ఆలస్యంగా సాగు నీరు అందిన ప్రాంతాల్లో స్వల్ప, మధ్యకాలిక రకాలను సాగు చేసుకుంటే రైతులకు మేలు జరుగుతుంది. - స్వల్పకాలిక రకాలైన ఎంటీయూ 1153, ఎంటీయూ 1156, ఎన్ ఎల్ ఆర్ 34449, మధ్యకాలిక రకాలైతే ఎంటీయూ 1075, ఎంటీయూ 1121, ఎన్ ఎల్ ఆర్ 304 సాగుకు అనువైనవి. - వెదజల్లే పద్ధతిలో కలుపు నివారణకు విత్తిన 3 నుంచి 5 రోజుల మధ్య ఎకరానికి ఆక్సాడయర్జిల్ 35 గ్రాములను 25 కిలోల పొడి ఇసుకతో కలిపి సమానంగా చల్లాలి. విత్తిన 810 రోజుల మధ్య ఎకరానికి ఫైరజోసల్ఫ్యురాన్ ఇధైల్ లీటర్ నీటికి వంద గ్రాములు లేదా ఇథాక్సిలస్ఫ్యురాన్ 40 గ్రాములను 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20 రోజులకు ఎకరానికి సైహాలోఫాప్ బ్యూటైల్ పది శాతం ద్రావకాన్ని 400 మిల్లీలీటర్లు లేదా బిస్పైరిబాక్ సోడియం పది శాతం ద్రావకాన్ని వంద మిల్లీలీటర్ల చొప్పున ఎకరానికి 200 లీటర్ల మందును పిచికారీ చేయాలి. - వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కలుంటే విత్తిన 20 – 25 రోజుల లోపు ఎకరానికి 400 గ్రాముల డి.సోడియం సాల్ట్ 80 శాతం పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. - వర్షాల కారణంగా జొన్నలో గింజ బూజు తెగులు లేదా బంక కారు తెగులు నివారణకు ప్రొపికొనజోల్ 0.5 మిల్లీలీటర్‌ను లీటర్ నీటిలో కలిపి పూత, గింజ దశలో పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. సజ్జను కూడా జొన్న మాదిరిగా సస్యరక్షణతో కాపాడుకోవచ్చు. - మినుము, పెసరలో తెగుళ్ల నివారణకు ఎపిఫేట్మో, మోనోక్రోటోఫాస్, ఫిప్రోనిల్, డైమిథోయేట్, స్పైనోసాడ్లలో ఏదో ఒకదాన్ని వ్యవసాయాధికారుల సూచన మేరకు పిచికారీ చేయాలి. ఒక అడుగు ఎత్తులో నీలిరంగు జిగురు అట్టలను ఎకరానికి 20 వరకు ఉంచితే తామర పురుగులు ఉధృతిని తెలుసుకోవచ్చు. - పల్లాకు తెగులు సోకిన పొలంలో పైరుపై ఒక అడుగు ఎత్తులో పసుపు రంగు రేకులు లేదా అట్టలను ఉంచి వాటిపై ఆముదం లేదా గ్రీజు రాయడం ద్వారా తెల్ల దోమ ఉధృతిని తెలుసుకోవచ్చు. తెల్ల దోమ నివారణకు ట్రైజోఫాస్, మోనోక్రోటోఫాస్, మెటాసిస్టాక్స్, ఎసిటామిప్రిడ్ లీటర్ నీటికి కలిపి పురుగు ఉధృతిని బట్టి 7 నుంచి పది రోజుల వ్యవధిలో మార్చి మార్చి పిచికారీ చేయాలి. పల్లాకు తెగులు సోకిన మొక్కల్ని తొలగించడం మంచిది. - మినుము, పెసర పూత దశలో ‘మారుక’ గూడు పురుగు నివారణకు లీటర్ నీటికి క్లోరిఫైరిఫాస్ డైక్లోరివాస్ లేక నొవల్యురాన్‌ను పిచికారీ చేసుకోవాలి. -
పంట నష్టపోయిన రైతుకు పరిహారమివ్వాలి
సాక్షి, హైదరాబాద్: పంటలకు అవసరమైన నీటిని ప్రణాళికాబద్ధంగా అందించాలని, నీరు లేక ఏ రైతు పంట నష్టపోయినా ప్రభుత్వం పరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. వర్షాభావంతో ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయని, రబీపై ఆశలు పెట్టుకున్నా.. నాగార్జునసాగర్ ఎడమకాలువ, శ్రీరాంసాగర్, జూరాల కింది రైతులకు తైబందీ చేసి నీరివ్వడం లేదన్నారు. నాగార్జునసాగర్ కింద నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో వేసిన పంటలకు ఇవ్వాల్సిన నీటిని మిషన్ భగీరథకు తరలించడానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే వేసిన పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం సాగర్‌లో డెడ్‌స్టోరేజీ పోగా 60 టీఎంసీల నీరు ఉన్నందున.. సాగర్ బోర్డును సంప్రదించి రాష్ట్రంలోని మొదటి, రెండో జోన్లకు కావాల్సిన నీటిని సాధించాలన్నారు. శ్రీశైలంలో డెడ్‌స్టోరేజీ పోగా 30 టీఎంసీల నీటి లభ్యత ఉన్నందున, ఇందులో రాష్ట్రానికి రావాల్సిన కోటా రాబట్టాలని కోరారు. ఇప్పటికైనా నీటిపారుదల, వ్యవసాయశాఖలు నీటి లభ్యతను బట్టి ఆయకట్టు ప్రాంతాన్ని నిర్ధారించి కచ్చితంగా అమలుచేయాలని తమ్మినేని సూచించార -
వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు అడుగింటి పోతున్నాయి. లోటు వర్షపాతం కారణంగా చాలా జిల్లాల్లో ఖరీఫ్ పంటల సాగుకు రైతులు బోర్లపై ఆధారపడటంతో మట్టాల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. గతేడాది నవంబర్ మట్టాలతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 2.54 మీటర్ల దిగువకు పడిపోయాయి. మెదక్ జిల్లాలో ఏకంగా 20.71 మీటర్లకు భూగర్భ నీటిమట్టం పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది 19 శాతం మేర లోటు వర్షపాతం తక్కువగా నమోదైంది. ఈ ఏడాది నవంబర్‌లో భూగర్భ జల శాఖ 584 మండలాల పరిధిలో భూగర్భ మట్టాలను పరిశీలించింది. గతేడాది నవంబర్‌లో రాష్ట్ర సగటు నీటి మట్టం 8.36 మీటర్లు ఉండగా, ఈ ఏడాది అది 10.90గా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే 2.54 మీటర్ల మేర తగ్గుదల కనిపించింది. కేవలం 8 జిల్లాల్లో మాత్రమే 0.34 మీటర్ల నుంచి 1.64 మీటర్ల పెరుగుదల కనిపించగా, 23 జిల్లాల్లో 7.85 మీటర్ల నుంచి 0.15 మీటర్ల వరకు తగ్గాయి. ముఖ్యంగా సంగారెడ్డి, రంగారెడ్డి, గద్వాల, మెదక్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లోమట్టాలు ఊహించని రీతిలో పడిపోయాయి. ఏకంగా కొన్ని జిల్లాలో 7 మీటర్లు పడిపోగా, మరికొన్ని జిల్లాలో 6 మీటర్లకు పైగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వేసవికి మరో 4 నెలల ముందే ఇలాంటి పరిస్థితులు ఉంటే.. ఇక నిండు వేసవిలో ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్న గుబులు కలిగిస్తోంది. -
కరువు ఛాయలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కరువు ఛాయలు అలముకున్నాయి. వ్యవసాయశాఖ బుధవారం ప్రభుత్వానికి అందజేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 17 జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. ఈ నెలలో ఇప్పటివరకు ఏకంగా 82 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం గమనార్హం. కొన్ని జిల్లాల్లోనైతే వంద శాతం లోటు నమోదైంది. పైపెచ్చు ఎండలు మండిపోతున్నాయి. అనేక జిల్లాల్లో సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ఖరీఫ్‌లో వేసిన పంటల పరిస్థితి అధ్వానంగా మారింది. మరోవైపు రబీలో పంటల సాగు విస్తీర్ణం సాగిల పడింది. రబీ మొదలైన తర్వాత ఈ 25 రోజుల్లో కేవలం నాలుగు శాతం మేర మాత్రమే పంటలు వేశారు. ఈ యాసంగిలో మొత్తం 33.06 లక్షల ఎకరాల సాధారణ సాగు అంచనా ఉండగా, ఇప్పటి వరకు 1.22 లక్షల ఎకరాల్లో సాగు నమోదైంది. ఇందులో శనగ పంట 30 వేల ఎకరాల్లో, వేరుశనగ 70 వేల ఎకరాల్లో, మొక్కజొన్న 12 వేల ఎకరాల్లో వేశారు. గత రెండేళ్లుగా సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో వర్షాలు కురిసి ప్రాజెక్టులు, చెరువులు నిండి జలకళను సంతరించుకునేవని, కానీ ఈసారి ఆ పరిస్థితులు లేకపోవడంతో సాగు అంచనాలను చేరుతుందా లేదా అన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రబీలో ఇప్పుడే కరువు ఛాయలు కనిపిస్తున్నందున మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. ఖరీఫ్ పంటలపై ప్రభావం... పంట చేతి కందే సమయంలో వర్షాలు కురవకపోవడం, ఎండలు తీవ్రంగా ఉండటంతో పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రధానంగా చివరి దశలో ఉన్న పత్తి, కంది ఎండిపోతుండటంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు ఆశాజనకంగా కురవక పోవడంతో అనేక మెట్ట పంటలు ఎండిపోతున్నాయి. జూన్‌లో 15 శాతం అధిక వర్షపాతం నమోదైనా, జూలైలో 30 శాతం లోటు నమోదైంది. ఆగస్టులో 18 శాతం అధిక వర్షపాతం కురవగా, సెప్టెంబర్‌లో ఏకంగా 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇక అక్టోబర్‌లో ఇప్పటివరకు ఏకంగా 82 శాతం లోటు నమోదైంది. మొత్తంగా ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు 16 శాతం లోటు రికార్డు అయింది. కీలకమైన సెప్టెంబర్‌లో వర్షాలు కురవకపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. మొత్తం 584 మండలాలుంటే, ఏకంగా 320 మండలాల్లో వర్షపాతం కొరత వేధిస్తుంది. ఎండల తీవ్రత, వర్షాభావం, గులాబీ పురుగు కారణంగా పత్తి దిగుబడి పడిపోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ అంచనా ప్రకారం 35 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి జరగాల్సి ఉండగా, కేవలం 30 లక్షల టన్నుల లోపు మాత్రమే ఉండొచ్చని అంటున్నారు. ఎండలు తీవ్రం కావడంతో గింజ పట్టే దశలో ఉన్న కంది పరిస్థితి దారుణంగా మారింది. లక్షలాది రూపాయలు అప్పులు చేసి పంటలను సాగు చేస్తే నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. -
ఆశలు.. మోసులు
జిల్లాలో రబీ సీజన్ సాగుపై ఆశలు మోసులెత్తుతున్నాయి. జిల్లా వ్యవసాయానికి సోమశిల, కండలేరు జలవనరులే కీలకం. అటువంటి జలాశయాలు ప్రస్తుతం నిండుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నా.. జిల్లాలో ఊరిస్తున్న మేఘాలు జల్లుకురిసే వరకు నిలవడం లేదు. ఈ పరిస్థితితో వర్షాలు జిల్లాకు మొహం చాటేస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా కృష్ణా జలాలు సోమశిలకు వస్తుండడంతో జిల్లా రైతులు రబీ సాగుపై ఆశలు పెట్టుకుంటున్నారు. వర్షం ఊరిస్తుందా.. ఊతమిస్తుందా అనేది చూడాల్సి ఉంది. నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో వ్యవసాయం సాగుకు తలమానికంగా ఉన్న సోమశిల, కండలేరు రిజర్వాయర్లు ప్రస్తుతం నిండుకున్నాయి. సోమశిల 71 టీఎంసీలు, కండలేరు 68 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా రెండు రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండిన దాఖలాలు లేవు. సోమశిల కింద గతంలో గరిష్టంగా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. కండలేరు కింద జిల్లాలో 2.54 జిల్లాలో ఆయకట్టు ఉంటే.. చిత్తూరు జిల్లాలో 46 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నీటి స్టోరేజీని బట్టి ఏటా ఆయకట్టు విస్తీర్ణాన్ని స్థిరీకరిస్తున్నారు. ఊరిస్తుందా..! ఊతమిస్తుందా!! సాధారణంగా సోమశిల జలాశయం నుంచి 18 నుంచి 20 టీఎంసీలు ఉంటేనే అరకొర నీరు వదులుతారు. కండలేరు పరిస్థితి కూడా అంతే. 8.8 టీఎంసీల నీరు నిల్వ ఉంటేనే సాగుకు నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం 3.8 టీఎంసీలు మాత్రమే ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో నీరు లేకపోవడంతో చాలా తక్కువ శాతం సాగు చేశారు. అయితే సోమశిల జలాశయంలో కొద్ది రోజుల వరకు 9 టీఎంసీల నిల్వ ఉండేది. ఇటీవల కృష్ణా జలాలు విడుదల కావడంతో సాగుపై కాసింత ఆశలు మొలకెత్తాయి. బుధవారం సాయంత్రానికి 18.587 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బుధవారం 16,440 క్యూసెక్కుల వంతున కృష్ణానది జలాల రాక కొనసాగింది. గతేడాది కూడా జిల్లాలో వర్షాలు కురవలేదు. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయాలకు నీళ్లు రావడంతో రబీ సాగు గట్టెక్కింది. ప్రస్తుతం పరిస్థితులు జిల్లాలో వర్షాలు కురవకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు సోమశిలకు రావడంతో అక్టోబరు నుంచి ప్రారంభం కానున్న రబీ సీజన్‌పై రైతులు ఆశలు పెట్టుకుంటున్నారు. చిత్తడి జల్లులతో సరి.. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. కానీ జిల్లాలో మాత్రం తుంపర్లతో సరిపెడుతున్నాయి. గతేడాది కూడా పడాల్సిన సాధారణ వర్షపాతం కన్నా 55 శాతం తక్కువగా నమోదైంది. దీంతో రబీ అంతంత మాత్రంగా గట్టెక్కినా.. ఖరీఫ్‌లో అనుకున్నంతగా సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇటీవల జిల్లాలో 45 మండలాలను కరువుగా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది రబీ సీజన్ ముంచుకొస్తున్నా.. వర్షాలు సమృద్ధిగా కురవాల్సిన రోజులు దాటిపోతున్నా.. నీటి నిల్వల పరిస్థితి రైతాంగాన్ని కలవరపెడుతుంది. జిల్లాలో ఏడాది కూడా ప్రస్తుత సమయానికి పడాల్సిన వర్షాలు కూడా పడలేదు. ఈ ఏడాది పరిస్థితి ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుండడంతో రబీ ప్రారంభం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే రబీలో కొంత, ఖరీఫ్‌లో పూర్తిస్థాయిలో నష్టాలు చవిచూసిన రైతులు ఈ ఏడాది రబీలోనైనా గట్టెక్కాలనుకుంటే వరుణుడు కనికరించక పోవడంతో వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ ఈ విధంగా లేదు ప్రస్తుతం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సాగు, తాగుకు నీరు ఇబ్బందికరంగా మారింది. భూగర్భ జలాలు ఎండిపోయాయి. బోర్లు వేద్దామన్నా నీరు పడే పరిస్థితి లేదు. దీంతో వర్షాలపై ఆధారపడి సాగు చేసే పంటల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వమే ప్రత్యామ్నాయం చూపాలి. – కొప్పోలు యల్లారెడ్డి, ఆత్మకూరు జేడీ వ్యవసాయశాఖఆందోళన కలిగిస్తుంది ప్రస్తుతం కొంత కాలం నుంచి వర్షాలు లేకపోవడంతో ఎక్కువగా రాపూరు మండలంలో కరువు ఏర్పడింది. ఈ ప్రాంతంలో వర్షాలపై ఎక్కువగా ఆధార పడి సాగు చేస్తారు. కానీ పరిస్థితి చూస్తుంటే వర్షాలు లేకపోతే ఈ ఏడాది పంట ఏ విధంగా సాగుచేయాలో ఆందోళన కలిగిస్తుంది.– టి హరగోపాల్, రాపూరు ప్రత్యామ్నాయ పంటలను చూస్తాం ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అనుకున్నంతగా సాగు చేయలేదు. కానీ మరో నెల తర్వాత రబీ ప్రారంభం కానుంది. అప్పటికీ వర్షాలు లేకపోతే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయంపై త్వరలోనే రైతులకు అవగాహన కల్పిస్తాం. రబీకి విత్తనాలు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. – బీ చంద్రనాయక్, -
ఖరీఫ్ భళా.. రుణాలు ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర దాటింది.. సాగు విస్తీర్ణం ఇప్పటికే సగానికి మించింది.. కానీ రైతులకు రుణాలందించడం లో బ్యాంకులు అంతులేని నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నాయి. ఈ సీజన్లో రూ.25 వేల కోట్ల మేర రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఇప్పటిదాకా అందులో ఐదో వంతు కూడా ఇవ్వ లేదు. రైతులకు ఖరీఫ్ పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు అనేక కొర్రీలు పెడుతు న్నాయి. ‘ఔను ఖరీఫ్ రుణాలు ఇంకా పుంజుకోలేదు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు కావా లని కొన్నిచోట్ల బ్యాంకులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి’అని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారంటే పరి స్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతోంది. దీంతో అనేకచోట్ల అన్నదాతలు ప్రైవేటు అప్పుల కోసం పరుగులు తీస్తున్నారు. మళ్లీ అప్పులు, వడ్డీలే దిక్కవుతున్నాయి. అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకర్లతో సమీక్ష చేయకపోవడాన్ని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇచ్చింది రూ.5 వేల కోట్లే: రాష్ట్రంలో పంటల సాగు 49 శాతానికి చేరింది. ఖరీఫ్ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 52.72 లక్షల ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు ఏకంగా 30.30 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 5.76 లక్షల ఎకరాలు కాగా, కేవలం 3.91 లక్షల ఎకరాల్లోనే సాగైంది. కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.15 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 5.64 లక్షల ఎకరాల్లో సాగైంది. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.40 లక్షల ఎకరాలు కాగా, 5.01 లక్షల ఎకరాల్లో సాగైంది. ఓవైపు పంటల సాగు పెరుగుతోంది. మరోవైపు వర్షాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పంటల రుణాలు మాత్రం 20 శాతానికి మించలేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఖరీఫ్‌లో బ్యాంకులు రైతులకు ఇవ్వాల్సిన పంట రుణాల లక్ష్యం రూ.25,496 కోట్లు కాగా, ఇప్పటివరకు ఐదో వంతు అంటే రూ.5,099 కోట్లే ఇచ్చినట్లు వెల్లడించాయి. వాస్తవంగా పత్తి రైతులకు రూ.8,279 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే, రూ.3 వేల కోట్లకు మించలేదని అంచనా. కొత్త పాసు పుస్తకాలు రాలేదంటూ.. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత రాష్ట్రంలో రైతుల సంఖ్య 58.33 లక్షలుగా తేలింది. కానీ వారిలో 43 లక్షల మందికే కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. సర్కారు లెక్కల ప్రకారం 15 లక్షల మందికి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు రాలేదని తేలింది. ఇలా పాసు పుస్తకాలు రాని రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి తిరస్కరిస్తున్నాయి. మరోవైపు పాసు పుస్తకాలు వచ్చినా వాటిని బ్యాంకుల వద్ద కుదువ పెట్టాల్సిన పనిలేదని, ఆన్లైన్లో చూసుకుని రుణాలు ఇవ్వాలని సర్కారు నిర్దేశిం చినా బ్యాంకులు పట్టించుకోవడంలేదు. పాసు పుస్తకాలను కుదువ పెట్టాల్సిందేనని బ్యాంకు లు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల కు కొత్త రుణాలు అందడం కష్టంగా మారింది. ‘రైతుబంధు’ కూడా జమ! బ్యాంకులు రైతుల నుంచి పంట రుణంపై వడ్డీని వసూ లు చేస్తున్నాయి. రైతు రూ.లక్ష పంట రుణం తీసుకుని ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే వడ్డీ కట్టక్కరలేదని వ్యవసాయ శాఖ చెబుతుంటే, బ్యాంకులు మాత్రం పట్టించుకోవడంలేదు. కొత్త రుణం కావాలని వెళ్లిన రైతుల నుంచి అసలు, వడ్డీ ముక్కుపిండి వసూలు చేస్తున్నా యి. ‘రైతుబంధు’చెక్కులను తమ పొదుపు ఖాతాల్లో జమ చేయగా ఆ సొమ్మును పాతబాకీ వడ్డీ కింద జమ చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు రూ.500 కోట్లకుపైగా ఉన్న బాకీ సొమ్మును విడుదల చేస్తే, వాటిని రైతు ల ఖాతాల్లో వడ్డీ కింద తిరిగి జమ చేస్తామని బ్యాం కులు తెలిపాయి. ప్రభుత్వం విడుదల చేయకపోవడం తో బ్యాంకులు రైతుల నుంచే వసూలు చేస్తున్నాయి. వడ్డీ వసూలు చేయవద్దని ప్రభుత్వం పదేపదే చెబు తున్నా బ్యాంకర్లు ఏమాత్రం అంగీకరించడంలేదు. ‘రుణమాఫీ’పై వడ్డీ భారం రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణాన్ని నాలుగు విడతలుగా మాఫీ చేయడంతో రైతులపై విపరీతమైన వడ్డీ భారం పడింది. బ్యాంకులో ఉన్న పట్టా పాసు పుస్తకాలను విడిపించుకునేందుకు వడ్డీని రైతులే భరించాల్సి వస్తోంది. ఉదాహరణకు ఒక రైతు 2013లో రూ.లక్ష పంట రుణం తీసుకున్నాడు. 2014లో ప్రభుత్వం మొదటి విడత కింద రూ.25 వేలు చెల్లించగా రుణాన్ని రెన్యువల్ చేసుకున్నాడు. ఇలా నాలుగు విడతలు రూ.25 వేల చొప్పున ప్రభుత్వం చెల్లించింది. కానీ రూ.లక్షకు ఈ మొత్తం కాలంలో పడిన వడ్డీని మాత్రం ప్రభుత్వం చెల్లించలేదు. ఇలా ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ రాకపోవడంతో బ్యాంకులు వడ్డీలు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ భారం తమపైనే పడుతుండటం, రుణాలు ఇవ్వకుండా వేధించడంపై రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
ఖరీఫ్ సాగు 52 లక్షల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాగు 49 శాతానికి చేరింది. ఖరీఫ్ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 52.72 లక్షల ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి 56.74 లక్షల ఎకరాలు సాగు కావడం గమనార్హం. అంటే గతేడాది కంటే కాస్త తక్కువ విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. సాగైన పంటల్లో అత్యధికంగా పత్తి విస్తీర్ణమే ఉండటం గమనార్హం. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా ఈసారి ఏకంగా 30.30 లక్షల ఎకరాల్లో సాగు చేయడం గమనార్హం. కంది సాధారణ సాగు విస్తీర్ణం ఇప్పటివరకు 5.64 లక్షల ఎకరాల్లో సాగైంది. మొక్కజొన్న ఇప్పటివరకు 5.01 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇక కీలకమైన ఖరీఫ్ వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.04 లక్షల ఎకరాల్లో నార్లు పోశారు. ఆగస్టులో వరి నాట్లు పుంజుకోనున్నాయి. -
‘కనీస మద్దతు ధర’లో అసలు కిటుకు తెలుసా!
సాక్షి, న్యూఢిల్లీ : ఖరీఫ్ సీజన్‌కుగాను 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం నాడు నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఇది చరిత్రాత్మక నిర్ణయమని, ఇది ప్రస్తుత విధాన స్వరూపానే మార్చి వేస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో గొప్పగా చెప్పింది. పైగా రైతులకు పంటకయ్యే ఖర్చుకు 50 శాతాన్ని మించే కనీస మద్దతు ధర ఇస్తామంటూ ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన హామీని అక్షరాల అమలు చేస్తున్నామని డాబుసరిగా చెప్పుకుంది. 2020 సంవత్సరం నాటికల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదే పదే చేసిన ప్రతిజ్ఞను అమలు చేసే దిశగా ఈ అడుగు వేస్తున్నామని కూడా సగౌరవంగా ప్రకటించుకుంది. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం రైతులకు కావాల్సినంత పెంచిందా, లేదా? రైతులు ఎంత డిమాండ్ చేస్తూ వచ్చారు? ప్రభుత్వం ఎంత పెంచింది? అసలు కనీస మద్దతు ధరను పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న ప్రాథమిక ప్రమాణాలు ఏమిటీ? గత ప్రభుత్వాల కన్నా నరేంద్ర మోదీ ప్రభుత్వమే ఎక్కువ పెంచిందా? ఈ పెంపుతో రైతుల కష్టాలు తీరుతాయా? అన్ని కోణాల నుంచి ప్రభుత్వ మద్దతు ధరలను పరిశీలించి చూస్తేగానీ సంగతంతా బోధ పడదు. ఓ పంటకయ్యే మొత్తం ఖర్చును పరిగణలోకి తీసుకొని దానికన్నా ఎక్కువ ధర వచ్చేలా ప్రభుత్వం కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది. కనీసం ఆ మద్దతు ధరకన్నా మార్కెట్ ఆ పంటను కొనకపోతే ప్రభుత్వమే ఆ ధరకు పంటను రైతు నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పంట ఖర్చును ఎలా లెక్కిస్తారు? పంటకయ్యే ఖర్చును ప్రాతిపదికగా తీసుకొని కనీసమద్దతు ధర నిర్ణయిస్తారు. అయితే ఈ ఖర్చును ఏ ప్రమాణాలపై నిర్ణయిస్తారు. మూడు ప్రమాణాలు లేదా మూడు సూత్రాల ప్రకారం పంటకయ్యే ఖర్చును లెక్కిస్తారు. మొదటి సూత్రం: ఏ2.....విత్తనాలు, ఎరువులు, పురుగుమందలకు రైతులు పెట్టే ఖర్చుతోపాటు వ్యవసాయ కూలీలకు, వ్యవసాయ అద్దె యంత్రాలకు రైతులు చెల్లించే మొత్తంను పరిగణలోకి తీసుకుంటారు. రెండవ సూత్రం: ఏ2 ప్లస్ ఎఫ్ఎల్ (ఫ్యామిలీ లేబర్): మొదటి సూత్రం కింద విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలకు, యంత్రాలకు పెట్టే మొత్తం ఖర్చు ప్లస్ రైతు కుటుంబం ఆ పంటపై పెట్టే మొత్తం శ్రమను పరిగణలోకి తీసుకోవడం. మూడవ సూత్రం: సీ2. అంటే కాంప్రెహెన్సివ్ కాస్ట్. విత్తనాల దగ్గరి నుంచి రైతు కుటుంబం శ్రమ వరకు అయ్యే ఖర్చు ప్లస్ రైతు ఓ పంటపై పెట్టిన పెట్టుబడికి వచ్చే కనీస వడ్డీ, ఆ పంట పండే భూమి లీజుకయ్యే మొత్తం. ఈ మూడు సూత్రాల ప్రాతిపదికన ఓ పంటకు కనీస మద్దతు ధరను కేంద్రంలోని ‘కమిషన్ ఫర్ అగ్రికల్టర్స్ కాస్ట్ అండ్ ప్రైసెస్’ నిర్ణయిస్తుంది. పంటలకు కనీస మద్దతు ధరలను నిర్ణయించడంలో ప్రభుత్వాల అసలు కిటుకు అంతా ఇక్కడే ఉంది. 2017లో దేశవ్యాప్తంగా ర్యాలీలు, ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించిన రైతులు కూడా తమ పెట్టుబడులకన్నా యాభై శాతం ఎక్కువగా కనీస మద్దతు ధర ఉండాలని డిమాండ్ చేశారు. మూడవ సూత్రమైన ‘సీ2’ కన్నా 1.5 రెట్లు ఎక్కువగా కనీస మద్దతు ధర ఉండాలని కోరారు. వారికి ఈ అవగాహన ఎలా వచ్చిందంటే వ్యవసాయ సంస్కరణలపై అధ్యయనం చేసిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ నాయకత్వంలోని జాతీయ కమిషన్ 2006లో సమర్పించిన నివేదికలో ఇదే సిఫార్సు చేశారు కనుక. ఏ ప్రాతిపదికన మద్దతు ధర నిర్ణయించారు? స్వామినాథన్ నివేదిక సిఫార్సు మేరకు లేదా రైతుల డిమాండ్ మేరకు నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడవ సూత్రం ప్రకారం కనీస మద్దతు ధరను నిర్ణయించక రెండో సూత్రం ప్రకారం నిర్ణయించింది. కనీస మద్దతు ధర పెంపును ‘సీ2’ సూత్రం ప్రకారం లెక్కిస్తే ఒక్క సజ్జల కనీస మద్దతు ధర పెంపు మాత్రమే పెట్టుబడికి 50 శాతంపైగా ఉంది. మిగతా వాటి ధరలన్నీ 14 శాతం, అంతకన్నా తక్కువే. అత్యంత ముఖ్యమైన వరికి 12.2 శాతం, నువ్వులకు కేవలం మూడు శాతం పెంచింది. గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంతో పోలిస్తే మోదీ ప్రభుత్వం పెంచిందీ ఎక్కువా ? అదీ అంతా నిజం కాదు. 2012–2013లోనే ఎక్కువ పెరిగాయి దేశంలోని ఎక్కువ పంటలకు కనీస మద్దతు ధరలు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న 2012–2013 ఆర్థిక సంవత్సరంలోనే ఎక్కువ పెరిగాయి. సీ2 సూత్రం ప్రకారం మోదీ ప్రభుత్వం వరి మద్దతు ధరను పెట్టుబడులపై 12.2 శాతం పెంచగా, నాడు మన్మోహన్ సర్కార్ 15 శాతం పెంచింది. జొన్నలపై నేటి ప్రభుత్వం 11.3 శాతం పెంచగా, నాటి ప్రభుత్వం 53 శాతం పెంచింది. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం సజ్జలు, రాగులు, గడ్డి నువ్వులపైనే కాస్త ఎక్కువ పెంచింది. మోదీ ప్రభుత్వం బుధవారం నాడు 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించినా అందులో పెరిగిందీ 14 పంటలకే. మద్దతు ధరను అమలు చేస్తుందా ? అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేది ఎక్కువగా బియ్యం, గోధుమలు మాత్రమే. ఓ మోస్తారుగా పప్పు దినుసులను కొనుగోలు చేస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు చౌక ధరలపై రేషన్‌పై బియ్యం, గోధమలను ప్రభుత్వమే సరఫరా చేస్తున్నందున బియ్యం, గోధుమలను ప్రభుత్వాలు కొనుగోలు చేస్తూ వస్తున్నాయి. అది కూడా ఉత్తర భారత దేశం నుంచే ఎక్కువగా కొనగోలు చేస్తూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నాయి. రైతుల నుంచి మద్దతు ధరకు బియ్యం, గోధుమలను కేంద్రం కొనుగోలు చేసి వాటిని రేషన్ ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్నా ప్రభుత్వం వద్ద ధాన్యం వృధా అవుతోంది. ఈ వృధా అరికట్టేందుకు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు కొత్త స్కీమ్‌ను ప్రకటించాయి. కనీస మద్దతు రేటుకు, మార్కెట్ రేటుకున్న వ్యత్యాసాన్ని నేరుగా రైతులకు డబ్బు రూపంలో ప్రభుత్వం చెల్లించడమే ఆ స్కీమ్. అది కూడా ఆయా రాష్ట్రాల్లో అంతంత మాత్రంగానే అమలవుతోంది. సీ2తో సవరించిన మద్దతు ధరలను పొలిస్తే పంట పాత(రూపాయల్లో) కొత్త(రూపాయల్లో) పెరిగిన శాతం 1. వరి 1,560 1,750 12.2 2. జొన్నలు 2,183 2,430 11.3 3. సజ్జలు 1,124 1,950 47.3 4. రాగి 2,370 2,897 22.2 5. మొక్కజొన్న 1,480 1,700 14.9 6. కందిపప్పు 4,981 5,675 13.9 7. పెసరపప్పు 6,161 6,975 13.2 8. మినపపప్పు 4,989 5,600 12.2 9. పల్లీలు 4,186 4,890 16.8 10. పొద్దు తిరుగుడు గింజలు 4,501 5,388 19.7 11. సోయాబిన్ 2,972 3,399 14.4 12. నువ్వులు 6,053 6,249 3.2 13. పత్తి(మీడియం రకం) 4,514 5,150 14.1 14. నైగర్ సీడ్(కలోంజి) 5,135 5,877 14.4