model code of conduct
-
ఎన్నికల వేళ డేరా బాబాకు పెరోల్ ఆమోదం.. ఈసీకి కాంగ్రెస్ లేఖ
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలవేళ.. ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) పెట్టుకున్న పెరోల్ పిటిషన్‌ను ఎన్నికల సంఘం సోమవారం ఆమోదించింది. దీనిపై హర్యానా పీసీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మంగళవారం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.హర్యానా ఎన్నికల సమయంలో జైలు నుంచి డేరా బాబాను విడుదల చేయడం ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినట్లు అవుతుందని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొంది. అదేవిధంగా 2019లొ డేరా బాబా చేతిలో హత్యచేయబడిన జర్నలిస్ట్ కుమారుడు సైతం గుర్మీత్ సింగ్ పెరోల్‌ను వ్యతిరేకించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల సమయంలో డేరా బాబాను పెరోల్‌పై విడుదల చేయటం.. ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికలు, ఓటింగ్ హక్కును ఉల్లంఘించినట్లు అవుతుంది. ఆయన ముఖ్యంగా ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చే సందేశాలను హర్యానా ప్రజలకు పంపటం ద్వారా ఓటింగ్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంద’ని అన్నారు. డేరా బాబాకు పంజాబ్, ఉత్తరప్రదేశ్‌తో పాటు ప్రస్తుతం బీజేపీ పాలించే హర్యానాలో ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈసారి హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాహోరీగా పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేరా బాబాను పెరోల్‌పై విడుదల చేయటాన్ని హర్యానా కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది.ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో 2017లో జైలు పాలైన డేరా బాబా.. 2020లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా 40 రోజుల పాటు పెరోల్‌పై విడుదల కావటం గమనార్హం. ఎన్నికల ముందే డేరా బాబాను ఇలా పెరోల్‌పై విడుదల చేయటంపై కాంగ్రెస్, ప్రజా సంఘాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇక.. అక్టోబర్ 5వ తేదీన హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.చదవండి: MUDA scam : సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్ -
కోడ్ ఉల్లంఘిస్తే గట్టి చర్యలుండాలి!
ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అభ్యర్థుల నైతిక వర్తన నియమావళి (మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్)ని తొలిసారి 1960లో రూపొందించారు. ఈ కోడ్‌ను ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలకు జారీ చేయడం 1979 నుంచి ఆనవాయితీగా మారింది. 1991లో పార్టీలన్నింటి అనుమతితో దీన్ని మరింత బలపరిచారు. కానీ రాజకీయ వాతావరణం పదును తేలినకొద్దీ, ఉల్లంఘనలు పెరిగాయి.కోడ్‌కు కట్టుబడి ఉండటం కంటే తప్పించుకునే మార్గాలను అన్వేషించేందుకే నేతలు ఇష్టపడుతుంటారు. కాబట్టి, వీలైనంత పారదర్శకంగా నిబంధనల ఉల్లంఘనలకు ఎలాంటి శిక్షలుంటాయో స్పష్టం చేయాలి. అదే సమయంలో, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా కోడ్‌ను మార్చాలి. ప్రజాజీవితంలో గౌరవ మర్యాదలను కొనసాగించేందుకు ఇది చాలా ముఖ్యం.‘చాలాసార్లు ఎన్నికలు ఒక మనిషిలోని చెడ్డతనపు పార్శా్వన్ని బయటికి తెస్తాయి, అవి ప్రతిసారీ మంచి మనిషి విజయానికి దారితీయవనేది కూడా నిశ్చయం’ అన్నారు భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఆయన రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకంలోని ఈ పేరా ఎన్నికలు, ప్రజాస్వామ్య వ్యవస్థల్లోని లోటుపాట్లను ఎత్తిచూపుతుంది. అప్పటికి ఎన్నికల కమిషన్ లేదు... మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ– నైతిక వర్తన నియమావళి) కూడా లేదు.రాజకీయ నేతలు, వ్యవస్థలన్నింటి ప్రత్యేక సమ్మతితో ఏర్పడిందీ ఎంసీసీ. మార్పులు, చేర్పులతో కాలంతోపాటు ఎదుగుతూ వచ్చింది. ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఎంసీసీపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. పార్టీలతో సహా నేతలు, అభ్యర్థులు... ఎన్నికల కమిషన్ కు సవాళ్లు విసురుతూనే ఉంటారు. ఇదంతా కూడా మీడియా నిఘా, న్యాయ వ్యవస్థ కీలక డేగ కన్ను మధ్యలోనే జరుగుతూంటుంది.కేరళతో మొదలు...గతాన్ని కొంచెం తరచి చూద్దాం. కేరళ అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా కొన్ని విధివిధానాలతో మొదలైందీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ప్రచార సభలు, ప్రదర్శనలు, ప్రసంగాలు, నినాదాలు, పోస్టర్లు, ప్లకార్డుల వంటివి ఎలా ఉండాలో ఈ విధి విధానాల్లో పొందుపరిచారు అప్పటి (1960) ఎన్నికల ప్రధాన అధికారి కేవీకే సుందరం. 1968లో ఎస్పీ సేన్ వర్మ ప్రధానాధికారిగా ఉండగా ఎన్నికల కమిషన్ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపింది. కేరళ ఎన్నికల సందర్భంగా రూపొందించిన విధి విధానాలను అందరికీ జారీ చేస్తూ, ఎన్నికలు సజావుగా జరిగేందుకు (ఫ్రీ అండ్ ఫెయిర్) కనీస మర్యాదలను పాటించాలని కోరింది. తరువాతికాలంలో అంటే 1979 నుంచి ఈ కోడ్‌ను సార్వత్రిక ఎన్నికల సంద ర్భంగా అన్ని పార్టీలకు జారీ చేయడం ఆనవాయితీగా మార్చారు అప్పటి సీఈసీ ఎస్.ఎల్. శక్ధర్. అంతేకాకుండా, రాజకీయ పార్టీల సమ్మతితో ఈ కోడ్‌ను మరింత విశదంగా రూపొందించారు. అధికార పార్టీకి కొన్ని పరిమితులు విధించడం, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవడం వంటి చర్యలు అమల్లోకి వచ్చింది అప్పుడే. 1991లో టీఎ¯Œ శేషన్ ఎన్నికల ప్రధానాధికారిగా ఉండగా మరో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి పార్టీలన్నింటి అను మతితో ‘కోడ్’ను మరింత బలపరిచారు. అయితే అప్పటినుంచి ఇప్పటివరకూ రాజకీయ వాతా వరణం మరింత పదును తేలింది. ఫలితంగా మోడల్ కోడ్ సామర్థ్యం మొద్దుబారింది. ఉల్లంఘనలు పెచ్చుమీరి పోయాయి. ఉల్లంఘనల పరిణామాలు స్పష్టం చేయాలి...ప్రస్తుతం అమల్లో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఉన్న ప్రధాన లోపం కోడ్‌ను ఉల్లంఘిస్తే ఎటువంటి పరిణామాలను ఎదు ర్కోవాల్సి వస్తుందీ? అన్నది లేకపోవడం. అందుకే ఈ కోడ్... నిబంధనల ఉల్లంఘనలకు అడ్డు కావడం లేదు. కాబట్టి వీలైనంత పార దర్శకంగా నిబంధనల ఉల్లంఘనలకు ఎలాంటి శిక్షలు ఉంటాయో స్పష్టం చేయాల్సి ఉంటుంది. విద్వేషపూరిత ప్రసంగాలు, కుల మతాలను అడ్డం పెట్టుకుని ఓట్లు అడగడం వంటి విషయాల్లో మరీ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది. ఓట్ల కోసం పెట్టే ప్రలోభాలు, ప్రత్యర్థి పార్టీలు, నేతల గురించి అసభ్యకరమైన సంభా షణలు, భారత సాయుధ దళాలను పొగుడుతూ లేదా విమర్శిస్తూ, చర్యలను ప్రశ్నిస్తూ చేసే ప్రసంగాల గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఏ రకమైన ఉల్లంఘనలకు ఎలాంటి శిక్షలుఉంటాయో స్పష్టంగా, బహిరంగంగా ప్రకటించాలి.ఉదాహరణకు విద్వేషపూరిత ప్రసంగాల వంటి వాటికి ప్రచారంపై నిర్దిష్ట కాలం నిషేధం విధించడం, మరింత తీవ్రమైన ఉల్లంఘనలకు నిషేధ సమయాన్ని పొడిగించడం, అప్పటికీ ఉల్లంఘనలు మానకపోతే మోడల్ కోడ్ అమల్లో ఉన్నంత కాలం నిషేధాన్ని కొనసాగించడం చేయవచ్చు. ఇది కేవలం ప్రచార సభలకు మాత్రమే పరిమితం కాకుండా... మీడియాలో కనిపించడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటి వాటికీ వర్తించేలా నిబంధనలు రూపొందించాలి. ‘ఉల్లంఘనులు’ స్టార్ క్యాంపెయినర్లు అయితే తరువాతి ఎన్నికల్లో ఆ గుర్తింపు రద్దు చేయడం కూడా చేయవచ్చు. అయితే వీటి నుంచి తప్పించుకునేందుకు నేతలు సర్వశక్తులూ ఒడ్డుతారు. యుక్తులు పన్నుతారు కూడా. ఒకప్పుడు కండబలం ఉపయోగిస్తే ఇప్పుడు ఆ స్థానాన్ని ధన బలం ఆక్రమించింది. టెక్నాలజీ ఈ ఆయుధానికి మరింత పదును పెట్టింది. కోడ్‌కు కట్టుబడి ఉండటం కంటే తప్పించుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషించేందుకు నేతలు మరింత ఎక్కువ ఇష్టపడుతూంటారు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంసీసీని రీమోడల్ చేయాల్సిన అవసరముంది. అది కూడా వివక్షకు తావులేని విధంగా అమలు చేసేలా ఉండాలి. ప్రజాజీవితంలో కొద్దోగొప్పో గౌరవ మర్యాదలను కొనసాగించేందుకు ఇది చాలా ముఖ్యం. పార్టీలకు నోటీసులు... కొత్త పంథా!ఎన్నికల కమిషన్ (ఈసీ) ఈ మధ్యకాలంలో ఓ కొత్త పంథాను ఎంచుకుంది. కోడ్ ఉల్లంఘించిన వ్యక్తులకు కాకుండా... ఆ వ్యక్తుల పార్టీలకు నోటీసులు పంపుతోంది. అయితే ట్రాఫిక్ ఉల్లంఘనలకు డ్రైవరే బాధ్యుడైనట్లు కోడ్ ఉల్లంఘనల బాధ్యత కూడా పార్టీది కాదన్నది గుర్తించాలి. పైగా ఈసీ నోటీసు ప్రాథమికంగా ఉల్లంఘనపై సంతృప్తి చెందిన తరువాతే వెళుతుందన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. పార్టీకి చెందిన స్టార్ క్యాంపెయినర్లు, కీలక వ్యక్తులు కోడ్‌ను ఉల్లంఘిస్తే ఈసీ ఆ పార్టీపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడరాదు. ఈ చర్యలు జరిమానా కావచ్చు లేదా పార్టీ గుర్తులకు సంబంధించినదైనా కావచ్చు. అవసరమైతే ఈ రెండు రకాల చర్యలు కూడా తీసుకునేలా మార్పులు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా... ఉల్లంఘనలు జరిగిన 72 గంటల్లోపే చర్యలు తీసు కోవడం కూడా అవసరం. వీటికి సంబంధించి స్పష్టమైన పద్ధతి ఒకదాన్ని సిద్ధం చేయాలి. ఆలస్యంగా తీసుకునే తూతూ మంత్రపు చర్యల వల్ల ప్రజల్లో ఈసీపై నమ్మకం సడలుతుంది. కోడ్ ఉల్లంఘనలు ఎన్ని జరిగాయో ఒక జాబితా సిద్ధం చేసి వాటిల్లో ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారు? ఎన్ని అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి? వంటి వివరాలను వెబ్సైట్లో ఉంచాలి.కోడ్ ఉల్లంఘనలను నేరుగా ఇతర చట్టాలకు అనుసంధానించడం జరిగితే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై పడుతుంది. అయితే, ఈ చర్యలన్నీ రాజ కీయ పార్టీలు కోడ్ విషయంలో స్వీయ నియంత్రణ పాటించేలా చేస్తాయా? ఇది మన రాజకీయ నేతల క్యారెక్టర్‌పై ఆధారపడిఉంటుంది. అయితే ఈ వ్యవహారాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించే వారి విచక్షణాధికారాలకు పరిమితి విధిస్తుందనడంలో సందేహం లేదు. తద్వారా ఎన్నికల ప్రధానాధికారిపై వివక్ష, ఏకపక్ష ధోరణివంటి ఆరోపణలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఉల్లంఘనలపై తీసుకునే చర్యలు నిర్దిష్ట కాలావధిలోగా పూర్తవుతాయన్న భరోసా ఎన్నికల కమిషన్ ప్రజలకు కల్పించడం కూడా అవసరమే. వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. నాయకత్వం వహిస్తున్న వారు ఆదర్శప్రాయంగా వ్యవహరిస్తే ఎలాంటి మోడల్ కోడ్లూ అవసరం ఉండదు.- వ్యాసకర్త ఎన్నికల మాజీ ప్రధాన అధికారి-అశోక్ లవాసా -
స్వేచ్ఛగా అసెంబ్లీ ఎన్నికలు
నిర్మల్: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, స్వచ్ఛంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ వరుణ్‌రెడ్డి కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సమష్టిగా పని చేయాలని ఎస్పీ ప్రవీణ్‌కుమార్ సూచించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమీకృత కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ కిషోర్‌కుమార్, భైంసా ఏఎస్పీ కాంతిలాల్పటిల్, నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డితో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. కోడ్ దాటొద్దు.. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచే కోడ్ అమలులోకి వచ్చిందని కలెక్టర్ వరుణ్‌రెడ్డి తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఎవరూ నియమావళిని దాటొద్దని హెచ్చరించారు. పబ్లిక్ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పోస్టర్లు, చిహ్నాలను తొలగిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం 922 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నవంబర్ 30న ఎన్నికలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. జిల్లాలోని ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలను చేపట్టామన్నారు. చునావ్ గ్రామసభ, సెల్ఫీ విత్ పోలింగ్ స్టేషన్ వంటి వినూత్న కార్యక్రమాలనూ నిర్వహిస్తామని తెలిపారు. సీనియర్ సిటిజన్స్, దివ్యాంగుల ఓటు నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు వివరించారు. ఓటు నమోదు చేసుకోవచ్చు.. జిల్లాలో 7,11,190మంది ఓటర్లు ఉన్నారని, కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించామన్నారు. ఇప్పటికీ ఓటు హక్కు లేని వారు ఈనెల 31లోపు నమోదు చేసుకోవాలని తెలిపారు. పెద్ద క్యూలైన్లు లేకుండా.. ఈసారి ఎన్నికలకు పెద్ద క్యూలైన్లు లేకుండా ప్రశాంతంగా ఓటువేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతీ పోలింగ్ స్టేషన్లో 1,500 దాటకుండా ఓటర్లు ఉండేలా చూస్తున్నామన్నారు. ఓటరుకు కేవలం 2కి.మీ. లోపే పోలింగ్ కేంద్రం ఉంటుందని చెప్పారు. కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్లు, ఫర్నిచర్, వృద్ధులు, దివ్యాంగులకు ర్యాంపులు, వీల్చైర్లు, ప్రత్యేకంగా వాలంటీర్లు వంటి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లాలోని 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఉంటుందన్నారు. తొలిసారి ఎన్నికల కమిషన్ వృద్ధులు, దివ్యాంగుల కోసం ఇంటి నుంచి ఓటువేసే ప్రత్యేక అవకాశం కల్పించిందన్నారు. ఇలా ఓటు వేసేవారికి బీఎల్ఓలు ఫామ్–12డి ఇస్తారని, దీన్ని నవంబర్ 8లోపు రిటర్నింగ్ అధికారికి చేరేలా పంపించవచ్చని చెప్పారు. దివ్యాంగులు ఈ ఫామ్‌తోపాటు సదరం సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ జతచేయాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్నవారు ఎలక్ట్రానిక్/పోస్టల్ ఓటు వినియోగించుకోవచ్చని కలెక్టర్ వివరించారు. రూ.50 వేల లోపే అనుమతి.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తిచేసేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని ఎస్పీ ప్రవీణ్‌కుమార్ కోరారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా ఎన్నికలు పూర్తిచేద్దామన్నారు. కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచే జిల్లాలో సరిహద్దుల్లో ఐదుచోట్ల, అంతర్గతంగా ఐదుచోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. మద్యం, డబ్బు, మత్తుపదార్థాలు రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నగదు కేవలం రూ.50 వేలకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. అంతకంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకెళ్తే స్వాధీనం చేసుకుని గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామన్నారు. సరైన లెక్కలు లేకపోతే ఆ డబ్బు ఐటీ అధికారులు జప్తు చేసుకుంటారని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు ఉన్నవారు సంబంధిత పత్రాలను చూపించాల్సి ఉంటుందని తెలిపారు. వాటిని నిర్ధారించుకున్న తర్వాతే అనుమతిస్తారని చెప్పారు. గన్‌లైసెన్స్ ఉన్నవారు ఆయుధాలను సమీప పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేయాలని తెలిపారు. రౌడీషీట్, కమ్యూనల్ కేసులు ఉన్నవారిని బైండోవర్ చేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 153 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 17 మావోయిస్టు ప్రభావి త ప్రాంతాల్లో ఉన్నాయని వివరించారు. ఇక కనీసం సిగ్నల్ వ్యవస్థలేని 10 షాడో జోన్లో ఉన్నవాటికి శాటిలైట్ ఫోన్స్, కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా ఏర్పాట్లు చేస్తామన్నారు. సీ–విజిల్, డయల్ 100, కంట్రోల్‌రూం నంబర్లను ఉపయోగించుకుని పారదర్శక ఎన్నికలకు సహకరించాలని ఎస్పీ కోరారు. -
ఎన్నికల కోసం ఇలా.. సిద్థంగా వున్నాము..
జిల్లాలో 1,338 పోలింగ్ స్టేషన్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్–14 టీంలు, స్టాటిస్టిక్ సర్వైలైన్స్–14 టీంలు,వీడియో సర్వైలైన్స్ టీంలు–09, వీడియో వీవింగ్ 05,మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహణకు 19 టీంలు కరీంనగర్: ఎన్నికల కోడ్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం నుంచి అమలులోకి వచ్చిందని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) నిర్వహణలో భాగంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని కరీంనగర్ కలెక్టర్ బి.గోపి వెల్లడించారు. సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీఐజీ రమేశ్‌నాయుడు, సీపీ సుబ్బారాయుడుతో కలిసి మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 2,807 బ్యాలెట్ యూనిట్ లు, 2,222 కంట్రోల్ యూనిట్ లు, 2,187 వివి పాట్ లు సిద్ధంగా ఉంచాం. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులను సి–విజిల్‌యాప్ ద్వారా చేయొచ్చని సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహణకు సంబంధించి ఫిర్యాదులను కంట్రోల్ రూమ్‌కు 1950కు 24 గంటలపాటు ఫిర్యాదు చేయొచ్చన్నారు. కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రచారానికి సంబంధించిన ప్రభుత్వ, రాజకీయ ప్రకటనల తొలగింపు ప్రారంభమైందని ప్రభుత్వ పరిధిలోని ఆస్తులపై 24 గంటల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవాటిని 48 గంటల్లో ... ప్రైవేటు ఆస్తులపై ఉన్న యాడ్స్‌ను 72 గంటల్లో తొలగిస్తామని కలెక్టర్ తెలిపారు. నగదు రవాణాపై ఆంక్షలు ఉన్నాయని.. రూ.50 వేలకు మించి నగదు రవాణా చేయాల్సి వస్తే.. డాక్యుమెంట్లు దగ్గర ఉంచుకోవాలన్నారు. ఐటీ, ఎక్సైజ్, ఫారెస్ట్, జీఎస్టీ, ఆర్టీవో డిపార్ట్మెంట్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయని, ఒకవేళ ఎలాంటి నగదు సీజ్ చేసినా.. డీఆర్డీవో నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వాటిని పరిశీలించి చర్యలు చేపడుతుందని వివరించారు. మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ–సువిధ యాప్ ద్వారా పర్మిషన్ల కోసం్ల దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మీడియా ప్రసారాలు, వార్తా కథనాలు, పెయిడ్ ఆర్టికల్స్, సోషల్ మీడియాపై నిరంతర నిఘా ఉంఉంటుందని పేర్కొన్నారు. ఏమైనా అనుమానాస్పదంగా అనిపిస్తే.. వాటిని అభ్యర్థి ఖర్చులో జమ చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరువ్యవహరించినా వారిపై కేసులు నమోదు చేస్తాం అని స్పష్టంచేశారు. జిల్లాలో తనిఖీల కోసం ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు సీపీ సుబ్బారాయుడు చెప్పారు. ఇందులో మిగిలిన డిపార్ట్మెంట్లు కూడా ఉంటాయన్నారు. ఎన్నికలపై నిఘా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక టీంలతో ఎప్పటికప్పుడు సమన్వయంతో చేసుకుంటామని తెలిపారు. అక్రమ ఆయుధాలు, లైసెన్స్డ్ ఆయుధాలు వెంటనే సరెండర్ చేయాలని ఆయన ఆదేశించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తామని సీపీ పేర్కొన్నారు. -
ఎన్నికల హామీలకు నిధులెలా తెస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉచితాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా మోడల్ కోడ్‌ను(ఎన్నికల ప్రవర్తనా నియమావళి) సవరించాలని ఎన్నికల సంఘం నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఓటర్లకు చెప్పాలని, ఈ ప్రతిపాదనపై ఈ నెల 19వ తేదీలోగా అభిప్రాయాలు తెలియజేయాలని పేర్కొంది. ఈ మేరకు గుర్తింపు పొందిన అన్ని జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలకు మంగళవారం లేఖ రాసింది. మేనిఫెస్టోల్లో ప్రకటించిన ఎన్నికల వాగ్దానాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ఓటర్లకు అందజేయాలని లేఖలో స్పష్టం చేసింది. మోడల్ కోడ్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఆర్థిక వనరులు ఏమిటో కూడా ఓటర్లకు తెలియచేయాలని వెల్లడించింది. పార్టీ ఇచ్చే ఎన్నికల హామీల విషయంలో తాము కళ్లు మూసుకొని కూర్చోలేమని తేల్చిచెప్పింది. బూటకపు వాగ్దానాలతో విపరిణామాలు రాజకీయ పార్టీలు ఇచ్చే బూటకపు వాగ్దానాలు విపరిణామాలకు దారితీస్తాయని ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయకుండా తాము అడ్డుకోలేకపోనప్పటికీ, ఓటర్లకు సమాచారం ఇచ్చే హక్కు ఉందని పేర్కొంది. ఇకపై దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నిర్దిష్ట ఫార్మాట్లో పార్టీల వ్యయాల వివరాలను అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల హామీల అమలుకు అవసరమైన నిధుల వివరాలను ఓటర్లకు చెప్పే అంశాన్ని ఎన్నికల ప్రవర్తనా నియామావళి(ఎంసీసీ)లోని పార్ట్–8లో (ఎన్నికల మేనిఫెస్టోపై మార్గదర్శకాలు) చేరుస్తూ ఎంసీసీని సవరించాలని ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. దీని ప్రకారం మేనిఫెస్టోల్లో ఇచ్చే హామీల అమలుకు నిధులు సేకరించే మార్గాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. అదనపు పన్నులు, ఖర్చుల హేతుబద్దీకరణ, కొన్ని పథకాల్లో కోత, మరిన్ని అప్పులు తీసుకురావడం వంటి వివరాలు వెల్లడించాలి. ఓటర్లకు ఉచితాలు పంచే సంస్కృతికి రాజకీయ పార్టీలు చరమగీతం పాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే పిలుపునిచ్చారు. దీనిపై అధికార బీజేపీ, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సైతం జరిగింది. ఉచితాలపై సర్వోన్నత న్యాయస్థానంలో సైతం ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేత
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తొలగించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాజకీయ పార్టీలు, నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఎవరూ ఎన్నికల ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషనర్ నిర్ణయంలో రాజకీయ కోణాలు ఉన్నాయంటూ ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిటర్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఒకవైపు ఎన్నికల ప్రక్రియను నిరంతరాయంగా వాయిదా వేస్తూ.. మరోవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కొనసాగిస్తున్నారంటూ కోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఆక్షేపించింది. తదుపరి స్థానిక ఎన్నికల తేదీలు ఖరారు చేసేటప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టం చేసింది. చదవండి : ఏపీలో ఎన్నికల వాయిదా: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు -
ఈసీలో అసమ్మతి ‘లావా’సా
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు పూర్తయి, ఓట్ల లెక్కింపునకు గడువు సమీపిస్తున్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)లో విభేదాలు బయటపడ్డాయి. నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులపై తీసుకునే నిర్ణయాల్లో తన అసమ్మతిని రికార్డు చేయనందుకు నిరసనగా ఈసీ సమావేశాలకు దూరంగా ఉంటానని ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా ప్రకటించారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరాకు లావాసా లేఖ రాయడం కలకలం రేపింది. మరోమార్గం లేకనే దూరంగా ఉంటున్నా ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఎన్నికల ప్రచారం సందర్భంగా నియమావళిని ఉల్లంఘించడంపై వచ్చిన ఫిర్యాదులపై చర్యల విషయంలో తన అభిప్రాయాన్ని రికార్డు చేయనందుకు కమిషనర్ అశోక్ లావాసా అసంతృప్తి వ్యక్తం చేశారు. 16న సీఈసీ అరోరా లేఖ రాశారు. అందులో ‘ఈసీలో పారదర్శకత ఉండాలన్న తన నోట్‌పై స్పందించనందుకు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులపై దూరంగా ఉండటం మినహా మరోమార్గం లేదని భావిస్తున్నా. మైనారిటీ అభిప్రాయాలను రికార్డు చేసేదాకా కమిషన్ సమావేశాలకు గైర్హాజరు కావాల్సిన పరిస్థితిని కల్పించారు. అసమ్మతిని రికార్డు చేయనప్పుడు సమావేశాల్లో పాల్గొనడంలో అర్థంలేదు’ అని లేఖలో పేర్కొన్నారు. ‘చాలా సందర్భాల్లో నేను వ్యక్తం చేసిన మైనారిటీ అభిప్రాయం బహుళ సభ్యుల చట్టబద్ధ సంస్థలు పాటించే సంప్రదాయాలకు భిన్నంగా అణచివేతకు గురైంది’ అని పేర్కొన్నారు. న్యాయ నిపుణులు ఏమన్నారంటే.. నిబంధనల ప్రకారం.. ఎన్నికల సంఘం ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అది సాధ్యం కానప్పుడు మెజారిటీ అభిప్రాయమే అంతిమం అవుతుంది. నియమావళి ఉల్లంఘనల ఫిర్యాదులపై నిర్ణయాలు తీసుకునే సమయంలో ట్రిబ్యునల్‌లో మాదిరిగా విచారణ ఉండదని, ఈసీ నిర్ణయాలపై సీఈసీతోపాటు మిగతా ఇద్దరు సంతకాలు చేస్తున్నందున మైనారిటీ అభిప్రాయాన్ని రికార్డు చేయాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు చెప్పారు. మెజారిటీ అభిప్రాయాన్నే ఈసీ నిర్ణయంగా వెలువరిస్తారని, అసమ్మతి అభిప్రాయాన్ని రికార్డు చేస్తారే తప్ప బహిర్గతం చేయబోరని అంటున్నారు. మోదీ, అమిత్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ వచ్చిన 11 ఫిర్యాదులపై లావాసా అసమ్మతిని తెలపగా కమిషన్‌లోని సీఈసీ, మరో సభ్యుడు సుశీల్‌చంద్ర అన్ని ఫిర్యాదులపై క్లీన్చిట్ ఇచ్చారు. ఆరోపణలపై విచారణ: కాంగ్రెస్ ఈసీపై మోదీ ప్రభుత్వం ఒత్తిడి చేసిందన్న లావాసా ఆరోపణలపై విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా.. ‘మోదీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను ‘ఎలక్షన్ ఒమిషన్’గా మార్చేసింది. లావాసా అసమ్మతిని రికార్డు చేసి ఉన్నట్లయితే ఈసీని ప్రభుత్వం మరిన్ని ఇబ్బందులు పెట్టి ఉండేది’ అని అన్నారు. మోదీ– అమిత్ షా ద్వయం ఉల్లంఘనలపై కమిషనర్ లావాసా పలు పర్యాయాలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఎన్నికల సంఘం వారికి క్లీన్చిట్ ఇవ్వడమే పనిగా పెట్టుకుందని ఆరపించారు. లేఖలో పేర్కొన్న అంశాలను తీవ్రమైనవిగా పరిగణించాలన్నారు. సుప్రీంకోర్టులో తీర్పుల సందర్భంగా జడ్జీలు వ్యక్తం చేసిన మెజారిటీతోపాటు మైనారిటీ అభిప్రాయాన్ని వెల్లడిస్తుండగా ఈసీలో అసమ్మతి అభిప్రాయాన్ని ఎందుకు బహిర్గతం చేయరని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ఎన్నికల సంఘంలో సంభవిస్తున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ఈసీ నిష్పాక్షికతపై అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఇది ఈసీ అంతర్గత విషయం: సీఈసీ అరోరా ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా లేఖ ఎన్నికల సంఘం అంతర్గత విషయమని సీఈసీ అరోరా అన్నారు. ఉల్లంఘన ఫిర్యాదులపై చర్యల విషయంలో ఈసీ పనితీరుపై మీడియాలో వచ్చిన కథనాలు ‘అభ్యంతరకరం. ఇది ఈసీ అంతర్గత విషయం’ అని అన్నారు. ‘కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యులు కూడా ఒకే వైఖరితో ఉండాలని ఏమీ లేదు. గతంలో ఎన్నోసార్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అది సహజం. కానీ, అదంతా ఎన్నికల సంఘం పరిధికి లోబడి జరిగింది. ఇటీవల మే 14వ తేదీన జరిగిన సమావేశంలోనూ ప్రవర్తనా నియమావళిసహా 13 అంశాలను పరిష్కరించేందుకు గ్రూపుల ఏర్పాటుపై ఏకాభిప్రాయం వ్యక్తమయింది. అవసరమైన సందర్భాల్లో బహిరంగ చర్చకు నేను వెనుకాడలేదు. ఆఖరి దశ ఓటింగ్,23న లెక్కింపు వేళ లావాసా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు మిగతా విషయాలపై చర్చించేందుకు 21న ఈసీ పూర్తిస్థాయి సమావేశం ఉంటుంది’ అని అరోరా వెల్లడించారు. -
బాబు కేబినెట్ భేటీ.. సీఎస్ సమాలోచనలు!
సాక్షి, అమరావతి : ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈనెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంతో ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమాలోచనలు ప్రారంభించారు. సీఎం కార్యదర్శి సాయిప్రసాద్, జీఏడీ పొలిటికల్ కార్యదర్శి శ్రీకాంత్‌తో ఆయన మంగళవారం తన చాంబర్లో భేటీ అయ్యారు. ఇదే విషయమై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదితోనూ ఆయన భేటీ అయి సమాలోచనలు జరిపారు. ఈ నెల 10వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలంటూ సీఎస్‌కు ముఖ్యమంత్రి కార్యాలయం నోట్ పంపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఆ రోజు ఉదయం 10.35 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్మహ్యణ్యంకు నోట్ వచ్చింది. దీనిని ఆయన సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లికి పంపించారు. ఈ అంశం సచివాలయంలోని అఖిల భారత సర్వీసు (ఐఏఎస్) సీనియర్ అధికారుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల నిబంధనావళి అమలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించడం సహేతుకమేనా? అసలు ఈ సమావేశం జరుగుతుందా? జరగదా? అనే అంశాలు ప్రస్తుతం ఐఏఎస్‌ల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈనెల 10న కేబినెట్ సమావేశం జరుగుతుందా? జరగదా? అని సీనియర్ ఐఏఎస్ అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా జరిగే అవకాశం లేనేలేదని కుండబద్దలు కొట్టారు. సీఎం తీసుకున్న నిర్ణయం సమంజసమైనది కాకపోవడం, నిబంధనలను పాటించకపోవడమే ఇందుకు కారణాలని వారు విశ్లేషిస్తున్నారు. -
‘ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు’
సాక్షి, అమరావతి: ఫొని తుపాన్ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ వెసులుబాటు కావాలంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ఏ ప్రతిపాదనలు వచ్చినా సీఈసీ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కోడ్ వెసులుబాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం సీఈసీకే ఉంటుందని పేర్కొన్నారు. సీఈసీ ఇచ్చే ఆదేశాలను తాము అమలు చేస్తామని అన్నారు. తుపాన్ వల్ల స్ట్రాంగ్ రూమ్‌ల్లోని ఈవీఎంలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని వెల్లడించారు. తుపాన్ ప్రభావిత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఈవీఎంల విషయంలో అప్రమత్తంగా ఉండమని కలెక్టర్లను ఆదేశించినట్టు చెప్పారు. -
గుజరాత్ బీజేపీ చీఫ్‌కు ఈసీ ఝలక్..!
న్యూఢిల్లీ : గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు జీతుభాయ్ వాఘానికి ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లఘించిన కారణంగా ఆయనను మూడు రోజుల పాటు (72 గంటలు) ప్రచారంలో పాల్గొనొద్దని ఆదేశాలు జారీ చేసింది. మే 2 సాయంత్రం 4 గంటల నుంచి ఈ నిషేదం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇక గుజరాత్‌లోని అన్ని లోక్‌సభ స్థానాలకు మూడో దశలో భాగంగా ఏప్రిల్ 23న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆయన బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటర్వ్యూలు, బహిరంగ చర్చా కార్యాక్రమాల్లో పాల్గొనరాదని నోటీసులిచ్చింది. సూరత్‌లోని అమ్రోలిలో ఏప్రిల్ 7న జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో వాఘాని ప్రతిపక్ష పార్టీ నాయకులపై అసంబద్ధమైన, ఖండించదగిన వ్యాఖ్యలు చేసినట్టు రుజువయిందని పేర్కొంది. (చదవండి : మోదీ, అమిత్ షా కోడ్ ఉల్లంఘనపై మీరేమంటారు?) -
ఎవరెన్ని చెప్పినా చంద్రబాబు..
సాక్షి, అమరావతి: ఎవరెన్ని చెప్పినా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదు. ‘అంతా నా ఇష్టం’ అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నియావళిని పదేపదే ఉల్లంఘిస్తున్నారు. తాజాగా మరోసారి ఎన్నికల కోడ్‌ను అతిక్రమించారు. ప్రజా కార్యక్రమాలకు ఉపయోగించే ప్రజా వేదికను నిబంధనలకు విరుద్ధంగా వాడుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో సోమవారం ఇక్కడ సమావేశం నిర్వహించి మరో వివాదానికి తెర తీశారు. ప్రజా వేదికను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా చంద్రబాబు పట్టించుకోకపోవడం శోచనీయం. ఇంతకుముందు సచివాలయంలో కూడా పార్టీ సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయలేదు. చంద్రబాబు వైఖరిని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సమర్థించారు. ప్రజా వేదికలో ఎన్నికల సమీక్ష నిర్వహించామని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఎన్నికల సమావేశాలు నిర్వహించుకోవడంలో తప్పులేదని, సీఎం ఎక్కడ ఉంటే అక్కడ సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. చంద్రబాబు తీరును ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. (చదవండి: ఎన్నికల కోడ్ పట్టింపే లేదు) -
ఎన్నికల వ్యవస్థకు కాయకల్ప చికిత్స
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకమైనది. ఐదేళ్ళకు ఒక సారి చట్టసభలకు తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఎన్నికలు నిష్పాక్షికంగా, ధర్మంగా, స్వేచ్ఛగా జరగాలి. స్వాతంత్య్ర పోరాటం నాటి విలువలు కొన్ని సార్వత్రిక ఎన్నికల వరకూ కొనసాగాయి. 1952లో ప్రథమ సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు పార్టీ సిద్ధాంతాలనూ, అభ్య ర్థుల అర్హతలనూ చూసి ప్రజలు ఓటు చేసేవారు. కాంగ్రెస్‌ను అధికారం చెడగొట్టింది. నైతిక, రాజకీయ విలువలకు పాతర వేసింది. ప్రజలకు ఆ పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లుతూ వచ్చింది. 1967 నుంచి ప్రతిపక్షాలను గెలిపించడం ప్రారంభించారు. కాలక్రమంలో అనేక ప్రయోగాలు జరిగాయి. కూటమి ప్రభు త్వాలు ఏర్పడినాయి. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల ప్రయో గాలు విఫలమైన తర్వాత బీజేపీ నాయకత్వంలో నేషనల్ డెమాక్రాటిక్ అల యెన్స్ (ఎన్డీఏ), కాంగ్రెస్ నేతృత్వంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) ప్రభుత్వాలు నిలకడగా పరిపాలించాయి. 2014లో బీజేపీకి లోక్ సభలో మెజారిటీ స్థానాలు దక్కినప్పటికీ మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ ప్రభు త్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమి తమైన జాతీయ పార్టీ కాగా 1984లో లోక్‌సభలో రెండు స్థానాలు మాత్రమే గెలు చుకున్న బీజేపీ ఇప్పుడు ఇరవైకి పైగా రాష్ట్రాలలో అధికారం చెలాయిస్తున్నది. ప్రభుత్వాలను మార్చడానికి ఓటు హక్కును ఎట్లా వినియోగించుకోవాలో ప్రజలు తెలుసుకున్నారు. ప్రతిపక్షాలు సైతం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వలెనే అవినీతికీ, అక్రమాలకూ, ఆశ్రితపక్షపాతానికీ ఒడిగడుతున్నాయి. రాజకీయ ప్రమాణాలు అడుగంటుతున్నాయి. ఎన్నికలు విపరీతమైన ఖర్చుతో కూడిన జూదంగా మారిపోయాయి. ఇది వరకు సంపన్నుల సరసన కనిపించడా నికి అగ్రనేతలు సంకోచించేవారు. క్రమంగా సంపన్నులూ, వ్యాపారులూ, పారి శ్రామికవేత్తలూ రాజకీయాలలోకి వచ్చారు. కార్పొరేట్ రంగానికీ, రాజకీయ పార్టీ లకూ అక్రమసంబంధం విడదీయలేనంతగా బలపడింది. ఇప్పుడు సంపన్నులకే రాజకీయాలలో పోటీ చేసి గెలిచే అవకాశం ఉంది. డబ్బు లేనిదే రాజకీయాలలో రాణించడం అసాధ్యం. టీఎన్ శేషన్ ఎన్నికల సంఘానికి అపారమైన ప్రతిష్ఠను సంపాదించి పెట్టారు కానీ ఎన్నికలలో డబ్బు పాత్రను తగ్గించలేక పోయారు. ఆయన పదవీ విరమణ తర్వాత ఈ జాడ్యం జడలు విచ్చుకొని స్వైరవిహారం చేస్తున్నది. ఎన్నికల ప్రధానాధికారులు ఎంతమంది మారినా వ్యవస్థ క్రమంగా క్షీణిస్తూ పోతున్నది. నియమావళి ఉల్లంఘన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినవారిపైన చర్య తీసుకునే అధికా రాలు తమకు ఉన్నాయో లేవో ఎన్నికల సంఘం సభ్యులకు సుప్రీంకోర్టు చెప్పే వరకూ స్పష్టంగా తెలియదు. నియమావళిని ఉల్లంఘించిన యోగి ఆదిత్యనాథ్, మాయావతి, మేనకాగాంధీ, ఆజంఖాన్లపైన రెండు, మూడు రోజులు ప్రచారం చేయకుండా ఆంక్షలు విధించారు. ఇటువంటి చర్య తీసుకోవడం ఇదే ప్రథమం. తొలి రెండు సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల నియమావళి అవసరం లేకపో యింది. రాజ్యాంగ నిర్మాతలే పాలకులుగా ఉన్న రోజులవి. ఎన్నికల సమ యంలో అధికార దుర్వినియోగం చేయకుండా వారిని నియంత్రించవలసిన అవ సరం లేకపోయింది. డబ్బు పెట్టి ఓట్లు కొనుగోలు చేసే జబ్బు అప్పటికి సోక లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థకు గట్టి పునాదులు వేసినవారు మొదటి తరం నాయకులు. ఆ తర్వాత తరం నాయకులకు నిగ్రహం లేదు. అధికార దుర్విని యోగానికి ఒడిగట్టడం ప్రారంభించారు. కనుక నియమావళిని ప్రవేశపెట్టవలసి వచ్చింది. మొదటి సారిగా 1960లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు దాన్ని అమలు చేశారు. అధికారంలో ఉన్నవారూ, ప్రతిపక్షానికి చెందినవారూ ఎన్నికల ప్రచార సమయంలో ఎటువంటి మార్గదర్శకాలు పాటించాలో ఎన్నికల సంఘం నిర్దేశించింది. సమావేశాలు ఎట్లా నిర్వహించుకోవాలి, ప్రసంగాలు ఎట్లా ఉండాలి, ఎటువంటి నినాదాలు ఇవ్వవచ్చు అనే అంశాలకే మార్గదర్శకాలు పరిమితమై ఉండేవి. 1962 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం నియమావళిని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకూ అందజేయవలసిందిగా కోరింది. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలలో విజయం సాధించేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఎటువంటి నియమావళిని పాటించాలో 1979లో ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఈ నియ మావళిని గట్టిగా అమలు చేయడం 1991లోనే ప్రారంభమైంది. దాన్ని ప్రజా ప్రాతినిధ్యచట్టం (రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951) లో భాగం చేయా లంటూ 2013లో లా, జస్టిస్ వ్యవహారాల స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. భారత శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్‌కోడ్) ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావ ళిని అమలు చేయవచ్చునంటూ ఈ సంఘం సూచించింది. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత 45 రోజులలో ఎన్నికల కార్యక్రమం పూర్తి చేయాలనీ, ఆ సమయంలో కోడ్ అమలు చేయవచ్చుననీ నిర్ణయించారు. అంటే, నియమావళి క్రమంగా రూపుదిద్దుకొని ఈ స్థాయికి వచ్చింది. ఎన్నికల కమిషన్ చర్యల పట్ల హర్షం ఇటీవల తనపైన ఎన్నికల సంఘం తీసుకున్న చర్యను సవాలు చేస్తూ మాయా వతి దాఖలు చేసిన రిట్పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పుడు సమాజంలో హర్షం వ్యక్తమైంది. ఒక్క మాయావతిపైనే కాదు, హద్దుమీరిన రాజకీయ నాయ కులందరిపైనా నిషేధం విధించాలనీ, శిక్షాత్మక చర్యలు తీసుకోవాలనీ ప్రజలు కోరుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఉగ్రవాదం గురించి ప్రస్తావిస్తూ పుల్వా మాపైన ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల త్యాగాలనూ, పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్‌కు చెందిన ఉగ్రవాద శిక్షణ శిబిరాలపైన బాంబుల వర్షం కురిపించిన వైమానికదళానికి చెందిన సాహసికుల శౌర్యాన్నీ బీజేపీ ఎన్నికల ప్రచారానికి వినియోగించడాన్ని ప్రశ్నించకపోవడంతో ఎన్నికల సంఘం పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తున్నదనే అభిప్రాయం ప్రజలలో ప్రబలింది. ప్రధాని ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన అధికారిని ఎన్ని కల సంఘం సస్పెండ్ చేయడంతో ఇది మరింత బలపడింది. 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థి హోదాలో ఎన్నికల ప్రచారం చేసిన మోదీ నియమావళిని రెండు సార్లు ఉల్లంఘించారు. రెండు విడతలా ఎన్నికల సంఘం ఆయనపైన ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్పర్మేషన్ రిపోర్ట్–ప్రాథమిక సమాచార నివేదిక) దాఖలు చేశారు. భారత సైన్యాన్నీ, సైనిక చర్యలనూ ప్రచారాంశాలుగా వినియోగించుకోవడాన్ని ఖండిస్తూ పదవీ విరమణ చేసిన పలువురు సైన్యాధికారులు రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ పంపించారు. మాటలతో, చేతలతో హిందూ ఓటర్ల హృదయాలు గెలుచుకోవాలన్న మోదీ–అమిత్‌షా ప్రయత్నంలో భాగమే భోపాల్ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్సింగ్పైన మాలేగాం ఉగ్రవాద ఘటనలో నిందితురాలు సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకుర్‌ను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టడం. ఇలా నిర్ణయించిన తర్వాత అంతర్జాతీయ వేదికలపైన పాకిస్తాన్ స్థావరంగా చేసుకొని కశ్మీర్లో అగ్గి రగిలిస్తున్న ఉగ్రవాద సంస్థలపైన భారత దౌత్యాధికారులు చేస్తున్న విమర్శలకు విలువ ఏముంటుంది? ఎట్లాగైనా సరే ఎన్నికలలో గెలుపొందడం ప్రధానమని అన్ని పార్టీలూ భావిస్తున్నట్టు కనిపి స్తున్నది. ప్రతిపక్షంలో ఐక్యత లేక, మోదీకి దీటైన నాయకుడు లేక బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ఈ ఎన్నికల అనంతరం కూడా అధికారంలో కొనసాగ వచ్చునేమో కానీ ఎన్నికలు జరుగుతున్న పద్ధతి మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తికి తగినట్టుగా లేదు. తనపైనే ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రధాని మోదీ ఇంటెలిజెన్స్ అధికారులను కలుస్తుండగా తాను సమీక్షా సమావేశాలు పెడితే తప్పేమిటంటూ వాదిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)కు లేని ఆంక్షలు చంద్రబాబుపైన ఎందుకంటూ నారా లోకేష్ ప్రశ్నిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష చేయవచ్చు. పోలవరంపైనా, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ కార్యకలాపాలపైనా సమీక్షించినందుకు ప్రతిపక్షం ఫిర్యాదు చేసిన కార ణంగా ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ ప్రమేయంతో ప్రభుత్వ ప్రధానాధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులకు నోటీసులు ఇచ్చారు. మంచినీటి సమస్యపైన కూడా చంద్రబాబు సమీక్షించారు. ఆ శాఖకు సంబంధించిన అధికారులకు నోటీ సులు ఇవ్వలేదు. మంచినీటి ఎద్దడి అత్యవసరమైన సమస్య. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అధికారులను దుర్వినియోగం చేసిన తీరు నియమావళికి మరింత పదును పెట్టవలసిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నది. ఎన్నికల షెడ్యూలు ప్రకటిం చడానికి కొద్ది రోజుల ముందే ముఖ్యమంత్రి తనకు ఇష్టులైన అధికారులను జిల్లా కలెక్టర్లుగా నియమించుకున్నారు. డీజేపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ విధేయులే. అందరినీ ఎన్నికలలో టీడీపీ కోసం వినియోగించినట్టు ప్రతిపక్షం ఆరోపణలు చేసింది. ఈ దుర్వినియోగంతో పోల్చితే నలభై నాలుగు సంవత్సరాల కిందట చరిత్ర సృష్టిం చిన రాయ్‌బరేలీ కేసులో ఆరోపించిన అధికార దుర్వినియోగం చాలా స్వల్ప మైనది. చారిత్రక అలహాబాద్ కోర్టు తీర్పు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)పైన అనుమానాలు వ్యక్తం చేస్తు న్నట్టుగానే 1971లోనూ ప్రతిపక్షాలు బ్యాలట్పత్రాలపైన రసాయనిక ప్రక్రియ జరిపారని ఆరోపించాయి. నాటి సార్వత్రిక ఎన్నికలలో రాయ్‌బరేలీలో ప్రధాని ఇందిరాగాంధీపైన ప్రతిపక్ష అభ్యర్థిగా రాజనారాయణ్ పోటీ చేశారు. ఇందిరకు 1,83,309 ఓట్లు వస్తే రాజ్‌నారాయణ్‌కు 71,499 ఓట్లు వచ్చాయి. ఓట్లు లెక్కించకముందే రాజ్‌నారాయణ్ విజయోత్సవం నిర్వహించారు. తానే గెలు స్తానని అంత ధీమా. తీరా ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటించే సరికి డీలా పడి పోయారు. కానీ బ్యాలెట్‌పత్రంపైన రసాయనిక ప్రయోగం చేశారని ఆయన గట్టిగా విశ్వసించారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఆయనను బలపరి చారు. బ్యాలెట్ పత్రాలను ముద్రించే సమయంలోనే దానిపైన కాంగ్రెస్‌పార్టీ గుర్తు ముద్రించారనీ, దాన్ని కప్పి ఉంచేందుకు రసాయనం ఉపయోగించారనీ, ఎన్నికలలో ఓటర్లు పెట్టిన గుర్తు కొద్ది సేపటికి అదృశ్యమై కాంగ్రెస్‌పార్టీ గుర్తు బయటికి వచ్చిందనీ, ఓట్ల లెక్కింపు సమయానికి రసాయన ప్రయోగం చేసిన అన్ని బ్యాలట్ పత్రాలపైనా కాంగ్రెస్ గుర్తు ఉన్నదనీ రాజ్‌నారాయణ్ అను మానం. అందుకే ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. శాంతిభూషణ్ ఆయన తరఫున వాదించారు. జూన్ 12, 1975నాడు అలహాబాద్ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జగ్మోహన్లాల్ సిన్హా ఇందిర ఎన్నిక చెల్లనేరదంటూ చారిత్రక తీర్పు ప్రకటించారు. యశ్పాల్ కపూర్ అనే ఉద్యోగిని ఎన్నికల ఏజెంట్‌గా ఇందిరాగాంధీ నియమించారనేది న్యాయమూర్తి తప్పుపట్టిన చర్య. నిజానికి యశ్పాల్ ప్రభుత్వ ఉద్యోగం నుంచి వైదొలిగి ఇందిర ఎన్నికల ఏజెంట్‌గా ఉన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రత్యేకాధికారి (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ–ఓఎస్డీ)గా మళ్ళీ ఉద్యోగంలో చేరారు. ఈ తీర్పు కారణంగా ఇందిరా గాంధీ పదవి నుంచి వైదొలిగి సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకుంటే బహుశా అలహాబాద్ హైకోర్టు తీర్పును కొట్టివేసేదేమో. కానీ ఆ పని చేయకుండా ఆత్యయిక పరిస్థితి ప్రకటించడంతో చరిత్ర మలుపు తిరిగింది. ఒక ఉద్యోగిని ఎన్నికల కార్యక్రమంలో వినియోగించుకున్నందుకు దేశ ప్రధాని ఎన్నిక చెల్లదని హైకోర్టు నిర్ణయించింది. ఆ రోజులతో పోల్చితే ఇప్పుడు అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. అధికార దుర్వినియోగం, ధనబలం, కండబలం, కులం, మతం, ప్రాంతం, తదితర అపభ్రంశాలన్నీ ఆవహించి ఎన్నికల ప్రక్రియను భ్రష్టుపట్టించాయి. ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం వంటి అరకొర సంస్కరణలతో పరి స్థితి బాగుపడదు. మొత్తం రాజకీయ వ్యవస్థకే కాయకల్ప చికిత్స జరగాలి. నియమావళిని కచ్చితంగా అమలు చేయడమే కాకుండా ఎన్నికల ప్రణాళికలలో రాజకీయ పార్టీలు ఇస్తున్న వాగ్దానాల అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించే బాధ్యత సైతం ఎన్నికల సంఘమే స్వీకరించాలి. ఇప్పుడున్న ధోరణే కొనసాగినట్లయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు విశ్వాసం నశిస్తుంది. అరాజకం ప్రబలు తుంది. రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా పౌరసమాజం యావత్తూ సమష్టిగా సమాలోచన జరిపి పరిష్కరించుకోవలసిన సమస్య ఇది. -కె. రామచంద్రమూర్తి -
ఆఖరి ఎత్తులు!
ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగబోతున్నదనగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు యధావిధిగా తనకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించారు. బుధవారం అమరావతి లోని సచివాలయంలో ఉన్న ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పోయి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీతో ఆయన ప్రవర్తించిన తీరు అందరినీ విస్మయపరిచింది. ఎన్నికల ప్రచారానికి గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసిపోయింది. ఆ తర్వాత ఏ నాయకుడూ ప్రచారానికి దిగకూడదు. ఎన్నికల నియమావళి ఇందుకు అంగీకరించదు. కానీ చంద్రబాబు తాను అన్నిటికీ అతీతుడనని భావిస్తారు. అందుకే పదవీభ్రష్టత్వం ఖాయమని ఖరారైన చివరి నిమిషంలో కూడా దింపుడు కళ్లం ఆశతో ఏదో హడావుడి చేసి మీడియాకెక్కాలని తెగ తాపత్రయపడ్డారు. అందుకు ఏకంగా ఎన్నికల కమిషన్ కార్యాలయాన్నే ఆయన ఎంచుకున్నారు. ద్వివేదీతో అమర్యాద కరంగా ప్రవర్తించి అడ్డగోలుగా మాట్లాడారు. బెదిరింపులకు దిగారు. వేలు చూపిస్తూ స్వరం పెంచి ఆయన మాట్లాడిన తీరు అధికార యంత్రాంగాన్ని మాత్రమే కాదు... రాజకీయవర్గాలనూ, ప్రజ లనూ కూడా ఆశ్చర్యపరిచింది. ‘మీరు పోస్ట్‌మాన్ డ్యూటీ చేస్తారా... కేంద్ర ఎన్నికల సంఘం చెప్పి నట్టు ఎలా చేస్తారు?’ అంటూ బాబు ప్రశ్నించడం హాస్యాస్పదం. రాష్ట్ర ఎన్నికల సంఘం తన చెప్పు చేతల్లో నడవాలన్నది ఆయన ఉద్దేశం కాబోలు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడటం ఊహకందనిది. ఈ మాటల్లో కొత్తేమీ లేదు. గత కొన్నిరోజులుగా రోడ్ షోల్లో ఏకరువు పెడుతున్న ఆరోపణలే అవన్నీ. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీని, ముగ్గురు ఎస్పీలను బదిలీ చేయడం ఆయనకు పరమ అభ్యంతరకరం. తాను ఏం చేసినా అన్ని వ్యవస్థలూ అచేతనంగా ఉండిపోవాలని ఆయన భావిస్తున్నారు. ఏ పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) బదిలీ చేసింది? ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, మరికొందరు పోలీస్ అధికారులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వారిలో ముగ్గురిపై చర్య తీసుకుంది. కానీ ఆ చర్యను వమ్ము చేసి తనకు అత్యంత ప్రీతి పాత్రుడైన వెంకటేశ్వరరావు బదిలీని ఆపాలని చంద్రబాబు ప్రయత్నించారు. అందుకోసం వరస బెట్టి జారీచేసిన మూడు జీవోలు బాబు మానసిక స్థితికి, ఆయన మార్క్ పాలనకూ అద్దం పడ తాయి. ఆ ముగ్గురు అధికారులనూ బదిలీ చేస్తూ ఒక జీవో, వారిలో కేవలం ఇద్దరిని మాత్రమే బదిలీ చేస్తూ మరో జీవో, ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చే అధికారుల జాబితాలో ఇంటెలిజెన్స్ చీఫ్‌ను మినహాయిస్తూ ఇంకొక జీవో విడుదల చేశారు. ఈ మూడు జీవోల మధ్యా కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉన్నదని, పైగా ఇందులో ఆఖరుగా విడుదలచేసిన జీవోను ఎన్నికల సంఘం చర్యను వమ్ము చేసేందుకు వీలుగా వెనకటి తేదీ నుంచి అమలయ్యేలా జారీ చేశారని గమనిం చుకుంటే బాబు సర్కారు అనైతికత ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది. చెప్పాలంటే ఈ జీవోల జారీలో ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ వాస్తవానికి పోస్ట్‌మాన్‌లా ప్రవర్తిం చారు. ఇష్టంగానో, అయిష్టంగానో బాబు అభీష్టాన్ని నెరవేర్చారు తప్ప నిబంధనలేం చెబుతు న్నాయో, తన కర్తవ్యమేమిటో గమనించుకోలేకపోయారు. అందువల్లే సీఈసీ ఆయనపై కూడా చర్య తీసుకోవాల్సి వచ్చింది. తనపై విరుచుకుపడుతున్న బాబును ఈ జీవోల సంగతేమిటని కెమెరాల సాక్షిగా ద్వివేదీ నిలదీసి ఉంటే ఏమయ్యేది? వీటన్నిటినీ పట్టించుకోకుండా ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్ర వహించాలా అని ప్రశ్నిస్తే బాబు పరువు ఏమయ్యేది? ఇక్కడ మరో ముఖ్య విషయం గమనించాలి. ఈ బదిలీలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లో తాము జోక్యం చేసు కోలేమని హైకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల సంఘం పనితీరుపై ఏ పార్టీకైనా అసంతృప్తి ఉండటం తప్పేమీ కాదు. నియమావళిని సక్రమంగా అందరితో పాటించేలా చేయడంలో అది విఫలమవుతున్నదనో, ఉల్లంఘనలు జరుగు తున్నా పట్టించుకోవడంలేదనో ఆరోపించదల్చుకుంటే అందుకు తగిన ఆధారాలను అందించాలి. తగిన వేదికల వద్ద ఫిర్యాదు చేయాలి. దేశంలో అందరికన్నా తానే సీనియర్ రాజకీయవేత్తనని, తనకు అపార అనుభవమున్నదని తరచు చెప్పుకునే బాబుకు ఇలాంటి అంశాలు ఇంకా తెలియ లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయనకు తెలియక కాదు. ఏ పనైనా ఆయన తెలిసే చేస్తారు. తెలుసుకునే చేస్తారు. ఎవరూ తనని గమనించరని, గమనించినా నిలదీయరని అపార విశ్వాసం. ఏ వ్యవస్థా తనను ప్రశ్నించదన్న ధీమా. అంతక్రితం తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడైనా, మూడేళ్లక్రితం తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యేను నోట్ల కట్టలు పంపి ప్రలోభపరచాలని ప్రయత్నించినప్పుడైనా ఆయన ఈ ధీమాతోనే బరితెగించారు. ఇప్పుడు యావత్తు అధికార యంత్రాంగాన్నీ గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నది ఈ ధీమాతోనే! నిజానికి షెడ్యూల్ ప్రకటించిననాటినుంచి బాబు య«థేచ్ఛగా కోడ్ ఉల్లంఘిస్తున్నారు. తాను ఆపద్ధర్మ సీఎంనన్న సంగతి మరిచి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను పిలిపించుకుని మొబిలైజేషన్ అడ్వాన్సులకింద, నీరు–చెట్టు పథకం కింద నిధుల సంతర్పణ చేశారు. ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండే కలర్ ఫొటోలతో కూడిన జాబితాలనూ, పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి సొంత పార్టీ ప్రయోజనాలకు వినియోగించుకున్నారు. పలు జిల్లాల్లో పోలీసుల ద్వారా, తమ పార్టీ వారి ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలనూ, కార్యకర్తలనూ బెదరగొట్టాలని చూస్తున్నారు. నిజానికి ఇలాంటి అంశాల్లో ఎన్నికల సంఘం కఠినంగా ఉండటం లేదన్న అసంతృప్తి అందరిలో ఉంది. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతూ తమకేదో తీరని అన్యాయం జరిగిందని బాబు శోకాలు పెడుతున్నారు. ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికొచ్చిన ప్రజానీకాన్ని ఇలాంటి కపట నాటకాలు ఏమార్చలేవు. బాబు తన అప్రజాస్వామిక వైఖరికి స్వస్తి చెప్పి వ్యవస్థలను గౌరవించడం నేర్చుకోవాలి. -
యోగికి ఎన్నికల సంఘం ప్రేమలేఖ!
న్యూఢిల్లీ: భారత సైన్యాన్ని ‘మోదీ సేన’ గా అభివర్ణిస్తూ వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కేవలం మందలించి వదిలేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత ఆర్మీని యోగి అవమానిస్తే.. అందుకు బదులుగా ఈసీ ఆయనకు ‘ప్రేమలేఖ’ రాసిందని మండిపడింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) కాస్తా మోదీ కోడ్ ఆఫ్ కండక్ట్‌గా మారిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా విమర్శించారు. అధికారంలో ఉన్నవారిపై చర్యలు తీసుకునేందుకు ఈసీ భయపడుతుందా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పేదలకు కనీస ఆదాయ పథకాన్ని విమర్శించిన నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్‌ను.. ‘మళ్లీ ఇలా చేయొద్దంటూ’ ఈసీ హెచ్చరించి వదిలేసిందని, అలాగే యోగిని కూడా మందలించి వదిలేసిందని, కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంలో ఈసీ ఎందుకు భయపడుతోందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. భారత ఆర్మీ మోదీ సేన అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన యోగిని ఈసీ శనివారం హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
పోలింగ్ సెంటర్ వద్ద బాలయ్య హల్చల్
సాక్షి, అనంతపురం: సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద హల్చల్ చేశారు. ఇప్పటికే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన బాలయ్య శుక్రవారం హిందూపురంలో ఎన్నికల నియామవళి ఉల్లంఘనకు పాల్పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద బాలకృష్ణ ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా ఉద్యోగులతో ఫొటోలు దిగారు. బాలయ్యతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకుని వచ్చారు. అయితే పోలీసులు మాత్రం టీడీపీ నేతలను అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. దీనిపై స్పందించిన హిందూపురం రిటర్నింగ్ అధికారి గుణభూషణ్‌రెడ్డి బాలకృష్ణకు నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద బాలకృష్ణ ప్రచారం చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఇందుకు నిరసనగా నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. మరోవైపు పోస్టల్ బ్యాలెట్స్ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లపైన ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడులో ఒకే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంపై ఉద్యోగులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరపురం అర్బన్ పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఉద్యోగులు బారులు తీరారు. అరకొర ఏర్పాట్లు చేయడంపై ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. చదవండి: బాలకృష్ణకు చేదు అనుభవం -
మరోసారి కోడ్ ఉల్లంఘించిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు పదేపదే ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు. ఉండవల్లిలోని తన అధికార నివాసం పక్కనే నిర్మించిన ప్రజా వేదికను పూర్తిస్థాయి పార్టీ కార్యాలయంలా వినియోగించుకుంటున్నారు. గురువారం ప్రజావేదికలో ఆయన క్రైస్తవ మతగురువులు, జమాయతే ఉలేమా హింద్ నేతలతో సమావేశమై ఎన్నికల ప్రసంగం చేశారు. తనకు ఓటు వేయాలని చంద్రబాబు ఈ సమావేశంలో వారిని కోరారు. శ్రీశైలం భువనేశ్వరి పీఠాధిపతి కైలాసగిరి స్వామిని చంద్రబాబు కలిశారు. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ నిధులతో కట్టిన భవనాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించకూడదు. ఉండవల్లిలోని ప్రజావేదిక సీఆర్డీఏ నిర్మించింది. పార్టీ కార్యకర్తల సమావేశాలు, ఇతర పార్టీలకు చెందిన నాయకులను చేర్చుకునే కార్యక్రమాలు, అభ్యర్థులతో సమావేశాలు వంటి అన్నింటికీ ప్రజావేదికనే వాడుతున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిత్యం నిర్వహించే టెలీకాన్ఫరెన్స్‌లకు సైతం ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థను వినియోగించుకుంటున్నారు.కాగా,శుక్రవారంఉండవల్లి ప్రజావేదికలో చంద్రబాబు అర్చకులతో నిర్వహించే సమావేశానికి రావాలంటూ ఆలయాల్లో పనిచేసే అర్చకులను దేవదాయశాఖ ఉన్నతాధికారులు బెదిరిస్తున్నారు. దీనికి కచ్చితంగా హాజరవ్వాలని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు అర్చకులకు మౌఖిక ఆదేశాలిచ్చారు. సమావేశానికి హాజరు కాని పక్షంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బెదిరిస్తున్నారు. సమావేశానికి వెళితే తాము ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్టు అవుతుందేమోనని, వెళ్లకపోతే అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారేమోననే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మంత్రిసేవలో మత్స్యశాఖ ఉద్యోగి !
సాక్షి, కడప : ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏ పార్టీకి కొమ్ము కాయకూడదు. తటస్థంగా ఉండాలి. పార్టీల పట్ల తమ భావాలను వ్యక్తం చేయకూడదు. ఆఖరుకు సామాజిక మాధ్యమాల్లో కూడా. ప్రచారం చేయకూడదు. ఎన్నికలు ముగిసే వరకు ఎక్కడా ప్రచారాల్లో పాల్గొనకూడదు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగులందరూ ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటారు. వీరిపై ఎన్నికల కమిషన్ నిఘా ఉంటుంది. కానీ ఇవేమీ పట్టని కొందరు ‘పచ్చ’ఉద్యోగులు ప్రభుత్వ సేవకులమనే విషయం మరిచిపోతున్నారు. వ్యక్తులు, పార్టీలను ఆరాధిస్తూ తరిస్తున్నారు. మత్స్యశాఖ అధికారి నెల్లూరు రెడ్డయ్య వ్యవహార శైలి ఆది నుంచి వివాదాస్పదంగా ఉంటోంది. ఎన్నికల నియమావళి రావడంతో మంత్రులు సైతం సాధారణ పౌరులుగా ఉంటారు. ప్రొటోకాల్ కలిగిన ప్రజాప్రతినిధులు సైతం సొంత వాహనాల్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రాతినిథ్యం వహించిన మత్స్య శాఖలో అధికారిగా పనిచేసే నెల్లూరు రెడ్డయ్య మాత్రం ఇప్పటికీ మంత్రి సేవలోనే తరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కడప నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో కడప ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆదినారాయణరెడ్డి కార్యాలయాన్ని ప్రారంభించారు. టీడీపీ ఎన్నికల కార్యాలయంలో ఓటర్ల పరిశీలన, ఓటర్లకు ఫోన్లు చేయడం, వారిని ప్రలోభాలకు గురిచేయడం, టీడీపీకి అనుకూలంగా పనిచేయాలంటూ కోరడం లాంటి విషయాల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ఈ అధికారిపై ఎన్నికల అధికారులు ఏం చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు నిత్యం రాజకీయ పార్టీ ప్రచారంలో తరిస్తున్నారు. ముద్దనూరులో ఇరిగేషన్ ఏఈ కటిక మధుసూదనరెడ్డి, చింతకొమ్మదిన్నెలో ఏఈ ఖాశీంసాబ్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. తాజాగా మత్య్యశాఖ అధికారి వ్యవహారం వెలుగుచూసింది. నిబంధనల మేరకు చర్యలుంటే మరో అధికారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉండేందుకు కట్టడి చేయివచ్చు. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన గవర్నర్.!
జైపూర్ : రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్‌సింగ్‌పై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ చర్యపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు దృష్టికి తీసుకొచ్చింది. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ తటస్థంగా ఉండాల్సింది పోయి పక్షపాతంగా వ్యవహరించారని తెలిపింది. ఈ మేరకు కోవింద్‌కు లేఖ రాసింది. మార్చి 23న అలీఘర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్.. .. ‘మనమంతా బీజేపీ కార్యకర్తలం. బీజేపీ ఘనవిజయం సాధిస్తుంది. నరేంద్రమోదీ మరోసారి ప్రధానమంత్రి అవుతాడు. ఆయన ప్రధాని కావడం దేశానికి అవసరం’ అని వాఖ్యానించారు. కాగా, గవర్నర్ వ్యాఖ్యలపై సీఎం అశోక్ గహ్లోత్ స్పందించారు. గవర్నర్ కల్యాణ్‌సింగ్ వ్యాఖ్యలు దురదృష్టకరం. ఇలాంటి చర్యలు ఆ పదవికి ఉన్న హుందాతనాన్ని తగ్గిస్తాయి అని విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా కూడా కల్యాణ్‌సింగ్ అంటే తనకు అభిమానమని, ఎంతో సీనియర్ లీడర్ అయిన ఆయన బాధ్యతాయుత పదవిలో కొనసాగుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని ట్వీట్ చేశారు. -
కేంద్రానికో న్యాయం, రాష్ట్రానికో న్యాయమా?
సాక్షి, న్యూఢిల్లీ : ఒకే ఎన్నికల కోడ్. రెండు ఒకే తరహా రైతు ఆర్థిక భరోసా స్కీమ్‌లు. ఓ స్కీమ్ కేంద్రానిది, మరో స్కీమ్ రాష్ట్రానిది. ఎన్నికల కోడ్‌ను అమలు చేయడంలో మాత్రం ద్వంద్వ ప్రమాణాలు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘పీఎం కిసాన్ స్కీమ్’ కింద దేశంలోని రైతులకు 19 వేల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. అదే ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ‘కాలియా స్కీమ్’ కింద రైతులకు పంట పెట్టుబడి కింద నిధులను విడుదల చేయడానికి ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రధానాధికారి అనుమతించలేదు. పైగా కేంద్రం కన్నా ముందు నుంచే ఒడిశా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ రెండు పథకాలు కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రైతు బంధు’ పథకం లాంటివే. తెలంగాణ రాష్ట్రంలో లాగా కాకుండా ఒడిశా ఈ రైతు ఆర్థిక భరోసా పథకాన్ని సన్న, చిన్నకారు రైతులతోపాటు భూమి కౌలుదారులకు (టెనెంట్స్) కూడా అమలు చేస్తోంది. అంతేకాకుండా కేంద్రంలోలాగా ఆరువేలో, తెలంగాణలాగా తొమ్మిదివేలో కాకుండా ఏడాదికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. రెండు ఒకే తరహా పథకాలు అయినప్పుడు కేంద్రం నిధుల విడుదలకు అనుమతించిన ఎన్నికల కమిషన్ తమ రాష్ట్రం నిధుల విడుదలను అడ్డుకోవడం ఏమిటని ఒడిశా పాలకపక్ష బిజూ జనతాదళ్ అధికార ప్రతినిధి సుశ్మిత్ పాత్ర ప్రశ్నించారు. ఆయన ప్రశ్నే సహేతుకమే. అటు కేంద్రం అమలు చేస్తున్న పథకం, ఇటు ఒడిశా అమలు చేస్తున్న పథకం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మార్చి పదవ తేదీకి ముందు ప్రకటించినవే. లబ్ధిదారులను కూడా ముందే గుర్తించారు. అయినా సరే, ఎన్నికల సమయంలో ఓటర్ల చేతికి డబ్బు అందడమంటే అది ప్రలోభానికి గురి చేయడానికే అని అర్థం చేసుకున్న కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేసే ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి నిధుల విడుదలను అడ్డుకున్నారు. ఎన్నికలకు ముందే పథకాన్ని ప్రకటించడమే కాకుండా లబ్ధిదారులను కూడా గుర్తించినందున ఎన్నికల సమయంలో నిధులను విడుదల చేయడంలో తప్పులేదని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం అందుకు అనుమతి ఇచ్చింది. ఎన్నికల సమయంలో పాలకపక్ష పార్టీ తన అధికారాన్ని ఉపయోగించి ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు అన్ని రాజకీయ పార్టీలతో సంప్రతింపులు జరిపి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్‌ను రచిస్తుంది. అలాంటప్పుడు రాష్ట్రం విషయంలో ఒకలాగా, కేంద్రం విషయంలో ఒకలాగా కోడ్‌ను అమలు చేయడం ద్వంద్వ ప్రమాణాలను పాటించడమే అవుతుంది. ఎన్నికల అధికారుల మధ్య దృక్పథాల్లో తేడా వచ్చినప్పుడు సంప్రతింపుల ద్వారా అలాంటి తేడాలు రాకుండా చూసుకోవాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తోందన్న అపవాదు లేదా ఆరోపణలు రాకముందే కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించడం మంచిది. -
వెబ్సైట్ల సాక్షిగా కోడ్ ఉల్లంఘన
విశాఖసిటీ : సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైనప్పటి నుంచి కోడ్ వర్తిస్తోంది. కోడ్ కూసిన వెంటనే.. ప్రభుత్వ వెబ్సైట్లలో ఉన్న ఫొటోల్ని మార్చాల్సి ఉంటుంది. కానీ.. ఇంత వరకు ఏపీ ప్రభుత్వం మాత్రం కోడ్ మాకు వర్తించదన్నట్లుగా నిర్లక్ష్యపు ధోరణిని ప్రదర్శిస్తోంది. ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల వెబ్సైట్లలో సీఎం చంద్రబాబు, అనేక మంది మంత్రుల ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఇక ఆయా వెబ్సైట్లను పరిశీలిస్తే.. డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్‌లో సీఎంగా చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణుడు, బీసీవెల్ఫేర్ కమిషనర్ వెబ్సైట్లో బాబు, మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్సైట్లో బాబు, నారాయణ ఫొటోలు ఉన్నాయి. ఓవైపు.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని వెబ్సైట్లలోనూ ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రుల ఫొటోలను తొలగిస్తూ.. ఎన్నికల కమిషన్ నియమాల్ని పాటిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇలా బరితెగించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
టీడీపీ కార్యాలయం @ప్రజావేదిక
సాక్షి, అమరావతి: నీతి నియమాలు, ప్రజాస్వామ్యం, క్రమశిక్షణ గురించి నిత్యం శ్రీరంగనీతులు చెప్పే చంద్రబాబు ఎన్నికల నియమావళిని యథేచ్ఛగా తుంగలో తొక్కి తన మాటలు, చేతలకు పొంతన ఉండదని ప్రజావేదిక సాక్షిగా మరోసారి నిరూపించారు. ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రమే వినియోగించాల్సిన తన అధికారిక నివాసం, దాని పక్కనే ఉన్న ప్రజా వేదికను పూర్తిస్థాయి పార్టీ కార్యాలయంలా మార్చివేశారు. సాక్షాత్తూ సీఎం స్థానంలో కూర్చున్న వ్యక్తే అధికార దుర్వినియోగానికి పాల్పడడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికల నియమావళి ప్రకారం సీఎం, మంత్రులు తమ అధికారిక నివాసాలను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించకూడదు. కృష్ణా నది కరకట్టపై తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లిలో ఉన్న లింగమనేని రమేష్‌కు చెందిన అక్రమ కట్టడాన్ని చంద్రబాబు తన నివాసంగా మార్చుకున్నారు. మూడున్నరేళ్ల క్రితం ప్రభుత్వం దాన్ని సీఎం అధికారిక నివాసంగా గుర్తించింది. సీఎంని కలిసేందుకు వచ్చే ప్రజల కోసమంటూ సీఆర్డీఏ 2017 ఏప్రిల్‌లో ప్రజావేదిక (గ్రీవెన్స్ సెల్)ను నిర్మించింది. రూ.4.34 కోట్లతో ఎన్సీసీ ఈ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేసింది. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ ప్రజావేదికను మొదటి నుంచి చంద్రబాబు పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా దాన్ని, తన ఇంటిని ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలా మార్చివేశారు. విశాఖ, విజయనగరం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలతో ప్రజావేదికలో సోమవారం సాయంత్రం సమావేశం నిర్వహించిన చంద్రబాబు ఎన్నికలకు వారిని సమాయత్తం చేసే ప్రసంగం ఇచ్చారు. మూడు రోజుల క్రితం చింతలపూడికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి ఆయన వెంట వచ్చిన కార్యకర్తలు పార్టీలో చేరే కార్యక్రమాన్ని అక్కడే నిర్వహించి వారితో మాట్లాడించడమే కాకుండా తానూ మాట్లాడారు. ఎన్ఆర్ఐ టీడీపీ తయారు చేసిన పది ప్రచార రథాలను ప్రజావేదిక ప్రాంగణంలోనే ఉంచి అక్కడి నుంచే వాటిని ప్రారంభించారు. సుజనాచౌదరి, యనమల, పార్టీ కార్యక్రమాలు సమన్వయం చేసే టీడీ జనార్థన్, వీవీవీ చౌదరి వంటి వారంతా ప్రజా వేదికలోనే అసమ్మతి నేతలు, వర్గాలతో బుజ్జగింపులు, సంప్రదింపులు జరుపుతున్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన కొందరు నేతలు టీడీపీలో చేరే కార్యక్రమాన్ని ప్రజావేదికలో నిర్వహించారు. మరోవైపు చంద్రబాబు ప్రతిరోజూ లక్షన్నర మంది పార్టీ కార్యకర్తలు, నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలా పనిచేయాలో నిర్దేశిస్తున్నారు. అంతమందితో ఒకేసారి టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడేందుకు ప్రభుత్వం ఆధీనంలోని కమ్యూనికేషన్ వ్యవస్థను వాడుకుంటున్నారు. ఈ వ్యవస్థ అంతా ఆర్టీజీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. దాన్ని కూడా దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి సంబంధించిన పలు వ్యవస్థలను చంద్రబాబు పార్టీ కార్యక్రమాలకు ఇష్టానుసారం వాడుకుంటున్నారు. కోడ్ అమల్లో ఉండగా అధికారులతో సమీక్ష చేయకూడదని తెలిసినా వారితో టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. -
యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ.. టీడీపీ నేతలు దానితో తమకేం సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. అమరావతిలోని ప్రజవేదికలో చంద్రబాబు టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 5 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన ప్రజావేదికలో సొంత పార్టీ చేరికల కార్యాక్రమాన్ని బాబు చేపట్టారు. అంతేకాకుండా పసుపు కండువాలతో ప్రజావేదికలో సమీక్షలు కూడా జరుపుతున్నారు. ప్రతిపక్షాలను విమర్శిస్తు రాజకీయ ప్రెస్ మీట్లను కూడా అక్కడి నుంచే చేపడుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న చంద్రబాబు ఇలా వ్యవహరించడంపైనా పెద్ద ఎత్తున్న విమర్శలు వస్తున్నాయి. టీడీపీ కింది స్థాయి నేతలు కూడా పార్టీ అధినేత బాటలోనే ఎన్నికల కోడ్ ఉంటే మాకేంటి అన్నట్టు ముందుకు సాగుతున్నారు. రాజధాని రైతుల భూముల్లో టీడీపీ కార్యక్రమాలు.. టీడీపీ తమ అవసరాల కోసం రాజధాని రైతుల భూములను వాడుకుంటుంది. రైతుల భూముల్లో యథేచ్ఛగా టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అమరావతిలో పార్టీ నేతల సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా రాజధాని రైతల భూములను వినియోగించుకోవడానికి తయారైంది. సీఆర్డీఏ ఆధినంలో ఉన్న భూముల్లో టీడీపీ టెంపరరీ కార్యాలయం ఏర్పాటు చేస్తోంది. -
దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు
-
దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఆదివారం నుంచే అమల్లోకి వచ్చింది. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో ప్రభుత్వాలు కొత్త పథకాలు ప్రకటించడంతో పాటు ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనల కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉండదు. ఇక లోక్ సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూలును విడుదల చేసింది. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దేశవ్యాప్తంగా పలు విడతల్లో ఎన్నికల ప్రక్రియ ముగించనుంది. చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ (175), ఒడిషా (147), సిక్కిం (32), అరుణాచల్ ప్రదేశ్ (60) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
నిఘా నేత్రం..!
సాక్షి, మిర్యాలగూడ రూరల్ : ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు పెట్టే ఖర్చు పర్యవేక్షణకు అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేశారు. ఎన్నికల ఏర్పాట్లు , మద్యం, డబ్బు పంపిణీ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, అనుమతి లేకుండా ప్రచార కార్యక్రమాలు చేపట్టడం లాంటి వాటిని నిరోధించేందుకు ఎనిమిది రకాల బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. వీరు ప్రతి అంశాన్ని నేరుగా పరిశీలకులకు, ఎన్నికల అధికారికి సమాచారం ఇస్తారు. వ్యయ పరిశీలకులు : వ్యయ పరిశీలకులుగా ఐఏఎస్, ఐఆర్ఎస్, సెంట్రల్ ఎక్సైజ్ అధికారులను నియమించారు. ప్రతి జిల్లా నియోజకవర్గాలకు అనుగుణంగా పరి శీలకులను నియమించారు. నల్లగొండ జిల్లాలో ఆరు నియోజక వర్గాలకు గాను ఇద్దరు ఆర్.గోపాలస్వామి (నల్లగొండ, నకరేకల్, మునుగోడు నియోజకవర్గాలు), ఆకాశ్ దేవా నంద్ (మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజక వర్గాలు) లను వ్యవయ పరిశీలికులుగా నియమించారు. ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్టర్) : జిల్లా వ్యప్తంగా ఆరు నియోజకవర్గాల్లో ఈ కమిటీలో 33మంది పని చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఐదు, ఆపై సంఖ్యలో కమిటీలను నియమించారు. ఒక్కో కమిటీలో ఐఏఎస్‌తో పాటు వీడియో గ్రాఫర్ ఉంటారు. ప్రవర్తణా నియమావళి ఉల్లంఘనపై సమాచారం ఆధారంగా వీరు రంగంలోకి దిగుతారు. అనుమతి లేని సమావేశాలను రద్దు చేయడం వాహనాలను అడ్డుకోవడం వంటి విధులు నిర్వహిస్తారు. వీడియో నిఘా బృందాలు : వీడియో నిఘా బృందాలు నియోజక వర్గానికి ఒ కటి చొప్పున ఉంటుంది. ప్రతి బృందానికి అధి కారి, వీడియో గ్రాఫర్ ఉంటారు. వీరు నియోజకవర్గంలో రాజకీయ పార్టీ సభలు, సమావేశాలు, ర్యాలీలు ఇతర ప్రచార కార్యక్రమాలను చిత్రీకరిస్తూ ఉంటారు. ఒకే సమయంలో ఎక్కువ కార్యక్రమాలు ఉంటే అదనపు వీడియో గ్రాఫర్‌ను నియమిచుకునే అధికారం ఆ అధికారికి ఉంటుంది. అకౌంట్ టీం: జిల్లాలో మొత్తం ఆరు బృందాలు ఉన్నాయి.ఒక్కొ బృందానికి అధికారి, సహాయకుడు ఉంటారు. వీరు వీడియో వ్యూయింగ్ బృందాలు పంపిణీ సామగ్రి లెక్కలు చూసి వాటిని ఎన్నికల నిబంధనల ప్రకారం ధరలు నిర్ణయిస్తారు. వీడియో వీక్షణ బృందం : ప్రతి నియోజకవర్గానికి ఒక బృందం చొప్పున కేంద్రంలో ఫ్లయింగ్ స్క్వాడ్ స్టాటిక్సర్వోలెన్స్ టీం, ఎంసీఎంసీ కమిటీల నుంచి వచ్చిన నివేదికలను, వీడియోలను పరిశీలిస్తారు.ఉదాహరణకు వీడియో బృందం ఇచ్చిన సీడీలో అభ్యర్థి, పార్టీకి సంబంధించిన టోపీలు కండువాలు, జెండాలు, బ్యానర్లు, వాహనాలు ఎన్ని ఉన్నాయని వివరాలు పరిశీలించి నమోదు చేస్తారు. సహాయ పరిశీలకులు పరిశీలకులకు సహాయంగా ఉండేందుకు సహాయ వ్యయ పరిశీలకులను నియోజకవర్గానికి ఒకరిని నియమించారు. ప్రతి నియోజకవర్గానికి ఆదాయ పన్ను అధికారి (ఐటీఓ) హోదా లేదా ఇతర ప్రభు త్వ సర్వీసుల్లో ఉన్న అధికారులు ఉంటారు. అభ్యర్థులకు సంబంధించిన అన్ని రకాల వ్యయాన్ని పరిశీలిస్తుంది. ఈ అధికారి వద్ద ఒక్కో అభ్యర్థి పే రుతో ఒక రిజిస్టర్ ఏర్పాటు చేస్తారు. షాడో రిజిస్టర్‌గా పిలిచే దీనిలో అభర్థికి సంబంధించిన వివిధ కమిటీలు ఇచ్చిన వివరాలు పొందుపరుస్తారు. అభ్యర్థులు చూపే ఎన్నికల ఖర్చుతో షాడో రిజి స్టర్ పొందుపరిచిన ఖర్చులతో పోల్చి చూసి తేడా ఉంటే సంజాయిషీ కోరుతారు. అంతిమంగా అ భ్యర్థిఖర్చుల్లో వీరు చెప్పిందే ఫైనల్‌గా ఉంటుంది. నిఘా బృందాలు ఈ బృందాలు నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఉంటారు. జిల్లాలో ఒక్కొక్క నియోజక వర్గానికి మూడు నుంచి నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.ఒక్కొక్క బృందంలో డీటీస్థాయి అధి కారితో పాటు ముగ్గురు లేదా నలు గురు కానిస్టేబుళ్లు ఉంటారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్లు ప్రతి నియోజకవర్గంలో మూడు అపై సంఖ్యలో ఉంటారు. ఒక్కో బృందానికి నాయకత్వం వహించే ఒక అధికారి మెజిస్టీరియల్ అధికారులు ఉంటారు. ఇలా జిల్లా మొత్తం ఆరు నియోజక వర్గాల పరిధిలో 18మంది ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పని చేస్తున్నారు.బృందంలో ఒక వాహనం, ముగ్గురు లేదా నలుగురు కానిస్టేబుళ్లు, ఏఎస్సై , వీడియో గ్రాఫర్ ఉంటారు. డబ్బు, మద్యం ఇతర ప్రలోభాలపై సమాచారం ఇస్తే ఆకస్మిక తనిఖీలు చేసి వాటిని రికార్డు చేస్తారు.