NBFC
-
ఇక లోన్లు ఇవ్వొద్దు.. 4 కంపెనీలపై ఆర్బీఐ బ్యాన్
నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలు తీసుకుంది. రుణాల మంజూరు, పంపిణీని నిలిపివేయాలని ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్, ఆరోహణ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, డీఎంఐ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నవీ ఫిన్సర్వ్ లిమిటెడ్‌లకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది . అక్టోబరు 21న వ్యాపార కార్యకలాపాలు ముగిసిన అనంతరం నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని పేర్కొంది.ఈ కంపెనీల వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేట్ (WALR), వాటి నిధుల వ్యయంపై విధించే వడ్డీ స్ప్రెడ్ పరంగా ఈ కంపెనీల ప్రైసింగ్ పాలసీలో గమనించిన మెటీరియల్ సూపర్వైజరీ లోపాల ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇవి ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే.. ఆర్బీఐ రూల్స్ తెలుసా?అయితే ఆయా కంపెనీలు తమ కస్టమర్లకు ఇతర సేవలను, రుణాల వసూలు, రికవరీ కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్థిక రంగంలో స్థిరత్వం కోసం, సంస్థలన్నీ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూసేందుకు ఆర్బీఐ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలపై చర్యలు చేపడుతూ వస్తోంది. -
ముందస్తు విత్‌డ్రాకు ఆర్బీఐ నిబంధనలు
ముంబై: ఎన్బీఎఫ్సీల్లో డిపాజిట్ చేసిన మూణ్నెల్ల వ్యవధిలోనే డిపాజిటర్లు అత్యవసర పరిస్థితుల కోసం మొత్తం డబ్బును వెనక్కి తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రిమెచ్యూర్ విత్డ్రాయల్స్పై వడ్డీ లభించదని పేర్కొంది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) నిబంధనలను సమీక్షించిన సందర్భంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. వైద్యం, ప్రకృతి వైపరీత్యాలతో పాటు ప్రభుత్వం ప్రకటించే విపత్తులను అత్యవసర పరిస్థితులుగా పరిగణిస్తారు. మరోవైపు, డిపాజిట్లు స్వీకరించే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీ) పాటించాల్సిన లిక్విడ్ అసెట్స్ పరిమాణాన్ని అవి ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లలో 13 శాతం నుంచి 15 శాతానికి ఆర్బీఐ పెంచింది. అలాగే, పబ్లిక్ డిపాజిట్లకు అన్ని వేళలా పూర్తి కవరేజీ ఉండేలా చూసుకోవాలని, ఏడాదికి ఒకసారైనా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నుంచి ’ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్’ రేటింగ్ పొందాలని హెచ్ఎఫ్సీలకు సూచించింది. పబ్లిక్ డిపాజిట్లను 12 నెలల నుంచి 60 నెలల్లోపు తిరిగి చెల్లించేయాల్సి ఉంటుంది. -
ఆర్బీఐ కఠిన చర్యలు.. నాలుగు కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఓ ప్రైవేటు బ్యాంక్‌పై కఠిన చర్యలు తీసుకుంది. నాలుగు ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను రద్దు చేసింది. అలాగే ఓ ప్రైవేటు బ్యాంకుకు రూ.1కోటి జరిమానా విధించింది. ఆర్బీఐ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన కంపెనీలలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుండల్స్ మోటార్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడుకు చెందిన నిత్య ఫైనాన్స్ లిమిటెడ్, పంజాబ్ ఆధారిత భాటియా హైర్ పర్చేజ్ ప్రైవేట్ లిమిటెడ్, హిమాచల్ ప్రదేశ్ ఆధారిత జీవన్‌జ్యోతి డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్ లిమిటెడ్ ఉన్నాయి. ఆర్బీఐ చట్టంలో నిర్వచించిన విధంగా ఈ కంపెనీలు ఇప్పుడు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వ్యాపార లావాదేవీలను నిర్వహించలేవు. ఇక 'రుణాలు, అడ్వాన్సులు - చట్టబద్ధమైన ఇతర పరిమితులు'పై ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించనందుకు గానూ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు రూ.1కోటి పెనాల్టీ విధించింది. తమ ఆదేశాలు, చట్టబద్ధమైన నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఈ బ్యాంకుకు ఇదివరకే షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది. -
టాటా సన్స్ మెగా ఐపీవో!
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా సన్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు ఈక్విటీ మార్కెట్ రీసెర్చ్ సంస్థ స్పార్క్ క్యాపిటల్ పేర్కొంది. టాటా గ్రూప్ ఎన్బీఎఫ్సీ హోల్డింగ్ కంపెనీ విలువను రూ. 7.8 లక్షల కోట్లుగా మదింపు చేసింది. గ్రూప్ కంపెనీల ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం విలువ మదింపు చేయగా.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రానున్న 18 నెలల్లో టాటా సన్స్ ఐపీవో చేపట్టనున్నట్లు తెలియజేసింది. అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్బీఐ గతేడాది గుర్తింపునిచి్చన నేపథ్యంలో 2025 సెపె్టంబర్‌కల్లా తప్పనిసరిగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కావలసి ఉన్నట్లు స్పార్క్ పేర్కొంది. ఇందుకు ఏడాదిన్నర కాలంలో పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంటుందని తెలియజేసింది. దీంతో సంక్లిష్టంగా ఉన్న గ్రూప్ హోల్డింగ్ నిర్మాణం సరళతరమయ్యేందుకు వీలుంటుందని అభిప్రాయపడింది. కాగా.. ఇటీవల వెలువడిన సమాచారం ప్రకారం కంపెనీ రూ. 11 లక్షల కోట్ల విలువను అందుకోగలదని వెల్లడించింది. వెరసి ఐపీవో పరిమాణం రూ. 55,000 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేసింది. టాటా సన్స్ హోల్డింగ్స్‌లో 80 శాతం మోనిటైజబుల్ కానప్పటికీ పునర్వ్యవస్థీకరణ కారణంగా కంపెనీ రీరేటింగ్ను సాధించే వీలున్నట్లు పేర్కొంది. విలువ జోడింపు అన్‌లిస్టెడ్ పెట్టుబడులతో పలు మార్గాల ద్వారా టాటా సన్స్‌కు అదనపు విలువ జమకానున్నట్లు స్పార్క్ క్యాపిటల్ తెలియజేసింది. ఇటీవల సెమీకండక్టర్స్ తదితర ఆధునికతరం విభాగాలలోకి టాటా గ్రూప్ ప్రవేశించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. టాటా ఎలక్ట్రానిక్స్.. చిప్ తయారీ ప్రణాళికలు ప్రకటించిన విషయం విదితమే. టాటా టెక్నాలజీస్, టాటా మెటాలిక్స్, ర్యాలీస్ తదితర అనుబంధ సంస్థలను పేర్కొంది. ఫలితంగా టాటా గ్రూప్ మరో రూ. 1–1.5 లక్షల కోట్ల విలువను జోడించుకోనున్నట్లు అంచనా వేసింది. లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీలు, ప్రిఫరెన్స్ షేర్లు, ఫండ్స్‌లో పెట్టుబడులను పరిగణించి విలువను మదింపు చేసింది. టీసీఎస్ బలిమి టాటా సన్స్ విలువలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ అతిపెద్ద వాటాను ఆక్రమిస్తోంది. టీసీఎస్ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం టాటా సన్స్ వాటా విలువ రూ. 10 లక్షల కోట్ల వరకూ ఉంటుంది. అన్‌లిస్టెడ్ కంపెనీలు, పెట్టుబడులుకాకుండా గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ దిగ్గజాలు టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్‌లో యాజమాన్య వాటాలు కలిగి ఉంది. టాటా కెమికల్స్‌లో అత్యధిక స్థాయి(కంపెనీ విలువలో 80 శాతం)లో యాజమాన్య హక్కులను కలిగి ఉంది. కాగా.. టాటా సన్స్‌లో దొరాబ్జీ టాటా ట్రస్ట్ 28 శాతం, రతన్ టాటా ట్రస్ట్ 24 శాతం, సైరస్ మిస్త్రీ కుటుంబ పెట్టుబడి సంస్థ(స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్) 9 శాతం, ఇతర ప్రమోటర్లు 14 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. -
బ్యాంక్ లైసెన్స్‌లు కోరుకోవడం అసాధారణం
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) ఒకవైపు నియంత్రణపరమైన ప్రయోజనాలను అనుభవిస్తూనే మరోవైపు బ్యాంకింగ్ లైసెన్స్ కోరుకోవడం అనుచితమని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎన్బీఎఫ్సీలపై సీఐఐ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వడ్డీ రేట్లపై నియంత్రణ సంస్థ (ఆర్బీఐ) ఇచి్చన స్వేచ్ఛను కొన్ని సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐలు) దురి్వనియోగం చేస్తున్నాయని, అధిక రేట్లను వసూలు చేస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. పీర్ టు పీర్ (పీటుపీ) రుణ ప్లాట్‌ఫామ్‌లు లైసెన్స్ మార్గదర్శకాల పరిధిలో లేని వ్యాపార విధానాలను అనుసరిస్తుండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి ఉల్లంఘనలను ఆమోదించేది లేదని హెచ్చరించారు. ఎన్బీఎఫ్సీలు బ్యాంక్‌లుగా మారే విషయంలో వస్తున్న డిమాండ్‌పై రాజేశ్వరరావు మాట్లాడారు. టాప్ టైర్ ఎన్‌బీఎఫ్‌సీలకు సైతం నియంత్రణ విధానాలు యూనివర్సల్ బ్యాంకుల మాదిరిగా లేవని స్పష్టం చేస్తూ, ఎన్బీఎఫ్సీలు కొన్ని ప్రయోజనాలను అనుభవిస్తున్నట్టు చెప్పారు. ‘‘ఎన్బీఎఫ్సీలు కీలక సంస్థలుగా మారి ప్రత్యేకమైన ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కనుక అవి బ్యాంక్‌గా మారాలని అనుకోవడం సముచితం కాదు’’అని రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న బజాజ్ ఫిన్సర్వ్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ ఎన్బీఎఫ్సీలు బ్యాంక్ లైసెన్స్‌లు ఎందుకు కోరుకోరాదంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా రాజేశ్వరరావు మాట్లాడడం గమనార్హం. బ్యాంక్‌గా ఎందుకు మారకూడదు? ఆర్బీఐ పటిష్ట నియంత్రణల మధ్య ఎన్బీఎఫ్సీలు పెద్ద సంస్థలుగా, బలంగా మారినట్టు సంజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని ఎన్బీఎఫ్సీలు బ్యాంక్ లైసెన్స్ గురించి ఎందుకు ఆలోచించకూడదు?. ముఖ్యంగా ఈ ఎన్బీఎఫ్సీలు పదేళ్లకు పైగా సేవలు అందిస్తూ, నిబంధనలను సరిగ్గా అమలు చేస్తూ, తమను తాము నిరూపించుకున్నాయి’’అని సంజీవ్ బజాజ్ అన్నారు. దీనికి రాజేశ్వరావు స్పందిస్తూ.. ‘‘యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్‌లను ఆన్‌టాప్ విధానం కిందకు కొన్నేళ్ల క్రితం ఆర్బీఐ మార్చింది. కానీ, ఏ ఒక్క సంస్థ కూడా బ్యాంక్‌గా పనిచేసేందుకు ఆమోదం పొందలేదు’’అని చెప్పారు. ప్రవేశించడం, తప్పుకోవడానికి సంబంధించి ఎలాంటి అవరోధాలు ఎన్‌బీఎఫ్‌సీలకు లేవని, యూనివర్సల్ బ్యాంక్ ఏర్పాటుకు రూ.1,000 కోట్ల అవసరం ఉంటే, ఎన్బీఎఫ్సీ ఏర్పాటుకు ఇది రూ.10 కోట్లుగానే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్బీఎఫ్సీలు తమ నిధుల అవసరాల కోసం బ్యాంక్‌లపై ఎక్కువగా ఆధారపడకుండా ఇతర మార్కెట్ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలని రాజేశ్వరరావు సూచించారు. -
అంబానీ చేతుల్లోకి పేటీఎం వాలెట్? నిజమెంత..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలు విధించినప్పటి నుంచి పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ తరుణంలో కంపెనీ తమ వాలెట్ బిజినెస్ ముకేశ్ అంబానీకి చెందిన NBFCతో పాటు HDFC బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తీవ్ర సంక్షోభంలో ఉన్న కంపెనీ తమ వ్యాపారాన్ని ముకేశ్ అంబానీకి చెందిన కంపెనీకి విక్రయిస్తుందనే పుకార్లు వెల్లువెత్తడంతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 14 శాతం పెరిగి 288.75 రూపాయల గరిష్ఠానికి చేరుకున్నాయి. పేటీఎం వాలెట్ బిజినెస్ కొనుగోలు చేయడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జియో ఫైనాన్షియల్‌లు ముందున్నాయని, కంపెనీ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ బృందం ఈ విషయాన్నే.. గత నవంబర్ నుంచి జియో ఫైనాన్షియల్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. RBI నిషేధానికి ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మొత్తం మీద పేటీఎం వాలెట్ బిజినెస్ కొనుగోలు చేయడానికి జియో కూడా సుముఖత చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్బీఐ పేటీఎం లైసెన్స్ రద్దు చేస్తుందా.. పేటీఎంలో మనీలాండరింగ్, కేవైసీ ఉల్లంఘనల కారణంగా బ్యాంకింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేసే విషయాన్ని RBI పరిశీలిస్తోంది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించినట్లు.. ఫిబ్రవరి 29 తరువాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్ అప్‌లను స్వీకరించకూడదనే నియమాలు అమలులోకి వస్తాయా? అనేది తెలియాల్సి ఉంది. పేటీఎం సీఈఓ ఏమన్నారంటే.. ఫిబ్రవరి 29 తరువాత కూడా పేటీఎం యధాతధంగా పనిచేస్తుందని, ప్రతి సవాలుకు ఒక పరిష్కారం ఉంటుందని, దేశానికి సేవ చేయడానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటామని విజయ్ శేఖర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. పేటీఎం ఆవిష్కరణతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఆర్థిక లావాదేవీల్లో ఈ యాప్ ఇతర యాప్స్ కంటే అద్భుతంగా పనిచేస్తుండటం వల్ల ఎక్కువ మంది దీని వినియోగానికి ఆసక్తి చూపుతున్నారని, పేటీఎం కరో ఓ ఛాంపియన్‌గా నిలుస్తుందని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాద్వారా వెల్లడించారు. ఇదీ చదవండి: జేఈఈ, యూపీఎస్సీలలో ఏది కష్టం?.. ఆనంద్ మహీంద్రా ఏం చెప్పారంటే.. -
ఆశీర్వాద్ మైక్రోకు సెబీ బ్రేకులు
న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ.. మణప్పురం ఫైనాన్స్ అనుబంధ సంస్థ ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తాజాగా సెబీ బ్రేకు వేసింది. సంస్థ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను ప్రస్తుతానికి పక్కనపెట్టింది. అయితే వెబ్సైట్లో సెబీ ఇందుకు కారణాలను వెల్లడించలేదు. ఈక్విటీ జారీ ద్వారా రూ. 1,500 కోట్ల సమీకరణకు వీలుగా ఆశీర్వాద్ మై క్రో 2023 అక్టోబర్‌లో సెబీకి దరఖాస్తు చేసింది. సాధారణంగా ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన 30 రోజుల్లోగా సెబీ పరిశీలనా పత్రాన్ని జారీ చేస్తుంది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు అనుమతిస్తుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో ఆశీర్వాద్ మైక్రో పే ర్కొంది. 2008లో తమిళనాడులో ప్రారంభమైన కంపెనీ ప్రస్తుతం 1,684 బ్రాంచీలతో దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించింది. గతేడాది(2022–23)కల్లా నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 10,041 కోట్లకు చేరాయి. ఈ వార్తల నేపథ్యంలో మణప్పురం ఫైనాన్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం పతనమై రూ. 168 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 163 వద్ద కనిష్టాన్ని తాకింది. -
ఎన్బీఎఫ్సీ వృద్ధి అంతంతే..
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఇటీవల అసురక్షిత రిటైల్ రుణాల నిబంధనలు కఠినతరం చేయడంతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ)పై ప్రభావం చూపనుంది. కఠిన నిబంధనల వల్ల రుణాల మంజూరు నెమ్మదించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్బీఎఫ్సీ రంగ వృద్ధి ఒక మోస్తరుగానే ఉండనుంది. 16–18 శాతం కన్నా తక్కువే ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లో ఉత్పత్తుల్లో వైవిధ్యం, రుణాల ప్రొఫైల్ వంటివి వృద్ధి వ్యూహాల్లో కీలకంగా ఉండగలవని ఒక ప్రకటనలో తెలిపింది. పటిష్టమైన స్థూల, సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు .. రిటైల్ రుణాల వృద్ధికి ఊతమివ్వగలవని వివరించింది. రిటైల్‌గా గృహాలు, వాహనాలు, కన్జూమర్ డ్యూరబుల్స్ మొదలైన వాటిపై చేసే వ్యయాలు పటిష్టంగా ఉండటంతో ప్రైవేట్ వినియోగమనేది దీర్ఘకాలిక సగటుకు పైన కొనసాగుతోందని క్రిసిల్ రేటింగ్స్ ఎండీ గుర్ప్రీత్ చత్వాల్ తెలిపారు. అసురక్షిత రిటైల్ రుణాల నిబంధనలు కఠినతరం అయినప్పటికీ హామీతో కూడుకున్న రుణాలపై ప్రభావం ఉండబోదని పేర్కొన్నారు. ముఖ్యంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (హెచ్ఎఫ్సీ) ప్రభావం ఉండదని తెలిపారు. పటిష్టమైన అమ్మకాల దన్నుతో వాహన రుణాల విభాగం ఈ ఆర్థిక సంవత్సరం 18–19 శాతం వృద్ధి చెందగలదని వివరించారు. వచ్చే ఏడాది గృహ రుణాలు 14 శాతం అప్.. ఎన్‌బీఎఫ్‌సీల నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో (ఏయూఎం) ప్రస్తుతం గృహ, వాహన రుణాలకు చెరో 25–27 శాతం వాటా ఉన్నట్లు క్రిసిల్ తెలిపింది. ఈ రెండూ స్థిరంగా వృద్ధి చెందగలవని వివరించింది. అఫోర్డబుల్ గృహ రుణాలపై (రూ. 25 లక్షల కన్నా లోపు) హెచ్ఎఫ్సీలు ప్రధానంగా దృష్టి పెడుతుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం హోమ్ లోన్ సెగ్మెంట్ 12–14 శాతం వృద్ధి చెందగలదని క్రిసిల్ తెలిపింది. వాహన రుణాల విభాగం 2024–25 మధ్యకాలంలో స్థిరంగా 17–18 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని పేర్కొంది. ఎన్బీఎఫ్సీ ఏయూఎంలో అసురక్షిత రుణాల సెగ్మెంట్ మూడో అతి పెద్ద విభాగంగా ఉంది. మరోవైపు, బ్యాంకుల నుంచి ఎన్‌బీఎఫ్‌సీల నిధుల సమీకరణ వ్యయాలు 25–50 బేసిస్ పాయింట్ల మేర పెరగవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. అయితే, అవి ఎంత మేర బ్యాంకు రుణాలపై ఆధారపడి ఉన్నాయనే అంశంపై వాటి ఆర్థిక పనితీరు మీద ప్రభావం ఉంటుందని వివరించింది. -
సూక్ష్మ రుణాల్లో ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్‌ఐల ప్రధాన పాత్ర
కోల్‌కతా: దేశంలో సూక్ష్మ రుణాల పంపిణీలో ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్టు సూక్ష్మ రుణ సంస్థల నెట్వర్క్ (ఎంఫిన్) ప్రకటించింది. 2022–23 సంవత్సరానికి సూక్ష్మ రుణ పరిశ్రమకు (ఎంఎఫ్ఐలు) సంబంధించి నివేదికను రూపొందించి విడుదల చేసింది. 2023 మార్చి 31 నాటికి రూ.1,38,310 కోట్ల రుణాలను ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు అందించాయి. మొత్తం సూక్ష్మ రుణాల్లో ఇది 39.7 శాతానికి సమానం. సూక్ష్మ రుణాల్లో బ్యాంక్‌ల వాటా 34.2 శాతంగా ఉంది. ఇవి రూ.1,19,133 కోట్ల రుణాలను సమకూర్చాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు అందించిన సూక్ష్మ రుణాలు రూ.57,828 కోట్లుగా (16.6 శాతం వాటా) ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఎంఎఫ్‌ఐల మొత్తం పోర్ట్‌ఫోలియో (రుణాలు) రూ.3,48,339 కోట్లుగా ఉంది. ఎంఎఫ్ఐ రంగానికి అపార వృద్ధి అవకాశాలు ఉన్నాయని, 2024 మార్చి నాటికి సూక్ష్మ రుణ పరిశ్రమ పరిమాణం రూ.13 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంది. నూతన నియంత్రణలు సూక్ష్మ రుణ సంస్థల కార్యకలాపాలను బలోపేతం చేస్తాయని అభిప్రాయపడింది. కరోనా తర్వాత నిధుల వితరణ, పోర్ట్‌ఫోలియో నాణ్యత, క్లయింట్ల చేరికలో ఎంఎఫ్ఐ పరిశ్రమ బలంగా పుంజుకున్నట్టు తెలిపింది. -
చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు సిడ్బీ సాయం
ముంబై: చిన్న ఎన్‌బీఎఫ్‌సీల వృద్ధిని వేగవంతం చేసేందుకు చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బీ) ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. తద్వారా బ్యాంక్‌ల నుంచి నిధుల పొందే అర్హతను వాటికి కలి్పంచనుంది. ఈ కార్యక్రమంలో తొలుత 18 చిన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను (ఎన్బీఎఫ్సీలు) చేర్చింది. చిన్న ఎన్బీఎఫ్సీలు మరింత విస్తరించేందుకు వీలుగా, వాటి అర్హతలను పెంచేందుకు ఐదు నెలల కార్యక్రమాన్ని రూపొందించినట్టు సిడ్బీ చైర్మన్, ఎండీ శివసుబ్రమణియన్ రామన్ తెలిపారు. రిస్క్, కార్యకలాపాలు, పరిపాలన, టెక్నాలజీ తదితర అంశాల్లో నిపుణుల మార్గదర్శకత్వాన్ని వాటికి అందించనున్నట్టు చెప్పారు. దేశంలో 8 కోట్ల చిన్న వ్యాపార సంస్థలు ఉంటే, కేవలం 15 శాతం వాటికే సంఘటిత మార్కెట్ (ఇనిస్టిట్యూషన్స్) నుంచి రుణ సాయం అందుతున్నట్టు రామన్ తెలిపారు. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) రుణ వితరణ విభాగంలో భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. గడిచిన మూడేళ్లలో ఎంఎస్ఎంఈలకు సిడ్బీ రుణ వితరణ రూ.50,000 కోట్ల మార్క్‌ను అధిగమించినట్టు తెలిపారు. వ్యవస్థ మొత్తం మీద ఎంఎస్ఎంఈలకు సంబంధించి రూ.25 లక్షల కోట్ల రుణ పుస్తకం ఉండగా, వచ్చే రెండేళ్లలో రెట్టింపు అవుతుందన్నారు. ఇప్పుడున్న ఎంఎస్ఎంఈ రుణాల్లో కేవలం 28 శాతమే ఎన్బీఎఫ్సీలు సమకూర్చినవిగా తెలిపారు. తాము చేపట్టిన కార్యక్రమంలో భాగంగా.. ఎంఎస్ఎంఈలు ప్రధాన లక్ష్యంగా పనిచేసే ఎన్‌బీఎఫ్‌సీలకు సంఘటిత మార్కెట్ నుంచి నిధులు పొందే అర్హతను కలి్పంచడం ప్రధాన లక్ష్యమని రామన్ చెప్పారు. -
వారికి 6 నెలలే సమయం.. ఆర్బీఐ కీలక నిబంధనలు
అప్పుల ఎగవేతదారులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిబంధనలు ప్రతిపాదించింది. అకౌంట్లు నిరర్థకంగా మారిన ఆరు నెలల్లోపు సదరు రుణగ్రహీతలను ఉద్దేశపూర్వక ఎగవేతదారులు (Wilful Defaulters)గా ప్రకటించాలని బ్యాంకులకు, రుణ సంస్థలకు సూచించింది. (20 శాతం ట్యాక్స్.. అక్టోబర్ 1 నుంచే..) బకాయిలను చెల్లించగల సామర్థ్యం ఉండీ కూడా రుణాలు తిరిగి చెల్లించకుండా నిధులను ఇతర మార్గాలకు మళ్లీంచేవారిని ఆర్బీఐ ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారులు’ పరిగణిస్తుంది. అయితే దీనికి నిర్ధిష్ట కాల వ్యవధిని మాత్రం ఆర్బీఐ ఇంతవరకూ నిర్దేశించలేదు. ఇప్పుడు ప్రతిపాదించిన 6 నెలల కాలవ్యవధి నిబంధనలకు అనుగుణంగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFC) కూడా ఉద్దేశపూర్వక ఎగవేతదారులను ప్రకటించవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా సమీక్షా కమిటీని ఏర్పాటు చేయాలని బ్యాంకులకు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ సూచించింది. అలాగే రుణగ్రహీత రాతపూర్వకంగా సమాధానమిచ్చేందుకు 15 రోజుల సమయం ఇవ్వాలని, అవసరమైతే వ్యక్తిగతంగా విచారణకు సైత అవకాశం ఇవ్వాలని ఆర్బీఐ తన డ్రాఫ్ట్ మాస్టర్ ఆదేశాలలో పేర్కొంది. ఒక ఖాతా ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయినట్లు ప్రకటిస్తే.. తిరిగి ఆ ట్యాగ్ తొలగించిన ఒక సంవత్సరం వరకు బ్యాంకులు అదనపు రుణాలు మంజూరు చేయకూడదని ఆర్బీఐ నిర్దేశించింది. డిఫాల్ట్ అయిన ఖాతాను మరొక బ్యాంకుకు, రుణ సంస్థకు లేదా అసెట్ రీకన్‌స్ట్రక్షన్‌కు బదిలీ చేయడానికి ముందు 'విల్‌ఫుల్ డిఫాల్ట్'ని నిర్ధారించడానికి లేదా తోసిపుచ్చడానికి దానిపై విచారణ పూర్తి చేయాల్సి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అటువంటి ఖాతాలను రీస్ట్రక్చర్ చేయడానికి వీలుండదని స్పష్టం చేసింది. ముసాయిదా నిబంధనలపై వాటాదారులు అక్టోబర్ 31 వరకు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. -
కొత్త వ్యాపారంలోకి బంధన్ బ్యాంక్.. త్వరలో ఒప్పందాలు
కోల్‌కతా: కో లెండింగ్ (ఇతర సంస్థలతో కలసి రుణాలు ఇవ్వడం) వ్యాపారంలోకి తాము అడుగు పెడుతున్నట్టు బంధన్ బ్యాంక్ ఎండీ, సీఈవో చంద్రశేఖర్ ఘోష్ ప్రకటించారు. ఇందుకోసం తాము ఎన్బీఎఫ్సీలతో జట్టు కడతామని తెలిపారు. బంధన్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం గురువారం కోల్‌కతాలో జరిగింది. ఈ సందర్భంగా ఘోష్ ఈ ప్రకటన చేశారు. కో లెండింగ్ కింద అన్ని రకాల రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు. ఇప్పటికే కొన్ని ఎన్బీఎఫ్సీలను ఎంపిక చేశామని, త్వరలోనే వారితో ఒప్పందాలు చేసుకోనున్నట్టు తెలిపారు. 6,100 బ్యాంకింగ్ అవుట్లెట్లు ఎనిమిదేళ్ల క్రితం బంధన్ బ్యాంక్ తన కార్యకలాపాలు ప్రారంభించగా, నేడు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 6,100 బ్యాంకింగ్ అవుట్లెట్లు కలిగి ఉన్నట్టు చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లోని లేహ్‌లో తాజాగా ఒక శాఖను తెరవగా, సెప్టెంబర్‌లో కార్గిల్‌లో ఒకటి ప్రారంభించనున్నట్టు తెలిపారు. తమకు 3 కోట్ల కస్టమర్లు ఉన్నారని, వ్యాపారం రూ.2 లక్షల కోట్లు అధిగమించిందని వెల్లడించారు. కాసా డిపాజిట్ల రేషియో 39 శాతంగా ఉందన్నారు. బ్యాంకు లావాదేవీల్లో 94 శాతం డిజిటల్‌గా నమోదవుతున్నట్టు తెలిపారు. భౌగోళికంగా, రుణ విభాగాల పరంగా తాము మరింత వైవిధ్యాన్ని అమలు చేస్తామని, అందరికీ ఆర్థిక సేవలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్! ఇకపై మరింత.. -
ఎన్‌బీఎఫ్‌సీలకు భారీగా బ్యాంకు రుణాలు
ముంబై: బ్యాంకుల నుంచి ఎన్బీఎఫ్సీలు భారీగా నిధుల సమీకరణ చేస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకుల రుణాలు జూన్‌లో 35 శాతం పెరిగి రూ.14.2 లక్షల కోట్లకు చేరినట్టు కేర్ రేటింగ్స్ తెలిపింది. ఎన్బీఎఫ్సీలు అంతర్జాతీయ రుణాలపై ఆ ధారపడడాన్ని తగ్గించినట్టు ఇది తెలియజేస్తోందని పేర్కొంది. మొత్తం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 2022 జూన్ నాటికి ఉన్న 8.5 శాతం నుంచి ఈ ఏడాది జూన్ నాటికి 9.9 శాతానికి పెరిగినట్టు కేర్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనం జూలై 1 నుంచి అమల్లోకి వచి్చనందున.. బ్యాంకుల రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా తగ్గుతుందని అంచనా వేసింది. హెచ్డీఎఫ్సీ రుణాలు పునర్వర్గీకరణకు గురవుతాయని పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీలకు మ్యూచువల్ ఫండ్స్ డెట్ పథకాల ఎక్స్పోజర్ సై తం జూన్‌లో 14.5 శాతం పెరిగి రూ.1.62 లక్షల కోట్లకు చేరుకున్నట్టు కేర్ రేటింగ్స్ వివరించింది. బ్యాంకుల రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 2018 ఫిబ్రవరి నాటికి 4.5 శాతంగా ఉంటే, అది ఈ ఏడా ది జూన్ నాటికి 10 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. 2021–22 ద్వితీయ ఆరు నెలల కాలం నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకుల రుణాలు పెరుగుతూ వ స్తున్నట్టు కేర్‌రేటింగ్స్ వెల్లడించింది. కరోనా తర్వా త ఆరి్థక కార్యకలాపాలను తిరిగి పూర్తి స్థాయిలో తెరవడం ఇందుకు అనుకూలించినట్టు తెలిపింది. -
ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ ఐపీవో కుదింపు
ముంబై: ఎన్బీఎఫ్సీ.. ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ లక్ష్యాన్ని కుదించుకుంది. తొలుత వేసిన రూ. 1,600 కోట్లలో రూ. 400 కోట్లమేర కోత పెట్టుకుంది. వెరసి రూ. 1,200 కోట్ల సమీకరణకు సిద్ధపడుతోంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 450 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ గతేడాది నవంబర్‌లో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. ఐపీవోలో భాగంగా ప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 150 కోట్లు సమకూర్చుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఆఫర్ పరిమాణం తగ్గే అవకాశముంది. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) ఏప్రిల్–డిసెంబర్ కాలంలో రూ. 525 కోట్ల ఆదాయం సాధించింది. -
ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌కు నిధుల్లేక సుస్తీ
సాక్షి, హైదరాబాద్: నష్టాల అంచులో ఉన్న సూక్ష్మ, చిన్నపరిశ్రమలను ఆదుకుని వాటి కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం 2018లో ‘ది తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్’(టీఐహెచ్‌సీఎల్)ను ఏర్పాటు చేసింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)గా ప్రస్థానం ప్రారంభించిన హెల్త్ క్లినిక్ నిధుల కొరత ఎదుర్కొంటోంది. రూ.100 కోట్ల కార్పస్ ఫండ్‌తో హెల్త్ క్లినిక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా పదోవంతు అనగా రూ.10 కోట్లు విడుదల చేసింది. కేంద్రం నుంచి మరో రూ.50 కోట్లు, ఎంఎస్ఎంఈలు, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి రూ.40 కోట్లు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతలో రూ.10 కోట్లు విడుదల చేసినా కేంద్రం నుంచి నయాపైసా రాలేదు. మరోవైపు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి కూడా స్పందన శూన్యం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మరో రూ.10 కోట్లు విడుదల చేసింది. ఈ కొద్ది నిధులతోనే ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ నష్టాల అంచులో ఉన్న పరిశ్రమలకు కన్సల్టింగ్, కౌన్సెలింగ్, మార్గదర్శనం వంటి సేవలను అందిస్తోంది. నిధుల సేకరణ కోసం ప్రయత్నాలు పారిశ్రామికంగా శరవేగంగా పురోగమిస్తున్న తెలంగాణలో సూక్ష్మ, చిన్న పరిశ్రమలే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఉద్యమ పోర్టల్ వివరాల ప్రకారం రాష్ట్రంలో 3.25 లక్షల సూక్ష్మ, చిన్న పరిశ్రమలు నమోదయ్యాయి. అయితే కరోనా పరిస్థితుల్లో అనేక సూక్ష్మ, చిన్న పరిశ్రమలు పెట్టుబడి వ్యయం(వర్కింగ్ క్యాపిటల్) దొరక్కపోవడం, ఇతరత్రా కారణాలతో నష్టాల బాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నష్టాల అంచులో ఉన్న సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌ను ఆశ్రయిస్తున్నా నిధుల కొరతమూలంగా ఆశించిన సాయం అందడంలేదు. ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వ ఆర్థిక సంస్థ ‘జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ’(జికా)తో రుణ వితరణ ఒప్పందం కోసం ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ప్రయత్నిస్తోంది. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేసే ‘స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’(సిడ్బి)తో కూడా సంప్రదింపులు చేస్తోంది. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ కార్యకలాపాలు మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు నష్టాల అంచులో ఉన్న 45 పరిశ్రమలకు రూ.5.50 కోట్ల మేర ఆర్థిక సాయం లభించింది. నష్టాల అంచులో ఉన్న మరో 430 వరకు సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేసినట్లు సమాచారం. ఆదుకునేందుకు అన్ని రకాల ప్రయత్నం ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ కార్పస్ ఫండ్ కోసం ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాం. నష్టాల అంచు లో ఉన్న పరిశ్రమల వివరాలను బ్యాంకర్ల ద్వారా సేక రించడంతోపాటు సర్వేల ద్వారా కూడా గుర్తిస్తున్నాం. అయితే చాలా పరిశ్రమలు మూసివేతకు గురైన తర్వాతే యాజమాన్యాలు మా దగ్గరకు వస్తున్నాయి. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ కార్యకలాపాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సంబంధిత వర్గాలను కోరాం. – వెంకటేశ్వర్లు శిష్లా్ట, సీఈవో, ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ -
కార్ల అమ్మకాల్లో కార్స్24 దూకుడు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఎన్బీఎఫ్సీ విభాగం ఆకర్షణీయ ఫలితాలు సాధించనున్నట్లు సెకండ్‌హ్యాండ్(ప్రీఓన్డ్) వాహనాల ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ కార్స్24 అంచనా వేస్తోంది. వినియోగించిన కార్లకు కనిపిస్తున్న భారీ డిమాండు నేపథ్యంలో 80–100 శాతం వృద్ధిని సాధించే వీలున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఎంవో గజేంద్ర జంగిడ్ పేర్కొన్నారు. గతేడాది(2021–22) నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ) విభాగం రూ. 75 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇందుకు ప్రీఓన్డ్ కార్ల ఫైనాన్సింగ్ బిజినెస్ దోహదం చేసింది. 2019లో కంపెనీ ఎన్బీఎఫ్సీ లైసెన్సును పొందింది. తద్వారా కన్జూమర్లకు రుణాలివ్వడం ప్రారంభించినట్లు గజేంద్ర తెలియజేశారు. కంపెనీ ద్వారా విక్రయమవుతున్న ప్రతీ 2 కార్లలో ఒకదానికి ఫైనాన్స్ అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీయంగా ప్రీఓన్డ్ కార్ల విభాగంలో ఫైనాన్సింగ్ అవకాశాలు అతిస్వల్పమని వివరించారు. దీంతో ఎన్బీఎఫ్సీ లైసెన్సును తీసుకున్నట్లు వెల్లడించారు. -
ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులు రూ.54 లక్షల కోట్లు
ముంబై: ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులు 2022 మార్చి నాటికి రూ.54 లక్ష కోట్లకు చేరాయని, వాణిజ్య బ్యాంకుల బ్యాలన్స్ షీట్ పరంగా చూస్తే పావు శాతం మేర ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కృష్ణారావు కరాడ్ తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీలు కుప్పకూలిపోవడంతో, ఎన్బీఎఫ్సీ రంగం దీర్ఘకాలంగా సంక్షోభాన్ని చూడడం తెలిసిందే. దీన్నుంచి ఈ రంగం బయటకువచ్చి మెరుగైన పనితీరు చూపిస్తుండడాన్ని మంత్రి ప్రస్తావించారు. సీఐఐ నిర్వహించిన ఎన్బీఎఫ్సీ సదస్సులో భాగంగా మంత్రి మాట్లాడారు. సూక్ష్మ, మధ్య స్థాయి కంపెనీలకు రుణాలు అందించడం ద్వారా ఎన్బీఎఫ్సీలు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. ఎంఎస్ఎంఈల కార్యకలాపాల విస్తరణకు, మరింత మందికి ఉపాధి కల్పనకు ఎన్బీఎఫ్సీలు సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. బ్యాంకులతో పోలిస్తే రుణాల మంజూరులో ఎన్బీఎఫ్సీలే అధిక వృద్ధిని చూపిస్తున్నట్టు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్బీఎఫ్సీలు రుణాల పరంగా 10 శాతం వృద్ధిని చూపిస్తే, బ్యాంకుల రుణ వితరణ వృద్ధి ఇందులో సగమే ఉందన్నారు. -
ఎన్‌బీఎఫ్‌సీల కోసం క్యాష్‌ఫ్రీ డిజిటల్ సొల్యూషన్
హైదరాబాద్: నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ), వాటి భాగస్వామ్య సంస్థల కోసం కొత్తగా డిజిటల్ సొల్యూషన్‌ను ప్రవేశపెట్టినట్లు క్యాష్‌ఫ్రీ పేమెంట్స్ సీఈవో ఆకాష్ సిన్హా తెలిపారు. రుణ వితరణ, వసూళ్ల కోసం ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత డిజిటల్ లెండింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సొల్యూషన్స్ పని చేస్తుందని సిన్హా వివరించారు. రుణగ్రహీత గుర్తింపు, బ్యాంకు ఖాతా ధృవీకరణ, ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా నేరుగా రుణ గ్రహీత ఖాతాలోకే రుణాల బదలాయింపు మొదలైనవి దీనితో సులభతరం అవుతాయని పేర్కొన్నారు. -
ఎన్బీఎఫ్సీ కంపెనీలకు మంచి రోజులు
ముంబై: ఎన్బీఎఫ్సీ రంగానికి సంబంధించి క్రిసిల్ రేటింగ్స్ సానుకూల అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) వాటి ఆస్తులు నాలుగేళ్ల గరిష్ట స్థాయి అయిన 11–12 శాతం మేర వృద్ధి చెందుతాయని అంచనా వేసింది. కరోనా కారణంగా వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల పాటు ఎన్బీఎఫ్సీ ఆస్తుల వృద్ధి కుంటుపడిందని, 2021–22లో కేవలం 5 శాతం వృద్ధికి పరిమితమైనట్టు వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటి ఆస్తులు రెండంకెల స్థాయిలో పెరగొచ్చని అంచనా వేస్తూ.. అయినప్పటికీ కరోనా ముందున్న 20 శాతం వృద్ధి కంటే తక్కువేనని పేర్కొంది. బ్యాంకుల నుంచి తీవ్ర పోటీ ఉండడం, వడ్డీ రేట్ల పెరుగుదల కొన్ని విభాగాల్లో ఎన్‌బీఎఫ్‌సీల పోటీతత్వాన్ని ప్రభావితం చేస్తాయని అంచనా వేసింది. దీనివల్ల ఎన్బీఎఫ్సీలు అధిక రాబడులు వచ్చే విభాగాలపై దృష్టి సారించొచ్చని పేర్కొంది. వాహన రుణాల్లో మెరుగైన వృద్ధి.. ఎన్బీఎఫ్సీ ఆస్తుల్లో (అవి ఇచ్చిన రుణాలు) సగం మేర వాహన రుణాలే ఉంటాయి. ఇవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11-13 శాతం వరకు పెరుగుతాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. క్రితం రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ వాహన రుణాల్లో వృద్ధి 3–4 శాతంగానే ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. పునర్వినియోగ వాహన రుణాల్లో అధిక వృద్ధిని ఎన్బీఎఫ్సీలు చూస్తాయని, వీటిల్లో అధిక మార్జిన్లు ఉంటాయనే విషయాలను ప్రస్తావించింది. వాహన రుణాలు ఆశాజనకంగా ఉండడం, ఇన్ఫ్రా రంగం నుంచి వాహనాలను మార్చేందుకు బలమైన డిమాండ్ ఉంటుందని క్రిసిల్ తెలిపింది. తీవ్ర పోటీ, పెరిగే వడ్డీ రేట్ల వల్ల కొత్త వాహన రుణాల్లో బ్యాంకులు పైచేయి చూపించొచ్చని పేర్కొంది. -
ప్రస్తుత డిజిటల్ రుణాలకూ కొత్త నిబంధనలు
ముంబై: డిజిటల్ రుణాలకు సంబంధించి ఇటీవల ప్రకటించిన కొత్త నిబంధనలను, ఇప్పటికే పంపిణీ చేసిన డిజిటల్ రుణాలకు సైతం వర్తింపజేయాలని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలను ఆర్బీఐ ఆదేశించింది. ఇందుకు నవంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. అసాధారణ స్థాయిలో వడ్డీ రేట్లు, అనైతిక రుణ వసూళ్లను కట్టడి చేస్తూ నూతన నిబంధనలను ఆర్బీఐ గత నెలలో ప్రకటించింది. డిజిటల్ రుణాలకు మధ్యవర్తులుగా వ్యవహరించే ఫిన్‌టెక్ సంస్థలు కస్టమర్ల నుంచి చార్జీ వసూలు చేయకూడదని కూడా ఆదేశించింది. బ్యాంకులే ఈ చార్జీలను చెల్లించాలని నిర్దేశించింది. మొబైల్ యాప్‌లు, డిజిటల్ మాధ్యమాల ద్వారా మంజూరు చేసే రుణాలకు ఈ నూతన నిబంధనలు వర్తిస్తాయి. ఇప్పటికే తీసుకున్న డిజిటల్ రుణాలు, తాజాగా తీసుకునే వాటికి కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. ప్రస్తుత రుణాలనూ కొత్త నిబంధనల పరిధిలోకి తీసుకొచ్చేందుకు తగిన సమయం ఇస్తున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. కొత్త నిబంధనల కింద రుణాన్ని బ్యాంకు నేరుగా రుణ గ్రహీత ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ లేదా డిజిటల్ లెండింగ్ యాప్ (డీఎల్ఏ) ద్వారా రుణ దరఖాస్తు వచ్చినప్పటికీ, ఆ రుణాన్ని మంజూరు చేసే సంస్థ, నేరుగా రుణ గ్రహీతకు అందించాలి. -
పేదల నడ్డి విరుస్తున్న అడ్డగోలు వడ్డీ వసూళ్లు, ఆర్బీఐ కీలక నిర్ణయం!
ముంబై: డిజిటల్‌గా రుణాల మంజూరుకు సంబంధించి నిబంధనలను ఆర్బీఐ కఠినతరం చేసింది. ఇష్టారీతిన వడ్డీ రేట్లు వసూలు చేయడం, అనైతిక వసూళ్ల విధానాలకు చెక్ పెట్టే లక్ష్యంతో వీటిని తీసుకొచ్చింది. కొత్త నిబంధనల కింద.. బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు రుణాలను నేరుగా రుణ గ్రహీత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాల్సి ఉంటుంది. మధ్యలో రుణ సేవలను అందించే ఫిన్‌టెక్‌లు కానీ, మరో సంస్థ (మూడో పక్షం)లకు ఇందులో పాత్ర ఉండకూడదు. రుణ సేవలను అందించినందుకు మధ్యవర్తులకు ఫీజులు, చార్జీలను ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలే (బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు/ఆర్ఈలు) చెల్లించాలి. రుణ గ్రహీతల నుంచి వసూలు చేయకూడదు. ముఖ్యంగా థర్డ్ పార్టీ సంస్థల అగడాలను అరికట్టడానికి ఆర్బీఐ ప్రాధాన్యం ఇచ్చింది. రుణ ఉత్పత్తులను అడ్డగోలుగా మార్కెటింగ్ చేయడం, డేటా గోప్యతను ఉల్లంఘించడం, అనైతిక వ్యాపార విధానాలు, భారీ వడ్డీ రేట్లు, అనైతిక వసూళ్ల విధానాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను తీసుకొచ్చింది. ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలు లేదా ఇతర చట్టాల కింద అనుమతించిన సంస్థల ద్వారానే రుణాల మంజూరు కొనసాగాలన్నది ఆర్బీఐ కార్యాచరణగా ఉంది. నిబంధనల్లో ఇతర ముఖ్యాంశాలు.. ► రుణ ఒప్పందానికి ముందు రుణ గ్రహీతకు కీలకమైన వాస్తవ సమాచార స్టేట్మెంట్ (కేఎఫ్ఎస్) ఇవ్వాలని ఆర్బీఐ నిర్ధేశించింది. ఆర్బీఐ నియంత్రణల కింద పనిచేసే సంస్థలు, డిజిటల్ లెండింగ్ యాప్‌లు, వీటి కింద పనిచేసే రుణ సేవల సంస్థలు (థర్డ్‌పార్టీ) దీన్ని తప్పక పాటించాలి. ► రుణ గ్రహీత ఆమోదం లేకుండా ఆటోమేటిక్‌గా రుణ పరిమితి పెంచడాన్ని నిషేధించింది. ► డిజిటల్ రుణాలను అసలుతోపాటు, అప్పటి వరకు వడ్డీతో చెల్లించి (ఎటువంటి పెనాల్టీ లేకుండా) క్లోజ్ చేసేందుకు వీలుగా కూలింగ్ ఆఫ్/ లుక్ అప్ పీరియడ్‌ను కల్పించాలి. ► రుణ గ్రహీత తన ఫిర్యాదుపై నియంత్రిత సంస్థ 30 రోజుల్లోపు పరిష్కారం చూపకపోతే.. అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు. ► డిజిటల్ లెండింగ్ యాప్‌లు, రుణ సేవల సంస్థలు రుణ గ్రహీత అనుమతితో, కావాల్సిన వివరాలను మాత్రమే తీసుకోవాలి. డేటా వినియోగంపై రుణ గ్రహీత అనుమతి తీసుకోవాలి. ► ఫిన్‌టెక్, డిజిటల్ లెండింగ్ సేవలపై ఫిర్యాదుల పరిష్కారానికి వీలుగా నియంత్రిత సంస్థలు, వాటి కింద రుణ సేవలను అందించే సంస్థలు తగిన యంత్రాంగాన్ని కలిగి ఉండాలి. వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా అందించే రుణాలను డిజిటల్ లెండింగ్‌గా పరిగణిస్తారు. -
Foreclosure: వేలంలో ‘ప్రాపర్టీ’ కొనొచ్చా?
సొంతిల్లు ప్రతి ఒక్కరి లక్ష్యాల్లో ఒకటిగా ఉంటుంది. కానీ, మార్కెట్లో ఇళ్ల ధరలు చూస్తే.. అంత పెట్టి కొనగలమా? అనేట్టు ఉన్నాయి. మధ్యతరగతి వారు కూడా కొనలేని విధంగా కొన్ని ప్రాంతాల్లో రేట్లు ఉన్నాయంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఈ పరిస్థితుల్లో కొంచెం అందుబాటు ధరల ఇళ్లు ఎక్కడ ఉన్నాయి? కొన్నేళ్ల పాతది అయినా ఫర్వాలేదని భావించే వారికి.. ‘ఫోర్ క్లోజ్డ్’ ప్రాపర్టీలు (జప్తు చేసిన ఆస్తులు) ఒక మార్గం. బ్యాంకులు జప్తు చేసిన ఈ ఆస్తులలో తమ స్థోమతకు తగ్గట్టు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు. ఇందుకు ఏం చేయాలి? అనుసరించాల్సిన ప్రక్రియ ఏంటి? ఇందులో ఉండే లాభ, నష్టాల వివరాలను తెలియజేసేదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం... బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇళ్లు, ఫ్లాట్ల కొనుగోలుకు రుణాలు ఇస్తుంటాయి. రుణ గ్రహీతలు నెలవారీ ఈఎంఐల చెల్లింపుల్లో విఫలమైతే ఆయా ఆస్తులను బ్యాంక్‌లు స్వాధీనం చేసుకుంటాయి. నిర్ణీత కాలం పాటు రుణ వాయిదాలు చెల్లించకపోతే రుణ గ్రహీతకు నోటీసు ఇచ్చిన తర్వాత బ్యాంకులు ఈ చర్యలు చేపడతాయి. ఇలా బ్యాంకుల స్వాధీనంలోకి వెళ్లిన వాటిని ఫోర్క్లోజ్డ్ ప్రాపర్టీస్‌గా చెబుతారు. ఇలాంటి ఆస్తులకు బ్యాంకులు వేలం నిర్వహిస్తుంటాయి. వేలంలో విక్రయించగా వచ్చిన మొత్తాన్ని రుణ వసూలుగా అవి ఖాతాల్లో చూపిస్తాయి. అంటే తాము ఇచ్చిన రుణాన్ని ఈ రూపంలో అవి రికవరీ చేసుకుంటాయి. ఒక్కసారి బ్యాంక్ ఓ ఇంటిని స్వాధీనం చేసుకుందంటే.. సర్ఫేసీ చట్టం కింద దానికి యజమానిగా మారిపోతుంది. అటువంటి ఇళ్లను విక్రయించేందుకు నూరు శాతం హక్కులు వాటికి దఖలు పడతాయి. ఈ తరహా ప్రాపర్టీలను మార్కెట్లో పలుకుతున్న రేటు కంటే తక్కువకే బ్యాంకులు సాధారణంగా విక్రయిస్తుంటాయి. ఎందుకంటే తమ రుణ బకాయిలను రాబట్టుకోవడమే ఇక్కడ బ్యాంకులకు ప్రాధాన్యంగా ఉంటుంది. అంతేకానీ, మార్కెట్ రేటు కంటే మెరుగైన ధరకు విక్రయించుకుని, కాస్త లాభపడదామన్న సగటు వినియోగదారుని ధోరణి బ్యాంకులకు ఉండదు. పైగా బ్యాంకులు ప్రాపర్టీ విలువలో 70–80 శాతానికే రుణం ఇస్తాయి. అది కూడా ప్రభుత్వ రికార్డుల్లోని వ్యాల్యుయేషన్ ఆధారంగానే ఉంటుంది. మార్కెట్ రేటు ఆధారంగా రుణాలు ఇవ్వవు. ప్రాపర్టీని సగం ధరకు విక్రయించినా వాటి రుణం మొత్తం వసూలైపోతుంది. అందుకనే తక్కువ రేటుకు ఫోర్క్లోజ్డ్ ప్రాపర్టీలు లభిస్తుంటాయి. అనుకూలతలు... ప్రతికూలతలు బ్యాంకులు వేలానికి పెట్టే ఇళ్ల ధరలు మార్కెట్ రేటు కంటే తక్కువకు లభించడమే ప్రధాన అనుకూలతగా చెప్పుకోవాలి. ఎంత మేర తక్కువకు వస్తాయంటే..? కచ్చితంగా ఇంత శాతం అని కాకుండా, సంబంధిత ప్రాపర్టీ పట్టణంలోనా, పట్టణ శివారులోనా, మండల కేంద్రంలోనా అనే దాని ఆధారంగా రేట్ల వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా 20–30 శాతం వరకు మార్కెట్ రేటు కంటే చౌకగా ఇవి లభిస్తాయి. ఇంకో విషయం ఏమిటంటే రుణ బకాయి ఎంత మేరకు బ్యాంకుకు వసూలు కావాల్సి ఉందన్న అంశం కూడా ధరను నిర్ణయిస్తుంది. ఇచ్చిన రుణంలో సగమే తిరిగి రావాలనుకుంటే బ్యాంకులు ఇంకాస్త తక్కువ ధరకే వాటిని విడిచిపెట్టొచ్చు. ఇలా వేలంలో కొనుగోలు చేసే జప్తు ఆస్తులకు న్యాయపరమైన చిక్కులు దాదాపుగా ఉండవు. ఎందుకంటే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఆయా ప్రాపర్టీలకు రుణాలు ఇచ్చే ముందు న్యాయపరమైన అన్ని కోణాలను పరిశీలిస్తాయి. పైగా బ్యాంక్ వేలాలకు చట్టపరమైన రక్షణ ఉంది. ఇవి సర్ఫేసీ చట్టం, డీఆర్టీ చట్టం పరిధిలోకి వస్తాయి. బ్యాంకుల వేలంలో కొనుగోలు చేసిన వాటి బదిలీ ప్రక్రియ రెండు మూడు నెలల్లో పూర్తయిపోతుంది. యాజమాన్య హక్కులు ఒక నెలలోనే లభిస్తాయి. కాకపోతే వాటి స్వాధీనానికి మరో నెల, రెండు నెలలు పట్టొచ్చు. ∙ బ్యాంకులు స్వాధీనం చేసుకుని విక్రయించే ఇళ్ల నాణ్యత ఏ మేరకు అన్నది సందేహమే. బ్యాంకులు రుణం వసూలు కాకపోతే రుణ గ్రహీత నుంచి ప్రాపర్టీని స్వాధీనం చేసుకుని వేలం పెడతాయే కానీ, దాని వయసు ఎంత? కండీషన్ బాగుందా, లేదా, నాణ్యత ఇత్యాది అంశాలేవీ అవి పట్టించుకోవు, ఆ వివరాలను వెల్లడించవు. ఏవైనా మరమ్మతులు చేయాల్సి ఉంటే అవి వేలంలో కొనుగోలు చేసుకున్న వ్యక్తే భరించాల్సి ఉంటుంది. బ్యాంకులు చేయించి ఇవ్వవు. వాటిపై ఆ బాధ్యత కూడా ఉండదు. ఉన్నది ఉన్న స్థితిలోనే వేలం పెడుతున్నట్టు నియమ, నిబంధనల్లో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు స్పష్టంగా పేర్కొంటాయి. కనుక నాసిరకం నిర్మాణం అయితే ఆ మేరకు కొనుగోలుదారు నిరాశకు గురికావచ్చు. చూడాల్సినవి.. ముందు జాగ్రత్తలు.. జప్తు చేసిన ఇంటికి పూర్వపు యజమాని (రుణం చెల్లించలేకపోయిన) నుంచి కొన్ని బాకీలు ఉండొచ్చు. ప్రాపర్టీ పన్నులు, సొసైటీ మెయింటెనెన్స్ చార్జీలు, విద్యుత్ బిల్లులు, ఇతరత్రా ఏవైనా బకాయిలు ఉంటే వాటికి బ్యాంకులు బాధ్యత వహించవు. వేలంలో కొనుగోలు చేసిన వారే స్వయంగా ఆయా బకాయిలు తీర్చేయాల్సి ఉంటుంది. వేలానికి పెట్టిన ఇల్లు, ధర ఆకర్షణీయంగా ఉన్నాయని, ఇంకేవీ తెలుసుకోకుండా ఉత్సాహంగా పాల్గొని కొనేయడం కాకుండా.. ముందస్తుగా ఈ వివరాలు అన్నీ ఆరాతీయాలి. కనుక ప్రాపర్టీ వ్యవహారాల్లో అనుభవం ఉన్న న్యాయవాదిని సంప్రదించాలి. వారితో డాక్యుమెంట్లను తనిఖీ చేయించాలి. మరీ పాత ఇళ్లను కొనుగోలు చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. ఎందుకంటే 20–30 ఏళ్లు దాటిన ఇళ్లకు ఏమంత విలువ ఉండదు. అందులో నివాసం ఉండేట్టు అయితే పూర్తిగా నవీకరించుకోవాల్సి రావచ్చు. అందుకోసం ఖర్చు అంచనా ఉండాలి. వేలానికి వచ్చే ఇళ్లు/ఫ్లాట్లలో ఎవరైనా అద్దెకు ఉంటే, వారిని ఖాళీ చేయించుకోవాల్సిన బాధ్యత కూడా కొనుగోలుదారుపైనే ఉంటుంది. చాలా కాలంగా కిరాయిదారు ఉంటే, కొన్ని సందర్భాల్లో ఖాళీ చేసి వెళ్లిపోవడానికి నిరాకరించొచ్చు. అందుకని వేలానికి ఉంచిన ఇళ్లల్లో కిరాయిదారు ఉంటున్నట్టు అయితే వాటిని ఎంపిక చేసుకోకుండా ఉండడమే మంచి నిర్ణయం అవుతుంది. గుర్తించడం ఎలా..? జప్తు చేసిన ఆస్తులకు సంబంధించిన సమాచారం అంతగా ప్రచారంలో ఉండదు. వీటి గురించి తెలియజేసే ఓ ఏకీకృత డేటాబేస్ అంటూ లేదు. అందుకని ఫోర్ క్లోజ్డ్ ఆస్తులకు సంబంధించిన సమాచారం కోసం ప్రత్యేకంగా కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. వాటిని పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. ‘ఫోర్క్లోజర్ఇండియా డాట్ కామ్’, ఎన్‌పీఏసోర్స్ డాట్ కామ్, బ్యాంక్ ఈఆక్షన్స్, బ్యాంకుడీఆర్టీ డాట్ కామ్ పోర్టళ్లను పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే, స్థానిక పత్రికల్లోనూ బ్యాంకులు ప్రకటనలు ఇచ్చి వేలం నిర్వహిస్తుంటాయి. వీటికి సంబంధించి బ్యాంక్ శాఖల వద్ద బ్యానర్లు కూడా కనిపిస్తుంటాయి. ఎస్బీఐ అయితే తన పోర్టల్‌లోనే ఇలాంటి వేలం ఆస్తులకు ప్రత్యేక పేజీ నిర్వహిస్తోంది. బ్యాంకు శాఖలను సంప్రదించడం ద్వారా వేలానికి వచ్చే ప్రాపర్టీల వివరాలు తెలుసుకోవచ్చు. ప్రాపర్టీ ఎంపిక, వేలంలో పాల్గొనడం..? వేలానికి సంబంధించి ప్రాథమిక సమాచారం తెలుసుకున్న తర్వాత బ్యాంక్ అధికారితో కలసి జప్తు చేసిన ఇంటిని సందర్శించొచ్చు. వేలం పోర్టల్‌లో ఇంటిపై రుణం తీసుకుని చెల్లించలేకపోయిన వ్యక్తి పేరు, ప్రాపర్టీ ఏ ప్రాంతంలో ఉంది?, రిజర్వ్ ధర, వేలం తేదీ, సమయం, ముందస్తుగా చేయాల్సిన డిపాజిట్, ఇలాంటి వివరాలు అన్నీ ఉంటాయి. వేలంలో పాల్గొనాలని నిర్ణయించుకుంటే దరఖాస్తుతోపాటు, కేవైసీ డాక్యుమెంట్లను బ్యాంక్‌కు సమర్పించాలి. అలాగే బిడ్ విలువలో 5–20 శాతాన్ని వేలానికి ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. వేలం రోజున అధికంగా బిడ్ చేసిన వ్యక్తిని విజేతగా బ్యాంక్ ప్రకటిస్తుంది. సంబంధిత వ్యక్తి బిడ్ ధరలో ముందుగా చెల్లించింది మినహాయించగా, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు చెప్పిన తేదీలోపు చెల్లించాలి. దీనికి ఎంత వ్యవధి, నియమ, నిబంధనలను బ్యాంకులు ముందే ప్రకటిస్తాయి. అవసరమైతే అప్పుడు రుణ మార్గాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. కానీ, ముందుగా సంబంధిత ప్రాపర్టీకి సరిపడా తమ వంతుగా సమకూర్చుకునే సామర్థ్యం ఉంటేనే వేలంలో పాల్గొనాలి. -
ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీలకు సానుకూలం
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), గృహ రుణ సంస్థలు (హెచ్ఎఫ్సీలు) నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9-11 శాతం మేర వృద్ధిని చూస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల ఏయూఎం వృద్ధి ప్రధానంగా చివరి త్రైమాసికం (2022 జనవరి-మార్చి)లో నమోదైనట్టుగా పేర్కొంది. హెచ్ఎఫ్సీల ఆస్తులు 10 శాతం పెరగ్గా, ఎన్‌బీఎఫ్‌సీల రిటైల్ ఆస్తులు 8.5 శాతం, హోల్‌సేల్ ఆస్తులు 12 శాతం చొప్పున వృద్ధి చెందాయని బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు (ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ కంపెనీలు కాకుండా) మొత్తం మీద 9–11 శాతం మేర వృద్ధిని నమోదు చేయగలవని అంచనా వేస్తున్నట్టు ఇక్రా వివరించింది. ఈ సంస్థలు ఇచ్చిన రుణాలనే ఆస్తులుగా పరిగణిస్తారు. నిధుల మార్గాలు ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు తమ నిధుల అవసరాల కోసం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ (ఎన్సీడీలు) ఇష్యూలను చేపట్టడం అన్నది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎన్నో త్రైమాసికాల కనిష్టానికి చేరినట్టు ఇక్రా నివేదిక తెలియ జేసింది. 2021-22 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 28 శాతం తగ్గాయని, 2020-21 మొదటి త్రైమాసికంలోని ఇష్యూలతో పోల్చినా 65 శాతం తక్కువగా ఉన్నట్టు వివరించింది. ఆర్బీఐ ఈ ఏడాది మే, జూన్ నెలల్లో రెపో రేట్లు పెంచడం, ద్రవ్యోల్బణం పెరిగిన పరిస్థితుల్లో వీటి ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతగా లేదని తెలిపింది. కమర్షియల్ పేపర్ల రూపంలో నిధుల సమీకరణ గత కొన్ని నెలల్లో కొంత పుంజుకున్నట్టు పేర్కొంది. వడ్డీ రేట్లు పెరుగుతున్న క్రమం, పోటీ ఒత్తిళ్ల నేపథ్యంలో ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు మార్జిన్లను కాపాడుకు నేందుకు స్వల్పకాల నిధుల వాటాను పెంచుకోవచ్చని ఇక్రా అంచనా వేసింది. -
పెరిగిపోతున్న ఆర్ధిక నేరాలు, బ్యాంకులకు ఆర్బీఐ కీలక నిబంధనలు!
ముంబై: బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు సహా తన నియంత్రణలో ఉన్న ఇతరత్రా సంస్థలు ఆర్థిక, పరపతిపరమైన రిస్కుల్లో పడకుండా చూసేలా..ఐటీ సర్వీసుల అవుట్సోర్సింగ్కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు మొదలైనవి బోర్డు ఆమోదిత సమగ్ర ఐటీ అవుట్సోర్సింగ్ విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. ఏ కార్యకలాపాలనైనా అవుట్సోర్సింగ్కు ఇచ్చినంత మాత్రాన సదరు నియంత్రిత సంస్థ (ఆర్ఈ) తన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి కుదరదని, అంతిమంగా ఆయా అంశాలకు సంబంధించి జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. అవుట్సోర్సింగ్ సంస్థ కచ్చితంగా ఆర్ఈ ప్రమాణాలతోనే కస్టమర్లకు అందించాల్సి ఉంటుందని, అలా చేసేలా చూడాల్సిన బాధ్యత ఆర్ఈదేనని తెలిపింది. బోర్డు .. సీనియర్ మేనేజ్మెంట్ పాత్ర, క్లౌడ్ కంప్యూటింగ్ సేవల వినియోగం, సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్వోసీ) అవుట్సోర్సింగ్ మొదలైన వాటికి సంబంధించిన నిబంధనలను ముసాయిదా ప్రతిపాదనలో ఆర్బీఐ పేర్కొంది. ఆర్ఈలు పటిష్టమైన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. వీటిపై జూలై 22లోగా పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. -
అన్ని రుణాలూ భారమే
న్యూఢిల్లీ: వాహన, గృహ, వ్యక్తిగత రుణాలు మరింత భారంగా మారుతున్నాయి. ఆర్బీఐ కీలకమైన రెపో రేటు పెంచడంతో దాదాపు అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రేట్లను పెంచుతూ నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా (బీవోబీ), పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ), బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుతోపాటు హెచ్డీఎఫ్సీ ఇప్పటికే రేట్ల పెంపు అమల్లోకి తీసుకొచ్చాయి. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే స్వల్పకాల రుణాలపై వసూలు చేసే రేటునే రెపో రేటుగా చెబుతారు. ప్రస్తుతం బ్యాంకులు ఎక్కువగా రెపో ఆధారిత రేట్ల విధానాన్నే రుణాలు, డిపాజిట్లకు అనుసరిస్తున్నాయి. జూన్ 8నాటి సమీక్షలో ఆర్బీఐ అర శాతం మేర రెపో రేటును పెంచింది. దీనికి నెల ముందు 0.40 శాతం పెంచడంతో నెలన్నర వ్యవధిలోనే 0.90 శాతం రేటు పెంపు అమల్లోకి వచ్చింది. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధంతో కమోడిటీల ధరలు అదుపు తప్పాయి. అంతర్జాతీయంగా ఆహార సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ద్రవ్యోల్బణం నియంత్రణ పరిధి దాటిపోయింది. ఫలితంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ రేట్ల పెంపు బాట పట్టింది. ఒక్కో బ్యాంకు.. ► ఐసీఐసీఐ బ్యాంకు రెపో అనుసంధానిత ‘ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు’ (ఈబీఎల్ఆర్)ను 8.10 శాతం నుంచి 8.60 శాతం చేస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 8 నుంచి కొత్త రేటు అమల్లోకి వచ్చింది. ► పీఎన్బీ రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను 6.90% నుంచి 7.40% చేసింది. ► బ్యాంకు ఆఫ్ బరోడా సైతం ఆర్ఎల్ఎల్ఆర్ను 7.40 శాతానికి సవరించింది. ► ఎస్బీఐ ఈబీఎల్ఆర్ రేటును 7.05 శాతానికి సవరిస్తూ ఆర్బీఐ జూన్ పాలసీకి ముందే నిర్ణయాన్ని ప్రకటించింది. దీనికి క్రెడిట్ రిస్క్ ప్రీమియం కూడా కలిపి రుణాలపై వడ్డీ రేటును అమలు చేయనుంది. ► హెచ్డీఎఫ్సీ.. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (ఆర్పీఎల్ఆర్)ను గృహ రుణాలపై అర శాతం పెంచింది. ఇది జూన్ 10 నుంచి అమల్లోకి వచ్చింది. 20 ఏళ్ల కాల గృహ రుణాలపై ప్రతీ రూ.లక్షకు రూ.31 పెరిగినట్టయింది. ► ఇండియన్ బ్యాంకు ఆర్ఎల్ఎల్ఆర్ను 7.70 శాతానికి, బ్యాంకు ఆఫ్ ఇండియా 7.75 శాతానికి పెంచాయి. ► ఐఓబీ ఆర్ఎల్ఎల్ఆర్ను జూన్ 10 నుంచి 7.75%కి సవరించినట్టు తెలిపింది. ► బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర సైతం ఆర్ఎల్ఎల్ఆర్ను 7.20 శాతం నుంచి 7.70 శాతానికి సవరించినట్టు, ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) రుణాలపైనా 0.30% మేర రేటును పెంచింది. ► కెనరా బ్యాంకు ఏడాది ఎంసీఎల్ఆర్ను 7.35 శాతం నుంచి 7.40 శాతం చేస్తూ, జూన్ 7 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ► 2019 అక్టోబర్ 1 నుంచి రెపో, ట్రెజరీ బిల్లు ఈల్డ్ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును బ్యాంకులు అమలు చేస్తున్నాయి. అంతక్రితం ఎంసీఎల్ఆర్ విధానం ఉంది.