Police Commissionerate
-
9 అంశాల ఎజెండా !
ఇవీ ఎజెండాలోని అంశాలు ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం – కాలానుగుణ పరిస్థితులు, ఆరోగ్యం– సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య. శాంతిభద్రతలు–రక్షణ సంబంధిత సమస్యలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం.సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలకు ముందే సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 16న మంత్రులతో కలిసి కీలక సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్కమిషనర్లు, ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొంటారు. పాలనను పూర్తిస్థాయిలో పరుగులు పెట్టించే క్రమంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు సమాచారం.గత డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకసారి కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సమావేశం నిర్వహించినా, ఆ తర్వాత వెంటనే లోక్‌సభ ఎన్నికల కోడ్ రావడం, కలెక్టర్లు, ఎస్పీలంతా పూర్తిగా ఎన్నికల విధుల్లోనే నిమగ్నం కావడంతో పాలనపై దృష్టి సారించలేకపోయారు. కోడ్ ముగియడం, ఈ మధ్యనే కలెక్టర్లు, కార్యదర్శులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల బదిలీలు చేయడం ద్వారా కొత్తగా ఆయా స్థానాల్లోకి వచ్చిన అధికారులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ ప్రా«థమ్యాలపై దిశానిర్దేశం చేయడానికి ఈ సమావేశాన్ని వినియోగించుకోనున్నారు. 16న నిర్వహించే సమావేశ ఏజెండాలోని అంశాలను కూడా వారికి పంపించారు. ప్రధానంగా తొమ్మిది అంశాలను ఎజెండాలో చేర్చారు. ⇒ రాష్ట్రప్రభుత్వం అధికారంలోకి వచి్చన వెంటనే ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి, అక్కడ ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ప్రజల నుంచి విజ్ఞాపన పత్రాలు స్వీకరించడం, వాటిని సంబంధిత విభాగాలకు పంపించి అవి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.గడిచిన ఆరేడు నెలల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? వాటిలో ఏ విధమైన విజ్ఞాపనలు ఉన్నాయి? వచి్చన విజ్ఞాపనల్లో ఎన్నింటికి పరిష్కరించారు? ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? పెండింగ్‌లో ఉండడానికి గల కారణలేంటి? అన్న అంశాలను ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. ⇒ ఆర్థికంగా పెద్దగా భారం కాని పనులు కూడా పరిష్కరించకుండా ఉన్న పక్షంలో వాటిపై అధికారులకు నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వనున్నట్టు ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ⇒ భూముల సమస్యకు సంబంధించి ధరణిని రద్దు చేస్తామని, రైతులకు ప్రయోజనకరంగా ఉండే కొత్త వ్యవస్థ తీసుకొస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచి్చన సంగతి తెలిసిందే. ధరణిపై ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం నియమించిన సంగతి విదితమే. ఆ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై పూర్తిస్థాయిలో నివేదిక సిద్ధం చేసినట్టు తెలిసింది. దీనిపై కలెక్టర్ల నుంచి ఫీడ్ తీసుకొని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ⇒ వ్యవసాయ సీజన్ ప్రారంభమై దాదాపు నెలన్నర రోజులు అవుతున్న నేపథ్యంలో రైతులకు ఎరువులు, వర్షాభావ పరిస్థితులున్న చోట ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఈ సమావేశంలోనే చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ⇒ వర్షాకాలసీజన్లో వ్యాధులు ప్రబలే అవకాశం అధికంగా ఉన్నందున, ముందస్తుగా చేపట్టాల్సిన జాగ్రత్తలు గురించి ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు, ఆస్పత్రుల్లో సరైన వైద్య సదుపాయం కలి్పంచేందుకు డాక్టర్లు, సిబ్బంది, మందులు తదితర అంశాలను చర్చించనున్నారు. ⇒ వర్షాకాలంలో దాదాపు 20 కోట్ల మొక్కలను ఈసారి నాటాలని నిర్ణయించారు. కార్యక్రమం కొనసాగుతున్న తీరును కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించనున్నారు. ⇒ మహిళాశక్తి క్యాంటీన్ల ఏర్పాటు, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలని చర్చించనున్నారు.⇒ విద్యాసంవత్సరం ప్రారంభం, పాఠశాలల పరిస్థితి, వసతి గృహాలు, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల కొరత తదితర అంశాలను క్షుణ్ణంగా కలెక్టర్లతో సమీక్షిస్తారు. ⇒ ఇక శాంతిభద్రతలు, రక్షణపరమైన అంశాలతోపాటు, రాష్ట్రంలో పెరిగిపోతున్న మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాల మాట వినిపించరాదని సీఎం ఇదివరకు ఇచి్చన ఆదేశాలు మరోసారి ఈ సమావేశంలో పునరుద్ఘాటించనున్నారు. -
తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై ప్రభుత్వం సీరియస్
చెన్నై : చెన్నైలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)చీఫ్ కే.ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యతో తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయ్యింది. చెన్నై పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ రాథోర్‌ను బదిలీపై వేటు వేసింది. చెన్నై అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ లా అండ్ ఆర్డర్)గా ఉన్న అరుణ్‌ను కమిషనర్‌గా నియమించింది.ఇప్పటి వరకు చెన్నై పోలీస్ కమిషనర్‌గా ఉన్న సందీప్ రాయ్‌ని చెన్నై పోలీస్ ట్రైనింగ్ కాలేజీ డీజీపీగా ఎంపిక చేసింది. -
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు: వైజాగ్ చేరుకున్న బాధితులు
విశాఖపట్నం: కంబోడియా కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని విశాఖపట్నం పోలీసు కమిషనర్ రవి శంకర్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో ఈ కేసు సంబంధించిన విషయాలు తెలిపారు. ‘‘మొత్తం 68 మంది బాధితులను రక్షించాము. ఇంకా 90 మంది కంబోడియాలో ఉన్నారు. 68 మందిలో 25 మంది వైజాగ్ వాళ్ళూ. దేశ వ్యాప్తంగా 25 మంది ఏజెంట్లు ఉన్నారు. 12 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశాం. ఆరుగురు ఏజెంట్లుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశాము. ఈ మొత్తం స్కాంలో సిమ్ సప్లయార్స్ ముగ్గురుని గుర్తించాం. ... ఒక సిమ్ కార్డు భారత్ నుంచి తీసుకొని వెళ్లి ఇస్తే 10 నుంచి 15 వేలు కమిషన్ ఇస్తారు. నకిలీ బ్యాంక్ అకౌంట్స్.. తయారు చేస్తున్న ముఠాపై కూడా నిఘా పెట్టము. ఎమర్జెన్సీ పాస్ పోర్టు కూడా ఇండియా ఎంబసీ అధికారులు జారీ చేస్తున్నారు’’ అని తెలిపారు.కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్‌కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు.అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు. అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.ఈ నేపథ్యంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. -
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు సిట్ ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తాజాగా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. విశాఖ సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయనుంది. మరోవైపు.. ఆపరేషన్ కంబోడియా విజయవంతమైంది. 360 మంది భారతీయులను ఎంబసీ అఫ్ ఇండియా కాపాడింది. సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్: + 855 10642777 సంప్రదించాలని అధికారులు కోరారు. అయితే.. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్‌కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు. అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు.అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయాలని సీపీ రవిశంకర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జాయింట్ కమిషనర్ ఫకీరప్ప సారథ్యంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవానీప్రసాద్, సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
‘బెస్ట్ ఠాణా’లో 85 మంది బదిలీ.. సీపీ శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న 85మందిని ఒకేసారి బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఠాణాలో మొత్తం 130 మంది పనిచేస్తుండగా, ఇప్పటికే ఇన్స్పెక్టర్ బి.దుర్గారావు సస్పెండ్ అయ్యారు. తాజాగా ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ఇక్కడ పనిచేస్తున్న మహిళ సిబ్బంది సహా 85 మందిని బదిలీ చేసి సీఏఆర్(సిటీ ఆర్మ్డ్ రిజర్వు) హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో వివిధ ఠాణాల నుంచి 82 మందిని నియమించారు. దేశ పోలీస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మసకబారిన ఠాణా ప్రతిష్ట .. నగరంలోని అత్యంత కీలకమైన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ ఏ గ్రేడ్ కేటగిరీలో ఉంది. కొన్నాళ్ల క్రితం వరకు సీఎం నివాసం, క్యాంపు కార్యాలయం దీని పరిధిలోనే ఉండేవి. అనేక కీలక ప్రాంతాలు, బడా వ్యాపార సంస్థలు, జ్యువెలరీ షాపులు, పోలీసు ఉన్నతాధికారుల క్వార్టర్స్... ఇలా విస్తరించి ఉన్న ఈ ఠాణాలో ఇన్స్పెక్టర్ పోస్టింగ్‌కు భారీ డిమాండ్ ఉండేది. కొన్నిసార్లు సీఎం కార్యాలయ అధికారుల చేతిలోనే ఈ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ ఉండేది. పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు 2018లో దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్ల నిర్వహణ, పనితీరును బేరీజు వేస్తూ బెస్ట్ ఠాణా అవార్డులు ఇవ్వడాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ ఏడాది నుంచే ప్రారంభించింది. ఆ ఏడాది ఈ పోలీస్‌స్టేషన్ దేశంలోనే రెండో బెస్ట్ ఠాణాగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలోనే నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసుఅకాడమీలో శిక్షణ పొందుతున్న ఐపీఎస్‌లతో పాటు ఇక్కడ పర్యటనకు వచ్చిన వివిధ రాష్ట్రాల, దేశాల మంత్రులు, అధికారులకు ఈ మోడల్ ఠాణా చూపించేవారు. దాదాపు మూడునాలుగేళ్ల వరకు ఈ క్రేజ్ కొనసాగింది. ఇటీవల కాలంలో వరుస వివాదాలు కొందరు అధికారుల వ్యవహారశైలి, సిబ్బంది కక్కుర్తి వెరసి ఈ ఠాణా వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న వరుస ఘటనలు కూడా దీని ప్రతిష్టను మసకబారేలా చేశాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ‘రోడ్డు ప్రమాదం–ఎస్కేప్’ఎపిసోడ్లో ఠాణా ఇన్స్పెక్టర్గా పనిచేసిన బి.దుర్గారావుపై సస్పెన్షన్ వేటు పడటం, ఆయన ఇదే కేసులో నిందితుడిగా మారడంతోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇన్స్పెక్టర్ ప్రేమ్‌కుమార్ అరెస్టు కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మద్యం తాగి వాహనం నడుపుతూ ఈ పోలీసులకు చిక్కిన ఇద్దరు ఠాణా నుంచి తప్పించుకున్నారు. గత వారం మద్యం మత్తులో వాహనం నడుపుతూ బీభత్సం సృష్టించిన పాతబస్తీకి చెందిన ఓ యువకుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ నుంచి అతడు ఎస్కేప్ అయ్యాడు. ► నిందితుల అరెస్టు, నోటీసుల జారీ, కోర్టుకు తరలింపు, నాన్‌బెయిలబుల్ వారెంట్ల (ఎన్బీడబ్ల్యూ) ఎగ్జిక్యూషన్.. ఇలా ప్రతి దాంట్లో అవినీతి ఉందని ఉన్నతాధికారులు గుర్తించారు. ► గత ప్రభుత్వ పెద్దలు, నగరానికి మాజీలు అయి న ఉన్నతాధికారులకు ఈ ఠాణా నుంచి కీలక సమాచారంపై లీకులు వెళుతున్నట్టు తేలింది. సీరియస్‌గా తీసుకున్న సీపీ పంజగుట్ట పీఎస్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సమగ్ర విచారణ జరిపే బాధ్యతను డీసీపీ విజయ్‌కుమార్‌కు అప్పగించారు. పంజగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్ సహాయంతో వివిధ కోణాల్లో ఆరా తీశారు. ఈ ఠాణాలో పనిచేస్తున్న సిబ్బందిలో అత్యధికులు విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి, ఏమరుపాటు నిండిపోయాయని గుర్తించారు. ఇక్కడ పనిచేస్తున్న వారిలో దాదాపు 90 శాతం పైరవీలతో వచ్చిన వారే కావడంతో సరైన పర్యవేక్షణ కొరవడిందని వెలుగులోకి వచ్చింది. దీంతో ఒకేసారి 85 మందిని బదిలీ చేశారు. వీరిని మరో ఠాణాకు పంపకుండా పనిòÙ్మంట్ కింద సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. బదిలీ అయిన వారి స్థానంలో వివిధ ఠాణాల నుంచి 82 మంది కొత్తవారిని నియమించారు. వేటుపడిన వారిలో ఆరుగురు ఎస్ఐలు ఎనిమిది మంది ఏఎస్ఐలు, 17 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 54 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. రహీల్ ఎస్కేప్ ఎపిసోడ్లో సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ బి.దుర్గారావు పరారు కావడానికి, ఈ ఠాణా సిబ్బంది నుంచి వెళ్లిన సమాచారమే కారణమని ఉన్నతాధికారులు తేల్చారు. ఆ కేసులో నిందితుడిగా మార్చినట్టు దుర్గారావుకు ఈ ఠాణా నుంచే సమాచారం అందిందని అధికారులు ఆధారాలు కూడా సేకరించారు. -
సిటీ ట్రాఫిక్.. ఓ జీవనది
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ అనేది ఒక జీవనది అని, పరిస్థితులను బట్టి పెరగడం–తగ్గడం ఉంటాయి తప్ప.. ఆగడం, లేకపోవడం అనేది జరగదని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. దీని నిర్వహణలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నగర ట్రాఫిక్ విభాగంలో వలంటీర్లుగా (ట్రాఫిక్ ఫరిస్టే) పని చేస్తున్న వారిని హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) గురువారం సన్మానించింది. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో జరిగిన ఈ కార్యక్రమానికి హెచ్సీఎస్సీ చైర్మన్‌గా ఉన్న కొత్వాల్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కౌన్సిల్ పోలీసులకు విరాళంగా ఇచ్చిన అంబులెన్స్‌ను ప్రారంభించడంతో పాటు ఫ్రీ లెఫ్ట్ సైనేజ్ బోర్డులను ఆయన ఆవిష్కరించారు. అనివార్య కారణాలతో.. సాధారణంగా ప్రతి మెట్రో నగరంలోనూ ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని, అనివార్య కారణాల వల్ల సిటీలో ఇవి కొద్దిగా ఎక్కువని కొత్వాల్ అన్నారు. అన్ని చోట్లా సమాన వెడల్పులో ఉన్న రోడ్లు లేకపోవడం, రహదారులకు మధ్యలో ప్రార్థనా స్థలాలు ఉండటంతో పాటు రద్దీ ప్రాంతాల్లోకీ అన్ని వేళల్లో, అన్ని రకాల వాహనాలను అనుమతించడం, ఆక్రమణలు ప్రధాన కారణాలని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక అలవెన్స్ సహా అనేక రకాలుగా ప్రభుత్వ ఆదుకోవడంతో సంక్షేమం విషయంలో ముందున్నామని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు తగిన ప్రాధాన్యం ఇస్తూ అన్ని వ్యవస్థలు కలిసి పని చేయాలని, కేవలం ట్రాఫిక్ పోలీసులనే బాధ్యులుగా చూస్తారని సీపీ వ్యాఖ్యానించారు. ఉల్లంఘనులకు జరిమానా విధింపు అనేది అసలైన ఎన్ఫోర్స్మెంట్ కాదని, వాహనాలు నియంత్రణే దీని కిందికి వస్తుందని స్పష్టం చేసిన శ్రీనివాసరెడ్డి రద్దీ వేళల్లో చలాన్లు విధించవద్దని అధికారులను ఆదేశించారు. కొన్ని కీలక చర్యలపై లోతుగా అధ్యయనం... పీక్ అవర్స్‌లో అదనపు సీపీ నుంచి ప్రతి అధికారి కచ్చితంగా రోడ్డుపై ఉండి, వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలని సీపీ పునరుద్ఘాటించారు. ట్రాఫిక్ అంశంలో పాఠశాల స్థాయి నుంచి 2 వరకు చదువుతున్న వారిని భాగస్వాముల్ని చేయడం, ట్రాఫిక్ క్విజ్‌ల నిర్వహణ, ఎంపిక చేసిన రోడ్ల పైకి రద్దీ వేళల్లో వేగంగా నడిచే వాహనాల నియంత్రణ, ఆటోలపై సమగ్ర విధానం, తేలికపాటి వాహనాలకు సంబంధించి ‘సరి–బేసి’ విధానం అమలు, కార్ పూలింగ్ను ప్రోత్సహించడం సహా మరికొన్ని కీలక చర్యలపై అధ్యయనం చేస్తున్నామని కొత్వాల్ శ్రీనివాసరెడ్డి వివరించారు. ట్రాఫిక్ విభాగంలో పని చేసే వాళ్లు అన్సంగ్ హీరోలు కాదని, వారి పనిని గుర్తించి, ఆ మేరకు ఫలితాన్ని అందిస్తామన్నారు. ట్రాఫిక్ నిర్వహణలో అవగాహనకే పెద్దపీట... ప్రస్తుతం నగర ట్రాఫిక్ పోలీసులకు సహకరించడానికి దాదాపు 80 మంది ఫరిస్టేలు ఉన్నారని, ఈ సంఖ్యలో తొలి దశలో 310కి పెంచడమే లక్ష్యమని ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ఈ బాధ్యతలను స్థానిక ఇన్స్పెక్టర్లకు ఆ బాధ్యతలు ఇస్తూ ఠాణాల్లో అప్లికేషన్లు అందుబాటులో ఉంచుతామని, ఔత్సాహికులు ముందుకు వచ్చి వలంటీర్లుగా చేరాలని కోరారు. పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులని ఆయన వివరించారు. ట్రాఫిక్ నిర్వహణలో 80 శాతం అవగాహన (ఎడ్యుకేషన్), 20 శాతం చలాన్ల విధింపు (ఎన్ఫోర్స్మెంట్) పాత్రలు ఉంటాయని విశ్వప్రసాద్ అభిప్రాయపడ్డారు. -
ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో నిర్లక్ష్యం
ఖమ్మంక్రైం: రహదారి నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు అటు రవాణా శాఖ, ఇటు ట్రాఫిక్ పోలీసులు జరిమానా చలానా విధించడం పరిపాటి. అయితే, ఈ చలాన్లను ఎప్పటికప్పుడు చెల్లించకపోతే తనిఖీల్లో దొరికినప్పుడు వాహనాన్ని సీజ్ చేసే అవకాశముంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో చలాన్లు పేరుకుపోయినట్లు గుర్తించిన ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలపై 80శాతం, కార్లు, ట్రాలీలు వంటి నాలుగు చక్రాలు, లారీలు, ఇతర భారీ వాహనాల పై 60శాతం రాయితీని ప్రకటించినా చెల్లించడంలో వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. కమిషనరేట్ పరిధిలో 9లక్షల చలాన్లు ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో చాన్నాళ్లుగా చలాన్లు పేరుకుపోయాయి. ట్రాఫిక్ స్టేషన్లలో సిబ్బంది కొరత కారణంగా జరిమానా విధించడమే తప్ప వసూళ్లపై పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో చలాన్లు నానాటికీ పెరిగి 9లక్షలకు చేరాయి. వీటి చెల్లింపునకు ప్రభుత్వం భారీగా రాయితీ ప్రకటించినా వాహనదారుల నుంచి స్పందన రావడం లేదు. గతనెల 26వ తేదీ నుంచి రాయితీ అమల్లోకి రాగా బుధవారం నాటికి కేవలం 1,12,125 మంది మాత్రమే చలాన్లపై జరిమానా చెల్లించారు. వీటి ద్వారా రూ.70,13,485 ఆదాయం లభించింది. అంటే ఇంకా 7,87,875 పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, రాయితీ గడువు ఈనెల 10వ తేదీతో ముగియనున్నందున వాహనదారులు ముందుకు రావాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆతర్వాత తనిఖీల్లో దొరికితే వాహనాలు సీజ్ అవకాశముంది. అవగాహన లేమితోనే.. నిత్యం వీవీఐపీలు, వీఐపీల బందోబస్తులో నిమగ్నమవుతున్నట్రాఫిక్ పోలీసులు ప్రభుత్వం రాయితీ కల్పించిన అంశంపై వాహనదారులకు అవగాహన కల్పించలేకపోతున్నారు. దీంతో కమిషనరేట్ పరిధి లోని 9లక్షల చలాన్లలో కనీసం 20శాతం కూడా చెల్లింపులు జరగలేదు. ఈనెల 10వ తేదీతో గడువు ముగియనన్న నేపథ్యాన ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు జిల్లా వ్యాప్తంగా రాయితీపై అవగాహన కల్పించాల్సిన అవసరముంది. సకాలంలో చెల్లించండి ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్న వారు ఈనెల 10వ తేదీలోగా చెల్లించాలి. తద్వారా ప్రభుత్వం ప్రకటించిన రాయితీ వర్తిస్తుంది. మీ సేవ కేంద్రాల్లో లేదా ఆన్లైన్లో సొంతంగానూ చెల్లించవచ్చు. గడువులోగా చెల్లిస్తేనే రాయితీ వర్తిస్తుందనే విషయాన్ని వాహనదారులు గుర్తించాలి. – అశోక్, ట్రాఫిక్ సీఐ -
రంగనాథ్‌పై బదిలీ వేటు.. వరంగల్ ఇన్చార్జ్ సీపీగా దాసరి మురళీధర్
వరంగల్ క్రైం: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బదిలీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో క్రైం డీసీపీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి దాసరి మురళీధర్‌ను ఇన్చార్జ్ సీపీగా నియమించారు. గురువారం సీపీ రంగనాథ్ నుంచి దాసరి మురళీధర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏవీ రంగనాథ్ వరంగల్ పోలీస్ కమిషనర్‌గా 2022 డిసెంబర్ 3న బాధ్యతలు స్వీకరించారు. మొదటి రోజునుంచే అనేక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు, బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు క్షేత్రస్థాయిలో ఉన్న అనేక సమస్యలను స్వయంగా పరిశీలన చేసి సంబంధిత అధికారులకు పరిష్కార మార్గాలను చూపించారు. తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. భూకబ్జాదారుల గుండెల్లో రైళ్లు.. సామాన్యుల భూములను ఆక్రమించి వ్యాపారం చేసే భూకబ్జాదారుల గుండెల్లో సీపీ రంగనాథ్ రైళ్లు పరిగెత్తించారు. సుమారు 2,500కు పైగా ఫిర్యాదులను బాధితులు, ప్రజలు స్వయంగా సీపీకి అందజేశారు. ఆ ఫిర్యాదులను సీపీ.. సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతోపాటు ఏసీపీ, డీసీపీ, టాస్క్‌ఫోర్స్, ఎస్బీ విభాగాల ద్వారా విచారణ చేయించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. దీంతో భూకబ్జాలకు పాల్పడుతున్న వారు చాలామంది వెనక్కి తగ్గారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో అధికా రులు సమస్యాత్మక విషయాల్లో రెండు వర్గాలను సీపీ దగ్గర ప్రవేశపెట్టడంతో స్వయంగా పరిష్కార మార్గాలను చూపెట్టారు. మొదట్లో చాలామంది ప్రజలు సీపీ ఫొటోలకు పాలాభిషేకాలు నిర్వహించి కొత్త ఒరవడికి నాంది పలికారు. 10 నెలలు.. 24 మందిపై సస్పెన్షన్ వరంగల్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన 10 నెలల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్న 24 మంది పోలీస్ అధికారులపై సీపీ రంగనాఽథ్ సస్పెన్షన్ వేటు వేశారు. భూకబ్జాదారులకు సహకరించి నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్న పోలీస్ అధికారులను హెచ్చరించారు. పద్ధతి మార్చుకోని వారిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కమిషనరేట్‌లో ఏడుగురు ఇన్స్పెక్టర్లు, ఒక ఆర్ఐ, ఏడుగురు సబ్ ఇన్స్పెక్టర్లు, ఒక ఏఎస్సై, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులపై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో పాటు పలువురిని క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఏఆర్‌కు అటాచ్డ్ చేశారు. చిట్‌ఫండ్ యాజమాన్యాలపై కొరడా... రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మోసాలకు పాల్పడిన చిట్‌ఫండ్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. సామాన్యులను మోసం చేసి సకాలంలో చెల్లింపులు చేయకుండా డబ్బులు ఎగ్గొట్టి ఇబ్బందులకు గురిచేసిన చిట్‌ఫండ్ యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. కమిషనరేట్‌లో పలుమార్లు సమావేశాలు నిర్వహించి ప్రతి నెల చిట్టి డబ్బులను చెల్లించేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీని పర్యవేక్షణ కోసం డీసీపీ స్థాయి అధికారిని నియమించారు. సుమారు రూ.200 కోట్లకు పైగా యజామాన్యాల ముక్కుపిండి చెల్లింపులు చేయించారు. ప్రతి శుక్రవారం చిట్స్‌ఫండ్ యాజమాన్యాలు ఎంతెంత చెల్లించాయో వివరాలు తెలిపేలా ప్రత్యేకంగా వ్యవస్థను సిద్ధం చేయించారు. బండి సంజయ్ ఫిర్యాదుతోనేనా? రాష్త్రంలో పలువురు అధికారుల బదిలీ ఎలక్షన్ కమిషన్ చేసినప్పటికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాఽథ్ బదిలీ వెనక బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తన పాత్ర లేకున్నా అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారనే కోపంతో బండి సంజయ్ సీపీ బదిలీ కోసం కేంద్రంతో పట్టుబట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవల ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో పర్యటించిన సమయంలో బండి సంజయ్.. సీపీ రంగనాథ్‌పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీపీ వెంట మరికొంత మంది అధికారులు..? ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కమిషనరేట్‌లో పనిచేస్తున్న కొంతమంది అధికారులపై కూడా బదిలీ వేటు పడే అవకాశం ఉందని పోలీస్ శాఖలో పలువురు చర్చించుకుంటున్నారు. గతంలో కొంత మంది అధికారులపై కొందరు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఆ అధికారులపై ఈ సమయంలో వేటు పడే అవకాశం ఉందనే సమాచారం. 21 మంది అధికారులపై వచ్చిన అభియోగాలపై సీపీ రంగనాఽథ్ గతంలో ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చారు. పాలనపై ప్రత్యేక ముద్ర వేసిన సీపీ రంగనాఽథ్ బదిలీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిదిలో సంచలనంగా మారింది. -
బేబీ సినిమాపై హైదరాబాద్ సీపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో సంచలనాలకు నెలవైన బేబీ సినిమాపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఫైర్ అయ్యారు. సినిమా డ్రగ్స్ కల్చర్‌ను ప్రొత్సహించేలా ఉందంటూ మండిపడ్డారాయన. సినిమాలో డ్రగ్స్‌ను ప్రొత్సహించేలా సన్నివేశాలు ఉన్నాయి. ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో రైడ్లు నిర్వహించినప్పుడు.. బేబీ సినిమాలోని సీన్లలాంటివి కనిపించాయి. ఆ సినిమాను చూసే నిందితులు అలా పార్టీ చేసుకున్నారు. సినిమాల్లో అలాంటి సన్నివేశాలు పెట్టినప్పుడు.. కనీస హెచ్చరిక(కింద మూలన వేసే ప్రకటన) కూడా వెయ్యికుండా డైరెక్ట్ ప్లే చేశారు. ( బేబీ చిత్రంలోని అభ్యంతరకర సీన్లుగా చెబుతున్నవాటిని మీడియాకు ప్లే చేసి చూపించారాయన). మళ్లీ మేం హెచ్చరిస్తేనే హెచ్చరిక వేశారు. ఇందుకుగానూ.. బేబీ సినిమా టీంకు నోటీసులు జారీ చేస్తాం అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇక నుంచి ప్రతీ సినిమాపై నిఘా వేస్తామని.. అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదని నగర సీపీ స్పష్టం చేశారు. -
సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమేనా
కేయూ క్యాంపస్: కాకతీయ వర్సిటీ పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులతో కొట్టించారని, పైగా తాము కొట్టలేదని వరంగల్ పోలీస్ కమిషనర్ సమర్ధించుకోవటంపై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై లైడిటెక్టర్ పరీక్షలు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణకు సిద్ధమేనా? అని సీపీకి సవాల్ విసిరారు. ఈ నెల 5న క్యాంపస్‌లోని ప్రిన్సిపాల్ ఆఫీస్ వద్ద విద్యార్థి నాయకులు ఆందోళన చేయగా పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ సమయంలో తమను పోలీసులు కొట్టారని విద్యా ర్థులు జడ్జి ఎదుట తెలిపారు. కాగా, ఆ విద్యార్థి నాయకులను శుక్రవారం రఘునందన్‌రావు కేయూ దూరవిద్య కేంద్రం ఆవరణలో పరామర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ నమోదై ఉన్న వీసీపై విచారణ జరపాల్సింది పోయి, ఆయనతో కలసి సీపీ ప్రెస్‌మీట్ నిర్వహించటమేమిటని ప్రశ్నించారు. వీసీ, పీహెచ్డీ అవకతవకల వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పోలీసుల, ప్రభుత్వ వైఖరికి నిరసనగా 12న వరంగల్ జిల్లా బంద్ చేపట్టినట్లు తెలిపారు. కాగా, పోలీసులు తమని అరెస్ట్‌చేసి టాస్క్‌పోర్స్ పోలీసులతో కొట్టించారంటూ విద్యార్థులు గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేశారు. -
12 పెళ్లిచూపులు..కట్నం ఇవ్వనందుకు సంబంధం క్యాన్సిల్
ఎంఎస్సీ మాథ్స్ చేసి ఆన్లైన్లో లెక్కలు చెప్పే భోపాల్ యువతికి పెళ్లి కావడం లేదు. కట్నం ఇవ్వను అనడమే కారణం. ‘50 లక్షలు అడుగుతున్నారు మా నాన్న ఎక్కడ నుంచి తెస్తాడు’ అని ఆమె ప్రశ్న. ‘సంబంధం కేన్సిల్’ అనేది తరచూ వినవస్తున్న జవాబు. ఇప్పటికి 12 పెళ్లి చూపులు భగ్నమయ్యాయి. విసిగిపోయిన ఆమె పోరాటానికి దిగింది. పోలీసులకు కంప్లయింట్ చేసింది. అన్ని చోట్లా చైతన్యానికి నడుం బిగించింది. ‘ఇది రొటీన్‌గా జరుగుతోంది. ఎప్పట్లాగే నేను ట్రేలో టీకప్పులు పెట్టుకుని వస్తాను. దానికి ముందు మా అమ్మ నాకు బాగుంటుందని చెప్పి ఆకుపచ్చ డ్రస్సు తీస్తుంది. నా పళ్లు కొంచెం ఎగుడుదిగుడుగా ఉంటాయని ఎక్కువగా నవ్వొద్దని హెచ్చరిస్తుంది. టీ ట్రేతో నేను హాల్లోకి రాగానే అందరూ నన్ను ఆపాదమస్తకం శల్యపరీక్ష చేస్తున్నట్టుగా చూస్తారు. ఏం చదివావు, ఏం పని చేస్తున్నావు, వంటొచ్చా... అవే ప్రశ్నలు. ఆ తర్వాత కీలకమైన సందర్భం వస్తుంది. కట్నం ఎంత ఆశిస్తున్నారు అని మా నాన్న అడుగుతాడు. అప్పుడు పెళ్లికొడుకు తరుఫువారు ఏ యాభైలక్షలో అరవైలక్షలో లేకుంటే పెళ్ళిళ్లు జరుగుతున్నాయా అనంటారు. కొంచెం ఆలోచించండి అని మా నాన్న అంటాడు. మీ అమ్మాయి అందంగా ఉంది కాబట్టి డిస్కౌంట్ ఇవ్వొచ్చులేండి అని వారు జోక్ చేస్తారు. నాకు మాత్రం ఇదంతా చాలా అసహ్యంగా ఉంటుంది’ అంటుంది రూప. ఇది ఆమె అసలు పేరు కాదు. ఇలాంటి అమ్మాయిలు దేశమంతా ఉన్నారు. వారికి వేరే వేరే పేర్లు ఉంటాయి. కాని వారందరి సమస్య మాత్రం ఒకటే– కట్నం. నేషనల్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం మన దేశంలో 2017 నుంచి 2022 వరకు 35,493 మంది నవ వధువులు, కొత్త పెళ్లి కూతుళ్లు వరకట్న చావులకు గురయ్యారు. అంటే రోజుకు సగటున 20 మంది. అయినా కట్నం కొనసాగుతూనే ఉంది. పేరు మారిందంతే మన దేశంలో వరకట్నం 1961లో నిషేధించారు. కాని అలాంటి చట్టం ఒకటుందని సమాజం ఆనాడు పట్టించుకోలేదు.. ఈనాడూ పట్టించుకోవడం లేదు. 1980ల కాలంలో వరకట్న పిశాచం దేశాన్ని పీడించింది. ఎందరో కొత్తకోడళ్లు కిరోసిన్ స్టవ్ మంటల్లో కాలిపోయారు. ఆ తర్వాత కొంత చైతన్యం వచ్చింది. అమ్మాయిలు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్నివర్గాల ఆర్థిక స్థితి మెరుగయ్యింది. కట్నం అనే మాట వాడటం నామోషీగా మారింది. దానికి బదులుగా లాంఛనాలు అంటున్నారు. ఫార్మాలిటీస్ అంటున్నారు. ఏ మాట వాడినా ఉద్దేశం మాత్రం ఆడపిల్ల తరఫువారు మగపెళ్లి తరఫు వారికి ఆర్థికంగానో ఆస్తిపాస్తుల రూపేణానో ముట్టజెప్పాలి. అంతస్తును బట్టి ఈ లాంఛనాల స్థాయి ఉంటుంది. లక్షల నుంచి కోట్ల వరకు. కట్నం ఇవ్వను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి, భోపాల్‌లో తన కాళ్ల మీద తాను నిలబడే స్థితిలో ఉన్న రూపకు 27 ఏళ్లు వచ్చేశాయి. ఈమె తల్లిదండ్రులు ఐదారేళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నారు. కాని కట్నం కారణంగా కుదరడం లేదు. ‘మా నాన్న నూటాయాభై మంది కుర్రాళ్ల ప్రొఫైల్స్ చూసి 20 మందిని సెలక్ట్ చేశాడు. వారిలో 12 మందితో పెళ్లిచూపులు అయ్యాయి. అందరూ కట్నం అడిగేవాళ్లే. ఎవరూ 50 లక్షలకు తక్కువ లేరు. మా నాన్న అంత ఖర్చు పెట్టలేడు. అసలు కట్నం ఎందుకివ్వాలి? నేను కట్నం ఇవ్వను... కట్నం అనేది చాలా చెడ్డ ఆచారం. పెళ్లి ఖర్చులు పెట్టుకుంటాను అని ఏ అబ్బాయికి చెప్పినా నా ముందు తలాడిస్తున్నాడు కాని ఆ తర్వాత సంబంధం కేన్సిల్ అనే కబురు వస్తోంది. నా ఆత్మవిశ్వాసం మొత్తం పోయింది. మరోవైపు మా బంధువులేమో అమ్మాయి ఇప్పటికే ముదిరిపోయింది అని టెన్షన్ పెడుతున్నారు. పెళ్లి చేసుకోవాలని నాకూ ఉంది. ఒంటరిగా జీవితాన్ని లాగలేము కదా. కాని ఈ కట్నం బాధ ఏమిటి? ఎంతమంది అప్పులు చేసి, ఆస్తులు అమ్మి ఇంకా ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలి?’ అని ప్రశ్నిస్తోంది రూప. పోలీసులు పూనుకోవాలి కట్నం తీసుకోవడం శిక్షార్హం కాబట్టి పోలీసులు పూనుకొని ఈ దురాచారాన్ని నిలువరించాలని, ప్రతి పెళ్లి జరిగే మంటపాల్లో చెకింగులు చేయాలని, కట్నం తీసుకుంటున్న కొంతమందికైనా శిక్ష పడితే కట్నం డిమాండ్ తగ్గుతుందని అంటుంది రూప. ఈమేరకు ఆమె భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణ్‌ను వినతిపత్రం ఇచ్చింది. వరకట్న దురాచారం వల్ల వస్తున్న ఆర్థిక బాధల గురించి చైతన్యం రావాలని మీడియాను సంప్రదించింది రూప. ‘నేను కట్నం వద్దంటున్నానని మా అమ్మ నాతో మాట్లాడటం లేదు. కట్నం వద్దంటే జన్మలో నీ పెళ్లి చేయలేనని మా నాన్న టెన్షన్ పడుతున్నాడు. నేటి కాలంలో కట్నం ఉంటే తప్ప పెళ్లి కాని స్థితిలో ఒక యువతి ఉండటం ఎంత విషాదమో ఈ సమాజం ఆలోచించాలి’ అంటోంది రూప. ఈ స్థితికి తాము ఎంత కారణమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ పరిస్థితిలో మార్పుకోసం ప్రయత్నించాలి. -
తెరపైకి కొత్త సీపీ.. సీఎంవోలో పని చేస్తున్న పోలీస్ ఉన్నతాధికారి
ఖలీల్‌వాడి : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోస్టు ఖాళీ అయి రెండు నెలలు గడుస్తున్నా నియామకం జరగడం లేదు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోవడమే కారణంగా విమర్శలు వస్తున్నాయి. పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన కేఆర్ నాగరాజు పదవీ విరమణ చేయడంతో ఈ పోస్టు ఖాళీ అయ్యింది. నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా రెండు నెలలుగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ పోలీసు కమిషనర్ నియామకానికి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు వేర్వేరుగా ఇద్దరు పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఒకరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన పోలీస్ అధికారిని, మరొకరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారిని నియమించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇద్దరు బలమైన ప్రజాప్రతినిధులు ప్రపొజల్స్ పంపడంతో పోలీస్ ఉన్నతాధికారులు తలలు పట్టుకున్నట్లు సమాచారం. ఎన్నికల గడువు సమీపించడంతో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా వ్యవహరించే కమిషనర్ కావాలని జిల్లాలోని ప్రధాన ప్రజాప్రతినిధులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. జిల్లాలో ఎస్సై, సీఐ తదితర పోస్టులకు సదరు ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖలు లేనిదే పోలీస్స్టేషన్లలో పోస్టులు భర్తీ కావడంలేదనే చర్చ పోలీస్‌శాఖలో సాగుతోంది. ఇప్పుడు వచ్చే పోలీస్‌కమిషనర్ రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు. ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా ఉండే సీపీ ఉంటే బాగుంటుందని చర్చించినట్లు తెలిసింది. దీంతో కొత్త కొత్వాల్ కోసం మల్లాగుల్లాలు పడుతున్నట్లు సామాచారం. ఇద్దరు ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు చేసిన వారిని కాకుండా సీఎంవోలో పని చేస్తున్న పోలీస్ ఉన్నతాధికారి పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో సదరు ఐపీఎస్ అధికారి నిజామాబాద్ సీపీ పోస్టు కోసం ప్రయత్నం చేసినప్పటికీ కేఆర్ నాగరాజుకు అవకాశం లభించినట్లు తెలిసింది. దీంతో మరోసారి సదరు ఐపీఎస్ అధికారి ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇదిలా ఉండగా పోలీస్స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారులకు చెపుకుందామంటే అవకాశం లేకుండా పోయిందని పలువురు పేర్కొంటున్నారు. -
33 రోజుల్లో.. 1000 మొబైల్ ఫోన్లు
సాక్షి, హైదరాబాద్ః చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల జాడ కనిపెట్టేందుకు అమల్లోకి తెచ్చిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్) పోర్టల్ విధానం సత్ఫలితాలిస్తోంది. గత నెల ఏప్రిల్ 13వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ నూతన పోర్టల్ విధానాన్ని డీజీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. 60 మంది ట్రైనర్లకు తొలుత ఈ పోర్టల్ వాడకంపై శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏప్రిల్ 20 నుంచి ఈ సీఈఐఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి ఈ పోర్టల్ విధానంతో సోమవారం వరకు అంటే 33 రోజుల్లో వెయ్యి మొబైల్ ఫోన్ల జాడను గుర్తించడంతోపాటు వాటిని తిరిగి ఫోన్ల యజమానులకు అందించారు. వీటిలో అత్యధికంగా సైబరాబాద్ కమిషనరేట్‌లో 149, వరంగల్ కమిషనరేట్ పరిధిలో 91, కామారెడ్డి జిల్లా పరిధిలో 79 మొబైల్ ఫోన్ల జాడ కనిపెట్టినట్టు సీఈఐఆర్ నోడల్ అధికారి, సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ తెలిపారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు మొత్తం 16,011 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ విధానంలో బ్లాక్ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర పౌరులెవరైనా తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్టయితే దగ్గరలోని మీసేవా లేదా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సీఈఐఆర్ విధానంలో ఫిర్యాదు చేయవచ్చని మహేశ్ భగవత్ సూచించారు. ఇది కూడా చదవండి: GO 111: మాస్టర్‌ప్లాన్ ఇప్పట్లో లేనట్టే! -
కొత్త డీసీపీలకు పీఏల కేటాయింపు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ కమిషనరేట్ పునర్ విభజన నేపథ్యంలో కొత్తగా రెండు జోన్లు వస్తున్న విషయం విదితమే. వీటితో పాటు డివిజన్లు, ఠాణాలు అధికారికంగా ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే సౌత్ వెస్ట్ జోన్‌కు ఖారె కిరణ్ ప్రభాకర్, సౌత్ ఈస్ట్ జోన్‌కు చెన్నూరి రూపేష్‌లను డీసీపీలుగా నియమించారు. వీరికి పీఏలను సైతం కేటాయిస్తూ కొత్వాల్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సౌత్ ఈస్ట్ డీసీపీకి మీర్జా ఇమ్రాన్ ఖాన్, సౌత్ వెస్ట్ డీసీపీకి టి.వినీత్ కుమార్ పీఏలుగా నియమితులయ్యారు. సౌత్ జోన్లో పని చేస్తున్న కె.అనిల్ రెడ్డిని సెంట్రల్ జోన్ డీసీపీ పీఏగా బదిలీ చేస్తూ మంగళవారమే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పీఏలు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముగిసిన ప్రీబిడ్ సమావేశాలు సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 21 నుంచి వరుసగా మూడు రోజుల పాటు జరిగిన ప్రీ బిడ్ సమావేశాలు గురువారం ముగిశాయి. మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలోని 5 ల్యాండ్ పార్సిల్స్‌పై ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో గురువారం ప్రీబిడ్ మీటింగ్ జరిగింది. హెచ్ఎండీఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గంగాధర్, మేడిపల్లి తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, హెచ్ఎండీఏ డీఏవో శోభారాణి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామారావు, ఎమ్మెస్టీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 5, సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్ పార్సిల్స్ కొనుగోలుదారులు కోసం సిద్ధంగా ఉన్నాయి. గండిపేట మండలంలో 3, శేరిలింగంల్లి 5, ఇబ్రహీంపట్నం మండలంలో 2 చొప్పున అమ్మకానికి ఉన్నాయి. మేడిపల్లి 4, ఘట్కేసర్ 1, అమీన్పూర్ 16, ఆర్సీపురం 6, జిన్నారం మండలంలో 1 చొప్పున విక్రయించనున్నారు. మార్చి 1న ఈ మొత్తం 38 ల్యాండ్ పార్సిల్స్‌ను ఎమ్మెస్టీసీ ఆధ్వర్యంలో ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేపట్టింది. ఉస్మానియాలో హైకోర్టు అడ్వకేట్ జనరల్‌కు వైద్య పరీక్షలు అఫ్జల్‌గంజ్: రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ గురువారం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, ఆర్ఎంఓ–1 డాక్టర్ శేషాద్రిలు రక్త, జనరల్ పరీక్షలు చేయించారు. ఆస్పత్రిలో పేద రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల గురించి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఆయనకు వివరించారు. -
పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా శారదా విద్యాలయ క్రీడా మైదానం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కేజీ నుంచి పీజీ వరకూ వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్న శారదా విద్యాలయలో ఇటీవలే శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న వేడుకల్లో విశిష్ట వ్యక్తులు పాల్గొంటూ.. విద్యాలయంతో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం (జనవరి 31) జరిగిన వేడుకల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా.. తెలంగాణ రాష్ట్ర యువజన వ్యవహారాలు, పర్యాటక, సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా గౌరవ అతిథిగా పాల్గొని, క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. గ్రౌండ్లో క్రికెట్ ప్రాక్టీస్ కోసం ఐదు నెట్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు బాస్కెట్‌బాల్, వాలీబాల్ క్రీడల కోసం ప్రత్యేక కోర్టులు, అథ్లెటిక్స్ కొరకు ట్రాక్‌లను అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు, ఏంజెల్ ఇన్వెస్టర్ మరియు నోహ్ సాఫ్ట్ వ్యవస్థాపకులు శ్రీ మైనేని పాల్గొన్నారు. వీరితో పాటు శారదా విద్యాలయ ట్రస్టీ, సింథోకెమ్ ల్యాబ్స్ ఛైర్మన్ శ్రీ జయంత్ ఠాగోర్, శారదా విద్యాలయ సెక్రటరీ రామ్ మాదిరెడ్డి, కరస్పాండెంట్ జ్యోత్స్న అంగారా పాల్గొన్నారు. కాగా, నిరుపేద విద్యార్థులకు మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే మహోన్నత సంకల్పంతో వై సత్యనారాయణ గారు 1922లో శారదా విద్యాలయ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఈ విద్యాలయను నాటి హైదరాబాద్ నిజాం ప్రధానమంత్రితో పాటు భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఇక్కడ దాదాపు 1450 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. శారదా విద్యాలయకు 2018లో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డు లభించింది. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ పూర్తి.. నయా స్వరూపం ఇలా..
సాక్షి, హైదరాబాద్: సిటీ పోలీసు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణ కొలిక్కి వచి్చంది. నగరంలో కొత్తగా రెండు జోన్లు, 10 డివిజన్లు, 13 ఠాణాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో జోన్ల సంఖ్య ఐదు నుంచి ఏడుకు, డివిజన్లు 17 నుంచి 27కు, ఠాణాలు 60 నుంచి 73కు చేరనున్నాయి. ఈ మార్పు చేర్పుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కొన్ని డివిజన్లు మాయమవుతుండగా.. ఠాణాల పరిధులు మారుతున్నాయి. పక్షం రోజుల్లో వీటికి సంబంధించిన కార్యాలయాల ఎంపిక పూర్తి చేయాలని, కొత్త ఏడాది నుంచి పని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇటీవల పోలీసు విభాగానికి 3,966 పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి నుంచి సిటీకి మూడు డీసీపీ, 12 ఏసీపీ, 26 ఇన్స్పెక్టర్ సహా 1,252 పోస్టులు వచ్చాయి. గతేడాది డిసెంబర్లో నగర కొత్వాల్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వీటిలో భాగంగానే పునర్ వ్యవస్థీకరణపైనా ఆయన దృష్టి పెట్టారు. ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన తుది నివేదికకు ఇటీవలే ప్రభుత్వ ఆమోదం లభించింది. వచ్చే జనవరి 1 నుంచి పని ప్రారంభించేందుకు సీపీ ఆనంద్ సన్నాహాలు చేస్తున్నారు. ఈస్ట్ జోన్: ప్రస్తుతం సుల్తాన్‌బజార్, కాచిగూడ, మలక్‌పేట డివిజన్లు.. సుల్తాన్‌బజార్, చాదర్‌ఘాట్, అఫ్జల్‌గంజ్, కాచిగూడ, నల్లకుంట, ఉస్మానియా యూనివర్సిటీ, మలక్‌పేట, సైదాబాద్, అంబర్పేట్ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో నార్త్‌జోన్, సెంట్రల్ జోన్లలోని కొన్ని ఠాణాలు దీంట్లోకి వస్తున్నాయి. కాచిగూడ, మలక్‌పేట డివిజన్లు మాయమై అంబర్‌పేట, చిలకలగూడ, ఉస్మానియా యూనివర్సిటీ పేరు తో కొత్తవి వస్తున్నాయి. వారాసిగూడ పేరుతో కొత్త ఠాణా, చిలకలగూడ, లాలాగూడ, నారాయణగూడ ఠాణాలు ఈ జోన్లోకి వస్తున్నాయి. నార్త్‌జోన్: ఇందులో గోపాలపురం, మహంకాళి, బేగంపేట సబ్–డివిజన్లు, గోపాలపురం, తుకారాంగేట్, లాలాగూడ, చిలకలగూడ, మహంకాళి, మార్కెట్, మారేడ్‌పల్లి, కార్ఖానా, బేగంపేట, బోయిన్పల్లి, బొల్లారం, తిరుమలగిరి ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో తిరుమలగిరి కేంద్రంగా డివిజన్ ఏర్పడుతోంది. తాడ్‌బన్‌లో కొత్త ఠాణాతో పాటు మధ్య మండల నుంచి రామ్‌గోపాల్‌పేట ఈ జోన్లోకే వస్తోంది. సౌత్ జోన్: ప్రస్తుతం చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్ డివిజన్లు, చార్మినార్, బహదూర్‌పుర, కామాటిపుర, హుస్సేనిఆలం, కాలాపత్తర్, మీర్‌చౌక్, డబీర్‌పుర, మొఘల్‌పుర, రెయిన్‌బజార్, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, శాలిబండ, ఛత్రినాక, కంచన్‌బాగ్, భవానీనగర్, మాదన్నపేట, సంతోష్‌నగర్ ఠాణాలు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ జోన్లో ఉండే ఫలక్‌నుమా డివిజన్ మాయమవుతోంది. దాని స్థానంలో బహదూర్‌పుర వస్తుండగా.. పోలీసుస్టేషన్ల 11కు తగ్గుతున్నాయి. వెస్ట్ జోన్: ప్రస్తుతం పంజగుట్ట, బంజారాహిల్స్, ఆసిఫ్‌నగర్ డివిజన్లు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్‌నగర్, ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, లంగర్‌హౌస్, గోల్కొండ, టప్పాచబుత్ర, షాహినాయత్‌గంజ్, హబీబ్‌నగర్, కుల్సుంపుర, మంగళ్‌హాట్ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో ఆసిఫ్‌నగర్ డివిజన్ ఈ జోన్ నుంచి మాయమవుతోంది. దీని స్థానంలో జూబ్లీహిల్స్ పేరుతో కొత్తది వస్తోంది. మాసబ్‌ట్యాంక్, రెహ్మత్‌నగర్, ఫిలింనగర్, బోరబండల్లో కొత్త ఠాణాలు వస్తున్నాయి. వీటితో పాటు ఈ జోన్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్‌నగర్ ఠాణాలు మాత్రమే ఉంటాయి సౌత్ ఈస్ట్ జోన్: కమిషనరేట్‌లో ఆరో జోన్‌గా సౌత్ ఈస్ట్ ఏర్పడుతోంది. ఇందులో కొత్తగా ఏర్పాటయ్యే చాంద్రాయణగుట్ట, సైదాబాద్ సబ్–డివిజన్లతో పాటు ఈస్ట్ నుంచి వచ్చే మలక్‌పేట, సౌత్ నుంచి వచ్చే సంతోష్‌నగర్ డివిజన్లు ఉండనున్నాయి. ఆ రెండు జోన్ల నుంచి వేరయ్యే చంద్రాయణగుట్ట, కంచన్‌బాగ్, చాదర్‌ఘాట్, మలక్‌పేట, మాదన్నపేట, సైదాబాద్, రెయిన్‌బజార్, భవానీనగర్, సంతోష్నగర్లతో పాటు కొత్తగా బండ్లగూడ, ఐఎస్ సదన్ ఠాణాలు ఈ కొత్త జోన్లో ఉంటాయి. సౌత్ వెస్ట్ జోన్: ఏడో జోన్‌గా పరిగణించే సౌత్ వెస్ట్ మరో కొత్త జోన్‌గా అవతరిస్తోంది. ఇందులో వెస్ట్, సెంట్రల్ జోన్ల నుంచి వేరైన ఆసిఫ్‌నగర్, బేగంబజార్‌తో పాటు కొత్తగా గోల్కొండ, కుల్సుంపుర డివిజన్లు వచ్చి చేరుతున్నాయి. ఆ రెండు జోన్ల నుంచే విభజించిన ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, హబీబ్‌నగర్, బేగంబజార్, షాహినాయత్‌గంజ్, మంగళ్‌హాట్, గోల్కొండ, లంగర్‌హౌస్, కుల్సుంపుర, టప్పాచబుత్ర ఠాణాలతో పాటు కొత్తగా టోలిచౌకి, గుడిమల్కాపూర్ పోలీసుస్టేషన్లు రానున్నాయి. సెంట్రల్ జోన్: ప్రస్తుతం ఈ జోన్లో అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ డివిజన్లు.. అబిడ్స్, నారాయణగూడ, బేగంబజార్, గాంధీనగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నాంపల్లి, రామ్‌గోపాల్‌పేట, సైఫాబాద్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. తాజా మార్పు చేర్పులతో గాం«దీనగర్ డివిజన్‌గా ఏర్పడుతోంది. దోమలగూడ, లేక్ పోలీసు, ఖైరతాబాద్‌ల్లో కొత్త ఠాణాలు ఏర్పాడుతున్నాయి. నారాయణగూడ, బేగంబజార్, నాంపల్లి, రామ్‌గోపాల్‌పేట్ ఠాణాలు ఈ జోన్లో ఉండవు. -
హైదరాబాద్‌లో మరికొందరు ‘పోలీస్ దొంగ’లు!.. విమానాల్లో తిరుగుతూ సెటిల్మెంట్లు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ మేకల ఈశ్వర్ వ్యవహారంతో నగర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సిటీలో ఈ తరహా దందాలకు పాల్పడుతున్న ‘పోలీసు దొంగ’ల్లో మరో ముగ్గురిని గుర్తించారు. వీరిలో ఇద్దరు నగర కమిషనరేట్‌లో పని చేస్తుండగా... మరొకరు సైబరాబాద్‌లో ఉన్నట్లు తెలిసింది. వీరి వ్యవహారాలకు సంబంధించిన నివేదికలు అందిన తర్వాత చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ అధికారులకు సహకరించిన, సహరిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్ల వ్యవహారాన్నీ సీరియస్‌గా తీసుకున్నారు. సమాచారంతో మొదలై సహవాసం వరకు... పోలీసులకు, దొంగలకు మధ్య పరిచయాలు ఉండటం కొత్త విషయం కాదు. వీరికి సమాచారం ఇచ్చే వారిలో పాత నేరగాళ్లే ఎక్కువగా ఉంటారు. ఎంత ఎక్కువ మంది నేరగాళ్లతో పరిచయాలు ఉంటే అంత ఎక్కువ సమాచారం అందుతుంది. ఈశ్వర్ సహా నగరంలో పని చేస్తున్న/చేసిన ముగ్గురు ఇన్స్పెక్టర్లు సమాచారం స్థాయిని దాటి సహవాసం వరకు వెళ్లారు. వీళ్లలో కొందరు పిక్ పాకెటింగ్, స్నాచింగ్స్ గ్యాంగ్స్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు ఏకంగా వారికి సంబంధించిన సెటిల్మెంట్లు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. జేబు దొంగలకు చెందిన ఓ బడా నాయకుడు ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. అతడు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఓ అధికారి వెళ్లి పరామర్శించడంతో వారి మధ్య సంబంధం బయటపడింది. పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్‌ను పట్టుకున్న ఠాణాలు, ప్రత్యేక విభాగాల వద్దకు వెళ్లే మరో అధికారి వాళ్లను అరెస్టు చూపకుండా వదిలేసేలా పైరవీలు చేయడంలో సిద్ధహస్తుడిగా మారాడు. విమానాల్లో తిరుగుతూ సెటిల్మెంట్లు... ప్రస్తుతం సైబరాబాద్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి ఈ వ్యవహారాల్లో సిద్ధహస్తుడు. తన మాట వినని, తన గ్యాంగ్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న ముఠాలను అరెస్టు చేయడంతోనే ఇతడి సక్సెస్ రేటు పెరిగిపోయింది. ఈ సక్సెస్‌ను మాత్రమే చూసిన ఉన్నతాధికారులకు ఇప్పుడిప్పుడే అతడి పూర్తి వ్యవహారాలు తెలుస్తున్నాయి. అంతర్రాష్ట్ర పిక్ పాకెటింగ్ ముఠాలో ఈ అధికారికి సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఏ నగరంలోని పోలీసులకు వీరు చిక్కితే ఈయనే వెళ్లి విషయం సెటిల్ చేసి వచ్చేవాడు. దీనికోసం లీవ్ కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా విమానాల్లో వెళ్లి వస్తూ పని పూర్తి చేసేవాడు. నగరంలో సుదీర్ఘకాలం పని చేసిన ఈయన ఎప్పుడూ ఫోకల్ పోస్టు కోసం ప్రయత్నించలేదు. కేవలం ఠాణాల్లోని డిటెక్టివ్, క్రైమ్ వింగ్స్‌లో పని చేయడానికే పైరవీలు చేసుకునేవాడు. ఈశ్వర్‌తో పాటు అలాంటి వ్యవహారాలు చక్కబెట్టిన కొందరు కానిస్టేబుళ్లకు అధికారులు సహకారాలు అందిస్తూ వారిని బందోబస్తు డ్యూటీలకు దూరంగా ఉంచేవారని తెలిసింది. అంతర్జాతీయ చోరీ ఫోన్ల నెట్‌వర్క్‌లో ఈశ్వర్.. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలు కూడా ఈశ్వర్‌కు ఆ పరిధిలోని ఠాణాలో పోస్టింగ్ వచ్చాక క్రైమ్ ప్రోన్ ఏరియాలుగా మారిపోయేవని తెలిసింది. ఆ పోలీస్ స్టేషన్లో ఉండే మార్కెట్లు, అనువైన ప్రాంతాలను గుర్తించే ఇతగాడు తన గ్యాంగ్స్‌ను దింపి నేరాలు చేయించేవాడు. ఇలా కొందరు దొంగలను తమ కంట్రోల్లో పెట్టుకోవడం, రికవరీల్లో సెటిల్మెంట్లు చేయడంలో ఈశ్వర్‌తో పాటు మరికొందరూ నిష్ణాతులని తెలుస్తోంది. చోరీ ఫోన్లు ట్రాక్ కాకుండా ఉండటానికి ఈశ్వర్ అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. తన గ్యాంగ్ ద్వారా తన వద్దకు చేరిన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లు క్లోనింగ్ చేసేవాడు. అలా కుదరని పక్షంలో బయటి దేశాలకు... ప్రధానంగా నేపాల్‌కు పంపేవాడని సమాచారం. గతంలో ఈశ్వర్‌తో పాటు ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారి ఒకే ఠాణాలో పని చేశారు. అçప్పట్లోనూ ఈ గ్యాంగ్స్ నిర్వహణ, సెటిల్మెంట్లకు సంబంధించి ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయి. చదవండి: Viral: కుటుంబంతో సేదతీరేందుకు వ్యవసాయక్షేత్రంలో రెడీమేడ్ ఇల్లు -
ప్రారంభానికి సిద్ధం చేయాలి
మర్కూక్(గజ్వేల్): మర్కూక్ పోలీస్ స్టేషన్ అవరణలోని నూతనంగా నిర్మించిన పోలీస్ కాంప్లెక్స్ భవనాలను ప్రారంభానికి సిద్దం చేయాలని పోలీస్ కమిషనర్ శ్వేత తాదేశించారు. శుక్రవారం ఆమె భవనాలను సందర్శించారు. కాంప్లెక్స్ భవనాల పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఏసీపీ, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఏసీపీ రమేశ్, డీఈ రాజయ్య, కాంట్రాక్టర్ ప్రసాద్‌రావు, సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
నేను..సీవీ ఆనంద్‌ను మాట్లాడుతున్న..
బంజారాహిల్స్: తన నివాసిత ప్రాంతం చుట్టుపక్కల రాత్రిపూట శబ్ద కాలుష్యం నెలకొందని చర్యలు, తగిన తీసుకోవాల్సిందిగా నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ 100కు డయల్ చేశారు. దీంతో పోలీసులు కొద్దిసేపట్లోనే ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీని ఆనుకొని ఉన్న ప్లజెంట్ వ్యాలీలో నగర పోలీస్ కమిషనర్ ఆనంద్ ఉంటున్నారు. శుక్రవారం రాత్రి 10.50 గంటల ప్రాంతంలో డప్పుల హోరుతో శబ్ద కాలుష్యం పెరగడంతో ఆయన వెంటనే 100కు డయల్ చేశారు. నైట్‌డ్యూటీలో ఉన్న జూబ్లీహిల్స్ డీఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్ అక్కడికి వెళ్లి పరిశీలించగా సమీపంలోని ఓం నగర్ బస్తీలో తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తూ డప్పులు వాయిస్తున్నట్లుగా గుర్తించారు. వెంటనే నిర్వాహకులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని 70బి కింద పెట్టీ కేసు నమోదు చేశారు. సమస్యను అక్కడికక్కడే పరిష్కరించారు. స్వయంగా సీపీ 100కు డయల్ చేయడం అధికారులు, సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. (చదవండి: పెట్స్.. అదో స్టేటస్! ) -
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు ఐఎస్వో గుర్తింపు
కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం (సీపీవో)కు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్వో) గుర్తింపు లభించింది. ఆ సంస్థ ప్రతినిధులు శనివారం పోలీస్ కమిషనర్ సత్యనారాయణకు ధ్రువీకరణపత్రం అందజేశారు. కమిషనరేట్ పరిధిలో పోలీసుల పనితీరు, పరిశుభ్రత, సదుపాయాలు, బాధితులకు త్వరితగతిన సమస్యలు పరిష్కరించడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ఐఎస్వో 9001 సర్టిఫికెట్‌కు ఎంపిక చేశారు. కాగా, కమిషనరేట్ పోలీస్ కార్యాలయం (సీపీవో) విభాగంలో తెలుగు రాష్ట్రాల్లోనే కరీంనగర్ కమిషనరేట్ ఎంపికై మేటిగా నిలవడం ప్రత్యేకం. ఈ సందర్భంగా కమిషనరేట్‌లో విలేకరుల సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ ఐఎస్వో గుర్తింపునకు ఎంపికవడం బాధ్యతను మరింత పెంచిందన్నారు. మరిన్ని సమర్థవంతమైన సేవలందించేందుకు ఈ గుర్తింపు దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్.శ్రీనివాస్ (ఎల్‌అండ్‌వో) జి.చంద్రమోహన్ (పరిపాలన), ఏసీపీలు తుల శ్రీనివాసరావు, విజయ్‌కుమార్, సి.ప్రతాప్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి మునిరత్నం పాల్గొన్నారు. -
ఇక అరెస్టులు ఉండవు.. తిప్పి పంపుడే: కమిషనర్ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమంగా నివసిస్తున్న ఆఫ్రికన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. వీరు చిక్కినప్పుడు అరెస్టు చేస్తే వస్తున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని డిపోర్టేషన్ (బలవంతంగా తిప్పి పంపడం) విధానానికి శ్రీకారం చుట్టారు. ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) సాయంతో తొలిసారిగా ఐదుగురిపై ఈ ప్రక్రియను అనుమతి పొందారు. వీరిని బుధవారం నగర పోలీసు కార్యాలయం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పంపారు. ఈ నేపథ్యంలో హెచ్–న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ ఆనంద్ వివరాలు వెల్లడించారు. అరెస్టు చేస్తే నేరాలకు ఊతమే... నైజీరియా, సోమాలియా, టాంజానియా, ఐవరీ కోర్టు వంటి ఆఫ్రికన్ దేశాల నుంచి అనేకమంది వివిధ రకాలైన వీసాలపై హైదరాబాద్ వస్తున్నారు. వీరిలో అనేక మంది వీసా, పాస్‌పోర్టుల గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్నారు. గతంలో ఇలా ఉంటూ చిక్కిన వారిపై ఫారెనర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసేవాళ్లు. కోర్టులో దీని విచారణ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్ చేయడానికి ఆస్కారం లేదు. ఈ మధ్య కాలంలో బెయిల్‌పై బయటకు వచ్చే ఆ ఆఫ్రికన్లు సైబర్ నేరాలు, డ్రగ్స్ విక్రయం చేపట్టడంతో కొత్త తల నొప్పులు వచ్చేవి. ఇలాంటి వారిలో కొందరు నగరంతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో ఉన్న ఈశాన్య రాష్ట్రాల యువతులతో సహజీవనం చేస్తూ వారి ఇళ్లల్లోనే నివసిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, గుర్తింపుకార్డులు, వీసాలు తయారు చేసుకుని వీటి ఆధారంగా బ్యాంక్ ఖాతాలు తెరవడం, ఆధార్ కార్డులు పొందడం చేస్తున్నారు. అత్యంత సమస్యాత్మక వ్యక్తులైన వీరి ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటోంది. ఎఫ్ఆర్ఆర్ఓ సాయంతో డిపోర్టేషన్... ఈ పరిణామాలను గమనించిన సీవీ ఆనంద్ డిపోర్టేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఇటీవల హెచ్–న్యూ అధికారులు డ్రగ్స్ కోసం ఆíఫ్రికన్ల ఉంటున్న ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. ఇన్స్పెక్టర్లు పి.రాజేష్, పి.రమేష్ రెడ్డిలు తమ బృందాలతో రెండు నెలల క్రితం బంజారాహిల్స్‌లోని పారామౌంట్‌కాలనీలో సోదాలు చేశారు. అక్రమంగా నివసిస్తున్న ఆంటోనీ సన్డే (నైజీరియా), కోనే మౌసా (ఐవరీ కోస్టు), ఆసూయ్ విలియం డెకోస్టేరియా (ఐవరీ కోస్టు), ఒబేరా పీటర్ (నైజీరియా), ఒమెజోరియా కింగ్స్లే (నైజీరియా) చిక్కారు. వీరి వివరాలు ఎఫ్ఆర్ఆర్ఓకు పంపి మూవ్మెంట్ రిస్ట్రెక్షన్ ఆర్డర్ పొంది సీసీఎస్‌లోని డిపోర్టేషన్ సెంటర్లో ఉంచారు. ఆయా ఎంబసీలకు సమాచారం ఇచ్చి వీరి గుర్తింపులు, ఢిల్లీ కార్యాలయం నుంచి టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్లు పొందారు. ఈ ఐదుగురికీ విమాన టిక్కెట్లు ఖరీదు చేసిన సిటీ పోలీసులు ఖతర్ ఎయిర్వేస్ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్, ఎఫ్ఆర్ఆర్ఓ నుంచి ఎగ్జిట్ పర్మిట్ తీసుకున్నారు. వీటి ఆధారంగా బుధవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి డిపోర్ట్ చేశారు. దీంతో వీళ్లు మరోసారి భారత్‌లో అడుగుపెట్టడానికి ఆస్కారం ఉండదు. 750 మంది అక్రమంగా ఉంటున్నారు హైదారాబాద్ ఎఫ్ఆర్ఆర్ఓ ద్వారా 2900 మంది ఆఫ్రికన్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 750 మంది వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉండిపోయారు. వీళ్లు నగరంలో ఉన్నారా? ఇతర ప్రాంతాలకు వెళ్లారా? అనేది ఆరా తీస్తున్నాం. ఇలాంటి వారిని గుర్తించడానికి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు ప్రారంభిస్తాం. ఇకపై చిక్కిన వాళ్లంతా డిపోర్టేషన్ కావాల్సిందే. ఇళ్ల యజమానులు సైతం వీసా, పాస్‌పోర్టు చూడకుండా అద్దెకు ఇవ్వద్దు. అనుమానం ఉంటే పోలీసుల సహాయం తీసుకోండి. – సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ చదవండి: బీజేపీ జాతీయ సభ.. షెఫ్‌లకు యాదమ్మ ‘వంటల’ పాఠాలు! -
సిటీలో డీడీసీ... మాదకద్రవ్యాలపై స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో కొన్ని రోజులుగా మాదక ద్రవ్యాలపై స్పెషల్ డ్రైవ్ నడుస్తోంది. శాంతిభద్రతల విభాగం అధికారులతో పాటు టాస్క్‌ఫోర్స్, హెచ్– న్యూ వంటి ప్రత్యేక విభాగాలూ డ్రగ్స్‌ను పట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు వీటిని భద్రపరచడమనేది పోలీసులు పెద్ద తలనొప్పిగా ఉండేది. ఇటీవల మాదకద్రవ్యాల నిరోధక చట్టంలో (ఎన్డీపీఎస్ యాక్ట్) కేంద్రం కీలక సవరణలు చేసింది. దీని ఆధారంగా నిర్ణీత సమయం తర్వాత డ్రగ్స్‌ను ధ్వంసం చేయడానికి ఆస్కారం ఏర్పడింది. అందుకు అనుమతి జారీ చేయడానికి సిటీలో డ్రగ్ డిస్పోజల్ కమిటీని (డీడీసీ) ఏర్పాటు చేస్తూ కొత్వాల్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కీలక సవరణ చేసిన కేంద్రం... ఇలా పోలీసుస్టేషన్ల అధీనంలో ఉన్న మాదకద్రవ్యాల అమ్మకాలు జరగడం, కొందరు పోలీసులే వాటిని వినియోగించడం, అమాయకులపై కేసుల నమోదుకు వీటిని వినియోగించడం వంటి ఉదంతాలు ఉత్తరాదిలో చోటు చేసుకున్నాయి. డ్రగ్‌ను ఎలుకలు తినేశాయని, కింది పడిపోయిదని రికార్డుల్లో పొందుపరిచి ఇలా దుర్వినియోగం చేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్డీపీఎస్ యాక్ట్‌కు కీలక సవరణ చేసింది. దీని ప్రకారం మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసు అప్పీల్ సమయం ముగిసే వరకు వాటిని భద్రపరచాల్సిన అవసరం తప్పింది. వీటిని ధ్వంసం చేయడానికి విధివిధానాలను రూపొందించింది. గంజాయి సహా పోలీసులు స్వాధీనం చేసుకున్న ప్రతి మాదకద్రవ్యం శాంపిల్‌ను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (ఎఫ్ఎస్ఎల్) పంపిస్తారు. వీళ్లు ధ్రువీకరిస్తూ, నివేదిక ఇస్తేనే న్యాయస్థానం స్వాధీనం చేసుకున్నది మాదకద్రవ్యంగా అంగీకరిస్తుంది. ఇలా ఈ రిపోర్టు వచ్చే వరకు మాత్రమే ఆ డ్రగ్‌ను భద్రపరచాలి. ఎఫ్ఎస్ఎల్ నుంచి అందిన నివేదికను కోర్టులో సమర్పించే పోలీసులు దాంతో పాటు తాము స్వాధీనం చేసుకున్న డ్రగ్‌ను తీసుకువెళ్తారు. ఇందులోంచి కొంత మొత్తం తీసి భద్రపరచమని ఆదేశించే న్యాయమూర్తులు మిగిలింది ధ్వంసం చేయడానికి అనుమతి ఇస్తారు. రాంకీ ప్లాంట్‌లో ధ్వంసానికి యోచన.. ఇలా అనుమతి వచ్చిన తర్వాత ఆ డ్రగ్స్‌ను ధ్వంసం చేయడానికి పోలీసులకు ఆస్కారం వస్తుంది. అయితే ఎవరికి వారుగా ఈ పని చేసుకుంటూపోతే జవాబుదారీతన కొరవడటంతో పాటు దుర్వినియోగానికి, అవకతవకలకు ఆస్కారం ఉంటుంది. దీని పర్యవేక్షణ కోసమే ప్రత్యేకంగా డీడీసీని ఏర్పాటు చేశారు. నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) సంయుక్త పోలీసు కమిషనర్ గజరావ్ భూపాల్ నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుంది. సీసీఎస్ అదనపు డీసీపీ (పరిపాలన) స్నేహ మెహ్రా, ఏసీపీ కె.నర్సింగ్‌రావు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మాదకద్రవ్యాలను ఎక్కడపడితే అక్కడ ధ్వంసం చేస్తే పర్యావరణంతో పాటు స్థానికుల పైనా అనేక దుష్ఫరిణామాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయా ఏజెన్సీలు నగర శివార్లలో రాంకీ సంస్థ నిర్వహిస్తున్న యూనిట్లో నిపుణుల పర్యవేక్షణలో ఈ డ్రగ్స్‌ను ధ్వంసం చేస్తున్నాయి. సిటీ పోలీసులూ ఇదే యూనిట్‌ను వాడాలని యోచిస్తున్నారు. ఠాణాల్లో పేరుకుపోయేవి.. గతంలో అమలులో ఉన్న ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం పోలీసులు స్వా«ధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను చాలా కాలం వరకు భద్రపరచాల్సి వస్తోంది. నగరంలో చిక్కుతున్న వాటిలో ఇతర డ్రగ్స్ కంటే గంజాయి ఎక్కువగా ఉండేవి. ఈ నేపథ్యంలో పోలీసుస్టేష్లలోని మాల్ఖానాలు (అధికారిక గోదాములు) మొత్తం వీటితో నిండిపోయేవి. మాదకద్రవ్యానికి సంబం«ధించిన కేసు విచారణ కోర్టులో పూర్తి కావడానికి కొన్నేళ్లు పట్టేది. ఆ తర్వాత అప్పీల్ చేసుకోవడానికి మరికొంత సమయం ఉండేది. అంటే ఈ కేసులో దోషులుగా తేలిన వాళ్లు, నిర్దోషులుగా తేలితే పోలీసులు ఆ తీర్పును సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడాన్ని అప్పీల్ అంటారు. ఈ సమయం ముగిసే వరకు ఆ మాకద్రవ్యాన్ని కేసు నమోదై ఉన్న పోలీసుల అధీనంలో ఉంచుకోవాల్సి వచ్చేది. సిటీలో డ్రగ్స్‌ను, నిందితులను శాంతిభద్రతల విభాగం, టాస్క్‌ఫోర్స్, హెచ్–న్యూ అధికారులు పట్టుకుంటారు. దీనికి సంబంధించిన కేసులు మాత్రం స్థానికంగా శాంతిభద్రతల విభాగం ఠాణాలోనే నమోదు చేస్తారు. ఈ కారణంగానే ఠాణాల మాల్ఖానాలన్నీ గంజాయితో నిండిపోయేవి. (చదవండి: ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ సక్సెస్ చేస్తాం ) -
చలో విజయవాడకు అనుమతి లేదు
విజయవాడ: ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఈ నెల 25వ తేదీన విజయవాడలో నిర్వహించ తలపెట్టిన చలో విజయవాడ, సీఎం కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి అనుమతి మంజూరు చేయలేదని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. నగరంలో 30 పోలీస్ యాక్ట్, 144 సీఆర్పీసీ ఆంక్షలు అమలులో ఉన్నాయని తెలిపారు. ఈ నిబంధనలు అతిక్రమించవద్దని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు సూచించారు. ఈ ఆంక్షలు ఉల్లగించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పలువురికి ముందస్తుగా నోటీసులు ఇచ్చామన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని చలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించుకోవాలని సూచించారు. -
హైదరాబాద్‌లో కొత్తగా రెండు జోన్లు, 13 పోలీస్ స్టేషన్లు.. ఏయే ప్రాంతాల్లో అంటే...
సాక్షి, హైదరాబాద్: సిటీ పోలీసు కమిషనరేట్‌కు 175 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది ఏర్పాటైన నాటి నుంచి పలుమార్లు చిన్నచిన్న మార్పులతో పునర్వ్యవస్థీకరణ జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గతానికి భిన్నంగా భారీ రీ– ఆర్గనైజేషన్‌కు కసరత్తు పూర్తయింది. కొత్తగా రెండు జోన్లు, 13 పోలీసుస్టేషన్లతో పాటు వాటికి తగ్గట్టు సబ్–డివిజన్లను ప్రతిపాదిస్తూ ప్రత్యేక కమిటీ తయారుచేసిన ప్రతిపాదనలు సోమవారం ప్రభుత్వానికి చేరాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం సర్కారు ఆమోదముద్ర వేయనుంది. ఈమేరకు ఉత్తర్వులు వెలువడితే నగరంలో జోన్ల సంఖ్య 7కు, పోలీసు స్టేషన్లు 73కు చేరనున్నాయి. ఇదీ చరిత్ర.. ► హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ 1847లో ఏర్పడింది. అప్పట్లో నిజాం స్టేట్‌కు హైదరాబాద్ రాజధాని కావడంతో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, జరిగిన నేరాలను కొలిక్కి తీసుకురావడం తదితర విధులతో దీన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం, హైదరాబాద్ సంస్థానం విలీనం అనంతరం తొలిసారిగా 1955లో నగర పోలీసు పునర్వ్యవస్థీకరణ జరిగింది. అప్పటి మద్రాస్ సిటీ పోలీసు విధానాలను అధ్యయనం చేసి ఇక్కడ అమలుపరిచారు. దీంతో క్రైమ్, లా అండ్ ఆర్డర్ వేరు పడటం, హైదరాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలు రైల్వే పోలీసులోకి బదిలీ కావడం తదితర కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ► ఆ ఏడాది జూలై 15 నుంచి ఈ విధివిధానాలు అమలులోకి వచ్చాయి. తొలిసారిగా ఏర్పాటు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్లకు కొందరు సిబ్బందిని అప్పగించి పెట్రోలింగ్ విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకున్నారు. 1956లో హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. దీంతో జంట నగరాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పోలీసు విభాగంలో లా అండ్ ఆర్డర్, క్రైమ్‌తో పాటు ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్ తదితర విభాగాలనూ ఏర్పాటు చేస్తూ 1957 అక్టోబర్ 11న నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పుతో పాటు నగర కమిషనరేట్నూ పాలనా సౌలభ్యం కోసం విభజించారు. నాలుగు సబ్– డివిజన్లు, 12 సర్కిళ్లతో 34 పోలీసుస్టేషన్లు ఏర్పడ్డాయి. నగర విస్తరణతో 1981 పునర్వ్యవస్థీకరణ.. ► విస్తరిస్తున్న నగరంలో పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు 1981లో కమిషనరేట్‌ను మరోసారి పునర్వ్యవస్థీకరించారు. దీనిప్రకారం నగరంలో నాలుగు జోన్లు (ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్), 12 సబ్–డివిజన్లు ఏర్పడ్డాయి. జోన్‌కు డీసీపీలు, సబ్–డివిజన్‌కు ఏసీపీలు నేతృత్వం వహించే ఏర్పాట్లు చేశారు. ► 1985, 2001ల్లో జరిగిన మార్పుచేర్పులతో సెంట్రల్ జోన్, రెయిన్‌బజార్, కంచన్‌బాగ్ పోలీసుస్టేషన్ల ఏర్పాటుతో నగరంలోని జోన్ల సంఖ్య 5కు, పోలీసు స్టేషన్ల సంఖ్య 60కి పెరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ విశ్వనగరంగా మారుతూ వచ్చినా పోలీసుస్టేషన్లు, సబ్–డివిజన్లు, జోన్ల సంఖ్య పెరగలేదు. ► ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేశారు. తక్షణం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, నేరాల నమోదుతో పాటు జనాభా, పోలీసింగ్ తీరుతెన్నులు ప్రాతిపదికన పోలీసు కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తన నేతృత్వంలో సంయుక్త పోలీసు కమిషనర్, ముగ్గురు అదనపు డీసీపీలు, ముగ్గురు ఏసీపీలతో గత నెలలో కమిటీకి రూపమిచ్చారు. ► నగరంలో సుదీర్ఘ కాలం పని చేసిన అనుభవం, పట్టు ఉన్న ఈ అధికారులు పునర్వ్యవస్థీకరణ అంశాన్ని అనేక కోణాల్లో పరిశీలించారు. ఎట్టకేలకు సౌత్, వెస్ట్, సెంట్రల్, నార్త్జోన్లలో ఉన్న ప్రాంతాలను విడగొడుతూ రెండు జోన్లకు, 15 ఠాణాల్లోని ఏరియాలను కలుపుతూ 13 పోలీసుస్టేషన్లకు రూపమిస్తూ దస్త్రం రూపొందించి ప్రభుత్వానికి పంపారు. (క్లిక్: పోలీస్ పరీక్షల ఉచిత శికణకై ప్రీ రిక్రూట్మెంట్ టెస్ట్) ► ప్రస్తుత నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేపథ్యంలోనే కమిషనరేట్‌లో కీలక మార్పులు జరిగాయి. సెంట్రల్ జోన్ ఏర్పడినప్పుడు తొలి డీసీపీగా ఆయనే పని చేశారు. హుస్సేన్‌సాగర్‌లో ఆత్మహత్యల నిరోధానికి లేక్ పోలీసుస్టేషన్‌కు ఆనందే రూపమిచ్చారు. తాజాగా భారీ మార్పులు ఆయన నేతృత్వంలోని కమిటీ ద్వారానే జరగనుండటం విశేషం. (క్లిక్: మది దోచే మల్కంచెరువు..) -
నగర పోలీసు కమిషనరేట్‌లో కీలక నిర్ణయం.. ఇకపై ఆ లైసెన్సుల జారీ కఠినతరం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆయుధ లైసెన్సుల జారీ విధానాన్ని మరింత కఠినతరం చేస్తూ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుదారుడిని ఇంటర్వ్యూ చేసిన తర్వాతే దరఖాస్తును ఆమోదించనున్నారు. లైసెన్సుల జారీలో లోపాలను సరిచేయడం, పారదర్శకత పెంచడం, దుర్వినియోగాన్ని తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. అనునిత్యం బిజీ షెడ్యూల్లో ఉండే కొత్వాల్ ఆనంద్ ఈ ఇంటర్వ్యూల కోసం ప్రతి రోజూ నిర్ణీత సమయాన్ని కేటాయిస్తున్నారు. మూడు కేటగిరీలుగా జారీ.. ►సాధారణంగా తుపాకీ ఖరీదు చేసుకోవడానికి, కలిగి ఉండటానికి లైసెన్సును మూడు కేటగిరీల్లో జారీ చేస్తుంటారు. వ్యక్తిగత భద్రత, సెక్యూరిటీ గార్డులు, ఫైరింగ్ వంటి క్రీడలకు సంబంధీకులకు వీటిని ఇస్తుంటారు. నగర పరిధిలో నివసిస్తున్న క్రీడాకారులతో పాటు వ్యాపారులు, ప్రముఖులు, సెక్యూరిటీ గార్డులకు వీటి జారీ అధికారి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలు ఉన్న పోలీసు కమిషనర్‌కు ఉంది. ►ఆయుధ చట్టంలో 2020లో వచ్చిన సరవణ ప్రకారం వ్యక్తిగత భద్రత కేటగిరీలో గరిష్టంగా రెండు తుపాకులు మాత్రమే కలిగి ఉండాలి. అంతకుమించి ఉన్న వారి నుంచి నగర పోలీసులు రెండేళ్ల క్రితం డిపాజిట్ చేయించారు. వ్యక్తిగత భద్రత కేటగిరీలో ఆయుధ లైసెన్సు తీసుకున్న కొందరు దాన్ని క్రీడలు లేదా సెక్యూరిటీ విధులు వంటి వాటికి వినియోగిస్తుంటారు. ఇలా చేయడం ఆయుధ చట్టం ప్రకారం నేరమే అవుతుంది. గతంలో ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. నేర చరిత్ర లేనివారికే.. ►ఆయుధ లైసెన్సు కోసం నగరవాసి చేసుకున్న దరఖాస్తు దస్త్రంపై పోలీసుస్టేషన్, ఏసీపీ కార్యాలయం, డీసీపీ కార్యాలయం, సంయుక్త పోలీసు కమిషనర్ కార్యాలయాలు తొలుత ఆమోదముద్ర వేస్తాయి. ఎలాంటి నేరచరిత్ర లేని వారికే మంజూరుకు అనుమతిస్తాయి. ఇప్పటి వరకు ఇలా వస్తున్న దరఖాస్తు ఫైళ్లపై కొత్వాల్ ప్రాథమిక పరిశీలన చేసి సంతకం చేస్తూ లైసెన్సు జారీ చేస్తారు. దీని ఆధారంగా అనుమతి పొందిన క్యాలిబర్, సంఖ్యలో ఆయుధాలను లైసెన్సుదారు ఖరీదు చేసుకుంటారు. ►ఇటీవల కాలంలో లైసెన్స్డ్ ఆయుధాలు కలిగి ఉడటమనేది అవసరమున్నా లేకపోయినా స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. ఇదే కొన్నిసార్లు అపశ్రుతులకు దారి తీస్తోంది. ఏదైనా ఉదంతం జరిగినప్పుడు మాత్రమే ఈ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయుధ లైసెన్సులకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో వివిధ స్థాయిల్లో పోలీసులపై ఒత్తిళ్లు, ప్రలోభాలకు ఆస్కారం ఏర్పడుతోంది. వీటిని అన్ని సందర్భాల్లోనూ కింది, మధ్య స్థాయి అధికారులు పట్టించుకోకుండా ఉండలేరు. ప్రలోభాల కంటే ఒత్తిళ్లే ఎక్కువగా పని చేస్తుంటాయి. పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే.. ►ఇలాంటి అంశాలకు ఆస్కారం లేకుండా నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయుధ లైసెన్సు దస్త్రం వివిధ స్థాయిలను దాటి తన వద్దకు చేరాక దాన్ని పరిశీలించే సమయంలో దరఖాస్తుదారుడిని ముఖాముఖీ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ►దరఖాస్తు చేసుకున్నది ఎవరు? ఏ అవసరం కోసం అప్లై చేశారు? నిజంగా వారికి ఆయుధం కలిగి ఉండాల్సిన అవసరం ఉందా? తదితర అంశాలను ఆయనే స్వయంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుంటున్నారు. పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే లైసెన్సు జారీ చేస్తున్నారు. ►నగరవాసులు పోలీసు కమిషనర్‌ను నేరుగా కలవడానికి ప్రతి రోజూ విజిటింగ్ అవర్స్ ఉంటాయి. వీటిని కొత్వాల్ సీవీ ఆనంద్ పక్కాగా అమలు చేస్తున్నారు. ఆ సమయంలోనే ఆయుధ లైసెన్స్ దరఖాస్తుదారులనూ ఇంటర్వ్యూ చేయడానికీ కొంత కేటాయిస్తున్నారు.