ponduru
-
సీఎం బంధువునంటూ బెదిరింపులు
పొందూరు: బిల్డింగ్ కూల్చివేత విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, అతని తనయుడు తమ్మినేని చిరంజీవినాగ్‌తో పాటు ఇతరుల గురించి బెదిరింపు ధోరణిలో మాట్లాడిన వైఎస్సార్ కడప జిల్లా ప్రాద్దుటూరు మండలం తాలమాల్పురం గ్రామానికి చెందిన అన్నెపురెడ్డి చిన్న వెంకటసుబ్బారెడ్డిపై శ్రీకాకుళం జిల్లా పొందూరులో కేసు నమోదైంది. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వాసుదేవరావు అనే వ్యక్తిపై కూడా దురుసుగా ప్రవర్తించాడని కూడా సుబ్బారెడ్డిపై ఫిర్యాదు వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాను సీఎం బంధువునని, సీఎంఓ ఆఫీసులో ఉంటానని, బిల్డింగ్ కూల్చివేతకు సంబంధించి విచారణకు వచ్చానంటూ కొన్ని ఆడియో క్లిప్పింగులను వినిపించి మీ స్పీకర్ సంగతి, మీ నానిబాబు (చిరంజీవినాగ్) సంగతి చూస్తానంటూ సుబ్బారెడ్డి బెదిరించాడు. అలాగే.. ‘ఆర్డీఓ, ఈఓలతోను మాట్లాడాను, వారి ఉద్యోగాలు తీయిస్తా.. జైలు పాలవుతావు’ అని వాసుదేవరావును భయపెట్టాడు. దీంతో వాసుదేవరావు సీఎంఓ ఆఫీసుకు ఫోన్‌చేయగా అక్కడ అలాంటి వారెవరూ లేరని తేలింది. అనంతరం వాసుదేవరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఐపీసీ 448, 418, 506 సెక్షన్ల కింద సుబ్బారెడ్డిపై కేసులు నమోదు చేశారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా.. శ్రీకాకుళంలో రూం అద్దెకు తీసుకుని అక్కడే భూదందాలు, ఉద్యోగాలిప్పిస్తానంటూ డబ్బులు వసూలుచేస్తున్నట్లు తేలింది. దీంతో అతనికి 41ఏ నోటీసు ఇచ్చి పంపించామని ఎస్ఐ ఎస్. లక్ష్మణరావు చెప్పారు. -
ఏటీఎంను బద్దలు కొట్టిన వ్యక్తి.. డబ్బులు రాలేదని కోపంతో..
శ్రీకాకుళం (పొందూరు): డబ్బులు రాలేదనే కోపంతో ఏకంగా ఏటీఎం మిషన్నే బద్దలు కొట్టాడో వ్యక్తి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరులో సోమవారం జరిగింది. ఎస్ఐ లక్ష్మణరావు చెప్పిన వివరాలు మేరకు.. బూర్జ మండలానికి చెందిన పైడి సత్యనారాయణ నగదు కోసం సోమవారం పొందూరు బస్టాండ్‌లోని టాటా ఏటీఎంకు వెళ్లారు. తన ఏటీఎం కార్డును ఉపయోగించి డబ్బు డ్రా చేసే ప్రయత్నం చేయగా నగదు రాలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సత్యనారాయణ ఏటీఎం మిషన్‌ను బద్దలు కొట్టాడు. పోలీసులకు దీనిపై సమాచారం అందింది. వెంటనే వారు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
విషాదం: అమ్మానాన్నల కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలకు..
సాక్షి, పొందూరు, ఎచ్చెర్ల క్యాంపస్: అమ్మవారి దర్శనం కోసం వెళ్లిన దంపతులను మృత్యువు మింగేసింది. దైవ దర్శనానికి వెళ్లిన అమ్మానాన్నలు ఇంటికి వస్తారని ఎదురు చూస్తున్న కుమార్తెలకు ఆఖరకు వారి చావు కబురు అందింది. లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిల్చింది. పొందూరు మండలంలోని రెడ్డిపేట వద్ద మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఎచ్చెర్ల మండలం చిలకపాలెంకు చెందిన బనిశెట్టి శ్రీనివాసరావు(46), భార్య అన్నపూర్ణ(40) అనే దంపతులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చిలకపాలెంకు చెందిన బనిశెట్టి శ్రీనివాసరావు వస్త్ర వ్యాపారం చేస్తుంటారు. ఆయన భార్య అన్న పూర్ణ రిమ్స్‌లో హౌస్ కీపర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పొందూరులోని పైడితల్లి దర్శనం కోసం మంగళవారం ఈ దంపతులు తమ టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై బయల్దేరారు. అమ్మవారి దర్శనం అనంతరం పొందూరు నుంచి వస్తుండగా రెడ్డిపేట వద్ద భారీ లారీని చూసి పక్కకు తప్పుకున్నారు. అయితే ఆ క్రమంలో వీరి బండికి లారీ టైరు తగలడంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. వారి తలలపై నుంచి లారీ టైర్లు వెళ్లిపోవడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఆ దృశ్యాలు భీతావహంగా మారాయి. చదవండి: (ఆస్పత్రిలో గర్భిణీ మృతి.. అవమానం తట్టుకోలేక మహిళా వైద్యురాలు) స్థానికుల నుంచి సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ ఎస్.లక్ష్మణరావు సిబ్బందితో వెళ్లి మృతదేహాల ను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు మృతి చెందిన విషయాన్ని కుమార్తెలకు చెప్పారు. దీంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. సంతకవిటి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన వీరు 15 ఏళ్ల క్రితం చిలకపాలేంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అమ్మానాన్న వస్తారని ఎదురు చూసి న కుమార్తెలు సంధ్య, స్నేహలకు ఆఖరుకు వారి మృతదేహాలు చూడాల్సి రావడంతో గుండెలవిసేలా రోదించారు. స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. -
శ్రీకాకుళం: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పొందూరులో జరిగే జాతీయ చేనేత దినోత్సవంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ట దాస్, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గర రాజేంద్ర, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ జిల్లా అధికారులు స్వాగతం పలికారు. పొందూరు కేంద్రంగా పని చేస్తున్న ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవనాన్ని నిర్మలా సీతా రామన్ సందర్శించారు. ముందుగా చేనేత కార్యాలయం వద్ద నున్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కేంద్ర మంత్రి సీతారామన్. అనంతరం చేనేత కార్మికులతో కలసి వారి స్థితిగతులను మంత్రి నిర్మలా తెలుసుకున్నారు. 30 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న చేనేత కార్మికుల భవనానికి మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. అనంతరం మగ్గంపై నూలు వదులుతున్న నేత కార్మికుడిని స్వగృహానికి చేరుకుని కార్మికుడితో మాట్లాడారు. కేంద్ర మంత్రితో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, శ్రీకాకుళం, విజయనగరం ఎంపీలు కే రామ్మోహన్ నాయుడు, బెందాలం చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ , జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఖాదీ ప్రక్రియను ఆమె పరిశీలించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో జరిగే కార్య్రమంలో పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ప్రాంగణంలో ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు ఏర్పాటుచేసిన ప్రదర్శనశాలలను నిర్మలా సీతారామన్ పరిశీలించారు. పొందూరు ఖాదీకి ఖండాంతర ఖ్యాతి.. జిల్లాలో పొందూరులో తయారు చేసే ఖాదీ వస్త్రాల కు ఖండాంతర ఖ్యాతి ఉంది. ఇక్కడి నేత వస్త్రాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఎంతో మక్కువ తో ధరించేవారు. ఆయన కట్టుతో పొందూరు వస్త్రానికి ఎంతో గొప్పతనం లభించింది. ప్రఖ్యాత న టుడు అక్కినేని నాగేశ్వరరావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమ నటులు ఈ పొందూరు ఖాదీకి అభిమానులు. చేప ముళ్లుతో ఇక్కడ నూలు వడికి, 40, 60, 80, 100 కౌంటులతో కూడిన వస్త్రాలు నేస్తారు. కేవీఐసీ(ముంబై) ఆధ్వర్యంలో పొందూరు ఏఎఫ్‌కేకే సంఘం ఉన్నప్పటికీ సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవా ర్డును అందించింది. త్వరలో నగదును అందించనుంది. ఏఎఫ్‌కేకే సంఘం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటీకీ కళలు, కళారంగంలో ప్రోత్సాహానికి గాను ఇస్తు న్న పురస్కారాల్లో భాగంగా ఏఎఫ్‌కేకే సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లైఫ్‌టైమ్ అవార్డు అందించింది. -
మహిళతో అసభ్య ప్రవర్తన; ఎస్ఐ సస్పెన్షన్
సాక్షి, శ్రీకాకుళం : నిందితురాలితో ఫోనులో అనుచితంగా మాట్లాడినట్టు ఆరోపణ ఎదుర్కొంటున్న పొందూరు సబ్ ఇన్స్పెక్టర్ కొల్లి రామకృష్ణను జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ సోమవారం సస్పెండ్ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ ఈ విషయం ప్రకటించారు. పొందూరు మండలం రాపాక గ్రామంలో అక్రమ మద్యం నిల్వలు కలిగిన కేసులో నిందితురాలైన ఓ మహిళను ఎస్ఐ ఇంటికి రమ్మన్నట్టు ఫోన్లో రికార్డయిన సంభాషణ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఎస్ఐను సస్పెండ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ సంఘటనపై విచారణ జరిపిన తరువాత సీఆర్ నంబర్ 430/2020 యు/ఎస్ 354–ఎ ప్రకారం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. జిల్లాలో సిబ్బంది ఎవరైనా ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, వారిపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సమావేశంలో ఎస్పీ హెచ్చరించారు. అసలేం జరిగిందంటే.. రాపాక కూడలికి సమీపంలోని కుమ్మరికాలనీలో నివాసం ఉంటున్న మహిళను శనివారం మద్యం సీసాలను అక్రమంగా నిల్వ ఉంచిన కేసులో అరెస్టు చేశారు. అదే రోజు తుంగపేటలో నిందితురాలి తండ్రిని మద్యం సీసాల నిల్వ కేసులో అరెస్టు చేశారు. ఈ కేసు విషయంలో ఆదివారం వీరిని స్టేషన్‌కు పిలిపించారు. అదే రోజున ఎస్ఐ ఫోనులో నిందితురాలితో మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. ఇంటికి వస్తే కేసు లేకుండా చూస్తానని ఫోనులో మాట్లాడుతూ తాను నివాసం ఉంటున్న వీధి చిరునామాను తెలియజేశారు. ఒంటరిగా మాత్రమే రావాలని సూచించారు. వారిద్దరి మధ్య జరిగిన ఫోను సంభాషణ ఆడియో టేప్ వాట్సాప్‌లో హల్చల్ చేసింది. ఈ ఘటన గురించి పత్రికల్లో వార్తలు రావడంతో జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ స్పందించి సస్పెండ్ చేశారు. విచారణ ప్రారంభం.. కేసు నమోదు ఈ ఉదంతంపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించామని జేఆర్‌పురం సీఐ హెచ్.మల్లేశ్వరరావు తెలిపారు. ఎస్సై రామకృష్ణపై కేసు నమోదు చేసినట్లు కూడా ఆయన చెప్పారు. మహిళతో ఫోన్లో అనుచితంగా మాట్లాడారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
అడ్డంగా దొరికి.. ఎదురుదాడి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తహసీల్దార్‌పై నోరు పారేసుకుని అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎదురు దాడికి దిగారు. మూడు రోజులుగా పరారీలో ఉన్న రవికుమార్ బుధవారం ఉదయం పొందూరు పోలీసు స్టేషన్లో లొంగిపోయే సమయంలో ప్రత్యారోపణలకు దిగారు. తన మాట వినని వారిని అవినీతి అధికారులని, తానెవరినీ వదలనని అంటూనే.. వారికి అండగా నిలుస్తున్న ఉద్యోగ సంఘాలను టార్గెట్ చేశారు. వాస్తవానికి గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో మట్టి అక్రమ తరలింపు వ్యవహారంలోనే కాదు అంతకుముందు కూడా తహసీల్దార్ రామకృష్ణపై బెదిరింపులకు దిగారు. చెరువు వ్యవహారంతోపాటు మరో రెండు విషయాల్లో తహసీల్దార్ తమకు అడ్డంకిగా నిలిచారని టార్గెట్ చేసుకున్నారు. దారికి తెచ్చుకోవడమే లక్ష్యంగా... కూన రవికుమార్ తొలి నుంచి ఉద్యోగులపై దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. భయపెట్టి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. వీఆర్ఓలు, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, తహసీల్దార్... ఇలా ప్రతి ఒక్కరినీ బెదిరించి తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలనుకుంటారు. అధికారం లేకపోయినా తన మాటే చెల్లుబాటు కావాలని, తాను చెప్పినట్టు చేయాలని హుకుం జారీ చేయడం అలవాటుగా మారిపోయింది. ఎవరైతే తన మాటను వినరో వారిని టార్గెట్ చేసుకుని తొలుత లంచాలు ఎర చూపడం, ఇంకా లెక్క చేయకపోతే బూతు పురాణాలకు దిగడం, అంతకీ లొంగకపోతే అవినీతి ముద్ర వేసి పబ్బం గడుపు కోవాలని చూస్తున్నారు. గతంలో సరుబుజ్జిలి ఎంపీడీఓ విషయంలోనూ, ఈఓపీఆర్డీ విషయంలోనూ, వీఆర్ఓల విషయంలోనూ ఇదేరకంగా వ్యవహరించి నోటికొచ్చినట్టు తిట్టి ఆడియోల ద్వారా దొరికిపోయారు. అయినా తన వైఖరి మార్చుకోకుండా ఎన్ని కేసులు పెట్టినా ఏమవుతుందని, బెయిల్‌పై వచ్చేస్తానన్న ధీమాతో నోటికి పనిచెబుతూనే ఉన్నారు. చివరికి రవికుమార్ బెదిరింపులతో ఉద్యోగులంతా భయపడిపోతున్నారు. వారి అనుచరులు ఏం చేయిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇది తొలిసారి కాదు.. తహసీల్దార్ రామకృష్ణను బెదిరించడం ఇది తొలిసారి కాదు. దీనికి ముందు రెండు ఘటనలు జరిగాయి. వాటిలోనూ తహసీల్దార్‌ను దురుసుగా మాట్లాడారన్న వాదనలున్నాయి. కూన రవికుమార్ స్వగ్రామమైన పెనుబర్తిలో తన ఇంటి వెనక రెండు ఎకరాల గ్రామ కంఠం భూమి ఉంది. ఆ గ్రామంలో మరెక్కడా ప్రభుత్వ స్థలం లేకపోవడంతో 31మంది పేదల ఇళ్ల స్థలాల కోసం ఆ గ్రామ కంఠాన్ని ప్రతిపాదించారు. ఖాళీగా ఉన్న స్థలం కావడంతో సామాజిక పోరంబోకుగా గుర్తించి పేదల స్థలాల కోసం కేటాయించేందుకు గ్రామంలో తీర్మానం కూడా చేశారు. కానీ, రవికుమార్ వెనకుండి తన అనుయాయులు కొందర్ని రంగంలోకి దించి, ఆ భూమి తమ స్వాధీనంలో ఉందని చెప్పి అడ్డు తగలడం ప్రారంభించారు. ఉపాధి నిధుల కింద చేపట్టిన చదును పనులను అడ్డుకున్నారు. దీంతో వారందరికీ తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. వాటికి సమాధానం ఇవ్వకుండా ఈ విషయంలో కోర్టుకు వెళ్లారు. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని, నోటీసులు ఇచ్చిన తహసీల్దార్‌కు సమాధానం ఇచ్చుకోవాలని కోర్టు స్పష్టం చేయడంతో కంగుతిన్నారు. దీంతో అధికారులు ఆ గ్రామ కంఠాన్ని పేదల ఇళ్ల స్థలాల కోసం సిద్ధం చేసే పనిలో పడ్డారు. కూన రవికుమార్‌కు ఇదంతా రుచించలేదు. తహసీల్దార్‌ను లక్ష్యంగా చేసుకుని నోరు పారేసుకోవడం ప్రారంభించారు. ఇక, ఆ తర్వాత పెనుబర్తి పంచాయతీ పరిధిలో అలమాజీపేటలో ప్రభుత్వ నిధులతో వేస్తున్న రోడ్డుకు అడ్డంగా రవికుమార్ అనుయాయులు గోడ కట్టేశారు. దీని విషయంలోనూ తహసీల్దార్ ముందుకెళ్లడంతో ఆ సమయంలో కూడా రవికుమార్ బెదిరింపులకు దిగారు. తాజాగా గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్ఓ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ అక్కడికి చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీన్ని జీరి్ణంచుకోలేని కూన రవికుమార్ ఏకంగా ఫోన్లో ఇష్టారీతిన విరుచుకుపడ్డారు. కూన రవికుమార్ దుర్భాషలతోపాటు.. కొంతమంది తరుచూ వెంబడిస్తుండటం, ఫోన్లో సతాయించడంతో భరించలేక టీడీపీ నేత నోటి దురుసు ఆడియోను తహసీల్దార్ బయటపెట్టారు. వాస్తవంగా రామసాగరం చెరువులో ఉపాధి హామీ పథకం కింద కూలీల చేత మట్టి తవ్వకాలు జరపాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా కూన రవి సోదరుడు, మరికొంతమంది జేసీబీతో తవ్వకాలు జరిపి, లారీల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చెరువుల్లో జేసీబీతో తవ్వకాలు చేపట్టకూడదు. అందుకు భిన్నంగా చేసి ఇప్పుడు చెరువులో మట్టిని ఎందుకు తరలించకూడదని, తరలిస్తే తప్పేముందని వితండవాదానికి దిగుతున్నారు. అంతేకాకుండా తహసీల్దార్ అవినీతి పరుడని, అవినీతిపరులైన ఉద్యోగులను వదలనని, వారికి ఉద్యోగ సంఘాలు వత్తాసు పలుకుతున్నాయని ఎదురు దాడికి దిగడం చర్చనీయాంశమైంది. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కారణాలు వెతుకుతున్నారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. అధికారులంటే అంత చులకనా? పొందూరు: తహసీల్దార్ రామకృష్ణను బెదిరించిన కేసులో బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయిన టీడీపీ నాయకుడు కూన రవికుమార్ ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి మాట్లాడిన మాటల పట్ల నిరసన వ్యక్తమవుతోంది. పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారులపై తప్పుడు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల గౌరవం లేకుండా మాట్లాడారు. తహసీల్దార్‌ను ఏకవచనంతో సంబోధించడాన్ని అందరూ ఆక్షేపిస్తున్నారు. రవికుమార్ తహసీల్దార్ రామకృష్ణపై చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు. అడ్డంగా దొరికి ఎదురుదాడికి దిగడం తగదని, క్షమాపణ చెబితే పరువు నిలుస్తుందని హితవు పలుకుతున్నారు. గతంలో గ్రామ కంఠం భూమి విషయంలో, నిర్మాణంలో ఉన్న రోడ్డుకు అడ్డంగా తన అనుయాయులు కట్టిన గోడకు అభ్యంతరం పెట్టిన విషయంలో తహసీల్దార్‌పై కోపం పెంచుకొని.. ఇప్పుడు అతనిపై అవినీతి ఆరోపణలు చేయడం తగదని వారంటున్నారు. పొందూరు స్టేషన్లో లొంగిపోతూ రవికుమార్ తహసీల్దార్ రామకృష్ణపై విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలున్న అతనిని ఉద్యోగ సంఘాలు వెనకేసుకు రావడం తగదని సమర్థించుకోజూశారు. -
టీడీపీకి షాక్..
పొందూరు: మండలంలో మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు, టీడీపీకి గట్టిషాక్ తగిలింది. ఇంతవరకు పార్టీ బలోపేతానికి కృషి చేసిన పార్టీ మండల కార్యదర్శి గుడ్ల మోహన్, శ్రీశైలం దేవస్థానం డైరెక్టర్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాకర్ల రాజారావులు పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వీరు వెల్లడించారు. ఈ మేరకు మండల కేంద్రంలో శుక్రవారం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలనకు ఆకర్షితులమై ఆ పార్టీలో చేరేందుకు నిర్ణయించామన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఆశీస్సులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్ ఆధ్వర్యంలో పారీ్టలో చేరనున్నామన్నారు. ఉత్తరాంధ్రను పరిపాలన రాజధానిగా వ్యతిరేకిస్తున్న టీడీపీకి భవిష్యత్ ఉండదన్నారు. -
ఉల్లం‘గనులు’
నిబంధనలు అతిక్రమిస్తున్నా అదుపు లేదు.. ప్రాణాలు పోతున్నా లెక్క లేదు.. ప్రభుత్వాదాయానికి గండి పడుతున్నా ఖాతరు లేదు.. యథేచ్ఛగా గనులను దొలిచేస్తున్నారు.. కాసులు కొల్లగొడుతున్నారు.. క్వారీల నిర్వహణలో నియమ నిబంధనలు మచ్చుకైనా అమలు కావడం లేదు. బ్లాస్టింగ్‌లకు అత్యంత ప్రమాదకరమైన జిలెటిన్ స్టిక్స్‌ను ఉపయోగిస్తున్నారు. కొండలను పిండి చేస్తున్నారు. దీంతో క్వారీలను నిర్వహిస్తున్న మేస్త్రీలు కాసులు సంపాదిస్తున్నారు. నిబంధనలు పాటించకపోవడం, రక్షణ కిట్లు ఇవ్వకపోవడంతో పొట్ట కూటి కోసం రాయి పనిచేస్తున్న క్వారీ కార్మికులు గాయాలు పాలై అనేకమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. వీటిపై నిఘా వేయాల్సిన అధికార యంత్రాంగం కనీసం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. సాక్షి, పొందూరు: ప్రభుత్వానికి చేరాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం అక్రమ క్వారీ నిర్వాహకుల జేబుల్లోకి వెళుతున్నాయి. క్వారీ చేసుకునేందుకు మైనింగ్, రెవెన్యూ అధికారులు ఇచ్చిన అనుమతి విస్తీర్ణం చాలా తక్కువ మేరకు ఉంటుంది. దానికి మూడు, నాలుగు రెట్ల మేరకు కొండను పేల్చేస్తున్నారు. కొండ ఎత్తు మూడు నుంచి నాలుగు వందల మీటర్లు ఉంటే దాని కింద సుమారు రెండు నుంచి మూడు వందల మీటర్లు లోతు వరకు దొలిచేస్తున్నారు. ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండలను రాళ్లుగా మార్చి కోట్లు కూడబెట్టుకొంటున్నారు. మైనింగ్ అధికారులు క్వారీ పనికి ఇచ్చిన అనుమతుల మేరకు కిందకు కొంత పరిమితి వరకు మాత్రమే వెళ్లి రాయిని తీయాల్సి ఉంటుంది. అయితే అపరిమితంగా రాయిని దొలిచేస్తున్నారు. అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ప్రమాదాలు జరిగినప్పుడు కుటుం బాలు వీధిన పడుతున్నాయి. మండలంలో రాపాక, ఇల్లయ్యగారిపేట, గారపేట, రెడ్డిపేట సమీపాల్లో క్వారీ లు నిర్వహిస్తున్నారు. సుమారు 100 మంది మేస్త్రీలు ఇక్కడ క్వారీలను నడిపిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు పొందిన లీజుదారులు 16 మంది ఉండగా అక్రమ లీజుదారులు కనీసం 100 మంది వరకు ఉన్నారు యథేచ్ఛగా జిలెటిన్ స్టిక్స్ వాడకం.. కొండను బ్లాస్టింగ్ చేసేందుకు లైసెన్సు ఉండాలి. కాని మండలంలో ఎవరికీ లైసెన్సులు లేవు. తక్కువ పరిమాణంలో మందును ఉపయోగించి బ్లాస్టింగ్ చేసేందుకు ఒకరిద్దరికి మాత్రమే అనుమతి ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఎక్కువ పరిమాణంలో పేలుడు పదార్ధాలు, భారీ విస్ఫోటనం కలిగించే జిలెటిన్ స్టిక్స్, భారీ స్థాయిలో అమ్మోనియం నైట్రేటు ఉపయోగిస్తున్నారు. కూరగాయలు అమ్మడానికి వీధుల్లో తిరుగుతున్న మాదిరిగా ఇంటింటికీ పేలుడు పదార్ధాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. క్వారీ నిర్వాహకులు ఈ పేలుడు పదార్ధాలను విక్రయించి ఖాళీగా ఉన్న ఇళ్లల్లోను, పలువురు వారి సొంత ఇళ్లల్లోను నిల్వ చేస్తున్నారు. వాస్తవానికి క్వారీలలో పేలుళ్లు నిర్వహించాలంటే పోలీసు, ఎక్స్‌ప్లోజివ్ డిపార్ట్మెంట్ (న్యూఢిల్లీ) నుంచి అనుమతులు తీసుకోవాలి. వారి గైడ్‌లైన్స్ మేరకు మాత్రమే సాధారణ పేలుడు పదార్ధాలు ఉపయోగించాలి. అది కూడా నిపుణుడైన, సుశిక్షితుడైన వ్యక్తి మాత్రమే బ్లాస్టింగ్ నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల ప్రమాదాల బారిన పడకుండా కార్మికులకు రక్షణ కలుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. అయితే ఇక్కడ బ్లాస్టింగ్లు అక్షర జ్ఞానం లేని కూలీలను, జిలెటిన్ స్టిక్, డిటొనేటర్ అంటే తెలియని అమాయకులతో õనిర్వహిస్తున్నారు. బాంబుల హోరు.. జనం బేజారు.. జిలెటిన్ స్టిక్స్, అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్ధాలతో మండలంలోని కొండలను పేల్చుతున్నారు. పొందూరుకు చుట్టుపక్కల ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోనే బ్లాస్టింగ్ క్వారీలు ఉన్నాయి. గత రెండు రోజులుగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బాంబుల మోతతో పొందూరు చుట్టుపక్కల గ్రామాలు హోరెత్తిపోతున్నాయి. శుక్రవారం పలువురి క్వారీల్లో కంప్రెషర్ ఉపయోగించి రాళ్లకు రంధ్రాలు చేసి జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేలుడుకు సిద్ధం చేస్తుండగా సాక్షి క్లిక్‌మనిపించింది. మృత్యుబారిన పలువురు కార్మికులు.. కొండలకు బెజ్జాలు పెడుతున్నప్పుడు, కొం డపైకి ఎక్కుతున్నప్పుడు, ట్రాక్టర్లోకి రాళ్ల ను ఎత్తుతున్నప్పుడు, బ్లాస్టింగ్లు జరుపుతున్నప్పుడు కార్మికులు మృత్యుబారిన పడుతున్నారు. కాళ్లు, చేతులు, వేళ్లు తెగిపడిన వారు ఉన్నారు. 2019 జనవరి 2న ఇల్లయ్యగారిపేట జరిగిన బ్లాస్టింగ్‌లో కెంగువ రామారావు మృతి చెందగా.. 2018 జూన్ 26న క్వారీలో నుంచి ట్రాక్టర్‌ను రోడ్డుపైకి తీసుకొస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడి మహదాస్యం నాగరాజు, 2015 జూన్ 13న కొండపై నుంచి జారిపడి కొంచాడ శ్రీను మృతి చెందారు. ఇలా ఎందరో మృత్యు ఒడిని చేరారు. ఇంత జరుగుతున్నప్పటికీ మృతుల కుటుంబాలకు సరైన న్యాయం జరగటం లేదు. వారికి నామమాత్ర పరిహారం అందిస్తూ పోలీసులకు, మైనింగ్ అధికారులకు లక్షల్లో ముట్టచెబుతున్నారు. బ్లాస్టింగ్లు జరపొద్దని పోలీసు శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ అక్రమార్కులు పట్టించుకోవటం లేదు. పై స్థాయిలో అధికారులు కచ్చితంగా బ్లాస్టింగ్లు జరపవద్దని చెబుతున్నారు. కింది స్థాయిలో అమలుకు లొసుగులు అడ్డువస్తున్నాయేమో గాని బ్లాస్టింగ్లు మాత్రం ఆపడం లేదు. క్వారీలను పరిశీలించిన సీఐ.. మండలంలోని క్వారీలను జేఆర్ పురం సీఐ హెచ్ మల్లేశ్వరరావు శుక్రవారం రాత్రి పరిశీలించారు. రాపాక, ఇల్లయ్యగారిపేట క్వారీలను పొందూరు పోలీసు సిబ్బందితో కలిసి సందర్శించారు. బ్లాస్టింగ్లు ఎక్కడైనా జరుగుతున్నాయా? అని తెలుసుకునేందుకు పర్యటించామని చెప్పారు. అక్రమంగా పేలు ళ్లు జరిపితే చర్యలు తీసుకుంటామన్నారు. అతిక్రమిస్తే లీజు రద్దు.. క్వారీల నిర్వహణ కచ్చితంగా లీజుదారులే చేయాలి. అది కూడా వారికి మైనింగ్ అధికారులు కేటాయించిన కొండలో నిబంధనలను అధిగమించకుండా క్వారీ నిర్వహించాలి. అనుమతి ఇచ్చిన కొండ విస్తీర్ణం దాటి క్వారీ నిర్వహిస్తే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వారి లీజు రద్దుకు సిఫార్సు చేస్తాం. – టి.రామకృష్ణ, తహశీల్దార్, పొందూరు అక్రమార్కులపై కఠిన చర్యలు.. క్వారీల్లో జిలెటిన్ స్టిక్స్, పేలుడు పదార్ధాలు ఉపయోగిస్తే వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత పోలీసులది. మైనింగ్‌కు ఇచ్చిన విస్తీర్ణం కంటే ఎక్కువ క్వారీ నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే లీజు రద్దు చేస్తాం. –సత్యనారాయణ, గనులు, భూగర్భ శాఖ ఏడీ అక్రమ పేలుళ్లకు క్వారీ లీజుదారులే బాధ్యులు క్వారీ నిర్వహణకు బ్లాస్టింగ్లు జరపొద్దని హెచ్చరించాం. ప్రమాదకర పేలుడు పదార్ధాలు ఉపయోగిస్తే విడిచిపెట్టం. ఎక్కడైనా అక్రమంగా బ్లాస్టింగ్లు జరిగితే క్వారీ లీజుదారులే బాధ్యులవుతారు. అరెస్టులు కూడా చేస్తాం. –హెచ్.మల్లేశ్వరరావు, సీఐ, జేఆర్ పురం -
రాఖీ కట్టించుకోవడానికి వెళ్తూ..
పొందూరు: మండలంలోని గారపేట గ్రామానికి చెందిన అంబల్ల సంతోష్ (19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మరో యువకుడు చీమల మణికంఠ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గురువారం మండలంలోని రెడ్డిపేట వద్ద జరిగింది. మృతుని బంధువులు, పోలీసుల కథనం ప్రకారం..దుర్గారావు, లక్ష్మి దంపతులకు ముంగురు సంతానం. వీరిలో సంతోష్ (19) పెద్ద కుమారడుడు, కుమార్తె తులసి, చిన్న కుమారుడు వినోద్‌కుమార్ ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గురువారం రక్షాబంధన్ పండగ కావడంతో లావేరు మండలంలోని చిన్నయ్యపేట గ్రామంలో ఉంటున్న చీమల మణికంఠ (సంతోష్ పెద్దమ్మ కుమారుడు) గారపేటకు వచ్చాడు. సంతోష్, మణికంఠలకు తులసీ రాఖీ కట్టింది. వీరిద్దరూ రాఖీ కట్టించుకునేందుకు శ్రీకాకుళంలోని ఉంటున్న స్వాతి (మణికంఠ అక్క) ఇంటికి ద్విచక్రవాహనంపై గారపేట నుంచి బయలుదేరారు. సంతోష్ బైక్ డ్రైవింగ్ చేస్తున్నాడు. వెనుక మణికంఠ కూర్చున్నాడు. సుమారు రెండు కిలోమీటర్లు దూరంలో వెళ్లారు. రెడ్డిపేట వద్ద ముందు వెళ్తున్న లారీని క్రాస్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా వెనుక నుంచి వచ్చిన క్వారీ లారీ బలంగా ఢీకొట్టింది. ఇరువురు రోడ్డుపై పడిపోయారు. లారీ అతివేగంగా రావడంతో సంతోష్ తలపై నుంచి వెళ్లింది. సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు మణికంఠకు కాలు విరిగింది. మణికంఠను 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సంతోష్ తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విగతజీవిగా పడివున్న కుమారుడిని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మృతి చెందిన అన్నయ్యను చూసిన చెల్లి తులసీ, తమ్ముడు వినోద్‌లు బోరున విలపించారు. అందివచ్చిన కొడుకు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలను ఆపడం ఎవరితరమూ కాలేదు. వారి ఆవేదనను చూసిన ప్రజలు కంట తడిపెట్టారు. మృతుడు సంతోష్ పొందూరు మండల కేంద్రంలోని సిస్టం కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మంచి విద్యార్థిగా గుర్తింపు పొందాడు. స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొని ఎంతో సంతోషంగా గడిపాడు. సంతోష్ మృతి చెందాడన్న విషయాన్ని స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. సంతోష్ మృతితో గారపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ మహ్మద్ యాసిన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘గ్రామ వాలంటీర్లందరూ సచివాలయ సైనికులు’
సాక్షి, శ్రీకాకుళం : గ్రామ వాలంటీర్లందరూ సచివాలయ సైనికులని, గ్రామీణ పాలనా వ్యవస్థకు మూలమని ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారం వ్యాఖ్యానించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థ గురించి ఆరా తీస్తున్నాయని పేర్కొన్నారు. శ్రీలంక, మలేషియా దేశాల నుంచి కూడా పరిశీలనకు సిద్ధమయ్యారని తెలిపారు. సోమవారం పొందూరు మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో జరిగిన గ్రామ వాలంటీర్ల సమావేశంలో తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4.50 లక్షల వాలంటీర్లు, 1.50 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగుల భర్తీ రాష్ట్ర, దేశ చరిత్రలో గొప్ప విషయమన్నారు. ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇవ్వాలని, ప్రస్తుతం అదే జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటకు కట్టుబడి మనసుతో పాలన చేస్తున్నారని చెప్పారు. సామాజిక న్యాయం కోసం శాసనసభలో చట్టాలను తీసుకువచ్చామని, వచ్చే శాసనసభలో 50 శాతం మహిళలతో నిండిపోతుందని అన్నారు. ప్రతీ గ్రామ సచివాలయాన్ని సందర్శిస్తానని తెలిపారు. ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. ఏపీపీఎస్సీ, ఎక్సైజ్, డీఎస్సీ తదితర ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నారని తెలిపారు. తన విధుల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నానని, ఎప్పుడూ వ్యవస్థలను భ్రష్ఠు పట్టించే దిశగా పనిచేయనని స్పష్టం చేశారు. -
కేశవదాసుపురంలో రెండో రోజూ ఉద్రిక్తత
సాక్షి, పొందూరు: మండలంలోని కేసవదాసుపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం క్రికెట్ ఆడుతుండగా యువకుల మధ్య తలెత్తిన వివాదం సద్దుమణగలేదు. సోమవారం ఉదయం ఇరు వర్గాలకు చెందిన పలువురు మరోసారి కొట్లాటకు దిగారు. గ్రామంలో పికెట్ నిర్వహిస్తున్న పోలీసులు టిఫిన్ చేసి వచ్చే కాసింత సమయంలోనే పలువురు పరస్పర దాడులకు దిగారు. ఆది, సోమవారాలు జరిగిన దాడుల్లో లింగాల శకుంతల, యజ్జల అప్పమ్మ, లింగాల తోటరాజు, గాడు ఎర్రప్పడుకు గాయాలయ్యాయి. లింగాల శకుంతల, యజ్జల అప్పమ్మకు చేయికి గాయాలు కాగా, ఛాతి ఎడమవైపు ఎముక బీటలు వారినట్లు వైద్యులు చెప్పినట్లు లింగాల తోటరాజు తెలిపారు. బీసీ కులానికి చెందిన గాడు ఎర్రప్పడు కాలికి, మెడకు గాయాలయ్యాయి. చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అంబేడ్కర్ విగ్రహం వద్దే తమపై బీసీలు దాడులు చేశారని, విగ్రహాన్ని పగలగొట్టేందుకు ప్యత్నించారని దళితులు ఆరోపించారు. నాగవరపు రమణ అనే వ్యక్తి తనకు లైసెన్స్ ఉందని, లారీతో మిమ్మల్ని గుద్దించేస్తానని బెదిరించనట్లు దళిత యువకుడు జె.ప్రదీప్ తెలిపారు. క్రికెట్ ఆడుతున్న సమయంలో మొదటి దళిత సామాజిక వర్గానికి చెందిన యువకులే బీసీ యువకులను తిట్టారని కొంత మంది గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విఫలమైన చర్యలు... గ్రామంలో కొనసాగుతున్న పికెటింగ్‌ను జెఆర్‌పుర సీఐ వై.మల్లేశ్వరరావు సోమవారం పరిశీలించారు. క్రికెట్ ఆడుకుంటున్న యువకుల మధ్య గొడవ జరిగితే పెద్దలు పరిష్కరించాల్సింది పోయి దాడులకు పాల్పడడటం సరికాదన్నారు. గ్రామంలో ఇరు కులాలకు చెందిన పెద్దలతో చర్చలు జరిపారు. అయితే చర్చలు విఫలమైయ్యాయి. సమస్య కొలిక్కి రాకపోవడంతో మొదటిగా దళితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహ్మద్ యాసిన్ తెలిపారు. బీసీ వర్గానికి చెందిన వారు కూడా 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు వెళ్లినట్లు తెలిసిందని చెప్పారు. -
టీడీపీ నాయకుని భూ కబ్జాపై విచారణ
సాక్షి, పొందూరు (శ్రీకాకుళం): గత ప్రభుత్వ హయాంలో కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. ఖాళీగా జాగా కనిపిస్తే చాలు పాగా వేసేందుకు ప్రయత్నించారు. దీనికి కొంతమంది అధికారులు కూడా సహకరించి, అక్రమంగా ఈ–పాసు పుస్తకాలు జారీ చేయడంతో మరింత సులువుగా స్థలాలను కాజేసేందుకు పన్నాగాలు పన్నారు. మండలంలోని దళ్లిపేట గ్రామంలోని సుమారు 25 ఎకరాల కొండ స్థలాన్ని టీడీపీ నాయకుడు పెయ్యల బోడయ్య కబ్జా చేశాడని గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బడి రఘురాంరెడ్డితో కలసి 107 మంది రైతులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంగా పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది స్థలం వద్దకు బుధవారం చేరుకొని ఉప తహసీల్దార్ బలిజేపల్లి ప్రసాదరావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. విచారణ సమయంలో ఆ స్థలంపై పట్టాలు ఉన్న పలువురు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ భూమిపై పట్టాలు ఉన్నవారి పేర్లను చదవాలని ఉప తహసీల్దార్ బలిజేపల్లి ప్రసాదరావు సూచించడంతో వీఆర్వో జి.వెంకటరావు పట్టాదార్ల పేర్లను చదివి వినిపించారు. అయితే ఈ భూమిపై పట్టా కలిగిన వారి పేర్లలో కబ్జాదారుడు పెయ్యల బోడయ్య పేరు లేకపోవడం గమనార్హం. అక్రమంగా ఈ–పాస్ పుస్తకం జారీ..? ఈ భూమిపై కబ్జాదారుడు బోడయ్యకు ఎటువంటి పట్టా లేకపోయినా అధికారులు ఈ–పాసు పుస్తకం ఎలా వచ్చిందని వైఎస్సార్సీపీ నాయకుడు బడి రఘురాంరెడ్డి అధికారులను ప్రశ్నించారు. ఈ పాసు పుస్తకాన్ని అధికారులు జారీ చేయడంలో ఆంతర్యం ఏంటన్నారు. ఇటీవలే కబ్జాదారుడు ఈ భూమిలో జీడి, నీలగిరి చెట్లు వేశారని, 25 ఎకరాల భూమి ఆక్రమించుకుంటుంటే అధికారులు చర్యలు తీసుకోకపోవడంలో మతలబు ఏంటన్నారు. దీనిపై సమధానం చెప్పాలని గ్రామస్తులు పట్టుబట్టడంతో అధికారులు విచారణ పూర్తిచేయకుండానే వెనుదిరిగారు. అర్హులకు పట్టాలిస్తాం ఈ విషయమై ఉప తహసీల్దార్ బలిజేపల్లి ప్రసాదరావు మాట్లాడుతూ సర్వే నంబర్ 1 కొండ స్థలంలో పూర్తిస్థాయి విచారణ జరిపి గ్రామంలో లేనివారు, సాగు చేయని వారి పట్టాలను తొలగించి అర్హులకు పట్టాలను అందిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని స్పష్టం చేశారు. పరిశీలనలో ఉప తహసీల్దార్‌తో పాటు ఎస్ఐ మహ్మద్ యాసిన్, మండల సర్వేయర్ గణపతి, ఆర్ఐ డి.నారాయణమూర్తి, వీఆర్వో జి.వెంకటరావులు పాల్గొన్నారు. -
పొందూరు సర్పంచ్ అక్రమ అరెస్టు
► టంగుటూరు పీఎస్‌ను ముట్టడించిన గ్రామస్తులు ► వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో 500 మందితో ధర్నా ► అర్థరాత్రి నుంచి ఉదయం 11 వరకు కొనసాగిన నిరసన ► సంబంధం లేని కేసులో జైలుకు తరలించిన పోలీసులు ► బెయిలు మంజూరు చేసిన జిల్లా కోర్టు ఒంగోలు: టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అర్ధరాత్రి అరెస్టులు, వైఎస్సార్సీపీ నాయకుల నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామస్థాయి నుంచి, రాష్ట్రస్థాయి నాయకుల వరకూ దాడులకు తెగబడుతూనే ఉంది. తాజాగా టంగుటూరు మండలం పొందూరు గ్రామ సర్పంచ్ రంగారావును తెలుగుదేశం నేతలు అక్రమంగా అరెస్టు చేయించారు. తనకు ఏమాత్రం సంబంధం లేని కేసులో రంగారావును అక్రమంగా ఇరికించి అర్థరాత్రి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆగ్రహం చెందిన వైఎస్సార్సీపీ అభిమానులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. 500 మందికి పైగా వైఎస్సార్సీపీ అభిమానులు, కొండపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో పోలీసుస్టేషన్‌కు చేరుకుని గురువారం అర్ధరాత్రి నుంచి ఉదయం 11 గంటల వరకు ధర్నా నిర్వహించారు. ఉదయం రంగారావును ఒంగోలు జిల్లా కోర్టులో హాజరుపరచడంతో జడ్జి ఆయనకు బెయిలు మంజూరు చేశారు. దీంతో కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. ధర్నాలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు, పార్టీ రాష్ట్ర నాయకుడు ఢాకా పిచ్చిరెడ్డి, మండల అధ్యక్షుడు బొట్ల రామారావు, కొండపి మండల నాయకులు వాకా బాలకృష్ణారెడ్డి, వాకా శ్రీకాంత్‌రెడ్డి, పొందూరు గ్రామ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రంగారావుపై ఎందుకంత కుట్ర.. పొందూరు గ్రామంలో పోటాపోటీగా జరిగి పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్ధిగా రంగారావు విజయం సాధించి సర్పంచ్ అయ్యారు. దీంతో 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నాయకులు ఆయన్ను టార్గెట్ చేసి, వేధింపులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయన వ్యాపారాలపై దాడులు చేయంచడం.. ఆయనకు చెందిన ఆస్తులకు నష్టం కలిగించడం చేసిన టీడీపీ నాయకులు.. తాజాగా తనకేమాత్రం సంబంధం లేని ఓ కేసులో పోలీసులను పురమాయించి టంగుటూరు పీఎస్‌కు తరలించారు. దాదాపు 3 వేలకు పైగా ఓట్లున్న పొందూరు గ్రామంలో వైఎస్సార్సీపీకి చిట్నీడి రంగారావు బలమైన నాయకుడు. పైగా రంగారావుకు మాజీ మంత్రి బాలినేని, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కొండపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి వరికూటి అశోక్బాబులతో మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. ఆయన రాజకీయంగా ఎదిగితే గ్రామంలో టీడీపీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందనే భయంతోనే టీడీపీ నాయకులు ఆయనపై అసత్య ప్రచారంతోపాటు, అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారు. తాజాగా రంగారావుకు ఏమాత్రం సంబంధం లేని కేసులో ఇరికించడం ద్వారా తమ అధికార ఆధిపత్యాన్ని చాటుకోవాలని భావించింది. కానీ పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ అభిమానులు తరలిరావడంతో వారి ఆటలు సాగలేదు. ఈ సందర్భంగా కొండేపి నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు మాట్లాడుతూ టీడీపీ ఆటలు సాగబోనివ్వమని స్పష్టం చేశారు. -
క్వారీ గుంతలో పడి ఇద్దరు మృతి
పొందూరు (శ్రీకాకుళం జిల్లా): పొందూరు పంచాయతీ పరిధిలోని రాపాక కూడలి వద్ద ఉన్న క్వారీ గుమ్ము (గుంత)వద్దకు స్నానానికి వెళ్లి ఆదివారం ఇద్దరు మృతి చెందారు. స్థానిక ఇటుక బట్టీలో పనిచేసే నాగవరపు వెంకటరమణ(40), కలివరపు రాజు (13), మరో చిన్నారి దుర్గతో కలిసి స్నానానికి వెళ్లారు. వెంకటరమణ రాజును తన వీపుపై ఎక్కించుకుని గుమ్ములోని నీటి లోపలికి దిగగా ప్రమాదవశాత్తు అడుగు భాగానికి వెళ్లిపోయారు. ఎంతసేపటికీ వారు పైకిరాకపోవడంతో చిన్నారి దుర్గ అక్కడి గ్రామస్తులకు విషయం చెప్పింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎచ్చెర్ల ఎస్ఐ సందీప్ గజ ఈతగాళ్లను పిలిపించి 30 అడుగుల లోతులో ఉన్న వారి ఇద్దరి మృతదేహాలను బయటకు తీయించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
మోడల్ స్కూల్లో ‘అత్తెసరు’
పొందూరు: మండల పరిధిలోని వావిలపల్లిపేట సమీపంలో ఉన్న మోడల్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం బాగోలేకపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. ఉడకని అన్నం పెట్టడంతో విద్యార్థులు పారబోశారు. కొంత మంది విద్యార్థులు కొంచెం అన్నం తిని అర్ధాకలితో ఉండిపోయారు. మరి కొంత మంది విద్యార్థులు పూర్తిగా అన్నం తినకుండా పారిబోసేశారు. ఆరు నుంచి పదో తరగతి వరకు 349 మంది విద్యార్థులు ఉండగా వారంతా బుధవారం ఆకలిని తట్టుకోలేకపోయారు. ఇలా పలుమార్లు ఉడకని అన్నం పెట్టడం, కూరలు బాగోలేకపోవడం, రుచిగా వండకపోవడం తదితర సమస్యలు ఇక్కడ సర్వసాధారణంగా జరుగుతుండడంతో పలువురు విద్యార్థులు నేరుగా ఇంటి నుంచి మధ్యాహ్న భోజనాన్ని తెచ్చుకొంటున్నారు. ఎన్ని సార్లు చెప్పినా మధ్యాహ్న భోజన నిర్వాహకుల్లో మార్పు రాలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సాంబారు, కూరలు బాగోలేవని వంట నిర్వాహకులను విద్యార్థులు పలుమార్లు ప్రశ్నిస్తే తింటున్న వారందరికి బాగుంది...మీకేనా బాగోలేదు అని కోపగించుకొనే వారని చెప్పారు. బుధవారం మధ్యాహ్న భోజనం మరీ అధ్వానంగా ఉండడంతో ఆకలిని తట్టుకోలేని విద్యార్థులు ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌కు బి.శ్రీరామ్మూర్తి, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మళ్లీ అన్నం వండించారు. అప్పటికి సమయం 2.30 గంటలు అయింది. వంట నిర్వాహకులతో మాట్లాడగా కొత్త బియ్యం కావడంతో తేడా వచ్చిందని, దానిని గుర్తించలేకపోయామని చెప్పారు. అన్నం తినలేకపోతున్నాం... పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోవడం లేదు. ఎన్ని సార్లు చెప్పినా వంటలో మార్పు రాలేదు. సర్దుకుపోయి తింటుం డడంతో ఆరోగ్యం పాడైంది. దీంతో రోజూ పాఠశాలకు మధ్యాహ్న భోజనాన్ని ఇంటి నుంచి తెచ్చుకొంటున్నాను. మా స్నేహితులంతా ఈ రోజు ఆకలితో ఉన్నారు. - కోరుకొండ రమ్యశ్రీ, తొమ్మిదో తరగతి. -
అభ్యర్థుల టెన్షన్
పొందూరు: జిల్లాలోని పశు సంవర్థక శాఖ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. గత ఏడాది నవంబర్ 29న మల్టీపర్పస్ డెయిరీ ఎక్సటెన్షన్ అసిస్టెంట్ (ఎంపీడీ ఈఏ) పోస్టులకు ఇంటర్వూలు నిర్వహించారు. 52 రోజులు గడుస్తున్నా.. ఇంత వరకు ఫలితాలు విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నారు. ఈ శాఖ నిర్వాకంపై అభ్యర్థులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటికే సిబ్బంది కొరతతో పశువుల ఆస్పత్రుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అనేక పశువైద్య కేంద్రాల్లో అటెండర్లే వైద్యం చేస్తున్న దీనమైన పరిస్థితి ఉంది. సరైన వైద్యం అందక మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిపై 28 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. 156 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అభ్యర్థి అకడమిక్ రికార్డుకు 80, మౌఖిక పరీక్షకు 20 మార్కులు కేటాయించారు. ఫలితాలు మాత్రం విడుదల కాలేదు. దళారులను ఆశ్రయించిన అభ్యర్థులు మౌఖిక పరీక్ష కోసం కొందరు అభ్యర్థులు అధికార పార్టీ నాయకులను, దళారులను ఆశ్రయించారు. పలువురు దళారులు అభ్యర్థుల నుంచి లక్షలాది రూపాయలు దండుకొన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక నాయకుల ఒత్తిడి కూడా అధికారులపై విపరీతంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. అధికారులు కూడా తమ సొంత ప్రయోజనాలను ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో నాయకుల ప్రభావానికి లోనుకాకుండా అధికారులు స్వతంత్రంగా ఫలితాలను విడుదల చేశారు. ఇక్కడి అధికారులు మాత్రం నాయకులకే గులామైనట్టు తెలుస్తోంది. అభ్యర్థులు జిల్లా పశు సంవర్థక శాఖాధికారులకు ఫోన్ చేస్తుంటే త్వరలోనే ఫలితాలు వస్తాయని చెప్పడమే తప్ప న్యాయం చేయడం లేదు. ఫలితాలు విడుదల చేస్తాం... పరిపాలనా పరమైన ఇబ్బందుల వల్ల ఫలితాలు విడుదలలో తీవ్ర జాప్యం జరగడం వాస్తవమే. పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న గ్రామాలను గుర్తించి నియామకాల జాబితాను విడుదల చేస్తాం. - నాగన్న, జేడీ, జిల్లా పశుసంవర్థక శాఖ పోస్టులను గుర్తించకుండానే... జిల్లాలో 28 పోస్టులు భర్తీ చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కానీ, పాల ఉత్తత్తి ఎక్కువగా ఉన్న గ్రామాలను గుర్తించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోంది. వాస్తవానికి పోస్టులను గుర్తించిన త ర్వాతనే నోటిఫికేషన్ జారీ చేయాలి. అందుకు విభిన్నంగా జిల్లాలో జరగడం విడ్డూరంగా ఉంది. నియామకాల జాప్యంపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
కోర్కె తీర్చలేదనే...
భార్యను చంపేశానని ఒప్పుకున్న భర్త రాములు పొందూరు: తన కోర్కె తీర్చలేదనే కారణంతోనే భార్యను చంపేశానని గారపేట గ్రామానికి చెందిన రాములు ఒప్పుకున్నాడు. గారపేట గ్రామంలో భార్యను చంపిన భర్తను స్థానిక పోలీసు స్టేషన్లో క్రైమ్ పోలీసులు ఆదివారం విచారించారు. ఎటువంటి తడబాటు లేకుండా భార్యను ఎలా చంపాడో హెడ్ కానిస్టేబుల్ రాజుకు రాములు వివరించాడు. తన కోర్కె తీర్చలేదనే కారణంతో చంపేశానని ఒప్పుకున్నాడు. ఇంటి గడపలో నిద్ర మత్తులో ఉన్న భార్య మెడకు గట్టిగా చీరను చుట్టేసి లాక్కొని ఇంట్లోకి తీసుకెళ్లిపోయి చంపేశానని చెప్పాడు. మెడమీద, పొట్టమీద కాళ్లుతో మట్టేసి తన్నేశానని తెలిపాడు. ఆమె విడిపించుకోకుండా ఉండేందుకు చేతులును, కాళ్లును కదలకుండా కట్టేశానని చెప్పాడు. కొన ఊపిరితో ఉన్నప్పుడు ఫ్యాన్‌కు ఉరేయడంతో మరణించిందని తెలిపాడు. అయితే ఇదంతా తాగిన మైకంలో చేశానని చెప్పాడు. చిత్ర హింసలు పెట్టినప్పుడు ఆమె అరవలేదా అని పోలీసులు ప్రశ్నిస్తే, అరుస్తున్నప్పటికీ బయటకు శబ్దం రాలేదని పేర్కొన్నాడు. దీనిని బట్టి మెడను ఎంత బిగుతుగా ఇరించేశాడో అర్ధమవుతుంది. గతంలో తన భార్య తల బద్దలు కొట్టి పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగిన సంఘటనలు ఉన్నాయని వివరించాడు. ఈ విచారణలో క్రైమ్ పోలీసు కానిస్టేబుల్లు కె.సి.రాజు, తారక్, స్థానిక పోలీసులు ఉన్నారు. -
రెవెన్యూ మాయ...
వీఆర్వోలతో ప్రభుత్వ విప్ సమావేశం రికార్డులు తేకపోవడంతో ఆగ్రహం ఆరా తీస్తే ప్రైవేటు వ్యక్తి ఇంట్లో లభ్యం కలెక్టర్ ఆదేశాలతో స్వాధీనం పొందూరు: ప్రైవేటు వ్యక్తి ఇంట్లో రెవెన్యూ రికార్డులను స్థానిక రెవెన్యూ సిబ్బంది మంగళవారం సాయంత్రం స్వాధీనం చేసుకొన్నారు. కలెక్టర్ లక్ష్మీన రసింహం, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఇన్‌ఛార్జి తహశీల్దార్ కె. శ్రీరాములు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఆ వ్యక్తి ఇంట్లో సోదాలు జరిపారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ వీఆర్వోలతో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తుండగా, వీఆర్వోలు రికార్డులు తీసుకురాకుండా హాజరవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ రికార్డులు ఎక్కడ ఉన్నాయని ఆరా తీయగా పొందూరులోని ఓ ప్రైవేటు వ్యక్తి ఇంట్లో ఉన్నాయని తెలియడంతో వెంటనే కలెక్టర్‌తో మాట్లాడి సోదాలు జరిపించారు. రికార్డులను తహశీల్దార్ కార్యాలయానికి తెప్పించారు. తోలాపి, తాడివలస, పెనుబర్తి, అలమాజీపేట, సింగూరు, బొడ్డేపల్లి, మొదలవలస తదితర గ్రామాలకు చెందిన రికార్డులన్నీ ప్రైవేటు వ్యక్తి కోరుకొండ మోహనరావు ఇంట్లో ఉన్నట్లు వాటిని స్వాధీనంచేసుకుని వచ్చిన సీఎస్‌డీటీ మధుసూదనరావు, ఆర్ఐలు మధుసూదనరావు, ప్రవీణ్ తెలిపారు. వన్-బి, ఎఫ్ఎంబీ, వీఏ-3 రికార్డులు తహశీల్దార్ కార్యాలయంలోనైనా లేదా వీఆర్ఓల వద్దనైనా ఉండాలి. పాస్ పుస్తకాలు జారీ చేయాలంటే వన్-బి తప్పనిసరిగా ఉండాలి. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూములను గుర్తించాలంటే ఎఫ్ఎంబీ ఉండాలి. రైతుల వివరాలు, భూ విస్తీర్ణం అడంగల్‌లో పొందుపరిచేందుకు వీఏ-3 అత్యవసరం. అలాంటి ముఖ్యమైన రికార్డులన్నీ ఇలా ప్రైవేటు వ్యక్తి ఉంట్లో ఉండటంలో అంతరార్థమేమిటో అంతుబట్టని విషయంగా ఉంది. పైగా కొందరు వీఆర్ఓలు రికార్డులు తమ వద్ద లేవని అబద్ధాలు చెప్పడంతో మరిన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే. కార్యక్రమంలో ఎస్ఐ కుమార్ ఉన్నారు. -
గెడ్డలో కలిసిన చంద్రబాబు హామీ !
రెల్లుగెడ్డతో పొంచిఉన్న ముంపు సమస్య పొందూరు :పొందూరు మండలంలోని రెల్లుగెడ్డతో ఉన్న ముంపు సమస్యను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ గెడ్డలో కలిసిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. రెల్లుగెడ్డ పరీవాహక ప్రాంతంలో ఏటా పంటపొలాలు ముంపు బారిన పడుతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పలుగ్రామాల గుండా ఈ గెడ్డ ప్రవహిస్తున్నప్పటికీ మొదలవలస పరిసర గ్రామాల పరిధిలోని పంటలను తీవ్రంగా ముంచేస్తోంది. ప్రతీ సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెలల్లో వచ్చే వరదలతో పంటలు నాశనమవుతున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ తుపానుకు పంటలు పూర్తిగా మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో అదే నెల 15వ తేదీ సాయంత్రం ఆరు గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెల్లుగెడ్డ ముంపు ప్రాంతమైన మొదలవలసను స్వయంగా పరిశీలించారు. ఈ గెడ్డ నుంచి విముక్తి కల్పిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ తరువాత దీన్ని పట్టించుకోవడం మానేశారు. గోరింట, గోకర్నపల్లి, తాడివలస, మొదలవలస, సింగూరు గుండా రెల్లుగెడ్డ ప్రవహిస్తుంది. వర్షాలు భారీగా కురిసినప్పుడు గోరింట, గోకర్నపల్లి, తాడివలస గ్రామాల నుంచి వచ్చే నీరు మొదలవలస వద్ద కలిసి నీటి ప్రవాహం ఎక్కువైపోతుంది. సింగూరు గుండా నాగావళిలో కలవాల్సిన నీరు తిరగి మొదలవలస వైపునకు పోటెత్తి మొదలవలసతో పాటు బొడ్డేపల్లి, అచ్చిపోలవలస, కింతలి గ్రామాల పరిధిలోని పంట పొలాలను ముంచేస్తుంది. పొందూరుకు ఎగువ ప్రాంతాలైన రాజాం, సంతకవిటి, జి.సిగడాం మండలాల్లో కురిసిన భారీ వర్షాల నీరు రెల్లుగెడ్డలో ప్రవేశించి వరి పొలాలను ముంచుతుంది. మూడు, నాలుగు దశాబ్దాలుగా ఈ గెడ్డ పరీవాహక ప్రాంతాల్లో పంటలను రైతులు నష్టపోవడం పరిపాటిగా జరుగుతుంది. బొడ్డేపల్లి, సింగూరు మీదుగా ప్రవహిస్తున్న నాగావళి నదిలో నీటిమట్టం పెరిగితే ఆ నీరంతా సింగూరు వద్ద రెల్లుగెడ్డలో కలవటంతో పంటలు మునిగిపోతున్నాయి. విలువ లేని హామీ వర్షాకాలంలో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు రెల్లుగెడ్డను ఆధునీకరించడంలో విఫలమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వవిప్ కూన రవికుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబకు ఈ ప్రాంతంపై పూర్తి సమాచారం అందించారు. దీంతో సీఎం మొదలవలస వచ్చి రె ల్లుగెడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. దీన్ని ఆధునీకరించి ముంపు సమస్యలేకుండా చేస్తామనని హామీ ఏడు నెలలైనా ఆచరణకు నోచుకోలేదు. కనీసం పట్టించుకోవడం లేదు. గెడ్డను ఆధునికీరించాలంటే సుమారు రూ. 4 కోట్లు ఖర్చుయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే మూడు వేల ఎకరాలకు రక్షణ కలుగుతుంది. సుమారు 1500 రైతు కుటుంబాలకు లబ్ధిచేకూరనుంది. అది ఉత్తుత్తి హామీ గత ఏడాది అక్టోబర్ 15న చంద్రబాబు మొదలవలస వచ్చి రెల్లుగెడ్డ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ఆ హామీ ఉత్తుత్తి హామీగానే మిగిలింది. మళ్లీ వర్షాకాలం సమీపిస్తుండడంతో రైతుల్లో గుబులు ప్రారంభమైంది. ఇప్పటికైనా రెల్లుగెడ్డపై దృష్టి సారించాలి. - మొదలవలస రామస్వామినాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, మొదలవలస -
ఆగిపోయిన ‘కల్యాణి’ రాగం
నాలుగేళ్ల క్రితం మూడుముళ్లు పడ్డాయి. మూడు నెలలకే అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. మొదట ఆడబిడ్డ పుట్టింది. వేధింపులు మరింత పెరిగాయి. పుట్టింటి వైపు కన్నెత్తి చూడకుండా నిర్బంధానికి గురి చేశారు. నెల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చినా.. ఆ బిడ్డ అదే రోజు చనిపోవడం.. ఇప్పుడు బాలింత అయిన ఆ ఆడకూతురు ఈ లోకాన్నే వీడిపోవడం విషాదమైతే.. ఆమె శరీరంపై ఉన్న గాయాలు అత్తింటి ఆరళ్లను వేలెత్తి చూపుతున్నాయి. వారిపైనే అనుమానాలు పెంచుతున్నాయి. పొందూరు : అత్తింటి ఆరళ్లకు మరో అబల బలి అయ్యింది. పచ్చి బాలింత అయిన ఆమెను బలవన్మరణానికి గురి చేశారన్న అనుమానాలను ఆమె శరీరంపై ఉన్న గాయాలు రేపుతున్నాయి. పోలీసులు సైతం ఆ కోణంలోనే కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. జి.సిగడాం మండలం దవళపేటకు చెందిన కల్యాణికి పొందూరు మండలం అలమాజీపేటకు చెందిన బాడాన నర్సింగరావుకిచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. ఎకరా పొలం, రూ. 5 లక్షల నగదు, 10 తులాల బంగారం కట్నకానుకలుగా సమర్పించారు. అయితే పెళ్లయిన మూడు నెలల నుంచే అదనపు కట్నం కోసం కల్యాణికి అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. ఈ విషయం తెలుసుకొని దవళపేట సర్పంచ్ కంచరాన సూరన్నాయుడు తదితర పెద్దలు పలుమారు కల్యాణి అత్తమామలతో మాట్లాడి సర్ది చెప్పారు. ఈ తరుణంలో కల్యాణి ఆడపిల్లకు జన్మనిచ్చింది. దాంతో వేధింపులు మరింత పెరిగాయి. పండుగలకు, శుభకార్యాలకు కూడా ఆమెను పుట్టింటికి పంపించకుండా చేసేవారు. కూతురిని, మనవరాలిని చూసేందుకు వెళ్లిన కల్యాణి తల్లిదండ్రులకు సైతం వారిని చూపించకుండా చేసేవారు. ఇటీవల కల్యాణి మళ్లీ గర్భం దాల్చినా పుట్టింటికి పంపకపోగా భర్త, అత్తమామలు ఆమెను రోజూ హింసించేవారు. ఫలితంగా నెల రోజుల క్రితం కల్యాణి జన్మనిచ్చిన మగబిడ్డ అదే రోజు మరణించాడు. కొడుకు మరణించిన బాధలో ఉన్న బాలింత అయిన కల్యాణిని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు వెళ్లిన ఆమె తల్లిదండ్రులను నిర్ధాక్షిణ్యంగా బయటకు తోసేశారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున మీ కూతురు చనిపోయిందంటూ అల్లుడు ఫోన్ చేసి చెప్పడంతో తల్లిదండ్రులు భోరున రోదిస్తూ అలమాజీపేటకు వెళ్లారు. ఒళ్లంతా గాయాలే ఈ సమాచారం అందున్న మహిళా పోలీస్ విభాగం డీస్పీ ఎ.శ్రీనివాసరావు, తహశీల్దార్ భువన్మోహన్, ఎస్సై శ్యామలరావు, వీఆర్వోలు జనకచక్రవర్తి, రామ్మూర్తి నాయుడు సంఘటన స్థలానికి చేరుకొని కల్యాణి మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులను విచారించి వివరాలు సేకరించారు. ఒంటిపైన గాయాలను నమోదు చేసుకున్నారు. ముఖం కింద ఎడమ దవడ నుంచి కుడి దవడ వరకు గాయాలు, ముక్కు ఎడమ వైపున రక్తపు గాయం, ఎడమ భుజం దిగువన తట్లు, కుడి, ఎడమ మోకాళ్ల దిగువన, పైన గీరుకుపోయిన గాయాలు, ఎడమ మడంపైన రగుడు గాయం, వీపుపైన తట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ మేరకు సెక్షన్ 302, 304 సబ్‌సెక్షన్-బి కింద హత్య, వరకట్న వేధింపుల కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. పాపం చిన్నారి తల్లి మరణించినట్లు తెలుసుకోలేని కల్యాణి మూడేళ్ల కూతురు ప్రవల్లిక తీరు అక్కడున్న వారిని కలచివేసింది. తల్లి నేలమీద పడుకొని ఉందనుకొని పిలిచింది. ఎంతకీ ఆమె పలక్కపోవడంతో బిక్కమొహంతో ఏడవడం మొదలుపెట్టింది. ఆ చిన్నారిని సముదాయించడం ఎవరి తరం కాలేదు. ఆ సంఘటన చూసిన వారందరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి. చిన్నారి ప్రవల్లిక భవిష్యత్తును, తమ కూతురి మరణాన్ని తలచుకొని కల్యాణి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అల్లుడు, కుటుంబ సభ్యులే చంపేశారు నా కూతురిని అల్లుడు, అత్తమామలు, కుటుంబ సభ్యులు కలిసి చంపేశారు. పుట్టిన బిడ్డ చనిపోయిన బాధలో ఉన్నప్పుడైనా మా ఇంటికి పంపించకుండా ఈ దారుణానికి ఒడిగట్టారు. -ఎన్ని సత్తెమ్మ, మృతురాలి తల్లి -
మొదలైంది మరో.. పవర్ గేమ్
బృందం పర్యటన సాగిందిలా.. ఎచ్చెర్ల మండలంలో.. జిల్లాలో మొదటిగా ఈ మండలంలోని ఎస్.ఎం.పురం ప్రాంతంలో పర్యటించింది. భూముల వివరాలతో అధికారులు రూపొందించిన ప్రాథమిక మ్యాప్ ఆధారంగా పరిశీలన జరిపింది. పొందూరు మండలంలో.. అనంతరం పొందూరు మండలంలోని బురిడి కంచరాం, ధర్మపురం, కనిమెట్ట భూములను పరిశీలించింది. భౌగోళిక పరిస్థితులు, పంటల సాగు, భూగర్భ జలాల వివరాలపై ఆరా తీసింది. నరసన్నపేట మండలంలో.. ఉర్లాం, కామేశ్వరిపేట, జల్లువానిపేట, కొత్తపోలవలస, కొల్లవానిపేట గ్రామాల్లో పర్యటించింది. భూముల లభ్యత, పవర్ ప్లాంట్‌కు గల అనుకూలతలను పరిశీలించింది. ఎచ్చెర్ల, పొందూరు, నరసన్నపేట:జిల్లాలో మరో పవర్ గేమ్ మొదలైంది. ఇప్పటికే సోంపేట, కాకరాపల్లి పవర్ ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతుండగా కొత్తగా జపాన్ సంస్థ సుమితొమొ ఆధ్వర్యంలో ప్రతిపాదించిన 4వేల మెగావాట్ల అల్ట్రా మెగా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌కు స్థల పరిశీలన మొదలైంది. సుమితొమొ-జెన్కో ప్రతినిధుల బృందం మంగళవారం జిల్లాలోని ఎచ్చెర్ల, ఆమదాలవలస, నరసన్నపేట నియోజకవర్గాల్లోని ప్రతిపాదిత భూములను పరిశీలించింది. తొమ్మిది మంది సభ్యుల జపాన్ బృందంతోపాటు జెన్కో చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర్బాబు, ఎస్ఈ రంగనాథం, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఎల్.సుబ్రమణ్యం, ఎల్.సూర్యనారాయణ తదితర పది మంది సభ్యులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎచ్చెర్ల, పొందూరు మండలాల్లో, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నరసన్నపేట మండలంలోనూ ఈ బృందాలతో పర్యటించి వివరాలు అందజేశారు. మ్యాప్‌ల ఆధారంగా పరిశీలన మొదట ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురం ప్రాంతంలో పర్యటించిన బృందానికి స్థానిక అధికారులు రూపొందించిన మ్యాపు అందజేశారు. ఇందులో ఎస్.ఎం.పురానికి చెందిన 601.02, పొందూరు మండలంలో కనిమెట్టకు చెందిన 746. 40, బురిడి కంచరాంకు చెందిన 438.12, కింతలికి చెందిన 38.71, తోలాపికి చెందిన 190.55, ధర్మపురానికి చెందిన 271.82, నందివాడకు చెందిన 10 4.92 ఎకరాలు.. మొత్తం 2391.55 ఎకరాల భూములను సూచిం చారు. అనంతరం పొందూరు మండలంలోని బురిడికంచరాం,ధర్మపురం, కనిమెట్ట భూములను పరిశీలించారు. భూముల పరిస్థితి, పంటల సాగు, భౌగోళిక పరిస్థితి, తదితర అంశాలను ఆరా తీశారు. అయితే ప్రభుత్వ స్థలం ఉందని అధికారులు చెబుతున్న కొండ ప్రాంతాన్ని మాత్రం జపాన్ బృందం పరిగణనలోకి తీసు కోలేదు. మరోపక్క చెరువు గర్భం 200 ఎకరాలుగా గుర్తించారు. ఎలాగైనా ఈ ప్రాంతంలోనే ప్రాజెక్టు ఖరారు చేయించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ విప్, జెన్కో అధికారులు ప్రయత్నించగా.. జపాన్ బృందం ప్లాంట్, టౌన్షిప్, ఇతరత్రా అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థల పరిశీలన చేశారు. పోలీసుల మోహరింపు ఈ పర్యటన సందర్భంగా శ్రీకాకుళం డీఎస్పీ భార్గవరావు నాయుడు, జేఆర్‌పురం సీఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ధర్మపురం నుంచి ఎస్ఎం పురం వరకు పోలీసులను మోహరించారు.పోలీసులు ముందుగా ఈ ప్రాంత గ్రామాల్లో సివిల్ దుస్తుల్లో తిరుగుతూ పరిస్థితిని ఆరా తీశారు. అయితే ప్రాజెక్ట్‌పై ఇంకా పూర్తిగా అవగాహన లేకపోవడంతో ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఎచ్చెర్ల నాయకులు దూరం ఎస్ఎంపురం భూముల పరిశీలన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ చౌదరి అవినాష్, ఇదే గ్రామానికి చెందిన జడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి తదితరులు హాజరు కాలేదు. బృందం పర్యటన సమాచారం కూడా వీరికి తెలియజేయలేదని తెలిసింది. ఉర్లాం ప్రాంతంలో.. అనంతరం ఈ బృందం మంగళవారం సాయంత్రం నరసన్నపేట మండలంలో పర్యటించింది. ఉర్లాం, కామేశ్వరిపేట, జల్లువానిపేట, కొత్తపోలవలస, కొల్లవానిపేట తదితర గ్రామాల భూములను పరిశీలించారు. ఉర్లాం సమీపంలోని మూర్తిరాజు కాల్వ నుంచి రెండు వైపులా కన్పిస్తున్న పంట భూములను పరిశీలించారు. జపాన్ బృంద నాయకుడు యువమోటోకు జెన్కో ప్రతినిధి సీవీ రంగనాథన్, స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, తహశీల్దార్ సుధాసాగర్లు భూముల సమాచారం అందజేశారు. ఈ ప్రాంతంలో 2600 ఎకరాల భూమి ఉందని, దీంట్లో 600 వరకూ ప్రభుత్వ భూమి అని వివంచారు. రెండు కిలోమీటర్ల పరిదిలో రైల్వే స్టేషన్, 23 కిలోమీటర్లు పరిదిలో కళింగపట్నం పోర్టు, ఐదు కిలో మీటర్ల పరిధిలో జాతీయ రహదారి ఉన్నాయని వివరించారు. ప్రధాన నీటి వనరుగా వంశధార నది ఉందని తెలిపారు. అలాగే గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా ఆశాజనకంగా ఉంటుందని వివరించారు. వీరి వెంట శ్రీకాకుళం ఆర్డీఓ దయానిధి ఇతర అధికారులు పాల్గొన్నారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. -
‘పవరే’ పరమార్థమా!
ఎచ్చెర్ల, పొందూరు:థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన ఎస్ఎంపురం-ధర్మపురం, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌ల చుట్టూనే తిరుగుతోంది. జపాన్‌కు చెందిన సుమితొమొ సంస్థ, జెన్కోలు కలిసి ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ కోసం సోంపేట, పలాస, పోలాకి ప్రాంతాల్లోనూ భూములను పరిశీలించినా.. ఎస్.ఎం.పురం-ధర్మపురం ప్రాంతాల్లో ఏర్పాటుకే సుమితొమొ ఆసక్తి చూపుతోందని విప్ ఏకపక్షంగా చెప్పిడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఈ నాలుగు ప్రాంతాలను పరిశీలించేందుకు ఆ సంస్థ ప్రతినిధి బృందం జిల్లాకు నేడో రేపో రావాల్సి ఉంది. ఈ విషయాన్ని పట్టించుకోకపోగా ఇక్కడ అవసరమైన భూములు అందుబాటులో ఉన్నాయని కూన ప్రకటించడంపై నిరసన వ్యక్తమవుతోంది. పట్టు కోసమేనా..? : కాగా ఎస్.ఎం.పురం ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉండగా, ధర్మపురం ఆమదలవలస నియోజకవర్గ పరిధిలోని పొందూరు మండల ంలో ఉంది. ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకట్రావు ప్రమేయం లేకుండానే ఆమదలవలస ఎమ్మెల్యే అయిన రవికుమార్ ఈ ప్రాంతాల్లో పలుమార్లు పర్యటించి స్థలాలు పరిశీలించారు. తాజాగా ఆదివారం కూడా జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహంతో కలిసి మరోసారి పరిశీలించారు. ఎస్.ఎం.పురం ఏపీ గురుకుల పాఠశాలలో ఇదే అంశంపై వారిద్దరూ రెవెన్యూ అధికారులతో సమీక్ష జరిపినా అదే గ్రామానికి చెందిన జెడ్పీ చైర్పర్సన్ చౌదిరి ధనలక్ష్మికి గానీ, స్థానిక సర్పంచ్ అయిన ఆమె కుమారుడు చౌదిరి అవినాష్‌కు గానీ సమాచారం లేదు. భూములెక్కడ..? పోనీ విప్ చెబుతున్నట్లు భూములు అందుబాటులో ఉన్నాయా అంటే.. అదీ లేదు. ప్రాజెక్టుకు 2600 ఎకరాలు అవసరమని నిర్ణయించగా ఎచ్చెర్ల పరిధిలో ఎస్సీ రైతులకు పట్టాలుగా ఇచ్చిన 75 ఎకరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎస్.ఎం.పురం పరిధిలో 122 సర్వే నెంబర్లో 790 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉండగా.. అందులో 130 ఎకరాలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి, 50 ఎకరాలు 21వ శతాబ్ది గురుకులానికి, 100 ఎకరాలు రాజీవ్ స్వగృహకు, 20 ఎకరాలు ఏపీ గురుకుల పాఠశాలకు ఎప్పుడో కేటాయించారు. మిగిలింది నిర్మాణాలకు సైతం పనికి రాని కొండ ప్రాంతమే. ఇక పొందూరు మండలం ధర్మపురంలో కూడా ఎస్సీ రైతులకు పట్టాలు ఇచ్చిన సుమారు 200 ఎకరాల భూములే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే రైతుల నుంచి తీసుకోక తప్పదు. ప్రస్తుతం ఇక్కడ ఎకరా ధర రూ.15 లక్షల నుంచి రూ. 20 లక్షలు ఉండగాఅధికారులు మాత్రం రూ.5 లక్షలే ఉందని అంటున్నారు. ప్రభుత్వ విప్ మాత్రం తుళ్లూరు ప్రాంతంలా ఇక్కడి రైతులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయి పోతారని, ఇంటికో ఉద్యోగం సైతం వచ్చేస్తుందని త్రిశంకు స్వర్గం చూపిస్తున్నారు. అధికారుల కోణం మరోలా ఉంది. ఈ ప్రాంతం పొందూరు రైల్వేస్టేషన్‌కు, సముద్రతీరానికి దగ్గరగా ఉండటంతో పాటు ప్రాజెక్టుకు మడ్డువలస ప్రాజెక్టు నీరు అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతో దీని వైపు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. వీరందరి ఆలోచనలు, పట్టుదలలు ఎలా ఉన్నా గ్రామాలు, పంట భూములను కాలుష్య కోరల్లోకి నేట్టే పవర్ ప్లాంట్ వద్దే వద్దని ఆందోళనలు ప్రారంభించారు. పట్టాలు లాక్కుంటే ప్రతిఘటిస్తాం ప్రభుత్వం థర్మల్ పవర్ ప్లాంట్ ఆలోచన విరమించుకోవాలి. పంట భూములను పనికిరాని భూములని అనటం ప్రభుత్వ విప్‌కు తగదు. పట్టాలు లాక్కోవాలని చూస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదు. - గుడివాడ కుప్పయ్య, బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జి కాలుష్య కోరల్లోకి నెట్టొద్దు ప్రభుత్వం గతంలో 112 సర్వే నెంబర్లో ఎస్సీ విలాంగులకు భూమి పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు లాక్కోవాలని చూస్తే సహించేది లేదు. గ్రామాలను కాలుష్య కోరల్లోకి నెట్టే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి. -ఎ.అప్పారావు, దళిత నాయకుడు -
ఈ కాళ్లు ఎవరివో?
పొందూరు, జి.సిగడాం: గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసి చెరుకు తోటలో తగలబెట్టిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సంఘటన స్థలంలో మృతదేహం మొత్తం కాలిపోగా, రెండు కాళ్లు మాత్రమే ఉన్నాయి. హతుడెవరో.. హంతకులెవరో తెలియరావడంలేదు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... పొందూరు మండలం బురిడి కంచరాం, ధర్మపురం గ్రామాల మధ్యలోని చెరుకు తోటలో గుర్తుతెలియని వ్యక్తిని, గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి తగుల బెట్టారు. మొదలవలస సన్యాసిరావు అనే రైతుకు చెందిన చెరుకుతోటలో పని చేసేందుకు సోమవారం ఉదయం వ్యవసాయకూలీలు వెళ్లగా, అక్కడ తగల బెట్టిఉన్న మృత దేహాన్ని గమనించారు. వారు గ్రామస్తులకు చెప్పటంతో, గ్రామస్తులు పొందూరు పోలీసులకు సమాచారం అందజేశారు. గ్రామ రెవెన్యూ అధికారి ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య, సాక్షాలు తారుమారు సెక్షన్ల కింద కేసునమోదు చేశారు. మృతదేహాన్ని ఆది రాత్రి తగులబెట్టి ఉంటారని పోలీసులు భావిస్తుండగా, సంఘటన స్థలంలో మృత దేహాన్ని కాల్చేందుకు పెట్రోల్, కిరోసిన్, టైర్లు వినియోగించి నట్లు తెలుస్తోంది. కత్తి, మద్యం బాటిళ్లు, కాలిన టైర్ల ఆనవాళ్లు కూడా ఉన్నాయి. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా కాలిపోగా, కాళ్లు మాత్రం సగం కాలి మిగిలి ఉన్నాయి. మృతుడు ఎవ్వరనేదీ గుర్తించే అవకాశాలు కనిపించటం లేదు. పథకం ప్రకారమే.. చెరుకు తోటలకు రహదారి 200 మీటర్ల దూరాన ఉంటుంది. వాహనంలో బతికున్న వ్యక్తిని తీసుకొచ్చి సజీవంగా తగులబెట్ట టం కష్టం. ఎక్కడో చంపి, మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి మో సుకువచ్చి, పథకం ప్రకారం మృతదేహం తగులబెట్టేందుకు అవసరమైన సామగ్రిని సైతం తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీనితో పోలీసులు జిల్లాలోని ఎక్కడైనా అదృశ్యం కేసులు ఇటీవల నమోదయ్యాయా అన్న కోణంలో పరిశీస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తి ఆడా, మగా అన్న అంశం కూడా తెలియం లేదు. కాళ్ల ఆనవాళ్లను బట్టి పురుషుడే అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సంఘన స్థలాన్ని పరిశీలించిన జేఆర్ పురం సీఐ సాకేటి విజయ్ కుమార్, పొందూరు ఎస్సై ఆర్‌హెచ్‌ఎన్‌వి కుమార్, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ పరిశీలించాయి. ప్రాథమికంగా 302(హత్య), 201 (సాక్షాలు తారుమారు)సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరో పక్క ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల ఆచూకీ కోసం, హతుని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. -
రాజుకుంటున్న థర్మల్ కుంపటి
పొందూరు:పొందూరు-ఎచ్చెర్ల మండలాల సరిహద్దులో థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలన్న ప్రతిపాదన ఆ ప్రాంతంలో ఉద్యమ కుంపటి రాజేస్తోంది. స్థలపరిశీలనకు జపాన్‌కు చెందిన సుమిటోమో సంస్థ ప్రతినిధులు రానున్నారన్న వార్తలతో కలవరపాటుకు గురైన స్థానికులు థర్మల్ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆదివారం ముక్తకంఠంతో నినదించారు. పొందూరు మండలం తోలాపి సత్యసాయి సేవా మందిరం వద్ద ధర్మపురం, పిల్లలవలస, దళ్లవలస, తోలాపి, కనిమెట్ట గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, రైతులు సమావేశమయ్యారు. ఈ గ్రామాల పరిధిలోనే సుమారు 2 వేల ఎకరాల్లో థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించడంపై వారంతా చర్చించారు. ఈ ప్రాజెక్టు వల్ల త మ గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో పంట భూము లు నాశనమవుతాయని, వ్యవసాయం కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ప్రతిపాదనకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. తమ మనోభావాలను పట్టించుకోకుండా ప్రాజెక్టు ఏర్పాటుకే నిర్ణయిస్తే ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పంట భూముల్లో థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ ప్రతినిధి సువ్వారి గాంధీ, గురుగుబెల్లి మధుసూదనరావు, పప్పల దాలినాయుడు, పప్పల అప్పలనాయుడు, యతిరాజుల జగన్నాథం, చల్లా ముఖలింగం, బొనిగి రమణమూర్తి, గురుగుబెల్లి శ్రీరామ్మూర్తి, పాత్రుని శ్రీనివాసరావు, మొదలవలస మురళీ, పాపారావు, వావిలపల్లి తిరుమలరావు, వజ్జాడ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కింతలి, కనిమెట్ట, తోలాపి, దళ్లవలస గ్రామాల్లో చాలావరకు నారాయణపురం కాలువ ద్వారా పంటలు పండిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వీఆర్‌గూడెం, తండ్యాం, రాపాక, పొందూరు, తోలాపి, కింతలి, కనిమెట్ట, పిల్లలవలస, ధర్మపురం, బురిడి కంచరాం, ఎస్ఎంపురం పరిధిలోని పలు గ్రామాల్లో మెట్టు భూములను సస్యశ్యామలం చేసేందుకు రూ. 47 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో ఇప్పటికే అరిణాం అక్కివలస డిస్ట్రిబ్యూటరీ నిర్మించి నీరు విడుదల చేశారు. ధర్మపురం డిస్ట్రిబ్యూటరీ పనులు చిన్న ఇబ్బందుల కారణంగా నిలిచిపోయాయి. వీటిని మళ్లీ చేపట్టేందుకు మడ్డువలస ప్రాజెక్టు అధికారులు సిద్ధమవుతున్న తరుణంలో థర్మల్ ప్రతిపాదన పిడుగుపాటులా రైతులను తాకింది. పచ్చదనం పోతుంది థర్మల్ ప్రాజెక్టుతో పచ్చదనం కనుమరుగవుతుంది. గాలి విషతుల్యమవుతుంది. ఈ ప్రాంతం ఏడారిగా మారిపోతుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గిపోతాయి. వేసవికాలంలో రెట్టింపు స్ధాయిలో పెరిగిపోతాయి. -గురుగుబెల్లి మధుసూదనరావు, విశ్రాంత ప్రిన్సిపాల్ థర్మల్ ప్రతిపాదన విరమించాలి థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలి. వ్యవసాయాన్నే నమ్ముకొని బతుకుతున్నాం. భూమి సారం దెబ్బతింటాయి. రైతు శ్రేయస్సే ధ్యేయమని చెబుతున్న ప్రభుత్వం పంట భూముల్లో పవర్ ప్రాజెక్టు పెట్టడం అన్యాయం. - చల్లా ముఖలింగం, సర్పంచ్, ధర్మపురం ప్రాణాలైనా అర్పిస్తాం... ప్రాణాలు అర్పించైనా పవర్ ప్రాజెక్టు ప్రతిపాదనను అడ్డుకుం టాం. సోంపేట, కాకరాపల్లి పోరాటాల స్ఫూర్తితో ఇక్కడా ఉద్యమాలుచేపడతాం. రైతాం గాన్ని, పంట భూములను కాపాడుకుంటాం. అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ మంటలు రేపడం తగదు. -సువ్వారి గాంధీ, ఎంపీపీ ప్రతినిధి, వీఆర్‌గూడెం -
పొందూరులో టెక్స్టైల్ పార్కు
పొందూరు : పొందూరులో కనీసం వెయి మందికి ఉపాధి కల్పించేందుకు వీలుగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తెలిపారు. స్థానిక సాయిబాబా చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చేనేత వృత్తిలో ఆదాయం లేక, ఎంతోమంది కార్మికులు హైదరాబాద్‌లో మట్టితవ్వుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతి వృత్తులు కనుమరుగవ్వకుండా ఉండాలంటే బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్ప ల్ మాట్లాడుతూ చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే మార్కెటింగ్ జరగాలన్నారు. చేనేత వస్త్రాలను ధరిస్తే దాదాపు ఎలర్జీలు రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో విదేశీయులు వీటిపై మక్కువ చూపుతుంటారని తెలిపారు. విదేశాలకు ఉత్పత్తులను పంపిస్తే డిమాండ్ పెరిగి కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా లాభాలు వస్తాయని పేర్కొన్నారు. టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు మండల రెవెన్యూ కార్యాలయం పరంగా అవసరమైన సహకారం అందిస్తామన్నారు. స్కాలర్‌షిప్‌ల పంపిణీ మహాత్మా గాంధీ బునకర్ బీమా యోజన పథకం కింద తొమ్మిది, పది, ఇంటర్ చదువుతున్న 88 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 1200లు చొప్పున స్కాలర్షిప్లను, చేనే త కార్మికులకు డిజైనింగ్ పరికరాలను కలెక్టర్, విప్, ఎల్ఐసీ డివిజనల్ మేనేజర్ కె.రవికాంత్ అందజేశారు. జిల్లాలో మహాత్మా గాంధీ బునకర్ బీమా యోజన పథకం ద్వారా 1053 మం దికి స్కాలర్ అందిస్తున్నామని హ్యాండ్లూమ్ ఏడీ గుత్తు రాజారావు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు లోలుగు శ్రీరాముల నాయుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు కూన సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యురాలు అనకాపల్లి అనూష, తహశీల్దార్ భువన్ మోహన్, ఎంపీడీవో బాలసుబ్రహ్మణ్యం, పొందూరు, తోలాపి చేనేత సహకార సంఘాల అధ్యక్షులు గంపల వీరభద్రస్వామి, బట్ట అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.