Printing
-
ప్రింటింగ్ దోశ..
కాగితంపై అక్షరాలు ప్రింట్ తీయడం చూశాం.. ఫొటోలు ప్రింట్ తీయడం చూశాం.. ఫ్లెక్సీలు ప్రింట్లు వస్తున్నాయి. ప్రింటర్లలోనూ కలర్, బ్లాక్ అండ్ వైట్, 3డీ, ఇంకా వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే దోశను ప్రింట్ తీయడం ఎప్పుడైనా విన్నారా.. కొత్తగా ఉంది కదూ.. నిజమే ఇటీవల కాలంలో మార్కెట్లోకి కొత్తగా దోశ మేకర్ (ప్రింటర్) అందుబాటులోకి వచి్చంది. వంటింట్లో ఇప్పటికే అనేకరకాలైన ఆధునిక వస్తువులు వినియోగిస్తున్నాం. తాజాగా చెన్నైకి చెందిన ఓ సంస్థ దోశ ప్రింటర్‌ను అభివృద్ధి చేసింది. ప్రింటర్‌కు ఒక వైపు ట్రే ఉంటుంది. అందులో పిండి వేస్తే సరిపోతుంది.నిమిషానికి ఒక దోశ వస్తుంది. దోశను ఎంత మందంతో కావాలనుకుంటే ఆ విధంగా మనం మర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్లిప్ ఆటోమేటిక్ దోశ మేకర్‌కు 360 డిగ్రీల ఫుడ్ గ్రేడ్ కోటెడ్ రోలర్ అమర్చి ఉంటుంది. ఈ యంత్రం 1600 వాట్ల విద్యుత్తు శక్తితో పనిచేస్తుంది. అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో పనిచేస్తుందని తయారీ సంస్థ పేర్కొంటోంది. పరిమాణం చిన్నగా ఉండటంతో వంట గదిలో ఇట్టే ఇమిడిపోతుంది. ఆటోమేటిక్ సేఫ్టీ కట్ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. 3 నిమిషాలు వినియోగించకపోతే దానంతట అదే పవర్ ఆఫ్ అయిపోతుందట. ఒక్కో ప్రింటర్ రూ.13 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. -
వివాదాస్పద భూభాగాలతో రూ.100 నోట్ ముద్రించాలని నిర్ణయం
నేపాల్ భారత భూభాగాలైన లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీలు కలిగి ఉన్న మ్యాప్‌తో కొత్త రూ.100 కరెన్సీ నోటును ముద్రించాలని నిర్ణయించింది. ఈ చర్యను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశంలో వివాదాస్పద భూభాగాలను నేపాల్ కొత్త మ్యాప్‌లో చేర్చాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ అధికార ప్రతినిధి రేఖా శర్మ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఈ భూభాగాలకు సంబంధించి ఇండియా-నేపాల్ మధ్య భిన్నాభిప్రాయలున్నాయి.వివాదాస్పద భూభాగాలతో కూడిన మ్యాప్‌ను నేపాలీ రూ.100 నోట్‌పై ముద్రించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేపాల్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి రేఖా శర్మ తెలిపారు. ఏప్రిల్ 25, మే 2వ తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొత్త మ్యాప్ రీడిజైన్‌కు ఆమోదం లభించినట్లు ఆమె చెప్పారు.ఇదీ చదవండి: ‘ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు..’ నిర్మలాసీతారామన్ వివరణఅసలు వివాదం ఏమిటి..?లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలు నవంబర్ 2019లో భారత్‌మ్యాప్‌లో చేర్చారు. అవి ఇండియా తమ భూభాగాలుగా భావిస్తోంది. మే 2020లో నేపాల్ అదే భూభాగాలతో రాజకీయ మ్యాప్‌ను విడుదల చేసింది. దాంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. మే 8, 2020న లిపులేఖ్ మీదుగా కైలాష్ మానస సరోవరాన్ని కలిపేలా రహదారిని ప్రారంభించాలని భారత్ ప్రయత్నించింది. దాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్ భారత్‌కు నోట్‌ను పంపించింది. దాంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లా గుండా వెళ్లే రహదారి పూర్తిగా భారత భూభాగంలోనే ఉందని స్పష్టం చేసింది. -
యూట్యూబ్ చూసి దొంగనోట్ల ముద్రణ
పలమనేరు (చిత్తూరు జిల్లా): చదివింది కేవలం ఏడో తరగతి.. వారపు సంతలో దుకాణాల వద్ద తిరుగుతూ టీ అమ్మడం అతని వృత్తి. ఇంట్లో రహస్యంగా దొంగ నోట్టు ముద్రించి సంతలో మార్చి సులభంగా డబ్బులు సంపాదించడం ప్రవృత్తి. పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా వి.కోట మండలం కె.కొత్తూరుకు చెందిన గోపాల్ (41) ఏడో తరగతి చదివాడు. కొన్నాళ్లు బెంగళూరులోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేశాడు. ఇప్పుడు సంతలకు వెళ్లి టీ అమ్ముతుంటాడు. వ్యసనాలకు బానిసైన గోపాల్ సులభంగా డబ్బులు సంపాదించడం ఎలా అని యూట్యూబ్‌లో చూసేవాడు. అందులో దొంగనోట్లను ముద్రించే వీడియోలు చూస్తూ దొంగనోట్లను ముద్రించాలనుకున్నాడు. బెంగళూరు వెళ్లి కలర్ ప్రింటర్, మందంగా ఉండే ఖాళీ బాండ్ పేపర్లు, కలర్లు, గ్రీన్ కలర్ నెయిల్ పాలీష్ కొనుక్కొచ్చాడు. 6 నెలలుగా ఇంట్లోనే రహస్యంగా రూ.500, రూ.200, రూ.100 నోట్లను ముద్రిస్తున్నాడు. రూ.500 నోట్లపై ఉండే సెక్యూరిటీ థ్రెడ్ కోసం గ్రీన్ నెయిల్ పాలిష్ వేశాడు. ఇలా ముద్రించిన నోట్లను వారపు సంతలో చలామణి చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం పట్టణంలోని కూరగాయల దుకాణంలో రూ.500 దొంగనోటు ఇచ్చి రూ.50 విలువైన కూరగాయలు కొని చిల్లర తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గోపాల్‌ను అరెస్ట్ చేసి రూ.8,200 విలువైన దొంగనోట్లను, ప్రింటర్, ఖాళీ తెల్లకాగితాలను సీజ్ చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
ఫుడ్ పార్సిళ్లపై ప్యాకింగ్ సమయమూ ఉండాలి
తిరువనంతపురం: ఆహార పార్సిళ్లపై అందులోని పదార్థాలు ఎప్పుడు తయారయ్యాయి? ఎప్పటిలోగా తినడం సురక్షితం? అనే వివరాలను కూడా ముద్రించాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే ఈ ఆదేశాలు అమలు చేయాలని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం స్పష్టం చేసింది. అమలు చేయని వారిపై చర్యలు తప్పవని ఆరోగ్య మంత్రి వీణా జార్జి హెచ్చరించారు. రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటనల నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలిచ్చామన్నారు. హోటళ్ల నిర్వాహకులు, ఇతర ఆహార పదార్థాల తయారీదారులు హెల్త్ కార్డులు తీసుకోవాల్సిన గడువును మరో రెండు వారాలకు పొడిగించామన్నారు. హెల్త్ ఇన్స్పెక్టర్లు ఆహార తనిఖీలను ముమ్మరం చేశారన్నారు. -
10 రోజుల్లో అందుబాటులోకి..
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్‌కు సిద్ధమవుతున్న లక్ష లాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న తెలుగు అకాడమీ పుస్తకాలు మరో 10 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. పుస్తకాల ప్రిటింగ్ కోసం ఎంపిక చేసిన ప్రింటింగ్ ప్రెస్‌లకు శుక్రవారం ఈ మేరకు అధికారిక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రావతరణ తర్వాత రూపకల్పన చేసిన పుస్తకాలనే ఈసారీ ప్రింటింగ్‌కు ఇచ్చినట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది. సిలబస్‌లో మార్పులు చేర్పులేం చేయలేదని, సమయం లేకపోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని అకాడమీ అధికారులు చెబుతున్నారు. గ్రూప్స్‌కు అవసరమైన సబ్జెక్టులతో పాటు బీఎడ్, ఇతర పుస్తకాలను ప్రింట్ చేయిస్తున్నారు. మొత్తం 45 రకాల పుస్తకాలను తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రచురించబోతున్నారు. ఈ పుస్తకాలను ప్రింట్ చేయించాలని 2 నెలల క్రితమే నిర్ణయం తీసుకున్నా పేపర్ కొరత, అకాడమీలో నిధుల గోల్మాల్ వ్యవహారంతో ముద్రణ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈలోగా గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదలవ్వడంతో అభ్యర్థుల నుంచి డిమాండ్ పెరిగింది. పోటీ పరీక్షల మెటీరియల్‌కు తెలుగు అకాడమీ పుస్తకాలను అన్నివర్గాలు విశ్వసిస్తాయి. అయితే సరైన సమయంలో పుస్తకాలపై అకాడమీ దృష్టి పెట్టకపోవడం విమర్శలకు దారి తీసింది. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో పుస్తకాల ముద్రణ చేపట్టింది. ముద్రణకు ఇచ్చిన పుస్తకాలు ఇవీ ఆర్థికాభివృద్ధి, పర్యావరణం, భారత రాజ్యాంగం, తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ, విపత్తు నిర్వహణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక నిర్మితి–వివాదాలు–విధానాలు, తెలంగాణ ప్రాచీన చరిత్ర (ముంగిలి), భారత స్వాతంత్రోద్యమ చరిత్ర–3, భారత ప్రభుత్వం రాజకీయాలు–2, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రశ్నల నిధి చరిత్ర, భారత దేశ చరిత్ర–సంస్కృతి, తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, జనరల్ స్టడీస్, భారత ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ అధ్యయనం, అంతర్జాతీయ సంబంధాలు వంటి పుస్తకాలతో పాటు మరికొన్నింటిని అకాడమీ ముద్రణకు పంపింది. -
‘ఏ కలర్స్ అద్దమంటారు’ .. ఓ డిజైనర్ ప్రయాణం
‘‘మేడమ్! మీ వీడియోలు చూశాం. పోయిన వారం హైదరాబాద్‌కి వచ్చాం, మిమ్మల్ని చూసిపోదామని...’’ అని ఏలూరు దగ్గర వేల్పుచర్ల అనే గ్రామం నుంచి ముగ్గురు మహిళలు వచ్చారు. ‘‘మేడమ్! మా అమ్మ ఇలా ఉంటారు’’ అని ఫోన్లో ఫొటో చూపిస్తూ ‘‘అమ్మకు ఏ కలర్ కాంబినేషన్లో చీరలు తీసుకోమంటారు’’ అని ఓ యువతి అడుగుతోంది. ఇంతలో ఆమె భర్త వచ్చి ‘‘గాయత్రీ! వేర్‌హౌస్‌కి వెళ్తున్నాను’’ అని చెప్పి బయలుదేరారు. షోరూమ్ వెనుకగా ఉన్న ప్రింటింగ్ యూనిట్లో ఒక వ్యక్తి ఒక చీరను తెచ్చి బోర్డరు చూపిస్తూ... ‘‘ఏ కలర్స్ అద్దమంటారు’’ అని అడిగి ఆమె ‘పింక్’ అని చెప్పగానే తలూపుతూ వెళ్లిపోయాడు. ‘‘మీ వీడియోలు రోజూ చూస్తుంటాం. అలవాటైపోయింది. మీరు మా ఇంట్లో ఒకరిలా అయిపోయారు’’ అంటూ ఆ మహిళలు గాయత్రితో మాటల్లో పడిపోయారు. ‘‘మమ్మీ! వీడియో అప్ లోడ్ చేశాను. అమ్మమ్మ క్యారియర్ పంపించింది. ఆఫీస్ రూమ్‌లో పెట్టాను’’ అని క్లుప్తంగా చెప్పి మరో ఫ్లోర్‌లోకి వెళ్లి పోయాడు ఓ కుర్రాడు. ఇది... హైదరాబాద్, సైనిక్‌పురిలో ‘గాయత్రీరెడ్డి ట్రెడిషనల్ డిజైనర్ స్టూడియో’ నిర్వహిస్తున్న ఫ్యాషన్ డిజైనర్ గాయత్రి డైలీ రొటీన్. ఇది ఆమె తనకు తానుగా నిర్మించుకున్న సామ్రాజ్యం. 2008లో ఇంట్లో ఒక మూలగా ఒక టేబుల్‌తో మొదలైన తొలి అడుగు ఇప్పుడు పర్వత శిఖరానికి చేరువలో ఉంది. అన్నీ అమరిన దశ నుంచి జీవితం ఒక్కసారిగా పరీక్ష పెట్టింది. అంతా అగమ్యం. జీవితం తనను ఎటు తీసుకువెళ్తుందో తెలియని అస్పష్టమైన అయోమయమైన స్థితిలో వేసిన మొదటి అడుగు అది. గమ్యం కనిపించకపోయినా సరే... నీ ప్రయాణం ఆపవద్దు అనే ‘సంకల్పం’ మాత్రమే ఆమెకు తోడు. నేను కూడా నీకు తోడుగా వస్తానని భర్త నైతిక మద్దతునిచ్చాడు. ‘కుటుంబాన్ని నడిపించాల్సిన నేను వ్యాపారంలో నష్టపోయాను. నా బాధ్యతను నీ భుజాలకెత్తుకున్నావు. ఈ టైమ్‌లో నేను చేయగలిగింది ఇంతవరకే’ అని మాత్రం చెప్పాడాయన. పదమూడేళ్ల కిందట అలా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు నెలకు వందమందికి పైగా ఉద్యోగులకు జీతాలిచ్చే స్థాయికి చేరింది. బంధువులను మొహమాట పెట్టి కస్టమర్లుగా మార్చుకోలేదామె. కస్టమర్లను ఆత్మీయ బంధువులుగా మార్చుకున్నారు. మధ్యవర్తులెవరూ లేరు! ‘‘నా కస్టమర్‌కు నేను మంచి క్వాలిటీ ఇవ్వాలి. ధర అందుబాటులో ఉండాలి. అందుకోసం చేనేతకారులున్న ప్రతి గ్రామానికీ వెళ్లాను. ఐదేళ్ల పాటు నిరంతర ప్రయత్నం తర్వాత నేను వారి విశ్వాసం చూరగొనగలిగాను. అప్పటి వరకు చేనేతకారులు వాళ్ల వాళ్ల గ్రామాల్లో షావుకారు చేతిలో ఉండేవారు. షావుకారు నూలు కొనుగోలు కోసం డబ్బు పెట్టుబడి పెట్టి ఉంటాడు. కాబట్టి చేనేతకారులు నేసిన దుస్తులను షావుకారుకు తప్ప మరెవరికీ ఇవ్వడానికి వీల్లేదనే విరచిత రాజ్యాంగం ఒకటి అమలులో ఉండేది. బయటి వాళ్లు ఎవరైనా సరే ఆ షావుకారు దగ్గర కొనాల్సిందే. ఏ వ్యాపారమైనా సరే... ఉత్పత్తిదారుడికీ– వినియోగదారుడికి మధ్య వారధిగా ఉండే వ్యక్తుల సంఖ్య పెరిగే కొద్దీ ధర కూడా పెరిగిపోతుంది. నేను ఐదేళ్లు కష్టపడి షావుకారు అనే ఒక మధ్య వ్యక్తిని తొలగించగలిగాను. అలాగే నాకు ఏ కౌంట్ నేత కావాలో, ఏయే కాంబినేషన్లలో కావాలో చేనేతకారులకు ముందుగానే చెప్తాను. ఇంత పోటీలో కూడా నన్ను మార్కెట్లో నిలబెట్టింది. సౌకర్యం విషయంలో ఫ్యాబ్రిక్ ధరించినప్పుడు ఒంటికి హాయిగా అనిపించాలి. మన్నిక విషయంలో పెట్టిన డబ్బు వృథా కాలేదని సంతృప్తి కలగాలి. ఇవే నేను నమ్మిన సూత్రాలు. అనుసరిస్తున్న నియమాలు.’’ అని చెప్పారు గాయత్రి. పిల్లలకు కొంతే ఇవ్వాలి! ‘‘మరో రెండేళ్లకు యాభై ఏళ్లు నిండుతాయి. అప్పటికి షోరూమ్, వేర్ హౌస్, నగరంలో ఉన్న మూడు ప్రింటింగ్ యూనిట్లను ఒక చోటకు చేర్చాలి. ఇప్పటి వరకు దేశంలో అన్ని రకాల వస్త్రకారులను అనుసంధానం చేస్తూ నేను ఏర్పాటు చేసిన నెట్‌వర్క్‌ను నా ఉద్యోగులతో నడిపించాలని, ఇక నా పరుగులు ఆపేయాలనేది కోరిక. భగవంతుడి దయ వల్ల పోగొట్టుకున్న ఆస్తులకంటే ఎక్కువే సంపాదించుకున్నాం. పిల్లలను చదివించాం, జీవితాన్ని మొదలుపెట్టడానికి భరోసాగా కొన్ని ఆస్తులను మాత్రమే వాళ్లకు ఇస్తాం. వాళ్ల జీవితాన్ని వాళ్లే మొదలు పెట్టాలి. అలా చేయకపోతే డబ్బు మీద గౌరవం ఉండదు, జీవితం విలువ తెలియదు. ఇక సమాజానికి తిరిగి ఇవ్వడం మొదలు కావాల్సిన సమయం వచ్చింది. అది నా ఉద్యోగులతోనే మొదలవుతుంది’’ అని చెప్పేటప్పుడు గాయత్రీరెడ్డిలో జీవితం నేర్పిన పరిణతితోపాటు స్థితప్రజ్ఞత కనిపించింది. అక్షరం నేర్పిన విలువలు ఇల్లు దిద్దుకోవడం, చక్కగా వండి పెట్టుకోవడం, పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవడం... ఇదే నా లోకంగా ఉండేది. ఆర్థిక సమస్యలే రాకపోయి ఉంటే నాలో ఇంత శక్తి ఉందని నాకు కూడా ఎప్పటికీ తెలిసేది కాదేమో. అయితే కంచి పరమాచార్య చెప్పినట్లు మనం దేనిని పైకి విసురుతామో అది మనకు అంతకంటే వేగంగా వచ్చి చేరుతుందని నమ్ముతాను. మా వారు మధ్యప్రదేశ్‌లో కాంట్రాక్టులు చేస్తున్నప్పుడు తప్పని సరై నేర్చుకున్న హిందీ ఇప్పుడు నార్త్ ఇండియా పర్చేజ్కి, అక్కడి నుంచి వచ్చిన పనివాళ్లతో మాట్లాడడానికి పనికొస్తోంది. బెంగళూరులో ఉన్నప్పుడు రోజంతా ఏమీ తోచడం లేదని నేర్చుకున్న ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు ఈ రోజు నన్ను విజేతగా నిలబెట్టింది. అంతకంటే ముందు ఇంకో విషయం చెప్పాలి. పదో తరగతి వరకే చదివిన నేను మా ఇంటి దగ్గరున్న లైబ్రరీలో ఉన్న పుస్తకాల్లో చందమామ నుంచి ఆధ్యాత్మికం వరకు దాదాపుగా చదివేశాను. ఆ అక్షరజ్ఞానం నేర్పిన విలువలే నాకు యూనిట్ నిర్వహణలో ఉపయోగపడుతున్నాయి. – గాయత్రీరెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ – వాకా మంజులారెడ్డి -
సంక్షోభంపై కరెన్సీ ముద్రణ అస్త్రం యోచన లేదు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు కోవిడ్–19 మహమ్మారి విసిరిన సవాళ్లను అధిగమించేందుకు కరెన్సీ నోట్ల ముద్రణ ప్రణాళిక ఏదీ ప్రభుత్వం దృష్టిలో లేదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ మేరకు అడిగిన ఒక ప్రశ్నకు ఆమె సమాదానం ఇస్తూ, ‘‘నో సర్’’ అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనడానికి కరెన్సీ ముద్రణ జరపాలా, వద్దా అన్న అంశంపై ఆర్థికవేత్తల మధ్య తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అధిక శాతం మంది కరెన్సీ ముద్రణ సరికాదన్న అభిప్రాయంలో ఉన్నారు. మరికొన్ని అంశాలకు సంబంధించి లోక్‌సభలో ఆర్థిక మంత్రి లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధాలను పరిశీలిస్తే.. ► 2020–21లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3 శాతం క్షీణించింది. మహమ్మారి దీనికి ప్రధాన కారణం. తీవ్ర ప్రతికూలతలను కట్టడి చేయడానికి కేంద్రం పలు చర్యలు తీసుకుంది. ► ఎకానమీ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, మూలాలు పటిష్టంగా ఉన్నాయి. లాక్డౌన్ ఆంక్షలు తొలగడంతో తిరిగి రికవరీ క్రియాశీలమవుతోంది. స్వావలంభన్ (ఆత్మనిర్భర్) భారత్ చర్యలు వృద్ధి పురోగతికి దోహదపడుతున్నాయి. ► స్వావలంభన్ భారత్ (ఏఎన్‌బీ) కింద ప్రభుత్వం రూ.29.87 లక్షల కోట్ల విలువైన సమగ్ర, ప్రత్యేక ఆర్థిక ఉద్దీపనను ప్రకటించింది. ► వృద్ధి విస్తృతం, పటిష్టం కావడానికి 2021–22 బడ్జెట్లో కేంద్రం పలు చర్యలను ప్రకటించింది. మూలధన వ్యయాల్లో 34.5 శాతం పెంపు, ఆరోగ్య రంగంలో కేటాయింపులు 137 శాతం పెరుగుదల వంటివి ఇందులో ఉన్నాయి. ప్రజారోగ్యం, ఉపాధి కల్పన వంటి లక్ష్యాల సాధనకు 2021 జూన్‌లో కేంద్రం రూ.6.29 లక్షల కోట్ల సహాయక ప్యాకేజ్ ప్రకటించింది. ► జీడీపీ సర్దుబాటు చేయని స్థిర ధరల వద్ద (నామినల్) 2022 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 14.4 శాతం వృద్ధి నమోదువుతుందని 2021–22 బడ్జెట్ అంచనా. ఆర్బీఐ తాజా విశ్లేషణల ప్రకారం, వాస్తవిక జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతం. అర్బీఐ అంతక్రితం 10.5 శాతం వృద్ధి అంచనాలను 9.5 శాతానికి తగ్గించడానికి మహమ్మారి ప్రేరిత అంశాలే కారణం. ► వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ)కి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా రెపో ఆపరేషన్స్సహా పలు చర్యలను ఆర్బీఐ తీసుకుంటోంది. ముఖ్యంగా లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) తగిన లిక్విడిటీ అందుబాటులో ఉండడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ► పరారైన ఆర్థిక నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారి ఆస్తులను జప్తు చేసుకుని, బాకీలన్నీ రాబట్టడానికి కేంద్రం తగిన అన్ని చర్యలు తీసుకుంటుంది. ► బ్యాంకింగ్‌లో మొండిబకాయిల సమస్యను తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఇందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. లోక్‌సభలో దివాలా చట్ట సవరణ బిల్లు దివాల చట్ట సవరణ బిల్లును (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్రప్సీ కోడ్– అమెండ్మెంట్ బిల్లు 2021) ఆర్థికమంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రుణ ఒత్తిడిలో ఉన్న లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమలకు ప్రీ–ప్యాకేజ్డ్ రిజల్యూషన్ పక్రియ సౌలభ్యతను కల్పించడం ఈ సవరణ ప్రధాన ఉద్దేశం. ఏప్రిల్ 4న ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సీతారామన్ ప్రవేశపెట్టారు. రుణ చెల్లింపుల వైఫల్య పరిమితి రూ.కోటికి లోబడి ప్రీ–ప్యాకేజ్డ్ రిజల్యూషన్ ప్రాసెస్‌ను ప్రారంభించడానికి ఈ సవరణ వీలు కల్పిస్తుంది. బిజినెస్ @ పార్లమెంటు క్యూ1 పన్ను వసూళ్లలో 86% వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (క్యూ1–ఏప్రిల్ నుంచి జూన్)లో నికర పన్ను వసూళ్లు 86 శాతం పెరిగినట్లు లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ఇందులో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.2.46 లక్షల కోట్లయితే, పరోక్ష పన్నుల విషయంలో ఈ పరిమాణం రూ.3.11 లక్షల కోట్లని పేర్కొన్నారు. నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు (2020 ఇదే కాలంతో పోల్చి) 109 శాతంపైగా పెరిగి రూ.2,46,520 కోట్లకు పెరిగాయని తెలిపారు. నికర పరోక్ష పన్నుల విషయంలో పెరుగుదల 70 శాతం ఉందని వివరించారు. ఇన్ఫోసిస్‌కు ఇప్పటికి రూ.164.5 కోట్లు కొత్త ఆదాయపు పన్ను ఈ–ఫైలింగ్ పోర్టల్ అభివృద్ధికి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు కేంద్రం ఇప్పటికి రూ.164.5 కోట్లు చెల్లించిందని పంకజ్ చౌదరి మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2019 జనవరి నుంచి జూన్ 2021 మధ్య ఈ చెల్లింపులు జరిపినట్లు వివరించారు. ఆర్థికశాఖ సహాయమంత్రి పేర్కొన్న వివరాల ప్రకారం రూ.4,242 కోట్ల ఈ ప్రాజెక్టుకు కేంద్రం 2019 జనవరి 19న ఆమోదముద్ర వేసింది. నిర్వహణ, జీఎస్టీ, రెంట్, పోస్టేజ్‌సహా 8.5 సంవత్సరాల్లో ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూన్ 7న పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. అయితే కొన్ని సాంకేతిక లోపాలను పన్ను చెల్లింపుదారులు, వృతి నిపుణులు, సంబంధిత వ్యక్తులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల నిరంతర పరిష్కారానికి ఇన్ఫోసిస్ పనిచేస్తోంది. రూ.8.34 లక్షల కోట్లకు తగ్గిన ఎన్పీఏలు మొండిబకాయిల (ఎన్పీఏ) భారం 2021 మార్చి చివరికి రూ.61,180 కోట్లు తగ్గి రూ.8.34 లక్షల కోట్లకు దిగివచ్చినట్లు లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కే కరాద్ తెలిపారు. 2020 మార్చి ముగింపునకు ఎన్పీఏల భారం రూ.8.96 లక్షల కోట్లని వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు బ్యాంకింగ్ మొండిబకాయిలు తగ్గడానికి కారణమని వివరించారు. మరో ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ, 2018 మార్చి 31వ తేదీ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు రూ.8,95,601 కోట్లని వివరించారు. -
కోవిడ్ సంక్షోభం.. ఆర్థికమంత్రి గారు నోట్లు ముద్రిస్తారా?
న్యూఢిల్లీ: కోవిడ్ కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవడానికి కొత్తగా నోట్లు ముద్రించే ఆలోచన ఏదీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు. కోవిడ్ సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ త్వరగానే కోలుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. నో సార్ పార్లమెంటు సమావేశాల సందర్భంగా ... కోవిడ్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, ఈ విపత్తును ఎదుర్కొనేందుకు నోట్లను ముద్రిస్తారా అంటూ ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ‘నో సార్’ అంటూ ఆర్థిక మంత్రి చట్టసభలో సమాధానం ఇచ్చారు. గాడిన పడుతోంది 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్థూల జాతీయోత్పత్తి జీడీపీ సుమారు 7.3 శాతం కుదించబడిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రాథమిక అంశాలు బలంగా ఉన్నాయని అందువల్ల ఇప్పుడప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని, ఈ ఏడాది చివరి నాటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు రూ,.30 వేల కోట్లతో ఆత్మనిర్బర్ భారత్ ప్యాకేజీని ప్రకటించామని వివరించారు. -
తప్పని పరిస్థితుల్లోనే నగదు ముద్రణ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నగదును ప్రత్యక్షంగా ముద్రించి ప్రభుత్వానికి ద్రవ్య పరమైన మద్దతు అందించవచ్చని మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. అయితే ఇక ప్రత్యామ్నాయంలేని తప్పని పరిస్థితుల్లోనే ఈ తరహా ప్రత్యక్ష నగదు ముద్రణ విధానాన్ని అవలంభించాలని బుధవారం ఆయన స్పష్టం చేశారు. ఈ తరహా పరిస్థితిని భారత్ ఎప్పుడూ ఎదుర్కొనలేదని కూడా వివరించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కోవిడ్ బాండ్ల జారీ అంశాన్ని కేంద్రం పరిశీలించవచ్చని సూచించారు. దేశం కరోనా సవాళ్లలో ఉన్న నేపథ్యంలో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దువ్వూరి అభిప్రాయాలు ఇవీ... కోవిడ్ బాండ్లతో ప్రయోజనం ప్రస్తుత ఆర్థిక మందగమన పరిస్థితులను ఎదుర్కొనడానికి ప్రభుత్వం కరోనా బాండ్ల జారీ ద్వారా రుణ సమీకరణ అంశాన్ని పరిశీలించవచ్చు. బడ్జెట్లో పేర్కొన్న రుణ సమీకరణ ప్రణాళికకు అదనంగా... ‘కోవిడ్ బాండ్ల ద్వారా నిధుల సమీకరణగా’ దీనిని పరిగణించవచ్చు. మార్కెట్ సమీకరణలకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు కోవిడ్ బాండ్ల జారీ ద్వారా ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న వడ్డీరేట్లకు స్వల్పంగా అదనపు వడ్డీ ఇవ్వడం ద్వారా పొదుపరులను కోవిడ్ బాండ్లతో ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. మనీ సప్లై, ఆర్బీఐ ద్రవ్య లభ్యతా చర్యలకు దీనివల్ల ఎటువంటి అవరోధం ఏర్పడదు. ‘లాభాలు’... ఆర్బీఐ ధ్యేయం కాదు ప్రభుత్వ ద్రవ్య ఒత్తిడులను ఎదుర్కొనడానికి ఆర్బీఐ మరిన్ని లాభాలను ఆర్జించడంపై దృష్టి పెట్టవచ్చు అనుకోవడం సరికాదు. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్ వాణిజ్య సంస్థ కాదు. లాభార్జన దాని ధ్యేయాల్లో ఒకటి కాదు. తన కార్యకలాపాల్లో భాగంగానే ఆర్బీఐ కొంత లాభాలను ఆర్జిస్తుంది. ఇందులో తన వ్యయాలు పోను ‘మిగిలిన లాభాన్ని’’ కేంద్రానికి బదలాయిస్తుంది. తన వద్ద ఎంత మొత్తం ఉంచుకోవాలన్న అంశాన్ని బిమల్ జలాన్ కమిటీ సూచించింది. 2021–22 బడ్జెట్ అంచనాలకు మించి రెండు రెట్లు రూ.99,122 కోట్లను కేంద్రానికి ఆర్బీఐ బదలాయించిన సంగతి తెలిసిందే. మహమ్మారిని ఎదుర్కొనడానికి ఆర్బీఐ గడచిన ఏడాదిగా క్రియాశీలంగా, వినూత్నంగా వివిధ చర్యలను తీసుకుంటోంది. ఇప్పుడు ముద్రణ జరుగుతోంది, కానీ.. తన లోటును ప్రభుత్వం తగిన మార్గాల ద్వారా భర్తీ చేసుకోలేని పరిస్థితి ఉత్పన్నమయినప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి ప్రత్యక్ష నగదు ముద్రణ వైపు మొగ్గుచూపవచ్చు. అయితే భారత్ ఎప్పుడూ ఈ తరహా పరిస్థితిని ఎదుర్కొనలేదు. ప్రభుత్వ లోటును భర్తీ చేయడానికి ఆర్బీఐ నగదు ముద్రణ చేయాలనే వారు ఒక విషయాన్ని గుర్తించడంలేదు. ప్రభుత్వ లోటును భర్తీ చేయడానికి సెంట్రల్ బ్యాంక్ ఇప్పుడు కూడా నగదు ముద్రణ జరుపుతోంది. అయితే ఇది పరోక్ష నగదు ముద్రణా విధానం. ఉదాహరణకు ఆర్బీఐ తన ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్(ఓఎంఓ) కింద బ్యాంకర్ల నుంచి బాం డ్లను కొనుగోలు చేస్తుంది. లేదా విదేశీ మారకద్రవ్య నిల్వల(ఫారెక్స్) ఆపరేషన్ల కింద డాలర్లను కొనుగోలు చేస్తుంది. ఈ కొనుగోళ్లకు సంబంధించి చెల్లింపులకు ఆర్బీఐ ముద్రణ జరుపుతుంది. ప్రత్యక్ష మనీ ప్రింట్‌తో ఇబ్బందులు ఇక ప్రభుత్వ ద్రవ్య లోటును భర్తీ చేయడానికి కరెన్సీ ప్రత్యక్ష ముద్రణకు పైన పేర్కొన్న దానితో పూర్తి వైరుధ్యం ఉంది. ఇక్కడ కరెన్సీ ముద్రణ ఎప్పుడు ఎంత జరగాలన్న అంశం ప్రభుత్వ రుణ ప్రణాళిక అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ద్రవ్య సరఫరాపై ఆర్బీఐ తన నియంత్రణలను కోల్పోతుంది. దీనితోపాటు అటు ఆర్బీఐ ఇటు ప్రభుత్వ విశ్వసనీయ పరిస్థితులు కోల్పోయే అవకాశం ఉంది. ఇది ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి కీలక మౌలిక ఆర్థిక గణాంకాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఫెడ్, ఈసీబీలతో పోల్చకూడదు... సవాళ్లను ఎదుర్కొనడంలో ఆర్బీఐ వంటి వర్థమాన దేశాల సెంట్రల్ బ్యాంకులకు, అమెరికా ఫెడరల్ బ్యాంక్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వంటి ధనిక దేశాల సెంట్రల్ బ్యాంకులకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్ బ్యాంకులు ఒక సమస్యను ఎదుర్కొనడానికి ప్రత్యక్ష మనీ ప్రింట్‌సహా ఎటువంటి సాంప్రదాయేత నిర్ణయమైనా తీసుకోగలుగుతాయి. మనకు అటువంటి సౌలభ్యమైన పరిస్థితి ఉండబోదు. దీనికితోడు వర్థమాన దేశాల సెంట్రల్ బ్యాంకులు తీసుకున్న మితిమీరిన నిర్ణయాలను మార్కెట్లు సహించబోవు. -
Corona Crisis: నోట్లు ముద్రించి ప్రజల ఖాతాల్లోకి నేరుగా వేయండి
సాక్షి, అమరావతి: కోవిడ్–19 తో వచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి ఇండియా త్వరగా కోలుకోవాలంటూ ఇందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరింత నగదును ముద్రించి ప్రజల ఖాతాల్లోకి నేరుగా వేయాలన్న డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. అమెరికా, యూరోప్, జపాన్ వంటి దేశాలు ఈ విధంగానే నగదు ముద్రించి వ్యవస్థలోకి వదిలాయని, అదే విధంగా ఇండియా కూడా చేయాలంటూ మాజీ ఆర్థికమంత్రులు, ఆర్థిక వేత్తలు, పారిశ్రామికవేత్తలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. వీరికి ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా గొంతుకలుపుతున్నాయి. అక్కడ అలా కోవిడ్ వచ్చిన తర్వాత అమెరికా ఫెడరల్ బ్యాంక్ తన బ్యాలెన్స్ షీట్‌ను భారీగా పెంచుకుంది. కోవిడ్ ముందు 4.4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న అమెరికా కేంద్ర ఫెడరల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీటు ఇప్పుడు 7.1 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇదే విధంగా ఆర్బీఐ కూడా బ్యాలెన్స్ షీటు పెంచుకోవడం ద్వారా ప్రజల చేతిలో నగదు ఉంచాలన్నదిన ఆర్థికవేత్తల డిమాండ్. మన దేశంలో కూడా నగదు ముద్రించి ప్రజల ఖాతాల్లోకి వేయడం ద్వారా వాళ్లకు కొనుగోళ్ల శక్తి పెరిగి వస్తువులకు డిమాండ్ పెరుగుతుందన్నది వీరి వాదన. ఇదే సమయంలో మరికొంత మంది ఆర్థిక వేత్తలు నగదు ముద్రణను వ్యతిరేకిస్తున్నారు. నగదు ముద్రణ చేస్తే రూపాయి విలువ పతనం కావడంతో పాటు, ద్రవ్యోల్బణం కట్టడి చేయలేని స్థాయికి చేరుకుంటుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరు జింబాబ్వే, వెనిజులా దృష్టాంతాలను ఉదాహరణలుగా పేర్కొంటున్నారు. ఇలా ఆర్థికవేత్తలు రెండుగా విడిపోయి ఎవరి వాదనలు వారు గట్టిగా వినిపిస్తున్న తరుణంలో నాలుగు రోజుల క్రితం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నగదు ముద్రణపై ఒక స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో మర్ని కరెన్సీ నోట్లు ముద్రించే అవకాశం లేదంటూ స్పష్టంగా పేర్కొన్నారు. నోట్ల ముద్రణ విషయంలో ఆర్బీఐకి సొంత విధానం ఉందని, ఆర్థిక స్థిరత్వం, ద్రవ్యోల్బణం, విదేశీ మారకం రేట్లు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని దానికి అనుగుణంగా నిర్ణయం తీసుంకుంటామన్నారు. రుణాలకే మొగ్గు... ఆర్బీఐ నేరుగా నగదు ముద్రణ చేయకుండా పరోక్షంగా వ్యవస్థలోకి నగదు పంపిణీ చేయడానికే మొగ్గు చూపుతోంది. నేరుగా నగదు ముద్రణ చేయడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగిపోతుందన్న భయమే దీనికి కారణం. అందుకే నేరుగా ప్రభుత్వం నుంచి బాండ్లను కొనుగోలు చేసి ఆర్బీఐ తన వద్ద ఉన్న నగదును ప్రభుత్వానికి అందిస్తోంది. ఇందుకోసం ఆర్బీఐ ఏకంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అక్విజిషన్ పోగ్రాం (జీ–సాప్) ద్వారా రూ.1.2 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఒక విధంగా ఆర్బీఐ డిజిటల్ రూపంలో నగదు ముద్రించడం కిందకు వస్తుంది. అలాగే కేంద్రం 2021–22 బడ్జెట్లో రుణాల రూపంలో రూ.7.8 లక్షల కోట్లు సమీకరించినట్లు చెప్పినా ఇప్పుడు ఆ విలువను ఏకంగా రూ.12 లక్షల కోట్లకు పెంచేసింది. దీనివల్ల ద్రవ్యలోటు పెరిగినా పెద్ద ఇబ్బంది లేదని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. చాలా దేశాలు వాటి జీడీపీలో 90 శాతం వరకు అప్పులు ఉన్నాయని, కానీ మన దేశంలో అప్పుల విలువ 70 శాతంలోపే ఉంది కాబట్టి ఇబ్బంది ఉండదన్నది వీరి వాదన. జీడీపీ ఆధారంగా నగదు ముద్రణ ఎంత నగదు చలామణీలో ఉంచాలన్నది దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ) ఆధారంగా నిర్ణయిస్తారు. 50–60వ దశకంలో దేశంలో ఉన్న బంగారు నిల్వలు ఆధారంగా ఎంత నగదు ఉండాలన్నది లెక్కించే వారు. ఆ తర్వాత ఈ విధానాన్ని ఆపేసి జీడీపీ ఆధారంగా ముద్రించడం మొదలు పెట్టారు. ప్రస్తుత ధరల ప్రకారం 2020–21 నాటికి మన జీడీపీ (కరెంట్ ప్రైసెస్ ప్రకారం) 195.86 లక్షల కోట్లు. జీడీపీ పెరుగుతూ, నగదు లావాదేవీలు పెరుగుతుంటూ ఆ మేరకు ఆర్బీఐ నగదు ముద్రణ చేపడుతుంది. కోవిడ్ తర్వాత దేశంలో ఒక్కసారిగా నగదు లావాదేవీలు పెరిగాయి. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం ఏప్రిల్23 నాటికి ప్రజల వద్ద ఉన్న నగదు విలువ రికార్డు స్థాయిలో రూ.29,07,067 కోట్లకు చేరింది. ఒకపక్క డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నా నగదు లావాదేవీలు పెరగడం గమనార్హం. లాక్డౌన్ కారణంగా ప్రజలు ముందస్తుగా పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేసుకొని ఉంచుకోవడం దీనికి కారణం. దీనికి సగటు ఖాతాదారుని ఏటీఎం వినియోగం విలువ పెర గడం ఉదాహరణగా బ్యాంకులు పేర్కొంటున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు దేశవ్యాప్తంగా సగటు ఏటీఎం విత్ర్డ్రాయల్ విలువ రూ.4,000గా ఉంటే ఇప్పుడిది రూ.4,500కు చేరుకుందంట. ఇదే సరైన సమయం – కోటక్, ఎండీ, కోటక్ మహీంద్ర బ్యాంక్ ఆర్బీఐ మద్దతుతో ప్రభుత్వం బ్యాలెన్స్ షీట్‌ను పెంచుకోవడానికి ఇది సరైన సమయం. వ్యవస్థలో ద్రవ్య సరఫరా పెంచడం లేదా నగుదును ముద్రిచాలి. ఇది ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పుడూ చేయలేం. నేరుగా పేద ప్రజల ఖాతాల్లోకి – అభిజిత్ బెనర్జీ, నోబెల్ పురస్కార గ్రహీత పేద ప్రజలను ఆదుకోవడానికి నగదు ముద్రించి నేరుగా వారి ఖాతాల్లో వేయాలి. ద్రవ్యలోటుపై యోచించే సమయం కాదు – చిదంబరం, మాజీ ఆర్థికమంత్రి ద్రవ్యలోటు పెరుగుపోతుందని చూడకుండా నగదు ముద్రించి ప్రభుత్వ వ్యయాన్ని గణనీయంగా పెంచాలి. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది – కే నరసింహ మూర్తి, ఆర్థికరంగ నిపుణులు నగదు ముద్రించి ప్రజల ఖాతాల్లో వేస్తే ద్రవ్యోల్బణం పెరిగి పోతుంది. కాబట్టి ఇది మంచి నిర్ణయం కాదు. జీడీపీలో అప్పులు విలువ ఇంకా తక్కువగానే ఉంది. ఏటా జీడీపీ పెరుగుతోంది కాబట్టి కేంద్రం భారీగా అప్పులు చేసినా పెద్ద ఇబ్బంది లేదు. ఒక్కసారి సంక్షోభం ముగిసన తర్వాత ఆదాయం పెంచుకోవడం ద్వారా అప్పులు తగ్గించుకోవచ్చు. -
రెండేళ్లుగా రూ. 2000 నోట్ల ముద్రణను నిలిపేశాం..
న్యూఢిల్లీ: 2016లో నోట్ల రద్దు తర్వాత తొలిసారి చలామణిలోకి వచ్చిన రూ.2000 నోటు ముద్రణను నిలపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. గత రెండేళ్లుగా రూ.2000 నోటును ముద్రించడం ఆపివేసినట్లు సోమవారం జరిగిన లోక్‌సభ సమావేశాల్లో కేంద్రం ప్రకటించింది. ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2018, మార్చి 30నాటికి మొత్తం 336.2 కోట్ల రూ.2000 నోట్లు చెలామణిలో ఉన్నాయని, 2021, ఫిబ్రవరి 26 నాటికి వీటి సంఖ్య 249.9 కోట్లకు తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. లావాదేవీల డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. కాగా, నల్లధనానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి రూ.2000 నోటును చలామణిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
డిజిటల్ ఇండియా: కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ ఉధృతి, తీవ్ర మందగమనంలో ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, విభాగాల్లో డైరీలు, గ్రీటింగ్ కార్డులు, కాఫీ టేబుల్ బుక్స్, క్యాలెండర్లను భౌతిక రూపంలో ముద్రించడాన్నిని షేధించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖలు, విభాగాలు,స్వయంప్రతిపత్త సంస్థలతో పాటు, ఇతర ప్రభుత్వ రంగ విభాగాలకు సంబంధిత ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. రాబోయే సంవత్సరంలో ఏ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులు, ప్రభుత్వంలోని అన్ని ఇతర విభాగాల్లో వాల్ క్యాలెండర్లు, డెస్క్‌టాప్ క్యాలెండర్లు, డైరీలు ఇతర వస్తువులను ముద్రించకూడదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడంతోపాటు ఆర్థిక పొదుపు చర్యల కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం (సెప్టెంబర్ 2న) ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో ఇపుడు ఇవన్నీ డిజిటల్ రూపును సంతరించుకోనున్నాయి. వాల్ క్యాలెండర్లు, డెస్క్‌టాప్ క్యాలెండర్లు, డైరీలు,పండుగ గ్రీటింగ్ కార్డులు లాంటి వాటిని ఇకపై ఇ-బుక్స్ రూపంలో మాత్రమే అందించాలని ఆదేశించింది. ప్రపంచమంతా డిజిటల్ వైపు పరుగులు పెడుతున్న తరుణంలో ఉత్పాదకత రెట్టింపు, ప్రణాళిక, షెడ్యూలింగ్, అంచనాలకు నూతన సాంకేతిక ఆవిష్కరణల ఉపయోగంతో ఖర్చులను తగ్గించుకోవడమే కాదు నిర్వహణ కూడా సమర్థవంతంగా ప్రభావవంతంగా ఉంటుందని తెలిపింది. -
2,000 నోటు ముద్రణకు బ్రేక్
ముంబై: దేశంలో రూ. 2,000 నోట్లను 2019–20 ఆర్థిక సంవత్సరంలో అసలు ముద్రించనే లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వార్షిక నివేదిక తెలిపింది. గత కొద్ది సంవత్సరాలుగా అసలు ఈ నోట్ల సర్క్యులేషన్ కూడా తగ్గుతూ వస్తోందని నివేదిక పేర్కొంది. బ్యాంకింగ్ మోసాలు రెట్టింపు, ఆర్థిక వ్యవస్థపై కోవిడ్–19 ప్రభావం, వ్యవస్థలో డిమాండ్, దేశాభివృద్ధి వంటి కీలక అంశాలను 2019–20 వార్షిక నివేదిక చర్చించింది. ఆయా అంశాలను పరిశీలిస్తే... రూ. 500, రూ. 200 కరెన్సీ నోట్ల ప్రవాహం 2019 మార్చి చివరినాటికి చెలామణీలో ఉన్న రూ.2,000 కరెన్సీ నోట్ల సంఖ్య 33,632 లక్షలు. 2019 మార్చి నాటికి ఈ సంఖ్య 32,910 లక్షలకు తగ్గింది. 2020 మార్చి నాటికి మరింతగా 27,398 లక్షలకు పడిపోయింది. 2020 మార్చి చివరినాటికి మొత్తం నోట్ల పరిమాణంలో రూ.2,000 నోట్లు 2.4 శాతంగా ఉంది. 2018 మార్చి ముగిసేనాటికి ఇది 3.3 శాతం ఉంటే, 2019 మార్చి నాటికి 3 శాతానికి దిగివచ్చింది. ఇక విలువలు చూస్తే, మొత్తం నోట్ల విలువలో వీటి వాటా 2018 మార్చి నాటికి 37.3 శాతం. 2019 మార్చి నాటికి 31.2 శాతానికి దిగివచ్చింది. 2020 మార్చి నాటికి మరింతగా 22.6 శాతానికి తగ్గిపోయింది. ఇదే సమయంలో రూ.500, రూ.200 నోట్ల కరెన్సీ నోట్ల చెలామణీ అటు విలువ పరంగా ఇటు సర్క్యులేషన్ పరంగా భారీగా పెరిగింది. బ్యాంక్ నోట్ల ఇండెంట్ కూడా గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో 23.3 శాతం నుంచి 13.1 శాతానికి తగ్గింది. ఇక నకిలీ కరెన్సీ నోట్ల విషయానికి వస్తే, ఇలా గుర్తించిన మొత్తంలో 4.6 శాతాన్ని ఆర్బీఐ గుర్తించగా, 95.4 శాతాన్ని ఇతర బ్యాంకులు పసిగట్టాయి. గుర్తించిన మొత్తం నకిలీ నోట్ల సంఖ్య 2,96,695. 2018–19లో గుర్తించిన రూ.2,000 నకిలీ నోట్ల సంఖ్య 21,847 అయితే 2019–20లో ఈ సంఖ్య 17,020కి తగ్గింది. నిగనిగలడే రూ.100 బ్యాంక్నోట్లను ట్రైల్ బేస్‌లో తీసుకురావడానికి పలు చొరవలు ప్రారంభమయ్యాయి. అయితే కోవిడ్–19, ఇతర కొన్ని కారణాలతో ముద్రణాప్రక్రియ నిలిచిపోయింది. మెరుగుపడుతున్న వడ్డీరేట్ల బదలాయింపు సరళతర ద్రవ్య పరపతి విధానంలో (ఎంపీసీ) భాగంగా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం)ను 2019 ఫిబ్రవరి నుంచీ ఆర్బీఐ 250 బేసిస్ పాయింట్లు తగ్గించింది. తమకు అందివచ్చిన ఈ ప్రయోజనాన్ని బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయించడం 2019–20లో మెరుగుపడింది. ప్రత్యేకించి ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధభాగంలో బదలాయింపుల ప్రక్రియ ఊపందుకుంది. 2019 అక్టోబర్ నుంచి జూన్ 2020 మధ్య బ్యాంకింగ్ గృహ రుణాలపై వడ్డీరేట్లు 104 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గాయి. వాహన రుణాలపై ఈ తగ్గింపు 102 బేసిస్ పాయింట్లు ఉంటే, వ్యక్తిగత రుణాల విషయంలో 115 బేసిస్ పాయింట్లు ఉంది. ఇక లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల విషయంలో 198 బేసిస్ పాయింట్ల రుణ రేటు తగ్గింది. మరింతగా వడ్డీరేట్ల తగ్గింపునకు తగిన చర్యలను ఆర్బీఐ తీసుకుంటుంది. తగిన తక్కువ వడ్డీరేట్లకు రుణాలు అందడం వల్ల పెట్టుబడులు, డిమాండ్ పెరిగి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. 2018–19లో బ్యాంకింగ్ రుణ వృద్ధి రేటు 13.3 శాతం ఉంటే, 2019–20లో ఇది 6.1 శాతానికి తగ్గడం ఆందోళనకరం. ప్రస్తుత కోవిడ్–19 పరిస్థితుల నేపథ్యం రుణ వృద్ధిరేటుపై మరింత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అన్ని రంగాల్లో దాదాపు ఈ పరిస్థితి కనబడుతోంది. వ్యవస్థలో డిమాండ్, తద్వారా వృద్ధి పురోభివృద్ధికిగాను తగ్గిన రుణరేట్ల ప్రయోజనం కస్టమర్‌కు అందాలి. ఆహారోత్పత్తుల మిగులు నిర్వహణ సవాళ్లు ఆహారోత్పత్తుల మిగులు నిర్వహణ విషయంలో సవాళ్ల మధ్య ప్రస్తుతం భారత్ నిలబడింది. 2019–20లో భారత్ మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 296.65 మిలియన్ టన్నుల రికార్డు స్థాయికి చేరింది. ఇక ఉద్యానవన ఉత్పత్తులు ఆల్‌టైమ్ హై 320.48 మిలియన్ టన్నులకు ఎగసింది. పాలు, తృణధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, పండ్లు, పత్తి, చెరకు, మత్స్య, పౌల్ట్రీ వంటి రంగాల ఉత్పత్తి విషయంలో ముందు వరుసలో ఉన్న దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తోంది. అయితే ఆహార భద్రత, మిగులు నిర్వహణ విషయం లో భారత్ సవాళ్లను ఎదుర్కొంటోంది. సెప్టెంబర్ 3నాటికి రూ.20 వేల కోట్లు వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) తగినంత ఉండడానికి ఆర్బీఐ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుంది. సెప్టెంబర్ 3 నాటికి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ద్వారా నిర్వహించనున్న రెండు దశల బాండ్ల కొనుగోలు ప్రక్రియతో వ్యవస్థలోకి రూ.20,000 కోట్లను పంప్ చేయాలన్న నిర్ణయం జరిగింది. ఆగస్టు 27న రూ.10,000 కోట్లకు బాండ్ల వేలం నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 3న మరో దశ వేల ప్రకటన ఉంటుంది. వ్యవస్థలో ద్రవ్య లభ్యతకు ఎటువంటి సమస్యా లేకుండా ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయం... వాతావరణ మార్పులపై జాగ్రత్త మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 15 శాతం వాటా కలిగిన భారత వ్యవసాయ రంగంపై వాతావరణ మార్పు ప్రభావం పడే ఆందోళనకరమైన పరిస్థితి ఉంది. వర్షపాతంలో ఒడిదుడుకులు, ఉష్ణోగ్రత పెరగడం వంటి అంశాలు వ్యవసాయ ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. కొన్ని ప్రతికూలతలు ఉన్నా గడచిన గడచిన ఆర్థిక సంవత్సరం ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం చేయూతను ఇచ్చింది. 2020లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 1901 నుంచి 2000 మధ్య భారత్‌లో వార్షిక సగటు ఉష్ణోగ్రత 0.5 సెల్సియస్ పెరిగితే, 1997–2019 మధ్య ఇది 1.8 సెల్సియస్‌కు చేరడం ఒకింత ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి పరిస్థితి కొనసాగితే, పంట దిగుబడులు, వ్యవసాయ ఆదాయాలు పడిపోయే ప్రమాదం ఉంది. ఆయా పరిస్థితులను అధిగమించడానికి తగిన పటిష్ట చర్యలు అవసరం. పెరగనున్న ధరల స్పీడ్ ఆహారం, తయారీ వస్తువుల సరఫరాల్లో ఇబ్బందుల వల్ల వచ్చే కొద్ది నెలల కాలంలో ధరలు పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. 2019–20 చివరి నెలల్లో పెరుగుతూ వచ్చిన ద్రవ్యోల్బణం 2020–21 తొలి ఆరు నెలల్లోనే నిర్దేశిత స్థాయిలను దాటింది. ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకులూ ఇందుకు కారణం. కూరగాయలు, పప్పు దినుసులు, చేపలు, మాంసం వంటి ఆహార ధరలు పెరుగుదల వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 6.93%కి పెరిగింది. పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 4% (2 శాతం అటూఇటుగా) స్థాయిలో ఉండాలనేది ఆర్బీఐకి ప్రభుత్వ నిర్దేశం. జనవరి నుంచి ఎకానమీ వృద్ధిబాట! భారత్ ఆర్థిక వ్యవస్థలపై కరోనా వైరస్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందన్న విషయంపై కచ్చితమై నిర్ధారణకు రావడం కష్టం. లాక్డౌన్, వినియోగ డిమాండ్ పడిపోవడం, అంతర్జాతీయ అంశాలు వంటి పరిశీలించాల్సిన అపరిష్కృత అంశాలు ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– జూన్ మధ్య ఆర్థిక వ్యవస్థ క్షీణతలోకి జారిపోతుందని భావిస్తున్నాం. డిసెంబర్ వరకూ రికవరీ దశ ఉండే వీలుంది. చివరి త్రైమాసికం (జనవరి–మార్చి) నుంచి ఆర్థిక రంగం వృద్ధిబాటలోకి వెళ్లే అవకాశం ఉంది. ప్రైవేటు వినియోగం ప్రస్తుతం పూర్తిగా పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యయాలు, ప్రత్యేకించి మౌలిక రంగంపై ప్రత్యేక దృష్టి అవసరం. ఆయా చర్యలు డిమాండ్ రికవరీకి ఊతం ఇస్తాయి. ఇక సుస్థిర వృద్ధి రేటుకు ప్రొడక్ట్ మార్కెట్లు, ఫైనాన్షియల్, కార్మిక రంగాల్లో విస్తృత శ్రేణి సంస్కరణలు తీసుకురావాలి. అదే సమయంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాల మధ్య వ్యత్యాసం ద్రవ్యలోటు కట్టుతప్పకుండా తగిన చర్యలు ఉండాలి. బ్యాంకింగ్ మోసాలు రెట్టింపు బ్యాంకింగ్ మోసాలు రెట్టింపుకావడం తీవ్ర ఆందోళనకరమైన అంశం. 2018–19లో రూ.71,500 కోట్ల బ్యాంకింగ్ మోసాలు జరిగితే, అటు తర్వాత 2020 జూన్ నాటికి ఈ మొత్తం రూ.1.85 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. అటు వాసిలోనూ ఇటు రాసిలోనూ రెండింటిలో మోసాలు తీవ్రం అయ్యాయి. ఫ్రాడ్ కేసులు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వార్షికంగా 234 శాతం పెరిగితే, ప్రైవేటు బ్యాంకుల్లో ఈ పరిమాణం 500 శాతంపైగా ఉండడం గమనార్హం. ‘‘ముందస్తు హెచ్చరికల సంకేతాలు’’ వ్యవస్థ బలహీనత, అంతర్గత ఆడిట్ల విషయంలో లోపాలు, ఫోరెన్సిక్ ఆడిట్ల సమయంలో అందని రుణ గ్రహీతల సహకారం, అసమగ్ర ఆడిట్ నివేదికలు, నిర్ణయాల విషయంలో బ్యాంకింగ్ మధ్య సమన్వయ లోపాలు, మోసాలను గుర్తించడంలో జరుగుతున్న ఆలస్యం’’ వంటి అంశాలు ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆయా లోపాల పట్ల బోర్డులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
‘సాక్షి’ శానిటైజ్ చేసి...
సాక్షి, హైదరాబాద్ : వార్తాపత్రికల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు, వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు. వార్తాపత్రికల విషయంలో కొందరు పనికట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిజానికి పత్రికల వల్ల వైరస్ వ్యాప్తి అన్నది జరగదు. అయినప్పటికీ పత్రిక ప్రచురణలో సాక్షి మరిన్ని జాగ్రత్తలు చేపట్టింది. పత్రిక ముద్రణ ప్రక్రియలో అడుగడుగునా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. ఎక్కడా నిర్లక్ష్యం దొర్లకుండా, తమపై ప్రజలకున్న విశ్వాసాన్ని కాపాడుకుంటూ పూర్తి రక్షణ, ఆరోగ్యకరమైన వాతావరణంలో పత్రికలను ముద్రిస్తోంది. ముద్రణ నుంచి ప్యాకింగ్ వరకు ప్రతి అడుగులో జాగ్రత్తలు పాటిస్తూ పత్రికలపై ప్రత్యేకమైన ఏర్పాట్ల మధ్య శానిటైజర్ స్ప్రే వెదజల్లుతోంది. పాఠకులకు ఎలాంటి అనుమానాలకు తావులేకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించడానికి వార్తాపత్రికల నిరంతర సరఫరా అత్యవసరమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వార్తా పత్రికలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ క్లిష్ట సమయంలో తప్పుడు వార్తలను నిరోధించాలన్నా, ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించడానికి వార్తా పత్రికలు ప్రధాన పాత్ర పోషిస్తాయని కేంద్రం పేర్కొంది. వార్తా పత్రికలు శుభ్రమైనవి.. వైరస్ ఉండదు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. వార్తా పత్రిక, మ్యాగజైన్, ప్రింట్ చేసిన లేఖ, ప్యాకేజీల ద్వారా వ్యాపిస్తున్నట్లు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారమూ లేదని ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ (ఐఎన్‌ఎంఏ) ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్, సీఈవో ఎర్ల్‌జే విల్కిన్సన్ స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన డాక్టర్లు, శాస్త్రవేత్తలందరి అభిప్రాయమూ ఇదేనని ఆయన తెలిపారు. కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న అపోహ చాలా చోట్ల కనిపిస్తోందని, సైన్స్ పరంగా ఇందులో వాస్తవాలేమిటో తెలియజేయాల్సిందిగా కొంతకాలంగా ఐఎన్‌ఎంఏను కోరుతున్నారని ఆయన చెప్పారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలు అంతర్జాతీయ పరిశోధన సంస్థలు జరిపిన పరిశోధనలు కూడా వార్తా పత్రికల ద్వారా కరోనా వ్యాప్తి చెందదని ఇప్పటికే స్పష్టంచేశాయని ఆయన తెలిపారు. కరోనా కేసులున్న ఏ ప్రాంతంలోనైనా వార్తా పత్రికలు, మ్యాగజైన్లతో కూడిన ప్యాకేజీలను తీసుకోవడం, చదవడం వల్ల ఎలాంటి ముప్పూ ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కరోనా వైరస్ సోకిన వ్యక్తి వార్తా పత్రికలను ముట్టుకున్నా అతడి నుంచి కాగితంపైకి వైరస్ సోకదని, వార్తా పత్రికల రవాణా ద్వారా కూడా సమస్య ఏమీ ఉండదని స్పష్టంగా తెలిపింది. బీబీసీ మాట కూడా ఇదే.. ఈ నెల 10వ తేదీ బీబీసీ రేడియో జాన్ ఇన్నెస్ సెంటర్లోని వైరాలజిస్ట్ జార్జ్ లొమోనోస్సాఫ్‌తో ఒక ఇంటర్వ్యూ ప్రసారం చేస్తూ.. వార్తా పత్రికలు చాలా శుభ్రమైనవి అని స్పష్టం చేశారు. ప్రింటింగ్ కోసం వాడే సిరా, ప్రింటింగ్ జరిగే పద్ధతి తదితర కారణాల వల్ల వార్తా పత్రికల ఉపరితలంపై వైరస్ ఉండే అవకాశాలు అత్యల్పమని ఆయన తెలిపారు. వివిధ ఉపరితలాలపై కరోనా వైరస్ (సార్స్–సీఓవీ2) ఎంత కాలం ఉంటుందన్నదానిపై ఇటీవలే ఒక పరిశోధన జరిగిందని, దాని ప్రకారం వార్తా పత్రికలపై వైరస్ ఉండే అవకాశమే లేదని స్పష్టమైందని ఐఎన్‌ఎంఏ సీఈవో ఎర్ల్ జే విల్కిన్సన్ తెలిపారు. మొత్తమ్మీద చూస్తే వార్తా పత్రికల ద్వారా కరోనా వ్యాపించిన సంఘటన ఇప్పటివరకూ ఒక్కటి కూడా నమోదు కాలేదు. వాడే సిరా, ప్రింటింగ్ పద్ధతుల కారణంగా మిగిలిన వాటికంటే వార్తా పత్రికలు ఎంతో శుభ్రంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా వార్తా పత్రికల ప్రచురణ కర్తలు ప్రింటింగ్, పంపిణీ జరిగే చోట, న్యూస్స్టాండ్లలో, ఇళ్లకు చేరే సమయంలోనూ పలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారని ఎర్ల్ జే. విల్కిన్సన్ తెలిపారు. -
పూర్తి సురక్షితంగా సాక్షి దిన పత్రిక
-
2,000 నోటు ఇక కనుమరుగే..!
న్యూఢిల్లీ: బ్యాంకులు తమ ఏటీఎంల్లో ఎక్కువగా రూ.2,000కు బదులు రూ.500 నోట్లే ఉంచుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధిక విలువ కరెన్సీ నోట్లను క్రమంగా వెనక్కు తీసుకోడానికి ఇది సంకేతమనీ ఆ వర్గాలు సూచిస్తున్నాయి. సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు గత ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సమాధానం ఇస్తూ, రూ.2,000 నోట్ల ప్రింటింగ్‌ను నిలుపు చేసినట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సంబంధిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ► ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాలు ఏవీ లేనప్పటికీ, బ్యాంకులు తమకు తాముగా తమ ఏటీఎంలను తక్కువ విలువగల నోట్లతో నింపుతున్నాయి. ► ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ ఇప్పటికే ఒక ప్రకటన చేస్తూ, తమ ఏటీఎంల్లో రూ.2,000 నోట్ల వినియోగాన్ని నిలుపుచేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ► నిజానికి రూ.2,000 నోట్లను ఏటీఎంల్లో నింపడానికి వాటిని కొంత అప్‌గ్రేడ్ చేయాల్సిన పరిస్థితి. ఈ వ్యవహారం వ్యయాలపరంగా బ్యాంకింగ్‌పై అదనపు భారాన్ని మోపుతోంది. ఈ అంశం కూడా బ్యాంకులు రూ.2,000 నోట్లను ఏటీఎంలలో పెట్టడానికి కొంత వెనక్కుతగ్గేలా చేస్తోంది. ► సమాచార హక్కు చట్టం ప్రకారం, ఆర్బీఐ ఇచ్చిన సమాధానాన్ని చూస్తే, రూ.2,000కు సంబంధించి 2016–17లో 3,542.991 మిలియన్ నోట్లను ముద్రించడం జరిగింది. 2017–18లో ఈ సంఖ్య 111.507కు పడిపోయింది. 2018–19లో ఇది మరింతగా 46.690 మిలియన్ నోట్లకు తగ్గింది. దీని ప్రకారం చూస్తే రూ.2,000 నోటును ఆర్బీఐ క్రమంగా వెనక్కు తీసుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ► అధిక విలువ కలిగిన నోట్ల అక్రమ నిల్వ, నల్లధనం నిరోధం లక్ష్యంగా రూ.2,000 నోటును వ్యవస్థ నుంచి క్రమంగా తగ్గిస్తున్నట్లు సంకేతాలు ఉన్నాయి. ► 2016 నవంబర్‌లో కేంద్రం రూ.1,000, రూ.500 విలువ నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ► రూ.2,000 నోటును ఉపసంహరించే ప్రతిపాదనఏదీ ప్రభుత్వం వద్ద లేదని గత ఏడాది డిసెంబర్లో ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, చెలామణీలో ఉన్న నోట్ల (ఎన్ఐసీ) విలువ 2016 నవంబర్ 4న రూ.17,74,187 కోట్లు. 2019 డిసెంబర్ 2 నాటికి ఈ విలువ రూ.22,35,648 కోట్లకు పెరిగింది. ► వార్షిక ప్రాతిపదికన చూస్తే, 2014 అక్టోబర్ నుంచి 2016 అక్టోబర్ మధ్య చెలామణీలో ఉన్న నోట్ల విలువ సగటున 14.51 శాతం పెరిగింది. ఈ లెక్కన చూస్తే, 2019 డిసెంబర్ 2 నాటికి ఎన్ఐసీ రూ.25,40,253 కోట్లకు చేరి ఉండవచ్చు. -
దొంగనోట్ల ముద్రణలో సిద్ధహస్తుడు
సాక్షి, నెల్లూరు : చదువుకుంది ఇంటర్మీడియట్. కంప్యూటర్ పరిజ్ఞానం అతన్ని దొంగనోట్ల ముద్రణలో సిద్ధహస్తుడుని చేసింది. పోలీసులకు చిక్కి జైలు పాలైనా వెరవక తిరిగి యథేచ్ఛగా తన కార్యకలాపాలను విస్తృతం చేసి పలు రాష్ట్రాలకు వాటిని విస్తరింప చేశాడు. నిందితుడిపై వైఎస్సార్ జిల్లాలోనూ కేసులు ఉన్నాయి. ఇది ఇటీవల పోలీసులకు చిక్కి జైలు పాలైన మురళీ ఉదంతం. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం రాజుపాళెంకు చెందిన పి. మురళీ అలియాస్ మురళీకృష్ణ ఇంటర్ వరకు చదువుకున్నాడు. కంప్యూటర్లో పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఆటో క్యాడ్‌తో పాటు ఫొటోషాప్‌లో పూర్తిస్థాయి పట్టు సాధించాడు. ఈజీగా మనీ సంపాదించాలన్న ఆలోచన అతన్ని దొంగనోట్ల ముద్రణకు ఉసిగొల్పాయి. దీంతో ఏలూరుకు మకాం మార్చారు. కంప్యూటర్‌పై పూర్తిస్థాయి పట్టు ఉండటంతో ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నోట్లకు అచ్చు పోలిన విధంగా 2016లో దొంగనోట్లు ముద్రణ ప్రారంభించాడు. తొలుత తాను ముద్రించిన నోట్లను ఏలూరు జిల్లా శివారు గ్రామాల్లో వాటిని చలామణి చేశారు. దొంగనోట్లను ఎలా మార్చాలి? ఎవరికి విక్రయించాలి తదితరాలపై పూర్తి అవగాహన పెంపొందించుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకపోవడంతో దొంగనోట్లను ముద్రించి విచ్చలవిడిగా చలామణి చేశాడు. మూడు నెలల కిందట గుంటూరు జిల్లా రేపల్లె పోలీసులు అతనిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నెలన్నర కిందట బెయిల్‌పై బయటకు వచ్చిన మొరళీకృష్ణ రూ.50, రూ.100, రూ. 200. రూ.500, రూ.2 వేల నోట్లను ముద్రించారు. వాటిని మార్కెట్లో చలామణి చేసేందుకు మోసాల్లో సిద్ధహస్తులైన ఎనిమిది మందితో ముఠాను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణ, ఉత్తరాది రాష్ట్రాలకు తన వ్యాపారాన్ని విస్తరింప చేశాడు. అందుకు ముఠాలోని సభ్యులకు రూ.లక్ష నగదుకు రూ.25 వేలు కమీషన్ ఇచ్చేవాడు. దీంతో వారు దొంగనోట్లను యథేచ్ఛగా చలామణి చేయసాగారు. ముఠాలోని రాజస్థాన్‌కు చెందిన ప్రేమదాస్ సహకారంతో ఉత్తరాది రాష్ట్రాల్లో దొంగనోట్ల చలామణికి రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా సూరత్‌కు చెందిన ఓ వ్యాపారికి రూ.4 లక్షలు దొంగనోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 5వ తేదీ నోట్లు అందజేయాల్సి ఉండగా ఇందుకూరుపేటలో పోలీసులు ప్రధా న నిందితుడితో పాటు ముగ్గురిని, 6వ తేదీ మిగిలిన ఐదుగురును నెల్లూరు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఐ. శ్రీనివాసన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వెలుగులోకి వస్తున్న కేసులు మురళీకృష్ణపై ఇప్పటి వరకు గుంటూరు, నెల్లూరు జిల్లాలోనే పోలీసు కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా వైఎస్సార్ జిల్లా పులివెందులలోనూ దొంగనోట్లకు సంబంధించి పోలీసు కేసు ఉన్నట్లు, సదరు కేసులో వారెంట్ పెండింగ్‌లో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో అక్కడి పోలీసులు నెల్లూరు టాస్క్‌ఫోర్స్ పోలీ సులను సంప్రదించినట్లు సమాచారం. త్వరలో వారెంట్‌పై అక్కడి పోలీసులు నిందితుడు మురళీకృష్ణను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మురళీకృష్ణపై ఇంకా ఏవైనా కేసులు ఉన్నాయా? అతని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే వివరాల సేకరణలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిమగ్నమయ్యారు. -
‘ప్రింట్’పై సుంకం కొరడా!
(సాక్షి, బిజినెస్ ప్రతినిధి): ఒకవైపు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్న డాలర్–రూపాయి విలువతో ఆందోళన చెందుతున్న ప్రింట్ మీడియాపై... శుక్రవారం నాటి బడ్జెట్ మరో బండను పడేసింది. దిగుమతి చేసుకునే న్యూస్‌ప్రింట్‌పై 10 శాతం సుంకం విధించడం ఈ రంగంపై తీవ్రమైన ప్రభావాన్నే చూపించనుంది. ఎందుకంటే ఒకవైపు డిజిటల్ మీడియా అంతకంతకూ వ్యాప్తి చెందుతుండటంతో ప్రింట్ మీడియాకు ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయం తగ్గుతోంది. గడిచిన ఏడాదిన్నర కాలంగా విదేశాల్లో సైతం న్యూస్‌ప్రింట్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గతేడాది ఒకదశలో టన్ను న్యూస్‌ప్రింట్ ధర 820 డాలర్లకు కూడా చేరింది. ఆ దెబ్బకు కొన్ని చిన్న పత్రికలు మూతపడ్డాయి కూడా. అక్టోబర్ తరువాత కొంత దిగిరావటం మొదలై.... రెండు నెలల కిందట ధరలు కాస్త స్థిరపడి.. ప్రస్తుతం టన్ను న్యూస్‌ప్రింట్ ధర 700 డాలర్లకు అటూఇటుగా ఉంది. నిజానికి చాలా వరకూ పత్రికలు తక్షణ ఇబ్బందులు రాకుండా ఐదారు నెలలకు సరిపడా నిల్వల్ని ముందే తెచ్చుకుని పెట్టుకుంటాయి. కాబట్టి తగ్గిన ధరల తాలూకు ఫలితం వాటికింకా అందలేదనే చెప్పాలి. పోనీ ఇప్పుడైనా ఉపశమనం దొరుకుతుందని భావించిన ప్రింట్ మీడియాపై శుక్రవారం నాటి బడ్జెట్ ఏకంగా బాంబునే వేసింది. ఇప్పటిదాకా వీటిపై దిగుమతి సుంకం లేకపోగా... ఒకేసారి 10 శాతం విధించటం గమనార్హం. ఈ చర్యతో మరిన్ని చిన్న, భాషా పత్రికలు మూతపడవచ్చనే ఆందోళన నెలకొంది. ‘‘ప్రకటనల ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో ఆశించిన సాయం అందించకపోగా ప్రభుత్వం ఇలా సుంకాలు మోపి దెబ్బతీయడం దురదృష్టకరం’’అని భారతీయ భాషా పత్రికల సంఘం (ఐఎల్ఎన్ఏ) అధ్యక్షుడు పరేష్‌నాథ్ తప్పుబట్టారు. ఆంగ్ల పత్రికలకు ప్రయివేట్ ప్రకటనలు, టెండర్ నోటిఫికేషన్ల రూపంలో ఆదాయం బాగానే వస్తుందని, దేశవ్యాప్తంగా విస్తరించిన చిన్న, మధ్య స్థాయి భాషా పత్రికలు ఈ భారాన్ని మోయలేవని ఆయన చెప్పారు. తక్కువ నాణ్యతతో, ఎక్కువ లాభాలు ఆర్జించాలని దేశీ న్యూస్‌ప్రింట్ తయారీదారులు ఆలోచిస్తున్నారని, వారి ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం దిగుమతి సుంకం విధించిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఈ సుంకాన్ని తక్షణం తొలగించాలని, తన చర్యను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
బడ్జెట్ ‘హల్వా’ రెడీ..!
న్యూఢిల్లీ: సాంప్రదాయకంగా వస్తున్న ‘హల్వా’ తీపి రుచులతో 2019 కేంద్ర బడ్జెట్ పత్రాల ముద్రణా కార్యక్రమం ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో సోమవారంనాడు ఈ మేరకు జరిగిన ఒక కార్యక్రమంలో ‘బడ్జెట్ హల్వా’ రుచి చూడడానికి కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రులు శివ్ ప్రతాప్ శుక్లా, పొన్ రాధాకృష్ణన్, ఆర్థికశాఖ ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఫైనాన్స్ సెక్రటరీ ఏఎన్ ఝా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్, రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, డీఐపీఏఎం కార్యదర్శి ఏ చక్రవర్తి, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్‌లు కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ అధికారుల్లో ఉన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. ఎన్డీఏ ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 2019లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో... కేంద్రం ఓట్–ఆన్–అకౌంట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2019–2020) పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఎన్నికల అనంతరం కేంద్రంలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. బయటి ప్రపంచంతో సంబంధాలు కట్... కీలక హల్యా కార్యక్రమం అనంతరం బడ్జెట్ ముద్రణ ప్రక్రియతో సంబంధమున్న ముఖ్య అధికారులు అందరికీ... ‘ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించేంతవరకూ’ బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఈ కార్యక్రమం అనంతరం మంత్రులు, అతికొద్ది మంది ఉన్నత స్థాయి ఆర్థిక శాఖ అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. మిగిలినవారికి కనీసం వారి ఆప్తులతో సైతం ఫోనులోగానీ, ఈ–మెయిల్‌తోగానీ మరే రకంగానూ మాట్లాడ్డానికి వీలుండదు. నార్త్ బ్లాక్ హౌసెస్‌లోని ప్రత్యేక బడ్జెట్ ప్రెస్‌లో ఈ కీలక పత్రాల ముద్రణ జరుగుతుంది. అంత గోప్యత ఎందుకు? ఎంతో పకడ్బందీగా తయారయ్యే బడ్జెట్ గనక ముందే బయటకు తెలిసిపోతే... బడ్జెట్‌ను కొన్ని వర్గాలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి... బడ్జెట్ తయారీని అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఒక దేశానికి ఎంత పటిష్ట స్థాయిలో రక్షణ ఉంటుందో... బడ్జెట్ తయారీ అయ్యే ముద్రణ విషయంలో కూడా అంతే స్థాయి నిఘా ఉంటుంది. అత్యాధునిక పర్యవేక్షణ పరికరాలు, పటిష్టమైన సైనిక భద్రత, ఆధునిక నిఘా పరికరాలు, జామర్లు, పెద్ద స్కానర్లు... ఇలా అనేక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు. ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ ఈ భద్రత కొనసాగుతూనే ఉంటుంది. వీటితో పాటు ఈ బడ్జెట్ ప్రక్రియ కొనసాగినంత కాలం నార్త్‌బ్లాక్‌లో ఉండే ఆర్థికశాఖ కార్యాలయం నుంచి, ఆ బ్లాక్ కింద ఉండే బడ్జెట్ ముద్రణా విభాగం నుంచి వెళ్లే ఫోన్లను అన్నింటినీ ట్యాప్ చేసేందుకు ఒక ప్రత్యేక ఎక్సే్ఛంజీని ఏర్పాటు చేస్తారు. అంతేకాక మొబైల్ ఆపరేటర్ల సమన్వయంతో ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి కాల్‌ను ట్యాప్ చేస్తారు. అలాగే ఆర్థికశాఖ కార్యాలయ వరండాలలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయకుండా ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేస్తారు. మధ్య మధ్యలో ‘మాక్ డ్రిల్’ పద్ధతిలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రాలు బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. వీరినిసమర్థంగా పట్టుకోగలిగితే భద్రత చక్కగా ఉన్నట్లే. లేకుంటే భద్రత సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవు. ఇక బడ్జెట్‌రోజున వాటి ప్రతుల్ని భారీ బందోబస్తు మధ్య పార్లమెంటు భవనానికి తరలిస్తారు. అనంతరం ఆర్థికమంత్రి సార్వత్రిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు. -
రూ. 2,000 నోటుకు కళ్లెం!!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన రూ. 2,000 నోట్ల ముద్రణను రిజర్వ్ బ్యాంక్ నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. క్రమంగా ఈ నోట్ల చలామణీని తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. పన్నులు ఎగవేసేందుకు, మనీల్యాండరింగ్‌కు ఈ పెద్ద నోట్లను కొన్ని వర్గాలు దుర్వినియోగం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే వీటి ముద్రణ నిలిచిపోనుందని పేర్కొన్నాయి. అయితే, చలామణీని తగ్గించడమంటే రూ. 2,000 నోట్లు చెల్లకుండా పోవని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చలామణీలో ఉన్న నోట్లు యథాప్రకారం చెల్లుబాటవుతాయని, అయితే వీటిని దశలవారీగా తొలగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. మరోవైపు, రూ. 2,000 నోట్ల వార్తలపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు .. వీటి ముద్రణను ’కనిష్ట’ స్థాయికి తగ్గించినట్లు తెలిపాయి. ముద్రించాల్సిన కరెన్సీ పరిమాణంపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సాధారణమేనని వివరించాయి. చలామణీలో ఉన్న నగదును ఇందుకు ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నాయి. రూ. 2,000 నోట్లను ప్రవేశపెట్టినప్పుడే క్రమంగా వీటి ముద్రణ తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘రూ. 2,000 కరెన్సీ నోట్ల ముద్రణను గణనీయంగా తగ్గించడం జరిగింది. కనిష్ట స్థాయికి పరిమితం చేయాలని నిర్ణయించారు. ఇలాంటివి కొత్తేమీ కాదు’ అని వివరించారు. మొత్తం కరెన్సీలో 37 శాతం నోట్లు.. బ్లాక్‌మనీని కట్టడి చేసే లక్ష్యంతో 2016 నవంబర్‌లో రూ.1,000, రూ. 500 డినామినేషన్ల పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో భారీ స్థాయిలో ఏర్పడిన నగదు కొరతను సత్వరం అధిగమించేందుకు ప్రభుత్వం రూ. 2,000 నోట్లను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2017 మార్చి ఆఖరు నాటికి చలామణీలో ఉన్న 2,000 నోట్ల సంఖ్య సుమారు 328.5 కోట్లుగా ఉంది. ఏడాది తర్వాత 2018 మార్చి ఆఖరు నాటికి ఇది స్వల్పంగా పెరిగి 336.3 కోట్ల నోట్లకు చేరింది. 2017 మార్చి ఆఖరు నాటికి మొత్తం కరెన్సీ విలువలో రూ. 2,000 నోట్ల వాటా 50.2 శాతంగా ఉండగా.. 2018 మార్చి ఆఖరు నాటికి ఇది 37.3 శాతానికి తగ్గింది. గతేడాది మార్చి ఆఖరు నాటికి చలామణీలో ఉన్న మొత్తం కరెన్సీ విలువ రూ. 18.03 లక్షల కోట్లు కాగా ఇందులో సుమారు 37 శాతం (దాదాపు రూ. 6.73 లక్షల కోట్ల విలువ) రూ. 2,000 డినామినేషన్ నోట్లు ఉన్నాయి. మరో 43 శాతం (విలువ సుమారు రూ. 7.73 లక్షల కోట్లు) రూ. 500 నోట్లు ఉన్నాయి. మిగతా నోట్లు అంతకన్నా తక్కువ విలువ గలవి. అప్పట్లోనే విమర్శలు.. పన్ను ఎగవేతలు, మనీలాండరింగ్‌కు ఉపయోగపడుతోందన్న కారణంతో 2016 నవంబర్‌లో రూ.1,000 నోట్లను రద్దు చేసిన మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్ల రూపంలో అంతకన్నా అధిక విలువ గల నోట్లను ప్రవేశపెట్టడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. పన్ను ఎగవేతదారులకు, మనీల్యాండరర్స్కు ఈ అధిక విలువ కరెన్సీ నోట్లు మరింత బాగా ఉపయోగపడతాయని, మనీల్యాండరింగ్ లాంటివి అరికట్టడమే తమ ధ్యేయమని చెప్పుకునే కేంద్రం లక్ష్యాల సాధనకు ఇవి ప్రతికూలమని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ వంటి ప్రముఖులు కూడా దీన్ని ప్రశ్నించిన వారిలో ఉన్నారు. దీనికి తగ్గట్లుగానే గతేడాది పలు నగరాల్లో తీవ్ర స్థాయిలో నగదు కొరత ఏర్పడింది. రాష్ట్రాల్లో ఎన్నికలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో నీరవ్ మోదీ కుంభకోణం నేపథ్యంలో చాలా మంది ఈ పెద్ద నోట్లను భారీ స్థాయిలో దాచి పెట్టుకుని ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. వీటిని రుజువు చేస్తూ ఆదాయ పన్ను శాఖ సోదాల్లో పలు చోట్ల భారీ ఎత్తున రూ. 2,000 నోట్లు బయటపడ్డాయి. -
నకిలీ ఓటరు కార్డుల కలకలం
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కుతోంది. బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నియోజకవర్గంలో దాదాపు 10వేల నకిలీ ఓటరు గుర్తింపుకార్డులు దొరకటం సంచలనం సృష్టించింది. మంజుల అనే ఓ మహిళ పేరుతో రిజిస్టర్ అయి ఉన్న అపార్ట్మెంట్లో జరుగుతున్న నకిలీ కార్డుల ప్రింటింగ్ వ్యవహారం బట్టబయలైంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. కాగా, ఇవి అసలైన కార్డుల్లాగే కనబడుతున్నాయని అయితే విచారణలోనే అసలు విషయాలు వెల్లడవుతాయని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్ పేర్కొన్నారు. ‘ఇదే కాంగ్రెస్ సిద్ధాంతం. ఓటర్లు వారికి ఓటేయకపోతే.. నకిలీ ఓటర్లను సృష్టిస్తారు. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడే ఈ రాకెట్ వెనక ఉన్నారు’ అని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. ఇక్కడి ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఖండించారు. ఆ ఫ్లాట్ యజమాని మంజుల నంజమారి, పట్టుబడిన రాకేశ్‌లకు బీజేపీతో సత్సంబంధాలున్నాయని ఆరోపించారు. అటు కాంగ్రెస్ బృందం ఈ ఘటనపై ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల వి వాదంలో కాంగ్రెస్‌ను క్షమించొద్దని మోదీ అన్నారు. -
ఇంటి సమస్యకు 3–డీ ప్రింటింగ్ పరిష్కారం
ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి పైగా తగిన ఇంటి వసతి లేకుండా బతుకు వెళ్లదీస్తున్నట్టు ‘వరల్ట్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్స్ రాస్ సెంటర్ ఫర్ సస్టయినబుల్ సిటీస్’నివేదిక వెల్లడించింది. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు ఏడింట ఒకవంతు మంది ప్రజలకు కనీసం జీవించడానికి అవసరమైన గూడు వంటి సౌకర్యం అందుబాటులో లేదు. అయితే ఇంత తీవ్రంగా మారిన ఇంటి సమస్య పరిష్కారానికి ‘ఐకాన్’ అనే లాభాపేక్ష లేని నిర్మాణ సాంకేతిక కంపెనీ ప్రపంచంలోనే తొలి 3–డీ (త్రీ డైమెన్షన్స్) ఇంటిని రూపొందించింది. ఈ డిజైన్, సరళిలో అనుమతి సాధించిన మొదటి ఇల్లు గత నెలలో అమెరికా టెక్సాస్ రాజధాని ఆస్టిన్‌లో నిర్మితమైంది. అదీ కూడా 24 గంటల వ్యవధిలోనే... నాలుగు వేల డాలర్ల లోపు అయిన ఖర్చుతో... ఏదో ఇల్లు అనగానే చిన్న స్థలంలో, ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఇరుకు ఇరుకుగా నిర్మించినదై ఉంటుందని మనకు అనిపిస్తుంది. అయితే ఈ 3–డీ ఇళ్లు మాత్రం ఒక హాలు, పడక గది, స్నానపుగది, ఆఫీసు కోసం ఉద్ధేశించిన చిన్న స్థలంతో కూడిన బాల్కనీ వంటివన్నీ ఇందులో అమరిపోయాయట. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పేదలు ఎదుర్కుంటున్న గృహ సమస్య పరిష్కారానికి ఈ డిజైన్ దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ ఇంటి కోసం తక్కువ స్థలమే అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. అతి తక్కువ సమయంలో నిర్మాణం పూర్తి చేసే అవకాశంతోపాటు , తక్కువ ఖర్చు కారణంగా డబ్బు ఆదా వంటి అంశాలు కలిసొస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతానికైతే ఐకాన్ సంస్థ ఆస్టిన్లోని ఈ ఇంటిని నమూనా (ప్రోటోటైప్) గా ఉపయోగిస్తోంది. దీనిని తమ కార్యాలయంగా ప్రయోగాత్మకంగా ఉపయోగించడంతో పాటు ఓ మోడల్‌గా ప్రదర్శిస్తోంది. ఒక చిన్న కుటుంబం అవసరాలు తీరేలా 3–డీ ప్రింటింగ్‌ను ఉపయోగించి ఇంటి డిజైన్‌ను రూపొందించిన కంపెనీ ఇదొక్కటే కాదు. చైనా, ఇటలీ, రష్యాలలో ఇలాంటి కంపెనీలు ఈ ప్రింటింగ్తోనే డిజైన్లు రూపొందించాయి. దుబాయ్ కూడా 3–డీ ప్రింటింగ్‌తో భవనాలు నిర్మించేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కారు ముద్రించిన పాలీమేకర్
త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో బోలెడన్ని చిన్న చిన్న వస్తువులను మాత్రమే కాదు. ఏకంగా కార్లనే ప్రింట్ చేసేయవచ్చు అంటోంది చైనీస్ కంపెనీ పాలీమేకర్. అనడం మాత్రమే కాదు.. ఇటలీ కంపెనీ ఎక్స్ఈవీ సాయంతో ఫొటోలో కనిపిస్తున్న కారును ప్రింట్ చేసేసింది కూడా. చూసేందుకు చిన్నగా అనిపిస్తున్నా దీని ప్రత్యేకతలు బోలెడు. పూర్తిగా విద్యుత్తుతో నడవడం వీటిల్లో ఒక్కటి మాత్రమే. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 140 కిలోమీటర్ల దూరం వరకూ గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. కారు మొత్తాన్ని ప్రింట్ చేసేందుకు మూడు రోజుల వరకూ సమయం పడుతుందని, ప్రత్యేకమైన ప్లాస్టిక్‌తో పాటు కొన్ని ఇతర పదార్థాలను ఇందులో వాడామని అంటున్నారు పాలీమేకర్ సీఈవో డాక్టర్ లూ షిఫాన్. త్రీడీ ప్రింటింగ్ కారణంగా కారులో ఉండాల్సిన విడి ప్లాస్టిక్ భాగాల సంఖ్య రెండు వేల నుంచి ఏభై ఏడుకు తగ్గిపోయిందని, ఫలితంగా మామూలు వాటితో పోలిస్తే చాలా తేలికగా ఉంటుందని లూ తెలిపారు. ఇంకో ఏడాదిలోపు అందుబాటులోకి వచ్చే ఈ కారు కోసం ఇప్పటికే తాము ఏడు వేల ఆర్డర్లు అందుకున్నామని చెప్పారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ తయారీ రంగంలో మరింత విస్తృత స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు ఎక్స్ఈవీ దోహదపడుతుందని తాము అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇంతకీ ఈ బుల్లి కారు ఖరీదెంతో తెలుసా? దాదాపు 3.5 లక్షలు! -
పరి పరిశోధన
ఈ త్రీడీ ప్రింటెడ్ ఇంటి ధర రూ. 2.5 లక్షలే! త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో చిన్న వస్తువులను తయారుచేసుకోవచ్చునని చాలాకాలంగా తెలుసుగానీ.. ఇళ్లను ప్రింట్ చేసుకునే విషయం మాత్రం ఇంకా ప్రయోగ దశలోనే ఉంది అనుకునేవారు. ఈ అంచనాలను తారుమారు చేస్తూ అమెరికాకు చెందిన ఐకాన్ అనే కంపెనీ కారు చౌకగా పొందికైన, చిన్న ఇళ్లను కట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రత్యేకమైన కాంక్రీట్ మిశ్రమాన్ని పొరలు పొరలుగా పేర్చడం ద్వారా కేవలం ఒకే ఒక్క రోజులో ఈ ఇంటిని కట్టేయవచ్చునని చూపుతోంది. ప్రస్తుతం ఎల్ సాల్వడోర్, హైతీల్లో ఇలాంటి చౌక త్రీడీ ప్రింటెడ్ ఇళ్లను నిర్మిస్తోంది. ఒక్కో ఇల్లు 600 నుంచి 800 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుంది. సాధారణ ఇళ్లతో పోలిస్తే త్రీడీ టెక్నాలజీతో తయారుచేసే ఇంటి నిర్మాణంలో వృథా చాలా తక్కువగా ఉంటుందని, ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. సాధారణ కాంక్రీట్ ఇళ్లతో సమానంగా దశాబ్దాలపాటు చెక్కుచెదరకుండా ఉంటాయని కూడా తెలిపారు. పేదలకు చౌకగా ఒక గూడు కల్పించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారితోపాటు.. మురికివాడల్లో కనీస సౌకర్యాలు లేకుండా జీవిస్తున్న వారికీ నీడ కల్పించేందుకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. -
పాస్ పుస్తకం.. ఓ ప్రహసనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించే ప్రక్రియ ప్రహ సనంగా మారుతోంది. పుస్తకాల ముద్రణకు ఉద్దేశించిన ఆన్లైన్ రికార్డుల నమోదు నత్తనడకన సాగుతోంది. ప్రక్రియ ప్రారంభమై 20 రోజులు దాటుతున్నా ఇప్పటివరకు 50 శాతం భూములనే నిర్ధారించారు. అందులోనూ పాస్ పుస్తకాలకు అవసరమైన సర్వే నంబర్లు, తహశీల్దార్ల డిజిటల్ సంతకాలతో సిద్ధం చేసిన భూమి వివరాలు 5% కూడా దాటలేదు. మరోవైపు పుస్తకాల ముద్రణ బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వ ప్రింటింగ్ ప్రె స్ తప్పుకోవడం, ముద్రణకు సంబంధించి కొత్త టెండర్లు ఖరారు కాకపోవడంతో పుస్తకాల జారీ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. కొత్త మాడ్యూల్లో... భూ రికార్డుల ప్రక్షాళన వివరాలు ఆన్లైన్లో ఉంచేందుకు రెవెన్యూ శాఖ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రాసెస్ (ఎల్‌ఆర్‌యూపీ) పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు ప్రక్షాళనలో తేలిన సర్వే నంబర్లలో 53 శాతం భూములనే నిర్ధారించారు. 1.85 కోట్ల సర్వే నంబర్లలో 2.28 కోట్ల ఎకరాలకు పైగా భూములుండగా, అందులో 99 లక్షల సర్వే నంబర్లలోని 1.13 కోట్ల ఎకరాలనే నిర్ధారించారు. అందులో వివాదాస్పద భూములు పోను 96.15 లక్షల సర్వే నంబర్లలో భూము లే సరిగా ఉన్నాయని.. వాటిలోనూ 85.68 లక్షల సర్వే నంబర్ల భూమికే పుస్తకాలు అవసరమవుతాయని, మిగిలిన 11 లక్షల సర్వే నంబర్లలోని 26 లక్షల ఎకరాలు వ్యవసాయేతర భూములని తేల్చారు. ఇప్పటివరకు 10 లక్షల ఎకరాలే.. పాస్ పుస్తకాలపై తహశీల్దార్ల డిజిటల్ సంతకం అవసరమైన నేపథ్యంలో శుక్రవారం నుంచే తహశీల్దార్లకు సంతకాలు చేసే అనుమ తిని ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఇప్పటివరకు 10,61,514 సర్వే నంబర్లలోని 4,33,305 రైతు ఖాతాల్లో ఉన్న 10,85,077 ఎకరాల భూ విస్తీర్ణానికే డిజిటల్ సంతకాలు పూర్తయ్యాయి. అంటే పాస్‌పుస్తకం ముద్రణ, జారీకి ఇప్పటివరకు సిద్ధమయింది కేవలం 10.85 లక్షల ఎకరాలే. పుస్తకాల ముద్రణ టెండర్లు ఈ నెల 3న ఖరారు కానుండటంతో తర్వాత 2 రోజుల్లో టెండర్ దక్కించుకున్న సంస్థ ముద్రణ ప్రారంభిస్తుందటున్నారు. అయితే ఎంత వేగంగా చేసినా ఆన్లైన్ రికార్డులను పూర్తిస్థాయిలో అందజేయడానికి మరో 20 రోజులు పడుతుందని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు.