R. Narayana Murthy
-
యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి?
‘‘విద్యార్థులు జాతి సంపద. వాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంపై, ప్రభుత్వాలపై, మన అందరి పైనా ఉంది అని చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అని ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ఆయన లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై రూ΄÷ందిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం అయితే మొత్తం వ్యవస్థే దెబ్బతింటుంది. యూనివర్సిటీల్లో పేపరు లీకేజీలు, గ్రూపు 1, 2 ప్రశ్నా పత్రాల లీకేజీలు... ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమై΄ోవాలి? సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీగారు దయచేసి ఇవ్వాలి. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేసుకుంటూ΄ోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? వంటి విషయాలను మా సినిమాలో ప్రస్తావించాం’’ అన్నారు. -
అంబేడ్కర్ ఆశయాలను ఏపీలో నిజం చేస్తున్నారు
కంచిలి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెట్టి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను నిజం చేస్తున్నారని ప్రముఖ సినీనటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం గ్రామంలో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని అభినందించారు. కేంద్రంలోని బీజేపీ పాలకులు ప్రభుత్వ రంగ సంస్థలైన రోడ్లు, రైల్వేలు, విమాన సర్విసులు, ఎల్ఐసీ, బ్యాంకింగ్ తదితర సెక్టార్లను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. చివరికి ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఉపక్రమించడం దారుణమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రజాకవి, సినీ గేయ రచయిత జయరాజు, విశ్రాంత ఐఏఎస్ పి.ఎస్.ఎన్. మూర్తి పాల్గొన్నారు. -
నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి?
ఆర్.నారాయణ మూర్తి ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. స్నేహచిత్ర పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. జూన్ 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘10వ తరగతిలో పేపరు లీకేజీలు.. గ్రూప్ 1, 2లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరు లీకేజీలు జరుగుతున్నాయి. ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి?. కుంభ కోణాలు చేసే వారి వల్ల విద్యావ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ నిర్వీర్యం కావాలా?. మనది నిరుద్యోగ భారతం కాదు.. ఉద్యోగ భారతం కావాలని చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాబూరావు దాస్, కథ–స్క్రీన్ ప్లే–మాటలు– సంగీతం– దర్శకత్వం– నిర్మాత: ఆర్. నారాయణ మూర్తి. -
ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్
‘‘సార్’లాంటి సినిమాలు తీయడం ఆషామాషీ కాదు.. గుండె ధైర్యం కావాలి. ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాతి’). సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆర్. నారాయణమూర్తి. ‘‘సార్’ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అన్నారు వెంకీ అట్లూరి. ‘‘కె. విశ్వనాథ్‌గారిలా ‘సార్’ చిత్రంతో తనదైన ముద్రను ఆరంభించాడు వెంకీ’’ అన్నారు తనికెళ్ల భరణి. -
నారాయణ మూర్తి ప్రజా దర్శకుడు
‘‘ఇండస్ట్రీలో కళా దర్శకులు, వ్యాపారాత్మక దర్శకులు ఉన్నారు. కానీ, ప్రజా దర్శకుడు అంటే ఆర్. నారాయణ మూర్తి ఒక్కరే. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పాటు పడే వ్యక్తి ఆయన’’ అన్నారు ప్రముఖ నటుడు బ్రహ్మానందం. ఆర్. నారాయణ మూర్తి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ సినిమా టైటిల్ లోగోని బ్రహ్మానందం రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘ఎడ్యుకేషన్ మాఫియా, విద్యా వ్యవస్థ లోని లోపాలతో నారాయణ మూర్తిగారు తీసిన ఈ చిత్రాన్ని ఆదరించాలని ప్రేక్షకులను, నా ఫ్యాన్స్‌ని కోరుతున్నాను’’ అన్నారు. ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘వైజాగ్ సత్యానంద్ గారి శిష్యులు ఈ సినిమాలో నటించారు. భారతదేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో ‘యూనివర్సిటీ’ తీశాను. విద్య, వైద్యం ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలి. విజయనగరం పార్లకిమిడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాను.. నాకు సహకరించిన మంత్రి బొత్స సత్యనారాయణగారికి, ఇతరులకు థ్యాంక్స్’’ అన్నారు. -
"ఉక్కు సత్యాగ్రహం" ఆడియో విడుదల
తాను ఏ తరహా సినిమా తీసినా అందులో సామాజిక అంశాలను మిళితం చేసే సత్యారెడ్డి ఇప్పటివరకు ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి ,రంగుల కళ ,కుర్రకారు ,అయ్యప్ప దీక్ష , గ్లామర్, సిద్ధం, ప్రశ్నిస్తా వంటి చిత్రాలను నిర్మించారు. దర్శక, నిర్మాతగానే కాకుండా నటుడిగా కూడా తన అభిరుచిని చాటుకుంటున్నాడు. జనం సమస్యల పరిష్కారం కోసం రగులుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాన అంశంగా చేసుకుని “ఉక్కు సత్యాగ్రహం” పేరుతో సత్యారెడ్డి ఓ సినిమా తీస్తున్నారు. తాను ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సత్యారెడ్డి రూపొందిస్తున్నారు. మొన్నామధ్య గద్దర్ రాసిన పాటను రిలీజ్ చేయగా తాజాగా సుద్దాల అశోక్ తేజ రచించిన పాటను విడుదల చేశారు. గద్దర్ మాట్లాడుతూ.. 'ఈ సమస్య కేవలం విశాఖపట్నం ప్రజలది మాత్రమే కాదు. మన తెలుగు ప్రజలందరిది. మొత్తం తెలుగు ప్రజలందరూ ఏకమవ్వాలని పిలుపునిస్తున్నాను. అందరూ కలిసి ఈ ప్రయివేటీకరణ ఆపగలరు' అని కోరాడు. చదవండి: శ్రీసత్య ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందా అని చూస్తున్న హమీదా నా కోడలు బంగారం.. నయన్ అత్త -
కన్నీరు పెట్టుకున్న కృష్ణంరాజు
సాక్షి, హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ పార్థీవ దేహానికి సినీ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు నివాళులు అర్పించారు. హరికృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. సినీ, రాజకీయ రంగం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హరికృష్ణ స్వయంకృషితో ఎదగాలనుకునే తత్త్వం కలవాడన్న కృష్ణంరాజు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి తీరని లోటు.. నందమూరి హరికృష్ణ మానవీయ, సామాజిక విలువలు కలిగిన వ్యక్తి అని సినీ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు నారాయణ మూర్తి పేర్కొన్నారు. -
రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి
‘‘రైతులకు గిట్టుబాటు ధర ప్రకటిస్తే ఏ రైతూ ఆత్మహత్య చేసుకోడు. వారి జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. స్నేహ చిత్ర పతాకంపై ఆర్ నారాయణమూర్తి స్వీయ దర్శకత్వలో రూపొందించిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘అన్నం పెట్టే రైతు పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పరిస్థితి మారాలి. ప్రస్తుతం తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌గారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇటువంటి పథకాలను దేశంలో అన్ని రాష్ట్రాల వారు రూపొందించాలి. స్వామినాధన్ కమిటీ రైతులకు ఏర్పాటు చేసిన గిట్టుబాటు ధర లభిస్తే దేశానికి వెన్నుముక్క లాంటి రైతు సంతోషంగా ఉంటాడు. అందరికీ అన్నం పెట్టే రైతు నోట్లోకి కూడా నాలుగు మెతుకులు వెళ్తాయి’’ అన్నారు. -
ఆ సీన్స్ తీసేయమంటున్నారు
హైదరాబాద్ : ‘అన్నదాత సుఖీభవ’ సినిమాలో జీఎస్టీపై డైలాగులు తొలగించాలని సెన్సార్‌బోర్డు సభ్యులు ఆదేశించడం పట్ల దర్శక నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై సినిమా తీస్తే సెన్సార్ బోర్డు వాళ్లు కొన్ని ముఖ్యమైన సీన్లు తొలగించాలని ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించినట్టు ఆయన తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా తాను సినిమాలు తీస్తున్నానని చెప్పారు. తాను ఎవరికీ వ్యతిరేకంగా సినిమాలు తీయడం లేదని, ప్రజా సమస్యలపై మాత్రమే సినిమాలు తీస్తున్నానని అన్నారు. సెన్సార్ బోర్డు వారు తన సినిమాలోని... ‘బడా పారిశ్రామిక వేత్తలు అప్పులు చేస్తే శిక్షలు వేయరు గానీ, రైతు అప్పుకట్టకపోతే పీడిస్తారు’ అనే ప్రధానమైన సీన్‌ను తొలగించాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఇదే తన సినిమాకి సోల్ అని చెప్పారు. అందుకే తన సినిమాకు సెన్సార్ చేయలేదని, తాను రివైవింగ్ కమిటీకి వెళ్తున్నట్లు చెప్పారు. -
చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయ్
బంజారాహిల్స్: చిన్న సినిమాలను బతికించాలని కోరుతూ తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సోమవారం ఫిలించాంబర్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి హాజరై మాట్లాడుతూ సినిమా పరిశ్రమ పెట్టుబడిదారుల మయం అయిపోయిందని, వారి ఆధిపత్యం పెరిగిపోయిందన్నారు. వాళ్ల వల్ల చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయన్నారు. థియేటర్ల విషయంలో గుత్తాధిపత్యం కొనసాగుతుందని దీనిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని తగిన విధంగా ఆలోచించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణగౌడ్, సాయి వెంకట్, కవిత, అన్నపూర్ణమ్మ, రమ్యశ్రీ, బల్లెపల్లి మోహన్, వట్టికుమార్, శ్రీలక్ష్మి, పీఎన్.రాంచందర్‌రావు, వాసిరాజు ప్రకాశం, జ్యోతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సీయం కేసీఆర్‌గారికి ధన్యవాదాలు!
‘‘పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసి సగటు ప్రేక్షకుడికి, సగటు సినిమాకు మేలు చేసిన తెలంగాణ సీయం కేసీఆర్‌గారికి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘సార్ (కేసీఆర్)... కోట్ల రూపాయలు పబ్లిసిటీకి ఖర్చు పెట్టలేక పరిమిత బడ్జెట్‌తో నిర్మించే చిన్న చిత్రాల మనుగడకు నూన్ షో ఇచ్చి పరిశ్రమను కాపాడవలసిందిగా కోరుతున్నా’’ అన్నారు. -
.కేసీఆర్‌గారూ... ఓ విజ్ఞప్తి
‘‘సినిమా థియేటర్లలో టికెట్ రేట్లు పెంచడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు సగటు ప్రేక్షకుడికి వినోదం (సినిమా) దూరమైపోతుంది’’ అని నటుడు–దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 23న సినిమా టికెట్ రేట్లు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. దీని వల్ల చిత్ర పరిశ్రమకు నష్టం చేకూరుతుందని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు.ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘భారతీయుల జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి థియేటర్లో 60 శాతం నేల–బెంచీలు, 40 శాతం కుర్చీలు ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. థియేటర్లలో 90 శాతం కుర్చీలు ఉంటే... నేల–బెంచీలు 10 శాతం మాత్రమే ఉంటున్నాయి. కొన్ని థియేటర్లలో ఆ 10 శాతం కూడా కనిపించడం లేదు. రెండు మూడు లైన్లు ఉంటున్నాయంతే. దీని వల్ల సగటు ప్రేక్షకుడు, పేద–మధ్య తరగతి ప్రజలు ఆత్మనూన్యతకు లోనయి అప్పో సొప్పో చేసి అప్పర్ క్లాస్‌కి వెళ్తున్నారు.ఇప్పుడు టికెట్ రేట్లు పెంచడం వల్ల వాళ్లంతా థియేటర్లకు రావడం మానేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎగ్జిబిటర్లు ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది. ఆల్రెడీ స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు ఫ్లాట్ రేటుకు టికెట్లను అమ్ముతున్నారు. ఇప్పుడు జీఎస్టీ (వస్తు సేవల పన్ను) సాకు చూపిస్తూ, టికెట్ రేట్లు పెంచితే సగటు ప్రేక్షకుడి పరిస్థితి ఏంటి? కనీసం చిన్న సినిమాకు అయినా రాగలడా? మంచి సినిమా అని టాక్ వచ్చి, ప్రేక్షకుడు చూడాలనుకునే లోపే సినిమాను థియేటర్ల నుంచి తీసేస్తారు. దీని వల్ల ప్రేక్షకుడికి వినోదం దూరమవుతుంది. అయినా... రూ. 100 పై ఉన్నవాటికే పెంచమన్నది ఆదేశం కదా. అలాంటప్పుడు నగర పరిధి (మున్సిపాలిటీ, పంచాయతీ) లోకి రాని థియేటర్లలో రూ. 100లోపు ఉన్న బాల్కనీ టికెట్ రేటును పెంచడం ఎంతవరకు సమంజసం? అందువల్ల, టికెట్ రేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాల్సిందిగా గౌరవనీయులైన తెలంగాణ సీయం కేసీఆర్‌గారికి విజ్ఞప్తి చేస్తున్నాను’’ అన్నారు. -
పెద్ద దిక్కును కోల్పోయాం..
దర్శకరత్న దాసరి సంతాప సభల్లో వక్తలు ► ఎంతోమందికి ఆప్యాయతను పంచిన వ్యక్తి దాసరి: చిరంజీవి ► తండ్రి లాంటి వ్యక్తిని పోగొట్టుకుని సినీ కార్మికులు అనాథలయ్యారు.. ► కులం అడగకుండా అవకాశమిచ్చారు..: ఆర్.నారాయణమూర్తి సాక్షి, హైదరాబాద్: ‘దర్శకరత్న’ డాక్టర్ దాసరి నారాయణరావు కార్మికుల కష్టాలను తన కష్టాలుగా భావించేవారని, సినీ పరిశ్రమలో ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయం చేశారని వక్తలు పేర్కొన్నారు. సినీ పరిశ్రమల్లో 24 శాఖలకు వారధిగా ఉండేవారని, పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయిందని అన్నారు. హైదరాబాద్‌లో శనివారం ఉదయం తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం, సాయంత్రం యావత్ చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు సంతాప సభలు జరిగాయి. ఈ రెండు సభల్లో పలువురు ప్రముఖులు పాల్గొని దాసరి వ్యక్తిత్వం గురించి, ఆయనతో తమ అనుబంధం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిదని పేర్కొన్నారు. తన కష్టాలుగా భావించారు: చిరంజీవి దాసరి నారాయణరావు ఆస్పత్రిలో చేరిన మొదట్లో నేను వెళ్లినప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. పేపర్ తీసుకుని ‘నీ సినిమా స్కోర్ ఎంత’ అని అడిగారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన నా సినిమా ఎలా ఆడుతోందో తెలుసుకోవాలని ఉత్సాహం చూపించారు. ‘హయ్యస్ట్ గ్రాసర్ అవుతుంది’ అనగానే, చిన్న పిల్లాడిలా విజయ సంకేతం చూపించారు. ఆయన చివరి సారిగా పబ్లిక్ ఫంక్షన్లో మాట్లాడింది మా ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్లోనే. చివరిసారిగా ప్రెస్‌ను అడ్రెస్ చేస్తూ మే 4న తన పుట్టిన రోజు నాడు ఆయన మాట్లాడారు. ఆ రోజు శ్రీ అల్లు రామలింగయ్య అవార్డు ఆయనకు అందజేసినప్పుడు తన సంతోషాన్ని తెలియజేశారు. ఆయన ఆశీస్సులను మాకు అందజేశారు. ఆ రకంగానైనా ఆయన ఆశీస్సులు పొందడం, ఆ రెండు సభల్లో నేను పాలుపంచుకోవడం తృప్తినిచ్చింది. ఇటీవల వారి ఇంట్లో కొంతమంది పెద్దలతో సమావేశం జరిగినప్పుడు మేం 50 మందిదాకా వెళ్లాం. ‘నువ్వు మా ఇంట్లో భోజనం చేసి వెళ్లాలి. మన జిల్లా నుంచి వచ్చిన బొమ్మిడాయిలు తినాలి’ అంటూ దగ్గరుండి నాకు తినిపించి, పితృ వాత్సల్యం చూపించారు. ఎంతోమందికి ఆప్యాయతానురాగాలు పంచిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేరు. ఈ రోజు ఎంతో మంది సినిమా కార్మికులు ఆ బాధను అనుభవిస్తున్నారు. అలాంటి బాధే నాకూ ఉంది. ఒక పెద్ద దిక్కును, తండ్రి వంటి వ్యక్తిని పోగొట్టుకుని సినీ కార్మికులు అనాథలయ్యారు. కార్మికుల కష్టాలను తన కష్టాలుగా భావించారు. దాసరి లేని లోటు ఎవరూ పూడ్చలేనిది.. తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. గీతా ఆర్ట్స్ ఆయన వేసిన పునాదే నా మొదటి రెండు సూపర్ హిట్స్ (‘బంట్రోతు భార్య, దేవుడే దిగి వస్తే’)కి దాసరి దర్శకులు. గీతా ఆర్ట్స్ నలభై ఏళ్ళుగా నిలబడి ఉందంటే అది ఆయన వేసిన పునాదే. ప్రతి చిన్నవాడు కొట్టగలిగే ఒకే ఒక్క తలుపు దాసరి నారాయణరావు ఇల్లు. ఇండస్ట్రీలో నిర్మాతలకు, వర్కింగ్ క్లాస్‌కు మధ్య వారధిగా నిలిచిన వారు దాసరి. ఆ ‘వారధి’ లేరిప్పుడు. – నిర్మాత అల్లు అరవింద్ ప్రతి ఒక్కరికీ సాయం చేశారు ‘దాసరి నారాయణరావు తెలుగు చిత్రసీమకు గురువు. ఆయనకు ఎవరిపైనా ద్వేషం లేదు. అడిగిన ప్రతి ఒక్కరికీ సహాయం చేశారు’ అని తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం నిర్వహించిన శ్రద్ధాంజలి సభలో దర్శకుడు ‘ధవళ’ సత్యం అన్నారు. ఇటీవల స్వర్గస్తులెన దర్శకుల సంఘం సభ్యులు కేఎస్ రావుగారు, తిరుమలరావు మృతికి ఇదే వేదికపై సంతాపం ప్రకటించారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ ‘చిత్రసీమలోని 24 శాఖల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించ గల గొప్పవ్యక్తి దాసరిని కోల్పోవడం మన దురదృష్టం. ఈ కార్యక్రమానికి రాలేని దర్శకులకు దండాలు. తెలిసీ రాని దర్శకులకు శతకోటి దండాలు’ అని అన్నారు. కార్యక్రమంలో దర్శకులు ముత్యాల సుబ్బయ్య, రేలంగి నరసింహారావు, క్రిష్ణమోహన్‌రెడ్డి, సత్యనాయుడు, రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంత చెప్పినా తక్కువే మద్రాసులో ఎటూ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ‘తమ్ముడూ..’ అని పలకరించిన నా గురువు దాసరి నారాయణ రావును ఎప్పటికీ మరచిపోలేను. నీ కులమేంటి? మతమేంటి అని అడగకుండా అవకాశం ఇచ్చిన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. – నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి -
రాజధాని అంటే రియల్ ఎస్టేటా?
మనసులో మాట ► కొమ్మినేని శ్రీనివాసరావుతో ప్రజా నటుడు ఆర్ నారాయణమూర్తి రాజధాని అంటే వేల ఎకరాల భూసేకరణతో సాగించే రియల్ ఎస్టేట్ వ్యవహారం కాదని తెలుగు చిత్రపరిశ్రమలో ప్రజానటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా పేరుపొందిన ఆర్. నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించాలనే ఆశయం గొప్పదే కావచ్చు కానీ భూమితో వ్యాపారం చేయాలనుకునే ధోరణితో అది ఒక రియల్ ఎస్టేట్ వ్యవహారంగా మారుతోందన్నారు. రియల్ ఎస్టేట్ కోసమే ఇన్ని వేల ఎకరాలు సేకరించారు అనే అపప్రథ ఏదయితే ఉందో అది పాలకుడిగా చంద్రబాబుకూ, రాష్ట్రానికి కూడా ప్రమాదకరమే అవుతుందన్నారు. కేంద్రంతో అఫెన్స్ కాకుండా డిఫెన్స్ ఆడటం ద్వారా ప్రత్యేక హోదాను బాబు అటకెక్కిం చడం చాలా తప్పు అంటున్న ఆర్. నారాయణమూర్తి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... ముప్ఫై ఏళ్లుగా సినిమాలు తీస్తున్నారు. మొదట్లో వచ్చిన ఆదరణ ఇప్పుడు లేదుగా? దానికి కారణం కూడా నేను చెబుతాను. 31 ఏళ్లనుంచి సినిమాలు తీస్తున్నాను అర్ధరాత్రి స్వతంత్రం నుంచి నా పయనం ఇలా సాగుతోంది. 20 ఏళ్లు నా సినిమాలు చాలా బాగా ఆడాయి. నా సినిమాలు ఎప్పుడైతే బీభత్సంగా ఆడటం మొదలెట్టాయో.. అనేకమంది ఇలాంటి సినిమాలే తీయాలని ముందుకొచ్చారు. అది నాకు గొప్ప సక్సెస్ కింద లెక్క. మావో మహానుభావుడు ఏమన్నాడు? వెయ్యి పుష్పాలను వికసింప చేయండి అన్నాడు. విప్లవం నా సొత్తు కాదు. ప్రజల సినిమా నా సొత్తు కాదు. నేను ఆద్యుడినీ కాదు. చివరి వాడినీ కాదు. అనేకమందిలో నేనొకడిని. అందరూ ఈ ట్రెండ్‌లోకి రావడంతో ఒక మొనాటినీ వచ్చేసింది. ఎవరి రూట్లో వారు తీసారు కానీ పదేపదే తీయడం అనే మొనాటినీ వల్ల నేను దెబ్బతిన్నాను. వాళ్లంతా మానేసారు. నేను మాత్రమే సముద్రం ఈదుతున్నా. జనం దయవల్ల ఈదుతున్నా. కమ్యూనిజం వైపు ఎలా మళ్లారు? చిన్నప్పటినుంచి ప్రజల సమస్యలతో గడిపాను. మా ప్రాంతంలో ఉద్యమంకోసం ప్రాణత్యాగాలు చేసినవారిని చూశాను. ఇక చండ్రరాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, కొండపల్లి సీతారామయ్య వంటి నాయకులను అతి దగ్గరనుంచి చూశాను. వారన్నా వారి ఆచరణ అన్నా వీరారాధన. ఇక శ్రీశ్రీ గీతాలు అయితే యుద్ధనాదాలు. ఒక్క పదం అర్థం కాకున్నా పదండి పదండి పోదాం. పోదాం పోదా పైపైకి అంటూ పాడుతుంటే ఆవేశం, ఉత్తేజం. ఇక కొసరాజు జానపద పాటలన్నా అదే పీలింగ్. ఇలాంటి బాల్యం నాది. అంతే కానీ ఏరోజు నేను కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకుని పనిచేయలేదు. ప్రజల కోసం వారు చేసే పోరాటాలు, త్యాగాలు అవే నన్ను ప్రేరేపించాయి. తమ జీవితాలనే త్యాగం చేశారు వారు. అందుకే నా సినిమాలు వారి ప్రేరణతోనే సాగుతాయి. కానీ చండ్రరాజేశ్వరరావు, పుచ్చలపల్లి అంటే వీరారాధనతో చూసిన నాకు వారిద్దరు విడిపోవడం, వేరు పార్టీలు పెట్టుకోవడంతో ఏడుపొచ్చింది. ప్రపంచ కార్మికులారా ఏకంకండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అంటున్నారు. మరి మీరెం దుకు విడిపోయారు. ఎందుకు విడిపోయారో, ఆ విభేదాలు ఏమిటో ఈరోజుకీ నాకు తెలీదు. ఆ విడిపోవడం సిపీఐ, సీపీఎం, సీపీఐ ఎం–ఎల్ పార్టీలు ఎర్రజెండా అనేక పీలికలుగా ఇవ్వాళ చీలిపోవడం అన్నది భారత దేశ పీడిత ప్రజానీకానికి పెద్ద దెబ్బ అని నా అభిప్రాయం. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు వైఖరిని మీరేమనుకుంటున్నారు? రాజధాని కోసం దాదాపు 50 వేల ఎకరాల భూమి అవసరం లేదనుకుంటున్నాను. తుళ్లూరు రైతుల దగ్గర సేకరించిన 33 వేల ఎకరాలు కానీ, గ్రామ కంఠాలనుంచి సేకరించిన భూమి కానీ, అటవీ భూములు కానీ మొత్తంగా 50 వేల ఎకరాల భూమి రాజధానికి అవసరం లేదు. ప్రపంచంలోనే గొప్ప రాజధాని అనే ఆశయం గొప్పదే కావచ్చు. కానీ అది ఒక రియల్ ఎస్టేట్ వ్యవహారంగా మారుతోంది. రియల్ ఎస్టేట్ కోసమే ఇన్ని వేల ఎకరాలు సేకరించారా అనే అపప్రథ ఏదయితే ఉందో అది పాలకుడిగా చంద్రబాబుకూ, రాష్ట్రానికి కూడా హానికరమే అవుతుంది. ఏపీలో సోషల్ మీడియాపై జరుగుతున్న దాడులు, అరెస్టులపై మీ అభిప్రాయం? ఒక్క ఏపీలోనే కాదు దేశంలో ప్రపంచమంతటా సోషల్ మీడియాపై దాడి జరుగుతోంది ఎందుకు? ఇవ్వాళ రాజ్యాన్ని ప్రశ్నించడమే పెద్ద నేరం అయిపోతోంది కదా. నరేంద్రమోదీ గత మూడేళ్లలో బీభత్సంగా పాలన చేశాడని మీడియా అంటోది. అది అంగీకారమేనా? మీడియా మీద దాడి కాదు. మీడియానే ప్రజలపై రుద్దుతోంది. బాహుబలి సినిమా చూడకపోతే వాడు ప్రేక్షకుడు కాదు. మోదీకి ఓటేయకపోతే నేను ఓటర్ని కాను. రాజమౌళి నభూతో నభవిష్యత్ లాగా బాహుబలి తీశారు. ఒకే. ఒప్పుకుంటున్నా. కానీ నేను ఆ సినిమా చూడవచ్చు, చూడకపోవచ్చు. కానీ చూడకపోతే నువ్వు పాపాత్ముడివి అని మీడియా ఇంపోజ్ చేస్తుందనుకో. అది తప్పు కదా. మోదీ మూడేళ్ల పాలనలో అంత బీభత్సం చేశారా? నరేంద్రమోదీ నిజాయితీ పరుడు, అవినీతి మరక అంటనివాడు అంటే ఒకే. ఒప్పుకుందాం. కానీ ఆయన చుట్టుపక్కల చేరిన మూక అంతా అంబానీలు, అదానీలు మొత్తం పారిశ్రామిక వేత్తలు ఇదీ బీభత్సం కాగా మీడియా దీన్ని పక్కనపెట్టి పొగడటం ఏంటి? వాస్తవాలను పక్కనబెట్టి మీరు ప్రజలమీద భావాలను రుద్దడం మొదలు పెడితే అది ప్రజలమీద దాడే కదా. రాజ్యాన్ని ప్రశ్నిస్తున్న మీడియా మీద ప్రభుత్వాలు దాడి చేస్తున్నాయి. అదే సమయంలో మీడియా కూడా ప్రజా వ్యతిరేక విధానాలను, భావాలను ప్రజలపై రుద్దతూ వారిపై దాడి చేస్తున్నాయి. ప్రత్యేక హోదాపై చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా ఎందుకు అడగలేకపోతున్నారు? ఆ విషయంలో చంద్రబాబు వైఖరి తప్పు. యూపీఏ ప్రభుత్వం, సోనియా సైతం ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. తిరుపతి సభలో వెంకన్న సాక్షిగా మోదీ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రమాణం చేశారు. ఆ ప్రకటనలను వారు గౌరవించాలి. ఆమోదిం చాలి. కాని ఇవ్వాళ జరుగుతున్నదేమిటి? రాజ్యవ్యవహారాల్లో అపెన్స్, డిఫెన్స్ రెండూ ఉంటాయి. దాడి చేయాలి, కాచుకోవాలి. కానీ చంద్రబాబు మాత్రం మూడేళ్ల తర్వాత కూడా కేంద్రంతో వ్యవహారంలో డిఫెన్స్ తోనే వెళుతున్నారు. ఆయన అఫెన్స్‌లో వెళ్లి టీడీపీ ఎంపీలందరిచేత పూర్తిగా రాజీ నామా చేయించి మాకు మంత్రిపదవులు వద్దు ఏమొద్దు. ప్రత్యేక హోదా కావాలి అని పట్టుబడితే ప్రత్యేక హోదా రాదా? నిజంగా ప్రత్యేక హోదానే వస్తే దాని ఫలితాలు వేరుగా ఉంటాయి. గతంలో కూడా ఎన్నో సభల్లో చంద్రబాబును ఫైట్ చేయమని కోరాను. ఇప్పుడు సాక్షి ద్వారా కూడా ఇదే చెబుతున్నాను. ప్రత్యేక హోదా కోసం డిఫెన్స్ కాదు. ఫైట్ చేయండి. అదే రాష్ట్ర సమస్యలకు పరిష్కారం. రాజ్య వ్యవహారాల్లో అపెన్స్, డిఫెన్స్ రెండూ ఉంటాయి. దాడి చేయాలి, కాచుకోవాలి. కానీ చంద్రబాబు మాత్రం మూడేళ్ల తర్వాత కూడా కేంద్రంపట్ల డిఫెన్స్‌తోనే వెళుతున్నారు. ఆయన అఫెన్స్‌లో వెళ్లి టీడీపీ ఎంపీలందరిచేత పూర్తిగా రాజీనామా చేయించి, మాకు మంత్రిపదవులు వద్దు.. ఏమొద్దు. ప్రత్యేక హోదా కావాలి అని పట్టుబడితే ప్రత్యేక హోదా రాదా? నిజంగా ప్రత్యేక హోదానే వస్తే ఏపీలో దాని ఫలితాలు వేరుగా ఉంటాయి. ప్రత్యేక హోదా కోసం డిఫెన్స్ కాదు. ఫైట్ చేయండి. అదే రాష్ట్ర సమస్యలకు పరిష్కారం. (నారాయణమూర్తితో ఇంటర్వూ్య పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/R6B5HT https://goo.gl/RlVkiG -
సమస్యలపై కానిస్టేబుల్ పోరాటం
సమాజంలో జరుగుతున్న సమస్యలపై పోరాడే పాత్రల్లో పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తిని సోలోగా చూస్తుంటాం. అయితే, ఈ సారి ఆయన రొటీన్‌కు భిన్నంగా హీరోయిన్‌తో.. అదీ సహజనటి జయసుధతో స్టెప్పులేస్తే ఎలా ఉంటుంది? ఊహిస్తేనే సినిమా ఎప్పుడు చూద్దామా? అని ఆత్రుతగా ఉంది కదూ. అయితే.. మీరు సంక్రాంతి వరకూ ఆగాల్సిందే. నారాయణమూర్తి, జయసుధ ముఖ్యపాత్రల్లో చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మించిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ పోస్ట్ ప్రొడక్షన్ జరపుకొంటోంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘నిజాయతీ పరుడైన హెడ్ కానిస్టేబుల్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించాడన్నదే కథ. నారాయణమూర్తి, జయసుధ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ వారంలో పాటలు, సంక్రాంతికి సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సమాజంలోని ప్రధాన సమస్య ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఆ సమస్య ఏంటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నా గత చిత్రాలకంటే ఇందులో వైవిధ్యంగా కనిపిస్తా. మా చిత్రం చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని నారాయణమూర్తి చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్, కెమెరా: కె.సుధాకర్‌రెడ్డి, సమర్పణ: చదలవాడ తిరుపతిరావు. -
జోడీ కుదిరింది!
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి, సహజ నటి జయసుధ జంటగా ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ అనే చిత్రం రూపొందనుంది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దర్శకునిగా మారుతున్నారు. చదలవాడ తిరుపతిరావు సమర్పణలో చదలవాడ పద్మావతి నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 19న ప్రారంభం కానుంది. ‘‘నా అభిమాన నటి సావిత్రిగారు. ఆమె తర్వాత నేను అభిమానించే నటి జయసుధగారు. అటువంటి గొప్ప నటితో కలిసి నేను మొదటిసారి నటిస్తున్నానంటే చాలా హ్యాపీగా, థ్రిల్‌గా ఉంది. నాతో నటించేందుకు ఒప్పుకున్న జయసుధగారికి, ఈ అవకాశం ఇచ్చిన దర్శక-నిర్మాతలకు థ్యాంక్స్’’ అని నారాయణమూర్తి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘నీతి, నిజాయితీ ఉన్న ఓ పోలీసు నిజ జీవితంలో, వృత్తిలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించాడన్నది కథాంశం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్, కెమెరా: సుధాకర్ రెడ్డి. -
పండినా ఎండినా చేను చేనేరా... అంది!
మా అమ్మ : ఆర్. నారాయణమూర్తి అరవై రెండేళ్ల ఆర్. నారాయణమూర్తి గొంతెత్తితే కంచు గంట మోగినట్లు ఉంటుంది. పిడికిలి బిగిస్తే అది పోరాట గళం అవుతుంది. కళ్లెర్ర చేస్తే పీడించే వర్గం వెన్నులో వణుకు పుడుతుంది. నిత్యం రగిలే సూర్యుడిలా కనిపించే ఈ విప్లవ నారాయణుడిని తన మాతృమూర్తి గురించి చెప్పమని అడిగినప్పుడు.. అమ్మను, అమ్మ మలిచిన తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ కొద్దిసేపూ మమకారపు ఊయలలో ఊగుతున్నట్లే కనిపించారు. ‘‘మాది తూర్పు గోదావరి జిల్లా, రౌతులపూడి మండలం, మల్లంపేట గ్రామం. మా అమ్మ చిట్టెమ్మ, నాన్న రెడ్డి చిన్నయ్య నాయుడు. మాది చాలా సామాన్యమైన రైతు కుటుంబం. మా ఊరి నుంచి చదువుకోడానికి వెళ్లేది నేనొక్కడినే. రౌతులపూడిలో ఐదవ తరగతి తర్వాత శంఖవరం హైస్కూల్లో చేరాను. అది మా మల్లంపేటకు 14 కిలోమీటర్లు. రానూపోను రోజూ 28 కిలోమీటర్ల నడక. అది కాదు కష్టం. నన్ను బడికి పంపించడానికి మా అమ్మ రోజూ తెల్లవారుజామున మూడున్నరకే లేచి అన్నం వండి క్యారియర్ పెట్టేది. నేను నాలుగున్నరకు బయలుదేరేవాడిని. దారంతా చీకటి. దారి మధ్యలో గుమ్మరేకల మెట్ట అనే కొండను చూడాలంటేనే భయమేసేది. ఆ కొండమీద దెయ్యాలుంటాయనే కథలు మా ఊరంతా చెప్పుకునేవారు. రాత్రి ఇంటికొచ్చేటప్పుడూ ఆ కొండ దగ్గరకు వచ్చేటప్పటికి చీకటయ్యేది. అమ్మతో... ‘‘కొండ పక్కనుంచి వెళ్లాలంటే భయమేస్తోందమ్మా’’ అన్నాను. అప్పుడామె పల్లెలో అందరూ భయపడినట్లు దెయ్యానికి భయపడలేదు సరికదా ‘జై భజరంగభళీ’ అని ఆంజనేయుడిని తలుచుకో. నిన్ను ఏ దెయ్యమూ ఏం చేయదు’ అని చెప్పింది. ఊరికి నన్ను తొలి గ్రాడ్యుయేట్‌ని చేసింది మా అమ్మ అంత కష్టపడి నన్ను బడికి పంపిస్తే నేనేమో టెన్త్ ఫెయిలయ్యాను. మా నాన్న అసలే కోపిష్టి. ఫెయిలైనందుకు కొడతాడని ఇంట్లో వాళ్లకు కనిపించలేదు. అమ్మ ఊరంతా వెతికింది. నేను ఇంటి వెనకాలే దాక్కుని ఏడుస్తున్నాను. నాకోసం వెతికి వెతికి అలసిపోయింది అమ్మ. చీకటి పడే వేళకు ఇంటికొచ్చి ఏదో పని మీద పెరట్లోకి వచ్చింది. ఏడుస్తున్న నన్ను అమాంతం దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ఓదార్చి ఆమె అన్న మాట ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడు ఆమె పాదాలను తాకి దణ్ణం పెట్టాలనిపిస్తుంది. ఆమె ఏమన్నదో తెలుసా!! ‘‘మనం ఏటా చేలో పంటవేస్తాం. ఒక ఏడాది పండితే మరొక ఏడాది ఎండుతుంది. మరో ఏడాది వరదకు కొట్టుకుపోతుంది. అలాగని పంట వేయడం మానుతామా? చేను చెడ్డదని తప్పు పడతామా? పక్కటేడాది దుక్కి దున్నడం మానేస్తామా? పరీక్షా అంతే. వచ్చే ఏడు పాసవుతావు’’ అన్నది అమ్మ. అలా మా అమ్మ నన్ను ఊరికి తొలి గ్రాడ్యుయేట్‌ని చేసింది. ఆఖరికి నేను సినిమాల్లోకి వెళ్తానంటే నాన్నకు తెలియకుండా 70 రూపాయలిచ్చి పంపించింది. ఇప్పుడు మీరు చూస్తున్న నారాయణమూర్తి ఆవిర్భావానికి ఆమె తోడ్పాటే కారణం. ఆ రోజు అమ్మకు దణ్ణిం పెట్టి వెళ్లాను. ఇప్పటికీ ప్రతి సినిమా విడుదల తర్వాత ఓసారి మా ఊరెళ్లి అమ్మకు కనిపిస్తాను’’. కడుపు నిండా అమ్మ ప్రేమ సినిమాల్లోకి వచ్చాక కొంతకాలం వేషాల్లేక కష్టాలు పడ్డాను. అప్పుడు అమ్మ ఓ మాటంది. ‘‘నువ్వింకా కొంతకాలం వేషాల కోసం ప్రయత్నిస్తానంటే అలాగే చెయ్యి. కానీ డబ్బుల్లేవని పస్తులు మాత్రం ఉండకు. బియ్యం, పప్పులు పంపిస్తాను. వండుకుని రోజూ అన్నం తిను’’ అన్నది. ఆ మాట తలుచుకుంటే ఇప్పటికీ కళ్లలో నీళ్లు తిరుగుతాయి నాకు. కళ్లారా రాముని కోవెల నేను సంపాదించడం మొదలు పెట్టాక కూడా తమ కోసం డబ్బు పంపించమని అడగలేదింతవరకు మా అమ్మ. ఆమె కోరింది మా ఊళ్లో రాముని కోవెల మాత్రమే. ఊరంతా పెళ్లిళ్లు, ఇతర వేడుకలు చేసుకోవడానికి అనువుగా ఉంటుందని ఆమె ఉద్దేశం. ఆ కోవెలలో ఎన్నో పెళ్లిళ్లను ఆమె కళ్లారా చూస్తోందిప్పటికీ. నా పెళ్లి చూడలేని కొరతను ఆమె ఆ రకంగా పూరించుకుంటోంది. -సంభాషణ: వాకా మంజులారెడ్డి -
అంజయ్యకు కన్నీటి వీడ్కోలు
♦ గద్దర్, ఆర్.నారాయణమూర్తి తదితరుల నివాళి ♦ అధికార లాంఛనాలతో నిర్వహించకపోవడం బాధాకరం: మందకృష్ణ దండేపల్లి: ప్రజా కవి, గాయకుడు, రచయిత గూడ అంజయ్య (62)కు అభిమానులు బుధవారం అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో మంగళవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచిన ఆయన పార్థివ దేహాన్ని బుధవారం తెల్లవారుజామున స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్ కు తీసుకొచ్చారు. ప్రజలు, కుటుంబీకులు, బంధువులు, అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు ఉంచారు. ప్రజాకవి గద్దర్, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటి కొండ రాజయ్య, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్, సీపీఎం నేతలు రాములు, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే ఎస్.రామలింగారెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, పలు దళిత సంఘాల నాయకులు, తెలంగాణ సాంస్కృతి సారథి కళాకారులు మృతదేహంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. అనంతరం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంతక్రియలు నిర్వహించారు. కవిగా, గాయకునిగా దేశవ్యాప్త గుర్తింపు, ప్రజాదరణ పొందిన అంజయ్య అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించకపోవడం చాలా బాధాకరమని మంద కృష్ణమాదిగ ఈ సందర్భంగా ఆవేదన వెలిబుచ్చారు. ఆయన ఇతర సామాజికవర్గానికి చెంది ఉంటే అంత్యక్రియలను ఎలా నిర్వహించి ఉండేవారో చెప్పనవసరం లేదన్నారు. తీరని లోటు: నారాయణమూర్తి కవి, గాయకుడు దళిత జాతి ముద్దుబిడ్డ గూడ అంజయ్య మరణం దేశానికే తీరని లోటని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. ఆయన రాసిన పాటలతో తన సినిమాలు విజయం సాధించాయన్నారు. అంజయ్యతో తనది విడదీయరాని అనుబంధమని గుర్తు చేసుకున్నారు. ‘దండేపల్లి’కి అంజయ్య పేరు: గద్దర్ అభిమానుల కోరిక మేరకు దండేపల్లి మండలానికి అంజన్న పేరు పెట్టాలని గద్దర్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని బాల్క సుమన్ చెప్పారు. అంజయ్య కొన ఊపిరి దాకా సమాజం గురించే ఆలోచించిన మహోన్నతుడని సీపీఎం నేత రాములు పేర్కొన్నారు. -
దండకారణ్యం సినిమా రివ్యూ
చిత్రం: ‘దండకారణ్యం’, తారాగణం: ఆర్.నారాయణమూర్తి, త్రినాథ్, ప్రసాద్‌రెడ్డి, విక్రమ్, కెమేరా: శివకుమార్, మాటలు- ఫొటోగ్రఫీ- సంగీతం-నిర్మాత-దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి దేశంలో అభివృద్ధి ఎక్కడ జరిగినా చివరికి సమిధలుగా మారేది ఆది వాసీలు, అమాయక గిరిజనులు. అభివృద్ధి పేరుతో బహుళజాతి కంపెనీలతో కలిసి ప్రభుత్వం చేపడుతున్న బాక్సైట్, ఇనుము లాంటి సహజ వనరుల తవ్వకాలను అక్కడున్న ఆదివాసీలు, గిరిజనులు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తూ పోరాడుతున్నారు. ఈ పోరాటంలో ఎంతోమంది బలయ్యారు. అడవులు తుపాకుల మోతతో రక్తచరిత్రను లిఖిస్తున్నాయి. ఆ పరిస్థితి ఉండకూడదనే కథాంశంతో స్వీయ దర్శకత్వంలో ఆర్.నారాయణమూర్తి నిర్మించిన చిత్రం ‘దండకారణ్యం’. ప్రముఖ మావోయిస్ట్ నేత అయిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ జీవితం ఆధారంగా ఈ చిత్రకథను ఆయన అల్లుకున్నారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత ఆర్.నారాయణమూర్తి స్నేహా ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై రూపొందించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. మావోయిస్టు నాయకుడు కోటన్న (ఆర్.నారాయణమూర్తి) ఓ పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందడంతో అతని స్వస్థలమైన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి గ్రామస్థులు శోక సముద్రంలో మునిగిపోతారు. జగిత్యాల జైత్ర యాత్రతో మొదలుపెట్టి పశ్చిమ బెంగాల్‌లోని జంగల్‌మహల్ దాకా ప్రజల కోసం అలుపెరుగని పోరాటం సాగించిన కోటన్న గతంలోకి కథ వెళుతుంది. కట్ చేస్తే... యుక్తవయసు నుంచి అన్యాయాలను ఎదిరించే మనస్తత్వం ఉన్న కోటన్న కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తాడు. సొంత ఊరిలో జరుగు తున్న అన్యాయాలను ఎదిరించడంతో ప్రభుత్వం అతనిమీద నక్సలైట్ ముద్ర వేస్తుంది. కనిపిస్తే కాల్చివేయమని ఆదే శాలు జారీ చేస్తుంది. ఉన్న ఊరినీ, కన్నతల్లినీ విడిచి అడవిలో పోరాటానికి సిద్ధమవుతాడు కోటన్న. అక్కడ అతనికి మరో సమస్య... అడవిలో అపారసంపద మీద ప్రభుత్వంతోపాటు కొన్ని ‘కార్పొరేట్ సంస్థలు కన్నేస్తాయి. ఎలాగైనా ఆదివాసీల భూములను కొల్లగొట్టి, ఇళ్లను పడగొట్టి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని వాళ్ల ప్లాన్. దీనివెనుక కోటానుకోట్ల రూపాయల ఒప్పందాలున్నాయి. కానీ దీన్ని పసిగట్టిన కోటన్న ఆ గ్రామాలల్లో జరుగుతున్న అన్యాయం గురించి చైతన్యం తీసుకొస్తాడు. గ్రామస్థులు కూడా అక్కడికి వచ్చిన ప్రభుత్వాధికారులను, అక్కడ ఖనిజాలను తరలించడానికి చేపట్టిన రోడ్డు, రైల్వేపనుల్ని అడ్డుకుంటారు. దీంతో అక్కడి వాతావరణం హింసాత్మకంగా మారుతుంది. గ్రామస్థుల్లో కొంత మంది మావోయిస్ట్ ఉద్యమంలో చేరిపోతారు. ఇదే సమయంలో భూమి పూజ చేయడానికి వచ్చిన సీఎం నానాజీని చంపడానికి మందుపాతర పెడతారు మావోయిస్టులు. సీఎం గాయాలతో బయటపడ తాడు. కోటన్న గ్రూప్‌లోనే పనిచేస్తూ ఇన్ఫార్మర్గా మారిన వ్యక్తి సమా చారంతో పోలీసులు అతని మీద ఎటాక్ చేస్తారు. కానీ కోటన్న వెంట్రుకవాసిలో తప్పించుకుంటాడు. ప్లాన్ బెడిసి కొట్టడంతో మరో వ్యక్తిని పంపిస్తారు పోలీసులు. కోటన్న మంచితనం తెలిసిన అతను తనెందుకు వచ్చాడో కోటన్న ముందు నిజాయతీగా ఒప్పుకుంటాడు. పరిస్థితి విషమించడంతో ప్రభుత్వం అక్కడ పోలీసులు, మిలటరీని రంగంలోకి దించడంతోపాటు ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఆయుధాలిస్తుంది. ఈ క్రమంలోనే సీఎం కొడుకును మావోలు కాల్చిచంపడంతో కథ మలుపు తిరుగుతుంది. కానీ ఈ నింద మావోయిస్టు సానుభూతిపరుడైన క ళాకారుడు జితిన్ మరాండీ మీద పడుతుంది. జితిన్‌ను విడిపించడానికి కోటన్న ఏం చేశాడు? చివరికి పోలీసులు మోసంతో కోటన్న ప్రాణాలు ఎలా తీశారన్నది మిగతా కథ. మావోయిస్ట్ నాయకుడు కిషన్‌జీ మరణించినా ప్రభుత్వ సారథ్యంలో ‘ఆపరేషన్ గ్రీన్‌హంట్’ ఆగలేదు. ఇంకా దండకారణ్యం రగులుతూనే ఉంది. ఈ సమయంలోనే ప్రభుత్వం, మావోయిస్ట్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి శాంతి నెలకొనాలనే ఉద్దేశంతో నారాయణమూర్తి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తొలిసారిగా ఓ నిజజీవిత పాత్ర పోషించిన ఆయన కోటన్నకూ, అతని తల్లికీ మధ్య అనుబంధాన్ని ఓ పాట ద్వారా చూపించిన తీరు హృద్యం. ప్రజా గాయకుడు గద్దర్ ఈ సినిమాలో 3 పాటలు రాసి, పాడి, నటించారు. దండకారణ్యంలో సాగుతున్న పోరాటాలకు వెండితెర సాక్ష్యమైన ఈ చిత్రం అక్కడి పరిస్థితుల పట్ల ప్రేక్షకుల్లో ఆలోచన రేపుతుంది. -
అడవి పూలు
చెట్టుకు మాటలు రావు... పుట్టకు పాటలు రావు... కానీ, మాటా, పాటా రెండూ అడవిలోనే పుట్టాయి. అరణ్య రోదనలు మనదాకా చేరాలంటే... మన సహాయం అడవి కాచిన వెన్నెల కాకుండా ఉండాలంటే... అడవినీ, సమాజాన్నీ జతకలపాలంటే.. ఓ జత కావాలి! ఆర్. నారాయణమూర్తి, గద్దర్ - ‘దండకారణ్యాని’కి సూర్యచంద్రుల లాంటివారు! వెలుగు, వెన్నెల లాంటివారు! కళామతల్లి కడుపున పుట్టిన ఈ కవలలు అడవితల్లి పాదం మీద పుట్టుమచ్చలు! వీరి ఆట, పాట... మాట, బాట... ‘సాక్షి’కి ఎక్స్‌క్లూజివ్! నమస్తే గద్దర్ జీ! కొంత గ్యాప్ తర్వాత తెరపైకొచ్చారు... గద్దర్: అవును. రెండేళ్ల నుంచి ఎక్కడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు! ‘దండకారణ్యం’సిన్మాకు మా మూర్తి అన్న డెరైక్టరు, నేను యాక్టరు. కాబట్టి ఆయన నుంచే స్టార్ట్ చేద్దాం. నారాయణమూర్తిగారూ! 30 ఏళ్ళుగా ఉద్యమాలే ఊపిరిగా ఫిల్మ్స్ తీస్తున్నారు. తాజా ‘దండకారణ్యం’ ఏంటి? నారాయణమూర్తి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ - ఇలా అనేక రాష్ట్రాలకు విస్తరించింది - దండకారణ్యం. అపార ప్రకృతి సంపదకు నెలవు. దోపిడీకి వ్యతిరేకంగా ఆదివాసీలు చేస్తున్న పోరు, వెన్నుదన్నుగా నిలిచిన ఉద్యమకారుడు కోటన్న జీవితమే ఈ ‘దండకారణ్యం’ ఫిల్మ్. నేను ఉద్యమకారుడు మల్లోజు కోటేశ్వరరావు అలియాస్ కోటన్న అలియాస్ కిషన్‌జీ వేషం వేస్తున్నా. నేనెన్నో సినిమాలు తీసినా, కిషన్‌జీ లాంటివారి జీవితంతో తీయడం తొలిసారి. గద్దర్‌జీ! ‘జగిత్యాల టూ జంగల్‌మహల్’ సాగిన కిషన్జీతో మీకు సాన్నిహిత్యం ఉందిగా? గద్దర్: అవును. కానీ, ఈ సినిమా కేవలం ఆయన జీవితమే కాదు. గిరిజనులు ఎదుర్కొంటున్న దోపిడీని సిన్మాలో చూపాం. అన్ని రంగాల్లో, చివరకు మీడియాలో వస్తున్న ‘ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల’ వల్ల జరిగే దోపిడీపై జన చైతన్యానికే ఈ ప్రయత్నం! నారాయణమూర్తి: (ఆవేశంగా) ఒకప్పుడు ఈస్టిండియా కంపెనీవాడు దోపిడీ చేస్తే, ఇప్పుడు మనవాళ్ళు చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే, ఈ దేశంలో మరో స్వతంత్రం కోసం మళ్ళీ పోరు చేయాల్సొస్తుంది. కిషన్‌జీ మీద సినిమా తీయాలని ఎందుకనిపించింది? నారాయణమూర్తి: మావోయిస్ట్ టాప్‌లీడర్ కిషన్‌జీది పెద్దపల్లి. హి ఈజ్ లైక్ సుభాష్ చంద్రబోస్. నా దృష్టిలో ఇండియన్ చెగువేరా. నాలుగున్నరేళ్ళ క్రితం కిషన్‌జీని ఎన్కౌంటర్ చేశారు. అంత్యక్రియల్లో గద్దరన్న పాడిన పాట గుర్తుంది. అక్కడ నేను ‘కిషన్‌జీ మీద సినిమా తీస్తా’నన్నా. తీశా. గద్దరన్న 3 పాటలు రాసి, యాక్ట్ చేశారు. గద్దర్: మిలటరీ రాజ్యంలో బలవుతున్న ఆదివాసీలకు అద్దం ‘దండకారణ్యం’. ఆర్మీ బయటివాళ్ళతో కొట్లాడడానికుంది కానీ, ఇంట్లోవాళ్ళపై తుపాకీ పేలిస్తే ఎలా? వాళ్ళ డుగుతున్నవి పెద్దవేం కాదు. కాసింత బువ్వ, గూడు! మరి ‘దండకారణ్యం’ బాగుండాలంటే ఏం చేయాలి? నారాయణమూర్తి: (ఆవేదనగా..) అమాయకులు బలైపోతున్న దండకారణ్యం గురించి పార్లమెంట్లో చర్చ జరగాలి. అడవిలో మళ్ళీ శాంతి నెలకొనాలి. అక్కడ ఆయుధాలు పట్టినవాళ్ళతో బేషరతుగా చర్చలు జరపాలని హోమ్మంత్రికీ, ప్రధానమంత్రికీ నా విన్నపం. అందుకు, ప్రజాప్రతినిధులు, పెద్దలతో పాటు మేమూ వస్తాం. గద్దర్: మూర్తి ప్రతిపాదించినట్లు, శాంతి చర్చల కోసం అవసరమైతే నేను, మూర్తి దండకారణ్యంలోకి అడుగుపెడతాం. ఇవాళ ఎస్.టి. రిజర్వేషన్ కింద ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్లమెంట్లో ఈ విషయమై గొంతు విప్పాలి? తాము ఎవరివైపున్నామో స్పష్టం చేయాలి! అసలు మీ ఇద్దరి స్నేహం ఎక్కడ మొదలైంది? నారాయణమూర్తి: ప్రజల కోసం ఉద్యమాలు చేసే వాళ్లంటే చదువుకొనే రోజుల నుంచీ గౌరవం. కొండపల్లి సీతారామయ్య, చండ్ర రాజేశ్వరరావు, బాలగోపాల్, వరవరరావు, వంగపండు ప్రసాదరావు వంటి మహానుభావుల్ని చూడాలి. గద్దరన్న ప్రోగ్రాం చూడాలనుకునేవాణ్ణి. ఫస్ట్ ‘అర్ధరాత్రి స్వతంత్రం’(1986) సిన్మా తీశా. వంగపండు పాట పెట్టా. సిన్మా బిగ్ హిట్. మద్రాస్ వాణీమహల్లో ‘జననాట్య మండలి’ ప్రోగావ్ుకి వచ్చిన గద్దరన్నకు, సిన్మా చూపిస్తే, మెచ్చుకున్నారు. అలా మా స్నేహం మొదలైంది. నంది అవార్డొచ్చిన ‘నీ పాదం మీద...’ పాట కథేంటి? నారాయణమూర్తి: ‘ఒరేయ్ రిక్షా’ (95) నాతో తీస్తూ గురువు దాసరి గారు నాతో, ‘గద్దరన్నను అడగరా! ‘నా రక్తంతో నడుపుతాను రిక్షాను’ అనే పాట పెట్టుకుంటానని’ అన్నారు. అన్ననడిగితే, ‘నీ కోసం ఇస్తున్నా, తీసుకో’ అన్నారు. అలాగే ‘నీ పాదం మీద’ పాట రాసిచ్చారు. నా దృష్టిలో గద్దరన్న బెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ ది వరల్డ్. దేశం గర్వించదగ్గ మనిషి. ఒకరు సిన్మాలతో, మరొకరు పాటలతోకమ్యూనికేషన్..! గద్దర్: ‘ఒరేయ్ రిక్షా’ కన్నా ముందు బి. నరసింగరావు ‘రంగులకల’ (’84)లో ‘మదనా సుందరి’ లాంటి పాటలు రాశా, పాడా. ఇక్కడ మేము చేసేది ఒక జీవితాన్ని ఇంకో జీవితానికి కమ్యూనికేట్ చేయడం! మూర్తేమో తెర మీద కనిపించే ఆర్టిస్ట్ కమ్యూనికేటర్. నేనేమో స్టేజ్‌పైన ప్రత్యక్షంగా కనిపించే కమ్యూనికేటర్. మేము కమ్యూనికేట్ చేసే వస్తువుల్లో తేడా లేదు. తేడా రూపంలోనే! ‘పేదోనికింత బువ్వ దొరకాలి’, ‘ఎవడి కష్టం వాడికే దక్కాలే, లేకుంటే పోరాడాలి’ అని ఆయనా అంటాడు, నేనూ అంటా! ♦ ఇది నిజమైన దేశభక్తుడి కథ. ‘దండకారణ్యం’లో నేనెక్కడా లాల్ సలామ్ అనలేదు. ఇన్నేళ్ళ జీవితంలో తొలిసారిగా సిన్మాలో ‘భారత్‌మాతాకీ జై’ అని పాడా. ♦ నేను దేశమంతా తిరిగా. కోరాపుట్ - గంజాం సరిహద్దులో ఒంటి మీద తువ్వాలుతో గడుపుతున్న ప్రజల దైన్యం చూశా. కడుపులో బిడ్డని వందకి అమ్ముకొంటున్న తల్లుల దీనస్థితిని చూశా. ♦ సామాన్యుడి జీవితాన్ని మార్చడమెట్లా అన్నది ప్రధానం! అందుకే, ‘సున్రే బాబూ పేట్కీ సవాల్ హై... కుచ్ బాత్ కీ నై’ అంటా. అంటే, హైటెక్ సిటీ మీరే ఉంచుకోండి. మాకు బువ్వ, గుడిసె ఉండనివ్వండంటున్నాం. ♦ నేను పాటతో ఎంత ఇన్‌స్పిరేషనో మూర్తి ఆటతో అంతే ఇన్స్పిరేషన్! ఆయనలా నమ్మిన సిద్ధాంతాలతో పనిచేసేవారు దేశంలో తక్కువ. ఆ కమిట్మెంట్ మాకు పెద్ద నైతిక స్థైర్యం. సపోర్ట్ చేసేందుకు మాకూ ఒకడుఉన్నాడనిపిస్తుంది! ♦ ఎన్టీయార్, ఏయన్నార్, సావిత్రమ్మంటే ఆనందపడిపోతాం. వేరే కమ్యూనికేటర్లతో, యాక్టర్లతో మాకేం డిఫరెన్సెస్ లేవు! పరస్పరం గౌరవమే! ♦ రాబోయే కాలం మాదే! ప్రజాకవుల్ని ఒక తాటి మీదకు తెస్తాం. వారి మాట, పాట, ఆటతో ప్రజా వాగ్గేయకారుల యుగం వస్తుంది. పాటలతోనే సినిమాలు తీసే దర్శకులూ వస్తారు! మొదటిసారి మూర్తిని చూసినప్పుడు ఏమనిపించింది? గద్దర్: ‘నన్ను మించినోడు ఒకడు దొరికిండు’ అనుకున్నా. 62 ఏళ్ళ మూర్తికిప్పటికీ నో వైఫ్, నో ప్రాపర్టీ. లాభాపేక్ష లేకుండా 30ఏళ్లలో ఒక్కడే 29 సిన్మాలు తీశాడు. హి లివ్స్ ఫర్ ది పీపుల్. అతని ప్లెయిన్నెస్ నాకిష్టం! మూర్తి గారూ! ఈ 30 ఏళ్ల ప్రయాణం ఎలా సాగింది? నారాయణమూర్తి: 20 ఏళ్ళు నా సిన్మాలు బాగా ఆడాయి. తర్వాత ఇండస్ట్రీలో చాలామంది విప్లవం నేపథ్య సిన్మాలు తీశారు. ఎక్కువగా అవే చిత్రాలు వచ్చేటప్పటికి ప్రజలకు మొహం మొత్తేసింది. ఎవరూ తీయకపోయినా, నేను అవే పట్టుకుని సముద్రం ఈదుతున్నా. సిన్మాలా డినా, నన్ను ‘పీపుల్స్‌స్టార్’ అన్నా అది ఉద్యమం, ఈ ప్రజాకవులు, వాళ్ల బాణీలు, పాటల గొప్పదనం! సిన్మాలకు తగ్గట్లు రాయడం స్వేచ్ఛాకవులకు ఇబ్బందే? గద్దర్: నిజమే. కానీ, చాలాసార్లు అప్పటికే పాపులరైన ప్రజాగీతాలనే సినిమాలో వాడుతుంటారు. ప్రత్యేక సన్నివేశం చెబితే పాట ఆశువుగా కట్టేస్తా. ‘దండకారణ్యం’లోని ‘పొద్దుతిరుగుడు పువ్వా’ పాట బయట పాపులర్. అలా సిన్మాలోకొచ్చింది. చివరి చరణం కోటన్న గురించి ‘వీరయోధుని ముద్దాడే’ అని కొత్తగా రాసి, పాడా! దేశంలోని దోపిడీని ఆపమన్నవాడి కన్నా దేశభక్తుడు ఎవడు? ఉద్యమాన్ని పాటల కన్నా సినిమాతో ఎఫెక్టివ్‌గా చెప్పగలమా? లేక మీ పాటతో సినిమా పదునెక్కుతుందా? గద్దర్: పాట అనేది ఒక తక్షణ రూపం. కానీ, సిన్మా- ఫొటోగ్రఫీ సహా చాలా కలసి సమగ్ర రూపం. డెరైక్టర్ క్రియేటివిటీ. ఎన్నో చోట్ల పాడినా ‘పొడుస్తున్న పొద్దు మీద’, ‘బండెనక బండి కట్టి’ లాంటివి సిన్మా వల్ల ప్రజల్లోకి వేగంగా వెళ్లిపోతాయి. దటీజ్ ద పవర్ ఆఫ్ సినిమా. మీ పాపులార్టీని కూడా ఈ సిన్మాకు వాడుతున్నారా? గద్దర్: నేను తమ సినిమాల్లో నటిస్తే, కనిపిస్తే బాగుంటుందని అమితాబ్, రజనీకాంత్, చిరంజీవి దాకా ఎంతోమంది అనుకున్నారు. అడిగారు. కానీ, ‘గద్దర్ పాపులారిటీని నేను వాడుకున్నట్లు ఎందుకు?’ అని మూర్తి తన సినిమాల్లో చేయమంటూ ఎప్పుడూ అడగలేదు. ఈ సిన్మాలో నటించాలని నేనే అనుకున్నా. ‘కిషన్‌జీ లైఫ్‌పై సిన్మాలో 5 నిమిషాల పాత్ర ఇవ్వు చాలు’ అని అడిగా. చేశా. పాటల రికార్డింగ్‌లో ఎదురైన అనుభవాలేమైనా? గద్దర్: సిన్మాకోసం అప్పటికప్పుడు సీన్ చెప్పి రాయించిన క్రెడిట్ మూర్తిదే. సన్నివేశం చెప్పి వెళ్లిపోతాడు. నేను నాకిష్టం వచ్చినట్లు రాస్తా. రికార్డు చేసేవాడు, మ్యూజిక్ కొట్టేవాడు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు చేస్తారు. ఇది చాలా మందికి తెలీదు(నవ్వు). ‘దండకారణ్యం’లో ఒకటే డైలాగ్ నాది. ‘మహా దేశభక్తుడు కోటన్నకు జోహార్’ అనాలి. అది ఎన్నిసార్లు చెప్పినా కలుస్తలేదు. అప్పుడు మూర్తి ‘నీ ఇష్టం వచ్చినట్టు అను అన్నా, నా ఇష్టం వచ్చినట్టు కలుపుకుంటా’ అన్నాడు (నవ్వులు). పాటల రికార్డింగ్ గమ్మత్తుగా చేశాడు మూర్తి! మ్యూజిక్ డెరైక్టర్ లేడు.. లిరిక్ రాసింది లేదు.. స్టూడియో లేదు. డబ్బింగోడు ఆడ కూకున్నాడు. ‘అన్నా అడవి మీద పాడేయ్’ అన్నాడు. అప్పుడు ‘అడవి తల్లీ నీకు వందనం’ అని పాడి వచ్చేశా. ఈయన ఏం కలిపిండో ఏమో... తీరా పాట క్యాసెట్లో వింటే, నేనెప్పుడు రాస్తిరా ఇవన్నీ అనుకున్నా. పాటలు రాయడం, మాకు ప్రొఫెషన్ కాదు. అది మాకు జీవితం. నేనే కాదు ఈ సిన్మాలో తమ్ముడు గోరటి వెంకన్న ‘గిచ్చన్న గిరి మల్లెలో’ అనే వండర్ఫుల్ పొలిటికల్ సాంగ్ రాశాడు. ఉద్యమానిదే విజయమని నా కన్నా గొప్పగా రాశాడు. కానీ, ‘దండకారణ్యం’ అంటే ఇబ్బందులుంటాయిగా! గద్దర్: చాలానే. మిలటరీ వాళ్ళు మూర్తిని పట్టుకొని... నారాయణమూర్తి: (అందుకొని...) ఖమ్మంలో గద్దరన్న పాట అయిపోయింది. బయల్దెల్లా గనుల వద్దకెళ్లి కొన్ని షాట్స్ తీయాలని నేను, కెమేరామన్ బయల్దేరాం. ఛత్తీస్‌గఢ్‌లో కుంట నుంచి సుకుమ 85 కి.మీ. ప్రతి 4 కి.మీకొక మిలటరీ క్యాంప్. కీకారణ్యం. రోడ్డు మీద నుంచే మిలటరీ క్యాంప్ షూట్ తీసుకుంటూ వెళ్లిపోతున్నాం. వెనక ఏదో విజిల్ వచ్చింది. మరో 4 కిలోమీటర్లు వెళ్లగానే మిలటరీ సిబ్బంది రోడ్డుపై ఉండి కారు ఆపారు. నేను నా క్యారెక్టర్ నక్సల్ డ్రెస్ వేసుకుని ఉన్నా. వాళ్లు నేను నక్సలైట్ అనుకున్నారు. ‘నన్ను ఏమైనా చేయండి. కెమేరామన్, డ్రైవర్ని వదిలేయండి’ అన్నా. ఫైనల్‌గా వాళ్ల హెడ్డాఫీ సర్కి ఫోన్ చేశారు. ఆ మిలటరీ హెడ్ ఫోన్లో ‘ఏవండీ నారాయణమూర్తిగారూ.. మీరింకా విప్లవ సిన్మాలు చేస్తున్నారా. నేను మీ ఫ్యాన్‌ని’ అన్నారు. ఆ తెలుగాయన వల్ల బయటపడ్డాం. లేదంటే ఏమైపోయేవాళ్ళమో. (నవ్వు). గద్దర్‌జీ! జీవితాన్నే అర్పించిన మూర్తిని స్థిరపడమనరా? గద్దర్: వాళ్ల అవ్వ, అయ్య చెబితేనే వినలా! నేను చెబితే వింటాడా? (నవ్వులు) మూర్తికి ఇప్పటికీ సొంత ఇల్లు లేదు. ఆస్తీ లేదు. అంతెందుకు! హైదరాబాద్‌లో సినీకార్మికులకు ఇళ్లిచ్చిన ‘చిత్రపురి’లో అతనికిల్లు లేదు. నా చేత బలవంతాన పైసలు కట్టించి, నాకొచ్చేలా చూశాడు. మీరిద్దరూ కలిస్తే ఏవేం చర్చ చేస్తారు? గద్దర్: సమాజాన్నెట్లా మార్చాలనే! మా లాంటి వాళ్లు లక్ష మంది తయారైతే హ్యాపీ. కానీ 70 ఏళ్లకొచ్చా. ఇన్నేళ్లు జనంతో గడపడం జోక్ కాదు. ♦ దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న వారే నిజమైన దేశభక్తులు. దే శాన్ని ఎవరు దోచుకుంటున్నారో వాడే దేశద్రోహి. ♦ విప్లవం నా సొత్తేమీ కాదండి... అది ప్రజల సొత్తు! ఎవరైనా సినిమాలు తీసుకోవచ్చు. ఇప్పుడు లవ్ సినిమాలు ఎలాగో, అప్పుడు విప్లవం చిత్రాలు అలాగన్నమాట. ఇలాంటి సినిమాలకు నాతో స్టార్ట్ కాలేదు... నాతో ఫినిష్ కావు. ♦ ఈ ‘దండకారణ్యం’ సిన్మాలో క్లైమాక్స్‌లో 8 నిమిషాల ఎమోషనల్ పాట వస్తుంది. నా మీదొచ్చే ఆ పాటను కొద్దిగా శ్రుతి పెంచి పాడమన్నా. అంతే! 70 ఏళ్లకు దగ్గరవుతున్న గద్దరన్న నా కోసం శ్రుతి పెంచి, ఏక్దమ్ పాటంతా, కోరస్‌తో సహా పాడేశాడు. ఒకప్పుడు ఎవరి పాట విని ఆరాధించానో, ఇప్పుడు ఆయన పాడిన పాటకి నేను నటించడం పెద్ద థ్రిల్. ♦ ఏ సిన్మాకైనా కథ, కథనం, దర్శకత్వం ముఖ్యం. అవి బాగుంటేనే ఆడుతుంది. మ్యూజిక్ కూడా బాగుంటే, ఎక్కడికో వెళుతుంది! సిన్మా- దృశ్యం, పాట- శ్రవణం. రెండూ కలిస్తే - దృశ్యశ్రవణ కావ్యం. ♦ నాకూ, గద్దరన్నకూ పోలికే లేదు. ఆయన ఉద్యమంలో నడిచి, దానికోసమే బతికిన మనిషి. నేను ఉద్యమంపై అభిమానంతో, సిన్మాలు తీస్తున్న చిన్న కళాకారుణ్ణి. మరి మీ జీవితంపై మూర్తి సిన్మా తీస్తానంటే...? నారాయణమూర్తి: (అందుకొంటూ) నేనేమో ‘అన్నా! నువ్వు రైటర్‌వి, సింగర్వి, యాక్టర్‌వి. నువ్వే రాయి, డెరైక్ట్ చేయి. బాగుంటుంది’ అని చాలా కాలంగా చెబుతున్నా. గద్దర్: ‘ఊండెడ్ సోల్జర్’గా మూర్తితో చర్చించి, మిగతా జీవితమంతా సామాజిక ఉద్యమాల కోసం పనిచేసేవాళ్ళతో, ఇలాంటి ప్రత్యేక తరహా సిన్మాలు తీసేవారితో కలసి నడుస్తా. వాళ్ళ పనులకు తోడుగా ఉంటా. గద్దర్‌జీ... మీరు సినిమాలు చూస్తుంటారా? గద్దర్: (నవ్వేస్తూ...) తక్కువే! అప్పట్లో ‘టెన్ కమాండ్మెంట్స్’, ‘ఉమర్ ముఖ్తార్’ లాంటి సినిమాలు బాగా చూసేవాణ్ణి. అలాగే, నేనో ప్రేమ పిచ్చోణ్ణి. ‘దేవదాసు’, ‘అనార్కలీ’ లాంటి లవ్‌స్టోరీస్ తెగ చూసేవాణ్ణి. ఈ మధ్య ఎక్కువ చూసింది మన మూర్తి సినిమాలే! అతను మొట్టమొదట తీసిన ‘అర్ధరాత్రి స్వతంత్రం’ నాకు చాలా ఇష్టం. నారాయణమూర్తి: అన్నకు... ‘కుడి ఎడమైతే...’ లాంటి తాత్త్విక విషాద గీతాలంటే చాలా ఇష్టం బ్రదర్! అలాగా... గద్దర్‌జీ! మీరెలాంటి పాటలు వింటుంటారు? గద్దర్: శోక, వీర రసాలు కలసిన పాటలంటే నాకు ఇష్టం. గమనిస్తే, నా పాటలన్నీ అంతే! క్లాసికల్ సాంగ్స్ వింటా, సూఫీ సాంగ్సూ వింటాను. ఇక, భక్తిపాటలు, అన్నమయ్య పదాలు, తుకారామ్ గీతాలు, వేమన, సుమతీ శతకాలకు చెవి కోసుకుంటా. ఇక జానపద గీతాలంటారా... నా జీవితమే అవి! చాలామంది ‘నీ గొంతే నీ ప్లస్ పాయింట్’ అని చెబుతూ ఉంటారు. అది ఆమె నుంచే నాకొచ్చింది. మా అమ్మ లచ్చుమమ్మ లేకపోతే, నేను లేను. నా మొదటి పాట ‘సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ’ అమ్మ మీద రాసిందే! అమ్మకిది చేయలేదన్న లోటు మీకు ఏదైనా? నారాయణమూర్తి: ఏ తల్లైనా, బిడ్డ క్షేమమే తప్ప ఏమీకోరదు. అమ్మ రెడ్డి చిట్టెమ్మా అంతే! గద్దర్: ‘వానికి వాడేం చేసుకోలేద’నే అమ్మ బాధపడుతుండేది! వ్యవసాయ కూలీ అయినా, మా అమ్మకి సామాజిక చైతన్యం చాలా ఎక్కువ. ఒక్క మాటలో, నా తాత్త్విక గురువు కూడా మా అమ్మే! గద్దర్‌జీ! మీ ప్రస్థానంపై ఆత్మకథ ఏమైనా రాస్తారా? గద్దర్: ఆత్మకథ కాదు కానీ, ‘నిఫ్ట్’లో పనిచేస్తున్న మా అబ్బాయి సూర్యం నా మీద ఇంగ్లీషులో డాక్యుమెంటరీ తీస్తానంటున్నాడు. నిశ్శబ్దంగా సేకరణ పనిలో ఉన్నాడు. మూర్తిపై మీకున్నది ప్రేమా, అభిమానమా, గౌరవమా? గద్దర్: అతనిపై ప్రేమ కాదు. అతని కమిట్మెంట్ మీద అభిమానం, గౌరవం. తనేది అడిగినా, చేయమన్నా చేస్తా. మూర్తిగారూ! మీకు గద్దర్ అన్నా, మిత్రుడా, గురువా? నారాయణమూర్తి: వాటి కన్నా ఎక్కువ! మహాకవి, ప్రజల్ని చైతన్యపరిచిన కళాకారుడు. ఆయనకు శాల్యూట్! శాల్యూటా? రెడ్ శాల్యూటా? గద్దర్: (అందుకొని..) మనోడు రెడ్ శాల్యూట్ అంటే- కొన్ని పేపర్లే వేస్తాయి (నవ్వులు)! నేనూ మూర్తి గురించి ఒక్కమాట చెప్పాలి... ప్రజాచైతన్యం కోసం సాగిన జననాట్యమండలి గజ్జెల మోతకు కొనసాగింపే మా మూర్తి సిన్మాలు. ఇవాళ తెలంగాణలో మేమిద్దరం కలసి ఎక్కడికైనా పోతే, నా కన్నా అతణ్ణే ఎక్కువ ఆదరిస్తారు. వాళ్ళకు ఆయనే గద్దరన్న (నవ్వులు)! - డాక్టర్ రెంటాల జయదేవ. -
బోనాల పోతరాజుగా...
ఆర్.నారాయణమూర్తి ఇప్పటి వరకూ తన సొంత నిర్మాణ సంస్థలోనే ఎక్కువగా సినిమాలు చేశారు. చాలా ఏళ్ల విరామం తర్వాత వేరే సంస్థలో హీరోగా ‘బోనాల పోతరాజు’ అనే సినిమా చేస్తున్నారు. దానికి కథ ఆయనదే. సానా యాదిరెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రం ఉగాది రోజున హైదరాబాద్‌లో మొదలైంది. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ -‘‘ఎన్టీఆర్, శివాజీ గణేశన్లు చేయదగ్గ గొప్ప పాత్రను నాకు ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు. ఇది తప్పకుండా మంచి సినిమా అవుతుంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘జానపద కథలు చెబుతూనే ప్రజా సినిమాగా తీర్చిదిద్దుతాం. అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధాన్ని, ఆత్మీయతను ప్రతిబింబించే విధంగా రూపొందించే ఈ చిత్రంలో ఆర్.నారాయణమూర్తి టైటిల్ రోల్ పోషించడం మా అదృష్టం. ఏప్రిల్ 15న షూటింగ్ ప్రారంభించి, జూలై నెలలో జరిగే అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. -
యుద్ధం చేసిన ప్రతిసారీ గెలుపు వైవీయస్‌దే : వీవీ వినాయక్
‘‘చిరంజీవిగారు పరిశ్రమకు వచ్చి 30 ఏళ్లయినా ఆయన హవా ఇప్పటికీ తగ్గలేదు. ఆయన ఆశీస్సులతోనే పవన్ కల్యాణ్ ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నారు. రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఇప్పటికే తమ ప్రతిభ నిరూపించుకున్నారు. వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా చిరంజీవిగారిదే’’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘రేయ్’. సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ కథానాయికలు. బొమ్మరిల్లు వారి పతాకంపై యలమంచిలి గీత సమర్పణలో వైవీయస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘పవనిజం’ పాటను ఆర్. నారాయణమూర్తి విడుదల చేశారు. వైవీయస్ మాట్లాడుతూ -‘‘ ‘తొలిప్రేమ’ సినిమా తర్వాత పవన్‌కల్యాణ్‌తో సినిమా చేద్దామనుకున్నా కుదర్లేదు. సాయిధరమ్ కోసం ఆయనకు కథ చెబితే, నచ్చి ఒప్పుకున్నారు. రిస్క్ ఉంది చేస్తావా..? అని అడిగారు. తప్పకుండా చేస్తానన్నా. ఆయనకిచ్చిన మాట కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమించి ఈ సినిమా చేశా. 100 శాతం సంతృప్తినిచ్చింది. ఈ సినిమాకు చక్రి మంచి సంగీతం అందించారు’’ అని చెప్పారు. ‘‘ ‘పవనిజం’ అనే పదం జనం నుంచి పుట్టింది. మేం చాలా ఎగ్జైట్ అయి, ఈ పాటను చేశాం’’ అని హీరో అన్నారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ -‘‘యుద్ధం చేసిన ప్రతిసారీ వైవీయస్ గెలుస్తాడు. ఈసారి కూడా గెలుపు ఖాయం’’ అని చెప్పారు. చంద్రబోస్, సయామీఖేర్, చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. -
మానవతా సౌధానికి కూలీలెవ్వరు?
ఆర్.నారాయణమూర్తి ప్రముఖ నటుడు-నిర్మాత-దర్శకుడు హాలీవుడ్ ‘ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్’ (1957) అందుకే... అంత బాగుంది! తారాగణం: విలియం హోల్డెన్, ఎలెక్ గినెస్, జాక్ హాకిన్స్, సెస్యూ హయకవా; దర్శకుడు: డేవిడ్ లీన్; నిర్మాత: శామ్ స్పీగల్; స్క్రీన్‌ప్లే: కార్ల్ ఫోర్‌మ్యాన్, మైఖేల్ విల్సన్; సంగీతం: మాల్కమ్ ఆర్నాల్డ్; కెమెరా: జాక్ హిల్యార్డ్; విడుదల: 1957 అక్టోబర్ 31 (తొలి ప్రివ్యూ), 1957 డిసెంబరు 18 (రిలీజ్); సినిమా నిడివి: 161 నిమిషాలు; నిర్మాణ వ్యయం: 28.4 లక్షల డాలర్లు (దాదాపు రూ. 17 కోట్లు); వసూళ్లు: 3.06 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 183 కోట్లు) చిన్నప్పటి నుంచీ నాకు సినిమా అంటే పిచ్చి కాదు... అంతకన్నా ఎక్కువే! ‘మాయాబజార్’, ‘లవకుశ’, ‘మూగ మనసులు’... ఇలా అదీ ఇదీ అని లేదు. సినిమా అంటే చాలు... చూసి తీరాల్సిందే! అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఒక హాలీవుడ్ సినిమా చూశా. దాని పేరు ‘టెన్ కమాండ్మెంట్స్’. పెద్దగా భాష అర్థం కాకపోయినా, ఆ సినిమా చూసి అలాగే ఉండిపోయా. ఏం సినిమా అండీ అది! ఒక్కసారి చూసినా వందసార్లు చూసినంత గుర్తుండిపోయింది. కొన్ని డైలాగులైతే, అదే యాసలో టకటకా చెప్పేయగలను. ‘‘ది ఉమన్ హీ లవ్స్ షల్ బేర్ బై చైల్డ్... ది సిటీ హీ బిల్డ్స్ విల్ బి ఆన్ మై నేమ్’’ అనే డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత ‘బెన్హర్’, ‘ది గ్రేట్ ఎస్కేప్’, ‘స్పార్టకస్’ లాంటి సినిమాలు చాలా చూశా. ఇవన్నీ ప్రపంచ సినీగమనాన్ని మార్చేసిన సినిమాలు. సినిమాల్లో వేషాల కోసం మద్రాసుకు వెళ్లాక, ఏ మాత్రం ఖాళీ దొరికినా అక్కడ మౌంట్‌రోడ్డులోని దేవి థియేటర్లో హాలీవుడ్ సినిమాలు తెగ చూసేవాణ్ణి. అన్ని సినిమాలూ నేల టిక్కెట్ కొని, తెర ముందు వరుసల్లో కూర్చొని చూసినవే! అంత గొప్ప సినిమాలను చాలా దగ్గర నుంచి చూడడం భలే వింతైన అనుభవం. ఇక, నన్ను బాగా కదిలించిన హాలీవుడ్ సినిమా - ‘ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్’ (1957). ఈ సినిమాను లెక్కలేనన్ని సార్లు చూశాను. సినిమా చివరలో వచ్చే ఎండ్ టైటిల్స్ వరకూ కదలకుండా చూసి, చివర్లో లేచి నిలబడి చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోతుంటాను. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. మానవ జాతిలో కొందరు నిర్మాణం దిశగా అడుగులు వేస్తుంటారు. అదే సమయంలో మనలోనే రకరకాలుగా గూడు కట్టుకున్న ఈర్ష్యా అసూయా ద్వేషాలకు స్వార్థం, ఆధిపత్య ధోరణులతో మరికొందరు విధ్వంసానికి పాల్పడుతుంటారు. ఈ విచిత్రమైన పరిస్థితికి ఈ సినిమా నిలువుటద్దం. సామ్రాజ్యవాదం, ఇతరుల కన్నా అధికులమనే అహంకారం విషపురుగులా మనిషి మస్తిష్కంలోకి దూరి, తోటి మానవుల మనుగడను ఎలా శాసిస్తుందో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే!మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రపంచం రెండుగా చీలిపోయింది. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధమైతే మరీ విధ్వంసకరం. జర్మనీ, జపాన్, ఇటలీ దేశాలు ఒక జట్టు. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, రష్యా, మిగిలిన దేశాలన్నీ ఎలైడ్ ఫోర్సెస్ (మిత్రరాజ్య సేనలు)గా ఏర్పడి మరోవైపు నిలిచి, యుద్ధభేరి మోగించాయి. ఆ పరిస్థితులనూ, సరిగ్గా అప్పుడే 1942- 43 ప్రాంతంలోని బర్మా రైల్వే నిర్మాణాన్నీ నేపథ్యంగా తీసుకొని, యథార్థ సంఘటనల చుట్టూ అల్లుకొన్న కాల్పనిక సన్నివేశాలతో ఫ్రెంచ్ భాషలో ఒక నవల వెలువడింది. బర్మాలోని క్వాయ్ నది మీద బ్రిడ్జ్ నిర్మాణం నేపథ్యంలో వచ్చిన ఆ నవల పేరు - ‘బ్రిడ్జ్ ఓవర్ ద రివర్ క్వాయ్’. రచయిత - పియర్రీ బౌలే. ఆ నవల ఆధారంగానే ఈ సినిమా తీశారు దర్శకుడు డేవిడ్ లీన్. అలాగే, బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఫిలిప్ టూసీ జ్ఞాపకాలు కూడా డేవిడ్ లీన్‌కు ఉపకరించాయి. కొలంబియా సంస్థ ఈ సినిమాను డెరైక్ట్ చేయమని తొలుత హోవార్డ్ హాక్స్‌ను అడిగింది. ఆయనకేమో ఈ కథ నచ్చలేదు. ఒక్క స్త్రీ పాత్ర కూడా లేని ఈ సినిమా ఆడే అవకాశం లేదని ఆయన తేల్చేశారు. దాంతో డేవిడ్ లీన్‌కు డెరైక్షన్ చాన్సు ఇచ్చారు. ఆయన తీసిన ఈ సినిమా ఇవాళ్టికీ చరిత్రలో చెరగని స్థానంలో నిలిచిపోయింది. ఈ సినిమా కథ ఏమిటంటే... రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యం, కొంతమంది బ్రిటిష్ సైనికుల్ని, అధికారుల్ని యుద్ధ ఖైదీలుగా బందీలను చేస్తుంది. వీళ్లను థాయ్‌లాండ్-బర్మా దేశాల సరిహద్దుల్లోని ఓ దట్టమైన అడవికి తీసుకెళ్తారు. ఆ సమయంలో సైనిక రవాణా అవసరాల నిమిత్తం క్వాయ్ నది మీద బ్యాంకాక్ నుంచి రంగూన్‌కు రైలు వంతెన నిర్మాణానికి జపాన్ పూనుకుంటుంది. కానీ, నిర్మాణస్థలంలో లోపం ఉండడం వల్ల, ఆ వంతెన కట్టడంలో విఫలమవుతుంటారు. కట్టిన ప్రతీసారి అది కూలిపోవడంతో తమ దగ్గర బందీలుగా ఉన్న ఎలైడ్ ఫోర్సెస్ సైనికులతో ఆ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేద్దామని నిర్ణయించుకుంటారు. అయితే, ‘జెనీవా ఒప్పందం’ ప్రకారం పట్టుబడ్డ యుద్ధఖైదీలను వారి హోదాకు తగ్గట్టుగా గౌరవించాలి. కానీ ఆ నిబంధనలను తుంగలో తొక్కుతూ జపాన్ సైనిక అధికారి కెప్టెన్ సయీ సైనిక ఖైదీలందరినీ ఈ బ్రిడ్జ్ కట్టాలని ఆదేశిస్తాడు. ‘‘మీరు మా బందీలే కాదు, కూలీలు కూడా! మేం చెప్పింది చేయా లి’’ అంటూ హుకుం జారీ చేస్తాడు. కానీ బ్రిటిష్ అధికారి కల్నల్ నికోల్సన్ (నటుడు ఎలక్ గినెస్) దీన్ని వ్యతిరేకిస్తాడు. ‘‘మేము మీ బానిసలం కాదు’’ అని ధిక్కారస్వరం వినిపిస్తాడు. చివరకు కెప్టెన్ సయీ దిగి వస్తాడు. బ్రిడ్జ్ నిర్మాణ పర్యవేక్షణకు నికోల్సన్ అంగీకరిస్తాడు.కానీ ఓ షరతు విధిస్తాడు. ఆ రైల్వే బ్రిడ్జ్‌కి ‘దిస్ వజ్ బిల్ట్ బై ఎలైడ్ ఫోర్సెస్’ అని శాశ్వతంగా రాసి పెట్టాలంటాడు. అయితే, వైరి పక్షంలోని జపాన్ కోసం మనం రైలు వంతెన కట్టడం ఏమిటంటూ, ఈ ప్రతిపాదన ఎలైడ్ ఫోర్సెస్‌లోని అమెరికా, ఫ్రాన్స్ లాంటి మిగతా దేశాలవారికి ఎవరికీ నచ్చదు. ఈ పరిస్థితుల్లో అమెరికాకు చెందిన ఖైదీలు కొంతమంది తప్పించుకుని పారిపోతారు. వారిలో అమెరికన్ సైనిక అధికారి షియర్స్ (నటుడు విలియమ్ హోల్డెన్) ఒక్కడే తీవ్రంగా గాయపడినా, ప్రాణాలతో మిగులుతాడు. సిలోన్లో ఆశ్రయం పొందుతున్న షియర్స్ను ఇంకో బ్రిటిష్ అధికారి మేజర్ వార్డెన్ (నటుడు జాక్ హాకిన్స్) కలిసి, నిర్మాణం పూర్తయ్యే లోగా సదరు రైలు వంతెనను ధ్వంసం చేయడానికి సహకరించాలని కోరతాడు. అప్పుడు షియర్స్ తాను అసలు అధికారిని కాదనీ, బ్రిటీషు అధికారిని అంతకన్నా కాదనీ, అమెరికాకు చెందిన మామూలు సైనికుణ్ణి అనీ అసలు నిజం చెబుతాడు. ఇలా వే రే అధికారి పేరుతో సౌకర్యాలు అనుభవిస్తున్నవారు శిక్షకు గురవుతారంటూ మేజర్ వార్డెన్ బెదిరిస్తాడు. దీంతో ఇక తప్పనిసరి పరిస్థితిలో ఆ కుట్రలో షియర్స్ కూడా భాగస్వామి అవుతాడు. షియర్స్, మేజర్ వార్డెన్, కెనడియన్ మిలటరీ అధికారి జాయిస్ - వీళ్ల ముగ్గురూ ఆ కొత్త రైలు వంతెనను ఎలాగైనా కూల్చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మే 12 నాటికి రైలు వంతెన నిర్మాణం పూర్తవుతుంది. 13న ప్రముఖుల రైలు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లూ చేస్తారు. ఇంతలో బ్రిడ్జి మీద పర్యవేక్షణ చేస్తున్న నికోల్సన్కు, నీళ్లల్లో పేలడానికి సిద్ధంగా డెటొనేటర్లు కనిపిస్తాయి. దాంతో నికోల్సన్, షియర్స్ బృందంతో తలపడతాడు. చివరకు డెటొనేటర్లు పేలడంతో నికోల్సన్‌తో పాటు అతని నేతృత్వంలో నిర్మించిన వంతెన, ఆ వంతెనపై వెళుతున్న రైలు... భస్మీపటలమవుతాయి. ఆ వంతెనకు వాడిన చెక్క ముక్కలు నది నీళ్లల్లో తేలియాడుతుంటాయి. దాంతో సినిమా పూర్తవుతుంది. ఈ సినిమాలో కథంతా థాయ్‌లాండ్-బర్మా దేశాల సరిహద్దుల్లోని అడవుల్లో జరిగినా, షూటింగ్ మాత్రం శ్రీలంక (అప్పటి సిలోన్)లో చేశారు. చిత్ర నిర్మాణానికి దాదాపు 17 కోట్ల రూపాయలు ఖర్చయితే, బ్రిడ్జ్ నిర్మాణానికే కోటిన్నర ఖర్చు పెట్టారు. కై్లమాక్స్లో బ్రిడ్జ్ మీద ఓ రైలును పేల్చి వేస్తారు కదా. దాన్ని మన దేశంలోని ఓ మహారాజు దగ్గర కొన్నారట. యుద్ధం చేసే గాయాలు, అకృత్యాలు, యుద్ధ ఖైదీల అగచాట్లు, యుద్ధం కారణంగా బయటికొచ్చే వికృత ధోరణుల్ని చాలా అద్భుతంగా డేవిడ్ లీన్ ఒడిసిపట్టాడు. ఎక్కడా మనకు సినిమా చూస్తున్నట్టే అనిపించదు. ఆ రెండో ప్రపంచ యుద్ధం రోజుల్లోకి మనల్ని తీసుకుపోయి, అక్కడే కెమెరా పాతేసి, మనకన్నీ ‘ప్రత్యక్ష ప్రసారం లాగా’ చూపించినట్టే అనిపిస్తుంది. ప్రధాన పాత్ర పోషించిన ఎలక్ గినెస్ నటన అసాధారణం. కల్నల్ నికోల్సన్గానే మనకు అతను గుర్తుండిపోతాడు.ఈ సినిమా అప్పట్లో 9 విభాగాల్లో ఆస్కార్‌కి నామినేట్ అయ్యి, ఉత్తమ చిత్రంతో సహా ఏకంగా 7 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టింది. ఎలక్ గినెస్ ఈ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు, బాఫ్తా, గోల్డన్ అవార్డులు కూడా గెలుచుకున్నారు. పైపైన చూస్తే - ఒక నది మీద బ్రిడ్జ్ కట్టడమే కథలా అనిపిస్తుంది కానీ ఈ సినిమా అసలు ఆత్మ వేరు. ఈ బ్రిడ్జ్ నిర్మాణమంతా ఒకెత్తు అయితే, దీన్ని విధ్వంసం చేయాలనుకోవడం మరొక కోణం. ఈ రెండు వైరుధ్యాల వెనుకా కొన్ని దేశాల, కొన్ని జాతుల సంఘర్షణపూరిత వాతావరణం ఉంది. దేవుడు మానవ జీవితాన్నిచ్చింది ప్రేమించడానికి..! ప్రేమించబడడానికి!! ఈ ప్రకృతిని ఆలంబనగా, ఆసరాగా చేసుకుని మనిషి తన మనుగడ కోసం చేసుకొనే నిర్మాణాన్ని, చివరకు తన మనుగడనే దెబ్బ తీసుకునే విధంగా డిస్ట్రక్షన్ చేసుకోకూడదు.యుద్ధాలు వస్తాయి... పోతాయి. మిగిలిపోయేది నిర్మాణమే! బీ కన్స్ట్రక్టివ్... బీ పాజిటివ్... డోన్ట్ బీ డిస్ట్రక్టివ్... డోన్ట్ బీ నెగిటివ్. ఈ సకల చరాచర సృష్టిలో మానవుడే అత్యుత్తమమనే గొప్ప సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చారు.అందుకే, ప్రపంచ చరిత్రలోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా ‘ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్’ గుర్తింపు పొందింది. సాంస్కృతికంగా, చారిత్రకంగా, కళాత్మకంగా విశిష్టమైన సినిమాగా దీన్ని గుర్తించి, ‘లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీ’లో ఒక కాపీని భద్రపరచడానికి ఈ సినిమాను ఎంపిక చేశారు. విడుదలైన నలభై ఏళ్ళ తరువాత, 1997లో సైతం ఈ ప్రత్యేక గుర్తింపు పొందడం ఈ సినిమా గొప్పదనానికి ఒక మచ్చుతునక. మన మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి ఈ సినిమా అంటే ఇష్టం. సామ్రాజ్యవాదం ఎంత ప్రమాదకరమో తెలియాలంటే, ఈ సినిమాను ఈ తరం వాళ్లు కచ్చితంగా చూడాల్సిందే. దృశ్యకావ్యశిల్పి డేవిడ్ లీన్ నలభై ఏళ్ళ కెరీర్... పదహారే సినిమాలు... చరిత్రలో నిలిచిపోయే చిత్రాలను రూపొందించిన దర్శకుడిగా పేరు... అతి కొద్దిమందికే సాధ్యమయ్యే ఈ గౌరవాన్ని సంపాదించుకున్న అత్యంత పాపులర్ బ్రిటీష్ సినీ రూపకర్త - సర్ డేవిడ్ లీన్ (1908-1991). సాహిత్యం ఆధారంగా ఆయన సృజించిన వెండితెర కావ్యాలన్నీ అద్భుతమైన ఛాయాగ్రహణం, అత్యద్భుతమైన లొకేషన్లతో ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసినవే. అంతేకాక, తన సమకాలీన చారిత్రక, సామాజిక మార్పుల ప్రభావానికి ప్రతిబింబాలుగా సినిమాలను తీర్చిదిద్దిన సినీ మేధావి ఆయన. ఇవాళ్టి తరానికి స్టీవెన్ స్పీల్బెర్గ్ అభిమాన దర్శకుడు. కానీ, స్పీల్బర్గ్ అభిమానించింది మాత్రం డేవిడ్ లీన్ని! ఈ దృశ్యకావ్యశిల్పి 1920ల ద్వితీయార్ధంలో క్లాపర్ బాయ్‌గా మొదలై ఎడిటరై, పాతిక సినిమాలకు ఎడిటింగ్ చేసి, ఆ పైన దర్శకుడిగా విఖ్యాత కృషి సాగించారు. ప్రసిద్ధ నవలలు, నాటకాలను వెండితెర కెక్కించి, సాహిత్యానికీ, సినిమాకూ మధ్య వంతెన కట్టారు. ‘గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్’ (1946), ‘లారెన్స్ ఆఫ్ అరేబియా’ (’62), ‘డాక్టర్ ఝివాగో’ (’65), ‘ఎ ప్యాసేజ్ టు ఇండియా’ (’84) లాంటివన్నీ ఆయన సినీకృషికి ఉదాహరణలు. -
నాలుగు పాత్రల్లో కనిపించబోతున్న మూర్తి
-
విశ్వరూపం
-
నాలుగు పాత్రల్లో నారాయణమూర్తి
విప్లవ చిత్రాలకు కేరాఫ్ చిరునామా ఆర్. నారాయణమూర్తి తన తాజా చిత్రం ‘రాజ్యాధికారం’ కోసం ఒక ప్రయోగం చేశారు. రైతు రామయ్యగా, అతని ముగ్గురు కుమారులుగా 4 పాత్రలు పోషించారు. ‘‘వేషాల పిచ్చితో నేను మద్రాసు వెళ్ళా. ‘ఇద్దరు మిత్రులు’లో అక్కి నేని ద్విపాత్రాభియనం మొదలు, తమిళ ‘నవరాత్రి’లో శివాజీ గణేశన్ 9 పాత్రలు, ‘దానవీర శూర కర్ణ’లో ఎన్టీఆర్ 3 పాత్రలు, కమలహాసన్ ‘దశావతారం’ లో 10 పాత్రలు - ఇలా మహానుభావులెందరో అనన్య సామాన్యంగా బహు పాత్ర పోషణ చేశారు. వాళ్ళ స్ఫూర్తితో ఈ చిత్రంలో కథానుగుణంగా 4 వేషాలు వేస్తున్నా. ఆ మహామహులతో నాకు పోలిక లేదు కానీ, ఏదో పిల్లగాణ్ణి నా ప్రయత్నం చేస్తున్నా’’ అని నారాయణమూర్తి అన్నారు. ముగ్గురు కొడుకుల పాత్రల్లో ఒకటి ముస్లిము వద్ద పెరిగే అయూబ్ పాత్ర. మరొకటి ఉద్యమకారుడు శంకరన్న అయితే, మూడోది తండ్రి దగ్గర పెరిగిన అమాయకపు అర్జునుడు పాత్ర. ప్రతి పాత్రా భిన్నంగా ఉంటుంది. ‘‘చట్టం ముందు అందరూ సమానులే అన్నది ఆచరణలో సాధ్యం కాకపోతే, ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుంది. అలా జరగరాదని చెప్పేదే మా ‘రాజ్యాధికారం’’’ అన్నారు. అన్నట్లు, యెప్పటి లానే తెర వెనుక కూడా కథ, కథనం, మాటలు, ఫొటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం, నిర్మాతగా ఆయన బహుపాత్ర పోషణ చేయడం గమనార్హం. -
ఇలాంటి ప్రయత్నం నాకిదే ప్రథమం!
వార్డు మెంబర్ అవ్వాలంటే అయిదు కోట్లు, ఎమ్మెల్యే అవాలంటే పాతిక కోట్లు , ఎంపీ అవ్వాలంటే 50 కోట్లు... రాజకీయం వ్యాపారం అయిపోయింది. ఇలా డబ్బు వెదజల్లి పదవులు పొందిన వాళ్లు ప్రజాసేవ చేస్తారా? ఖర్చుపెట్టిన దానికి అంతకంత సంపాదించుకుంటారా? ఇది ధనస్వామ్యమా? ప్రజాస్వామ్యమా? డబ్బు లేని సామాన్యుడు ప్రజాసేవ చేయడానికి అనర్హుడైతే... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని పిలిపించుకునే హక్కు మన దేశానికి ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఆర్. నారాయణమూర్తి తెరకెక్కించిన చిత్రం ‘రాజ్యాధికారం’. ఈ సినిమాలో ఆయన నాలుగు పాత్రలు పోషించడం విశేషం. అలాగే... ప్రతినాయకునిగా నటించిన తనికెళ్ల భరణి కూడా ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. స్వీయ దర్శకత్వంలో నటించి, ఆర్. నారాయణమూర్తి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘ఇందులో దళిత రైతు రామయ్య పాత్రతో పాటు ఆయన ముగ్గురు కొడుకులుగా కూడా నేనే నటించాను. ఇందులో ఒకటి అమాయకమైన పాత్ర అయితే, రెండోది ముస్లిం ఛాయలున్న పాత్ర. మూడో పాత్ర కూడా భిన్నంగా ఉంటుంది. తనికెళ్ల భరణి పోషించిన రెండు పాత్రలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఇలాంటి ప్రయత్నం చేయడం నాకిదే ప్రథమం. ఇటీవలే సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు నా పాత్రల్ని అభినందించారు. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది. చట్టం ఎవడికీ చుట్టం కాదు.. దాని ముందు అందరూ సమానులే అనే రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరికీ కలిగించిననాడు ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం ఏర్పడుతుంది. లేనినాడు అది సన్నగిల్లుతుంది. మొత్తంగా మా ‘రాజ్యాధికారం’ కథాంశం ఇది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి పాటలు: వంగపండు ప్రసాదరావు, గోరటి వెంకన్న, జయరాజ్, వరంగల్ శ్రీనివాస్, దయా నర్శింగ్, గిద్దే రామనర్సయ్య, కమటం రామస్వామి, కెమెరా: రాంబాబు, కథ, కథనం, మాటలు, డెరైక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి. -
నాలుగు పాత్రల్లో నారాయణమూర్తి
‘‘ప్రజాసేవకన్నా రాజ్యాధికారమే కొంతమంది రాజకీయ నాయకులకు ఎక్కువైంది. పదవి కోసం ఎన్ని మొసలి కన్నీళ్లయినా కారుస్తారు.. అమాయక ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తారు. స్వార్థపూరిత రాజకీయాలతో నాయకులు దిగజారిపోతున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చని అలాంటి నాయకులపై ప్రజలు ఎలా తిరగబడాలి? అనే కథాంశంతో రూపొందించిన చిత్రం ఇది’’ అని ఆర్. నారాయణమూర్తి చెప్పారు. ఆయన హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రాజ్యాధికారం’. ఈ నెల 31న విడుదల కానున్న ఈ సినిమా గురించి ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ -‘‘దళిత కూలీ అయిన రామయ్య రైతుగా ఎదుగుతుంటే ఓర్వలేక పెద్దలు అతన్ని ఏ విధంగా హింసించారు? న్యాయం కోసం న్యాయస్థానానికి వెళ్లిన రామయ్యకు ఎదురైన అనుభవం అనేది ప్రధాన ఇతివృత్తం. ఈ కథకు రాజకీయ నేపథ్యాన్ని జోడించాం. ఇటీవల జరిగిన ఎన్నికల గురించి కూడా ఇందులో ప్రస్తావించాం. మంచి, చెడుల మధ్య పోరాటమే ఈ చిత్రం. ఇందులో నాలుగు పాత్రలు చేశాను. ఇప్పటికే పాటలు శ్రోతలను ఆకట్టుకున్న నేపథ్యంలో ఈ నెల 27న ప్లాటినమ్ డిస్క్ వేడుక జరపనున్నాం’’ అని చెప్పారు. తనికెళ్ల భరణి, తెలంగాణ శకుంత, అమరేంద్ర, అయూబ్, వీరభద్రం, దయాకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. -
ప్రజలు తిరుగుబాటు చేస్తే..!
రైతు కూలీ స్థాయి నుంచి రైతుగా ఎదిగిన కష్టజీవి రామయ్యను ఆ ఊరి పెద్దలు ఏ విధంగా హింసించారు? న్యాయస్థానంలో కూడా అన్యాయానికి గురైన రామయ్య... ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనే ఉద్వేగభరితమైన అంశంతో తెరకెక్కిన చిత్రం ‘రాజ్యాధికారం’. ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే సెన్సార్‌కి వెళ్లనుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణమూర్తి మాట్లాడుతూ -‘‘నాటికీ నేటికీ దళితులు సమాజంలో ఎందుకు నిరాదరణకు గురవుతున్నారు? అధికారం కోసం కొందరు రాజకీయ నాయకులు ఎలా దిగజారుతున్నారు? ప్రజలకిచ్చిన హామీలను ఏ విధంగా తుంగలో తొక్కుతున్నారు? ఇలాంటి వారిపై ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానమే నా ‘రాజ్యాధికారం’. ప్రజాకవుల సాహిత్యం మా సినిమాకు మణిహారం. ఇందులో నేను రామయ్య అనే దళితునిగా నటించాను. స్వర్గీయ తెలంగాణ శకుంతల, తనికెళ్ల భరణి ప్రతినాయక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.ఎవరి భాగాలు వారు పంచేసుకోవాల్సిందే: తెలంగాణకు ప్రత్యేక ఫిలిం చాంబర్ డిమాండ్ కరెక్టే అంటారా? అని నారాయణమూర్తిని అడిగితే -‘‘కచ్చితంగా కరెక్టే. రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు ఎవరి భాగాలు వారు పంచేసుకోవాలి. ఎవరి ఫలాలు వారు అనుభవించాలి. అన్ని విషయాల్లోనూ సమ న్యాయం జరగాలి. రెండుగా విడిపోయిన తర్వాత ఇంకా కలిసి ఉండాలనడం సబబు కాదు. వైజాగ్, రాజమండ్రి, తిరుపతి... ఇలా పలు చోట్లకు పరిశ్రమ తరలి వెళుతుందని అనడం కూడా కరెక్ట్ కాదు. పరిశ్రమ ఎక్కడికీ తరలిపోదు. ఇక్కడితో పాటు అక్కడ కూడా అభివృద్ధి చెందుతుంది. పలు చోట్ల సినీ పుష్పాలు వికసించడం మంచిదే. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఉన్నారు. అలాంటప్పుడు తెలుగు సినిమా రాష్ట్రాలకు అతీతంగా అభివృద్ధి చెందితే తప్పేంటి?. అప్పుడు ఇక్కడా సినిమాలు తీస్తాం. వైజాగ్, రాజమండ్రి వెళ్లి అక్కడా సినిమాలు తీస్తాం’’ అన్నారు. మరి మీరు ఏ చాంబర్లో సభ్యత్వం తీసుకుంటారు? అనడిగితే -‘‘నేను ఆంధ్రుణ్ణి. నా ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించిన ఫిలిం చాంబర్లోనే సభ్యుణ్ణి అవుతాను. అయితే ఏంటి? తెలంగాణలో సినిమా తీస్తే... ఇక్కడి ప్రభుత్వం, ఇక్కడి చాంబర్ నాకు సహకారం అందించరా? తప్పకుండా అందిస్తారు. అలాగే మా సహకారం వారికీ ఉంటుంది. అలా పరస్పర సహకారంతో తెలుగు సినిమా మరింత అభివృద్ధి చెందుతుంది’’ అని పేర్కొన్నారు నారాయణమూర్తి. -
రాజ్యాధికారం కోసం...
కొంతమంది రాజకీయ నాయకులకు ప్రజాసేవ కన్నా రాజ్యాధికారమే పరమావధి. అందుకోసం ఎన్ని గోతులైనా తవ్వుతారు. ఎన్ని మొసలి కన్నీళ్లయినా కారుస్తారు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తారు. అయితే అలాంటివారి ఆటలు ఎప్పుడూ చెల్లవు. ప్రజలు ఎప్పుడో ఒకప్పుడు బుద్ధి చెప్పడం ఖాయం. ఈ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘రాజ్యాధికారం’. స్నేహచిత్ర పతాకంపై ఆర్.నారాయణమూర్తి స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విశేషాలను ఆయన వివరిస్తూ- ‘‘మా సంస్థలో ఇది 27వ సినిమా. ఖమ్మం, కొత్తగూడెం, తూర్పు గోదావరి జిల్లా, శ్రీకాకుళం... తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది. ఇందులో ఆరు పాటలున్నాయి. త్వరలో పాటల్ని, ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఆర్.నారాయణమూర్తి, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: కె.రాంబాబు, డాన్స్: ముక్కురాజు. -
ప్రతినిధి మూవీ ప్రాటీనమ్ డిస్క్
-
కార్పొరేట్ సేన!
* మన గ్యాస్‌ను గుజరాత్‌కు తరలిస్తుంటే మోడీకి మద్దతు ఇవ్వడమేంటి? * చేగువేరాను వల్లించే పవన్‌కు రిలయన్స్ దోపిడీ అన్యాయమనిపించలేదా? * ఉద్యమం జరుగుతున్నప్పుడు విభజనపై ఎందుకు మాట్లాడలేదు? * పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నల పరంపర ఇంటర్వ్యూ: ఆర్.నారాయణమూర్తి: బొల్లోజు రవి, ఎలక్షన్ సెల్ ఆర్.నారాయణమూర్తి... విప్లవ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. సినిమాలు తీయడంలోనే కాదు ప్రజల పక్షాన క్షేత్రస్థాయికి వెళ్లి పోరాడే వ్యక్తి. కేజీ బేసిన్లో రిలయన్స్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. కోస్తాంధ్రలో పుట్టినా, తెలంగాణ ఉద్యమంపై సినిమా తీయడమే కాదు, స్వయంగా అందులో పాల్గొన్నారు. సోంపేట, కాకరాపల్లి ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు. అలాంటి నారాయణమూర్తి పవన్‌కల్యాణ్ పార్టీ జనసేన కార్పొరేట్ సేనగా మిగిలిపోతుందని అభిప్రాయపడ్డారు. ఆయనతో సాక్షి ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే... పవన్ కళ్యాణ్ స్పం దిస్తాడు. ఆవేశపరుడు. ‘ఇజం’ రాశాడు. పార్టీ పెట్టాడు. మంచిదే. కానీ గుజరాత్ వెళ్లి నరేంద్రమోడీని కలిసి మద్దతు ఇస్తామనడమే నాకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ ఒకటి గుర్తించాలి. కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్ నుంచి ఉత్పత్తి అవుతున్న చమురు నిక్షేపాల ఫలాలు మొత్తం స్థానికంగా ఉన్న వారికి చెందాలి. కానీ దాన్నంతా పైపుల ద్వారా గుజరాత్‌కు తరలించుకుపోతున్నారు. ముఖేష్ అంబానీ ఈ సంపదను దోపిడీ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సంపదను అంబానీకి కట్టబెట్టడం దుర్మార్గం. గుజరాత్లో గ్యాస్ సిలెండర్ 250 రూపాయలు అమ్ముకుంటూ, ఇక్కడ మాత్రం 800 రూపాయలకు అమ్ముతున్నారు. స్థానికంగా గ్యాస్ దొరకుతున్నప్పుడు ఇక్కడ వంద రూపాయలకే అమ్మాలి. గుజరాత్లో వెయ్యి రూపాయలకు అమ్మాలి. కానీ ఇక్కడి ప్రజల సంపదను అక్కడకు దోచుకెళ్లేట్లు చేస్తున్నాడు మోడీ. ఆయన తన సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడు. ఇక్కడి వారికి అన్యాయం చేస్తున్నాడు. కేజీ బేసిన్ చమురు నిక్షేపాల సంపద మాదంటే మాదని అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ కొట్టుకుంటున్నారు. కోర్టులకూ ఎక్కారు. ఇది ఎవడబ్బ సొమ్ము? జాతి సంపద కాదా? ప్రజలకు ఈ రకంగా అన్యాయం జరుగుతుంటే... అందుకు కారణమైన మోడీకి పవన్ కళ్యాణ్ ఎలా మద్దతు పలుకుతాడు? అక్కడ అభివృద్ధి జరుగుతోందని చెప్పాడు. ఈ దోపిడీ ఎలా అభివృద్ధి అవుతుంది? పవన్‌కు ఒకటే విన్నవిస్తున్నా... ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటానంటున్నారు. కేజీ బేసిన్ ఆయిల్‌ను ఓఎన్జీసీ కనుగొన్నది. కేంద్రాన్ని మేనేజ్ చేసి దాన్ని రిలయన్స్ దక్కించుకుంది. ముఖేష్ అంబానీ అక్కడి చమురును బ్లాక్ చేస్తూ ఇష్టానుసారంగా రేట్లు పెంచుతున్నాడు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పవన్ ఉద్యమం చేయాల్సింది పోయి మోడీకి మద్దతు పలుకుతాడా? మేం రిలయన్స్ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాం. పవన్‌ని కూడా కోరుతున్నా దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని. ఆయన పోరాటం చేయగలరా? ప్రజల పక్షాన నిలిస్తేనే అది జనసేన అవుతుంది. లేకుంటే కార్పొరేట్ సేన అనిపించుకుంటుంది. పవన్ కళ్యాణ్ పదేపదే చేగువేరా, భగత్‌సింగ్‌ల గురించి చెబుతుంటారు. చేగువేరా అంతర్జాతీయ విప్లవవాది. ఆయన సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పోరాడాడు. భగత్‌సింగ్ దేశ స్వాతంత్రం కోసం, సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పోరాడాడు. అలాంటి చేగువేరా, భగత్‌సింగ్‌ల గురించి ప్రస్తావించే పవన్‌కళ్యాణ్ రిలయన్స్‌కు వ్యతిరేకంగా పనిచేయాలి. రాష్ట్ర విభజన సరిగా జరగలేదని పవన్ చెప్తున్నారు. ఎలా విభజన చేయాలో ఆయన ముందెందుకు చెప్పలేదు? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు విభజన ఎలా చేయాలో చెప్పి ఉండాలి కదా! తెలంగాణ కోసం అనేకమంది అమరులైనప్పుడు, ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు ఎందుకు నోరు విప్పలేదు? అప్పుడేమీ మాట్లాడని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడటంలో ఆంతర్యం ఏమిటి? ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఎలా అభివృద్ధి పథంలోకి వెళ్లాలో మాట్లాడాలి. ఎలా పునర్నిర్మాణం జరగాలో చెబితే ప్రయోజనం ఉంటుంది. సాయుధ పోరాటం... తెలంగాణ అణచివేతకు గురైంది. దోపిడీకి గురైంది. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో 10 లక్షల మంది పాల్గొన్నారు. భవిత కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటం అది. పదివేల మంది అమరులయ్యారు. ఫ్రెంచి విప్లవం, రష్యా బోల్షివిక్ విప్లవం, చైనా విప్లవం విన్నాం. వాటికి ఏమాత్రం తగ్గని మహోన్నత పోరాటం అది. దురదృష్టవశాత్తు ఈ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చలేదు. స్వాతంత్ర పోరాటానికి ఎంత చరిత్ర ఉందో తెలంగాణ సాయుధ పోరాటానికి అంతే చరిత్ర ఉంది. అలాంటి దాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చకపోవడం కుట్రలో భాగమే. ఇప్పటికైనా తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. ఒకప్పుడు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ సినిమా రంగం చెన్నై కేంద్రంగా ఉండేది. మద్రాసు నుంచి మనం విడిపోయినా సినిమా పరిశ్రమ చాన్నాళ్లు అక్కడే ఉండిపోయింది. తర్వాత హైదరాబాద్ తరలి వచ్చింది. ఇక్కడ బ్రహ్మాండంగా అభివద్ధి చెందింది. హిందీ మాట్లాడే రాష్ట్రాలు తొమ్మిది ఉన్నాయి. ముంబై కేంద్రంగా హిందీ పరిశ్రమ నడుస్తున్నప్పుడు... రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉంటే తప్పేంటి? కళకు హద్దులు లేవు. అయితే సీమాంధ్రలోనూ అంటే విశాఖ లేదా విజయవాడ లేదా తిరుపతిల్లో సినీ స్టుడియోలు నిర్మించాలి. ఆ చిత్రాలను ఇక్కడ ఆదరించాలి. ఇక్కడి సినిమాలను అక్కడ ఆదరించాలి. హైదరాబాద్ నుంచి సిని పరిశ్రమ కొనసాగుతూనే సీమాంధ్రలోనూ సినీరంగం అభివద్ధి చెందాలి. అన్నదమ్ముల్లా అందరూ కలిసి ఉండాలి. తెలంగాణలో వచ్చే ప్రభుత్వం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి. దానికో శాఖను ఏర్పాటు చేయాలి. స్టుడియోలు నిర్మించాలి. ఆంధ్ర వికాసం... ఎక్కడ చిన్న రాష్ట్రాలు ఉంటాయో అక్కడ స్వేచ్ఛ స్వావలంబన ఉంటుంది. రెండు మూడు కోట్ల జనాభా దాటిన ప్రాంతాన్ని విడదీయాలని అంబేద్కర్ చెప్పారు. అనంతపురం, శ్రీకాకుళం వంటి వారు రాజధాని హైదరాబాద్ రావాలంటే దూరాభారం అవుతుంది. కాబట్టి పరిపాలన కేంద్రీకరణ వల్ల ఇబ్బందులు వస్తాయి. చిన్న రాష్ట్రాల వల్ల సంపద వికేంద్రీకరణ జరుగుతుంది. సీమాంధ్రతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పెరుగుతుంది. వెయ్యి కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. తెలంగాణకు సింగరేణి ఎలాగో సీమాంధ్రకు తీర ప్రాంతం అలాంటిది. ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు తీవ్రంగా వెనుకబడ్డాయి. హైదరాబాద్, దుబాయ్, గల్ఫ్ ప్రాంతాలకు వలస పోయారు. వాటిని రానున్న ప్రభుత్వం నివారించాలి. -
నీచరాజకీయాలపై అస్త్రం ‘రాజ్యాధికారం’
రాజాం రూరల్: అటు రాష్ట్రం.. ఇటు కేంద్రంలో అక్రమ పొత్తులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న నాయకుల నీచరాజకీయాలను ప్రజలను వివరించడానికే ‘రాజ్యాధికారం’ సినిమా తీస్తున్నామని సినీ దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి చెప్పారు. సినిమా షూటింగ్ కోసం శ్రీకాకుళం జిల్లా రాజాం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ సంస్కృతికి పట్టుకొమ్మలైన పల్లె సీమల్లో నేతలు వైషమ్యాలు రేపుతున్నారని, ఎన్నికల అనంతరం తమ దారి తాము చూసుకుని ఓటర్లను ఘోరంగా మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ఓటుతో బుద్ధి చెప్పి ప్రజాస్వామ్యాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలియజేయడానికి రాజ్యాధికారం సినిమా దోహదపడుతుందన్నారు. సీమాంధ్రకు రాజధానిగా విశాఖపట్నాన్ని ఎంపిక చేస్తే అన్ని ప్రాంతాల వారికి మేలు చేకూరుతుందని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఇక్కడ సముద్ర తీరప్రాంతంతోపాటు అధికంగా మైదాన ప్రాంతం ఉందని, దీనివల్ల త్వరితగతిన అభివృద్ధి చెందవచ్చని తెలిపారు. సినీరంగానికి కూడా విశాఖపట్నం అనువైన ప్రాంతమని అన్నారు. -
ఇప్పుడైతే ఆర్. నారాయణమూర్తితో సినిమా చేస్తాను..!
పూరి జగన్నాథ్ అంటేనే ఓ పవర్ హౌస్. తన మాటల్లోనూ చేతల్లోనూ తీసే సినిమాల్లోనూ ఓ ఎనర్జీ కనిపిస్తుంది. అయితే పైకి కనిపించే జగన్ వేరు. ఇన్నర్ జగన్ వేరు. ఆ లోపలి మనిషిలో ఓ తాత్వికత, ఓ విప్లవాత్మకత, ప్రపంచం పట్ల అవగాహన, కొంచెం చిలిపితనం, ఇంకొంచెం ఘాటుతనం కనిపించకుండానే కనిపిస్తాయి. తనలోని భిన్నత్వాన్ని ‘సాక్షి’ ముందు ప్రత్యేకంగా ఆవిష్కరించారు. నేడు పూరి జగన్నాథ్ పుట్టిన్రోజు. ఈ సందర్భంగా ఆయన ఇన్నర్వ్యూ. *** మీరు వదిలేసుకున్న గొప్ప అవకాశం? చరణ్‌ని లాంచ్ చేయడం కోసం సల్మాన్‌ఖాన్ ‘వాంటెడ్’ సినిమా వదిలి తప్పు చేశాను. *** మీరు కోరుకుంటున్న గొప్ప అవకాశం? నాకు హింగ్లిష్‌లో సినిమా చేయాలని ఉంది. అందులో పాత్రలన్నీ హిందీ లేదా ఇంగ్లిష్ మాట్లాడతాయి. *** ప్రతి మనిషిలోనూ హీరో, విలన్, కమెడియన్ ఉంటాడు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి బయటికొస్తుంటాడు. మరి మీలో? ఇన్నేళ్ల జీవితంలో నేను హీరోగా, కమెడియన్‌గా వేసిన వేషాలు చాలు. ఇప్పుడు విలన్ వేషాలు వెయ్యాలనుంది. నాలో ఉన్న విలన్ని ఎంకరేజ్ చేద్దామనుకుంటున్నాను. *** మీకు బాగా నచ్చిన ఓ ఐదు తెలుగు సినిమాలు? మిస్సమ్మ 25 సార్లు చూశాను. బొబ్బిలిపులి, ఆకలిరాజ్యం, నాయకుడు, క్షణ క్షణం... ఇవి కూడా నాకు బాగా నచ్చిన సినిమాలు. *** కొడుకు, భర్త, తండ్రి, ప్రేమికుడు, స్నేహితుడు, దర్శకుడు, నిర్మాత... ఇలా ఒక్కొక్క పాత్రకి ఎన్నెన్ని మార్కులు వేసుకుంటారు? మీరిచ్చిన అన్ని పాత్రలకీ నేను సగం కంటే ఎక్కువ న్యాయం చేయలేదు. కాబట్టి ఒక్కోదానికి 50 మార్కులే వేసుకుంటా. *** మీరు తరచుగా కలవాలనుకునే వ్యక్తి? ఒకే ఒక్క ప్రాణి... రాంగోపాల్‌వర్మ *** ఇన్నేళ్ల అనుభవంలో సినిమా ఫీల్డ్ నుంచి మీరేం నేర్చుకున్నారు? నాకేమీ రాదు.. నాకేమీ తెలియదు... అనే విషయం నేర్చుకున్నాను. *** మీ ఫేవరెట్ హీరో, హీరోయిన్? అబ్బాయిల్లో - అమితాబ్ బచ్చన్, అమ్మాయిల్లో - శ్రీదేవి *** చనిపోయే లోపు మీరు కచ్చితంగా ఏం చేయాలనుకుంటున్నారు? అందరికీ స్వర్గం చూడాలని ఉంటుంది. అది చూడాలంటే చావాలి. సో... చనిపోతేగానీ స్వర్గం కనిపించదు. మన పనికోసం ప్రాణాలు వదిలేసే దమ్ముంటే అన్ని స్వర్గాలూ చూడొచ్చు. అందుకే నేను చనిపోయే ముందు మళ్లీ మళ్లీ చావాలనుంది. *** మిమ్మల్ని సంతోషంగా ఉంచే అంశాలు? మ్యూజిక్ వినడం, అప్పుడప్పుడు సినిమాలు చూడడం, ఒంటరిగా విదేశీ పర్యటన, భార్యతో పిచ్చాపాటీ, స్నేహితులతో బాతాఖానీ, టెక్నాలజీ పిచ్చి, కొత్త గాడ్జెట్ల గోల. *** మిమ్మల్ని మీరు రిపేర్ చేసుకునే అవకాశం వస్తే? నన్ను నేను రిపేర్ చేసుకునే వయసు దాటిపోయింది. కాబట్టి ఈ బండితో ఇలాగే నాలుగు రోజులు తిరిగేద్దామనుకుంటున్నాను. *** మీ సినిమాల్ని రిపేర్ చేసుకునే అవకాశమొస్తే? గంట గడిచిపోయిన తర్వాత ముల్లు వెనక్కి తిప్పలేం. ఇక ముందైనా కొన్ని మంచి సినిమాలు తీస్తే చాలు. *** మీరిప్పుడే ఫీల్డ్‌లోకి ఎంటరయ్యారనుకుందాం. డైరక్టర్‌గా మీ తొలి సినిమా ఎవరితో చేస్తారు? ఆర్. నారాయణమూర్తి *** మళ్లీ జన్మించే అవకాశం వస్తే ఎవరిలా పుట్టాలనుకుంటారు? బ్రూస్లీ. గబుక్కున బ్రూస్లీలా పుట్టేయాలి. గబగబా ఫైట్లు చేసెయ్యాలి. 32 ఏళ్లు తిరక్కుండా చనిపోవాలి. *** ఈ ప్రపంచం నుంచి డబ్బుని బ్యాన్ చేస్తే? బ్యాన్ చేయాల్సింది డబ్బుని కాదు... మనుషులని. ఈ భూమ్మీద డబ్బు వదిలేసి మనుషులని తీసేస్తే బెటరు. నాకో క్రేజీ ఐడియా ఉంది. డబ్బు లేకుండా, ఏ వసతి లేకుండా ఎవరూ లేని ఒక ఐల్యాండ్‌లో ఒంటరిగా నెలరోజులు గడపాలని ఉంది. *** మీ అప్పులన్నీ తీర్చేశారా? బాగా డబ్బు విలువ తెలిసొచ్చిందా? ఏదో అప్పు ఉండబట్టే ఈ లోకంలో పుట్టాం. అప్పు తీరిపోతే చస్తాం. మనం బతికి ఉండాలంటే అప్పు పెరుగుతూనే ఉండాలి. మీరన్నట్టు డబ్బు విలువ నాకు బాగా తెలిసొచ్చింది. *** ఈ సృష్టి నుంచి స్త్రీని డిలీట్ చేసేస్తే? డిలీట్ చేయలేం. స్త్రీ లేకుండా సృష్టి ఉండదు. ఆ దేవుడు కూడా ఏదో స్త్రీకి పుట్టినవాడే. కాకపోతే ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నాడో... వాడు దేవుడై పుట్టాడు. మనం మనుషులమై పుట్టాం అంతే! *** మీ దృష్టిలో ఈ ప్రపంచంలో గొప్ప అందగత్తె ఎవరు? మా ఆవిడ (ఇలా చెబితే మా ఆవిడ నమ్మదు. మీరు కూడా నమ్మరు. కానీ ఇది పచ్చి నిజం). *** కారులో లాంగ్ డ్రైవ్ చేయాల్సి వస్తే ఎవరితో కలిసి చేస్తారు? అంత లాంగ్ డ్రైవ్ అంటే నన్ను బాగా ఎంటర్టైన్ చేసే మనిషి కావాలి. రాంగోపాల్‌వర్మ తప్ప ఇంకెవరున్నారు? *** ఎన్టీఆర్, సావిత్రి, ఎస్వీఆర్, రాజనాల, సాలూరు రాజేశ్వరరావు, మార్కస్ బార్ట్లే, ఆత్రేయ లాంటి పాతతరం ప్రముఖులంతా బతికొస్తే ఎలాంటి సినిమా తీస్తారు? ఏం చేస్తానో తెలియదు. కచ్చితంగా వాళ్లతో బ్లాక్ అండ్ వైట్ సినిమానే చేస్తాను. కలర్ అస్సలు తీయను. ఒక వ్యక్తిని ఒకే ఒక్క వాక్యంలో నిర్వచించడం కష్టం. కానీ అందులోనే మజా ఉంటుంది. కొంతమంది పేర్లు చెప్పగానే మీ మనసులో పుట్టిన నిర్వచనాన్ని టకీమని చెప్పగలరా? అమితాబ్ బచ్చన్ - నా టైం బావుంది చిరంజీవి - కష్టజీవి నాగార్జున - క్రమశిక్షణ కలిగిన వ్యక్తి పవన్‌కల్యాణ్ - ఫొటో పెట్టుకోవాలి మహేష్ - పేరంటేనే కిక్ ఎన్టీఆర్ - అంటేనే ఎనర్జీ ప్రభాస్ - నా డార్లింగ్ చరణ్ - మహర్జాతకుడు బన్నీ - నా తమ్ముడు రవితేజ - మొహం మీద తిడతాడు రక్షిత - స్వీట్ హార్ట్ అసిన్ - తెలివైన కుట్టి ఇలియానా - అందమైన నడుం తమన్నా - బంగారం -
తీర్పు అనంతరం ఏం జరుగుతుంది?
‘‘ప్రతి ఒక్కరినీ కదిలించిన ఢిల్లీ నిర్భయ సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశాను. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే అని చెప్పే సినిమా ఇది’’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నిర్భయభారతం’. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నారాయణమూర్తి మట్లాడుతూ - ‘‘ఇటీవలే నిర్భయ నిందితులకు కోర్టు మరణ దండన విధించింది. ఈ తీర్పు అనంతరం ఏం జరుగుతుంది? అనేది మా సినిమా క్లైమాక్స్’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సి.గోపాలరావు, కూర్పు: మోహన్ రామారావు. -
ఇలా బతకడమేనాకిష్టం!
నారాయణమూర్తి నడినెత్తి సూరీడు. అతడికి పొద్దుల్లేవ్... ఏ హద్దుల్లేవ్! భగభగ... భగభగ... భగభగ... కణకణ తీక్షణ, జ్వలించే వీక్షణ...! అన్యాయాన్ని చూస్తే అగ్గైపోతాడు. అధర్మంపై ఆగ్రహోదగ్రుడౌతాడు. సినిమాలూ అంతే... ఫిల్మీ ఇన్‌ఫ్లేమబుల్! ఈవారం ‘తారాంతరంగం’లో మీకతడు చల్లగా నవ్వుతూ కనిపించవచ్చు. చెప్పలేం, ఆ నవ్వు కూడా ఒక... రెవల్యూషనరీ స్టేట్మెంట్ కావచ్చు! పోరుబాటలో ఓ వ్యక్తి నడుస్తున్నాడు అంటే... దాని వెనుక కచ్చితంగా ధర్మాగ్రహం ఉండుండాలి... ఆర్.నారాయణమూర్తి: నువ్వన్నది నిజం సోదరా... మనిషిని ఉద్యమదిశగా నడిపించేది ధర్మాగ్రహమే. అందుకు నా జీవితమే ఉదాహరణ. మా ఊళ్లో జోగయ్య అనే దళితుడు ఉండేవాడు. ఆయన్ను ‘మామయ్య...’ అని పిలిచేవాణ్ణి. ఊరందరికీ ఆయన సేవ చేసేవాడు. ఊరి జనాలు కూడా ఆయన్ను కలవరించేవారు. కానీ కలవరించేది ప్రేమతోకాదు... అవసరాలు తీర్చుకోడానికి! జనం ఆయనకు అన్నం పెట్టే తీరు హృదయ విదారకంగా ఉండేది. అంటరాని వాడికి పెడుతున్నట్లు ఆమడదూరంలో నిలబడి, గంజి ఎత్తి పోసేవారు. అది చూసి రగిలిపోయేవాణ్ణి. ‘ఊరందరికీ అంత సేవ చేసే ఆయన్ను.. ఇంట్లో కూర్చోబెట్టి ఎందుకు అన్నం పెట్టకూడదు? నూతులు తవ్వేది వాళ్లు... కానీ ఆ నూతుల్లో నీళ్లు తాగే అర్హత వాళ్లకు లేదు. గుళ్లు కట్టేది వాళ్లు... కానీ గుళ్లోకొచ్చి దేవుణ్ణి దణ్ణం పెట్టుకునే యోగం వాళ్లకు లేదు! ఇదెక్కడి న్యాయం?’ ఈ ప్రశ్నలు నా హృదయాన్ని తొలిచేస్తుండేవి. ఓ రోజు నా కన్నతల్లి కూడా ఆయనకు అలాగే అన్నం పెట్టడం చూశాను. చెప్పలేనంత కోపం వచ్చింది. ‘ఏంటమ్మా ఈ పని?’ అని అమ్మను కోపంగా అడిగేశాను. ‘తప్పురా... మనం అతన్ని తాకకూడదు’ అంది అమ్మ. ‘ఎందుకు తాకకూడదు? నువ్వూ మనిషివే, ఆయనా మనిషే! ఏంటీ అంటరానితనం’ అని సూటిగా అడిగేశాను. ఇంతలో నా చెంప ఛెళ్లుమంది. కళ్లు బైర్లు కమ్మాయి. కళ్లు తెరిచి ఎవరో చూశాను. ఎదురుగా నాన్న! సాటి మనిషిని అమ్మానాన్నలే అంటరానివాడిగా చూడ్డం తట్టుకోలేకపోయాను. నాలో అభ్యుదయభావాలకు బీజం పడింది అప్పుడే! అలాగే... స్కూల్లో కలిగినవారి పిల్లలందరితో... మా పంతుళ్లు బ్యాడ్మింటన్ ఆడించేవాళ్లు. మాలాంటి పేద పిల్లలు మాత్రం చూస్తూ కూర్చోవాలి. ఇదెక్కడి న్యాయం? అని అడిగా... మళ్లీ నా చెంప చెళ్లు మంది. ఎదురుగా మాస్టర్! ఇది నా రెండో అనుభవం! పెద్దాపురంలో కాలేజ్‌లో చేరాను. అక్కడ సత్రం ప్రెసిడెంట్ అయ్యాను. పెద్దాపురం మహారాణి రాజావత్సవాయి బుచ్చిసీతయ్యమ్మగారు పేద ప్రజానీకానికి రాసిచ్చేసిన ఆస్తిలో ఆ సత్రం ఒకటి. నాలాంటి పేద విద్యార్థులందరూ ఆ సత్రంలోనే భోంచేసేవారు. అన్నం తినేటప్పుడు కూరల్లో పురుగులేమైనా కనిపించినా, అన్నం సరిగ్గా పెట్టకపోయినా... వెంటనే గొడవ పెట్టేసుకునేవాణ్ణి. దేవాదాయ శాఖకు చెందిన చింతపల్లి నరసింహారావుగారని ఓ పెద్దాయన ఉండేవారు. నా గొడవలు పడలేక ఓ సారి ఆయన మా నాన్నను పిలిపించాడు. ‘ఏరా... నువ్వేమైనా గాంధీ అనుకుంటున్నావా?’ అని మా నాన్న సమక్షంలో అడిగాడాయన. ‘నేనంత గొప్పోణ్ణి కాదులేండీ..’ అని దురుసుగా సమాధానం చెప్పాను. ఈ సారి చెంపచెళ్ళుమనడం కాదు... పెద్దాపురం రోడ్ల మీద తన్నుకుంటూ తీసుకెళ్లాడు నాన్న! అన్యాయంపై ఎదురుతిరిగిన ప్రతిసారీ... నాకు దెబ్బలే! అవి నాలో భయాన్ని పెంచాల్సిందిపోయి కసిని పెంచాయి. తప్పు జరిగిందనిపిస్తే... ఎదురున్నది ఎంత పెద్దవారైనా సరే... కడిగిపారేసేవాణ్ణి. . తొలిసారి ఎర్రకండువా ఎప్పుడు కప్పుకున్నారు? ఆర్.నారాయణమూర్తి: ‘కమ్యూనిస్ట్’ అనిపించుకునేంత గొప్పవాణ్ణి కాదు నేను. మనిషిని ప్రేమిస్తాను అంతే. అందుకే చదువుకునే రోజుల్లోనే కుర్రాళ్లమంతా ఓ టీమ్‌గా ఏర్పడి విరాళాలు పోగు చేసి మరీ కాలేజీ కట్టించాం. సత్రాలు నెలకొల్పాం. ఎవరైతే పీడిత ప్రజల కోసం ఉద్యమాలు చేస్తున్నారో, బడుగు, బలహీన వర్గాలకు బాసటగా నిలుస్తారో.. వారంటే నాకు ఆరాధన. నా సినిమాల్లో హీరోలు కూడా వాళ్లే. పోరాటాలు సరే... సేవాదృక్పథం ఎలా అలవడింది? ఆర్.నారాయణమూర్తి: దానికి ఓ గొప్ప సంఘటన కారణం మిత్రమా! బీహార్ వరద బాధితుల సహాయార్థం మా మిత్రులంతా కలిసి పెద్దాపురంలో ఇల్లు ఇల్లు తిరిగి విరాళాలు వసూలు చేస్తున్నాం. అక్కడ ‘దర్గానగర్’ అనే ఏరియా ఉంది. అది ప్రాస్టిట్యూట్లు ఉండే చోటు. ఇల్లు ఇల్లు తిరుగుతూ... అక్కడకి కూడా వెళ్లాం. ఓ ఇంటిముందు నిలబడి.. ‘బీహార్ బాధితులకు ఏదైనా సాయం చేయండమ్మా’ అని అడిగాను. ఆ ఇంట్లో నుంచి ఓ తల్లి వచ్చింది. ‘నీ పేరేంటి నాన్నా..’ అనడిగింది. ‘నారాయణమూర్తి’ అని చెప్పాను. ‘నారాయణమూర్తి.. ఇదిగో బట్టలు, బియ్యం’ అని జోలెలో వేసింది. ఆమెకు ఓ నమస్కారం పెట్టి వెళ్లబోయాను. ‘నారాయణమూర్తీ.. నాకింకా బేరం రాలేదయ్యా... రాత్రికి కచ్చితంగా బేరాలొస్తాయి. ఆ సొమ్ము మొత్తం బాధితులకు ఇస్తాను.. సరేనా’ అంది. ‘అమ్మా... నీకు వందనం’ అని పాదాభివందనం చేసినంత పని చేశాను. నాలో సేవాదృక్పథాన్ని పెంపొందింపజేసిన సంఘటన అది! మరి సినిమాలవైపు మీ దృష్టి ఎలా మరలింది? ఆర్.నారాయణమూర్తి: సినిమాల్లోకి రాకముందు పలు యూనియన్లకు ప్రెసిడెంట్‌గా పనిచేశాన్నేను. పోరాటాలు నాకు ఓ కన్ను అయితే... సినిమాలు నా రెండో కన్ను. తూర్పు గోదావరిజిల్లా రౌతులపూడి మండలం మల్లంపేట అనే కుగ్రామం మాది. అయితే... రౌతులపూడి మా తాతగారి ఊరవ్వడంతో అక్కడే పుట్టి పెరిగాన్నేను. మా అమ్మపేరు రెడ్డి చిట్టెమ్మ, నాన్నపేరు రెడ్డి చిన్నయ్యనాయుడు. నన్నేమో అందరూ ‘రెడ్డిబాబులు’ అని పిలిచేవారు. అక్కడ టూరింగ్ టాకీస్ ఉండేది. శ్రీవెంకటేశ్వరా థియేటర్. మీరు నమ్మండి బ్రదర్... టికెట్లు ఇచ్చే ముందు ఆ థియేటర్ నుంచి ‘నమో వెంకటేశా... నమో... తిరుమలేశా...’ అంటూ ఘంటసాలపాట వినిపించేది. అంతే.. థియేటర్ వైపు పరుగు లంకించుకునేవాణ్ణి. వరసపెట్టి అన్ని షోలు చూసేసేవాణ్ణి. డబ్బులు లేవనుకోండీ.. పంది కన్నాల్లోంచి దూరి వెళ్లి దొంగచాటుగా సినిమా చూసేసేవాణ్ణి. అయితే... నటునిగా నన్ను విపరీతంగా ప్రభావితం చేసిన సినిమా మాత్రం అన్నగారి ‘శ్రీకృష్ణ పాండవీయం’ సోదరా! అందులో ఎన్టీఆర్‌గారు చేసిన దుర్యోధనుని పాత్ర నా హృదయంలో గాఢమైన ముద్ర వేసింది. మట్టి దిబ్బనే స్టేజ్‌గా భావించి, ఇటుకరాయి పొడుం, మసి బొగ్గులతో మేకప్ వేసుకొని, దుప్పట్లను వీపుకు కట్టుకొని ఫ్రెండ్సందరి ముందు దుర్యోధనుని ఏకపాత్రాభినయం చేసేవాణ్ణి. స్వతహాగా అక్కినేని వీరాభిమానినైనా... నటునిగా ఎన్టీఆర్ ప్రభావమే నాపై ఎక్కువ ఉండేది. ఎస్వీఆర్, సావిత్రమ్మ తల్లి, సూర్యకాంతం, రేలంగి అన్నా కూడా చాలా ఇష్టం. మద్రాస్‌లో ఎప్పుడు అడుగుపెట్టారు? ఆర్.నారాయణమూర్తి: ఇంటర్మీడియట్ అయిపోయింది. ‘సినిమాల్లోకి వెళతా...’ అని అమ్మని బతిమాలి.. ఆమె దగ్గర ఓ డెబ్భై రూపాయలు తీసుకొని మద్రాస్ రెలైక్కా. ‘వెళ్లగానే.. రామారావుగారు వేషం ఇచ్చేస్తారు. నాగేశ్వరరావుగారు భోజనం పెడతారు’ అని మనసులోనే అమాయకంగా అనుకునేవాణ్ణి. అక్కడ నాలా వందల మంది పడిగాపులు కాస్తూ ఉంటారని వెళ్లాక గానీ అర్థం కాలేదు. కష్టపడితే పడ్డాను కానీ.. ఆ రోజులు, ఆ అనుభవాలు మరిచిపోలేనివి మిత్రమా! ఆ అనుభవాలు కొన్ని... ఆర్.నారాయణమూర్తి: చెబుతాను మిత్రమా.. అప్పట్లో తిరుపతి వెళ్లే భక్తులందరికీ.. శ్రీవారిని దర్శించాక... అట్నుంచి అటు మద్రాసు వెళ్లి.. ఎన్టీఆర్‌ని చూసే సంప్రదాయం ఉండేది... అలా ప్రతి రోజూ పొద్దున్నే ఎన్టీఆర్ ఇంటికి వందల సంఖ్యలో భక్తులు వచ్చి చేరేవారు. ఆయన కూడా ఎర్లీ అవర్స్‌లో బయటకు వచ్చి వారికి కనిపించేవారు. ‘దర్శనం బాగా అయ్యిందా..’ అని కుశల ప్రశ్నలు వేసేవారు. రామారావుగారిని చూడాలనే కోరిక నాకు బలంగా ఉండేది. అందుకే ఆ భక్తుల్లో ఒకడిగా వెళ్లిపోయి.. ఆయన ముందు నిలుచున్నా. ఆ క్షణం గుర్తొస్తే... ఇప్పటికీ నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కానీ ఆ ఆనందం కడుపు నింపదుగా. కడుపేమో నకనకలాడుతోంది. స్వతహాగా భోజనప్రియుణ్ణి. రోజుకు ఏడుసార్లు తింటా. జేబులో డబ్బుల్లేవ్. మరో వైపు లాడ్జివాడు ఖాళీ చేయమన్నాడు. వేషాలేమో రాలేదు. ఉంటానికి చోటు లేదు. దాంతో పానగల్‌పార్క్‌లో ఓ రోజు, రామకృష్ణ పార్క్‌లో ఓ రోజు, క్రిసెంట్ పార్క్‌లో ఓ రోజు పడుకునేవాణ్ణి. అన్నం లేకపోయేసరికి ట్యాప్ వాటర్ కడుపు నిండా పట్టించేవాణ్ణి. అష్టకష్టాలు అనుభవించా. కానీ వెనక్కు మాత్రం వెళ్లకూడదని దృఢంగా నిశ్చయించుకున్నా. అలాంటి సమయంలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన పేరు చిన్ని. స్టార్ కమెడియన్ రాజబాబుగారి మేకప్‌మేన్ కృష్ణకు సహాయకుడాయన. మహాలింగపురంలోని ఓ పాడైపోయిన కార్‌షెడ్‌లో చోటు ఇప్పించాడు. రాత్రిళ్లు అక్కడే పడుకునేవాణ్ణి. ఆ మహానుభావుడి దయవల్లే ‘తాతామనవడు’ సెట్లోకి అడుగుపెట్టా. నేను ప్రప్రథమంగా సినిమాఫుడ్ తిన్నది ఆ సెట్లోనే! అందుకే.. ఆ చిత్ర నిర్మాత ప్రతాప్ ఆర్ట్స్ రాఘవగారికి వందనాలు. నా అదృష్టం.. ఆ సెట్లోనే మహానటుడు రంగారావుగారిని, సూర్యకాంతమ్మని, సత్యనారాయణగారిని, అల్లురామలింగయ్యగారిని, రాజబాబుగారిని, రమాప్రభగారిని.. మహామహులందరినీ ఒకేసారి చూసే అవకాశం దొరికింది. ‘నేను నటిస్తానండీ.. వేషం ఇవ్వరా...’ అని డెరైక్ట్‌గా రంగారావుగారినే అడిగేశా. ఆయన సరదాగా ‘ఏది నటించి చూపించు’ అన్నారు. అంతే... ఇక రెచ్చిపోయా. అందర్నీ ఇమిటేట్ చేసేశా. రంగారావుగారు ఒకటే నవ్వు. ‘భలేవాడివిరా అబ్బాయ్. పైకొస్తావ్..’ అన్నారు. నాకు ఆనందం ఆగలేదు. ఇంతకీ మీ గురువు దాసరిగారిని ఎప్పుడు కలిశారు? ఆర్.నారాయణమూర్తి: వస్తున్నాను మిత్రమా, అక్కడికే వస్తున్నా! నా దేవుణ్ణి కలిసే సమయం ఆసన్నమయ్యింది. నేను బొమ్మలు బాగా గీస్తాను. మిమ్మల్ని కూర్చోబెట్టి... యాజిటీజ్‌గా మీ బొమ్మ దించేస్తా. నాలో ఉన్న ఆ కళ కూడా అక్కడ ఉన్నవారికి చూపించాలని ఓ మూల కూర్చొని ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల బొమ్మలు గీసేశాను. అప్పుడే... నా ఆరాధ్యదైవం నా గురువుగారు సెట్లోకి అడుగుపెట్టారు. నేరుగా గురువుగారి దగ్గరకెళ్లి నా బొమ్మలు చూపించాను. ‘ఏ ఊరు తమ్ముడూ...’ అని భుజం మీద చేయివేశారు. నా భుజంపై ఉన్నది సాధారణమైన చేయి కాదని, అది నా పాలిటి సాక్షాత్ వరద హస్తమని నాకు అప్పుడు తెలీదు. కానీ ఏదో తెలీని వైబ్రేషన్. ‘సినిమా పిచ్చితో వచ్చాను. వేషం ఇస్తే చేస్తాను’ అని అడిగేశాను. ‘ఏం చదివావ్’ అనడిగారు. ఆ రోజే ఇంటర్మీడియట్ ఫలితాలొచ్చాయి. పాసైపోయా. ఆ విషయమే చెప్పా. ‘చిన్న కుర్రాడివి. అప్పుడే సినిమాలు వద్దు. డిగ్రీ పూర్తి చేసి రా... అప్పుడు తప్పకుండా అవకాశం ఇస్తా’ అన్నారు గురువుగారు. ‘ఎన్టీరామారావు బి.ఏ’లా ‘నారాయణమూర్తి బి.ఏ’ అనిపించుకోవాలని నాక్కూడా ఉండేది. అందుకే గురువుగారి మాట ప్రకారం వెళ్లి డిగ్రీ పూరిరంగారావుగారి ముందు నేను నటించి చూపిస్తున్నప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ సప్లయిర్ శరభయ్యగారు చూశారట. ఆయన నన్ను పిలిపించి, ‘గోల్డెన్‌స్టూడియోకి వచ్చేయ్. నీకు వేషం ఉంది’ అన్నారు. ‘అబ్బడియబ్బ... యాక్టర్‌ని అయిపోయా’. ఇంకేముంది.. నా ఆనందానికి పట్టపగ్గాల్లేవ్. మహాలింగపురం నుంచి ఏడు కిలోమీటర్లు నడిచి గోల్డెన్ స్టూడియోకి చేరుకున్నా. తీరా వెళ్లాక అక్కడ నా వేషం ఏంటనుకుంటున్నారు.. ‘రాముని బంటుని రా... సీతారాముని బంటుని రా...’ అని గుడిముందు కృష్ణగారు డాన్స్ వేస్తుంటారు. ఆయన వెనుక ఎగిరే ఓ నూట డెభ్భైమందిలో నేనూ ఒకణ్ణి. ఆ సినిమా పేరు ‘నేరము-శిక్ష’... కె.విశ్వనాథ్‌గారు దర్శకుడు. కాస్త కనిపించే వేషం వేసి, ఊరెళ్లిపోవాలనేది నా ఆలోచన. అందుకే.. సహాయ దర్శకుడు కృష్ణమూర్తిగారి దగ్గరకెళ్లి, రామారావు, నాగేశ్వరరావుగారిని ఇమిటేట్ చేసి చూపించి, ‘ఏదైనా కనిపించే వేషం ఇవ్వండి సార్’ అనడిగాను. నా బాధను గ్రహించి.. సాక్షిరంగారావు, మాడా తదితర ప్రముఖులు నటిస్తున్న ఓ సన్నివేశంలో... వారి పక్కనే నన్ను కూడా నిలబెట్టాడు. డైలాగ్ అయితే.. లేదు. దక్కిందే దక్కుదల అనుకున్నా. ఆ షూటింగ్ టైమ్‌లోనే మద్రాస్‌లో ప్రథమంగా... నాన్‌వెజ్ తిన్నాను. ఆకలితో మాడీ మాడీ ఉన్న కడుపు కదా. నోరు కూడా బాగా చవిజచ్చిపోయింది. నాన్‌వెజ్ కనిపించగానే రెచ్చిపోయా. ఇంకేముందీ.. తేడా కొట్టేసింది. భయంకరమైన జ్వరం. శరభయ్యగారు ఇంటికి తీసుకెళ్లి, టాబ్లెట్ ఇచ్చారు. పొద్దున్నే జ్వరం తగ్గింది. అరడజను దోసెలు పళ్లెంలో పెట్టి తినమన్నారు. తిన్నాను. ఓ 36 రూపాయలు ఇచ్చారు. నా తొలి పారితోషికం అనమాట! అవి తీసుకొని ఆయనకు కృతజ్ఞత చెప్పి ఊరుకెళ్లే ముందు మళ్లీ మా గురువుగారిని కలిశాను. ‘ఊరు వెళుతున్నాను’ అని చెప్పాను. ‘జాగ్రత్తగా వెళ్లిరా’ అన్నారు. రాజబాబుగారు నాకు టెర్రీకాటన్ బట్టలు కొనిచ్చారు. వారి ఆప్యాయత ఇంకా నా కళ్లముందు కదులుతూనే ఉంది(చమర్చిన కళ్లతో). ముఖ్యంగా మద్రాసు మహాతల్లికి వందనాలండీ. ఆ సాంబారుకి శతకోటి వందనాలు. ఇంతకీ బి.ఏ పుర్తి చేశారా? ఆర్.నారాయణమూర్తి: ఓ వైపు విద్యార్థి ఉద్యమాలు. మరో వైపు చదువు. సినిమా పరిశ్రమలో ఎన్ని కష్టాలుంటాయో ప్రత్యక్షంగా చూశాను కదా. అందుకే... ‘మళ్లీ వెళ్లాలా..’ అనే ఆలోచనలో ఇంకో వైపు. అలాంటి సమయంలో... మా ఊరి టూరింగ్ టాకీస్‌లో ‘నేరము-శిక్ష’ విడుదలైంది. స్క్రీన్‌పై ఎప్పుడైతే నేను కనిపించానో.. ‘అడిగోరా.. రెడ్డిబాబులు’ అని ఒకే కేక పెట్టారు ఊరి జనాలు! నేను ఆ సినిమాలో ఉన్నట్లు చుట్టుపక్క ఊళ్లల్లో స్ప్రెడ్ అయ్యింది. అంతే.. బళ్లు కట్టుకొని మరీ సినిమాకి రావడం మొదలుపెట్టారు జనాలు! అందులో నేను చేసింది జూనియర్ ఆర్టిస్ట్ వేషం. కానీ నన్ను హీరోలా చూడ్డం మొదలుపెట్టారు. ఆ క్రేజ్ నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక మద్రాస్ వెళ్ళాల్సిందే.. అని నిశ్చయించుకున్నాను. బి.ఏ. అయిపోగానే.. అమ్మానాన్నల పర్మిషన్ తీసుకొని మద్రాస్ ట్రైన్ ఎక్కేశా. సూటిగా గురువుగారిని కలిశా. వెళ్లీవెళ్లగానే.. అన్నమాట ప్రకారం ‘నీడ’ సినిమాలో సెకండ్ లీడ్ క్యారెక్టర్ ఇచ్చారు. వందరోజులాడింది. నా అభిమాన హీరో అక్కినేని నుంచి షీల్డ్ కూడా తీసుకున్నా! కెరీర్ తొలినాళ్లలో గుర్తుండిపోయిన సంఘటనలు? ఆర్.నారాయణమూర్తి: అబ్బో లెక్కలేనన్ని. మనకు ఎన్టీఆర్ ఎలాగో.. తమిళనాడులో ఎమ్జీఆర్ అలా. బాత్రూమ్ గోడలమీద కూడా ఆయన పేర్లే ఉంటాయి. నేను జూనియర్ ఆర్టిస్‌గా ఉన్న రోజుల్లో సప్లయిర్ సూర్యనారాయణగారు నాకో వేషం ఇప్పించారు. వాహినీ స్టూడియోలో షూటింగ్. అందులో కూడా వందమందిలో ఒకణ్ణే. కాస్ట్యూమ్స్ వాడు అందరికీ ‘పోడుంగో... పోడుంగో...’ అని ఎవరి కాస్ట్యూమ్స్ వాళ్లకు విసురుతున్నాడు. అవి ముక్కిపోయిన వాసన వస్తున్నాయి. ‘ఇదేంటండీ... ఇవి ముక్కిపోయిన కంపు గొడుతున్నాయి. ఎలా తొడుక్కుంటాం’ అని అడిగేశా. ‘ఏయ్... ఉంగళక్కు తెరియుమా.. అంద డ్రస్ యార్ పోటాచ్చో. యమ్జీఆర్ పోటాచ్చి. పోడుంగో’ అని గదిమాడు. వాడన్నదానికి అర్థం ఏంటంటే... ‘నీకు తెలుసా... ఆ డ్రస్ ఎవరు వేసుకున్నారో... ఎమ్జీఆర్ వేసుకున్నారు. తోడుక్కో’ అని! ‘అబ్బ... ఎమ్జీఆర్ వేసుకున్న డ్రస్ వేసుకుంటున్నానా...’ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయా. ఆత్రం ఆత్రంగా ఆ డ్రస్ వేసుకున్నా. నా జీవితంలో మరిచిపోలేని సంఘటన అది. మరో సంఘటన ఏంటంటే... . హైదరాబాద్ సారథీ స్టూడియోలో ‘ఓ మనిషీ తిరిగిచూడు’ షూటింగ్ జరుగుతోంది. మా గురువుగారే దర్శకుడు. ఆ చిత్ర నిర్మాతకి తాగుడు అలవాటుంది. రోజుకు ఒకణ్ణి తిడుతుంటాడు. ఈ దఫా నా వంతు వచ్చింది. నోటికి ఏదొస్తే అది అనేశాడు. రైతు బిడ్డని అవ్వడంతో స్వతహాగా పొగరెక్కువ. దాంతో తిరగబడ్డాను. ఇద్దరం తోసుకున్నాం. ఆ నిర్మాతగారి అహం దెబ్బతినింది. ‘షూటింగ్ క్యాన్సిల్’ అని వెళ్లిపోయాడు. గురువుగారు నా దగ్గరకొచ్చి ‘సారీ చెప్పు’ అన్నారు. ‘నేను చెప్పను’ అని సూటిగా చెప్పేశా! ‘చెప్పకపోతే... నా దగ్గర ఉండవ్’ అన్నారు. ‘ఓకే’ అని మద్రాస్ ట్రైన్ ఎక్కేశా. మళ్లీ రోడ్డుమీద నిలబడ్డా. తర్వాత గురువుగారి మరో సినిమా మద్రాస్‌లో మొదలైంది. అప్పుడు ఆయనే... అసిస్టెంట్ డెరైక్టర్ని పిలిచి... ‘నారాయణమూర్తి ఏడయ్యా... కనబడటం లేదు. పాపం.. వాడెక్కడున్నాడో తీసుకురండి’ అన్నారు. కట్ చేస్తే గురువుగారి ముందున్నాను. ఇద్దరం కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ... ‘ఏరా... నేను పొమ్మంటే పోతావురా... నేను నిన్ను ఒక్క మాట అనకూడదా?’ అన్నారు గురువుగారు. నాకు ఏడుపు ఆగలేదు. కాళ్లమీద పడ్డంత పనిచేశాను. అసలు ఆయనకు నన్ను పిలిపించాల్సిన అవసరం ఏంటి చెప్పండి. ఆ రోజుల్లో ఆయన కారు వెళుతుంటే... సీఎం కాన్వాయ్‌లా... వెనుక ఓ పది కార్లు ఫాలో అయ్యేవి. ఆయన కోసం నిర్మాతలు పడిగాపులు కాచేవారు. ఆయన్ను నమ్ముకొని వచ్చిన ఆఫ్ట్రల్‌గాణ్ణి నేను. నా గురించి ఆయన అంతసేపు ఆలోచించడం ఏంటి? నాకు తెలిసి.. ‘గురువు’ అనే పదానికి సరైన నిర్వచనం నా గురువు దాసరే! మరో మరిచిపోలేని విషయం ఏంటంటే... నేను సక్సెస్‌లో ఉన్నప్పుడు నా చుట్టూ ఎప్పుడూ ఓ ఇరవై మంది ఉండేవారు. కోలాహలంగా ఉండేది నా లైఫ్. తర్వాత నా సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం మొదలయ్యాయి. అంతే... ఒక్కసారిగా ఆ కోలాహలం మాయం! జేబులో ఉన్న చిల్లర డబ్బులతో బన్ తిని, టీ తాగి రూమ్కొచ్చి పడుకునేవాణ్ణి. ‘ఏంటీ.. ఇలా అయిపోయింది జీవితం..’ తెలీకుండానే కంటి వెంట చెమ్మ. ఇంతలో బుద్ధభగవానుడి పుస్తకం కనిపించింది. పేజీ తిప్పాను. గొప్ప కొటేషన్... ‘నీవు దుఖించిన యడల దుఖము పోయినచో నువ్వు దుఖించుము’ అని. పనిగట్టుకొని ఏడవడం ఎంత దుర్మార్గమో ఒక్కమాటలో చెప్పాడు బుద్ధుడు. నా జీవితాన్ని మార్చిన సంఘటన అది. సాధారణ పేదరైతు బిడ్డ అయిన మీరు ‘స్నేహ చిత్ర’ పేరుతో నిర్మాణ సంస్థను ఎలా స్థాపించగలిగారు? ఆర్.నారాయణమూర్తి: హీరోని కావాలనేది నా యాంబిషన్! నాకేమో చిన్న చిన్న వేషాలొస్తున్నాయి. సో... ఏదో ఒక రిస్క్ చేస్తే తప్ప నేను హీరోని కాను. ముందు నేను హీరో అవ్వాలంటే... నేనే దర్శకుణ్ణి అవ్వాలి. కానీ నాకెవ్వరూ డెరైక్షన్ చాన్స్ ఇవ్వరు. నేను దర్శకుణ్ణి అవ్వాలంటే.. నేనే నిర్మాతను కావాలి. నేను పేదరైతు బిడ్డను. సినిమా తీసే స్తోమత నాకు లేదు. అలాంటి దశలో నా మిత్రులు సాయం చేశారు. వారి సహకారంతో ఇండో-సోవియట్ష్య్రా మైత్రి చిహ్నాన్ని నా సంస్థకు పెట్టుకొని ‘స్నేహచిత్ర’ సంస్థను స్థాపించా. నా సంస్థలో నేను తీసిన తొలి సినిమా ‘అర్ధరాత్రి స్వతంత్రం’. అది ఏడాది ఆడింది. ఆ తర్వాత ‘‘భూపోరాటం, ఆలోచించండి, అడవి దివిటీలు, దండోరా, ఎర్రసైన్యం, స్వతంత్రభారతం, చీమలదండు, దళం, ఊరుమనదిరా, వేగుచుక్కలు, వీరతెలంగాణ, పోరు తెలంగాణ, పీపుల్స్‌వార్, చీకటి సూర్యులు, అమ్మమీద ఒట్టు, గంగమ్మజాతర’’ ఇలా స్ఫూర్తిని రగిలించే సినిమాలు తీశా. రాబోతున్న ‘నిర్భయ భారతం’ కూడా నా సిద్ధాంతాలకు అనుగుణంగానే ఉంటుంది. కథాపరంగా ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఎవరూ సినిమాలు తీయరు. కానీ మీరు తీస్తారు. ఎందుకు? ఆర్.నారాయణమూర్తి: ఒక్కో దర్శకునిదీ ఒక్కో శైలి! శాంతారామ్‌గారి సినిమాలు వాస్తవానికి అద్దం పట్టేలా ఉంటాయి. విశ్వనాథ్‌గారి సినిమాలు, బాపుగారి సినిమాలు కళాత్మకంగా ఉంటాయి. రాఘవేంద్రరావుగారి సినిమాలు మసాలా ఓరియంటెండ్‌గా ఉంటాయి. నా సినిమాలు ఇలా ఉంటాయి. మళ్లీ మా గురువుగారు పద్ధతి వేరు. ఆయన ఎలాంటి సినిమా అయినా తీసేస్తారు. ఇలాంటి సినిమాలు తీస్తున్నారు కదా. ప్రభుత్వం నుంచి సమస్యలు ఎదురవ్వలేదా? ఆర్.నారాయణమూర్తి: అబ్బో చాలా! నేను తీసిన చాలా సినిమాలు సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పోలీసులైతే కొన్ని సినిమాల ప్రదర్శనలను కూడా అడ్డుకున్నారు. నా సినిమాకు వచ్చే జనాన్ని కూడా సోదా చేసేవారు! ఓసారి ఇంటిలిజెన్స్ ఐజీ నన్ను పిలిపించి ఇంటరాగేట్ చేశారు. ‘ఇలాంటి సినిమాలు తీశావంటే నిన్ను ఎన్కౌంటర్ చేస్తా’ అని బెదిరించాడు. ‘మీరు నన్నేం చేయలేరు’ అని మొహం మీదే చెప్పి వచ్చేశా. కొన్నిసార్లు నా సినిమా షూటింగులకు కూడా పర్మిషన్లు వచ్చేవి కావు. వ్యాపార దృక్పథంతో ఆలోచించకుండా నమ్మిన సిద్ధాంతం ప్రకారం సినిమాలు తీస్తున్న మీకు... ధైర్యంగా స్నేహ హస్తం అందిస్తూ,, సాయం చేస్తున్న ఆ మిత్రులు ఎవరు? ఆర్.నారాయణమూర్తి: నా కాలేజ్‌మేట్స్‌తో పాటు, పలువురు చిత్ర ప్రముఖులు కూడా ఉన్నారు. అది పెద్ద లిస్ట్. విప్లవాత్మక చిత్రాలే తీయడం వల్ల... నారాయణమూర్తికి నక్సల్స్‌తో సంబంధం ఉందని, ఆయన సినిమాలకు నిధులు అక్కడ్నుంచే వస్తాయని మీపై ఓ టాక్ ఉంది. ఆర్.నారాయణమూర్తి: చూడండీ... ఎవరైతే ప్రజల కోసం జీవితాలను త్యాగం చేసి, ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, అనన్యసామాన్యంగా పోరాటం చేస్తూ... పీడిత ప్రజలకు అండగా నిలుస్తున్నారో... ఆ ఉద్యమకారులంటే నాకెంతో గౌరవం. అందుకే నేను తీసిన కొన్ని సినిమాల్లో వాళ్లు హీరోలయ్యారు. ఒక్క నక్సల్స్‌నే హీరోలను చేసి నేను సినిమాలు తీయలేదు. ఎవరైతే... అన్యాయానికి ఎదురుతిరిగి పోరాటం చేస్తారో... వాళ్లనే హీరోలుగా చేసుకొని సినిమాలు తీశాను. దూబగుంట రోశమ్మ.. నా హీరోయిన్, నిర్భయ.. నా హీరోయిన్, ఢిల్లీలో పోరాడిన యువతరం నా హీరోలు. నేను అందరికీ చెప్పేది ఒక్కటే. బిఫోర్ ఇండిపెండెన్స్.. భగత్‌సింగ్ నా హీరో అయితే... ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఉద్యమకారులు నా హీరోలు. ఇక అన్నల దగ్గర్నుంచి డబ్బులు తీసుకోవడం అంటారా... అది పచ్చి అబద్దం. వాళ్లతో మీకు ఎలాంటి సంబంధాలు లేవా? ఆర్.నారాయణమూర్తి: మీకూ నాకు సంబంధం లేదా? చెప్పండి. నిజానికి ఆ మహానుభావులతో సంబంధం ఉండటం అదృష్టం. అజ్ఞాతంగా యుద్ధం చేస్తున్న ఆ మహనీయులకు మనం రుణపడి ఉన్నాం. ఇండస్ట్రీకి వచ్చాక ఆస్తులు ఏమైనా కొన్నారా? ఆర్.నారాయణమూర్తి: మేం నలుగురు అన్నదమ్ములం. అక్కచెల్లెళ్లు ముగ్గురు. మా ఊళ్లో చింతపల్లి నరసింహారావుగారని ఓ పెద్దాయన ఉండేవాడు. ఆయన పొలాన్నే నాన్న కౌలు చేసేవారు. అందరం కలిసి కష్టపడి, ఇప్పుడు అదే పొలాన్ని కొనుకున్నాం. అదే నా ఆస్తి! సిల్వర్‌జూబ్లీ సినిమాలు తీశారు. ఆ లాభాలు ఏం చేశారు? ఆర్.నారాయణమూర్తి: అనేక చోట్ల కాలేజీలకు ఫండ్లు ఇచ్చా. హస్పిటల్స్, పీపుల్స్ కమిటీ హాల్స్ కట్టించా. బోర్లు వేయించా. ఇదంతా గుచ్చి గుచ్చి అడుగుతున్నారు కాబట్టే చెబుతున్నా. కానీ ఊరు, పేరు మాత్రం చెప్పను. అది నా భావాలకు విరుద్ధం. ప్రజల ద్వారా నాకు సంక్రమించింది ప్రజలకే చెందాలనేది నా అభిమతం! అలాగే... నా మిత్రులు నాకు ఆర్థికంగా చాలాసార్లు సహాయం చేశారు. వారందరి అప్పులూ తీర్చేయాలి. నా ప్రధాన లక్ష్యం ఇప్పుడు అదే. బాకీలు తీర్చాలంటే మీరు సినిమాలే తీయనవసరం లేదు. బయట చిత్రాల్లో పాత్రలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే.. లక్షలివ్వడానికి దర్శక, నిర్మాతలు రెడీగా ఉన్నారు. ఆర్.నారాయణమూర్తి: ఒక్కటి చెబుతా వినండి బ్రదర్. నా రెమ్యునరేషన్ పైసానా, కోటి రూపాయలా అనే విషయాన్ని పక్కన పెట్టండి. యాక్టింగ్ అనేది ఇష్ట ప్రకారం చేసే పని. జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి హీరో స్థాయికి ఎదిగా. మళ్లీ ఒక్కడుగు కూడా వెనక్కు వేయను. ‘ఆర్.నారాయణమూర్తి ఫిల్మ్’ అనే స్థాయికి వచ్చా. ఆ మార్క్‌ని కాపాడుకోవడమే నా లక్ష్యం. ఇప్పటికి పాతిక సినిమాలు తీశా. అందులో పదిహేను హిట్లు. అది మూములు విషయం కాదు. ఒకానొక దశలో నా సినిమాల బాటలోనే అందరూ నడిచారు. అందుకే జనాలు మొనాటనీ ఫీలయ్యారు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయాల్సిన బాధ్యత నా మీదే ఉంది. అందుకే సముద్రం ఈదుతున్నా. కచ్చితంగా ఒడ్డుకు చేరతా. వామపక్ష భావజాలంతో ఉండే మీరు దేవుడు గుడి కనిపిస్తే మొక్కుతారు. ఈ భిన్నత్వం ఏంటి? ఆర్.నారాయణమూర్తి: కారల్ మార్క్స్ అంతటి వారు కూడా దేవుడు లేడని చెప్పలేదు. నేను భారతీయుణ్ణి. ముఖ్యంగా హిందువుని. ఆ సంప్రదాయాల మధ్య పుట్టి పెరిగిన వాణ్ణి. చెట్లలో, పుట్టలలో, గట్టులలో చివరకు విష సర్పాల్లో కూడా దైవాన్ని చూసే గొప్ప సంస్కృతి మనది. ఆ సంస్కృతిని ఆకళింపు చేసుకున్నాను కాబట్టే నాకు దేవుడంటే నమ్మకం. చిన్నప్పుడు మా ఇంటి నుంచి స్కూల్‌కి వెళ్లాలంటే ఏడు కిలోమీటర్లు నడిచేవాణ్ణి. మధ్యలో ఓ కొండ ఉండేది. ఆ కొండపై దెయ్యం ఉందనేవారు. రోజూ భయపడుతూ వచ్చేవాణ్ణి. ఓ రోజు అమ్మ చెప్పింది. ‘కొండ దగ్గరకు రాగానే ‘జై భజరంగబళి’ అనుకో... ఏ భయం ఉండదు’ అని. ఆ కొండ దగ్గరకు రాగానే ‘జై భజరంగబళి’ అనుకునేవాణ్ణి. ఎక్కడలేని ధైర్యం తన్నుకొచ్చేది. ఇంకా మాట్లాడితే... అక్కడ కాసేపు ఆగి... కొండవైపు పొగరుగా చూస్తూ... ‘జై భజరంగబళి’ అనేవాణ్ణి. నిజంగా దెయ్యాలనేవి ఉంటే... నా ధైర్యాన్ని చూసి పారిపోయేవి. ఆ ధైర్యమే దేవుడు. మీరు పెళ్లెందుకు చేసుకోలేదు? ఆర్.నారాయణమూర్తి: బ్రదర్.. వయసొచ్చినప్పట్నుంచీ ఉద్యమాలే ఊపిరిగా బతికా. నడుస్తున్న సూరీడులా ఉండేవాణ్ణి. పెళ్లి విషయంలో కూడా నాకంటూ కొన్ని కచ్చితమైన అభిప్రాయాలుండేవి. అవి నా భావాలకు అనుగుణంగానే ఉండేవి. దానికి పెద్దలు ఒప్పుకోలేదు. నేను అభిప్రాయం మార్చుకోలేదు. చివరకు ఒంటరిగా మిగిలిపోయా. మరి ఇండస్ట్రీకి వచ్చాక కూడా ఎవర్నీ ఇష్టపడలేదా? ఆర్.నారాయణమూర్తి: అన్నా.. వదిలేసెయ్యే.. ఉహ తెలిసినప్పట్నుంచీ అనేక మంది అమ్మాయిల్ని చూసి ఇష్టపడతాం. అలాగే అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని చూసి ఇష్టపడతారు. అది కామన్. అయితే.. ఇక్కడ కొన్ని ఎథిక్స్ ఉంటాయి. కట్టుబాట్లు, ఆచారాలు ఉంటాయి. వాటిని గౌరవించుకోవాలి. గౌరవించకపోతే నేను ‘నిర్భయభారతం’ తీయడంలో అర్థం లేదు. పెళ్లి అవసరం అప్పటికంటే.. ఇప్పుడే మీకు ఎక్కువ. ఆర్.నారాయణమూర్తి: నాకు తెలుసు. కానీ... 60 ఏళ్లు వచ్చేశాయి. పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే మనసులో లేదు. సరే... మరి భోజనం సంగతేంటి? ఆర్.నారాయణమూర్తి: హోటళ్లు ఉన్నాయిగా.. భోజన ప్రియులైన మీరు ఎన్నాళ్లు తింటారు హోటల్లో? ఆర్.నారాయణమూర్తి: అలవాటైపోయింది సోదరా... మరి బస? ఆర్.నారాయణమూర్తి: కృష్ణానగర్‌లో రూమ్ తీసుకున్నా. వీవీఐపి అయిన మీరు కృష్ణానగర్‌లో. అదీ అద్దె ఇంట్లో... ఆర్.నారాయణమూర్తి: మద్రాసులో పాండీబజార్ ఎంత గొప్పదో, హైదరాబాద్‌లో కృష్ణానగర్ అంత గొప్పది సోదరా. ఆ కృష్ణానగర్‌తల్లికి వందనం. వేలాది మంది సినీకార్మికులకు ఆసరాగా నిలిచింది మహాతల్లి. ఒక్కోసారి షేర్ ఆటో ఎక్కుతుంటా. ‘సార్.. మా జన్మ ధన్యమైంది’ అంటుంటారు పక్కన కూర్చున్నోళ్లు. ‘మీ పక్కన కూర్చోవడం వల్ల నా జన్మ ధన్యమైంది...’ అని నేను అంటుంటా. అప్పుడు చూడాలి వాళ్ల ఆనందం. నిరంతరం జనం బాగుకోసం తాపత్రయపడే మీరు.. రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు? ఆర్.నారాయణమూర్తి: అన్నా.... నాకు కాకినాడ నుంచి మూడు సార్లు ఎంపీ ఆఫర్లు వచ్చాయి. తుని నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే ఆఫర్లు వచ్చాయి. కానీ నేను వెళ్లలేదు. ఎందుకంటే... నేను వెళితే... సదరు పార్టీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. అది నాకు చేతకాదు. అయినా... నేను సినిమాలు తీస్తుంది ప్రజలకోసమే కదా. మీలాంటి నిస్వార్థపరులు రాజకీయాల్లోకొస్తే.. ప్రజలకు నిజంగా మంచి జరుగుతుంది కదా... ఆర్.నారాయణమూర్తి: నీ ప్రేమకు అభిమానానికీ వందనమే... కానీ నేను పాలిటిక్స్‌లోకొస్తే... నాకు లాల్బహుద్దూర్ శాస్త్రిగారిలా ఉండాలని ఉంటుంది. పుచ్చలపల్లి సుందరయ్యలా బతకాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు అదెంత సాధ్యమంటారు! అయినా... నాకింకా సినిమా పిచ్చిపోలా! - బుర్రా నరసింహ మా గురువుగారు నన్ను పీపుల్స్ స్టార్ అంటారు... అది భారతరత్నకంటే గొప్ప బిరుదు! గ్లామర్, కరెన్సీ, లగ్జరీ... సినీ సెలబ్రిటీ జీవితం ఇదే. కానీ మీరు అందుకు భిన్నం. సెలబ్రిటీ అయ్యుండి ఈ సాధారణమైన జీవితం ఏంటి? ఆర్.నారాయణమూర్తి: చూడన్నా... బంగళాలు కొనుక్కోవాలన్నా, కార్లల్లో తిరగాలన్నా... మీరంటున్న సోకాల్డ్ లగ్జరీ లైఫ్ అనుభవించాలన్నా నాకది పెద్ద సమస్యేం కాదు. స్విల్వర్ జూబ్లీ సినిమాలు తీసినోణ్ణి నేను. నా సినిమాలు రికార్డులు సృష్టించాయి. అలాంటి నేను అవన్నీ కొనుక్కోలేనా? నేను ఇలా ఓ సాధారణమైన జీవితం గడపడానికి కారణం నా ‘మెంటాలిటీ’. చిన్నప్పట్నుంచీ నేను ఇంతే. నా అభిరుచుల్ని, అభిప్రాయాల్ని, మనోభావాల్ని మార్చుకోలేని అశక్తుణ్ణి. పదిమందీ నన్ను చూసి గొప్పగా చెప్పుకోవాలని నేను ఇలా ఉండను. ఇలా బతకడమే నాకిష్టం. కాలేజీ రోజుల్లో కూడా నాకు రెండే జతల బట్టలుండేవి. ఇప్పటికీ అంతే. నా రూమ్‌లో చాప, దిండు మాత్రమే ఉంటాయి.. వేప పుల్లతో పళ్లు తోముకుంటా. సబ్బుతో స్నానం చేయను. మొహానికి పౌడర్ రాయను. నా స్వభావం ఇది. చెట్లకింద కూర్చోడం, జనంతో మమేకమవ్వడం.. ఇవే నాకు ఆనందాన్నిచ్చేవి. ఎవరో ఏదో అనుకుంటారని నా స్వభావాన్ని మార్చుకోలేను. ఇక గ్లామర్ అంటారా... నాకు గ్లామర్ లేకపోతే... నా ఇంటర్వ్యూ మీకెందుకు? ? చెప్పండి. సినీరంగంలో ‘అన్న’ అంటే ఎన్టీఆర్. ఆయన తర్వాత అన్నా అని నన్నే అంటారు. ‘మా ఆకలి బాధల్ని కళ్లకు కడుతున్నావ్ బిడ్డా...’ అంటూ ఈ రోజున తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు నన్ను గుండెలకు హత్తుకుంటున్నారు. ఇంతకు మించిన గ్లామర్ ఏం కావాలి? మా గురువుగారు నన్ను ‘పీపుల్స్ స్టార్’ అన్నారు. నాకు భారతరత్నకంటే గొప్ప బిరుదు అది. ‘జననాట్యమండలి గజ్జ ఆగిన చోట... ప్రజల గళాన్ని వినిపిస్తున్నాయి నారాయణమూర్తి సినిమాలు’ అన్నాడు గద్దరన్న. ఇంతకు మించిన కాంప్లిమెంట్ ఉంటుందా? స్వదేశీ భారతి అనే ప్రఖ్యాత బెంగాలీ రచయిత ఆయన రాసిన ‘ఆరణ్యక్’ బుక్‌పై ముఖచిత్రంగా నా బొమ్మ వేశాడు. పూరిజగన్నాథ్ తన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రాన్ని నాకు అంకితమిచ్చాడు. ఇంతకు మించిన గౌరవం ఉంటుందా? నాకు ఈ తృప్తి చాలు. ‘దేవుడు నన్ను అన్ని విషయాల్లో కింగ్‌ని చేసి ఆ ఒక్క విషయంలో అన్యాయం చేశాడు..! ఇంటికెళ్లగానే.. ఒంటరితనం కమ్మేస్తుంది. అప్పుడనిపిస్తుంది. ‘నిజంగా తోడు తోడే’ అని. జ్వరం వచ్చినప్పుడు పలకరించే నాథుడు లేకుండా ఒంటరిగా ముడుచుకొని పడుకొని ఉంటాను చూడండీ... అప్పుడనిపిస్తుంది. తోడులేని నా జీవితం కూడా ఓ జీవితమేనా అని. ఏ గోంగూరో, లేక చేపల పులుసో తినాలనిపించినప్పుడు, అవి హోటల్లో దొరకనపుడు... అదే నాకంటూ ఓ భార్య ఉంటే వండి పెట్టేది కదా అనిపిస్తుంది. ‘దేవుడు నన్ను అన్ని విషయాల్లో కింగ్‌ని చేశాడు. ఈ ఒక్క విషయంలో ఎందుకు అన్యాయం చేశాడు’ అనుకుంటుంటా. ఒక్కోసారి ఇంటి టైపై కూర్చుంటా. రెండు పక్షులు ఎగరడం నాకంట పడితే... వాటివంకే చూస్తుంటా. ‘వాటికీ ఓ గూడు ఉండి ఉంటుంది. చివరకు అడవిలో తిరిగే మృగాలకు కూడా తోడూ, నీడా ఉంటాయి. మరి నా కెందుకు లేవు. పిచ్చోణ్ణి... నాకెందుకు ఇంత అన్యాయం చేశాడు దేవుడు’ అని బాధపడ్డ సందర్భాలు కోకొల్లలు. కాబట్టి నేటి యువతకు నేను చెప్పేది ఒక్కటే. ‘మేం సెటిల్ అవ్వలేదు. అయ్యాక పెళ్లి చేసుకుంటాం’ అనే ధోరణి మానండి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. చక్కగా పెళ్లి చేసుకోండి. చక్కని సమాజానికి నాంది పలకండి. పేరుప్రఖ్యాతుల కోసం మాత్రమే జీవించేవాడికి మానసిక శాంతి ఉండదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. -
ఆడకూతుళ్ల కోసం పోరాడేదెవరు?
‘‘ఢిల్లీలో ఓ ఆడకూతురిపై బస్‌లో చేసిన అఘాయిత్యం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఎర్రకోట సాక్షిగా జరిగిన దుర్మార్గం అది. పైగా దేశరాజధాని. దాంతో మీడియా కూడా ఆ చర్యపై తీవ్రంగా స్పందించింది. జనాగ్రహ జ్వాలలతో పార్లమెంట్ అట్టుడికింది. కానీ... అలాంటి ఆఘాయిత్యాలే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ చాలా చోట్ల జరుగుతున్నాయి. గ్రామాల్లో, కుగ్రామాల్లో, తండాల్లో చివరకు నాగరిక పట్టణాలలో కూడా పసిపిల్లలని కూడా చూడకుండా కామాంధులు తెగబడుతున్నారు. వారిని ప్రతిఘటించేదెవరు? ఆడకూతుళ్ల తరఫున నిలబడి పోరాడేదెవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే నా ‘నిర్భయ భారతం’ ’’ అన్నారు నట దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి. ఆయన స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బుధవారం నారాయణమూర్తి విలేకరులతో మాట్లాడారు. ‘‘అమ్మ ఒక స్త్రీ. మనం నిత్యం కొలిచే ఆదిపరాశక్తి ఓ స్త్రీ. చివరకు ప్రకృతిని కూడా మనం స్త్రీతోనే పోలుస్తాం. అలాంటి స్త్రీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగిన రోజునే మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అన్నాడు మహాత్ముడు. కానీ పట్టపగలే ఆడది తిరగలేని పరిస్థితి. మన పూజనీయ గ్రంథాలైన రామాయణ, మహాభారతాలు మనకు చెప్పింది ఒక్కటే. కామాంధులను తెగనరకమని. చర్యకు తక్షణమే ప్రతిచర్య కావాలని. సీతను రావణుడు ఎత్తికెళితే... రాముడు వేపచెట్టుకు మొక్కలేదు. వానరసేనను కూడగట్టి, జలధిని దాటి మరీ వెళ్లి రావణుడి పది తలలు నరికాడు. నడి సభలో కౌరవులు ద్రౌపది వలువలూడదీస్తుంటే... పాండవులు భీష్ముణ్ణి ప్రాధేయపడలేదు. ఆ ఆఘయిత్యం చేసిన వాళ్లనే కాదు, చూసిన వాళ్లను కూడా మట్టిలో కలిపేశారు. మన గ్రంధాలు చెప్పిన నీతినే ఈ సినిమాలో చూపించాను. ప్రజాకవులు రాసిన పాటలు నా సినిమాకు కొండంత బలం. సెన్సార్ వారు కూడా సినిమాను అభినందించి రెండు కట్సే ఇచ్చారు. అతి త్వరలోనే పాటలను, త్వరలో సినిమాను విడుదల చేస్తాను’’అని చెప్పారు నారాయణమూర్తి.