ravela kishore babu
-
టీడీపీపై రెచ్చిపోయిన రావెల కిషోర్ బాబు
-
‘ప్రజా తీర్పు’ అంటే టీడీపీకి ఎందుకు భయం?: రావెల
సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. స్పష్టమైన ఫలితాలు మళ్లీ ఏపీలో రాబోతున్నాయన్నారు.‘‘ప్రజల నాడి, హృదయ స్పందన వైఎస్సార్సీపీ వైపు ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంటే టీడీపీ భయపడుతుంది. ప్రజా తీర్పు అంటే టీడీపీ ఎందుకు భయం?. ప్రజా తీర్పును గౌరవించడానికి, ఓటమిని స్వీకరించడానికి టీడీపీ జీర్ణించుకోలేక పోతుంది. జగన్ సీఎం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు’’ అని రావెల పేర్కొన్నారు‘‘ప్రజా తీర్పును టీడీపీ గౌరవించాలి. ఐదేళ్ల పాలన సంక్షేమం అభివృద్ధికి ప్రజలు తిరిగి పట్టం కట్టబోతున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో టీడీపీ అల్లర్లు చేయాలని చూస్తోంది. పోస్టల్ బ్యాలెట్లో అక్రమాలు చేయాలని టీడీపీ కుట్రలు చేస్తోంది. ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ పై దేశంలో ఎక్కడా లేని నిబంధనను ఏపీలో తేవాలని కుట్రలు చేశారు. ఏపీలో టీడీపీ కుట్రలు ఇకపై సాగవు. న్యాయం, ధర్మం, విజయం వైఎస్సార్సీపీ వైపు ఉన్నాయి’’ అని రావెల కిషోర్ బాబు చెప్పారు. -
బహుజన హితాయ... బహుజన సుఖాయ
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారంలో న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం లభించాలనీ, తద్వారా అంబేడ్కర్ కలలుగన్న సమ సమాజ నిర్మాణాన్ని సాధించవచ్చుననీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఒక గొప్ప సామాజిక పరివర్తనకు శ్రీకారం చుట్టారు. బహుజన కులాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేలా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను రూపొందించి, భారత దేశ సంక్షేమ పాలనా రంగంలో ఒక గొప్ప విప్లవాన్ని సృష్టించారు. అసమానతలతో నిండివున్న విద్యారంగంలో వినూత్నమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టి, పేద వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఆధునిక విద్యను అందజేశారు. పేద ప్రజల గుండెల్లో ఒక పెద్దకొడుకు స్థానాన్ని పొందిన జగనే మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని బహుజనులు ఎదురుచూస్తున్నారు.తరతరాలుగా భారత దేశంలోని నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ వలన అణచివేయబడిన వారికి రాజ్యాధికారం సాధించాలని 1935లో ఇండియన్ లేబర్ పార్టీని స్థాపించి జీవితకాలం ఆ రాజ్యాధికార సాధనే లక్ష్యంగా పని చేశారు అంబేడ్కర్. తరువాత కాలంలో ఆ ఆశయ సాధన కోసం మాన్య కాన్షీరాం బహుజన కులాలను ఐక్యం చేయడానికి 1975లో బ్యాక్వార్డ్ క్లాసెస్ అండ్ మైనారిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (బాంసెఫ్) స్థాపించి లక్షలాది మందని సమీకరించారు. వారికి అంబేడ్కరిజాన్ని బోధించి, వారిని భారతదేశ రాజకీయ భవిష్యత్తును మార్చడానికి సమాయత్తం చేశారు. 1985లో కాన్షీరాం బహుజన సమాజ్ పార్టీని స్థాపించి పదేళ్లలోనే దాన్ని జాతీయ పార్టీగా తీర్చిదిద్దారు. భారత దేశ రాజకీయాలలో కాన్షీరాం తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారంలో తమకు రావలసిన న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం లభించాలనీ, తద్వారా అంబేడ్కర్ కలలుగన్న సమ సమాజ నిర్మాణాన్ని సాధించవచ్చుననీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (జగనన్న) ఒక గొప్ప సామాజిక పరివర్తనకు శ్రీకారం చుట్టారు. బహుజన కులాలలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతూ వారిని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేలా పెద్ద ఎత్తున అనేక సంక్షేమ పథకాలను రూపొందించి, భారత దేశ సంక్షేమ పాలనా రంగంలో ఒక గొప్ప విప్లవాన్ని సృష్టించారు. ‘నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ’లంటూ బహుజన కులాలను సొంతం చేసుకొని వారిలో ఆత్మ న్యూనతా భావాన్ని తొలగించి మనోబలాన్ని, నూతన ఉత్సాహాన్ని నింపారు.కనీస గుర్తింపునకు నోచుకోని బీసీ కులాలను గుర్తించి, 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున చైర్మన్, డైరెక్టర్ పదవులను బీసీలకు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానిదే. ఇవ్వాళ వైఎస్సార్సీపీ తరఫున 11 మంది రాజ్యసభ సభ్యులుండగా వారిలో నలుగురు బీసీలు ఉండటం గమనార్హం. అసెంబ్లీ స్పీకర్, శాసన మండలి చైర్మన్, శాసన మండలి డిప్యుటీ చైర్మన్, మంత్రి పదవులను బీసీలకు కేటాయించి వారికి రాజకీయంగా సముచిత స్థానాన్ని కల్పించడం జరిగింది. 70 శాతం జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మైనారిటీలకి కేటాయించడం అనేది బహుజన కులాల పట్ల జగన్ చిత్తశుద్ధి, అంకిత భావాలను సూచిస్తుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయనటువంటి అనేక సంక్షేమ పథకాలను బహుజన పేదవర్గాల సాధికారత కోసం అమలు చేస్తూ ‘బహుజన సుఖాయ బహుజన హితాయ’ అనే మౌలిక సూత్రాన్ని పాటించడం జగన్ మానవతా, సమతావాదాన్ని ప్రతిబింబిస్తుంది. అక్షరాలా రూ.2.70 లక్షల కోట్ల నిధులను అనేక సంక్షేమ పథకాల ద్వారా నేరుగా బహుజన వర్గాల లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో దళారులతో పని లేకుండా పారదర్శకంగా జమ చేయడం సంక్షేమ రంగంలో ఒక నూతన విప్లవాత్మక సంస్కరణగా చెప్పుకోవచ్చు. దీనికి అదనంగా పరోక్షంగా రూ.1.30 కోట్లను గృహనిర్మాణం వంటి ఇతర సంక్షేమ పథకాల కోసం వినియోగించడం కూడా గమనించగలం. అసమానతలతో నిండి వున్న విద్యారంగంలో వినూత్నమైన సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టి, పేద వర్గాల విద్యార్థులకు నాణ్యమైన మేలైన ఆధునిక విద్యను అందజేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే. ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణకు రూ.73,000 కోట్లు వెచ్చించి వాటిని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించేందుకు రూ.46,000 కోట్లను అమ్మఒడి పథకం ద్వారా అందించడం మరో గొప్ప అడుగు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం, డిజిటల్ విద్యాబోధన, విద్యార్థులకు ట్యాబుల పంపిణీ వంటివి అమలు చేసి పేద విద్యార్థుల ప్రగతికి బంగారు బాటలు వేయడం జరిగింది. అర్హులైన పేద విద్యార్థుల విదేశీ విద్యకోసం ఒక్కొక్కరికి 1.25 కోట్ల రూపాయల వరకు వెచ్చించడం ఒక అద్భుతమైన అవకాశంగా గుర్తించాలి.బహుజన పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సదుపాయాలను కల్పించడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరణ చేయడం, కావలసిన నూతన వైద్య పరికరాలను సమకూర్చడం, తగినంత మంది వైద్య సిబ్బందిని నియమించడం, సమర్థవంతమైన పర్యవేక్షణతో మెరుగైన సేవలు అందించడం వంటి అనేక చర్యలను వైసీపీ ప్రభుత్వం తీసుకొంది. ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత విస్తృత పరిచి, ఒక వ్యక్తికి వెచ్చించే గరిష్ఠ పరిమితి ఖర్చును 25 లక్షలకు పెంచారు. ఉచిత కంటి పరీక్షలు, విలేజ్ మరియు వార్డు క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్లు, సంచార హాస్పిటల్స్ వంటి అనేక నూతన పథకాల ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం ఎంతో ఆదర్శవంతమైంది.సొంత ఇల్లు కావాలనే పేదల స్వప్నాన్ని సాకారం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి, 31 లక్షల మందికి ఇళ్ళను నిర్మించి ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. ఈ కాలనీలలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించి, కుల వివక్ష అనే సామాజిక మహమ్మారికి తావు లేకుండా సకల జనుల సహజీవనానికి నాంది పలికింది. నా అన్నవారు లేక ఆర్ధికంగా నిస్సహాయ స్థితిలో వుండే వృద్ధులకు నెలకు రూ.3,000 పెన్షన్ రూపంలో వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఇంటి వద్దనే ఇచ్చే పద్ధతిని అవలంబించడం అనేది నిజంగా ఒక గొప్ప పథకం. మానవతా దృక్పథంతో వృద్ధులకు జగన్ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం భారతదేశానికే ఒక ఆదర్శంగా నిలిచింది. 66 లక్షల మంది వృద్ధుల జీవితాల్లో వెలుగు నింపి వారి గుండెల్లో ఒక పెద్దకొడుకు స్థానాన్ని శాశ్వతంగా పొందడం జగనన్నకే దక్కింది.మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించి ప్రభుత్వ పరిపాలనను గ్రామ స్థాయికి తెచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని చెప్పాలి. గ్రామ సచివాలయాలు గ్రామ పరిపాలనకు కేంద్ర బిందువుగా మారి అన్ని రకాల పౌర సేవలను అందిస్తూ ప్రజల వద్దకు పరిపాలన అన్న ఉన్నత ఆశయాన్ని సాధించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విజయవంతమైంది. గ్రామాలలో నివసించే రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా మెరుగైన సేవలను అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దింది. సమాజంలో అన్ని రకాల అణచివేతకు, అవమానాలకు గురి అయిన స్త్రీ జాతి సాధికారతకు, రక్షణకు, ఆత్మ గౌరవానికి అనేక సంక్షేమ పధకాలలో పాటు ‘దిశ’ పోలీస్ స్టేషన్ల వ్యవస్థను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి నైపుణ్యాల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా అనేక చర్యలు తీసుకొని నిరుద్యోగ సమస్యను సమర్థవంతంగా జగన్ ప్రభుత్వం పరిష్కరించింది. ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారానే 2.5 లక్షల ఉద్యోగాలను, ఆ యా రంగాలలో మరొక 2.5 లక్షల ఉద్యోగావకాశాలను కల్పించి మొత్తం 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలను కల్పించడం జరిగింది. నాలుగు నౌకాశ్రయాలు, 14 సముద్ర పోర్టులు, ఒక పెద్ద విమానాశ్రయం, 17 మెడికల్ కాలేజీల వంటి అనేక ప్రాజెక్టులను చేపట్టి ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం అందరికీ తెలిసిన విషయమే.బహుజనుల కోసం తన జీవితాన్ని అంకితం చేయడానికి జగన్ సిద్ధంగా ఉన్న విషయం గ్రహించిన బహుజనులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మరలా ఆయన్నే ముఖ్యమంత్రిగా చూడాలనీ, సమసమాజం నిర్మాణం జరగాలనీ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.రావెల కిషోర్ బాబు వ్యాసకర్త మాజీ మంత్రి -
టీడీపీ అరాచకాలపై కిషోర్ బాబు ఫైర్
-
వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ రావెల...
-
ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ ప్రయత్నాలపై విమర్శలు
-
జనసేన కార్యాలయం ఖాళీ..
సాక్షి, ప్రత్తిపాడు: గుంటూరు నగర శివారులోని గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయం ఖాళీ అయింది. పార్టీ లోగోలు, పార్టీ అధినేత చిత్రాలను తొలగించకుండానే యజమానికి కార్యాలయ భవనాన్ని తిరిగి అప్పగించారు. భవన యజమాని టూలెట్ బోర్డు ఏర్పాటు చేశాడు. బార్ అండ్ రెస్టారెంట్‌కు అద్దెకు ఇస్తానని అందులో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది మార్చిలో ఈ కార్యాలయాన్ని జనసేన పార్టీ నేతలు ప్రారంభించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ముందు రావెల కిషోర్‌బాబు టీడీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే ఎన్నికల్లో జనసేన పరాజయంతో రావెల కిషోర్ బాబు పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి విదితమే. దీంతో పార్టీ కార్యాలయం కూడా ఖాళీ అయింది. అలాగే ఏపీలో పలు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ కార్యాలయాలకు టూలెట్ బోర్డులు దర్శనం ఇచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పలువురు జనసేన నాయకులు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు మూతపడ్డాయి. -
జనసేనకు గుడ్‌బై చెప్పిన రావెల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో దిగులుపడకుండా ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకొని ముందుకు వెళ్దామంటూ జనసేన పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన రెండోరోజే ఆ పార్టీకి షాక్ తగలింది. జనసేన పార్టీకి సీనియర్ నేత రావెల కిషోర్ బాబు శనివారం రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు పంపించారు. వ్యక్తిగత కారణాలతో జనసేనకు రాజీనామా చేస్తున్నట్లు రావెల ఆ లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని పార్టీ చీఫ్‌ను కోరారు. కాగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన తరఫున బరిలోకి దిగిన రావెల కేవలం 26,371 ఓట్లు సంపాదించుకోగలిగారు. ఇక్కడ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మేకతోటి సుచరిత గెలుపొంది, ఏపీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కాగా రావెల కిశోర్ బాబు కాషాయ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ పార్టీ నేతలతో మంతనాలు జరిపారని, త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన రావెల 2014 ఎన్నికల్లో ప్రతిప్తాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొంది, మంత్రివర్గంలో చోటు దక్కించుకుని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే పార్టీలో అంతర్గత విబేధాలు, వివాదాలతో పాటు కేబినెట్ విస్తరణ సందర్భంగా ఆయన మంత్రి పదవి కోల్పోయారు. ఆ తర్వాత నుంచి టీడీపీకి దూరంగా ఉన్న ఆయన...ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కేవలం తూర్పుగోదావరి జిల్లా రాజోలు సీటుతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. -
ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన మేడా మల్లిఖార్జునరెడ్డి, టీడీపీ నుంచి జనసేనలో చేరిన రావెల కిశోర్‌బాబు, బీజేపీ నుంచి జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణ రాజీనామాలకు స్పీకర్ ఆమోదముద్ర వేశారు. పార్టీ మారే సమయంలోనే ఈ ముగ్గురు తమ ఎమ్మెల్యే పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు. -
టీడీపీకి పట్టిన మైల పోయింది!
ప్రత్తిపాడు: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు రాజీనామాతో తమ పార్టీకి పట్టిన మైల పోయిందంటూ టీడీపీ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్తిపాడులోని నిమ్మగడ్డవారిపాలెం కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని శనివారం పసుపు నీళ్లతో కడిగి శుద్ధి చేసి.. క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ కుడికాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుంటుపల్లి వీరభుజంగరాయలు, నాయకుడు మమ్మూ సాహెబ్ మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రి పదవి ఇచ్చామన్నారు. అలాంటి వ్యక్తి నేడు టీడీపీకి రాజీనామా చేయడం దారుణమన్నారు. రావెల రాజీనామాతో పార్టీకి పట్టిన మైల పోయిందంటూ మండిపడ్డారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందునే.. ఎన్టీఆర్ విగ్రహాన్ని పసుపు నీళ్లతో కడిగి శుద్ధి చేశామని చెప్పారు. రావెల రాజీనామా వల్ల టీడీపీకి ఎలాంటి నష్టం లేదని టీడీపీ మండలాధ్యక్షుడు గింజుపల్లి శివరాంప్రసాద్, జెడ్పీటీసీ భాగ్యారావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.విజయ్‌బాబు తెలిపారు. ఆయన ఒంటరిగానే పార్టీని వీడారని చెప్పారు. కాగా, టీడీపీ నేతల తీరుపై దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు. మేమంటే ఇంత చిన్నచూపా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దుర్మార్గమా? దళిత ఎమ్మెల్యే అయిన రావెలను కించపరచడం దారుణం. దళితులుంటే టీడీపీకి మైల పడుతుందా? ఇదెక్కడి దుర్మార్గం. పసుపు నీళ్లతో శుద్ధి చేసి టీడీపీకి పట్టిన మైల పోయిందంటారా? ఇది దళితుల మనోభావాలు దెబ్బతీయడమే. – కోడిరెక్క కోటిరత్నం (మాల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు) -
నరంలేని నాలుక మాదిరి సీఎం మాటలు
సాక్షి, అమరావతి: నరం లేని నాలుక ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుందన్న సామెత మాదిరిగా సీఎం చంద్రబాబు ఏమైనా మాట్లాడతారని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ధ్వజమెత్తారు. మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు శనివారం జనసేన పార్టీలోకి చేరిక సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఒక రోజు బీజేపీని నెత్తికెత్తుకుంటారని, సన్మానాలు కూడా చేయించారని, తనకు నచ్చనప్పుడు తిడుతున్నారని విమర్శించారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు కాస్తయినా జ్ఞానం వచ్చి ఉంటుందని, అవకాశవాద రాజకీయాలకు దూరంగా ఉంటారనుకుని 2014లో మద్దతు పలికినట్లు తెలిపారు. ‘అవినీతి రహిత పాలన వస్తుందని ఆశించా. కానీ ఏ మూలకెళ్లినా, ఏ నియోజకవర్గానికెళ్లినా వేల కోట్ల అవినీతి, శాంతిభద్రతలు కరువైన పరిస్థితులు, కుల రాజకీయాలు, ఆడపడుచుల మీద, అధికారుల మీద ఎమ్మెల్యేలు దాడులు చేసే పరిస్థితొచ్చింది. పాలన మీద సీఎంకు పూర్తిగా పట్టు తప్పింది’ అని ధ్వజమెత్తారు. ఇప్పుడు చంద్రబాబు వయసు అయిపోతోందని ఆయన చెబుతున్నట్టుగా విజన్ 2050 ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. దళితుడిగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని సీఎం అంటున్నారని.. తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. అవినీతిలో లోకేశ్‌ది కూడా వాళ్ల నాన్న పోలికేనన్నారు. పార్టీ మారితే పదవికి రాజీనామా చేయాలి పార్టీ మారితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని.. సీఎంగారూ రావెలను చూసి నేర్చుకోండంటూ.. హితవుపలికారు. పార్టీ సభ్యతానికి రాజీనామా చేసేటప్పుడు ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలన్నారు. 2019లోనూ రావెల కిషోర్‌బాబు ఎమ్మెల్యేగా గెలుస్తారని, మంత్రి కూడా అవుతారని పవన్ చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, పసుపులేటి బాలరాజు పాల్గొన్నారు. టీడీపీలో దళితులకు పదవులిచ్చినా అధికారమివ్వరు:రావెల టీడీపీ ప్రభుత్వంలో దళిత, గిరిజనులకు పదవులు దక్కినా వాటికి సంబంధించిన అధికారాన్ని మాత్రం దక్కనీయడం లేదని మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు సంచలన ఆరోపణ చేశారు. టీడీపీలో దళిత, గిరిజన ప్రజాప్రతినిధులు అవమానాలకు గురవుతున్నారని ఆరోపించారు. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన ఆయన శనివారం జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రావెల దంపతులను పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు తనను మంత్రిని చేసినా ఆమేరకు పనిచేయనీయకుండా అవరోధాలు, ప్రతిబంధకాలు సృష్టించి.. అడుగడుగునా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. -
అందుకే టీడీపీ నుంచి బయటకు వచ్చా: రావెల
సాక్షి, విజయవాడ: అవినీతి, దుర్మార్గాలతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు దిగజారాయని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం దోపిడీస్వామ్యం, సారాస్వామ్యంగా మారిందని దుయ్యబట్టారు. శనివారం ఆయన జనసేన పార్టీలో చేరారు. ఆయనను జనసేన పార్టీలోకి సాదరంగా పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. (చంద్రబాబుకు రావెల ఝలక్) ఈ సందర్భంగా కిషోర్‌బాబు మాట్లాడుతూ.. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక టీడీపీ నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు. టీడీపీలో ఉండగా సైధ్దాంతిక విభేదాలతో ఎంతగానో నలిగిపోయానని వెల్లడించారు. టీడీపీలో పదవులు ఉంటాయి గానీ పవర్స్ ఉండవని వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవాన్ని చంపులేకపోయానని అందుకే టీడీపీకి రాజీనామా చేసినట్టు చెప్పారు. కులం పట్టింపులు లేని సమాజం కోసం పవన్ ప్రయత్నిస్తున్నారని, ఆయన చేస్తున్న పోరాటంలో సమిధగా మారేందుకు సిద్ధమని ప్రకటించారు. రావెల కిషోర్‌బాబును జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రతి నియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి: పవన్ విజయవాడ అంటేనే కుల రాజకీయాలు కేరాఫ్ అడ్రస్ అని, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన గొడవ వల్ల కుల రాజకీయాలు ఏర్పడ్డాయని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఏ నియోజకవర్గానికి వెళ్లి చూసిన కనీసం వెయ్యి కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆడపడుచులను కొట్టే నాయకులు ఎమ్మెల్యేలు కావడంతో, రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలుగుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా చెలరేగిపోతోందని దుయ్యబట్టారు. మంత్రి నారా లోకేశ్ అవినీతికి సంబంధించిన ఆధారాలు చూపించినా ఫలితం లేకపోయిందని వాపోయారు. దళితులను సీఎం చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. -
చంద్రబాబుకు రావెల ఝలక్
సాక్షి, అమరావతి : మాజీ మంత్రి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు టీడీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి లేఖ పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెల్ల కాగితంపై రాసి చంద్రబాబుకు పంపారు. కొన్ని నెలలుగా టీడీపీలో తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్న కిషోర్‌బాబు ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తూ చివరికి శనివారం జనసేన పార్టీలో చేరుతున్నారని ఆయన అనుచరులు చెప్పారు. అనుక్షణం అవమానభారం 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రావెల.. చంద్రబాబు మంత్రివర్గంలో మూడేళ్లు పనిచేశారు. తొలి రెండేళ్లు బాగానే ఉన్నా ఆ తర్వాత నుంచి పార్టీలో ప్రత్యర్థి వర్గం ఆయనపై పైచేయి సాధించి ఇబ్బందులకు గురిచేసింది. సొంత పార్టీ నేతలే వ్యతిరేకించడంతో జిల్లా రాజకీయాల్లో ఏకాకిగా మారారు. ఈ నేపథ్యంలో అవమానకరమైన రీతిలో 2017 మార్చిలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు ఆయనకు ఉద్వాసన పలికారు. మంత్రి పదవిపోయాక పార్టీలో రావెల పరిస్థితి మరింత దిగజారింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగతో కలిసి నియోజకవర్గంలో సభ నిర్వహించిన రావెల.. చంద్రబాబుపై విమర్శలు చేశారు. తన నియోజకవర్గంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు జోక్యం చేసుకుంటున్నారని, మట్టి తరలింపులో ఆయన ప్రమేయం ఉందని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ నేతలు ఆయన్ను గ్రామాల్లోకి రానీయకుండా అడ్డుకున్నారు. కొద్దిరోజుల కిందట వినాయక నిమజ్జనం ఉత్సవాల్లో పాల్గొనేందుకు వట్టిచెరుకూరు మండలం ముట్లూరు వెళ్లినప్పుడు స్థానిక టీడీపీ నేతలు దాడి చేశారు. ఆయన తలపై ఇసుకపోసి నానారభస సృష్టించారు. దీనిపై రావెల ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో రావెల జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయగా.. కమిషన్ సభ్యుడు నిజ నిర్ధారణ చేసుకుని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అయినా తూతూమంత్రపు చర్యలతో సరిపెట్టారు. పార్టీలో తనపై చూపుతున్న వివక్ష, మంత్రి పుల్లారావు వర్గీయుల వేధింపులపై చంద్రబాబుకు చెప్పేందుకు ప్రయత్నించినా రెండేళ్లుగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రావెల రాజీనామాను స్పీకర్ కార్యాలయం ధ్రువీకరించ లేదు. -
టీడీపీకి భారీ షాక్.. మాజీ మంత్రి రావెల రాజీనామా
సాక్షి, అమరావతి : ఏపీలో అధికార టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను శుక్రవారం స్పీకర్‌కు, టీడీపీ పార్టీ కార్యాలయానికి పంపారు. రావెల రాజీనామా పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇదిలావుండగా ఆయన రేపు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలిసింది. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ నుంచి తన అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లి జనసేనలో చేరనున్నారు. రైల్వే ఉద్యోగి అయిన కిషోర్ బాబు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి అనూహ్యంగా సీటు దక్కించుకుని తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎవరూ ఊహించనట్టుగా ఏపీ తొలి క్యాబినెట్లోనే సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. మరికొద్ది నెలల్లో సాధారణ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఏకంగా మాజీ మంత్రి పార్టీని వీడడంతో టీడీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. -
టీడీపీలో చలో ముట్లూరు టెన్షన్..!
సాక్షి, గుంటూరు: ప్రత్తిపాడు టీడీపీ నేతల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే రావెల, జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులు గ్రూపులుగా ఏర్పడి పరస్పరం ఘర్షణలకు దిగుతున్నారు. గత నెలలో వినాయకుని విగ్రహం వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే రావెలపై మరో వర్గం దాడికి యత్నించిన విషయం తెలిసిందే. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఓ మంత్రి ఒత్తిడితో అరెస్టు చేయకుండా వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళిత ఎమ్మెల్యేపైన దాడి జరిగి నెలరోజులు కావస్తున్నా ఇంతవరకు నిందితులను అరెస్టు చేయకపోవడంపై దళిత సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇప్పటికే జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు అందడంతో విచారణ జరిపేందుకు కమిషన్ సభ్యుడు రాములు మంగళవారం ముట్లూరు గ్రామానికి రావాల్సి ఉంది. అయితే కేంద్ర హోం మంత్రి రాజ్నా«థ్ సింగ్ పర్యటన నేపథ్యంలో బుధవారానికి వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. దళిత సంఘాలు మంగళవారం చలో ముట్లూరు కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అర్బన్ జిల్లా పరిధిలో 30 పోలీసు యాక్ట్, వట్టిచెరుకూరు మండలంలో 144 సెక్షన్ పెట్టారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో గత నెలలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహానికి పూజలు చేసేందుకు వెళ్లిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబును ఆయన వ్యతిరేక వర్గీయులు అడ్డుకుని దాడికి యత్నించిన విషయం తెలిసిందే. దీనిపై రావెల పీఏ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసి నెల కావస్తున్నా, నిందితుల్లో ఏ ఒక్కరినీ పోలీసులు అరెస్టు చేయకపోవడంపై ఎమ్మెల్యే రావెల వర్గీయులతో పాటు, దళిత సంఘాలు మండి పడుతున్నాయి. సాక్షాత్తు దళిత ఎమ్మెల్యేపై దాడి జరిగితేనే పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్య దళితులకు రక్షణ ఎక్కడిదంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇప్పటికే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడం, వారు పోలీసు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. అయితే నిందితులను అరెస్టు చేయకుండా జిల్లాలోని ఓ మంత్రితో పాటు, కొందరు ముఖ్యనేతలు పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితులను అరెస్టు చేసే వరకు న్యాయ పోరాటం చేస్తానని, అవసరమైతే రాజీనామాకైనా సిద్ధపడతానంటూ మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోవైపు రెండో వర్గం సైతం ఎమ్మెల్యే రావెల తమపై అక్రమ కేసులు పెట్టించి వేధింపులకు గురిచేస్తున్నారంటూ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఇంటి వద్ద ఆందోళనకు దిగిన విదితమే. ఇలా ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతుండటంతో జిల్లా టీడీపీ నేతలు తలలు పట్టుకుని కూర్చున్నారు. చలో ముట్లూరు పిలుపుతో ఉద్రిక్తత ఈ నేపథ్యంలో దళిత సంఘాల నేతలు మంగళవారం చలో ముట్లూరుకు పిలుపునివ్వడంతో ముట్లూరు గ్రామంతో పాటు, ప్రత్తిపాడు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు చలో ముట్లూరుకు అనుమతులు లేవని, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చలో ముట్లూరుకు అనుమతి లేదు గుంటూరు: చలో ముట్లూరు కార్యక్రమానికి పోలీసుల నుంచి ఎవరూ అనుమతులు తీసుకోని నేపథ్యంలో ఆ కార్యక్రమానికి పోలీసు అనుమతులు లేవని అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు సోమవారం విలేకరులకు తెలిపారు. ఇప్పటికే అర్బన్ జిల్లాలో పోలీస్ యాక్ట్–30 అమల్లో ఉన్న నేపథ్యంలో ధర్నాలు, ర్యాలీలు, «నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబును వినాయక చవితి వేడుకల్లో పాల్గొనడాన్ని అడ్డగించిన నేపథ్యంలో వెల్లువెత్తిన ఫిర్యాదులపై మంగళవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాములు ముట్లూరులో పర్యటిస్తారని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు కొనసాగించడం, అలాంటి కార్యక్రమంలో పాల్గొనడం నేరమని తెలిపారు. ముట్లూరు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా 144 సెక్షన్ అమలు చేస్తున్నామని వివరించారు. డివిజన్ స్థాయి బందోబస్తుతో పాటు స్పెషల్ టాస్క్‌ఫోర్స్, ఆర్మ్డ్ రిజర్వ్ బలగాలను కూడా కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. టీడీపీ హయాంలో దళితులకు రక్షణ లేదు టీడీపీ ప్రభుత్వ హయాలలో దళితులకు రక్షణలేదు. దళితుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేపై దాడికి పాల్పడినవారిని ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం దురదృష్టకరం. ఎమ్మెల్యే రావెలపై దాడికి యత్నించి నెలరోజులు గడుస్తున్నా నేటికీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గాని, టీడీపీ పెద్దలు గాని ఆ విషయంపై స్పందించలేదు. అగ్రకుల అహంకారంతో దళితులను టీడీపీ పెద్దలు చిన్న చూపు చూస్తున్నారు. దళితులకు టీడీపీ ప్రభుత్వంలో రక్షణ లేదనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ విషయాలన్నింటిని ఎస్సీ కమిషన్ సభ్యుడికి వివరిస్తాం. –చార్వాక, అంటరానితనం నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు -
కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి రావెల దీక్ష
సాక్షి, గుంటూరు : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. రావెల చేపట్టిన దీక్షకు దళిత, గిరిజన సంఘాల కార్యకర్తలు, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ సంఘీభావం ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రాత్రి ఏడు గంటల వరకూ తన దీక్ష కొనసాగుతుందని వెల్లడించారు -
నా నియోజకవర్గంలో నీ జోక్యం ఏమిటి?
గుంటూరు రూరల్: దళిత ఎమ్మెల్యేనైన తన నియోజకవర్గంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావ్? అంటూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై టీడీపీకి చెందిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు ధ్వజమెత్తారు. దళితుల భూములు అన్యాక్రాంతం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు రూరల్ మండలంలోని వెంగళాయపాలెం గ్రామంలో ఔటర్ రింగ్, కమ్యూనిటీ గృహాల సముదాయాలకు భూ సేకరణ నిమిత్తం ప్రభుత్వం ఎంపిక చేసిన రైతుల భూములను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు ఆయన వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన మనుషులు కొందరు వచ్చి.. ప్రభుత్వం ఈ భూములకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వదని తమకు ఎంతో కొంతకు విక్రయిస్తే కనీసం అదైనా దక్కుతుందంటున్నారని రైతులు వాపోయారు. తాము 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మార్కింగ్ రాళ్లు వేశారని కన్నీరుపెట్టుకున్నారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తమకు పట్టాలు ఇవ్వడం వల్లే ఈ భూములను తీసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రావెల కిశోర్‌బాబు స్పందిస్తూ.. దళిత ప్రజాప్రతినిధి నియోజకవర్గంలో ఇటువంటి దురాక్రమణలకు పాల్పడడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం 200 మంది రైతుల నుంచి 160 ఎకరాలు సేకరిస్తుంటే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాగా, మాదిగలపై ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. అధికార మదంతో అలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
వర్ల రామయ్యకు అహంకారం పెరిగింది..
సాక్షి, గుంటూరు : ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అనుచిత వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్ ... వర్ల రామయ్య వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.... ‘వర్ల రామయ్యకు పదవి రావడంతో అహంకారం పెరిగింది. వెంటనే మాదిగలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు.’ అని హెచ్చరించారు. కాగా ఆర్టీసీ బస్సులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్న ఓ యువకుడిని వర్ల రామయ్య కులం పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు రావెల కిషోర్...గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని అసైన్డ్ భూములను పరిశీలించారు. తక్కువ ధరకు భూములు ఇవ్వాలని ప్రభుత్వ ఒత్తిడి చేస్తోందని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రైతులకు ఉపాధి చూపించిన తర్వాతే వారి వద్ద నుంచి భూములు సేకరించాలని రావెల కిషోర్ అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
రావెల కిశోర్‌బాబు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు : టీడీపీలో దళిత ప్రజాప్రతినిధులకు గౌరవం లేదని, తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందని అంటూ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలోని దళిత ప్రజాప్రతినిధులకు పదవులు తప్ప అధికారం లేదని అన్నారు. ఆయన తాజాగా ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు. ‘పదవులు మావి.. పెత్తనం మాత్రం వాళ్లదా?’ అని నిలదీశారు. దళిత మంత్రులు, ఎమ్మెల్యేలకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని వాపోయారు. రావెల కిశోర్‌బాబు ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘తెలుగుదేశం పార్టీలో నా ఒక్క నియోజకవర్గంలోనే కాదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో అగ్రకుల నేతల పెత్తనమే ఎక్కువగా ఉంది. ఎస్సీ మంత్రులు, ఎమ్మెల్యేలకు పదవులు మాత్రమే ఉన్నాయి. అధికారం చెలాయించేది మాత్రం బయటి వ్యక్తులే. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని నామమాత్రపు ఎమ్మెల్యేగా చూస్తున్నారు. పెత్తనం మొత్తం అక్కడి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి విష్ణువర్థన్‌రెడ్డి సాగిస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తూ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి పదవిలో జవహర్ ఉన్నప్పటికీ పెత్తనం మొత్తం సుబ్బరాజు చౌదరి చేస్తుంటాడు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అధికారం మొత్తం అక్కడి చైర్మన్ బాపిరాజు చేతుల్లో ఉంటోంది. మంత్రి నక్కా ఆనందబాబు పదవిలో ఉండగా, వేమూరు నియోజకవర్గంలో అధికారమంతా తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా చేతుల్లోనే ఉంది. ప్రకాశం జిల్లా కొండెపిలో ఎమ్మెల్యే పదవి స్వామిది, అధికారం చెలాయించేది మాత్రం జిల్లా టీడీపీ అధ్యక్షుడు జనార్దన్. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. దాదాపు అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. కేవలం నామమాత్రపు నాయకత్వాన్ని ఇచ్చి అధికారం పక్కవాళ్లు చెలాయిస్తే దళితుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు చదువుకున్నవారు, విజ్ఞానవంతులు అంబేడ్కర్‌వాదులు రాజకీయాల్లోకి వస్తున్నారు. వీరు అగ్రకుల ఆధిపత్యాన్ని సహించే పరిస్థితుల్లో లేరు. వీరికి పదవులతోపాటు అధికారం కూడా ఇవ్వాలి. అప్పుడే ఈ పార్టీలో నాకు గుర్తింపు ఉంది, గౌరవం ఉంది, అధికారం ఉంది అనే ఆత్మవిశ్వాసంతో వారు పార్టీని ముందుకు తీసుకెళ్తారు. నా పేరు ప్రతిష్టలు దిగజార్చారు నా నియోజకవర్గం పరిధిలోని ఓబులునాయుడుపాలెం గ్రామంలో అక్రమ మైనింగ్‌లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తే ఆయన చెప్పా. ఎవరికి చెప్పినా ఉపయోగం లేకుండాపోయింది. నాకు వాటా పంపుతున్నామని ప్రచారం చేసి నా పేరుప్రతిష్టలను దిగజార్చడంతో అసలు ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు విలేకరులను తీసుకుని అక్కడికి వెళ్లా. యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరగడం చూసి ఆశ్చర్యపోయా. నారాయణస్వామి, అశోక్ అనేవాళ్లు ఇష్టం వచ్చినట్లు అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు తేలింది..’’ అని రావెల పేర్కొన్నారు. -
మంత్రికి తెలిసే అక్రమ మైనింగ్!
గుంటూరు రూరల్: తన నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తెలుసనీ, ఏడాది కాలంగా ఎన్నోసార్లు చెప్పినా ఆపలేక పోయారని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం తెచ్చినా అడ్డుకోలేదని తెలిపారు. గత ఏడాదిన్నర నుంచి రూ.100 కోట్లకు పైగా అక్రమ మైనింగ్ జరిగిందని ప్రకటించారు. గుంటూరు రూరల్ మండలం పొత్తూరు శివారు ఓబులునాయుడుపాలెం వద్ద నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ క్వారీలను ఎమ్మెల్యే రావెల బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్రమ మైనింగ్‌కు వినియోగిస్తున్న రెండు ప్రొక్లెయిన్లు, రెండు లారీలను పోలీసులకు అప్పగించారు. అనంతరం రావెల మీడియాతో మాట్లాడుతూ ఓబులునాయుడుపాలెం, పొత్తూరు, నాయుడుపేట, పేరేచర్ల, కైలాసగిరి తదితర ప్రాంతాల్లో నారాయణస్వామి, అశోక్ అనే వ్యక్తులు అజయ్ అనే వ్యక్తి ద్వారా ప్రభుత్వ, అటవీ భూముల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. -
మంత్రి ప్రత్తిపాటికి చెప్పినా...
సాక్షి, గుంటూరు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పినా తన నియోజకవర్గంలో భూ అక్రమాలు ఆగడం లేదని మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు వాపోయారు. గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడిపాలెం క్వారీల్లో బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మట్టిని అక్రమంగా తవ్వుతున్నారని, ఇప్పటికే వంద కోట్ల రూపాయల విలువైన మట్టిని తరలించారని ఈ సందర్భంగా ఆరోపించారు. మైనింగ్, రెవిన్యూ, పోలీస్ అధికారులకు మామూళ్లు అందాయని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో భూ అక్రమాలు జరగడం వల్ల తన పాత్ర ఉందని చాలా మంది అనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది దుర్బుద్ధి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. కాగా, మంత్రికి ఫిర్యాదు చేసినా అక్రమాలు ఆగడం లేదని సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి చెప్పడం ఏపీలో భారీ ఎత్తున జరుగుతున్న అవినీతి అక్రమాలకు అద్దం పడుతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
మంత్రి సోమిరెడ్డికి చేదు అనుభవం
సాక్షి, గుంటూరు : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి గురువారం చేదు అనుభవం ఎదురైంది. నేటి ఉదయం పత్తిపంటలను పరిశీలించేందుకు వెళ్లగా మంత్రి సోమిరెడ్డిని రైతులు అడ్డుకుని నిలదీశారు. ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం, కోయవారిపాలెం గ్రామాల్లో గులాబీ బారిన పడి పత్తి పంటలు నాశనమైపోతున్నాయి. దీంతో రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు, వ్యవసాయాధికారులు కలిసి పత్తిపంటలను పరిశీలించేందుకు వెళ్లారు. పంటలను పరిశీస్తుండగా పలువురు స్థానిక రైతులు పలు సమస్యలపై మంత్రి సోమిరెడ్డిని నిలదీశారు. పురుగు మందుల కంపెనీలపై వ్యవసాయ శాఖ అధికారుల నిఘా లేదని, దీంతో రైతులకు అన్యాయం జరుగుతోందంటూ మంత్రిని ప్రశ్నించారు. -
‘రావెల’ ధిక్కార స్వరం
-
‘రావెల’ ధిక్కార స్వరం
సాక్షి, అమరావతి: ఆరు నెలల నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న టీడీపీకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు తాజాగా చంద్రబాబును ధిక్కరిస్తూ మాట్లాడటం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది. చంద్రబాబు తీరును ఎండగట్ట డం, అవసరమైతే టీడీపీని వదిలేస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశ మయ్యాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం తన వందిమాగధులతో అప్పుడే ఎదురుదాడి మొదలుపెట్టింది. ఆరు నెలల క్రితం మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన కిషోర్‌బాబు అప్పటి నుంచి తీవ్ర అసం తృప్తితో ఉన్నారు. దీంతో ఆయన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగకు దగ్గరవడం, ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ తన రూటు సెపరేటని తేల్చి చెప్పారు. కృష్ణమాదిగ చేపట్టిన కురుక్షేత్ర సభకు మద్దతివ్వడంతోపాటు నేరుగా ఫ్లెక్సీల్లో కృష్ణమాదిగ ఫొటో పక్కన తన ఫొటోలను వేసినా అభ్యంతరం చెప్పలేదు. తాజాగా గురువారం తన నియోజకవర్గం ప్రత్తిపాడులో గుర్రం జాషువా విగ్రహావిష్కరణ సభకు మందకృష్ణ హాజరవ గా అందులో పాల్గొన్న కిషోర్‌బాబు ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందేనని దీనికోసం తాను రాజీనామా చేస్తానని ప్రకటించి పార్టీ అధినేతపైనే గురిపెట్టారు. మందకృష్ణను అడ్డు కుంటే రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఉలిక్కిపడిన టీడీపీ ముఖ్య నేతలు రావెలపై ఎదురుదాడి చేయించారు. రావెలతో ఎవరో మాట్లాడిస్తున్నారని, కావాలంటే రా జీనామా చేసుకోవచ్చని ఆయన సామాజిక వర్గానికి చెందిన మంత్రి జవహర్, హౌసింగ్ కార్పొరేష న్ చైర్మన్ వర్ల రామయ్య ప్రకటించారు. నా వ్యాఖ్యలు వక్రీకరించారు: రావెల గుంటూరు రూరల్ : తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి జవహర్, వర్ల రామయ్యలు పూర్తిగా వక్రీకరించారని ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు అన్నారు. వీరు చేసిన వ్యాఖ్యలు ఒక వర్గాన్ని కించపరిచేటట్లు ఉన్నాయన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రి జవహర్, వర్ల మాటలను ఖండిం చారు. కురుక్షేత్ర మహాసభను ప్రభుత్వం అడ్డుకుందన్న విషయం మాదిగల్లో బాగా నాటుకుపోయిందని.. తమను అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాదిగలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. వర్గీకరణ జీవో–25ను ప్రభుత్వం అమలుచేయడంలేదని మాదిగలు ఆవేదన చెందుతున్నారని.. అలాగే, ఇటీవల సంక్షేమ శాఖలో కీలకమైన పదవులన్నీ మాలలకే ఇచ్చారని మాదిగలు భావిస్తున్నారన్నారు. ప్రత్తిపాడులో గురువారం జరిగిన గుర్రం జాషువా విగ్రహావిష్కరణ సభలో తానుగానీ, మందకృష్ణ మాదిగగానీ ముఖ్యమంత్రిని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని రావెల స్పష్టంచేశారు. పార్టీని వీడతానని ప్రజల్లో అపోహలు కలిగేలా అధికార పార్టీ నేతలే తన గురించి వ్యాఖ్యానించడం విచారకరమన్నారు. -
రావెలకు మంత్రిపదవి ఇవ్వాలని..
గుంటూరు: రావెల కిషోర్‌బాబును మంత్రి పదవి నుంచి తొలగించినందుకు నిరసనగా ఓ అభిమాని సెల్‌టవర్ ఎక్కాడు. గుంటూరుకు చెందిన ఒక ఆటోడ్రైవర్ సోమవారం మధ్యాహ్నం అరండల్‌పేట 16వ లైను వద్ద ఉన్న సెల్‌టవర్‌పైకి ఎక్కాడు. రావెలను తిరిగి మంత్రి పదవిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. లేకుంటే కిందికి దూకుతానని బెదిరించసాగాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ సరిత అక్కడికి చేరుకుని అతని డిమాండ్‌ను పైఅధికారులకు తెలుపుతామని, కిందికి దిగాలని కోరారు. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి కిందకి దిగిరావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.