Rythu Bheema
-
ప్రాణం పోయినా.. పరిహాసమేనా?
ఈ ఫొటోలో కనిపిస్తున్నది మహబూబాబాద్ మండలంలోని గుండాలగడ్డ తండాకు చెందిన భూక్య సంత్రాలి, ఆమె కుమారుడు మహేష్. వీరి కుటుంబ పెద్ద భూక్య హసిరాం తనకున్న 5 ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి, పెసర పంటలు సాగు చేసేవాడు. ఇందుకోసం బ్యాంకులో, ప్రైవేటుగా రూ.8 లక్షల వరకు అప్పులు చేశాడు. పత్తి, పెసరకు తెగుళ్లు సోకడంతో పాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు చేతికి రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయాడు. అప్పులోళ్ల ఒత్తిడితో 2015 సెపె్టంబర్ 7న హసిరాం తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారించిన తర్వాత త్రిసభ్య కమిటీ అధికారులు వచ్చి హసిరాం కుటుంబానికి పరిహారం చెల్లిస్తామని చెప్పి వెళ్లారు. తొమ్మిదేళ్ల నుంచి ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటికీ పరిహారం అందలేదని సంత్రాలి, మహేష్ వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్: అప్పులు తీసుకుని పంటలు సాగు చేసి, నష్టాల పాలై బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాలను కనికరించే నాథుడే కన్పించడం లేదు. ఎప్పటికప్పుడు కాలం కలిసి రాకపోతుందా.. కష్టాల నుంచి బయట పడకపోతామా..అనే ఆశతో సాగు చేస్తూ, పంటలు చేతికి రాక అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన రైతుల కుటుంబాలు సాయం కోసం ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదు. దీంతో రైతు బీమా అమలుకు ముందు, రైతు బీమా అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన వేలాది మంది రైతుల కుటుంబాల పరిస్థితి నేటికీ దయనీయంగానే ఉంది. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం 2014 నుంచి 2022 వరకు 5,112 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా రు. ఇందులో రైతు బీమా అమల్లో లేని 2014–2018 సంవత్సరాల మధ్య బలవన్మరణాలకు పాల్పడిన వారు 4,125 మంది ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో 175 మంది రైతులు చనిపోయినట్లు రైతు స్వరాజ్య వేదిక (ఆర్ఎస్వీ) సర్వే చెబుతోంది. త్రిసభ్య కమిటీ నివేదికే ప్రామాణికం రైతు బీమా అమల్లో లేని జూన్ 2, 2014 నుంచి ఆగస్టు 14, 2018 మధ్యకాలంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 194 జీఓనే వర్తించేది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను విచారించేందుకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అధికారులు ఇచ్చే నివేదికే పరిహారం ఇచ్చేందుకు ప్రామాణికం. అయితే ఆ కమిటీ పంపిన నివేదికలు పరిహారం అందించడానికి ప్రతిబంధకంగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. అనేక కేసుల్లో సరైన విధంగా విచారణ జరిపి వాస్తవాలు నిర్ధారించకుండా, కూతురు పెళ్లి లేదా కొడుకు చదువు లేదా ఇంటి నిర్మాణం కోసం అప్పులు అయ్యాయంటూ నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కౌలు రైతు అయితే కౌలు కాగితాలు లేవనో, మరో కారణమో పేర్కొంటూ నివేదికలు పంపినట్లు చెబుతున్నారు. ఈ కారణాలతోనే 4,125 మందిలో కేవలం 1,600 కుటుంబాలకు మాత్రమే ఎక్స్‌గ్రేషియా అందిందని, మిగతా వాటిని తిరస్కరించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్‌గ్రేషియా రాని కుటుంబాలు ఏళ్ల తరబడి కార్యాలయాలు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండాపోతోంది. అయితే రైతు కుటుంబాలు ఇప్పటికీ ప్రభుత్వం ఆదుకోక పోతుందా, పరిహారం అందకపోతుందా అన్న ఆశతోనే ఎదురు చూస్తున్నాయి. ఇక 2018 ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో రైతు బీమా అమల్లోకి వచ్చాక అధికారులు ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబం దగ్గరికి వెళ్లడమే మానేశారు. దీంతో సొంత భూమి ఉన్న రైతుకు రైతు బీమా వస్తే వచ్చినట్టు లేదంటే లేదన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. కౌలు రైతుల సంగతేంటి..? సొంత భూమి లేని కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే 194 జీఓ వర్తించక, రైతు బీమా రాక.. ఆ కుటుంబానికి ఎలాంటి సహాయం అందడం లేదు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా కౌలు రైతులు, రైతు కూలీలకు బీమా అమలైతే వారికి కూడా 194 జీఓ వర్తిస్తుంది. 194 జీఓ ఏం చెబుతోంది? జీవో 194 వర్తిస్తే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.5 లక్షలు, అప్పుల వారందరికీ వన్ టైమ్ సెటిల్మెంట్ కింద రూ.లక్ష ఇచ్చే అవకాశం ఉంది. ఆ కుటుంబం అప్పుల నుంచి కొంత మేరకు బయట పడుతుంది. ప్రభుత్వం ఇల్లు, పెన్షన్ మొదలైన సౌకర్యాలు కల్పించనుండడంతో జీవితానికి భరోసా లభిస్తుంది. పిల్లలు చదువులు కొనసాగించేందుకు వీలవుతుంది. అయితే 194 జీవో ప్రకారం రైతు కేవలం వ్యవసాయం కోసమే అప్పు చేసినట్లుగా త్రిసభ్య కమిటీ నిర్ధారించాల్సి ఉంటుంది. పరిహారానికి సిఫారసు చేయాల్సి ఉంటుంది. అయితే మెజారిటీ కేసుల్లో త్రిసభ్య కమిటీ నివేదికలు రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా లేవని సమాచారం. కాగా పరిహారం అందని కుటుంబాలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు అధికారంలో ఉన్నందున తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. హామీ ఇచ్చిన విధంగా ఆదుకోవాలి బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఎక్స్‌గ్రేషియా కోసం ఎదురుచూస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. కొందరికి కుటుంబం గడవటం కూడా కష్టంగా ఉంటోంది. కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఈ కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ కుటుంబాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం చాలా అన్యాయం. సరైన విధంగా విచారణ జరిపించి ఆయా కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి. కౌలు రైతులను, రైతు కూలీలను వెంటనే గుర్తించి బీమా పరిధిలోకి తీసుకురావాలి. – బి.కొండల్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక సాయం కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నా.. నా భర్త ఎలవేణి వెంకటయ్య మాకున్న రెండు ఎకరాల భూమిలో వ్యవసాయ పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను చదివించేవాడు. అయితే పత్తి పంటకు నీళ్లు లేవని అప్పు చేసి రెండు బోర్లు వేశాడు. కానీ చుక్క నీళ్లు రాలేదు. దీంతో పాటు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి కోసం అప్పు చేశాడు. అసలు, వడ్డీ కలిపి రూ.6 లక్షలవడంతో వాటిని తీర్చలేననే బాధతో 2017 అక్టోబర్ 10న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడేళ్ల నుంచి పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నా. – ఎలవేణి స్వరూప, చౌటపల్లి, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా -
ఏడుపుగొట్టు రాతలు ..
-
ఏది ఉచితం? ఏది అనుచితం?
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇస్తున్న రాయితీలను, సబ్సిడీలను ఉచితాలుగా ప్రకటించి... వాటిని రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం సూచనలు, సలహాలు ఇస్తూ ప్రకటన చేసింది. ఏవి ఉచితాలో, వేటిని ఉపసంహరించుకోవాలో స్పష్టంగా చెప్పలేదు. ఉచితం అంటే పూర్తి సబ్సిడీగా ఇచ్చేది. ఎలాంటి శ్రమ, ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చేది. ఈరోజు దేశంలో 80 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన బతుకుతున్నారు. వారికి కనీస పౌష్టికాహారం అందుబాటులో లేదు. ఐదేళ్ల లోపు పిల్లలు వెయ్యికి 40 మంది మరణిస్తున్నారు. ఉత్పత్తి ధర చెల్లించి కొనుగోలు చేసే శక్తి ప్రజలలో లేదు. అలాంటి ప్రజలకు రాయితీలు ఇవ్వాలి. శ్రమ చేయడానికి శక్తిలేని వారు, వయస్సు మళ్లినవారు, ఆనారోగ్యానికి గురైన వారికి ప్రభుత్వం ఉచితంగా సహకారం అందించాలి. ప్రస్తుతం రాష్ట్రాలు చౌక డిపోల ద్వారా బియ్యం ఇస్తున్నాయి. వీటికి తోడు ఆసరా పింఛన్లు, భరోసా పింఛన్లు వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఇస్తున్నారు. వీటితోనే వీరు బతుకుతున్నారు. ఈ ఉచితాలు రద్దు చేస్తే వీరిలో చాలామంది బతకలేరు. వ్యవసాయ రంగానికి ఎరువులు, విత్తనాలు, విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పేర్లతో రాయితీలు ఇస్తున్నారు. వ్యవసా యోత్పత్తులకు పెట్టిన పెట్టుబడిని శాస్త్రీయంగా ప్రభుత్వం లెక్కించడంలేదు. చివరికి మార్కెట్లలో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక దేశంలో ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఏదో రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణగారిన ప్రజలకు సబ్సిడీల పేరుతో రాయితీలు ఇస్తూనే ఉన్నాయి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ రాయితీలన్నింటినీ రద్దు చేయాలని సలహా ఇస్తున్నది. వార్షిక తలసరి ఆదాయం దేశంలో రూ. 1,50,326గా కేంద్రం ప్రకటించింది (2021–22). అంతకు తక్కువ వచ్చిన వారు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల రాయితీలను గమనించి ఆహార సబ్సిడీ (రూ. 2,06,831 కోట్లు), ఎరువుల సబ్సిడీ (రూ. 1,06,222 కోట్లు), గ్యాస్ (రూ. 8,940 కోట్లు), పెట్రోల్ సబ్సిడీ (రూ.3.30 లక్షల కోట్లు) ఏటా ఇస్తున్నది. ఈ మధ్య రైతు కుటుంబానికి రూ. 6,000 చొప్పున కిసాన్ సమ్మాన్ పేర రూ.68,000 కోట్లు, వడ్డీమాఫీకి రూ. 19,500 కోట్లు, పంట బీమాకు రూ. 15,500 కోట్లు... మొత్తం రూ.1,03,000 కోట్లు సబ్సిడీగా ఇస్తున్నది. దళిత, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ కార్పొరేషన్లు, ఆయా వర్గాలకు 20 శాతం సీడ్‌మనీ పేర సబ్సిడీలు ఇచ్చి బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నారు. వాటితో ఉపాధి చాలామంది సంపాదించుకుంటున్నారు. రాష్ట్రాలు రాయితీలను రద్దు చేయాలంటున్న కేంద్రం ఈ రాయితీలను కూడా రద్దు చేయాల్సి ఉంటుంది! పేదలు తమ పిల్లలను బడికి పంపకుండా కూలీకి తీసుకుపోవడంతో అక్షరాస్యత పెరగడం లేదు. అక్ష్యరాస్యతను పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద కుటుంబాలకు సంవత్సరానికి ఉచితంగా రూ. 12,500 ఇవ్వడంతో వారు పిల్లలను పాఠశాలకు పంపిస్తున్నారు. ఆ విధంగా విద్య వ్యాప్తి జరుగుతున్నది. మరి ఈ సహాయాన్ని ఆపాలంటారా? కాలేజీలలోగానీ, యూనివర్సిటీలలో గానీ పేదలకు అనేక రాయితీలు ఉన్నాయి. వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ పేరుతో ఉచిత వైద్యం చేయిస్తున్నారు. ఈ ఉచితాలన్నింటినీ లెక్కవేసినా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లలో 15 శాతానికి మించవు. కానీ, కార్పొరేట్ సంస్థలు ఈ రాయితీలను రద్దు చేయాలనీ, తమకు అనుకూల విధానాలు తేవాలనీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కార్పొరేట్లకు తలొగ్గింది. సెప్టెంబర్ 2019న ఒక జీఓ ద్వారా కార్పొరేట్లు చెల్లించే 30 శాతం పన్నును 22 శాతానికి తగ్గించారు. మార్చి 2033 నాటికి 25 శాతం నుండి 15 శాతానికి తగ్గిస్తామని ప్రకటించారు. విదేశాలలో 35 నుండి 40 శాతం పన్నులు వసూలు చేస్తున్నారు. కానీ, ఇక్కడ పన్నులు తగ్గిస్తున్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటివాళ్ళు 13 రంగాలలో మోసాలు చేసి లక్షల కోట్లు ఎగనామం పెట్టారు. 2019 ఏప్రిల్ 14కు ముందు రూ. 7 లక్షల కోట్లు వారి ఖాతాల నుండి ‘రైట్ ఆఫ్’ చేశారు. నిరర్థక ఆస్తుల పేర 10 లక్షల కోట్లు రీక్యాపిటలైజేషన్ చేశారు. రూ. 2.11 లక్షల కోట్లు బెయిల్ ఔట్ కింద ఇచ్చారు. జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, ఇటలీ తదితర దేశాలలో కార్పొరేట్లపై 30–40 శాతం పన్నులు వసూళ్ళు చేయడంతోపాటు నెలవారీ వేతనాలపై పన్ను వసూలు చేస్తూ ఆహార, ఇతర సంక్షేమ సబ్సిడీలు పెద్ద ఎత్తున ఇస్తున్నారు. ఈ విషయాలు తెల్సినప్పటికీ భారత దేశంలో ఉచితాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలను రద్దుచేసి, కార్పొరేట్లకు బహి రంగంగా లాభాలు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. కేంద్రం ప్రకటించిన ‘ఉచితాల రద్దు విధానాన్ని’ ఉపసంహరించుకోవాలి. (క్లిక్: రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర) - సారంపల్లి మల్లారెడ్డి అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు -
గుడ్‌న్యూస్! రైతు బీమా నమోదు గడువు 13 వరకు పెంపు
సాక్షి, హైదరాబాద్: రైతు బీమా నమోదు గడువును ఈ నెల 13 వరకు పొడిగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గత నెల 15 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకే రైతు బీమా రెన్యువల్, కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించింది. గత నెల 15న మార్గదర్శకాలు జారీ చేసినా సైట్ తెరుచుకోడానికే మూడు రోజులు పట్టింది. పాత రెన్యువల్స్ 38.98 లక్షల ఎల్ఐసీ ఐడీలున్న రైతుల వెరిఫికేషన్‌తోపాటు, కొత్తగా అప్లోడ్ చేయాల్సిన 11.83 లక్షల మంది రైతుల వివరాలు ఇచ్చినా గడువులో పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. గడువు కేవలం 15 రోజులే ఇవ్వడం, గత నెలలో వర్షాల నేపథ్యంలో అర్హులైన 50.82 లక్షల మంది రైతు బీమా నమోదు పూర్తి స్థాయిలో కాలేదు. తాజా గడువు తేదీ ఈనెల 13 సాయంత్రం 6 గంటల వరకు ఏఈవోలు రైతు బీమా నమోదు చేయడానికి అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు నమోదు చేసుకోని రైతులు స్థానిక ఏఈవోలను సంప్రదించాలని వ్యవసాయశాఖ సూచించింది. (చదవండి: డిప్యుటేషన్ ఇష్టారాజ్యం.. ఇదేమని ప్రశ్నిస్తే ఆకాశ రామన్నల ఫిర్యాదులు తెరపైకి!) -
రైతుబీమా సొమ్ము కోసం కక్కుర్తి.. బతికుండగానే చంపేశారు!
సాక్షి, మహబూబ్‌నగర్: రైతుబీమా సొమ్ముకు ఆశపడి బతికున్న మహిళ చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం సృష్టించి, సొమ్ము కాజేసిన ఇద్దరిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రంజన్‌రతన్ కుమార్ ఆ వివరాలు వెల్లడించారు. గట్టు మండలానికి చెందిన మల్లమ్మ అనే మహిళా కూలీపనుల నిమిత్తం రాయిచూర్‌లో ఉంటోంది. ఆమె బంధువైన మాల నాగరాజు, అలమంచి రాజు(రాజప్ప)లు స్నేహితులు. తనకు డబ్బు అప్పుగా కావాలని మాల నాగరాజు, రాజును అడిగాడు. అయితే తన పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని చెప్పాడు. డబ్బు కావాలంటే మీ బంధువులది ఎవరిదైనా గట్టు రెవెన్యూ రికార్డుల్లో పొలం ఉంటే చెప్పు.. వాళ్లు మరేదైన ప్రాంతంలో ఉంటే మనకు రూ.5లక్షలు వస్తాయని చెప్పాడు. దీంతో నాగరాజుకు మల్లమ్మ గుర్తుకు వచ్చింది. ఆమె రైతుబంధు నగదు కోసం మాత్రమే ఇక్కడికి వస్తుందని రాజుకు తెలిపాడు. ఈ చర్చలో ఉండగానే అదే గ్రామంలో మాల నాగరాజు బంధువు మాల నరసమ్మ చనిపోయింది. ఇదే అదునుగా భావించిన ఇద్దరు స్నేహితులు, మాల నరసమ్మ పేరును మాల మల్లమ్మ పేరుతో అంగన్వాడీ టీచర్ శశిరేఖను తప్పుదోవ పట్టించి మరణ ధ్రువీకరణ నివేదికను పంచాయతీ సెక్రెటరీ శుభవతి వద్దకు తీసుకెళ్లారు. విచారణ చేపట్టి సర్టిఫికెట్ మంజూరు చేస్తానని చెప్పడంతో, నేను వార్డు మెంబర్‌ను నా మాటలు నమ్మరా అంటూ మాల నాగరాజు ప్రశ్నించాడు. దీంతో సరేనంటూ 2021 డిసెంబర్ 23న డెత్ సర్టిఫికెట్‌ను మంజూరు చేశారు. ఆ పత్రంతో రైతుబీమా కోసం దరఖాస్తు చేశారు. 2022 ఫిబ్రవరి 15న బీమా సొమ్ము రూ.5లక్షలు మాల నాగరాజు ఖాతాలో జమ అయ్యాయి. అనంతరం గట్టు ఎస్బీఐలో రూ.3 లక్షలు డ్రా చేసుకుని మాల నాగరాజు రూ.లక్ష, రాజప్ప రూ.2లక్షలు పంచుకున్నారు. మిగిలిన రూ.2 లక్షలు మాల నాగరాజు ఒక్కడే తీసుకోవడంతో ఇరువురికి గొడవ తలెత్తింది. ఈ క్రమంలోనే రాజప్ప జరిగిన విషయాన్ని తెలిసిన వారికి వివరించాడు. ఈ వ్యవహారం బయటికి పొక్కడంతో జరిగిన మోసంపై ఆయా పత్రికలలో ఈనెల 9న కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ మేరకు జిల్లా పోలీసు, వ్యవసాయ అధికారులు విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది. మోసానికి పాల్పడిన ఇద్దరి నుంచి రూ.5లక్షలు రికవరీ చేశామని, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. తప్పుడు మరణధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఐ ఎస్ఎం బాష, ఎస్ఐను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
కేసీఆర్ రైతుబాంధవుడు: హరీశ్
హుజూరాబాద్/గజ్వేల్: ‘రాష్ట్రానికి సీఎంగా ఉన్నా కేసీఆర్ వ్యవసాయం చేస్తున్నారు. అప్పట్లో కరువు మంత్రిగా, రవాణా మంత్రిగా, కేంద్రమంత్రిగా ఉన్నా వ్యవసాయాన్ని విడవని రైతు మన సీఎం కేసీఆర్. ఆయన రైతు గనుకనే రైతుల కష్టాలు తెలుసు. నీటితీరువా, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు, రైతుబీమా, రైతువేదికలు వంటివి ప్రవేశపెట్టిన రైతు బాంధవుడు కేసీఆర్. బీజేపీ మాత్రం రైతుల ఉసురు పోసుకుంటోంది’ అని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగిన విత్తనోత్పత్తి రైతుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ కింద వారంలోపే రూ.50 వేల రుణాలను మిత్తి సహా చెల్లిస్తామని చెప్పారు. ఇక్కడ విత్తనోత్పత్తి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు. చేనేతబీమా అమలు చేస్తాం రైతుబీమా తరహాలో చేనేత కార్మికులకు సైతం రూ. 5 లక్షల బీమాను అమలు చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహావిష్కరణ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నేతన్నల రుణమాఫీతోపాటు సబ్సిడీ ద్వారా ముడి సరుకులు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. -
రైతుబీమాకు ధరణి డేటా
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రైతుబీమా పథకం కింద ఆగస్టు 3వ తేదీ నాటికి ధరణి పోర్టల్‌లో నమోదైన పట్టాదారులు, ఆర్వోఎఫ్ఆర్ పట్టా కలిగి ఉన్న రైతుల డేటాను పరిగణనలోకి తీసుకున్నట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డేటాలోని 18–59 ఏళ్ల మధ్య వయసు గల రైతులు ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. ఒకటి కంటే ఎక్కువ గ్రామాలలో భూమిని కలిగి ఉన్నప్పటికీ ఒక రైతు ఒకే చోట నమోదుకు అర్హులని తెలిపారు. 2021–22 సంవత్సరానికి రైతుబీమా కింద మొత్తం 35.64 లక్షలమంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. -
ఆర్టీసీ సురక్ష ఆగింది
సాక్షి, హైదరాబాద్: ఈ ఇద్దరి మృతి మధ్య పక్షం రోజులే తేడా. కానీ ఒకరికి బీమా సాయం అందితే, మరొకరికి అందకపోవటానికి ఆర్టీసీ నిర్వాకమే ప్రధాన కారణం. నర్సయ్య కుటుంబానికే కాదు, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక ముందు కూడా ఉద్యోగులెవరైనా చనిపోతే ఆ కుటుంబాలకు బీమా సాయం అందే పరిస్థితి లేదు. రూ.5 లక్షల చేయూతనందించేలా రైతు బీమా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం కంటే దాదాపు ఏడాది ముందుగానే ఆర్టీసీలో పథకం ప్రారంభమైంది. ఇప్పటివరకు 1,100 ఆర్టీసీ కుటుంబాలకు అండగా నిలిచింది. ఇప్పుడా పథకం ఆగిపోయింది. దీనిపై ఉద్యోగులు, పథకం నిలిచిపోవడంతో సాయం అందకుండా పోయిన కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. అండగా నిలిచిన సురక్ష ఆర్టీసీ సహకార పరపతి సంఘం 2017లో సురక్ష పేరుతో బీమా పథకం అమలులోకి తెచ్చింది. ఆర్టీసీ ఉద్యోగుల జీతం నుంచి ప్రతినెలా 7% సంఘానికి జమ చేయటం ద్వారా సమకూరిన సీసీఎస్ నిధిని బ్యాంకులో డిపాజిట్ చేయటం ద్వారా వడ్డీ వచ్చేది. ఆ క్రమంలోనే బీమా పథకాన్ని ప్రారంభించారు. ఒక్కో ఉద్యోగికి సాలీనా రూ.1,500 ప్రీమియం చెల్లిస్తే.. ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబానికి బీమాసంస్థ రూ.5 లక్షలు చెల్లిస్తుంది. ఉద్యోగుల నుంచి పైసా వసూలు చేయకుండా ఈ పథకం ప్రారంభమైంది. ఒప్పందం కుదుర్చుకున్న బీమా సంస్థకు ప్రీమియంగా రూ.7.5 కోట్లు చెల్లించగా.. ఆ ఏడాది 220 మంది ఉద్యోగులు చనిపోవటంతో సదరు సంస్థ ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.11 కోట్లు చెల్లించింది. ఇలా వేర్వేరు బీమా సంస్థలు 1,100 కుటుంబాలను ఆదుకున్నాయి. ఏటా జూన్ ఆఖరుతో బీమా ఒప్పందం ముగిసేది. గతేడాది వారం ఆలస్యంగా ఒప్పందం జరగటంతో, గత జూలై ఏడు వరకు పథకం కొనసాగింది. కోవిడ్ వల్ల ఎక్కువమంది చనిపోగా రూ.2,750 ప్రీమియంతో ఒప్పందం కుదుర్చుకున్న బీమా సంస్థ జూలై ఏడు వరకు చనిపోయిన ఉద్యోగులకు సంబంధించి అన్ని కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది. సీసీఎస్ వద్ద నయాపైసా లేక.. జూలై ఏడుతో పథకం ముగిసిపోగా, అది కొనసాగేందుకు మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలంటే సీసీఎస్ వద్ద నయా పైసా నిల్వ లేకుండా పోయింది. డబ్బులన్నీ ఆర్టీసీ వాడేసుకోవటమే దీనికి కారణం. రూ.1,000 కోట్లకు పైగా ఏర్పడ్డ బకాయిలను ఆర్టీసీ చెల్లించకపోగా ప్రతినెలా ఇచ్చే మొత్తాన్ని ఇవ్వటం మానేయటంతో సీసీఎస్ పూర్తిగా దివాలా తీసింది. దీంతో బీమా పథకం ప్రీమియాన్ని చెల్లించే పరిస్థితిలేకుండా పోయింది. దీంతో ఏ కంపెనీతోనూ ఒప్పందం కుదుర్చుకోలేదు. దీంతో జూలై 8 నుంచి చనిపోయిన ఏడుగురు ఉద్యోగుల కుటుంబాలకు బీమా పథకం అందకుండా పోయింది. దీంతో తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఆర్టీసీ సహకరిస్తేనే.. బీమా ప్రీమియంకు కావల్సిన మొత్తాన్ని సీసీఎస్‌కు ఆర్టీసీ చెల్లిస్తే.. వేలాది మంది అల్పాదాయ కార్మికుల కుటుంబాలకు మళ్లీ బీమా సాయాన్ని పునరుద్ధరించే వీలుంది. లేదంటే ఉద్యోగులే ప్రతినెలా నిర్ధారిత మొత్తాన్ని ప్రీమియం కింద చెల్లించడం ద్వారా ఏర్పడే నిధి నుంచి ఈ సాయం అందేలా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. దీనిపై ఆర్టీసీయే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పునరుద్ధరిస్తాం సురక్ష మంచి పథకమని దీనిని పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తామని సీసీఎస్ కార్యదర్శి మహేష్ చెప్పారు. ఇప్పటికే చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కూడా సాయం అందేలా చూస్తామని తెలిపారు. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పీఎస్ నారాయణ. జనగామ బస్ డిపోలో కండక్టర్. కోవిడ్ బారిన పడి కోలుకున్నట్టే కోలుకుని ఆరోగ్యం విషమించి గత జూన్ 29న చనిపోయారు. ఆ కుటుంబానికి ఆయన సంపాదనే ఆధారం. ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్)లో బీమా పథకం అమలులో ఉండటంతో వారికి రూ.5 లక్షల సాయం అందింది. ఆ మొత్తం ఆ కుటుంబానికి ఎంతో ఉపయుక్తంగా మారింది. ఈయన పేరు నర్సయ్య. గోదావరిఖని డిపోలో డ్రైవర్. గత జూలై 14న బస్సు నడుపుతుండగానే గుండెపోటుకు గురయ్యారు. బాధతో విలవిల్లాడుతూనే ప్రమాదం జరక్కుండా బస్సును క్షేమంగా నిలిపి ప్రాణాలు వదిలారు. ఆయనది నిరుపేద కుటుంబం. కానీ ఇన్సూరెన్సు పథకం నుంచి నయాపైసా రాలేదు. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. -
త్వరలో చేనేత, మత్స్య, గౌడబీమా
హుజూరాబాద్/కమలాపూర్: టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని, త్వరలోనే రైతుబీమా తరహాలో చేనేత, మత్స్య, గౌడబీమాను ప్రభుత్వం అమలు చేయబోతోందని రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. సోమవారం హుజూరాబాద్‌లో చేనేత సంఘాలు, పారిశ్రామికుల అభివృద్ధి, సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికులు త్రిఫ్ట్ ఎంత కడితే అంతకు డబుల్ ప్రభుత్వం చెల్లిస్తోందని, అధికారులు వారిని ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి మంత్రి కేటీఆర్ రూ.70 కోట్లు విడుదల చేశారని తెలిపారు. త్వరలో చేనేత కార్మికుల సమస్యలపై సీఎం కేసీఆర్‌తో సమావేశం ఉంటుందని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు అన్నం పెట్టే వాళ్ల దిక్కా? పన్నులు వేసే వాళ్ల దిక్కా? అనేది ఆలోచించాలని కోరారు. చేనేతకు భరోసాగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మంత్రి కమలాకర్, మాజీమంత్రులు ఎల్.రమణ, పెద్దిరెడ్డి, నేతలు సమ్మారావు, స్వర్గం రవి తదితరులు పాల్గొన్నారు. నమ్మకానికి పెట్టింది పేరు టీఆర్ఎస్ నమ్మకానికి టీఆర్ఎస్, అమ్మకానికి బీజేపీ కేరాఫ్ అడ్రస్ అని మంత్రి హరీశ్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం సబ్సిడీలకు కోత లు పెడుతోందని, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెం చేసి వాతలు పెడుతోందని విమర్శించారు. సమావేశంలో సాయిచంద్ పాడిన పాటకు హరీశ్తోసహా ప్రభుత్వ విప్ సుమన్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మాజీమంత్రి పెద్దిరెడ్డి, కౌశిక్‌రెడ్డిలు స్టెప్పులేసి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. -
విద్యుత్ సంస్కరణలతో రైతులపై భారం
శాలిగౌరారం/ మోత్కూరు/చిట్యాల/ నార్కట్‌పల్లి: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యుత్ సంస్కరణలు రైతులకు భారంగా మారనున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో ఒప్పంద వ్యవసాయవిధానం అమలుకు అవకాశం కల్పించిందని, రైతులు కార్పొరేట్ వ్యవస్థలోకి వెళ్లనున్నారని దీంతో వ్యవసాయ మార్కెట్లు నిర్వీర్యమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి ఆయన శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. మోత్కూరు మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా దమ్ముంటే అటువంటి పథకాలు అమలు చేయాలని సవాలు విసిరారు. రాష్ట్రంలో కేంద్రప్రభుత్వ అధీనంలోని 6 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. సంక్షేమ పథకాల అమలుతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రాన్ని చూసి ఓర్వలేకే ప్రతిపక్ష పార్టీలు యాత్రలు చేస్తున్నాయని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. శాలిగౌరారం వెళ్తూ మార్గమధ్యంలో చిట్యాలలో రైతు కొంతం సత్తిరెడ్డి వ్యవసాయక్షేత్రాన్ని పరిశీలించి అక్కడ పండించిన వంకాయలను మంత్రి కొనుగోలు చేశారు. నార్కట్‌పల్లిలోని ఓ ఎడ్ల బండిని చూసి.. చాలా రోజుల తర్వాత చూస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. మావోయిస్టు దళ సభ్యురాలు లొంగుబాటు చర్ల: మావోయిస్టు పార్టీ దళ సభ్యురాలు, పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ రక్షణదళ గార్డు ముసికి బుద్రి అలియాస్ బీఆర్ శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ ఎదుట లొంగిపోయింది. ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా రాంపురంవాసి, గొత్తికోయ తెగకు చెందిన ముసికి బుద్రి ఆరేళ్లుగా పార్టీలో పని చేస్తోంది. ఆమె భర్త ముసికి సోమడాల్ అలియాస్ సోమనార్ కూడా ఊసూరు ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు నెలల వయసు ఉన్న బాబు ఉన్నాడు. కొంతకాలంగా రక్తహీనతతో బాధపడుతుండడంతో బుద్రి పోలీసులకు లొంగిపోయింది. -
ప్రాధేయ పడినా వినిపించుకోలేదు.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయాధికారి
మిర్యాలగూడ అర్బన్: ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కాడు. రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకున్న ఓ రైతు కుటుంబం నుంచి లంచం తీసుకుంటూ వ్యవసాయ అధికారి అడ్డంగా దొరికిపోయిన ఘటన మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. మిర్యాలగూడ మండలం కొత్తగూడం గ్రామానికి చెందిన మల్గిరెడ్డి అన్విస్‌రెడ్డి(23) ఈ నెల 5న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వ్యవసాయ భూమి అతడి పేరుపై ఉండటంతో రైతు బీమాకు అర్హులు అవుతారని, బీమా సొమ్ముతోనైనా ఆ కుటుంబం కొంత ఊరట చెందుతుందనే ఉద్దేశంతో మృతుడి మేనమామ గుండ్ర శ్రీనివాస్‌రెడ్డి ఈ నెల 16న బీమా పథకానికి కావలసిన అన్ని రకాల పత్రాలను తీసుకుని వ్యవసాయ అధికారి బొలి శెట్టి శ్రీనివాస్‌ను కలిశాడు. బీమా సొమ్ము రావాలంటే రూ.15వేలు ఇవ్వాలని.. డబ్బులు ఇస్తేనే సదరు ఫైల్ కదులుతుందని చెప్పాడు. దీంతో శ్రీనివాస్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనలతో మరోమారు సదరు అధికారితో మాట్లాడారు. చివరకు రూ.12వేలు ఇచ్చేంకు ఒప్పదం కుర్చుకున్నారు. దీంతో పక్కా ప్రణాళిక ప్రకారం శుక్రవారం పట్టంలోని నల్లగొండ రోడ్డు రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవనం సమీపంలో బాధితుడు గుండ్ర శ్రీనివాస్‌రెడ్డి నుంచి ఏఓ బొలిశెట్టి శ్రీనివాస్ రూ.12వేలు తీసుకుంటుండగా ఏబీసీ డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో అధికారులు శ్రీనివాస్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం శ్రీనివాస్‌ను వ్యవసాయ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లి అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రామ్మూర్తి, నగేష్, శివకువర్ ఉన్నారు. ప్రాధేయ పడినా వినిపించుకోలేదు మా మేనళ్లుడు ప్రమాదవశాత్తు మృతిచెందడంతో రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు బీమా కోసం ఏఓ శ్రీనివాస్‌ను కలిశాం. ఆయన రూ.15వేలు ఇస్తేనే ఫైల్ కదులుందని, లేకుంటే 4వేల పెండింగ్ ఫైళ్లలో నీ ఫైలు కూడా కలుస్తుందని చెప్పాడు. దీంతో ఏసీబీకి ఫిర్యాదు చేశాం. పేద కుటుంబ కావండంతో.. బీమా సొమ్ము వస్తే వారి కుటుంబానికి ఆసరాగా ఉంటుందని ఆశించాం. కానీ, ఇక్కడి వచ్చాక వ్యవసాయ అధికారులు లంచం అడిగి ఇబ్బందిపెట్టారు. – బాదితుడు గుండ్ర శ్రీనివాస్‌రెడ్డి -
బీమా డబ్బుల కోసం బామ్మర్ది హత్య!
భిక్కనూరు: రైతుబీమా డబ్బుల కోసం సొంత బామ్మర్దినే హత్య చేశాడంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శనివారం ఆగ్రహోదగ్రులయ్యారు. బావతో పాటు మరో ఇద్దరు నిందితుల ఇళ్లను ధ్వంసం చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం భాగిర్తిపల్లి గ్రామానికి చెందిన శేఖర్ (21) రామాయంపేట శివారులోని ఓ బావిలో శుక్రవారం శవమై కనిపించాడు. అతడి మృతికి బావ రాజశేఖరే కారణమని కుటుంబ సభ్యులు, స్థానికులు శనివారం గ్రామంలో ఆందోళనకు దిగారు. వారి ఇళ్లపై దాడి చేసి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఆందోళన విరమించాలని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు సర్దిచెప్పడంతో వారు శాంతించారు. బీమా డబ్బుల కోసమే శేఖర్‌ను అతని బావ రాజశేఖర్, మరో ఇద్దరు కలసి హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
లంచం ఇస్తేనే ఎల్ఐసీకి ఫైల్
సాక్షి, కాళోజీ సెంటర్(వరంగల్) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం అమలులో కొందరు ఉద్యోగుల తీరు కారణంగా అప్రతిష్ట వస్తోంది. ఇప్పటికే రెవెన్యూ శాఖపై పుట్టెడు కోపంతో ఉన్న రైతులు.. ప్రస్తుతం వ్యవసాయ శాఖపై కూడా అదే భావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతులకు బాసటగా నిలుస్తున్న రైతు బంధు, రైతు బీమా పథకాలకు రైతుల్లో మంచి పేరు ఉన్నా... అధికారుల తీరు దీనిని పలుచన చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన ఏఈఓ ఒకరు రైతులకు చెల్లించాల్సిన రైతు బంధు పథకం డబ్బును సొంత ఖాతాలో జమ చేసుకుని సస్పెన్షన్‌కు గురైన విషయం విదితమే. ఇక రైతు బీమా విషయంలో వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఉద్యోగి.. తాను అడిగినంత డబ్బు ఇస్తేనే పరిహారం ఫైల్‌ను ఎల్ఐసీకి సమర్పిస్తానంటూ నాన్చుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిపై విచారణ జరపగా నిజమేనని తేలినా... చర్యలు తీసుకోకుండా అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జరుగుతున్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది. పరిహారం కోసం లంచం అన్నదాతకు అండగా ఉండేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వమే బీమా ప్రీమియంను ఎల్ఐసీకి చెల్లించింది. ఏదేని జరగరాని సంఘటన జరిగి రైతు మృతి చెందితే ఆయన కుటుంబానికి బీమా సంస్థ ద్వారా రూ.5లక్షల పరిహారం అందుతుంది. అయితే, రైతు కుటుంబ సభ్యులు లంచం ఇవ్వనిదే ఉద్యోగులు జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) ఫైల్ పంపడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ) ఒకరు ఇదే తరహాలో పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయగా అధికారుల దృష్టికి వెళ్లింది. అయితే, సదరు ఉద్యోగిపై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నట్లు తెలిసింది. ఆ ఉద్యోగి మాకొద్దు... ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవసాయ విస్తరణ అధికారి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడని రైతులు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా అనేక ఆరోపణలు ఉండడంతో అధికారులు చీవాట్లు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అయినా ఆయనలో మార్పు రాకపోవడంతో వేరో చేటకు బదిలీ చేయాలని స్థానికంగా ఉండే ఓ అధికారి.. జిల్లా ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. మా దృష్టికి వచ్చింది... వ్యవసాయ విస్తరణాధికారి ఒకరు అవినీతికి పాల్పడుతున్నాడనే విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాము. ఆయన వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతున్నట్లు విచారణలో తేలింది. ఈ మేరకు తదుపరి చర్యల కోసం జిల్లా అధికారికి నివేదిక సమర్పించాం. – దామోదర్ రెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకుడు -
రైతుబీమాతో కుటుంబాలకు ధీమా
సాక్షి, మెదక్: రైతుబీమా పథకం అన్నదాత కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది. జిల్లాలోని వేలాది మంది రైతులకు మేలు జరుగనుంది. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ ఏడాది మరికొందరు కొత్తగా ఈ బీమాపథకంలో చేరే అవకాశం ఉంది. ఆ దిశగా వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతులు ప్రమాదవశాత్తు లేక ఏదైనా కారణంతో చనిపోతే వారి కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల తరఫున ఎల్ఐసీకీ బీమా ప్రీమియం చెల్లించి రూ. 5 లక్షల బీమా మొత్తాన్ని తక్షణం అందించేలా ఈ పథకాన్ని గత ఏడాది ప్రవేశపెట్టింది. రైతు కుటుంబంలో భరోసా పెంచేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని మరో ఏడాదిపాటు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీమియం పెరిగిన ప్రభుత్వం పథకం అమలును కొనసాగిస్తుంది. గతేడాదికి సంబంధించి బీమా గడువు ఈనెల 14తో ముగిసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2019 ఆగస్టు 14 నుంచి 2020 ఆగస్టు 14వ తేదీ కాలపరిమితికి ప్రీమియం రూపంలో ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.3457 చొప్పున ప్రీమియం చెల్లిస్తోంది. భూములు కలిగిన వారికి ఈ నెల 14 నుంచి 18 ఏళ్లు నిండి 59 ఏళ్లలోపు రైతుల పేర్లను నమోదు చేస్తున్నారు. ఇది నిరంతర పక్రియగా కొనసాగనుంది. 615 మంది రైతు కుటుంబాలకు పరిహారం జిల్లాలో మొత్తం 2.20 లక్షల మంది రైతులు ఉండగా వారిలో బీమా పథకానికి అర్హులైన వారు 1.8 లక్షల మందిరైతులు ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో 675 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందగా వారిలో 615 మంది రైతులకు రూ.30.7 కోట్లు పరిహారం చెల్లించారు. ఇంకా 60 మంది రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. యువరైతుల నమోదు ఇలా... రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకునే వారు 18 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల లోపు ఉండాలి. 18 ఏళ్లు నిండిన యువరైతుల పేర్లు నమోదు చేస్తారు. వీరు స్థానిక వ్యవసాయ అధికారులను కలిసి రైతుపట్టాపాస్‌బుక్ జిరాక్స్‌తో పాటు ఆధార్ కార్డు ఇస్తే సంబంధిత అధికారులు రైతుబీమాలో నమోదు చేసుకోవాలి.ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ పథకం ఒక్క ఏడాదితో ఆగేదికాదు గతేడాది ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ఏడు సైతం దాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. ఇది నిరంతర పక్రియగా కొనసాగుతోంది. 18 ఏళ్లు నిండిన రైతులు వారి పేర్లను నమోదు చేసుకోవాలి. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. – జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాం నాయక్ -
లాభం లేకున్నా... నష్టాన్ని భరించలేం!
సాక్షి, హైదరాబాద్: రైతుబీమా అమలు విషయంలో తమకు లాభం రాకపోయినా పరవాలేదు కానీ... నష్టాన్ని మాత్రం భరించలేమని ఎల్ఐసీ తెలంగాణ సర్కారుకు తేల్చిచెప్పింది. అందువల్ల రెండో ఏడాది ఏమాత్రం నష్టం రాకుండా రైతుబీమా ప్రీమియం చెల్లింపులో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే వారి కుటుంబాలకు తక్షణమే రూ. 5 లక్షల పరిహారం అందేలా గతేడాది ఆగస్టు 14 నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రారంభించి, రైతుల తరపున ఎల్ఐసీకి ప్రీమియాన్ని చెల్లించింది. ఏడాదిగా ఆ పథకం కింద తాము రైతులకు చెల్లించిన పరిహారం సొమ్ము ఎక్కువగా ఉండటంతో తమకు నష్టం వాటిల్లిందని ఎల్ఐసీ చెబుతోంది. ఈసారి అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. మొదటి ఏడాది పథకం వచ్చే నెల 13తో ముగియనుంది. రెండో ఏడాదికి మరోసారి ఎల్ఐసీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. దీంతో ప్రభుత్వంతో ఎల్ఐసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. 2018–19లో రైతు కుటుంబాలకు ఏ మేరకైతే పరిహారం చెల్లించామో, అంతే మొత్తాన్ని 2019–20 సంవత్సరానికి ప్రీమియంగా ఇవ్వాలని ఎల్ఐసీ కోరుతోంది. దానివల్ల తమకు లాభం రాకపోయినా నష్టం వాటిల్లదని చెబుతోంది. అంటే ‘నో లాస్... నో ప్రాఫిట్’ప్రాతిపదికన ఒప్పందం చేసుకోవాలనేది ఎల్ఐసీ ఉద్దేశం. దీనిపై వ్యవసాయశాఖ వర్గాలు సుముఖంగానే ఉన్నట్లు తెలిసింది. సీఎంకు విన్నవించాక తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రీమియం రూ. 704 కోట్లు.. రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 14 నుంచి ‘రైతు జీవిత బీమా’పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న రైతులకు దీన్ని వర్తింపచేస్తున్నారు. ఈ పథకంలో ప్రభుత్వం ఎల్ఐసీకి రైతుకు రూ. 2,211.50 వంతున ప్రీమియాన్ని చెల్లించింది. మొదట్లో 29.58 లక్షల మందికి గాను రూ. 612 కోట్లను చెల్లించింది. ఆ తర్వాత అర్హులైన వారు క్రమంగా బీమా పథకంలో పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం 30.97 లక్షల మంది దీని పరిధిలో ఉండగా, వారి తరపున రూ. 704.16 కోట్ల ప్రీమియాన్ని ప్రభుత్వం ఎల్ఐసీకి చెల్లించింది. 2018 ఆగస్టు 14 అర్థరాత్రి దాటిన తర్వాత నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 14,705 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందారు. వీరి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 735.25 కోట్లు ఎల్ఐసీ ద్వారా పరిహారంగా ముట్టింది. అంటే ఎల్ఐసీ తీసుకున్న ప్రీమియం కంటే పరిహారం ఎక్కువ చెల్లించాల్సి వచ్చింది. దీంతో ఎల్ఐసీకి రూ. 31.09 కోట్లు నష్టం వాటిల్లింది. వచ్చే నెల 13 వరకు గడువు ఉండటంతో అప్పటివరకు రైతులు చనిపోతే మరికొంత పరిహారం చెల్లించకతప్పదు. ఈ నేపథ్యంలో ఇది ఎల్ఐసీ పరంగా భారమవుతోందని.. ప్రీమియం విషయంలో తాము ఈ ఏడాదిలో ఎంత పరిహారం చెల్లించామో... అంతే మొత్తాన్ని వచ్చే ఏడాదికి ప్రీమియంగా చెల్లిస్తే సరిపోతుందనే ప్రతిపాదనను ఎల్ఐసీ అధికారులు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాలి. -
కొత్త పట్టాదారులందరికీ రైతుబీమా
సాక్షి, హైదరాబాద్: ఆపద సమయంలో అన్నదాతల కుటుంబాలను ఎంతగానో ఆదుకుంటున్న రైతుబీమా పథకానికి మరింత ఆదరణ పెరుగుతోంది. భూ మార్పిడి చేసుకుని, కొత్తగా పట్టాదారులైన రైతులు తమకు బీమా కల్పించాలని కోరుతూ వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)ను సంప్రదిస్తున్నారు. దీంతో కొత్త పట్టాదారు రైతులకు రైతుబీమా సౌకర్యం వెంటనే కల్పించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎల్ఐసీ వారికి బీమా ప్రీమియం చెల్లించేందుకు కొత్తగా జారీ చేసిన పట్టాదారుల వివరాలను తమ శాఖకు ఇవ్వాలని రెవెన్యూ శాఖను కోరింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సోమవారం లేఖ రాశారు. ఏఈవోలు కొత్తగా నమోదైన పట్టాదారుల వివరాలను, నామినీ పత్రాలను తీసుకుని బీమాలో నమోదు చేస్తారని పార్థసారథి లేఖలో పేర్కొన్నారు. రైతు బీమాకోసం ఎల్ఐసీతో చేసుకున్న ఒప్పందంలో కొత్తగా వచ్చే పట్టాదారులకు కూడా బీమా సౌకర్యం కల్పించే వెసులుబాటు ఉందని తెలిపారు. ప్రతివారం ఒకరోజు (సోమవారం) పేరు మార్పిడి జరిగిన పట్టాదారుల వివరాలు, కొత్తగా నమోదైన పట్టాదారుల పేర్లు వ్యవసాయ శాఖకు పంపాలని కోరారు. కొత్త పట్టాదారు రైతులు లక్షపైన ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 14వ తేదీ నుంచి రైతుబీమా అమల్లోకి వచ్చింది. 18 ఏళ్ల నుంచి 59 సంవత్సరాలలోపు ఉన్న పట్టాదారులందరికీ రైతుబీమా వర్తిస్తుంది. దీని ప్రకారం మొత్తం 29.58 లక్షల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసీకి ఒక్కో రైతుకు రూ. 2,271.50 చొప్పున మొత్తం రూ.672 కోట్లు చెల్లించింది. నాటినుంచి ఇప్పటివరకు 10,012 మంది రైతులు దురదృష్టవశాత్తు మరణించగా ఆ కుటుంబాలకు కేవలం 10 రోజుల వ్యవధిలోనే రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. మొత్తం రూ.500.60 కోట్లు పరిహారం ఎల్ఐసీ నుంచి రైతు కుటుంబాలకు అందింది. వీరంతా చిన్న కమతాలు కలిగిన రైతులే కావడం గమనార్హం. ప్రీమియం రేటు పెంచే అవకాశం ఎల్ఐసీ రైతుబీమా కోసం ఈసారి ప్రీమియం రేటును పెంచనున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనిపై ఒక నివేదికను తయారు చేసుకున్నట్లు ఎల్ఐసీ వర్గాలు వెల్లడించాయి. ఇంత మొత్తంలో మరణాలు సంభవిస్తాయని ఎల్ఐసీ ఉన్నతాధికారులు ఊహించలేదు. దీంతో ఒక్కో రైతుకు రూ. 2,271.50 గా ఉన్న ప్రీమియం రేటును ఈసారి రూ. 2,500లకు పైగా పెంచే అవకాశం ఉంది. ప్రస్తుత బీమా కాలపరిమితి ముగిసేందుకు మరో మూడు నెలల సమయం ఉంది. ఈ క్రమంలో ఇంకా రూ.100 కోట్ల వరకు చెల్లింపులు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వారు పేర్కొంటున్నారు. -
బీమాకు కొర్రీ.. రైతుకు వర్రీ!
సాక్షి, హైదరాబాద్: రైతుబీమా అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు చనిపోయిన మూడు నుంచి పది రోజుల్లోగా ఆయా కుటుంబాలకు బీమా కింద రూ.5 లక్షలు ఎల్ఐసీ నుంచి ఇప్పించాలి. కానీ, జిల్లా వ్యవసాయాధికారులు, ఎల్ఐసీ, బ్యాంకు వర్గాల కారణంగా కొన్నిచోట్ల జాప్యం జరుగుతోందన్న విమర్శలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని గతేడాది ఆగస్టు 14వ తేదీన ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏ కారణంతోనైనా 58 ఏళ్ల లోపు రైతులు చనిపోతే వారి కుటుంబాలను తక్షణమే ఆదుకునేందుకు రూ. 5 లక్షల బీమా పరిహారం చేతికందేలా ఈ పథకానికి రూపకల్పన చేసింది. అందుకోసం 28 లక్షలమంది రైతుల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం రూ.636 కోట్లను ఎల్ఐసీకి ప్రీమియం కింద చెల్లించింది. అంటే.. ఒక్కో రైతుకు రూ.2,271 ప్రీమి యం చెల్లించింది. బీమా పరిహారాన్ని రైతులకు సకాలంలో అందించేలా ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను ఎల్ఐసీ కాకుండా వ్యవసాయశాఖ తీసుకుంది. రైతు చనిపోతే మరణ ధ్రువీకరణపత్రం, ఇతర డాక్యుమెంట్లను తీసుకోవడం, పరిశీలించడం, అప్లోడ్ చేయడం వంటి పనులను కిందిస్థాయి వ్యవసాయాధికారులే చేస్తున్నారు. గతేడాది ఆగస్టు 14 నుంచి ఇప్పటివరకు 7,486 మంది రైతులకు రైతుబీమా కింద పరిహారం అందింది. ఇంకా 300 మంది రైతు కుటుంబాలకు బీమా పరిహారం వివిధ దశల్లో పెండింగ్‌లో ఉంది. అందులో 192 దరఖాస్తులు జిల్లా వ్యవసాయాధికారుల వద్ద ఉండిపోయాయి. వాటికి ఆమోదం తెలపడంలో జాప్యం జరుగుతోందని నల్లగొండ జిల్లాకు చెందిన బాధిత రైతు కుటుంబసభ్యుడు ఎం.వీరేశం ఆరోపిస్తున్నారు. నల్లగొండ, మెదక్ జిల్లాల్లో 18 దరఖాస్తుల చొప్పున ఆయా జిల్లా వ్యవసాయాధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 15, నిజామాబాద్ జిల్లాలో 13 పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని జిల్లాల్లోనైతే చనిపోయిన 55 మంది రైతుల బీమా దరఖాస్తులను ఇప్పటికీ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 11 రైతు బీమా దరఖాస్తులను అప్లోడ్ చేయలేదు. ఎల్ఐసీ ఎందుకు తిరస్కరించినట్లు? రైతుబీమా ప్రక్రియలో అన్నీ సక్రమంగా ఉన్నా కొన్ని దరఖాస్తులు ఎల్ఐసీ వద్ద తిరస్కరణకు గురికావడంపై విమర్శలున్నాయి. మొత్తం 43 మంది రైతుల పరిహారాన్ని ఎల్ఐసీ తిరస్కరించిందని వ్యవసాయశాఖ తెలిపింది. అన్ని రకాల డాక్యుమెంట్లను సమర్పించినా ఎందుకు తిరస్కరణకు గురయ్యాయో తెలియదని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒక రైతు కుటుంబసభ్యుడు లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జిల్లాలో 8 మంది రైతుల బీమాను ఎల్ఐసీ తిరస్కరించింది. ఎల్ఐసీ ఆమోదించి డబ్బు పంపినా బ్యాంకులు సొమ్ము ఇవ్వకుండా కొర్రీలు పెడుతున్నాయి. ఈవిధంగా రాష్ట్రంలో 10 మంది రైతు కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. -
సంక్షేమం కొత్త పుంతలు!
సాక్షి, హైదరాబాద్: ‘ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’అనే నినాదంతో సర్కారు నడుస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెబుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఈ ఏడాది ఇలాగే కొనసాగాయి. కంటివెలుగు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో సంక్షేమం ఈ ఏడాది కొత్త పుంతలు తొక్కింది. ప్రతిష్టాత్మక ఎయిమ్స్ మంజూరైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇతర ప్రాజెక్టుల పరిధిలో కొత్త ఆయకట్టుకు నీరు చేరింది. ఇవన్నీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు సానుకూలంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న పథకాలపై రౌండప్ మీకోసం. పెళ్లికి లక్షా నూట పదహార్లు.. అడబిడ్డ పెళ్లి చేయాలంటే భారంగా భావించే పేదలకు అండగా ఉండేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ను ప్రవేశపెట్టింది. 2014లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అమలైన ఈ పథకాన్ని ఆ తర్వాత బీసీలకు, అగ్రవర్ణాల్లోని పేదలకూ వర్తింపజేసింది. పథకం మొదలైన కొత్తలో రూ.51 వేలుగా ఉన్న సాయాన్ని గతేడాది రూ.75,116 వేలకు పెంచింది. ఈ ఏడాదిలో దీన్ని రూ.1,00,116కు పెంచింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఈ ఏడాది 1,21,793 మందికి సాయం అందింది. ఈ రెండు పథకాలతో లబ్ధిపొందిన వారిలో ఎస్సీలు 18,626, ఎస్టీలు 12,105, బీసీలు 62,453, ఈబీసీలు 6,369, మైనార్టీలు 22,240 మంది ఉన్నారు. అన్నదాతకు బీమా.. వ్యవసాయ కుటుంబంలోని పెద్ద చనిపోతే ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడుతుంది. ఇలాంటి దుస్థితిని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. వ్యవసాయ కుటుంబంలోని పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఎల్ఐసీతో ఒప్పందం చేసుకుని ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభమైంది. పట్టాదారుగా నమోదై, 60 ఏళ్లలోపు ఉన్న ప్రతి రైతుకు ఈ పథకం వర్తిస్తుంది. ఒక్కో రైతు పేరుమీద రూ.2,271 చొప్పున రూ.650 కోట్లను ప్రభుత్వం ఎల్ఐసీకి ఏడాది ప్రీమియం చెల్లించింది. రాష్ట్రంలో 60 ఏళ్లలోపు వయసున్న 28.3 లక్షల మంది ఈ పథకం కింద నమోదయ్యారు. రైతు బీమా అమల్లోకి వచ్చినప్పటి నుంచి దురదృష్టవశాత్తు 5 వేలకు పైగా రైతులు చనిపోయారు. వీరికి ఎల్ఐసీ రూ.230 కోట్లు విడుదల చేసింది. తెలంగాణకు ఎయిమ్స్.. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను మంజూరు చేస్తూ కేంద్రం ఈ ఏడాది నిర్ణయం తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.1,028 కోట్లు, ఎయిమ్స్ నిర్వహణలో కీలకమైన డైరెక్టర్ పోస్టును మంజూరు చేసింది. ఎయిమ్స్ మొదటి దశ పనులను 10 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. మూడు విడతల్లో పూర్తిస్థాయిలో ఎయిమ్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. 2019–20 విద్యా సంవత్సరంలో ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ కోర్సులు ప్రారంభించేలా నోటిఫికేషన్ జారీ చేసింది. రైతు బంధు.. రైతులకు పెట్టుబడి సాయమందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ‘రైతు బంధు’పేరిట రైతులకు నగదు ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టింది. 2018 ఖరీఫ్ నుంచి అమల్లోకి వచ్చింది. రబీలోనూ విజయవంతంగా అమలు చేశారు. రైతుబంధు పథకం అమలుకు ముందుగా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టింది. పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా సీజనుకు ఎకరానికి రూ.4 వేల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. వర్షాకాలం సీజన్లో 1.4 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం ఇచ్చింది. చిన్న, సన్నకారు, పెద్ద రైతులు అనే తేడా లేకుండా వ్యవసాయ భూమి ఉన్న అందరికీ రైతుబంధు సాయం అందింది. రాష్ట్రంలో 58.16 లక్షల పట్టాదారులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 58.81 లక్షల చెక్కులను ముద్రించింది. 51.4 లక్షల చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. పంపిణీ చేసిన చెక్కుల విలువ మొత్తం రూ.5,437 కోట్లు. రబీలో 44 లక్షల మందికి రూ.4,500 కోట్ల పెట్టుబడి సొమ్మును బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. నీళ్లు పారాయి.. సాగునీటి రంగంలో ఈ ఏడాది గణనీయ పురోగతి కనిపించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రారంభించిన పనుల ఫలాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద గరిష్ట ఆయకట్టుకు నీరందేలా ప్రభుత్వం కృషి చేసింది. మిషన్ కాకతీయ కింద నాలుగు విడతల్లో పునరుద్ధరించిన చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఈ ఏడాది నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు నిండాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు పూర్తి కావడంతో ఏడు లక్షల ఎకరాలకు కొత్త నీరు అందించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ మధ్యతరహా ప్రాజెక్టుల కింద గరిష్ట ఆయకట్టుకు నీరు చేరింది. కాళేశ్వరం పనులు మరింత వేగవంతమయ్యాయి. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు పూర్తయిన పనులతో కొత్త ఆయకట్టుకు నీరు చేరింది. కోటి కళ్ల కొత్త చూపు.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ‘కంటి వెలుగు’పథకానికి శ్రీకారం చుట్టింది. మారుతున్న జీవనశైలితో కంటి జబ్బుల బాధితుల సంఖ్య పెరుగుతోంది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోని ఎర్రవల్లిలో కంటి పరీక్షల నిర్వహణ కార్యక్రమం ఈ పథకానికి స్ఫూర్తిగా నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేయడం, శస్త్ర చికిత్సలు చేయించడం ఈ పథకం ఉద్దేశం. ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు కార్యక్రమం మొదలైంది. వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం కోటి మందికిపైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 45.15 లక్షల మంది పురుషులు, 54.85 లక్షల మంది మహిళలు ఉన్నారు. కంటి పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో 36.61 లక్షల మందికి దృష్టి లోపాలు ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. వీరిలో 16.66 లక్షల మందికి అక్కడికక్కడే ఉచితంగా సాధారణ కళ్లద్దాలు(రీడింగ్) పంపిణీ చేశారు. దృష్టి లోపం ఎక్కువగా ఉన్న మరో 12.95 లక్షల మందికి ప్రత్యేకంగా అద్దాలను తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు 4.47 లక్షల మందికి కంటి శస్త్ర చికిత్సలు చేయాలని వైద్యులు నిర్ధారించారు. త్వరలోనే శస్త్ర చికిత్సలు మొదలుకానున్నాయి. కొత్తగా 7 లక్షల ఎకరాలకు.. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల కంటే నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం గట్టిగా కృషి చేసింది. సాగునీటి మంత్రిగా హరీశ్‌రావు పట్టుదల తోడవడంతో మంచి ఫలితాలొచ్చాయి. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించడంతో కొత్తగా ఏడు లక్షల ఎకరాలకు నీరు చేరింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని కాలువ ఆధునీకరణతో హుజూరాబాద్, పెద్దపల్లి, పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని పంటలకు, చెరువులకు నీరు అందింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భూసేకరణ అడ్డంకులతో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 57 చెరువు పనులు ఈ ఏడాది పూర్తయ్యాయి. దీంతో 82 వేల ఎకరాల కొత్త ఆయకట్టు సాధించారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు 75 శాతం పూర్తయ్యాయి. 2019 జూన్ నాటికి మొత్తం పనులను పూర్తి చే సి నీటిని తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేడిగడ్డ నుంచి కనిష్టంగా 90 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి... అక్కడి నుంచి మిడ్‌మానేరు వరకు తరలించేలా పనులు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే రూ.24 వేల కోట్లు రుణాల రూపంలో ఖర్చు చేశారు. మరో ఎనిమిది వేల కోట్ల రుణాలతో తుపాకులగూడెం, సీతారామ, వరదకాల్వ పనులు చేశారు. రుణాల ద్వారా చెల్లింపులు చేస్తున్నా ప్రతి నెలా రూ.5 వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. కొత్త ఏడాదిలో ఈ సమస్యను అధిగించేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ–హబ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న రాష్ట్ర ప్రభుత్వం వీ–హబ్ ఇంక్యుబేటర్‌ను ప్రారంభించింది. స్టార్టప్‌ల ఏర్పాటుకు ఐడియాలతో వచ్చే ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం దీని ద్వారా అవసరమైన ప్రోత్సాహం అందిస్తోంది. గతేడాది రాష్ట్రంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఈఎస్) ముగింపు సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ‘వీ–హబ్’పేరుతో ఇంక్యుబేటర్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. -
బీమా.. ధీమా
మహబూబ్‌నగర్ రూరల్ : రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు అండగా నిలుస్తోంది. కుటుంబ పెద్దను కోల్పోయిన రైతు కుటుంబానికి బాసటగా ఉండేలా రూ.5 లక్షల పరిహారం చెల్లించేలా టీఆర్ఎస్ నేతృత్వంలోని గత ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. గత ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇప్పటివరకు.. రైతు బీమా పథకం ప్రారంభమయ్యాక జిల్లాలో 350 కుటుంబాలకు పరిహారం అందింది. ఈ పథకం అమల్లోకి వచ్చాక జిల్లాలో 375 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందారు. ఇందులో 350 కుటుంబాలకు పరిహారం అందజేశారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.16.25 కోట్ల పరిహారం అందింది. మిగతా 25 మంది రైతుల కుటుంబాలకు కూడా త్వరలోనే పరిహారం అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏ కారణంతోనైనా రైతు మృతి చెందితే ఆ కుటుంబానికి బీమా కింద రూ.5 లక్షల పరిహారం అందిస్తారు. ఇందుకు గాను అర్హత ఉన్న రైతులను ఇప్పటికే గుర్తించిన అధికారులు వారి వివరాలు, నామినీల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చారు. అలా అర్హులుగా గుర్తించిన అన్నదాతల్లో ఎవరైనా అకాల మరణం పొందితే ఆ కుటుంబ సభ్యులకు పరిహారం అందుతోంది. కుటుంబానికి అండగా నిలిచేలా... రైతు అకాల మరణం పొందితే ఆయన కుటుంబం వీధిన పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం గత ఆగస్టు 14వ తేదీ నుంచి పథకం అమల్లోకి వచ్చింది. పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉండి 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయస్సు గల రైతులు ఈ పథకానికి అర్హులు. రైతు ప్రమాదవశాత్తు, అనారోగ్యంతోనో మరణించినా.. ఆత్మహత్య చేసుకున్నా.. లేదా ఏ కారణంతో మరణించినా రూ.5 లక్షల బీమా వర్తించేలా జీవిత బీమా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించిన విషయం విదితమే. రైతు మరణించిన 24 గంటల్లోగా అధికారులు బీమా అందించే ప్రక్రియను ప్రారంభించేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు సూచించే నామినీ పేరిట బీమా పరిహారానికి సంబంధించిన చెక్కు మంజూరు చేస్తున్నారు. గతంతో పోలిస్తే భిన్నం గతంలో ఎవరైనా రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే రూ. 6 లక్షలు పరిహారం ఇచ్చే పథకం అమల్లో ఉంది. అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన బాధిత రైతు కుటుంబాలు చాలా తక్కువ. చనిపోయిన రైతుకు ఎంత అప్పు ఉందో వాటిని రుజువు చేసుకోవాల్సి వచ్చేది. రైతులు పంటల సాగు కోసం చేసే ప్రైవేట్ అప్పులకు రుజువులు దొరికేవి కాదు. వడ్డీ వ్యాపారుల నుంచి సాక్ష్యాలు తీసుకురాలేక బాధిత కుటుంబాలు కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగలేక ఇబ్బందులు పడేవారు. రైతు బీమా పథకం అమల్లోకి వచ్చిన తర్వాత నష్టపరిహారం అందడంలో ఆటంకాలు తొలగిపోయాయి. ఏ కారణంతో మరణించినా రైతు కుటుంబానికి బీమా వర్తిస్తోంది. ఇంటి పెద్దను కోల్పోయి కష్టాల్లో ఉన్న కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్ము వస్తుండడంతో రైతుల కుటుంబాలు ఊరట చెందుతున్నాయి. పకడ్బందీగా అమలు చేస్తున్నాం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 350 మంది రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున రూ. 16.25 కోట్ల పరిహారం అందింది. మిగతా 25 మందికి త్వరలోనే పరిహారం అందుతుంది. ఆ ప్రక్రియ నడుస్తోంది. – సుచరిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
ప్రపంచానికే ఆదర్శం ‘రైతుబంధు’
సాక్షి, హైదరాబాద్: రైతుల అభివృద్ధికి ప్రపంచంలో అమలు చేస్తున్న 20 వినూత్న పథకాలలో రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్యసమితి (ఐరాస) గుర్తించడం పట్ల వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది తెలంగాణకు, రాష్ట్ర రైతాంగానికి దక్కిన గొప్ప గౌరవమన్నారు. తెలంగాణ అమలు చేస్తున్న పథకాలు దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శమని మరోసారి నిరూపణ అయిందన్నారు. వ్యవసాయరంగం అభివృద్ధి, రైతు సంక్షేమం అనే గొప్ప ఆశయంతో ఈ రెండు పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రైతులు అప్పుల ఊబినుండి బయటపడి తలెత్తుకొని తిరగాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందుకే వ్యవసాయానికి అవసరమైన కరెంటును 24 గంటలు ఉచితంగా, నాణ్యతతో సరఫరా చేస్తున్నామన్నారు. ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చేశామన్నారు. పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్థిక వెన్నుదన్ను ఇస్తున్నామన్నారు. రైతులకు సలహాలు ఇవ్వడానికి ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించామన్నారు. మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులకోసం భారీగా గోదాములు నిర్మించామని, ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అమలుచేస్తున్న పథకాలతో ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు భరోసా వచ్చిందన్నారు. తమ వెనుక ప్రభుత్వం ఉందన్న ధైర్యం వచ్చిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్ర రైతులకు ఇంకా మంచి రోజులు రాబోతున్నాయన్నారు. అంతర్జాతీయ సదస్సుకు పార్థసారథి ఐరాస ఆధ్వర్యంలోని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) ప్రధాన కార్యాలయం రోమ్‌లో జరగనున్న అంతర్జాతీయ సదస్సులో రైతుబంధు, రైతుబీమా పథకాలపై ప్రసంగించేందుకు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ఈనెల 20న ఇక్కడినుంచి రోమ్ బయలుదేరనున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు కూడా పర్యటిస్తారు. ఈ మేరకు పార్థసారథి ఒక ప్రకటన విడుదల చేశారు. 21 నుంచి 23వ తేదీవరకు రోమ్ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తారు. తెలంగాణ విత్తన హబ్‌పైనా ఆయన మరో సదస్సులో ప్రసంగిస్తారు. 24న ఎఫ్ఏవో కార్యాలయంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 26–27 తేదీల్లో స్విట్జర్లాండ్ రాజధాని జ్యూరిచ్‌కు వెళతారు. -
ఎన్నికల ఏరువాకలో ఓట్ల సాగు
ఎన్నికల ఏరువాకలో ఓట్లు పండించడానికి రైతు సమన్వయ సమితులు సిద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గెలుపే లక్ష్యంగా.. ఊరూరా రైతులను కలుస్తూ ఈ సమితులు పార్టీ గెలుపునకు వ్యూహరచన చేస్తున్నాయి. గత ఖరీఫ్ సీజన్లో రైతుబంధు చెక్కుల పంపిణీ సందర్భంలో.. రైతుబీమా పథకంలో రైతులను చేర్పించడంలో కీలకంగా వ్యవహరించిన సమన్వయ సమితులు.. ఇప్పుడు ఆయా సాయాలను గుర్తుచేస్తూ రైతులను పార్టీ వైపు తిప్పేందుకు పని చేస్తున్నాయి. విత్తనం వేసింది మొదలు పంట పండాక మార్కెట్లో గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రైతుబంధు చెక్కుల పంపిణీ, రైతుబీమాలో రైతుల చేరిక వంటి సందర్భాల్లో ఈ సమితుల సభ్యులు అంతా తామై వ్యవహరించారు. చెక్కుల పంపిణీకి, బీమా పథకంలో చేరికకు సంబంధించి ఎవరు నిజమైన రైతులో కాదో నిర్ధారించింది వీరే. ఇంతలా గ్రామస్థాయిలో రైతులతో మమేకమై పనిచేసిన ఈ సమితులు ఇప్పుడు రైతులకు అందిన లబ్ధిని వివరిస్తూ.. ఓట్లుగా మలిచేందుకు కృషి చేస్తున్నాయి. 1.61 లక్షల మంది సభ్యులు గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఈ సమితుల్లోని సభ్యులు ప్రభుత్వ పరంగా నామినేట్ పదవుల్లో ఉన్నట్టు. రాష్ట్రంలోని 10,733 గ్రామాల్లోనూ రైతు సమన్వయ సమితులు ఉన్నాయి. ఒక్కో గ్రామంలో 15 మంది చొప్పున అన్ని గ్రామాల్లోనూ 1.61 లక్షల మంది సభ్యులను నియమించారు. దాంతోపాటు ప్రతీ గ్రామానికి ఒక సమన్వయకర్త ఉంటారు. ఆపై 24 మందితో మండల సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. అలా 559 మండలాలకు 13,416 మందిని నియమించారు. ప్రతీ మండలానికి మళ్లీ ఒక మండల రైతు సమితి సమన్వయకర్తను నియమించారు. వీరందరితో కలిపి జిల్లా సమన్వయ సమితిని ఏర్పాటు చేశారు. ప్రతీ జిల్లాకు 24 మంది చొప్పున జిల్లా సమితి సభ్యులను నియమించారు. దీనికి ఓ జిల్లా సమన్వయకర్త ఉంటారు. అనంతరం రాష్ట్రస్థాయిలో సమన్వయ సమితిని 42 మందితో ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్యలు రావడంతో కార్యరూపం దాల్చలేదు. రాష్ట్ర సమన్వయ సమితికి ఛైర్మన్‌గా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమించి.. క్యాబినెట్ హోదా కట్టబెట్టారు. జిల్లా సమన్వయకర్తకు జిల్లా కేంద్రంలో ఒక కార్యాలయం ఏర్పాటు చేశారు. మండల స్థాయిలోనూ కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. నామినేట్ పదవులు కావడంతో వారంతా సుశిక్షితులైన సైన్యంగా టీఆర్ఎస్ గెలుపునకు కృషిచేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ గుత్తా సుఖేందర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ 32 మంది రైతులకు ఒకరు ఒక అంచనా ప్రకారం ప్రతీ 32 మంది రైతులకు ఒక రైతు సమన్వయ సమితి సభ్యుడున్నారు. ఆయా రైతులందరినీ సమన్వయపరిచి టీఆర్ఎస్కు ఓటేసేలా వీరంతా కసరత్తు చేస్తున్నారు. ఈసారి అధికారంలోకి వచ్చాక రైతు సమన్వయ సమితి సభ్యులందరికీ రెమ్యునరేషన్ ఇస్తామని టీఆర్ఎస్ తన పాక్షిక మేనిఫెస్టోలో ప్రస్తావించడంతో 1.61 లక్షల మంది సభ్యులు ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నట్లు ఒక్కో సభ్యునికి నెలకు రూ.500 నుంచి రూ. వెయ్యి వరకు రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుబంధు సొమ్మును బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. దీనిపై రైతుల్లో అవగాహన కల్పించడంలో రైతు సమితులు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. రైతులకు బీమా సొమ్ము ఇప్పించడంలోనూ సభ్యులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ...::: బొల్లోజు రవి -
‘రైతుబంధు’కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు, రైతుబీమా పథకాలకు ఐక్యరాజ్యసమితి (ఐరాస) గుర్తింపు లభించింది. ప్రపంచదేశాల్లో రైతుల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో 20 పథకాలను ఎంపిక చేయగా.. అందులో తెలంగాణకు చెందిన రైతుబంధు, రైతుబీమా పథకాలు రెండూ ఎంపిక కావ డం విశేషం. ఈ పథకాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా ఐరాస తెలంగాణ ప్రభుత్వానికి ఆహ్వానం పంపింది. ఈ నెల 21–23 తేదీల మధ్య ఐరాసలోని వ్యవసాయ విభాగం ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) కేంద్ర కార్యాలయం రోమ్ నగరానికి రావాల్సిందిగా కోరింది. ఆ తేదీల్లో ఐరాస నిర్వహించే ‘వ్యవసాయాభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలు’అనే అంతర్జాతీయ సదస్సులో రైతుబంధు, రైతుబీమా పథకాలపై వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆయన ఈ నెల 20న రోమ్కు వెళ్లనున్నారు. ఆ 2 పథకాలకు సంబంధించి ఇప్పటికే ఐరాస పూర్తి సమాచారాన్ని రాష్ట్రప్రభుత్వం నుంచి సేకరించింది. తక్కువ నిడివి గల రెండు ప్రత్యేక డాక్యుమెంటరీ చిత్రాలను కూడా ప్రభుత్వం ఐరాసకు పంపించింది. పథకాలపై రెండు ప్రత్యేక పుస్తకాలు రోమ్‌లో ఐరాసకు చెందిన ఎఫ్ఏవోలో జరిగే అంత ర్జాతీయ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సదస్సుకు ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరవుతుండటంతో రైతుబంధు, రైతుబీమా పథకాలపై తక్కువ పేజీలు గల 2 ప్రత్యేక పుస్తకాలను వ్యవసాయశాఖ ముద్రించింది. వీటిని రోమ్ సదస్సులో పాల్గొనే అంతర్జాతీయ ప్రతినిధులకు అందజేయనుంది. పుస్తకాల్లోని వివరాలు: రైతుబంధు పథకంపై వ్యవసాయశాఖ తయారు చేసిన పుస్తకంలో రాష్ట్రం లోని సాగు పరిస్థితులను వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ వంటి పథకాలనూ ప్రస్తావించారు. ఇక్కడున్న రిజర్వాయర్లు, నీటిపారుదల వసతి, రైతుబంధు పథకంలోని ముఖ్యమైన అంశాలను వెల్లడించారు. ప్రతీ రైతుకు ఒక సీజన్లో పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు సీజన్లకు కూడా చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇదంతా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని ఆర్థికసాయంగా పేర్కొన్నారు. ఖరీఫ్‌లో అవకతవకలు జరగకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టి రైతులకు చెక్కుల ద్వారా గ్రామసభల్లో పంపిణీ చేసినట్లు వివరించారు. రైతుబీమాపైనా మరో పుస్తకాన్ని అధికారులు తయారుచేశారు. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేలా రూ. 5 లక్షల బీమా ఎల్ఐసీ ద్వారా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఐరాస గుర్తింపు వల్ల ఎఫ్ఏవో నుంచి ఏమైనా ప్రత్యేకంగా నిధులు వస్తాయేమో అన్న చర్చ జరుగుతోంది. ప్రపంచంలో ఇలాంటి పథకం లేకపోవడంతో అది తమకు కలసి వస్తుందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
రైతు కుటుంబాలకు బీమా ధీమా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబీమా 90 శాతం సన్నచిన్నకారు రైతు కుటుంబాల్లో వెలుగు నింపిందని వ్యవసాయ శాఖ తెలిపింది. రైతుబీమా పథకం ఆగస్టు 15 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. యాభై రోజుల్లో రైతుబీమా ద్వారా ఎంతమంది రైతు కుటుంబాలకు ప్రయోజనం కలిగిందో వ్యవసాయశాఖ సమగ్ర నివేదిక తయారు చేసి మంగళవారం ప్రభుత్వానికి పం పింది. ఇప్పటివరకు మొత్తం 1,910 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోయారు. అందులో 1,739 మందికి క్లెయిమ్స్ కోసం ఎల్ఐసీకి సమాచారం పంపారు. వాటిల్లో 1,602 మంది రైతుల క్లెయిమ్స్‌ను పరిష్కరించారు. ఆయా కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ.80.01 కోట్ల పరిహారం అందజేసినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఇంకా 137 క్లెయిమ్స్ ప్రక్రియలో ఉన్నట్లు తెలిపింది. పరిహారం పొందిన రైతుల్లో 90 శాతం మంది ఐదెకరాలలోపువారే ఉన్నారని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఆ నివేదికలో వెల్లడించారు. రైతుబీమా పరిహారం పొందిన 1,602 మంది రైతుల్లో ఎకరాలోపున్న రైతులు 401 మంది, ఎకరా నుంచి రెండున్నర ఎకరాలున్న రైతులు 748 మంది, రెండున్నర ఎకరాల నుంచి ఐదెకరాల వరకున్న రైతులు 294 మంది ఉన్నారు. ఐదు నుంచి పదెకరాల వర కున్న రైతులు 146 మంది, పది, అంతకుమించి భూమి కలిగిన రైతులు 13 మంది ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు 85 శాతం సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే పరిహారం అందుకున్న 1,602 మంది రైతుల్లో బీసీలు 816 మంది (51%) ఉండటం గమనార్హం. ఎస్సీ రైతులు 236 మంది (15%), ఎస్టీ రైతులు 329 మంది (21%), మైనారిటీలు 11 మంది (1%), ఇ తరులు 210 మంది (13%) ఉన్నారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే 85 శాతం రైతుబీమా పరిహారం పొందారు. వ్యవసాయశాఖ ఆయా రైతుల బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే వారి ఆర్థిక స్తోమత విస్మయం కలిగించేలా ఉంది. సన్న, చిన్నకారు రైతుల్లో చాలామంది బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.34 నుంచి వెయ్యి వరకే ఉండటం గమనార్హం. ఆయా కుటుంబాల్లో తమ కుటుంబ పెద్ద చనిపోయిన వెంటనే బజారున పడే పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో రైతుబీమా కింద ఒకేసారి రూ.5 లక్షలు జమ చేయడం వల్ల ఆయా కుటుంబాలు కుదుట పడటానికి వీలు కలుగుతుందని వ్యవసాయశాఖ తెలిపింది. అంతేకాదు సన్న, చిన్నకారు రైతులే 90 శాతం మంది ఉన్నారంటే వారి ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందనే అంశం కూడా తెలుస్తోంది. సరైన పోషకాహారం లేకపోవడం, వైద్య సదుపాయాలు లేకపోవడం తదితర కారణాలతో అనేకమంది సన్న, చిన్నకారు రైతులు చనిపోతున్నారనేది వాస్తవం. రైతుబీమా కింద చనిపోయిన రైతు కుటుంబానికి ఒకేసారి రూ.5 లక్షలు వస్తుండటంతో బీమాలో చేరని రైతులు ఇప్పుడు ముందుకు వస్తున్నారని వ్యవసాయశాఖ తన నివేదికలో ప్రస్తావించింది. కొత్తగా మరో లక్ష మంది రైతులు తమ పేర్లను రైతుబీమాలో నమోదు చేసుకున్నారు. మొదట్లో అనేకమంది రైతుబీమాలో చేరడానికి ముందుకు రాని సంగతి విదితమే. -
రైతు బీమా పథకం ఎలా ఉంది?: కేసీఆర్ ఆరా
కొండపాక (గజ్వేల్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమా పథకం పనితీరు, బీమా సొమ్ముల చెల్లింపులపై సీఎం కేసీఆర్ బాధిత కుటుంబానికి స్వయంగా ఫోన్ చేసి ఆరా తీశారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో ఇటీవల కాశ పోశవ్వ అనే మహిళా రైతు (51) మృతి చెందారు. బుధవారం సీఎం కేసీఆర్ మృతురాలి నామినీకి ఫోన్ చేయగా, ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో కొండపాక మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు దుర్గయ్యకు ఫోన్ చేసిన సీఎం.. పోశవ్వ కుటుంబానికి బీమా డబ్బులు ఎన్ని రోజులకు అందాయని, బీమా విషయంలో ఏ అధికారైనా లంచం అడిగారా? అని ఆరా తీశారు. పోశవ్వ ఆగస్టు 24న మృతి చెందగా బీమా డబ్బులు అదే నెల 28న మంత్రి హరీశ్ చేతుల మీదుగా సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో అం దించినట్లు దుర్గయ్య కేసీఆర్‌కు బదులిచ్చారు. పథకం ఎలా ఉందని కేసీఆర్ అడగ్గా, ‘చాలా బాగుంది సారూ’అంటూ దుర్గయ్య చెప్పడంతో సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఈ వివరాలను దుర్గయ్య ‘సాక్షి’కి తెలిపారు. సీఎం స్వయంగా మాట్లాడటం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
చరిత్రాత్మకం.. రైతుబీమా పథకం
సిద్దిపేటటౌన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు తీసుకువచ్చిన రైతుబంధు, జీవిత భీమా పథకం చరిత్రాత్మకమైనదని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జీవితబీమా పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ దేశంలో తమ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో ముందుంటుందని, ఇంత వరకు ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని పథకాలను రైతుల కోసం ప్రవేశపెడుతూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఎంతో మంది సరైన ఆహారం లేక, ప్రమాదాల బారిన పడి, అప్పులు ఎక్కువై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దీని వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని గుర్తించి వారిని ఆదుకోవడానికి రైతుబీమా పేరిట రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఇలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపింది తమ ప్రభుత్వమేనని అన్నారు. గత ప్రభుత్వాలు రైతులను ఆదుకోకపోగా అన్యాయం చేశాయని అన్నారు. రైతులకు భరోసా కల్పిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నామని జిల్లాలో 20 మంది రైతులు చనిపోగా అందులో 18 మందికి రూ.5 లక్షల చొప్పున పరిహారం చెక్కులు పంపిణీ చేశామని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని, వారి ఆత్మకుశాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, డీఏవో శ్రావణ్, నంగునూరు ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, ఏవోలు పరశురాంరెడ్డి, గీత, అఫ్రోజ్ పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం నంగునూరు(సిద్దిపేట): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పని చేస్తున్నామని భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం నంగునూరు, బద్దిపడగ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మంత్రికి ఘనస్వాగతం పలుకగా మహిళలు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నంగునూరులోని ఎస్సీ కాలనీ, ఐకేపీ భవనంలో గ్రామస్తులనుద్దేశించి మంత్రి మాట్లాడారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మండల కేంద్రం నంగునూరులో రూ. 10 లక్షలతో వైశ్య కమ్యూనిటీహాల్, రూ. 5 లక్షలతో పూసల కమ్యూనిటీహాల్, నంగునూరు నుంచి అంక్షాపూర్ వరకు రూ. 75 లక్షలతో నిర్మించనున్న తారు రోడ్డు, ఎస్సీ కమ్యూనిటీహాల్‌కు శంకుస్థాపనలు చేశారు. సిద్దిపేటటౌన్ : దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి పక్కాగా అమలు చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఉపాధ్యా భవన్లో ఆదివారం రాత్రి సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరు మండలాల లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని 107 మందికి రూ. 96,12,412 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. అలాగే జీవో నంబర్ 59 కింద 75 మంది అర్హులైన వారికి భూమి ధృవీకరణ హక్కు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజానీకానికి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నదని వివరించారు. కార్యక్రమంలో పరమేశ్వర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.