Sun Intensity
-
గాలి బీభత్సం.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం
సాక్షి, నెట్వర్క్: హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో పెనుగాలులు వీచాయి. దీంతో అనేకచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి నల్లగొండ, సిద్దిపేట, వికారాబాద్ తదితర జిల్లాల్లో గాలివాన హడలెత్తించింది. వేర్వేరు ఘటనల్లో మొత్తం 13 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క నాగర్‌కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు మరణించారు. మరోవైపు తగ్గేదేలే అన్నట్టు పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోయాయి. 45 డిగ్రీ సెల్సీయస్‌కు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం నాగర్‌కర్నూల్ జిల్లాలో అకాల వర్షాలు పెను విషాదం నింపాయి. ఆదివారం సాయంత్రం వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. తాడూరుకు చెందిన రైతు బెల్లె మల్లేష్ (38) గ్రామ శివారులోని తన సొంత పొలంలో రేకుల షెడ్ నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మల్లేష్, పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లికి చెందిన కూలీలు చెన్నమ్మ (45), రాములు (53) షెడ్‌పై పని చేస్తుండగా ఈదురుగాలులతో కూడిన వర్షానికి షెడ్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. దీంతో ఈ ముగ్గురు, అదే సమయంలో తండ్రి వద్దకు వచి్చన మల్లేష్ కూతురు అనూష (12) అక్కడికక్కడే చనిపోయారు. అక్కడే పనిచేస్తున్న మరో నలుగురు.. చిన్న నాగులు, పార్వతమ్మ, బి.రాజు, రాజు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే పార్వతమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. మరోవైపు నాగర్‌కర్నూల్ మండలంలోని మంతటి గేట్ వద్ద ఈదురు గాలుల ప్రభావంతో రేకుల షెడ్‌పై ఉన్న రాయి వచ్చి వికారాబాద్ జిల్లా బషీర్‌బాగ్ మండలం నలవెల్లి గ్రామానికి చెందిన క్రూజర్ వాహన డ్రైవర్ వేణుగోపాల్ (38)కు తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వేణుగోపాల్ కిరాయికి శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక ఇదే జిల్లాలోని తెలకపల్లికి చెందిన దండు లక్ష్మణ్ (12), మారేపల్లికి చెందిన వెంకటయ్య (52) పొలంలో పిడుగుపాట్లకు గురై మరణించారు. ఇలావుండగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామంలో శనివారం రాత్రి ఎడ్ల బండిపై పిడుగు పడింది. ఈ ఘటనలో రెండు దుక్కిటెడ్లు మృతిచెందగా రైతు ఎల్కరి సత్తన్నకు గాయాలయ్యాయి. ఇద్దరు మిత్రుల విషాదాంతం మేడ్చల్ జిల్లా కీసరలో ఈదురుగాలులకు భారీ వృక్షం విరిగి మోటార్ సైకిల్‌పై పడటంతో దానిపై ఉన్న యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రానికి చెందిన నాగిరెడ్డి రాంరెడ్డి (60), అదే మండలంలోని దన్రెడ్డిగూడెంలో ఉంటున్న ఏపీలోని తూర్పు గోదావరిజిల్లాకు చెందిన ధనుంజయ్ (46) అనే ఇద్దరు స్నేహితులు మరణించారు. శామీర్‌పేటలో ఉన్న తమకు తెలిసిన వారికి మామిడికాయలు ఇచ్చేందుకు వెళ్తుండగా..కీసర మండలం తిమ్మాయిపల్లి గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. గోడలు కూలి బాలుడు, వ్యాపారి మృతి హైదరాబాద్‌లోని మియాపూర్, ఓల్డ్ హాఫిజ్‌పేట సాయినగర్‌లో ఆదివారం గాలివానకు గోడ కూలి పడటంతో అబ్దుల్ సమద్ (3) మృతి చెందాడు. డ్రై క్లీనింగ్ చేయడంతో పాటు రోడ్ల ప్రక్కన దుస్తులను అమ్ముకుంటూ జీవించే యూపీకి చెందిన నసీముద్దీన్ కనోదియా, షబానా దంపతుల కుమారుడు సమద్ ఆదివారం సాయంత్రం రేకుల గదిలో నిద్రిస్తుండగా, పక్కనే ఉన్న రఫీయుద్దీన్ బిల్డింగ్‌పై నుండి ఇటుక గోడకూలి రేకులపై పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సమద్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మరో ఘటనలో ఓ భవనం పై నుండి ఇటుక గోడకూలి ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యాపారి రషీద్ (45)పై పడటంతో తీవ్రంగా గాయపడిన అతను స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొదుతూ మరణించాడు. ఈ దుర్ఘటన కూడా ఆదివారం మియాపూర్ ఓల్డ్ హాఫిజ్పేటలోని సాయినగర్ కాలనీలోనే చోటు చేసుకుంది. నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, ఘట్కేసర్ ప్రాంతాల్లో కూడా గాలివాన బీభత్సం సృష్టించింది. హయత్‌నగర్ ఆర్టీసీ డిపోలో పెద్ద వృక్షం కూలిపడటంతో బస్సు ధ్వంసమైంది. కోళ్లఫారం గోడ కూలి ఇద్దరు మృతి సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షానికి కోళ్ల ఫారం గోడకూలడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తూప్రాన్ మండలం ఘన్‌పూర్‌కు చెందిన గంగ గౌరిశంకర్ (30), గంగ మాధవి, విభూతి శ్వేత, ఇంద్రజ, చంద్రిక, చంద్రాయణగుట్టకు చెందిన భాగ్యమ్మ(40) క్షీరసాగర్ గ్రామంలోని శ్రీనివాస్ ఇంటికి చుట్టం చూపుగా వచ్చారు. అంతా కలిసి సరదాగా పొలంలోని బావి వద్దకు వెళ్లారు. తిరిగి వస్తుండగా వర్షం కురవడంతో తల దాచుకునేందుకు దారిలో ఉన్న ఓ కోళ్ల ఫారం వద్దకు వెళ్లారు. గాలుల ధాటికి ఫారం గోడ కూలి వీరిపై పడింది. ఈ ఘటనలో గంగ గౌరిశంకర్, భాగ్యమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు మాధవి, శ్వేత, ఇంద్రజ, చంద్రిక తీవ్రంగా గాయపడ్డారు.అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలకు అంతరాయం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో రుద్రూర్, బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రుద్రూర్లో కారుపై, అంబం శివారులో ఆటో, రెండు బైకులపై చెట్లు విరిగిపడ్డాయి. బాన్సువాడలోని కల్కి చెరువు కట్టపై ఉన్న హైమాస్ట్ విద్యుత్ స్తంభంతో పాటు పలు కరెంటు స్తంభాలు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పలు గ్రామాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. హస్నాపూర్ గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర రహదారిపై భారీ వృక్షం పడిపోవడంతో 3 గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు ఇళ్లు, కోళ్ల ఫారాల రేకులు లేచిపోయాయి. కరెంట్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. ధర్మారెడ్డి పల్లి గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో కాంటా చేసిన వెయ్యి బస్తాల ధాన్యం పాక్షికంగా తడిసింది. కొండమల్లేపల్లి మండ లం గుమ్మడవెల్లిలో పిడుగుపాటుకు 2 గడ్డివాములు దగ్ధమ య్యాయి. వికారాబాద్ జిల్లాలో గాలివానకు పలు ప్రాంతాల్లో రహదారులు, ఇళ్లపై చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. పరిగి మండల పరిధి రూప్సింగ్ తండాలో పిడుగుపాటుకు ఓ ఎద్దు మృత్యువాత పడింది. -
పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీనికి తోడు వడగాడ్పులూ వీస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 8, 9 గంటల ప్రాంతంలోనే ఇంటినుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల కారణంగా.. మార్చి నుంచి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 90 మంది వడదెబ్బ బారినపడ్డారు. ఈ క్రమంలో రైతులు, భవన నిర్మాణ, ఇతర కార్మికులు, ఉపాధి కూలీలు, సాధారణ ప్రజలు సైతం ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉదయం 11 గంటల తర్వాత నుంచి సాయంత్రం ఎండ తగ్గే వరకూ ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలితే.. బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చి ప్రథమ చికిత్స చేయాలి. దుస్తులు వదులు చేసి చన్నీటితో శరీరాన్ని తడపాలి. ఈ విధంగా చేస్తే రక్తనాళాలు కుచుకుపోకుండా ఆపే అవకాశం ఉంటుంది. గజ్జల్లో, చంకల్లో, మెడ వద్ద ఐస్ ప్యాక్‌లు ఉంచాలి. ఈ చర్యలు తీసుకుంటూనే వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించడం కోసం 108కు ఫోన్ చేయాలి. 72 ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. వడదెబ్బ నివారణకు, అనుసరించాల్సిన విధానాలపై ఇప్పటికే వైద్య శాఖ మార్గదర్శకాలిచి్చంది. పీహెచ్సీ వైద్యులు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు క్షేత్ర స్థాయిలో ప్రజలకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. అంగన్వాడీలకు ప్రభుత్వం ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ చేసింది. గర్భిణులు, ఆరేళ్లలోపు పిల్లలకు వీటిని పంపిణీ చేస్తున్నారు. గతేడాది అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదై, వడదెబ్బ కేసులు ఎక్కువగా నమోదైన 72 ఆస్పత్రులను వైద్య శాఖ గుర్తించింది. వీటిల్లో క్లైమేట్ రెసిలియంట్ వార్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. వడదెబ్బ బాధితులకు వైద్యం అందించడానికి వీలుగా ఈ వార్డుల్లో ప్రత్యేక వసతులను ఏర్పాటు చేస్తున్నారు. మండిన సన్డే సాక్షి, విశాఖపట్నం: ఇప్పటికే నిప్పులు కక్కుతున్న భానుడు ఆదివారం మరింత చెలరేగిపోయాడు. శనివారం నమోదైన 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆదివారానికి 46 డిగ్రీలకు దూసుకెళ్లాయి. అత్యధికంగా మార్కాపురంలో 46 డిగ్రీలు, నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా కాజీపేట, సింహాద్రిపురంలలో 45.6, బాపట్ల జిల్లా జనకవరం పంగులూరులో 45.5, కర్నూలు జిల్లా అలూరు, ప్రకాశం జిల్లా బోట్ల గూడూరులో 45.4, పల్నాడు జిల్లా విజయపురిలో 45.2 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా అనేక చోట్ల 40–44 డిగ్రీలు రికార్డయ్యాయి. వీటి ప్రభావంతో 107 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 235 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. అంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం 670 మండలాలకు గాను సగానికి పైగా (342) మండలాల్లో వడగాడ్పులు వీచాయన్నమాట. దీంతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. అయితే సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టనున్నాయి. సోమవారం కేవలం రెండు మండలాల్లో (అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో) తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి. మరో 93 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లాలో 6 మండలాలు, విజయనగరం 20, పార్వతీపురం మన్యం 8, అల్లూరి 8, అనకాపల్లి 11, కాకినాడ 6, కోనసీమ 4, ఏలూరు 4, ఎన్టీఆర్ 2, గుంటూరు 7, పల్నాడు 2, తూర్పు గోదావరి జిల్లాలో 15 మండలాల్లోను వడగాడ్పులకు ఆస్కారం ఉందని తెలిపింది. అలాగే మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్ర వడగాడ్పులు, మరో 27 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి సముద్రమట్టానికి 1.5 కి.మీల ఎత్తులో కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రస్తుతం అంతర్గత ఒడిశా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఛత్తీస్‌గఢ్, విదర్భ, మరఠ్వాడా, అంతర్గత కర్నాటక మీదుగా పయనిస్తోంది. దీని ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలోను ఈ నెల 10, 11 తేదీల్లో రాయలసీమలోను అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం తెలిపింది. ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో సోమ, మంగళవారాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. ద్రోణి కారణంగా రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వడగాడ్పుల నుంచి ఉపశమనం కలగనుంది. కూల్‌డ్రింక్స్ తాగొద్దు ఇంట్లో ఉన్నా, బయట పనిలో ఉన్నా తప్పనిసరిగా గంట గంటకూ ఉప్పు, చక్కెర కలిపిన ద్రవాలు తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్‌కు బదులు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలి. శరీరంలో నీటి శాతాన్ని పెంచే పుచ్చకాయ, కీరదోస తినాలి. రోజుకు కనీసం 4 లీటర్ల నీరైనా తాగాలి. ఎండలో పనిచేస్తున్న వారైతే గంటకు 10 నిమిషాల చొప్పున నీడ పట్టున చేరి విశ్రాంతి తీసుకోవాలి. గాలి బాగా ఆడేలా వదులు దుస్తులు, ముఖ్యంగా నూలు వస్త్రాలు, తలకు టోపీ, గొడుగు ధరించాలి. బాటిల్లో తాగు నీటిని వెంటబెట్టుకోవాలి. వాంతులు, విరేచనాల వంటి సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. – డాక్టర్ నాగా చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్, సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ -
నిప్పుల కొలిమి
ఎవరో తరుముకొచ్చినట్టు ఈసారి చాలాముందుగానే ఎండాకాలం వచ్చిపడింది. ఫిబ్రవరి నుంచే సెగలూ పొగలూ ఎగజిమ్మిన సూరీడు అంతకంతకూ తన ప్రతాపాన్ని పెంచుతూ పోతున్నాడు. రోజూ నమోదవుతున్న ఉష్ణోగ్రతలను చూస్తుంటే భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించినట్టు నిరుటికన్నా వేసవితాపం మరింత అధికంగా వుంటుందని అర్థమవుతోంది. ఇంచుమించు రోజూ 39–41 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలుంటున్నాయి. వాస్తవానికి పదేళ్లుగా దేశంలో ఎండల తీవ్రత పెరిగింది. పాత రికార్డులు బద్దలవుతున్నాయి. నిరుడు మార్చి ఎండ తీవ్రత 1901 నాటి రికార్డును అధిగమించిందని ఐఎండీ తెలిపింది. ఆ తర్వాత వరసగా ఏప్రిల్, మే, జూన్ నెలలు వేటికవే అత్యధిక ఉష్ణోగ్రతల్లో కొత్త పోకడలను నమోదు చేశాయి. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరుగుతుందే తప్ప తగ్గదని వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్తున్న జోస్యాలు భయపెడుతున్నాయి. దీనికి తోడు ఈసారి వానలు సైతం అంతంతమాత్రం కావటంతో జలాశయాలు నిండుకున్నాయి. భూగర్భ జలాలు లోలోతులకు పోతున్నాయి. నిరుడు ఎల్‌నినో ప్రభావం కారణంగా దక్షి ణాసియా ప్రాంత దేశాలన్నీ తక్కువ వర్షపాతాన్ని నమోదు చేశాయి. రివాజుగా జూన్ నెల మొదట్లో కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఏడు రోజులు ఆలస్యంగా వచ్చాయి. ఆ తర్వాత సెప్టెంబర్ వరకూ మెరుగ్గానే వర్షాలు పడ్డాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు పడటంతో వరదలు కూడా ముంచు కొచ్చాయి. మొత్తానికి దాదాపు 94 శాతం వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత అక్టోబర్ మొదలుకొని మార్చి వరకూ వర్షాల మాట అటుంచి కనీసం మబ్బుల జాడైనా కనబడలేదు. ఇది చాలదన్నట్టు ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత పెరగటంతో జలాశయాల్లో నీరు అంతంతమాత్రంగానే వుంది. ఈ మూడు నెలలూ సాధారణంగా అయితే నాలుగు నుంచి ఎనిమిది రోజులు మాత్రమే వడగాడ్పులు తీవ్రంగా వీచాలి. కానీ ఇది పది నుంచి 20 రోజుల వరకూ ఉండొచ్చని ఐఎండీ చెబుతోంది. ముఖ్యంగా గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో ఉష్ణోగ్రతలూ, వడగాడ్పుల తీవ్రత అధికంగా వుండొచ్చని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. మండే ఎండలు, తీవ్ర వడగాడ్పులు, కుండపోత వర్షాలు, ముంచెత్తే వరదలు ఎవరూ ఆపగలిగేవి కాదు. కానీ ప్రపంచ దేశాలు సమష్టిగా నిర్ణయాలు తీసుకుని, సమర్థంగా అమలు చేయగలిగే కార్యాచరణను రూపొందిస్తే వీటి తీవ్రతను తగ్గించటానికి ఆస్కారం వుంటుంది. ప్రపంచ వాతావరణ సంస్థలు(డబ్ల్యూఎంఓ) మొన్న మార్చి 19న విడుదల చేసిన ప్రపంచ వాతావరణ నివేదిక ఏమంత ఆశాజనకంగా లేదు. నిరుటికన్నా 2024 మరింత ప్రమాదకరంగా వుండగలదని హెచ్చరించింది. కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్లు వంటి గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలో పరిమితులకు మించి పెరిగి పోవటం వల్ల ఉష్ణోగ్రతలు అధికమై సముద్ర ఉపరితల జలాలను వేడెక్కిస్తున్నాయని ఆ నివేదిక తెలిపింది. ఆఖరికి అంటార్కిటిక్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో భారీ మంచు పలకలు కరగటం నిరుడు బాగా ఎక్కువైందని వివరించింది. ఆర్థికవృద్ధి పేరుతో ప్రభుత్వాలు పర్యావరణానికి నష్టం చేకూర్చే విధానాలు అవలంబించటమే ప్రస్తుత పరిస్థితికి కారణం. భారత, బంగ్లాదేశ్‌లలో పర్యావరణ విధ్వంసం వల్ల నిరుడు ఏప్రిల్ నెలలో వడగాడ్పుల తీవ్రత 30 రెట్లు పెరిగిందని వాతావరణ శాస్త్రవేత్తలు లెక్కేశారు. ఎండల తీవ్రత, వడగాడ్పుల వల్ల సహజంగానే రానున్న రోజుల్లో నీటి కొరత మరింత ఎక్కువకావొచ్చు. ఎన్నికల సీజన్ కావటంతో ఈ సమస్యపై వాగ్యుద్ధాల మోత కూడా ఎక్కువేవుంటున్నది. కారణం మీరంటే మీరని తెలంగాణ రాష్ట్రంలో అధికార, విపక్షాలు మాటలు విసురుకుంటున్నాయి. ఆ మాటెలావున్నా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండి వడ గాడ్పు లపై, ఎండల తీవ్రతపై ప్రజలను హెచ్చరించటం అవసరం. లేనట్టయితే వడదెబ్బ మరణాలు పెరిగే అవకాశం వుంది. మన దేశంలో వడగాడ్పులను ప్రకృతి వైపరీత్యంగా పరిగణించటం లేదు. చెప్పాలంటే వేటిని వడదెబ్బ మరణాలుగా లెక్కేయాలన్న అంశంలో ఎలాంటి కొలమానమూ లేదు. నిరుడు డిసెంబర్లో లోక్‌సభలో వడగాడ్పులను ప్రకృతి విపత్తుగా లెక్కేసి, బాధిత ప్రజల సహాయపునరావాసాల కోసం నిధులందించాలని డిమాండ్ వచ్చింది. కానీ కేంద్రం నుంచి పెద్దగా స్పందన లేదు. పర్యవసానంగా బాధిత కుటుంబాలకు ఎలాంటి సాయమూ అందటం లేదు. కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఇందుకు మినహాయింపు. ఎన్డీఎంఏ 2016 నుంచి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేస్తోంది. అక్కడితో దాని పాత్ర ముగుస్తోంది. ఎండ తీవ్రత ఉన్నపుడు ఆరుబయట కార్మికులతో పనిచేయించకుండా చూడటం, ఎక్కడికక్కడ తాగునీటి సౌకర్యం కల్పించటం, ప్రజారోగ్య సిబ్బందిని సంసిద్ధంగా ఉంచటం, అవసరమైన ప్రాంతాలకు సహాయబృందాలను తరలించటం కీలకం. ఇలాంటి జాగ్రత్తలతో వడగాడ్పు మరణాల నివారణ సాధ్యమే. అలాగే ఇరుకిరుకు ఇళ్లలో మగ్గి పోయే మురికివాడల ప్రజలనూ, మరీ ముఖ్యంగా వృద్ధులనూ, గర్భిణులనూ, బాలింతలనూ వడగాడ్పుల నుంచి సంరక్షించటానికి ఏం చేయగలమో ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ కృషిలో స్థానిక సంస్థల పాత్ర పెంచటం, అందుకు అవసరమైన నిధులు అందించటం ప్రభుత్వాల బాధ్యత. అన్నిటికీ మించి వడగాడ్పులను ప్రకృతి వైపరీత్యంగా పరిగణించి, ఆ విషయంలో పౌరులను అప్రమత్తం చేసేందుకూ, వారిని కాపాడేందుకూ అనుసరించాల్సిన విధానాలను రూపొందించటం తక్షణావసరమని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. -
Weather: జాగ్రత్త.. ఈసారి ఎండల మంటలే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. సాధారణంతో పోలిస్తే 2–3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వేడి సెగలు రేగుతున్నాయి. గత రెండు నెలలకు సంబంధించి ఈ రాష్ట్రాల్లో అత్యంత లోటు వర్షపాతం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తీవ్ర వర్షాభావం,అధిక వేడి ఉండే ఎల్‌నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోందని.. అంటే వచ్చే రెండు నెలలు ఎండల మంటలు తప్పకపోవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఈసారి భగభగలు తప్పనట్టే.. దేశవ్యాప్తంగా ఈ వేసవికాలంలో భానుడి భగభగలు తప్పకపోవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఆసియా ఖండంలోని దేశాల్లో తీవ్ర వర్షాభావం, అధిక వేడికి కారణమయ్యే ఎల్‌నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగవచ్చని పేర్కొంటున్నారు. భారత వాతావరణ శాఖ కూడా దీనిపై ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. ఈసారి సాధారణం కంటే అధికంగా వడగాడ్పులు వీయవచ్చని కూడా అంచనా వేసింది. పరిస్థితులు కూడా ఇందుకు అనుగుణంగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం (మార్చి చివరివారంలో) ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు, మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. చాలా చోట్ల 40 డిగ్రీలకుపైనే నమోదు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ, పశి్చమ భారత రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌లలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తీవ్రమవుతున్న ఎండల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు, మార్గదర్శకాలు జారీ చేసింది. తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. ఉత్తర భారతంలోనూ పలు ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోత.. ఆరు బయట జాగ్రత్త అధిక ఉష్ణోగ్రతలతో వాతావరణంలో తేమ శాతం పెరిగిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. దీనికితోడు పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తుండటం మరింత సమస్యగా మారిందని నిపుణులు చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయట తిరగకూడదని, ఆరు బయట అధిక శారీరక శ్రమతో కూడిన పనులు చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత మేర నీటిని తాగుతూ ఉండాలని, శరీరం చల్లగా ఉండేలా చూసుకోవాలని వివరిస్తున్నారు. జిమ్‌లు, బయటా వ్యాయామాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని.. డీహైడ్రేషన్, ఇతర పరిస్థితుల వల్ల ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బతినవచ్చని హెచ్చరిస్తున్నారు. ‘దక్షిణం’లో తీవ్ర వర్షాభావం.. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో కాస్త లోటు నుంచి సాధారణ వర్షపాతం నమోదైనట్టు గణాంకాలు చెప్తున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీలు అదనంగా నమోదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనూ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో తేమశాతం పెరగడంతో ఉక్కపోత కూడా తీవ్రంగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో.. రాత్రిపూట కూడా వేడిగా ఉంటున్న పరిస్థితి ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. కాగా.. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటినట్టు రాష్ట్ర ప్రణాళిక–అభివృద్ధిశాఖ పేర్కొంది. ఈ మేరకు ఉష్ణోగ్రతల అంచనాలను విడుదల చేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏప్రిల్‌లో మరింత ఎక్కువ ఎండలు.. గతేడాది కంటే వేగంగా ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వాతావరణంలో నెలకొంటున్న మార్పుల వల్లే ఈ పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే వారం రోజుల పాటు ఎండ వేడి ఎక్కువగా ఉన్నా వడగాడ్పులు వీచే అవకాశం లేదు. ఏప్రిల్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన ఉష్ణోగ్రతల అంచనాలను ఏప్రిల్ 1న విడుదల చేస్తాం. గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా మూడు రోజులపాటు సాధారణం కంటే 2, 3 డిగ్రీలు అధికంగా నమోదై, మరింత పెరిగే అవకాశం ఉన్నప్పుడు అలర్ట్‌లను జారీ చేస్తాం. ఏప్రిల్ నుంచి వేసవి ముగిసేవరకు ఉష్ణోగ్రతల అంచనాలు, జాగ్రత్తలపై రోజువారీగా బులిటెన్ విడుదల చేస్తాం. – నాగరత్న, ఐఎండీ డైరెక్టర్ ప్రధాన కేంద్రాల్లో ఉష్ణోగ్రతల తీరు (డిగ్రీల సెల్సియస్‌లలో) కేంద్రం గరిష్టం కనిష్టం ఆదిలాబాద్ 40.8 25.5 భద్రాచలం 40.0 25.0 నిజామాబాద్ 39.9 25.0 ఖమ్మం 39.6 24.0 నల్లగొండ 39.5 24.2 హైదరాబాద్ 39.2 24.6 మహబూబ్‌నగర్ 39.2 25.0 మెదక్ 39.2 21.1 దుండిగల్ 39.1 22.2 హకీంపేట్ 39.0 20.1 రామగుండం 38.6 24.6 హన్మకొండ 38.0 22.5 ఈ జాగ్రత్తలు తప్పనిసరి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరుబయట పనిచేసేవారు, ఏదైనా పని కోసం బయటికి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. తరచూ నీళ్లు తాగాలని, డీహైడ్రేషన్ తలెత్తకుండా చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఇంకా వైద్యులు సూచనలు ఇవీ.. బయటికి వెళ్లేవారు తెలుపు, లేత రంగుల పలుచటి కాటన్ వ్రస్తాలు ధరించాలి. తలపై టోపీ పెట్టుకోవాలి. లేదా రుమాలు చుట్టుకోవాలి. నీళ్లు, నిమ్మరసం, కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగుతూ ఉండాలి. ఎండ వేడిలో అధికంగా పనిచేయకూడదు. ఇబ్బందిగా అనిపిస్తే చల్లని ప్రదేశంలో సేదతీరాలి. అధిక వేడి వల్ల ఆహారం త్వరగా పాడైపోతుంది. అలాంటివి తింటే డయేరియాకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు మధ్యాహ్నం పూట బయటికి వెళ్లొద్దు. -
నిప్పుల కొలిమి.. తీవ్రమైన వేడి ప్రాంతంగా రాష్ట్రంలోని ఆ జిల్లాలు
సాక్షి, అమరావతి: భానుడి విశ్వరూపంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం అన్ని జిల్లాల్లోనూ (శ్రీ సత్యసాయి మినహా) ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో అయితే ఎండ మండిపోయింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని అన్ని మండలాల్లో 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడాన్ని బట్టి అక్కడ ఎండ తీవ్రతను అంచనా వేయవచ్చు. మన్యం ప్రాంతంలోనూ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురంలో అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ప్రకాశం జిల్లా పచ్చవలో 46.2, కృష్ణా జిల్లా కొండూరులో 46, గుంటూరు జిల్లా పొన్నూరులో 45.9, పల్నాడు జిల్లా రావిపాడులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2021, 22 సంవత్సరాల్లో వేసవి ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో 46 డిగ్రీలు దాటలేదు. 45 డిగ్రీలకు చేరుకున్నా అది కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. కానీ ఈ సంవత్సరం 46 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవగా, మెజారిటీ ప్రాంతాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైంది. వచ్చే రెండు రోజులు మరింత తీవ్రం వచ్చే రెండు రోజులు ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. కోస్తా జిల్లాల్లో తీవ్రమైన హీట్ వేవ్ ఉంటుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. మంగళవారం 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల, కొల్లిపర, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు మండలాలు, కృష్ణా జిల్లా పెనమలూరు మండలం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో తీవ్రవడగాల్పులు ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండబారిన పడకుండా చూసుకోవాలన్నారు. ఎక్కువగా నీరు తాగాలి ఈ ఉష్ణోగ్రతల ప్రభావంతో శరీరంలో నీటిశాతం తగ్గిపోయి హెపటైటిస్–బి వచ్చే ప్రమాదం ఉంది. ఎండలో పనిచేసే వారు ఎక్కువగా నీటితో పాటు పళ్లరసాలు, బార్లీ, మజ్జిగ వంటివి తీసుకోవాలి. ఎండలో పనిచేసేవారిలో విపరీతమైన నీరసం, తలనొప్పి, పిక్కలు పట్టేయడం, తల విసిరేయడం వంటి లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా డీహైడ్రేషన్‌కు గురైనట్లు గుర్తించాలి. వారు నీడలోకి చేరి నీరు ఎక్కువగా తీసుకుని సేదతీరాలి. కళ్లకు ఇబ్బందులు రాకుండా నల్ల కళ్లద్దాలు వాడాలి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటలు వరకు ప్రయాణాలు చేయకూడదు. – డాక్టర్ వడ్డాది సురేష్, ఎండీ, రాజమహేంద్రవరం. వడదెబ్బకు ప్రకాశంలో నలుగురు మృతి ఒంగోలు: ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురై సోమవారం ప్రకాశం జిల్లాలో నలుగురు మృతిచెందారు. జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటకు చెందిన సాబినేని సుబ్బమ్మ (56), పాపిశెట్టి సూరిబాబు(57), పొందూరి సుబ్బరామిరెడ్డి (68), సింగరాయకొండ మండలం పాతసింగరాయకొండ పంచాయతీకి చెందిన కొట్టే పేరమ్మ(65) వడదెబ్బకు గురై మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం నుంచే ఎండ తీవ్రత.. ఉదయం 6 గంటలకే మొదలవుతున్న ఎండ వేడి సాయంత్రం 6 గంటలు దాటినా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 40 డిగ్రీలు, 2, 3 గంటల సమయానికి 44 నుంచి 46 డిగ్రీలకు పెరుగుతోంది. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 30 నుంచి 36 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
‘సెగ’దరగ.. ఇదేం భగభగ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మరింతగా మండనున్నాయి. ఈ నెల మొదటి వారమంతా ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినప్పటికీ గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదవుతుండగా రానున్న మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింత అధికంగా నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో 42–44 డిగ్రీల సెల్సియస్ సగటు ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని అంచనా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ ఉష్ణోగ్రతలు 40–42 డిగ్రీల సెల్సియస్ మధ్యన నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 45.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా అదే జిల్లాలోని జన్నారంలో 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికం... వేసవి సీజన్ చివరి దశలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని, ప్రస్తుతం సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఉష్ణోగ్రతల మధ్య హెచ్చుతగ్గులుంటాయని ఐఎండీ అధికారులు వివరిస్తున్నారు. ఆదివారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఖమ్మంలో ఈ సీజన్ సాధారణ ఉష్ణోగ్రత కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. అలాగే నల్లగొండ, భద్రాచలంలో సాధారణంకంటే 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉండటంతో దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, వీలైనంత వరకు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. బలహీన పడుతున్న ‘మోక’ అతి తీవ్ర తుపానుగా కొనసాగిన ‘మోకా’తుపాను మయన్నార్ సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరం దాటడంతో బలహీనపడుతుందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రానికి వాయవ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వివరించింది. -
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. వచ్చే 3 రోజులు ఎండ మంటే
సాక్షి, అమరావతి: వచ్చే 3 రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలకంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం నుంచి ఎండ తీవ్రత ఇంకా పెరగనుంది. ఆదివారం కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని 136 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 173 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం నంద్యాల జిల్లా గోస్పాడులో అత్యధికంగా 42.2, తూర్పుగోదావరి జిల్లా నందరాడ, ముగ్గుళ్లలో 41.9, బాపట్ల జిల్లా అమృతలూరులో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యంత తీవ్ర తుపానుగా ‘మోకా’! సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అతి తీవ్ర తుపాను అత్యంత తీవ్ర తుపానుగా బలపడింది. ప్రస్తుతం ఇది గంటకు 22 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోంది. శనివారం రాత్రికి పోర్టుబ్లెయిర్‌కు వాయవ్యంగా 610 కి.మీలు, బంగ్లాదేశ్‌లోని కాక్స్బజార్కు దక్షిణ నైరుతి దిశలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ కాక్స్‌బజార్ (బంగ్లాదేశ్) – క్యాక్‌ప్యూ(మయన్మార్)ల మధ్య సిట్వే వద్ద ఆదివారం మధ్యాహ్నం అత్యంత తీవ్ర తుపానుగా తీరాన్ని దాటనుంది. ఆ సమయంలో గరిష్టంగా గంటకు 210 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ శనివారం రాత్రి ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. -
నేడు ఏపీలో పెరుగనున్న ఎండ తీవ్రత
-
ప్రకృతికి శిరమొగ్గి నిలిచిన ‘శివుడు’!
ఎండలు మండిపోతాయని ప్రతిసారీ చెప్పుకొంటున్నప్పటికీ, ఈసారి ఆ మండిపోవడం అక్షరాలా నిజమని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆసియా ఖండ చరిత్రలోనే విలయతాండవం చేస్తాయని భయపెడుతున్నారు కూడా. అయితే వాతావరణ మార్పుల వల్ల దుర్భరమైన వేడిగాడ్పులు ఎలా వస్తున్నాయో, భరించలేని చలిగాలులు కూడా అంతే వీస్తున్నాయి. ఇలాంటివన్నీ ఎప్పుడో మనకు కవి సమయాలయ్యాయి. దప్పిక వల్ల చెట్లు తమ నీడల్ని తామే తాగుతున్నట్లు చిత్రించాడు నన్నెచోడుడు. శివుడు కూడా చలి భరించలేక హిమాలయాలను వదిలాడని చమత్కరించాడు సారంగు తమ్మయ్య. ఏమైనా మనుషుల శరీరాలు ఈ రెంటికీ అలవాటు పడాలి. వీటన్నింటినీ భరిస్తూనే లోకయాత్ర చేస్తూ ఉండాలి. ‘‘చరిత్రలో ఇంతవరకు కనీవినీ ఎరుగని ఎండలు, వేడి గాలులు ఆసియా దేశాల్ని పీల్చి పిప్పి చేస్తాయి. ఈ అసాధారణ పరిణామం భారత, చైనా దేశాలలో పెక్కుమంది ప్రజల దుర్మరణాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్–మే నెలలు ఆసియా ఖండ చరిత్రలోనే విలయతాండవంగా భావించవచ్చు. ఉత్తర, తూర్పు భారత రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు తగ్గవు. ఒకవేళ వేడి తీవ్రత తగ్గని పక్షంలో పరిణామాలు ప్రమాదకరంగా మారవచ్చు’’ – మాక్సిమిలియానో హెరీరా, వాతావరణ శాస్త్రవేత్త (‘గార్డియన్’ పత్రిక; 20 ఏప్రిల్ 2023) వాతావరణ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం, భూమిపై ఏకంగా 20 లక్షల ఏళ్లపాటు వర్షం పడిందన్న వార్త ‘కలగుండు’ పడినట్లయింది. అంటే సృష్టి, వినాశాల మధ్య భూమి, ప్రకృతి పబ్బం గడుపుకుంటూ వచ్చాయని భావించాలి. సృష్టి, వినాశాలు ప్రాకృతిక సహజాలు. పెరుగుతూ వచ్చిన సృష్టి రహస్యాల పరిజ్ఞానంతో మానవ జాతి తన మనుగడను కాపాడుకుంటూ వస్తోంది. ఇదిలా ఉండగా, దక్షిణాసియా దేశాలకు దఫదఫాలుగా వినాశంగా పరిణమి స్తున్న ఇండో–పసిఫిక్ వాతావరణ మార్పులు ఒకసారి దుర్భరమైన వేడి గాలులకు (ఎల్‌నినో), మరోసారి అమితమైన చలి గాడ్పులకు (లానినా) కారణమవుతున్నాయి. 2009 నుంచి 2018 వరకు మన దేశంలో అసాధారణ వేడిగాడ్పులకు కారణమైనది ఎల్‌నినో. ఫలితంగా ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయి. ప్రతీ 2–7 సంవత్సరాలకు ఎల్‌నినో వరసగా దెబ్బతీస్తూనే వచ్చింది. ప్రకృతి వైపరీత్యం ఎంత దెబ్బతీయకపోతే, లోకాల్ని శాసించే శివుడు సహితం చలికి తట్టుకోలేక హిమాలయాల్ని వదిలి భూమ్మీద చెట్ల నీడను ఆశ్రయించాల్సిన గతి పడుతుంది! (‘హరుడు కైలాస కుధర నాథాగ్ర వసతి విడిచి/ వటమూల తలముల విశ్రమించె’.) ఈ సత్యాన్ని ‘వైజయంతీ విలాసం’ కావ్యం ద్వారా సారంగు తమ్మయ్య ప్రజలపై ప్రకృతి ప్రభావాన్ని తెలియ జెప్పడం కోసం ప్రకటించాడు. దుర్భాక రాజశేఖర శతావధాని తన ‘రాణా ప్రతాప సింహ చరిత్ర’లో హల్దీ్దఘాట్ కనుమ దగ్గర రాజపుత్రులకూ, మొగలాయీలకూ మధ్య జరిగిన యుద్ధాన్ని వర్ణిస్తూ, మధ్యాహ్నాన్నిలా చిత్రించాడు: ‘‘మెండై ఎండలు నిండె, నల్దెసల గ్రమ్మెన్ నిప్పులన్ గుప్పుచు ద్దండ గ్రీష్మ సమీరముల్ నిఖిల జగంబుల్ కడున్ డస్సె బ్ర హ్మాండబందు పొగల్ సెగల్ తటుములై వ్యాపించి మధ్యాహ్నమా ర్తాండుండుజ్వల కాండుడై గగనమధ్యం బందు మెల్గొందగన్.’’ ఇదిలా ఉండగా నన్నెచోడుడు ‘కుమార సంభవం’ కావ్యంలో, పార్వతి మండుటెండలకు పంచాగ్ని మధ్యంలో ఘోర తపస్సు చేస్తున్న సందర్భాన్ని వర్ణించాడు. ‘లోకులు భయపడేంత’గా వడగాలి వీచడాన్ని, ఆ వడగాలికి ఏనుగుల తలలు పేలిపోయి లోపలి ముత్యాలు పేలాలుగా పటపటా చిట్లిపోయినట్లు, దప్పిక కోసం ఎదురు చూసే చెట్లు తమ నీడల్ని తామే తాగుతున్నట్లు చిత్రించాడు. ఇక విశ్వనాథ పగటి ఎండల తీవ్రతల వల్ల జిల్లేడు కాయల్లా, వడ్లగింజల్లా, సున్నపురాయిలా విరిగిపోయి భూమి కాస్తా కకావికలైపోయిందని వర్ణించాడు! ఆధునికుడైన కవి కాకరపర్తి కృష్ణశాస్త్రి తన కాలంలోనే సముద్రం ఉప్పొంగడం, అది భూమిని ముంచేసిన ఘటనలను ‘ప్రళయ సంరంభం’ కవితలో కళ్లకు కట్టి చూపాడిలా: ‘‘ఆకసమంటుచున్ ఘుమ ఘుమార్భటితో దిశలన్ స్పృశించుచునే భీకర లీల లేచి అతివేల జవంబున వచ్చి వచ్చియ స్తోక తరంగ మొండుపడు దుస్సహమై ధరముంచి వైచి తా నేక పయోధి సూత్రముగ ఎంతయు జేసి శమించెనంతటన్’’! ఆంధ్ర సామ్రాజ్య విచ్ఛిన్నానికి ‘రాళ్లు’ కూడా దుఃఖంతో ఎలా కరిగిపోయాయో కవి కొడాలి సుబ్బారావు ఎంతో ఆర్ద్రతతో గుండె చెరువై ఇలా వర్ణించాల్సి వచ్చింది: ‘‘శిలలు ద్రవించి యేడ్చినవి, జీర్ణములైనవి తుంగభద్రలో పల గుడి గోపురంబులు, సభాస్థలులైనవి కొండ ముచ్చుగుం పులకు, చరిత్రలో మునిగి పోయిన దాంధ్ర వబంధరాధిపో జ్జ్వల విజయ ప్రతాప రభ సంబొక స్వప్న కథావిశేషమై.’’ ఇంతకూ, సంభవించే ప్రకృతి వైపరీత్యాలకేమిగాని మానవ హృదయంలో సహజంగానే ప్రకృతిని చూసి ఆనందించే లక్షణం మాత్రం చచ్చిపోదని చెబుతూ ప్రసిద్ధ కళాకారుడు, కవి అడవి బాపి రాజు ఓ చిరంతన సత్యాన్ని ప్రకటించిపోయారు: ‘‘అందరికీ ప్రకృతిని చూసి ఆనందించే లక్షణం ఉంది. ఆ ప్రకృతి భౌతిక రూపంగా, మనోమయ రూపంగా, బుద్ధి రూపంగా ప్రత్యక్షం అవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఆ ప్రకృతిలో మనస్సుకుగాని, హృదయానికిగాని, బుద్ధికిగాని, ఆత్మకుగాని ఆనందం కల్గించే ఒక దృశ్యం, ఒక రూపం, ఒక జీవితం, ఒక భావం, కళాశక్తి కలిగిన రసజ్ఞునికి గోచరించినప్పుడు – తనలో ఉండే ఆ కళా శక్తి పైకి ఒక స్వరూపంగా జన్మించాలని ఆవేదన పొందడం చేత కళా స్వరూపం ఉద్భవిస్తున్నది. ఆ కళా స్వరూపంలో ఉన్న ముఖ్య లక్షణం ఆనందం. ఆ సృష్టి భాషా స్వరూపమైతే కవిత్వం, వర్ణ స్వరూపమైతే చిత్ర లేఖనం, మూర్తి స్వరూపమైతే శిల్పం, అంగ విక్షేప స్వరూపమైతే నృత్యం, భవన స్వరూపమైతే ఆలయం అవుతుంది’’! ప్రకృతిలో మనం భాగం కాబట్టి, అందులో దఫదఫాలుగా ఇదే మానవుడి చేష్టల వల్లనో, ప్రకృతి సహజంగానో పెల్లుబుకి వచ్చే ఉపద్రవాలను భరిస్తూనే లోకయాత్ర సాగుతూండటం సహజ పరిణామం. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
రాష్ట్రంలో మంటలు కంటిన్యూ.. గ్రేటర్ మినహా రాష్ట్రమంతా ఆరెంజ్ అలర్ట్ జారీ
ఎండలు మండుతుండటంతో వేరుశనగ పంట తీసేందుకు వెళ్లిన కూలీలు.. ఆ మొక్కలనే గుడిసెగా మార్చు కుని పనిచేసుకుంటున్న దృశ్యమిది. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి గ్రామశివార్లలో ఈ దృశ్యం కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్ , ఆదిలాబాద్ సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రికార్డుస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలన్నా భయపడేలా వడగాడ్పులు వీస్తున్నాయి. గాలిలో తేమశాతం బాగా పెరగడంతో విపరీతంగా ఉక్కపోత ఉంటోంది. మరో రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడగాడ్పులు సైతం వీస్తాయని వివరించింది. 22 నుంచి కొన్నిరోజులు ఉపశమనం శనివారం (ఈ నెల 22వ తేదీ) నుంచి ఎండలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. కొన్నిచోట్ల సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉందని వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గవచ్చని అంచనా వేసింది. వాతావరణంలో నెలకొంటున్న పలు మార్పులే దీనికి కారణమని వివరించింది. దాదాపు నాలుగైదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గిన తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వాయవ్య తెలంగాణ, శుక్రవారం తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అప్రమత్తంగా ఉండాలి.. ఓవైపు అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. బయటికి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ఇంట్లోనే ఉండాలని పేర్కొంది. ఇక బుధవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీలుగా నమోదైనట్టు తెలిపింది. సాధారణం కంటే అధికంగా.. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మంలో సాధారణం కంటే ఏకంగా 3.2 డిగ్రీలు అధికంగా నమోదవడం గమనార్హం. నల్లగొండలో 2.4 డిగ్రీలు.. భద్రాచలం, మెదక్‌లలో 1.9 డిగ్రీలు, హన్మకొండలో 1.7 డిగ్రీలు, నిజామాబాద్, రామగుండంలలో 1.6 డిగ్రీల మేర అధికంగా నమోదైనట్టు తెలిపింది. – పగటి ఉష్ణోగ్రతలకు తగినట్టుగా రాత్రి ఉష్ణోగ్రతలూ సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు అధికంగా ఉంటున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చాలాచోట్ల అర్ధరాత్రి దాటే వరకు కూడా ఉక్కపోత కొనసాగుతోందని వివరించింది. – ఇక జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 44.5 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 44.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం తమ వెబ్సైట్లో తెలిపింది. – ఎండ తీవ్రత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం పది, పదకొండు గంటల సరికే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఏప్రిల్‌లోనే ఈ పరిస్థితి ఉంటే.. మే నెలలో ఎండల తీవ్రత మరెలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా భగభగలు న్యూఢిల్లీ: భానుడి ప్రతాపంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో, ఒడిశాలోని బారిపడలో 44.5 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీలో కొన్ని రోజులుగా 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఎండ ప్రచండంగా ఉంది. దాంతో త్రిపురలో ‘స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్’ ప్రకటించారు. కేరళలోనూ ఎండలు మండుతున్నాయి. పశ్చిమ బెంగాల్, ఏపీ, బిహార్ తదితర రాష్ట్రాల్లో తీవ్ర వడగాడ్పులు రెండు రోజులుంటాయని ఏపీలో ఈ నెల 21, 22ల్లో వర్షం పడొచ్చని వాతావరణ శాఖ చెప్పింది. -
రాష్ట్రం భానుడి భగభగలో మండుతోంది! సాదారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో సోమవారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటె ఎక్కువగా నమోదయ్యాయి. 119 కేంద్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు గుర్తించారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటె సగటున రెండు డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగినట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అత్యధికంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా రాజాంలో 41.8, నంద్యాల జిల్లా అవుకులో 41.6, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, విజయనగరం జిల్లా అల్లాడపాలెంలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు, హ్యుమిడిటీని విశ్లేషించినప్పుడు చాలా ప్రాంతాల్లో అసౌకర్య సూచికలు (డిస్కంఫర్టబుల్ ఇండెక్స్) పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు ఎండ ప్రభావంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు చెబుతున్నారు. ఎండ, ఉక్కపోతతో ఈ పరిస్థితి నెలకొందంటున్నారు. వారం రోజుల పాటు ఇలాగే వేడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెబుతున్నారు. మంగళవారం 26 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అడ్డతీగల, నెల్లిపాక, చింతూరు, గంగవరం, రాజవొమ్మంగి, వరరామచంద్రపురం, కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం తదితర మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. -
సవాలుకు సిద్ధమవుదాం!
గ్రీష్మ ఋతువు ఇంకా మొదలుకానే లేదు. కానీ శిశిరంలోనే, ఇంకా చెప్పాలంటే ఫిబ్రవరిలోనే గ్రీష్మ తాపం మొదలైపోయింది. 1901 నుంచి గత 122 ఏళ్ళలో ఎన్నడూ లేనంతటి సగటు పగటి ఉష్ణో గ్రత (29.54 డిగ్రీలు) ఫిబ్రవరిలో నమోదైంది. నిరుడు మార్చి కూడా ఇలాగే భారత ఉపఖండమంతటా చండ్రనిప్పులు చెరిగింది. దీన్ని బట్టి ఇక ఈ వేసవి ఎలా ఉండనుందో ఇప్పటికే అర్థమైపోయింది. దేశంలో ఇటు వేసవిలో, అటు శీతకాలంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. దేశంలో వాతావరణంపై అధ్యయనం చేసే ‘సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ’ (సీస్టెప్) ఈ సంగతి వెల్లడించింది. ఒక్కమాటలో వాతావరణ సంక్షోభం ఇక ఎప్పుడో నిజమయ్యే జోస్యం కానే కాదు. ఇప్పటికే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, ఆకస్మిక వర్షాలతో తరచూ సంభవిస్తున్న సంఘటన. ఈ వేసవిలో భానుప్రతాపం తీవ్రంగా ఉండనుందన్న హెచ్చరికలతో, స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి, ఈ సోమవారం నిపుణులతో సమావేశం జరపడం గమనార్హం. గత రెండు దశాబ్దాల (2000 – 2019) డేటా చూస్తే, కనివిని ఎరుగని ఉష్ణోగ్రతలతో ప్రపంచ వ్యాప్తంగా ఏటా సగటున 50 లక్షల మంది మరణిస్తున్నారు. ఇది 2021 జూలైలో ప్రచురితమైన ‘ది లాన్సెట్’ అధ్యయనం తేల్చిన మాట. మన దేశంలోనే 7.4 లక్షల మంది చనిపోతున్నారు. దేశంలో వాతావరణ మార్పులతో దుర్మరణాలు 55 శాతం పెరిగాయి. ఇక, కేవలం 30 ఏళ్ళలో (1990 – 2019) వేసవిలో మన కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల నుంచి 0.9 డిగ్రీల మేర పెరిగాయి. దేశంలో నూటికి 54 జిల్లాల్లో చలికాలంలోనూ ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. చర్మాన్ని చీల్చే ఎండతో వ్యవసాయం సహా వాతావరణ ఆధారిత రంగాలు ప్రభావితమై, జీవనోపాధి దెబ్బ తింటోంది. దాదాపు 167.2 బిలియన్ పని గంటలు నష్టం. తక్కువ వర్షపాతం, ఎక్కువ ఉష్ణోగ్రతలతో గోదుమల దిగుబడి 2020–21తో పోలిస్తే 2021–22లో దాదాపు 30 లక్షల టన్నులు పడిపోయింది. రానురానూ భూతాపోన్నతితో పాటు వడగాడ్పులు, పర్యవసానాలూ పెరుగుతాయని వాతావ రణ మార్పులపై అంతర్ ప్రభుత్వ సంఘం ఆరో అంచనా నివేదిక సారాంశం. ఈ నేపథ్యంలోనే ప్రకృతి వైపరీత్యాల ముప్పు తగ్గింపు జాతీయ వేదిక (ఎన్పీడీఆర్ఆర్) సైతం ఈసారి ‘మారుతున్న వాతావరణానికి తగ్గట్టు స్థానిక సంసిద్ధత’ అనే అంశాన్ని చేపట్టింది. రేపు శుక్రవారం జరిగే ఈ 3వ సదస్సును ప్రధానే ప్రారంభిస్తుండడం విశేషం. జోషీమఠ్ లో భూపాతాలు సహా పలు అంశాలపై చర్యల్ని ఇందులో చర్చించనున్నారు. ముంచుకొస్తున్న మార్పులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం స్వాగత నీయం. వాతావరణ సవాలుపై చర్యలకు ప్రభుత్వనిధుల కేటాయింపు తగ్గిందన్న వార్తలే విషాదం. పసిఫిక్ మహాసముద్రంలో పవనాల సహజ మార్పు వల్ల ఈ ఏడాది ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగి, వాతావరణ ధోరణుల్లో సంక్షోభం తప్పకపోవచ్చని శాస్త్రవేత్తల హెచ్చరిక. ఈ 2023లో ఉష్ణవాతావరణ ధోరణి అయిన ఎల్ నినో మళ్ళీ విరుచుకుపడే ప్రమాదం నూటికి తొంభై పాళ్ళుందట. అదే జరిగితే, ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల మేర పెరుగుతాయి. అంటే, ఈ శతాబ్దం చివరికి భూతాపోన్నతిని ఏ స్థాయికి నియంత్రించాలని ప్రపంచ నేతలు అంగీకరించారో ఆ చెలియలికట్టను ఇప్పుడే చేరుకుంటాం. దీనివల్ల 70 – 90 శాతం మేర పగడపు దిబ్బలు కనుమరుగై పోతాయట. ఇవన్నీ యావత్ ప్రపంచానికి, వ్యవసాయ ఆధారిత భారత్‌కు ప్రమాద ఘంటికలు. ఈ అత్యవసర పరిస్థితిని తట్టుకోవాలంటే 2030 కల్లా వర్ధమాన దేశాలు ఏటా 30 వేల కోట్ల డాలర్లు ఖర్చు చేయాలని ఐరాస అంచనా. ప్రపంచ జనాభాలో 12 శాతమే ఉన్నా, గ్రీన్ హౌస్ వాయువుల్లో 50 శాతానికి బాధ్యులైన ధనిక దేశాలు వర్ధమాన దేశాలకు అండగా నిలవాలి. మన వద్ద మార్చి, మే మధ్య ఉష్ణపవనాలకు తోడు మరో సమస్య రానుంది. వినియోగం బాగా పెరిగే వేసవిలో విద్యుత్ కొరత సహజం. గత అయిదేళ్ళలో దేశంలో సౌర విద్యుదుత్పత్తి 4 రెట్లు పెరిగింది గనక నడిచిపోయింది. అది పగటివేళ వరకు ఓకే. కొత్తగా థర్మల్, హైడ్రోపవర్ సామర్థ్యా లను పెంచుకోనందు వల్ల రాత్రి వేళల్లో కష్టం కానుంది. ఈ వేసవి రాత్రుళ్ళలో గిరాకీ, సరఫరాల మధ్య 1.7 శాతం లోటు రానుంది. ఒక్కమాటలో, ఈ వేసవిలో రాత్రిపూట దేశంలో కరెంట్ కష్టాలు తీవ్రం కానున్నాయి. ఆందోళన పడాల్సింది లేదని ప్రభుత్వాధికారులు పైకి అంటున్నా, త్వరితగతిన థర్మల్, హైడ్రో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోకుంటే ఈ వేసవిలో ప్రజలకు కష్టాలు తప్పవు. ముఖ్యంగా రాత్రింబవళ్ళు నడిచే ఆటో, ఉక్కు, ఎరువుల తయారీ పరిశ్రమలు చిక్కుల్లో పడతాయి. ముందే ఒక అంచనా రావడంతో నగర వ్యూహకర్తల మొదలు గ్రామీణ రైతుల దాకా అందరూ ఇప్పుడిక నష్టనివారణ చర్యలకు దిగాలి. భూ, జల నిర్వహణల్లో తగు మార్పులు చేసుకోవాలి. త్వరిత దిగుబడినిచ్చే కొత్త పంట రకాలపై రైతులకు మార్గదర్శనం చేయాలి. స్థానిక పాలనాయంత్రాంగాలు ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు చేయాలి. నీడనిచ్చే ఉద్యానాలు, నీటి వసతి లాంటి పరిష్కార మార్గాలు చూపాలి. అహ్మదాబాద్‌లో 2010లో గాడ్పులకు 1300కు పైగా మరణించాక, సిద్ధం చేసిన కార్యాచరణ ప్రణాళిక ఏటా 1200 మరణాల్ని నివారిస్తున్నట్టు అంచనా. అలాంటివి అంతటా అమలు చేయాలి. ఉష్ణతాపంతో తలెత్తే ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొనేలా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను సమాయత్తం చేయాలి. వాతావరణ సంక్షోభాలు ఇక నిత్యకృత్యం కానున్నందున వీటి దుష్ప్రభావాన్ని దీటుగా ఎదుర్కొనేలా పటిష్ఠమైన విధాన రూపకల్పనే పాలకుల తక్షణ కర్తవ్యం. -
ఈ వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతలే
సాక్షి, అమరావతి: ఈ వేసవిలో రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణశాఖ స్పష్టం చేసింది. తీవ్రమైన ఎండలు ఉండే అవకాశాలు తక్కువేనని తెలిపింది. ఎల్‌నినో పరిస్థితుల వల్ల ఎండల తీవ్రత పెరుగుతుందని, వర్షాభావం నెలకొంటుందని కొన్ని ప్రైవేటు వాతావరణ సంస్థలు అభిప్రాయపడ్డాయి. కానీ భారత వాతావరణశాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో ఎల్‌నినో ప్రభావం ఉన్నట్లు నిర్థారించలేదు. గత మూడు, నాలుగేళ్లుగా కొనసాగుతున్న లానినో బలహీనపడుతోందని, అదే సమయంలో ఎల్‌నినో న్యూట్రల్‌గా ఉందని స్పష్టం చేసింది. లానినో ఉంటే విస్తృతంగా వర్షాలు పడతాయి. ఎల్‌నినో ఉంటే వర్షాభావం నెలకొని కరువు పరిస్థితులు ఏర్పడతాయి. వాతావరణశాఖ తాజా నివేదికలో ఎల్‌నినో న్యూట్రల్‌గా ఉందని చెప్పిన నేపథ్యంలో ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయి. అంటే గత సంవత్సరంలో ఉన్న వాతావరణ పరిస్థితులే ఈసారి ఉండే అవకాశం ఉంది. 44 నుంచి 46 డిగ్రీల మేర అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం కూడా ఇవేస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఏడాది ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదే సమయంలో హీట్‌వేవ్ ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. అంటే మొత్తంగా చూసుకున్నప్పుడు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనా అక్కడక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. చలిగాలులు కూడా ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలలోపే ఉంటున్నాయి. వచ్చే 10–15 రోజుల్లో ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంది. అలాగే వడగాలుల తీవ్రత కూడా పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. -
ఆదిలోనే అధిక ఉష్ణోగ్రతలు
సాక్షి, అమరావతి: వేసవి ప్రారంభంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ప్రతాపం చూపుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 36 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో అత్యధికంగా 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల్లో 37 నుంచి 38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తా జిల్లాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో 36–38 డిగ్రీల ఉష్ణోగ్రతలొచ్చాయి. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న నాలుగైదు రోజుల్లో ఎండల తీవ్రత ఇంకా పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో 3– 5, రాయలసీమలో 2–3 డిగ్రీల మేర సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పొడి గాలుల కారణంగా ఎండ తీవ్రత, ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది. -
ఠారెత్తిస్తున్న ఎండలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల నుంచి ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండ తీవ్రత కొనసాగుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా కోస్తా జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వేడితోపాటు ఉక్కపోత పెరిగిపోతోంది. ఉదయం 9 గంటలకే.. మధ్యాహ్నం 12 గంటలకు ఉండే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు ఉష్ణోగ్రతలు పెరగడం, మరోవైపు గాలిలో తేమ శాతం తగ్గడంతో తీవ్ర వేడి వాతావరణం ఉంటోంది. ఎండ, వడ గాల్పులు, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బుధవారం రోహిణి కార్తె కావడంతో రెండు, మూడు రోజులు ఎండ తీవ్రత ఇంకా పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. వచ్చే వారం పాటు ఎండలు ఎక్కువగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 45.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు, ఉండ్రాజవరం, అత్తిలిలో 45.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. కామవరపుకోటలో 45.6, కృష్ణా జిల్లా నందివాడ, గుడివాడల్లో 45.3, తాళ్లపూడి, గోపాలపురంల్లో 44.9, ఉంగుటూరులో 44.8, రాజమహేంద్రవరంలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, దక్షిణ, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో ఇవి మరింత ముందుకు సాగేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు పేర్కొంది. ఈ నెల 26న శ్రీలంకను, జూన్ 1న కేరళను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశాలున్నాయి. -
ఎండలు ‘మండే’న్
సాక్షి, అమరావతి: భానుడి భగభగలు నిప్పుల కొలిమిని తలపించాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండాయి. వేడి తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో సోమవారం 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా చందర్లపాడు, కంచికచర్లలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నందలూరు, పెనగలూరు, చిట్వేల్, ప్రకాశం జిల్లా దోర్నాలలో 43.4 డిగ్రీలు, కర్నూలు జిల్లా కల్లూరు, వెల్దుర్తి, నెల్లూరు జిల్లా గూడూరు, తిరుపతి అర్బన్‌లో 43.1 డిగ్రీలు, కర్నూలు, కృష్ణా జిల్లా తిరువూరు, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, పుల్లల చెరువు, ముండ్లమూరులో 43 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, రాజమండ్రి, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో 42.9 డిగ్రీలు, చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురంలో 42.8, కర్నూలు జిల్లా పాణ్యం, బనగానపల్లె, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 42.6, పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం, తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట, కిర్లంపూడి, ప్రకాశం జిల్లా తర్లపాడులో 42.5, చిత్తూరు జిల్లా చిత్తూరు, గుడిపలలో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 152 మండలాల్లో తీవ్రమైన వేడి రాష్ట్రంలో 670 మండలాలు ఉండగా.. 514 మండలాల్లో సోమవారం బాగా వేడి వాతావరణం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 152 మండలాల్లో మాత్రం తీవ్రమైన వేడి గాలులు ఉన్నట్లు పేర్కొంది. నెల్లూరు, వైఎస్సార్, తిరుపతి, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఎక్కువ మండలాల్లో ఎండ ప్రభావం అధికంగా ఉంది. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో ఎండ వేడి, ఉక్కపోత వాతావరణంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మంగళ, బుధవారాలు కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. విశాఖ ఏజెన్సీలోనూ అక్కడక్కడా జల్లులు పడ్డాయి. వడదెబ్బకు ఇద్దరు మృతి నారాయణవనం (తిరుపతి): తిరుపతి జిల్లా నారాయణవనంలో వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. స్థానిక కోమటి బజారువీధికి చెందిన దొరస్వామి కుమారుడు ప్రేమ్(12) ఆదివారం వడదెబ్బ బారినపడి తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. అరుణానది సమీపంలోని డంపింగ్ యార్డు వద్ద ప్లాస్టిక్, ఇనుప వ్యర్థాలను సేకరిస్తున్న పళనిస్వామి (47) వడదెబ్బకు గురై అక్కడికక్కడే మరణించాడు. -
AP: భగభగలు..
సాక్షి, అమరావతి/రెంటచింతల: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఉ.9 గంటల నుంచి సా.5 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. వారం రోజులుగా అన్ని ప్రాంతాల్లో సగటున 3 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా ఉ.8 నుంచి 10 గంటల మధ్య 26–28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాల్సి వుండగా ప్రస్తుతం 30 నుంచి 32 డిగ్రీలు నమోదవుతోంది. 10 నుంచి 12 గంటల మధ్య 36–38 డిగ్రీలు ఉండాల్సి వుండగా 40 డిగ్రీలు నమోదవుతోంది. ఇక మ.12–3 గంటల మధ్య 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 26–29 నుంచి 30–32 డిగ్రీలకు పెరిగాయి. మే నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఇక మే 8వ తేదీ వరకు ఈ పరిస్థితి ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. ఆ తర్వాత నెలాఖరు వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు.. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ను అతలాకుతలం చేస్తున్న వేడిగాలులు అక్కడి నుంచి తెలంగాణ మీదుగా ఒడిశా వైపు వీస్తున్నాయి. ఈ గాలులు ఉత్తరాంధ్ర మీదుగా వెళ్తుండడంతో పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోను వాటి ప్రభావం ఉంటోంది. నిప్పుల కొలిమిలా రెంటచింతల గుంటూరు జిల్లాలోని రెంటచింతల నిప్పుల కొలిమిని తలపిస్తోంది. బుధ, గురు, శుక్రవారాలలో వరుసగా మూడ్రోజులుగా 44.6, 44.2 45.4 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. శనివారం గరిష్టంగా 47.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 29.5 డిగ్రీలుగా నమోదు కావడంతో ఒక్కసారిగా రెంటచింతల అగ్నిగుండంగా మారింది. పనులకు వెళ్లిన కూలీలు ఎండకు తట్టుకోలేక ఉ.11 గంటలకే ఇంటి ముఖం పట్టారు. వడగాడ్పులతో వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్నారులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. అలాగే, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా పడమలలో అత్యధికంగా 44.9 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కలిగిరిలో 44.6, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో 44.1, శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 44, ప్రకాశం జిల్లా యద్ధనపూడి, కర్నూలు జిల్లా మహానంది, పెరుసోమల, ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల, గొల్లవిడిపిలో 43.9, అనంతపురం జిల్లా తరిమెలలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ► సాధ్యమైనంత వరకు ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకూడదు. ► తలపై టోపీ లేకపోతే కర్చీఫ్ కట్టుకోవాలి. పలుచటి కాటన్ వస్త్రాలు ధరించడం మేలు. ► ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ కలిపిన నీటిని తాగాలి. ► వడ దెబ్బకు గురైన వారిని వెంటనే చల్లటి ప్రాంతానికి చేర్చాలి. తడిగుడ్డతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి. ► మంచినీరు ఎక్కువగా తాగాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు ఒక గ్లాసు మంచి నీరు తాగాలి. ► ఎండలో నుంచి వచ్చిన వెంటనే చల్లని నిమ్మరసం, కొబ్బరినీరు తాగాలి. ► ఎండలో ఉన్నప్పుడు తల తిరుగుతుంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. 5న అండమాన్ సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం దక్షిణ అండమాన్ సముద్రంలో మే 5న అల్పపీడనం ఏర్పడనుంది. తొలుత 4న ఆ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన తర్వాత 24 గంటల్లో అల్పపీడనంగా మారుతుంది. అనంతరం బలమైన అల్పపీడనంగాను, ఆపై వాయుగుండంగాను బలపడుతుంది. ఇది ఉత్తర, ఈశాన్య దిశగా కదులుతూ మయన్మార్ వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రంపై అంతగా ప్రభావం ఉండే అవకాశంలేదు. అందుకు భిన్నంగా పశ్చిమ/వాయవ్య దిశగా పయనిస్తే మాత్రం రాష్ట్రంలో వర్షాలకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు.. ఈ వాయుగుండం తీరాన్ని దాటాక రాష్ట్రంలో ఉష్ణ తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్. మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. -
AP: ఎండ 'మండింది'
సాక్షి, అమరావతి: వేసవి ప్రారంభంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగింది. ప్రస్తుతం 37 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత సంవత్సరం పలుచోట్ల ఇదే సమయానికి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నా ఎండ వేడి మాత్రం గతంకంటె తీవ్రంగా ఉంది. ఉదయపు ఉష్ణోగ్రతలు పెరగడమే ఇందుకు కారణమని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. గతంలో ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండేవి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఇప్పుడు ఉదయపు ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఆ తర్వాత మధ్యాహ్నం 2, 3 డిగ్రీల వరకు పెరుగుతున్నాయి. దీంతో రోజులో ఎండ వేడి ఎక్కువవుతోంది. మరోవైపు గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడం వల్ల కూడా ఎండ వేడిమి పెరగడానికి కారణమవుతోంది. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ఉదయం, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ప్రభావంతో భూమి త్వరగా వేడెక్కుతోంది. ఫలితంగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనా ఎక్కువ గంటలు ఎండలు కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం ఎండలు ఎక్కువే ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెలలో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలల్లో 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రత 45.9 డిగ్రీలు. ఈ సంవత్సరం 1, 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగి 47 దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. బుధవారం కర్నూలు జిల్లా అవుకులో 39.3 డిగ్రీలు, నందవరంలో 39.2, తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో 39.1, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 39, గుంటూరులో 38, విజయవాడలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
12న అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల మధ్యలో బంగాళాఖాతంలోఈ నెల 12న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఈ నెల 13 నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం తేలికపాటి వానలు పడతాయన్నారు. మరోవైపు ఉత్తర ఈశాన్య తెలంగాణ, ఉభయగోదావరి జిల్లాల మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురు వానలు పడే సూచనలున్నాయి. మధ్య భారతదేశంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం కారణంగా రాష్ట్రంపై పొడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ కారణంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ అల్పపీడనం బలహీనపడేవరకు పరిస్థితులు ఇదే మాదిరిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. సోమవారం నుంచి వాయవ్య దిశగా గాలులు నెమ్మదిగా రాష్ట్రంపైకి వీయనుండటంతో వాతావరణంలో మార్పులు కనిపించనున్నాయి. గడిచిన 24 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నూజివీడులో 80 మిల్లీమీటర్లు, వంగరలో 70, కిర్లంపూడిలో 47.25, దుగ్గిరాలలో 41, దేవరాపల్లిలో 39.25, చందర్లపాడులో 39, సత్తెనపల్లిలో 38, కురుపాం, నూజెండ్లల్లో 35, అమరావతిలో 33.5, శంఖవరంలో 33, కంచికచర్లలో 30.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
Hottest Summer: ‘రికార్డు’ భగభగలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: గాలులు, వర్షాలతో తూర్పు తీరాన్ని వణికించిన యాస్ తుపాను.. మన రాష్ట్రంలో వ్యతిరేక ప్రభావం చూపింది. ఎండ భగభగలాడేలా చేసింది. తుపాను తేమగాలుల్ని తీసుకుపోవడంతో రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంతం నుంచి పొడిగాలులు నేరుగా మన రాష్ట్రం వైపు వస్తున్నాయి. ఫలితంగా బుధవారం భానుడు ప్రతాపం చూపించాడు. కోస్తా, రాయలసీమల్లోని చాలా ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా అల్లూరులో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నంలో మే నెలలో 43 ఏళ్ల తర్వాత.. 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 1978 మే 19న విశాఖ నగరంలో నమోదైన 42 డిగ్రీలు మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతగా ఉంది. బుధవారం నగరంలో 42.3 డిగ్రీలు నమోదైంది. ఈనెల 30 వరకు వడగాలులు, ఎండలు ఈనెల 30 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలతో పాటు వడగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలోని 36 మండలాలు, కృష్ణాలోని 15, తూర్పు గోదావరిలోని 12, విజయనగరంలోని 2, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఒక్కో మండలం చొప్పున 68 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అధికారులు తెలిపారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాలో 28, పశ్చిమ గోదావరిలో 18, విజయనగరంలో 14, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో మండలం చొప్పున మొత్తం 65 మండలాల్లో వడగాలులు వీస్తాయని చెప్పారు. కోస్తాలోని పలు ప్రాంతాల్లో 42 నుంచి 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈనెల మే 30 తర్వాత తేమగాలులు తెలంగాణ మీదుగా రాష్ట్రం వైపు రావడంతో ఎండల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుందని, వర్షాలు మొదలవుతాయని తెలిపారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గురువారం సాయంత్రానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతం మొత్తం నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. జూన్ 5వ తేదీ నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. వచ్చే 4 రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్ కన్నబాబు ఒక ప్రకటనలో కోరారు. -
Cyclone Yaas: ముంచుకొస్తున్న తుపాన్
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం రాత్రి వాయుగుండంగా మారింది. అది సోమవారం ఉదయానికి మరింత బలపడి తుపాన్‌గా మారనుంది. రాగల 24 గంటల్లో అతి తీవ్ర తుపాన్‌గా మారుతుందని విశాఖలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఇది.. పోర్టుబ్లెయిర్‌కు ఉత్తర దిశలో 560 కి.మీ దూరంలో, ఒడిశా బాలాసోర్‌కు ఆగ్నేయ దిశగా 590 కి.మీ, పశ్చిమ బెంగాల్ దిఘాకు ఆగ్నేయ దిశగా 670 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ 26వ తేదీ ఉదయం ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గర్లో బంగాళాఖాతం ప్రాంతాలకు చేరుకుంటుంది. అనంతరం పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రయాణించి.. పారాదీప్ – సాగర్ ఐలాండ్స్ వద్ద 26వ తేదీ సాయంత్రం లేదా రాత్రి తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని తీరం వెంబడి రాబోయే నాలుగు రోజుల పాటు గంటకు గరిష్టంగా 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. రాష్ట్రంపై తుపాన్ ప్రభావం పెద్దగా ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. కోస్తా, రాయలసీమల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని, వడగాలులు వీస్తాయని నిపుణులు చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో టెక్కలి, పాతపట్నం, పమిడిలో 4 సెంమీ, కళింగపట్నం, వీరఘట్టం, యలమంచిలి, కైకలూరు, నర్సీపట్నం, భీమవరం, విజయనగరంలో 3 సెంమీ వర్షపాతం నమోదైంది. భారీగా సహాయక సామాగ్రి సిద్ధం ► భారత రక్షణ దళాలు తుపాన్ సహాయక చర్యలకు సిద్ధమయ్యాయి. భారత వాయుదళం (ఎయిర్‌ఫోర్స్) 950 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) బృందాలతో పాటు జామ్‌నగర్, వారణాసి, పాట్నా, అరక్కోణం నుంచి 70 టన్నుల సహాయక సామాగ్రిని కోల్‌కతా, భువనేశ్వర్, పోర్టుబ్లెయిర్‌కు పంపించారు. ► 15 ఎయిర్క్రాఫ్టŠస్ ద్వారా వీటిని ఆయా ప్రాంతాలకు ఎయిర్ ఫోర్స్ అధికారులు పంపించారు. మరో 16 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్సŠ, 26 హెలికాఫ్టర్లను సహాయక చర్యల కోసం పశ్చిమ తీరంలో సిద్ధంగా ఉంచారు. ► తుపాన్ ప్రభావిత ప్రాంతాలైన భువనేశ్వర్, కోల్‌కతాకు 10, పోర్ట్‌బ్లెయిర్‌కు 5 విపత్తు సహాయక బృందాలు తరలించారు. తూర్పు నౌకాదళం నుంచి 8 యుద్ధ నౌకలు, నాలుగు డైవింగ్ బృందాలు, 10 ఫ్లడ్ రిలీఫ్ కోలమ్స్‌ని తరలించారు. ► విశాఖలోని ఐఎన్ఎస్ డేగా నుంచి రెస్క్యూ బృందాలతో నేవల్ హెలికాఫ్టర్లు, ఇండియన్ ఆర్మీకి చెందిన మూడు ఇంజినీరింగ్ టాస్క్‌ఫోర్స్ బృందాలు తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. కోవిడ్ నేపథ్యంలో బాధితులకు ఆక్సిజన్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్మ్డ్ ఫోర్స్ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. అదనపు ఆక్సిజన్ నిల్వలు సిద్ధం సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం యాస్ తుపానుగా తీవ్రరూపు దాల్చే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒడిశా నుంచి అదనపు ఆక్సిజన్ నిల్వలను తెప్పిస్తున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా, ఆర్ అండ్ బి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా చేస్తున్న మూడు ప్లాంట్లతోపాటు అన్ని ఆస్పత్రులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేట్టుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ► ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా రెండు రోజులుగా ఒడిశా నుంచి అదనపు ఆక్సిజన్ నిల్వలు తెప్పిస్తున్నాం. తద్వారా అన్ని జిల్లాల్లోనూ ఆక్సిజన్ బఫర్ నిల్వలు ఉండేట్టుగా చూస్తున్నాం. ►ఇప్పటికే ఒడిశాలోని రూర్కెలా నుంచి 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను తెప్పించింది. సోమవారం నాటికి మరో 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వలు రైలు ద్వారా రానున్నాయి. ► రూర్కెలా, కళింగ నగర్, అంగూల్ నుంచి రోడ్డు మార్గంలో మరో 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సవ్యంగా తీసుకువచ్చేందుకు ఒడిశా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ►ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి రెడ్‌క్రాస్ సొసైటీ తెప్పించిన 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఆదివారం విశాఖపట్నం పోర్ట్ వద్ద ప్రభుత్వానికి అందించింది. ►రిలయన్స్ ఇండస్ట్రీస్ గుజరాత్‌లోని జామ్ నగర్ ప్లాంట్ నుంచి 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ప్రత్యేక రైళ్ల ద్వారా సరఫరా చేసింది. ► తుపాన్ నేపథ్యంలో విశాఖపట్నంలోని స్టీల్‌ప్లాంట్, ఎలెన్‌బారీ ఇండస్ట్రీస్, శ్రీకాకుళంలోని లిక్వినాక్స్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మూడు ప్లాంట్ల ద్వారా 210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోంది. ►సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసే 49 ఆక్సిజన్ రీఫిల్లర్లకు నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టింది. అన్ని ఆస్పత్రులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేట్టుగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అదనంగా జనరేటర్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. -
ఏపీలో ఎండ దంచి కొడుతోంది
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఓవైపు కరోనా ఉధృతి కొనసాగుతోంది. అంతేస్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వడదెబ్బ సోకకుండా అవగాహన కల్పించడంతో పాటు అన్ని ఆస్పత్రుల్లోనూ చికిత్సకు ఏర్పాట్లు పూర్తి చేసింది. కుటుంబ సంక్షేమ శాఖ అన్ని జిల్లాల అధికారులకు ఎండ వేడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధికారుల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశమున్నట్టు హెచ్చరికలు ఉండటంతో దీనికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా కేసుల కారణంగా ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సెలవులు లేకుండా పనిచేస్తున్నారు. అన్ని సబ్సెంటర్లతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సైతం ఫస్ట్ ఎయిడ్ కిట్లు సరఫరా చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పల్లెల్లో విస్తృత ప్రచారం పల్లెల్లో జనాన్ని అప్రమత్తం చేశారు. ఉపాధి హామీ లేదా ఇతర రైతు పనులకు వెళ్లిన వారిని ఉదయం 11 గంటలలోగా ఇంటికి చేరుకోవాల్సిందిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎఫ్ఎం రేడియో, కేబుల్ టీవీలు, కళాజాతాల ద్వారా ఎండ తీవ్రత, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి, మండల స్థాయిలో మెడికల్ క్యాంపుల నిర్వహణ చేపట్టారు. గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో ఏఎన్ఎంల ద్వారా ప్రత్యేక మెడికల్ కిట్లను అందజేస్తున్నారు. సురక్షితమైన తాగునీరు అందించాల్సిందిగా పంచాయతీరాజ్, మునిసిపాలిటీ అధికారులను కోరారు. ఎన్జీవో సంఘాలు ప్రత్యేక చలివేంద్రాలు, మజ్జిగ ఏర్పాట్లు చేయాలని సూచించారు. టీకాలకు ఉదయమే రండి కోవిడ్ వ్యాక్సిన్‌తో పాటు చిన్నారులకు ప్రతి బుధ, శనివారాలు వ్యాధినిరోధక టీకాలు నిర్వహణ జరుగుతుంది. ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం 9 గంటలలోగా వ్యాక్సిన్ తీసుకుని వీలైనంత త్వరగా ఇంటికి వెళ్లాలని కుటుంబ సంక్షేమ శాఖ కోరింది. ప్రతి ఆస్పత్రిలోనూ ఓఆర్ఎస్ పౌడర్‌తో పాటు, సన్‌స్ట్రోక్‌కు సంబంధించిన అన్ని రకాల మందులూ అందుబాటులో ఉంచారు. గర్భిణులు వైద్య పరీక్షలకు ఉదయం రావాలని, తిరిగి త్వరగా వెళ్లాలని, వారిని ఉదయమే తెచ్చే బాధ్యత ఆశా కార్యకర్తలు చూసుకోవాలని ఆదేశించారు. ఏదైనా సన్‌స్ట్రోక్ లక్షణాలుంటే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెంటనే వెళ్లాలని సూచించారు. 108కు ఫోన్ చేసి అంబులెన్సులో రావచ్చునని, లేదంటే 104కు కాల్ చేసి డాక్టరు సలహాలు తీసుకుని పాటించవచ్చునని కుటంబ సంక్షేమ శాఖ విజ్ఞప్తి చేసింది. సన్‌స్ట్రోక్ లక్షణాలు ఇవే ► విపరీతంగా తలనొప్పి రావడం, కళ్లు తిరిగినట్టుండటం ► నీరసంగా ఉండటం, నాలుక తడారిపోవడం ► ఒళ్లంతా చెమటలు పట్టినట్టు, శరీరం పాలిపోయినట్టు కావడం ► శ్వాస వేగంగా తీసుకోవడం, గుండె దడగా ఉండటం ► శరీరంలో ఉష్ణోగ్రతలు పెరగడం ► వాంతులు వచ్చినట్టు ఉండటం ఈ జాగ్రత్తలు తీసుకుంటే సమస్య రాదు ► వీలైనంత వరకు ఎండలో తిరగకపోవడం ► వెళ్లినా గొడుకు విధిగా వాడటం ► కావాల్సినన్ని మంచినీళ్లు దఫాలుగా తాగుతుండటం ► పల్చటి మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవడం ► అలసటగా ఉన్నట్టయితే ఓఆర్ఎస్ పౌడర్ మంచినీళ్లలో కలిపి తాగడం అన్నీ సిద్ధంగా ఉంచాం ఓఆర్ఎస్తో పాటు ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్ మందులు సిద్ధంగా ఉంచాం. ఇప్పుడిప్పుడే కొన్ని హీట్‌వేవ్ (వడదెబ్బ) కేసులు నమోదవుతున్నాయి. మెడికల్, పారామెడికల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పాం. ఏరోజుకారోజు వడదెబ్బ కేసులను నివేదికను పంపించాలని కోరాం. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు వృద్ధులు వీలైనంత వరకు ఇంటికే పరిమితం కావాలి. – డా.గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు -
Poultry Farmers: 'గుడ్డు'కు గడ్డుకాలం
కోడిగుడ్డు ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ పౌల్ట్రీ రైతులు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. పెరిగిన మేత ఖర్చులు, వేసవిలో కోళ్ల సంరక్షణకు అధికంగా ఖర్చు పెట్టాల్సి రావడం వారికి భారంగా మారింది. దీనికి తోడు గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు 100కు పైగా లారీల్లో గుడ్లు ఎగుమతి కాగా, ప్రస్తుతం 60కి పడిపోయింది. ఇరగవరం: పశ్చిమ గోదావరి జిల్లాలో రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా, ఇతర రాష్ట్రాలకు 80 లక్షల మేర ఎగుమతి చేస్తున్నారు. స్థానికంగా 20 నుంచి 30 లక్షల వరకు వినియోగిస్తున్నారు. జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా సుమారు పదివేల మంది ఉపాధి పొందుతున్నారు. అన్ స్కిల్డ్ లేబర్‌ను తీసుకుని వారికి పూర్తి స్థాయిలో ఉపాధి కల్పిస్తోంది. లేయర్ కోడిపిల్లను ప్రస్తుతం పౌల్ట్రీ రైతులు రూ.41లకు కొనుగోలు చేస్తున్నారు. 23 వారాలకు గుడ్లు పెట్టే దశకు చేరుకునేసరికి మొత్తం రూ.250 ఖర్చు అవుతుంది. ఈ దశ నుంచి ఒక కోడి సరాసరి రోజుకొకటి చొప్పున ఏడాదికి 320 గుడ్లు పెడుతుంది. గుడ్లను పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు గతంలో 100 నుంచి 120 లారీల్లో ఎగుమతి చేయగా, ప్రస్తుతం రోజుకు 60 నుంచి 70 లారీలు మాత్రమే ఎగుమతి అవుతుండటం గమనార్హం. కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం లేదు జిల్లాలో ఉత్పత్తి అయిన గుడ్డును స్థానికంగా నిల్వ చేసే అవకాశం లేదు. గుడ్డు నిల్వ చేసి ఎగుమతి చేసే అవకాశం ఉంటే పౌల్ట్రీ రైతులకు వరమేనని చెప్పవచ్చు. అయితే కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ చేయడం కష్టసాధ్యం. దీనిలో నిల్వ చేసిన గుడ్డును వెంటనే వినియోగించుకోవాలి. లేదంటే పాడైపోతుంది. దీంతో ఉత్పత్తికే పరిమితమయ్యారు. అయితే సేల్ పాయింట్ల వద్ద కోల్డ్ స్టోరేజ్‌లు పెట్టుకుని వేరే రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాలలో ఎక్కువ లాభాలు అర్జిస్తుండగా, పౌల్ట్రీ రైతులకు నిరాశే మిగులుతోంది. పెరిగిన మేత రేట్లు గతంతో పోలిస్తే మేత ధరలు భారీగా పెరిగాయి. గత ఏడాది ఇదే రోజుల్లో సోయ కేజి రూ.36 ఉండగా, ప్రస్తుతం రూ.58కి చేరింది. అలాగే ఎండు చేప, స్టోన్, నూకలు ఇలా ప్రతీది ధరలు పెరిగాయి. ఇందుకు అనుగుణంగా గుడ్డు ధర పెరిగినప్పటికీ పౌల్ట్రీ రైతులకు లాభాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. గతంలో ఒడిశా నుంచి కుటుంబాలతో సహా వచ్చి కోళ్లఫారాలలో మకాం ఉండి పనిచేసేవారు ఉండగా, ప్రస్తుతం కరోనా ప్రభావంతో కొత్తవారు పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఉన్నవారు వెళ్లిపోతుండటంతో ఈ పరిశ్రమ లేబర్ సమస్యను ఎదుర్కొంటోంది. వేసవిలో జాగ్రత్తలతో అదనపు ఖర్చు సాధారణ రోజుల్లో వేసవిలో పౌల్ట్రీ పరిశ్రమ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోక తప్పదు. కోళ్ల షెడ్లపైన స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తడుపుతూ ఉండాలి. దీనికి తోడు గోనుపట్టాలు, ఎండు గడ్డి, దబ్బగడ్డి వేసి కోళ్లకు రక్షణ కల్పించాలి. చల్లటి నీరు కోళ్లకు పెడుతుండాలి. ఇలా చేయడం వల్ల గతంలో కంటే కోడికి రూ.15 నుంచి 20 వరకు అదనంగా ఖర్చు అవుతోంది. అయినప్పటికీ సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే 10 నుంచి 20 శాతం కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంది. విద్యుత్‌పై రాయితీ ఇవ్వాలి గతంలో బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీ ఇచ్చేవారు. ఇప్పుడు అది లేదు. లేబర్ సమస్యల వల్ల యంత్రాలను ఎక్కువ వినియోగిస్తుండటంతో విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయి. ఆక్వా పరిశ్రమకు ఇచ్చినట్లే పౌల్ట్రీ పరిశ్రమకు కూడా విద్యుత్ రాయితీ ఇవ్వాలి. పౌల్ట్రీ నిర్వహణలో గతంలో కంటే సమస్యలు పెరిగాయి. కోళ్లలో వైరస్ల నివారణకు ఒక్కో కోడికి రూ.15 నుంచి రూ.20 వరకు ఖర్చవుతోంది. – పెన్మెత్స సుబ్బరాజు, పౌల్ట్రీ రైతు, డీసీఎమ్ఎస్డైరెక్టర్, కావలిపురం మేత ధరలు తగ్గించాలి వేసవిలో కోళ్లు మృత్యువాత పడుతుంటాయి. ఎండ తీవ్రతను బట్టి సుమారు 8 లక్షల వరకు మృత్యువాత పడుతుంటాయి. కోళ్లను సంరక్షించడానికి అదనంగా ఖర్చు అవుతుంది. వీటితో పాటు కోళ్లు మేతకు వాడే ముడి సరుకు ధరలు విపరీతంగా పెరిగాయి. ముడి సరుకులపై ప్రభుత్వం రాయితీ కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుంది. – జి.గంగాధరరావు, నెక్ గోదావరి జోనల్ కమిటీ చైర్మన్ -
'ఉపాధి'కి మరింత భరోసా
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వ్యవసాయ పనులు ముగిసిన నేపథ్యంలో కూలీలు వలస వెళ్లకుండా గ్రామాల్లో ముమ్మరంగా ఉపాధి పనులు కల్పిస్తోంది. అడిగిన వారందరికీ జాబ్‌కార్డు ఇచ్చి, పని చూపిస్తోంది. రోజువారీ వేతనం పెంచడంతోపాటు ఎండల నుంచి ఉపమశనం పొందేలా పనివేళలు మార్చి ‘ఊపాధి’కి మరింత భరోసా కల్పించింది. కర్నూలు(అగ్రికల్చర్): మండే ఎండాకాలం ‘ఉపాధి’ పనులకు వెళ్తున్న కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం చల్లని కబురు అందించింది. ఈ నెల 1వ తేదీ నుంచి గరిష్ట వేతనాన్ని రూ.237 నుంచి రూ.245కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రత్యేకంగా 30 శాతం అలవెన్స్ ఇవ్వాలని ఆదేశించింది. ఫలితంగా పనిలో 30 శాతం తక్కువ చేసినా కూలీలకు పూర్తి వేతనం లభిస్తుంది. కుటుంబానికి ఒకటి చొప్పున జిల్లాలో 5,75,231 జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో 11,39,439 మంది సభ్యులుగా ఉన్నారు. మొత్తం 3,70,449 కుటుంబాలకు చెందిన 6,59,538 మంది ఊపాధి పనులకు వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రతి రోజూ 1.50 లక్షల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. అడిగిన వారందరికీ పని.. అడిగిన వారందరికీ పని కల్పించే విధంగా జిల్లా నీటియాజమాన్య సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల వారీగా ఇంటింటికి వెళ్లి డిమాండ్ తీసుకొని పనులు కల్పిస్తున్నారు. వలసలు లేకుండా గ్రామగ్రామాన పనులు కల్పిస్తున్నారు. వడదెబ్బకు గురికాకుండా.. ఎండల తీవ్రత పెరుగుతున్నందున ఉపాధి పనులకు హజరయ్యే కూలీలు వడ దెబ్బకు గురికాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కూలీలు ఉదయం 6 నుంచి 10.30 గంటల వరకు పనులు చేసే విధంగా కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తున్నారు. మధ్యాహ్నానికి ఇంటికి చేరుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పనులు చేసే ప్రాంతంలో నీడను కల్పించే బాధ్యతను శ్రమశక్తి సంఘాలకు అప్పగించారు. పని ప్రదేశంలో ఎవరైనా వడదెబ్బకు గురైతే తక్షణం ప్రథ«మ చికిత్స చేసేందుకు వీలుగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి కూలీలకు మజ్జిగ సరఫరా చేయాలనే ప్రతిపాదన ఉంది. మెరుగైన సదుపాయాలు జిల్లాలో ఉపాధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎండల తీవ్రత నుంచి కూలీలకు రక్షణ కల్పిస్తున్నాం. పని ప్రదేశంలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను కూలీలు సద్వినియోగం చేసుకోవాలి. – అమరనాథరెడ్డి, డ్వామా పీడీ వలస వెళ్లడం మానుకున్నాం గతంలో ఉపాధి కూలీ అరకొర వచ్చేది. గుంటూరుకు వలస వెళ్లేవాళ్లం. ఈ సారి కూలీ గిట్టుబాటు అవుతోంది. ఉన్న ఊర్లోనే పనులు దొరుకుతున్నాయి. సౌకర్యాలు కూడా బాగున్నాయి. వలస వెళ్లడం మానుకున్నాం. – సీతమ్మ, ఉపాధి కూలి,బాటతాండ, తుగ్గలి మండలం -
ఠారెత్తించిన ఎండలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాష్ట్రంలో శుక్రవారం కూడా ఎండలు ఠారెత్తించాయి. వడగాలులు కూడా తోడవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అత్యధికంగా ప్రకాశం జిల్లా కందుకూరులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సముద్రంపై నుంచి తేమగాలుల రావడంతో వడగాడ్పుల తీవ్రత తగ్గి రాబోయే రెండ్రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.