Tampering
-
ఆ రెండు గంటలు ఏం జరిగింది మీరు సమాధానం చెప్పాల్సిందే
-
Venezuela presidential election: వెనిజులాలో... మళ్లీ పాత కథే!
కారకాస్: వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించిందే జరిగింది. అధ్యక్షుడు నికొలస్ మదురో వరుసగా మూడోసారి విజయం సాధించినట్టు ఆ దేశ ఎన్నికల సంఘం (సీఎన్ఈ) ప్రకటించింది. ఆదివారం జరిగిన దేశవ్యాప్త పోలింగ్ అనంతరం రాత్రి ఓట్ల లెక్కింపు చేపట్టారు. 80 శాతం ఓట్లను లెక్కించేసరికి మదురోకు విజయానికి అవసరమైన 51 శాతం ఓట్లు లభించినట్టు సీఎన్ఈ చీఫ్ ఎల్విస్ అమోరోసో అర్ధరాత్రి అనంతరం ప్రకటన విడుదల చేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌కు 44 శాతం ఓట్లొచ్చినట్టు వెల్లడించారు. దీనిపై విపక్షాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. ఓట్ల లెక్కింపును ప్రహసనప్రాయంగా మార్చేసి ప్రజాస్వామ్యాన్ని మరోసారి మంటగలిపారని విపక్ష నేత మరియా కొరీనా మచాడో దుమ్మెత్తిపోశారు. ‘‘మదురోను ఓడించేందుకు జనమంతా వెల్లువలా కదిలొచ్చి గొంజాలెజ్‌కు ఓటేశారు. ఆయన కనీసం మూడింట రెండొంతుల ఓట్లతో ఘనవిజయం సాధించారు. మా బూత్‌లవారీ విశ్లేషణలో కూడా అదే తేలింది. ఓటింగ్ సరళిని చూసిన మీదట ఓటమి ఖాయమని మదురోకు అర్థమైపోయింది. ఫలితాలను తారుమారు చేసేందుకు పథకం ప్రకారం విపక్ష కూటమి పర్యవేక్షకులను పోలింగ్ బూత్‌ల నుంచి తరిమేశారు. అనంతరం మదురో చేతిలో కీలుబొమ్మ అయిన సీఎన్ఈ చీఫ్ ఫలితాలను ఆయనకు అనుకూలంగా వక్రీకరించారు’’ అంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణం దేశవ్యాప్తంగా మొత్తం 30 వేల పోలింగ్ బూత్‌లవారీగా పోలైన ఓట్ల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. సీఎన్ఈ మాత్రం అందుకు సుముఖంగా లేదు. దీనికితోడు పోలింగ్ ముగిశాక ఫలితాల వెల్లడిని నిర్ధారిత సమయం కంటే ఏకంగా ఆరు గంటలపాటు ఆలస్యం చేశారు. ఫలితాలను మదురోకు అనుకూలంగా మార్చేందుకే ఇలా చేశారని విపక్ష కూటమి దుయ్యబట్టింది. ఫలితాలను చట్టపరంగా సవాలు చేస్తామని ప్రకటించింది. మదురో మాత్రం విదేశీ శక్తులతో కలిసి కొందరు కుట్ర పన్ని ఈవీఎంలను హాక్ చేసేందుకు ప్రయతి్నంచారంటూ విపక్షాలపై ప్రత్యారోపణలకు దిగారు. శాంతిభద్రతలకు భంగం కలిగించజూస్తే ఏం చేయాలో పోలీసులు, సైన్యం చూసుకుంటాయని హెచ్చరించారు. వెనిజులాలో పాతికేళ్లుగా యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ పాలనకు తెర దిచేందుకు విపక్షాలన్నీ మచాడో సారథ్యంలో ఒక్కతాటిపైకి వచ్చి పోటీ చేశాయి.ఫలితాలపై దేశాల పెదవి విరుపు వెనిజులా ఎన్నికల ఫలితాలు అస్సలు నమ్మశక్యంగా లేవని అమెరికా, చిలీ,ఉరుగ్వేతో పాటు చాలా దేశాలు పేర్కొన్నాయి. అవి ప్రజల మనోగతాన్ని, ఓటింగ్ సరళిని ప్రతిఫలించడం లేదని స్పష్టం చేశాయి. చిలీ అధ్యక్షుడు గేబ్రియెల్ బోరిక్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో పాటు బ్రిటన్ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. -
Lok Sabha Elections 2024: ఈవీఎంలు వెరిఫికేషన్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై కొందరు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తంచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఈవీఎంలలోని మైక్రో–కంట్రోలర్ చిప్‌లు ట్యాంపరింగ్‌కు గురయ్యాయో లేదో తనిఖీ చేయాలని ఆయా లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా ఆరు రాష్ట్రాల పరిధిలోని ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులుసహా ఎనిమిది దరఖాస్తులు ఈసీకి అందాయి. తమిళనాడు, హరియాణాలో చెరో రెండు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధప్రదేశ్, తెలంగాణలో చెరో స్థానంలో ఇలా మొత్తంగా 8 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. పేపర్ బ్యాలెట్ విధానానికి మారుదామంటూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ, ఈవీఎం విధానాన్ని సమర్థిస్తూ ఏప్రిల్ 26వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువడిన వేళ ఇలా ఈసీకి అభ్యర్థనలు రావడం గమనార్హం. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఓడి రెండో, మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థులు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తంచేస్తే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాండమ్‌గా ఐదు శాతం ఈవీఎంలను చెక్‌చేసేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. ఈ వెసులుబాటును వినియోగించుకుంటూ ఓడిన అభ్యర్థులు కొందరు తాజాగా ఈసీని ఆశ్రయించగా ఆయా వివరాలను ఈసీ వెల్లడించింది. ఆరు రాష్ట్రాల్లో కలిపి 92 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను చెక్ చేయనున్నారు. అయితే ఒక్కో ఈవీఎం సెట్‌ను తనిఖీచేయడానికి నిర్వహణ ఖర్చుగా రూ.47,200ను ఆ అభ్యర్థి ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుందని జూన్ ఒకటో తేదీన ఈసీ ఒక ప్రకటన జారీచేయడం తెల్సిందే. ఈవీఎంల తనిఖీ ఖర్చును భారత్ ఎలక్ట్రానిక్స్ (బెల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్)లు రూ.40,000 నిర్ణయించగా జీఎస్టీ 18 శాతం(రూ.7,200) కలుపుకుంటే ఖర్చు రూ. 47,200గా తేలింది. అయితే ఈవీఎంల తరలింపు, వాటిని తనిఖీని రికార్డ్ చేసేందుకు సీసీటీవీల ఏర్పాటు, విద్యుత్ చార్జీలు, వీడియోగ్రఫీ, జిల్లా ఎన్నికల అధికారి స్థాయిలో ఇతర నిర్వహణ ఖర్చులు అదనంగా ఉండొచ్చని తెలుస్తోంది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి సంజయ్ రాధాకృష్ణ విఖే పాటిల్ 40 పోలింగ్ కేంద్రాల్లో తనిఖీ చేయాలని దరఖాస్తుచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఒక లోక్‌సభ పరిధిలోని 4 పోలింగ్ స్టేషన్లను, హరియాణాలోని రెండు లోక్‌సభ స్థానాల్లోని 6 పోలింగ్ స్టేషన్లను, తమిళనాడులోని 2 లోక్‌సభ స్థానాల్లోని 20 పోలింగ్ స్టేషన్లను అభ్యర్థులు తనిఖీకి ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని బొబ్బిలి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలను తనిఖీ చేయాలని వైఎస్సార్సీపీ అభ్యర్థి కోరారు. గజపతినగరం అసెంబ్లీ స్థానంలో ఒక పోలింగ్ స్టేషన్, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 12 పోలింగ్ స్టేషన్లను వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎంచుకున్నారు. తెలంగాణలోని జహీరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న నారాయణ్‌ఖేడ్‌లో 7 , జహీరాబాద్‌లో 7, ఆందోల్‌లో 6 పోలింగ్ స్టేషన్లను బీజేపీ అభ్యర్థి ఎంచుకున్నారు. ఒడిశాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 13 పోలింగ్ స్టేషన్లను బీజేడీ అభ్యర్థి ఎంచుకున్నారు. -
ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమే: సెంథిల్
తిరువళ్లూరు: ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్ పారీ్టకి ఉన్న అనుమానాల వెనుక బలమైన కారణాలు ఉన్నాయని తిరువళ్లూరు పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో బుధవారం కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచి్చన తరువాత అన్ని వర్గాల ప్రజలను టార్గెట్ చేసి, కొన్ని వర్గాలకు పంచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై మాతో పాటు సాధారణ ప్రజలకు కూడా అనుమానం ఉంది. తాము వేసిన ఓటు ఎక్కడికి వెళ్తుందోనని ఆలోచన చేసే స్థాయికి చేరారు. దేశంలో ఈవీఎంలు లేకపోయి ఉంటే బీజేపీ హ్యాట్రిక్ సాధించేదా..? అని ప్రశ్నించారు. ఈవీఎంలను నిషేధించాలన్న తమ పార్టీ విధానానికి ఇప్పటికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం కుదరదన్న వారే ఎలాన్ మస్క్ సవాలుకు తోక ముడిచారన్నారు. -
Elon Musk: హ్యాక్ చేయొచ్చు..!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) పనితీరు, పారదర్శకతపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈవీఎంలలో నమోదైన ఫలితాలను సులభంగా తారుమారు చేయొచ్చని, ఎన్నికల్లో వీటిని ఉపయోగించకపోవడమే మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల యజమాని, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ఈవీఎంలపై స్పందించారు. ఈ మేరకు తాజాగా ‘ఎక్స్’లో తన అభిప్రాయం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వినియోగిస్తున్న ఈవీఎంల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యంత్రాలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. మస్క్ అభిప్రాయాన్ని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఖండించారు. భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీంఎలు పూర్తిగా సురక్షితమేనని తేల్చిచెప్పారు. దీనిపై మస్క్ ఘాటుగా స్పందించారు. ఏదైనా హ్యాక్ చేయొచ్చని పేర్కొన్నారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌లు కూడా ఆదివారం స్పందించారు. ఈవీఎంలు ఎవరూ తనిఖీ చేయలేని బ్లాక్‌బాక్సుల్లాంటివేనని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ‘ఎక్స్’లో ఎలాన్ మస్క్ చేసిన పోస్టును తన ‘ఎక్స్’ ఖాతాల్లో రాహుల్ షేర్ చేశారు. ఈవీఎంల విశ్వసనీయతను అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. రిస్క్ చిన్నదైనా పరిణామం పెద్దదే మనుషులు లేదా కృత్రిమ మేధ(ఏఐ)తో ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను వాడొద్దు. ఎన్నికల నుంచి ఈ యంత్రాలను దూరంగా ఉంచాలి. ఈవీఎంలను హ్యాక్ చేసే రిస్క్ తక్కువగా ఉన్నప్పటికీ అది ముమ్మాటికీ హ్యాకింగే అవుతుంది. రిస్క్ చిన్నదైనా అది పెద్ద పరిణామానికి దారితీస్తుంది.– ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎన్నికల ప్రక్రియపై అనుమానాలున్నాయి భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీఎంలు బ్లాక్‌బాక్సుల్లాంటివే. వాటిని తనిఖీ చేయడానికి ఎవరినీ అనుమతించరు. మన దేశంలో అమల్లో ఉన్న ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకత లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఓ బూటకంగానే మిగిలిపోతుంది – ‘ఎక్స్’లో రాహుల్ గాంధీ ఈవీఎంలు పూర్తి సురక్షితం పూర్తిగా సురక్షితమైన ఎల్రక్టానిక్ పరికరాలను, డిజిటల్ హార్డ్‌వేర్‌ను ఎవరూ తయారు చేయలేరన్న సాధారణ అభిప్రాయం ప్రజల్లో ఉంది. అలా అను కోవడం పొరపాటు. ఈవీఎంలపై ఎలాన్ మస్క్ వ్యక్తం చేసిన భయాందోళలు సమంజసం కాదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేయడం అమెరికాతోపాటు ఇతర దేశాల్లో సాధ్యమవుతుందేమో గానీ ఇండియాలో ఎంతమాత్రం వీలుపడదు. ఇతర దేశాల్లో ఇంటర్నెట్తో అనుసంధానించిన ఓటింగ్ యంత్రాలను వాడుతుంటారు. ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు. ఇంటర్నెట్తో కనెక్ట్ చేసినప్పుడు అవకతవకలు జరిగే అవకాశం ఉండొచ్చు. ఇండియాలో ఈవీఎంలకు ఇంటర్నెట్తో గానీ, బ్లూటూత్‌తో గానీ, వై–ఫైతోగానీ ఎలాంటి అనుసంధానం ఉండదు. ఇవి పూర్తిగా సురక్షితమైనవి. ఫ్యాక్టరీలో పోగ్రామ్ చేసిన ఈవీఎం కంట్రోలర్లను బయట రీప్రోగ్రామింగ్ చేయడం సాధ్యం కాదు. ఇండియాలో ఉపయోగిస్తున్న ఈవీఎంలు, వాటి భద్రత గురించి ఎలాన్ మస్‌్కకు ట్యూషన్ చెప్పడానికి నేను సిద్ధమే – రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి ‘‘ఏదైనా(ఏ ఎల్రక్టానిక్ పరికరమైనా) హ్యాక్ చేయొచ్చు’’ – రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ ప్రతిస్పందన ఈవీఎంలకు స్వస్తి పలకాలి టెక్నాలజీ అనేది సమస్యలను పరిష్కరించేలా ఉండాలి. అదే టెక్నాలజీ ఒక సమస్యగా మారినప్పుడు దాన్ని పక్కనపెట్టమే మంచిది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని నిపుణులు ఇప్పటికే నిరూపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నా యి. ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేస్తున్నట్లు సందేహాలున్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్‌పై ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ నిపుణులు సైతం బహిరంగంగా ప్రకటనలు చేశారు. అలాంటప్పుడు మన దేశంలో ఈవీఎంలను బలవంతంగా ఉపయోగించాల్సిన అవసరం ఏమిటి? దీనిపై అధికార బీజేపీ సమాధానం ఇవ్వాలి. ఈవీఎంలకు స్వస్తి పలకాలి. భవిష్యత్తులో జరిగే ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలి. – ‘ఎక్స్’లో అఖిలేష్ యాదవ్ దమ్ముంటే హ్యాక్ చేసి చూపించండి ఎలాన్ మస్క్ గానీ, ఇంకెవరైనా గానీ ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెబుతున్న వ్యక్తులు భారత ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలి. అక్కడ ఈవీఎంను తీసుకొని హ్యాక్ చేసి చూపించాలి. ఇదే మా చాలెంజ్. భారతదేశ ప్రజాస్వామ్యం గురించి రాహుల్ గాంధీ ఎందుకు ఎలాన్ మస్‌్కకు ఫిర్యాదు చేస్తున్నారు? మస్క్ ఏం చేయగలరు? ప్రపంచం ముందు కన్నీళ్లు పెట్టుకోవడం, భారతదేశ ప్రతిష్టను దిగజార్చడం కాంగ్రెస్ డీఎన్ఏలో ఒక భాగమా? వారసత్వ రాజకీయాలను ప్రజలు వరుసగా మూడోసారి తిరస్కరించారు. అయినా ఆ విషయం కాంగ్రెస్‌కు అర్థం కావడం లేదు? – అమిత్ మాలవీయ, బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జి -
‘బలి’ కోరుతున్న సాంకేతిక విజయం!
‘ది హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ గురించి క్రీడా ప్రియులందరూ వినే ఉంటారు. 1986 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సందర్భంగా అర్జెంటీనా – ఇంగ్లండ్ మ్యాచ్‌లో డీగో మారడోనా చేసిన తొలి గోల్ వివాదాస్పదమైంది. డీగో చేసిన హెడర్ గోల్‌ను వాస్తవానికి చేత్తో నెట్టాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రికార్డింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల రెఫరీ దాన్ని గోల్‌గానే ప్రకటించాడు. తర్వాత నాలుగు నిమిషాలకే ‘గోల్ ఆఫ్ ది సెంచరీ’ని కొట్టిన మారడోనా, అదే ఊపులో వరల్డ్ కప్‌ను గెలుచుకోవడమే గాక ఫుట్‌బాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. వివాదాస్పద గోల్‌పై ఆ తర్వాత స్పందించిన మారడోనా అది ‘సగం మారడోనా హెడ్, సగం హ్యాండ్ ఆఫ్ గాడ్’ ఫలితమని ప్రకటించాడు.దుబాయ్‌లో ఇటీవల కురిపించిన కృత్రిమ వర్షం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో ప్రపంచమంతా చూసింది. క్లౌడ్ సీడింగ్ ఓవర్‌డోస్‌కు వాతావరణ మార్పులు కూడా తోడైన ఫలితంగా రెండేళ్లలో కురవాల్సిన వర్షమంతా ఒకేరోజు కురిసి ఎమిరేట్‌ను అతలాకుతలం చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో ‘అదృశ్య హస్తం’ (హ్యాండ్ ఆఫ్ గాడ్) పనిచేసినట్టుగా, కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు. లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఫలితాలు రావాలంటే రష్యా నాయకుడు పుతిన్ లేదా తుర్కియే పాలకుడు ఎర్డోగాన్ లేదా మయన్మార్ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉండాలి. అలా జరగలేదు కాబట్టి ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ ప్రమేయం ఉండాలి. ఎవరా గాడ్? కేంద్ర ప్రభుత్వమా? ఎన్నికల సంఘమా... ఎవరు? కృత్రిమ ఓట్ల వర్షానికి క్లౌడ్ సీడింగ్ ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనసామాన్యం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబే పలుమార్లు ప్రకటించారు. ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకెళ్లి ఈవీఎమ్‌లను ఎలా హ్యాక్ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపెట్టారు. అందువల్ల ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్ అనే ఆర్ట్‌పై కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నది.రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు రోజుల సమయాన్ని తీసుకున్నది. ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువు ముగిసిన తర్వాత పోలయిన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించే విధంగానే ఉన్నది.తుది పోలింగ్ శాతాన్ని సుమారు 81గా నిర్ధారిస్తూ మూడు రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసింది. మామూలుగా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్నవారికి స్లిప్స్ పంపిణీ చేస్తారు. వారికి మాత్రమే ఓటువేసే అవకాశం కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్ లేదా టోకెన్లు పంపిణీ చేయలేదనే వార్తలు వినవస్తున్నాయి. ఇది అనుమానించదగ్గ అంశం.పోలింగ్ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్నవారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా యాభై నుంచి వంద దాటలేదు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో రెండు, మూడు గంటలు చాలు. అంటే తొమ్మిది గంటలకల్లా పోలింగ్ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటిందాకా పోలింగ్ జరుగుతూనే ఉందట! అంటే ఆ యాభైమందే అంతసేపూ సైక్లింగ్ చేస్తున్నారా? వేలాది పోలింగ్ బూత్‌లలో గడువు ముగిసే సమయానికి 65 నుంచి 70 శాతం మధ్యనున్న పోలింగ్ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85 నుంచి 95 శాతం దాకా ఎగబాకింది.పోలింగ్‌కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాట్లు, భరించిన అవమానాలు తెలిసినవే. కూటమిగా కుదురుకున్న తర్వాత వారు ‘ఎలక్షనీరింగ్’ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులను బదిలీ చేశారు. కనీవినీ ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ కూడా కూటమి కోర్కెలన్నింటినీ మారుమాట్లాడకుండా నెరవేర్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్‌లోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి నాలుగో ఫేజ్‌కు నెట్టివేశారు.మొదటి మూడు దశల పోలింగ్ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతా భావం మొదలైందట. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదనే నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు. నాలుగో దశకు ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ‘ఏర్పాట్ల’ కోసం ఉపయోగించుకున్నారు. ఈ ఏర్పాట్లకు ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ పూర్తిగా సహకరించింది. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎమ్‌ల మిస్సింగ్‌పై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఇవెక్కడున్నాయి? ఏ పనికి వినియోగిస్తున్నారు? ఎవరి సేవల కోసం ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ వీటిని వినియోగిస్తున్నారో తేలవలసి ఉన్నది.గడచిన ఐదేళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్లుగా చూపించి గగ్గోలు పెట్టినవారు పోలింగ్ రోజు సాయంత్రం, మరునాడు – మళ్లీ కౌంటింగ్ రోజు నుంచి గత నాలుగు రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది. కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి. మరుసటి రోజు కూడా చాలాచోట్ల ఇవి కొనసాగాయి. మళ్లీ కౌంటింగ్ పూర్తవుతున్న సమయం నుంచి నాలుగు రోజులుగా యథేచ్ఛగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అసాధారణమైన ఓటింగ్ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి ఈ దాడులు జరిగాయి. పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది.విచక్షణారహితంగా జరుగుతున్న ఈ దాడులు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద ప్రశ్నార్థకాన్ని రచిస్తున్నాయి. ఈ దాడులను ఖండించకపోగా ‘వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకండ’ని ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు ట్వీట్ చేశారు. గత రెండేళ్లుగా లోకేశ్ ఒక రెడ్‌బుక్‌ను సభల్లో ప్రదర్శిస్తూ హెచ్చరికలు జారీ చేసేవారు. తాను రెడ్‌బుక్‌లో పేర్లు ఎక్కించిన వారి సంగతి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేవారు. ఇప్పుడా రెడ్‌బుక్ హోర్డింగ్‌లను కూడళ్లలో ఏర్పాటు చేశారు. దాని సందేశమేమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.సందేశం గూండాతండాలకు స్పష్టంగానే అర్థమైంది. టీడీపీ వారికి చాలాచోట్ల జనసైనికులు కూడా తోడయ్యారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న సందర్భాల్లో పోలీసులు మౌన ప్రేక్షక పాత్రను పోషించారు. కొన్నిచోట్ల పారిపోతూ కనిపించారు. ఇప్పటివరకు బయటకొచ్చిన వీడియోల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కలవరం కలిగించాయి.నూజివీడులో వైసీపీకి చెందిన ముసినిపల్ కౌన్సిలర్‌ను వెంబడించి కత్తులతో పొడుస్తున్న దృశ్యం పిండారీల దండయాత్రను తలపించింది. ఒక హాస్టల్ నిర్వాహకుడి ఇంటిపై దాడిచేసి గృహాన్ని ఛిద్రం చేసి, ఆ పెద్దమనిషిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్న పైశాచికత్వం భయానకంగా కనిపించింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, కత్తులతో దాడులు, కిడ్నాప్‌లు... ఎన్నెన్ని దృశ్యాలు? వైసీపీకి చెందిన వారి కార్యాలయాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు. వాహనాలను తగులబెట్టారు. జెండా దిమ్మెలను సుత్తులతో పగులగొట్టారు. శంకుస్థాపన ఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయాల మీద దాడులు చేశారు. వైఎస్సార్ విగ్రహాలను తొలగించి ఈడ్చుకుంటూ అవమానించారు.వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంపై వైఎస్సార్ అక్షరాలు తొలగించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్‌ల వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించిన వైఎస్సార్ పేరు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి బాగుంటుందని భావించిన ప్రభుత్వం చట్టసవరణ ద్వారా ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్సార్ పేరు పెట్టారు. బదులుగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టారు. ఒక అల్లరిమూక దాడి చేసి ఇప్పుడా అక్షరాలను తొలగించింది..విశ్వవిద్యాలయాల మీద కూడా దాడులకు తెగబడ్డారు. వీసీలు, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వం మారితే యూనివర్సిటీ పాలకవర్గాలను కూడా మార్చాలనే ఓ కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తున్నది. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయడం సంప్రదాయం కానీ, ఇవి నామినేటెడ్ పదవులు కావు. సెర్చ్ కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ చేసిన నియామకాలు. అయినా సరే తమ పార్టీవాడే వీసీగా కూర్చోవాలనే దుందుడుకుతనం ప్రజాస్వామిక పద్ధతులను దెబ్బతీస్తున్నది.భయానక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది నెరవేరే అవకాశం ఉండదు. నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఎన్నికల అవకతవకలపై వారు దృష్టి సారించకుండా ఉండరు. నిజానిజాలు తవ్వితీయకుండా ఉండరు. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జనంతో కలిసి విపక్షాలు కచ్చితంగా ఉద్యమిస్తాయి. కూటమికి లభించిన విజయం సాంకేతికమైనదే. అయినా సరే, ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేస్తుంది. అడ్డంకులేమీ ఉండవు. చేసిన హామీలను నెరవేర్చి, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించితే కొత్త ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై ఈసీ స్పందించాలి
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాలని ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈవీఎంల పనితీరుపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. విజయవాడలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు శుక్రవారం మాట్లాడుతూ.. ఈవీఎంల పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించాలన్నారు.గతంలో ఆయన ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలు వ్యక్తంచేశారని, ఈవీఎం చిప్‌లను ట్యాంపరింగ్ చేసి ప్రజా తీర్పును మార్చి వెయొ్యచ్చని.. అలాగే, ప్రపంచంలో ఎక్కడా ఈవీఎంలను ఉపయోగించడంలేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కృష్ణంరాజు గుర్తుచేశారు. ఇప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు వైఖరి ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.గతంలో చంద్రబాబు సాంకేతిక సలహాదారుడిగా పనిచేసిన వేమూరు హరికృష్ణ ప్రసాద్ తన అమెరికన్ మిత్రులు అలెక్స్ హాల్దార్ మెన్, రాస్గోమ్ గ్రీస్ సహకారంతో ఎన్నికల సంఘం నుంచి దొంగిలించిన ఈవీఎంను బహిరంగంగానే హ్యాక్‌చేసి చూపించారన్నారు. ఈవీఎం దొంగతనం ఆరోపణపై హరికృష్ణ ప్రసాద్ అరెస్టు కూడా అయ్యారన్నారు. ప్రజాతీర్పు ఏకపక్షంగా, మెజార్టీలు అత్యధికంగా ఉండటంతో ప్రజల్లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.బాబు విదేశీ పర్యటనపై అనుమానాలు..బెటర్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ సునీత లక్కంరాజు మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల్లో ఉన్న అన్ని ఈవీఎంలను ఒకేసారి హ్యాక్ చేయవచ్చునని కూడా హరికృష్ణ ప్రసాద్ చెప్పారన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు విదేశీ పర్యటనలపై కూడా ప్రజలకు అనేక సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ఆంధ్ర అడ్వకేట్ ఫోరం కన్వీనర్ బి.అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం వివరణ ఇవ్వకపోతే తమ వద్ద ఉన్న ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పౌర సంఘాల ప్రతినిధులు తెలిపారు. -
ఈవీఎంల ట్యాంపరింగ్ అనుమానాలున్నాయ్: కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: అన్ని వర్గాలకు మంచి జరిగేలా వైఎస్ జగన్ పాలన చేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ గెలవాలని కష్టపడ్డ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.‘‘మంచి కంటే చెడు ఈజీగా ప్రచారం అవుతుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ని భూతంలా చూపించి దుష్ప్రచారం చేశారు. జగన్ మీ ఆస్తులు తాకట్టు పెట్టేస్తాడంటూ నమ్మించారు. ఇన్ని లక్షలమందికి అన్ని హక్కులతో స్థలాలు ఇచ్చిన జగన్.. మీ ఆస్తులు ఎందుకు లాక్కుంటారు?. ప్రజలు, రైతులకు మంచి జరగాలని తపన పడ్డ మనిషి వైఎస్ జగన్. ఈవీఎంలపై రాష్ట్రమంతటా చర్చలు జరుగుతున్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని మాకు అనుమానం ఉంది’’ అని కారుమూరి చెప్పారు.భీమవరంలో ఈవీఎంలను ప్రైవేట్ కారులో తరలిస్తుంటే పట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఒక నియోజకవర్గంలో లక్ష ఎనభై వేల ఓట్లు పొలైతే ముప్పై వేలు అధికంగా కనబడ్డాయి. ఈవీఎంలు ఏదో తేడా జరిగిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం’’ అని కారుమూరి పేర్కొన్నారు. -
అఫిడవిట్లో అలసత్వం వద్దు
తాము ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవడం ఓటర్ల హక్కుగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అందువల్లే పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు, ఉన్న కేసులు, జైలు జీవితం అనుభవిస్తే ఆ వివరాలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు, కుటుంబ సభ్యుల వివరాలన్నీ నామినేషన్ సందర్భంగా లిఖితపూర్వకంగా ఎన్నికల అధికారికి తెలపాలని పేర్కొంది. అయితే కొందరు అభ్యర్థులు అఫిడవిట్లో అన్ని వివరాలు తెలపడంలో అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై సుప్రీం కోర్టులో కేసు దాఖలైంది. దీనిపై 2013లో న్యాయస్థానం తీర్పును వెలువరించింది. దాని ప్రకారం అఫిడవిట్లో ఏ ఒక్క కాలమ్‌ను నింప కుండా ఖాళీగా ఉంచవద్దంటూ పేర్కొంది. ఎవరైనా అభ్యర్థి పొరపాటున ఎక్కడైనా ఖాళీగా వదిలేస్తే దాన్ని పూర్తిగా నింపాలంటూ తేల్చి చెప్పింది. ఓటర్ల హక్కు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సతీమణి వనమా పద్మావతి పేరిట ఉన్న ఇన్నోవా వాహనంపై హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.135 ట్రాఫిక్ చలాన్ పెండింగ్‌లో ఉంది. ఆయన కుటుంబం పాల్వంచ మున్సిపాలిటీకి రూ.3,120 వాటర్ బిల్లు బకాయి ఉంది. వీటితో పాటు వివిధ ఆస్తులు, తనపై నమోదైన పోలీసు కేసుల వివరాలను 2018 ఎన్నికల్లో నామినేషన్ దాఖలు సందర్భంగా వనమా అఫిడవిట్లో పేర్కొనలేదు. పారదర్శకత పాటించడంలో విఫలమైనందున వనమా ఎన్నికను రద్దు చేయాలంటూ ఆయన ప్రత్యర్థి జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించి చుక్కలు చూపించారు. చిన్న ట్రాఫిక్ చలానాయే కదా అనే నిర్లక్ష్యం, ప్రజాజీవితంలో ఉన్నోళ్లపై పోలీసు కేసులు సహజమే అనే ఏమరుపాటు ఇబ్బంది తెచ్చి పెట్టగా కేసు ఇంకా సుప్రీంలో కొనసాగుతోంది. ప్రజా జీవితంలో ఉన్నోళ్లు ప్రతీ అంశాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందే. ఆస్తులు, అప్పులు, కేసుల వివరాల వెల్లడిలో అలసత్వముంటే ఇబ్బందులు ఎదురవుతాయనేందుకు వనమా ఉదంతం ఉదాహరణగా నిలుస్తోంది. వనమా తరహాలోనే నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో వివరాలను టాంపరింగ్ చేశారనే ఆరోపణలతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సైతం న్యాయపరమైన చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. పత్రికా ప్రకటనలు అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను ప్రజలకు బహిరంగా తెలపాలనే నిబంధన సైతం 2013 నుంచి అమల్లోకి తెచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పోలింగ్‌కు రెండు రోజుల ముందులోపు స్థానికంగా ఉన్న పేపర్లు/టీవీల్లో ప్రకటనల ద్వారా క్రిమినల్ కేసుల వివరాలను ప్రజలకు తెలపాల్సి ఉంటుంది. అది కూడా ఏ మూలనో కాకుండా ప్రముఖంగా కనిపించేలా మూడు సార్లు ప్రకటనలు ఇవ్వాలి. ఇలా ప్రజలకు అన్ని వివరాలను తెలియజేయకుండా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్టయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం –1951 ప్రకారం అనర్హతకు గురవుతారు. బీ ఫామ్ అందుకోగానే బీ ఫామ్ అందుకోవడమే ఆలస్యం నామినేషన్ దాఖలు చేయడం, ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడమే తరువాయి అనుకుంటే పొరపాటే. నామినేషన్ సందర్భంగా అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్ (లిఖిత వాంగ్మూలం) విషయంలో జాగ్రత్త పడకపోతే చిక్కులు తప్పవు. అక్కడ రాసే ప్రతీ అక్షరం, పొందు పరిచే ప్రతీ విషయం ఆ అభ్యర్థిని నీడలా వెంటాడుతాయి. ఏమైనా పొరపాట్లు జరిగితే ఎన్నిక రద్దవ్వడమే కాదు తదుపరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండదు. -
ఒడిశా రైళ్ల ప్రమాదంపై... సీబీఐ విచారణ
బాలాసోర్/న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన ఒడిశా రైళ్ల ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రమాదానికి మూలకారణాన్ని, ఈ ‘నేరపూరిత’ చర్యకు ప్రధాన కారకులను ఇప్పటికే గుర్తించినట్టు ఆదివారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించిన కాసేపటికే ఈ మేరకు ప్రకటన వెలువడింది. అంతేగాక, ‘‘ప్రమాదం వెనక విద్రోహ కోణాన్నీ తోసిపుచ్చలేం. రైళ్ల ఉనికిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ వాటి గమనాన్ని నిర్దేశించే అతి కీలకమైన ఇంటర్ లాకింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి ఉండే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం’’ అని రైల్వే వర్గాలు చెప్పుకొచ్చాయి. రైలును ట్రాక్‌ను మళ్లించే ఎలక్ట్రిక్ పాయింట్, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సంబంధిత సమస్యే ప్రమాదానికి కారణమని ప్రమాద స్థలి వద్దే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న వైష్ణవ్ భువనేశ్వర్‌లో మీడియాకు చెప్పారు. ‘‘పూర్తి వివరాల్లోకి నేనిప్పుడే వెళ్లదలచుకోలేదు. అయితే పాయింట్ యంత్రం సెట్టింగ్‌ను మార్చారు. ఇదెందుకు, ఎలా జరిగిందన్నది విచారణ నివేదికలో వెల్లడవుతుంది’’ అని వివరించారు. మూడు రైళ్ల ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐకి సిఫార్సు చేసినట్టు వెల్లడించారు. విపక్షాలు మాత్రం ఈ విషయంలో కేంద్రంపై దుమ్మెత్తిపోశాయి. ప్రమాదానికి పూర్తి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి తక్షణం రాజీనామా చేయాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ సహా పలు ఇతర విపక్షాలు రైల్వే మంత్రి రాజీనామాకు డిమాండ్ చేశాయి. మంత్రుల స్థాయి నుంచి కింది దాకా బాధ్యులందరినీ గుర్తించి కఠినాతి కఠినంగా శిక్షించి తీరాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మోదీ సర్కారు మీడియా పిచ్చి, పీఆర్ గిమ్మిక్కులు ప్రభుత్వ వ్యవస్థను చేతగానిదిగా మార్చేశాయమంటూ ఖర్గే తూర్పారబట్టారు. యూపీఏ హయాంలో రైల్వే మంత్రుల పనితీరు ఎంత ఘోరంగా ఉండేదో కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ బీజేపీ ఎదురుదాడికి దిగింది. మహా విపత్తును కూడా రాజకీయం చేయడం దారుణమని మండిపడింది. ప్రమాదంలో మరణించిన వారి తుది సంఖ్యను 288 నుంచి 275గా రైల్వే శాఖ ఆదివారం సవరించింది. విద్రోహ కోణంపై రైల్వే ఏం చెప్పిందంటే... పాయింట్ మెషీన్, ఇంటర్ లాకింగ్ వ్యవస్థ పూర్తిగా సురక్షితమని రైల్వే వర్గాలు వివరించాయి. ‘‘అదెంత సురక్షితమంటే ఒకవేళ అది పూర్తిగా విఫలమైనా సిగ్నళ్లన్నీ వెంటనే రెడ్‌కు మారి రైళ్ల రాకపోకలన్నీ తక్షణం నిలిచిపోతాయి. అయినా సిగ్నలింగ్ సమస్యే ప్రమాదానికి కారణమైంది గనుక బయటి శక్తుల ప్రమేయాన్ని తోసిపుచ్చలేం. కేబుళ్లను చూసుకోకుండా ఎవరైనా తవ్వేయడంతో తెగిపోయి ఉండొచ్చు’’ అని రైల్వే బోర్డు సభ్యురాలు జయా వర్మ సిన్హా వివరించారు. ప్రమాదానికి మితిమీరిన వేగం, డ్రైవర్ల తప్పిదం కారణం కావని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి. లోపలి, లేదా బయటివ్యక్తులు విద్రోహానికి పాల్పడే అవకాశాన్నీ తోసిపుచ్చలేమని రైల్వే అధికారి ఒకరన్నారు. టికెట్ లేని వారికీ పరిహారం షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ శుక్రవారం రాత్రి ఒడిశాలోని బహనగా బజార్ స్టేషన్ సమీపంలో లూప్లైన్లోకి దూసుకెళ్లి ఆగున్న గూడ్సును ఢీకొని పట్టాలు తప్పడం, పక్క ట్రాక్‌పై పడ్డ బోగీలను ఢీకొని బెంగళూరు–హౌరా ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలు తప్పడం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో గాయపడ్డ 1,175 మందిలో వందలాది మంది ఇంకా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రెండు రైళ్లలో చాలావరకు వలస కార్మికులే ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్డు గత ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని టికెట్ లేని ప్రయాణికులకు కూడా పరిహారం అందించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. మరోవైపు సహాయ చర్యలతో పాటు ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. తూర్పు, దక్షిణ భారతాలను కలిపే ఈ కీలక రైల్వే లైన్లో పూర్తిగా దెబ్బ తిన్న ట్రాకుల్లో ఇప్పటిదాకా రెండింటిని పునరుద్ధరించారు. ప్రమాదంపై సుప్రీంలో పిల్ సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశాలో రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సారథ్యంలో విచారణకు కేంద్రాన్ని ఆదేశించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. రైల్వే వ్యవస్థలో ప్రమాద, భద్రత పరామితులను కమిటీ విశ్లేషించి, వాటి బలోపేతానికి సలహాలు, సూచనలిచ్చేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ విశాల్ తివారీ కోరారు. కవచ్ వ్యవస్థను వెంటనే అమలు చేసేలా మార్గదర్శకాలివ్వాలన్నారు. -
AP: విద్యార్థుల కోసం మరో 6 లక్షల ట్యాబ్‌లు
సాక్షి, అమరావతి: కొత్త విద్యా సంవత్సరం (2023–24)లో 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థుల కోసం కొత్తగా 6 లక్షల ట్యాబ్‌లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులందరికీ ట్యాబ్‌లు ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో 8వ తరగతి విద్యార్థులతోపాటు సుమారు 75 వేల మంది ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్‌లను ఉచితంగా అందించింది. 8, 9 తరగతుల విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలకు సంబంధించి సుమారు రూ.25 వేల ఖరీదు చేసే బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లను అందించింది. సమస్య వస్తే మూడు రోజుల్లో పరిష్కారం గత ఏడాది విద్యార్థులకు ఇచ్చి న ట్యాబ్‌ల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని అందుబాటులోకి తెచ్చి ంది. ట్యాబ్‌లలో తలెత్తే సాంకేతిక సమస్యలను గరిష్టంగా మూడు రోజుల్లో పరిష్కరించేలా ఏర్పాట్లు చేసింది. ట్యాబ్‌ల వినియోగంలో తలెత్తే సాఫ్ట్వేర్ సమస్యలు పరిష్కరించేలా ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చి ంది. అయితే, హార్డ్‌వేర్ సమస్యలు వస్తే ట్యాబ్‌లను స్థానిక వార్డు, గ్రామ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ద్వారా పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విద్యార్థి లేదా వారి తల్లిదండ్రులు ట్యాబ్‌ను డిజిటల్ అసిస్టెంట్‌కు అందజేసి సమస్యను వివరిస్తే ఫోన్ నంబర్, ట్యాబ్ ఈఎంఐఈ నంబర్ ఆధారంగా ఆన్లైన్లో నమోదు చేస్తారు. అయితే, వివరాల నమోదు, ఆన్లైన్లో ఉండటంతో చదువుకోలేని తల్లిదండ్రులు రసీదులు పొందడంలో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికోసం మాన్యువల్‌గా రశీదులు ఇవ్వనున్నారు. మరమ్మతుకు గురైన ట్యాబ్‌లను రాష్ట్రంలోని 145 శాంసంగ్ సర్వీస్ సెంటర్లలో గరిష్టంగా 3 రోజుల్లో మరమ్మతు చేయించి అందించనున్నారు. ట్యాంపర్ చేస్తే ఐటీ సెల్‌కు అలర్ట్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లు ప్రత్యేకంగా రూపొందించింది. ఈ ట్యాబ్‌ల్లో కంటెంట్ ఇంటర్నెట్ లేకుండానే వినియోగించుకోవచ్చు. సబ్జెక్టుల వారీగా ఉన్న పాఠ్యాంశాలను విద్యార్థి ఎన్ని గంటలు చూశారు, ఏ సబ్జెక్టు కోసం ఎక్కువ సమయం కేటాయించారో అందులో నమోదవుతుంది. ట్యాబ్స్‌ను నెట్(వైఫై)కు అనుసంధానం చేయగానే మొత్తం వివరాలు స్టేట్ ఐటీ సెల్‌కు చేరుతాయి. విద్యార్థులు ట్యాబ్‌లను ఎలా వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకు విశాఖపట్నంలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అందుబాటులోకి తెచ్చి ంది. ఇక్కడ ఉన్న సిబ్బంది ప్రతి విద్యార్థికి ఇచ్చి న ట్యాబ్‌ను ఎలా వాడుతున్నారో గుర్తిస్తారు. మరోవైపు ట్యాబ్‌లను ట్యాంపరింగ్ చేసే వీలు లేకుండా సాంకేతికపరంగా కట్టడి చేశారు. విద్యార్థికి ఇచ్చిన ట్యాబ్‌లోని కంటెంట్ తొలగించేందుకు యతి్నంచినా, కొత్తగా మార్పులు చేసినా ఆటోమేటిక్‌గా ట్యాబ్ లాక్ అయిపోతుంది. వెంటనే ఏ జిల్లాలో, ఏ పాఠశాలలోని విద్యార్థి ఈ పని చేశారో ఐడీ నంబర్‌తో సహా ఇబ్రహీంపట్నంలోని స్టేట్ ఐటీ సెల్‌కు, విశాఖలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఆ వివరాలు వెళ్లిపోతాయి. అనంతరం కారణం తెలుసుకుని, మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ (ఎండీఎం) సిస్టంతో పాటు గూగుల్ అథెంటికేషన్ ఓటీపీ ద్వారా జిల్లా నోడల్ అధికారి అన్‌లాక్ చేస్తారు. -
ఇంటర్ బోర్డు భద్రత వ్యవస్థ ట్యాంపర్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డులో భద్రత వ్యవస్థ ట్యాంపరింగ్‌కు గురైందని, కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారని బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ వెల్లడించారు. బోర్డులో అత్యంత కీలకమైన సీసీ కెమెరా లకు సంబంధించిన పాస్వర్డ్ చోరీ అయిందని తెలియడంతో అప్రమత్తమైనట్టు తెలిపారు. ఈ విషయం గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దీని వెనుక సూత్రధా రులెవరో, ఏ అవసరాల కోసం ఈ కుట్రకు పాల్పడ్డారో దర్యాప్తులో తేలుతుందన్నారు. నేర చరిత్ర ఉన్న ఓ వ్యక్తి బోర్డు అధికారిని బెదిరించి, భయపెట్టి పాస్‌వర్డ్‌ను తస్కరించినట్టు ప్రాథమికంగా తెలిసిందన్నారు. దీనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలిచ్చినట్టు మిత్తల్ వెల్లడించారు. ఆన్లైన్ మూల్యాంకనం పూర్తి పారదర్శకం అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే ఈ ఏడాది నుంచి ఇంటర్ సమా ధాన పత్రాల ఆన్లైన్ మూల్యాంకనం చేపడుతున్నట్లు మిత్తల్ తెలిపారు. దీనివల్ల మూల్యాంకనం పారదర్శకంగా ఉండటంతోపాటు తప్పుల నివారణ సాధ్య మవుతుందని తెలిపారు. గతంలో విద్యార్థి రీవ్యాల్యూయేషన్ కోరితే జిల్లాల నుంచి పేపర్లు తెప్పించడంలో తీవ్ర జాప్యం జరిగేదని, ఇప్పుడు ఆన్లైన్ చేయడం వల్ల వేగవంతంగా పూర్తవుతుందని చెప్పారు. పేపర్లు దిద్దేవారికి ఇచ్చే టీఏ, డీఏ ఖర్చునూ నివారించవచ్చన్నారు. ఇప్పటికే అన్ని దేశాలూ, విశ్వవిద్యా లయాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని, ఆన్లైన్ మూల్యాంకనం కోసం అధ్యాపకు లకు అవసరమైన శిక్షణ కూడా ఇస్తామని వివరించారు. ఈ ఏడాది ప్రయోగాత్మ కంగా ఆర్ట్స్, కామర్స్, లాంగ్వేజ్‌లకు సంబంధించిన 35 లక్షల పేపర్లను ఆన్లైన్ ద్వారా వ్యాల్యుయేషన్ చేస్తున్నామని, రెండేళ్లలో ఈ విధానాన్ని పూర్తిగా విస్తరిస్తా మన్నారు. గతంలో జరిగిన విధానంలో ప్రైవేటు కాలేజీలు సమాధాన పత్రాలు ఎక్కడకు వెళ్తున్నాయో తెలుసుకుని వారికి అనుకూలమైన విధానాలు అనుసరించారనే ఆరోపణలున్నాయని, ఇలాంటివి ఇప్పుడు సాగవనే ఉద్దేశంతో ఏసీబీ కేసులున్న ఓ వ్యక్తి పనిగట్టుకుని బోర్డు ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడని మిత్తల్ చెప్పారు. -
ధరణి పోర్టల్ ట్యాంపరింగ్.. మీసేవ ఆపరేటర్ల హస్తం!
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా, అక్రమార్కులు ధరణి పోర్టల్‌ను ట్యాంపరింగ్ చేశారు. పాసు పుస్తకం ఉన్నప్పటికీ పెండింగ్ మ్యుటేషన్‌గా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈ అక్రమాల్లో మీసేవ ఆపరేటర్ల హస్తం కూడా ఉంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నాతాధికారులు విచారణ ప్రారంభించారు. ఇది కూడా చదవండి: డీజీపీనీ వదలని సైబర్ నేరగాళ్లు -
మెడికల్ కౌన్సిల్’ కేసులో ముగ్గురి అరెస్ట్
సాక్షి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) డేటాబేస్ ట్యాంపరింగ్ చేసి, అనర్హులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన వ్యవహారంలో సీనియర్ అసిస్టెంట్ కందుకూరి అనంతకుమార్ సూత్రధారిగా తేలింది. చైనాలో మెడిసిన్ పూర్తి చేసిన వారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) పరీక్ష పాస్ అయితేనే రిజిస్ట్రేషన్‌కు ఆస్కారం ఉంటుందని, పాస్ కాని వారి నుంచి రూ.9 లక్షల చొప్పున వసూలు చేసిన కుమార్ సర్టిఫికెట్లు జారీ చేశాడని అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. జేసీపీ డాక్టర్ గజరావ్ భూపాల్, ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులతో కలిసి గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇబ్రహీంపట్నానికి చెందిన కసరమోని శివానంద్, కర్మన్‌ఘాట్ వాసి తోట దిలీప్ కుమార్ స్నేహితులు. వీరు చైనాలో ఎంబీబీఎస్ చదివారు. 2012లో సర్టిఫికెట్ పొంది తిరిగి వచ్చారు. ఇలా విదేశాల్లో వైద్య విద్యనభ్యసించిన వారు ఇక్కడ ప్రాక్టీసు చేయాలంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) ఉత్తీర్ణులు కావాలి. అత్యంత కఠినంగా ఉండే ఈ పరీక్షను ఎంసీఐ ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తుంది. ఈ ద్వయం 2012–14 మధ్య రెండుసార్లు పరీక్షకు హాజరైనా ఉత్తీర్ణులు కాలేదు. పాస్ అయితే కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదు. దీంతో వీళ్లిద్దరూ ‘ప్రత్యామ్నాయ మార్గాలు’ అన్వేషించారు. వీరికి ఓ స్నేహితుడు (ప్రస్తుతం దుబాయ్‌లో) ద్వారా టీఎస్‌ఎంసీలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న అనంతకుమార్‌తో పరిచయమైంది. 2017లో అతడిని కలిసి తమ అవసరాన్ని చెప్పారు. దీంతో ఒక్కొక్కరి నుంచి రూ.9 లక్షల చొప్పున వసూలు చేసిన అనంతకుమార్ 2016లో రిజిస్టర్ చేసుకున్న వైద్యుల రిజిస్ట్రేషన్ నంబర్లు వీరికి కేటాయించాడు. ఈ మేరకు టీఎస్ఎంసీ డేటాబేస్‌లో మార్పుచేర్పులు చేసి, వీరిద్దరికీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందించాడు. ఇటీవల అసలు వైద్యులు రెన్యువల్, అర్హతలు అప్డేట్ కోసం టీఎస్ఎంసీకి రావడంతో విషయం తెలిసింది. టీఎస్ఎంసీ ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుల కోసం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలోని టీమ్ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకుంది. వీరి వద్ద నకిలీ టీఎస్ఎంసీ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ... ఎంసీఐ సర్వర్‌లో మాత్రం ఎంటర్ కాలేదు. దీంతో అందులో అసలు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలే కనిపిస్తున్నాయి. చిక్కుతామని భయపడిన వీరు ప్రాక్టీసు చేయకుండా వైద్య సంబంధ ఉద్యోగాలు చేస్తున్నారు. అనంతకుమార్ వీరిద్దరితో పాటు శ్రీనివాస్, నాగమణిలకు ఈ తరహాలో సహకరించినట్లు అనుమానాలున్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్న వారి వివరాలు ఆరా తీస్తున్నామన్నారు. శివానందం 2012–16 మధ్య, దిలీప్ 2016 –18 మధ్య సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో డ్యూ టీ డాక్టర్లుగా పని చేశారు. టీఎస్ఎంసీ సర్టిఫికెట్ లేని శివానందంకు ఉద్యోగం ఎలా వచ్చిందనేది ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం వీరిలో ఒకరు మెడికల్ కంపెనీలో, మరొకరు వైద్యులకు అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. (చదవండి: తమ్ముడి ఇంట్లో తుపాకీ పెట్టాడు!) -
కటకటాల్లోకి కల్లాడ వీఆర్ఏ..
నందిగాం(శ్రీకాకుళం జిల్లా): రెవెన్యూ రికార్డుల తారుమారు కేసులో కల్లాడ పంచాయతీ వీఆర్ఏని అరెస్టు చేశామని ఎస్సై ఎస్.బాలరాజు బుధవారం తెలిపారు. తప్పుడు రికార్డులు సృష్టించి సుమారు 30 ఎకరాల లేని భూమి ఉన్నట్లుగా చేసి అమాయకులకు అమ్మజూపి వారి నుంచి లక్షలాది రూపాయలు దోచుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు మదన్‌గౌడ్‌కు వీఆర్ఏ కొత్తపల్లి ఢిల్లేశ్వరరావు సహకరించినట్టు తేలింది. కంప్యూటర్ పరిజ్ఞానంతో రెవెన్యూ కార్యాలయంలో తిష్ట వేసిన ఢిల్లేశ్వరరావు రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి మదన్‌గౌడ్‌కు సహాయం చేశాడని, అందుకు ప్రతిఫలంగా రూ.1.25 లక్షలు పుచ్చకున్నాడని పక్కా ఆ«ధారాలు సేకరించడంతో అరెస్టు చేసి జైలుకు పంపించామని ఎస్సై పేర్కొన్నారు. నందిగాం తహసీల్దారు కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్‌లో పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్ పని చేసేవారు. అయితే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వీఆర్ఏ ఢిల్లేశ్వరరావును గతంలో అధికారులు నియామకం చేశారు. ఇదే అదునుగా ప్రతి చిన్న పనికీ లంచం తీసుకోవడానికి అలవాటు పడిన ఆయన టీడీపీ నాయకులకు పూర్తి సహాయసహకారాలు అందిస్తుండేవాడని తెలిసింది. రెవెన్యూ రికార్డుల వ్యవహారంలో ప్రతి చిన్న పనికి తహసీల్దారు డిజిటల్ సంతకం అవసరం కావడంతో దానికి సంబంధించిన ‘కీ’ని అప్పుడప్పుడూ ఢిల్లేశ్వరరావు వినియోగించేవాడు. అయితే ఇదే అదునుగా భావించిన మదన్‌గౌడ్ ఢిల్లేశ్వరరావు ద్వారా మండలంలోని పలుచోట్ల రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేందుకు రూ.1.25 లక్షలు ముట్టజెప్పాడు. అయితే భూముల కోనుగోలు చేసిన హైదారాబాద్‌కు చెందిన వ్యక్తికి అనుమానం రావడంతో కార్యాలయానికి వెళ్లి ఆరా తీయడంతో రికార్డుల తారుమారు వ్యవహారం జూలైలో బయటకు వచ్చింది. అంతేకాక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నందిగాం పోలీసులు గతంలో ప్రధాన నిందితుడు మదన్‌గౌడ్‌ను అరెస్టు చేశారు. రికార్డుల తారుమారులో తహసీల్దారు కార్యాలయ సిబ్బంది పాత్రపై అనుమానం ఉన్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా వీఆర్ఏ ఢిల్లేశ్వరరావుపై అనుమానం వచ్చి ఆరా తీయగా నిజాలు బయటకు వచ్చాయి. దీంతో మదన్‌గౌడ్ నుంచి పుచ్చుకున్న రూ.1.25 లక్షల్లో పోలీసులు రూ.లక్ష రికవరీ చేయడంతో పాటు ఢిల్లేశ్వరరావును అరెస్టు చేసి నరసన్నపేట సబ్‌జైల్‌కు పంపించారు. రెవెన్యూ రికార్డుల తారుమారు వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. -
మాస్క్ పెట్టి మస్కా కొట్టాలని చూస్తే..
సాక్షి, హైదరాబాద్: నగరంలో సంచరిస్తున్న ఉల్లంఘనులు నానాటికీ రెచ్చిపోతున్నారు. నిఘా నేత్రాలకు తమ నెంబర్ ప్లేట్లు చిక్కకుండా ఉండేందుకు వాటిని ‘కవర్’ చేస్తున్నారు. మాస్క్‌లతో సహా కొన్నింటితో మూసేయడం, వంచేయడం, విరిచేయడం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఉల్లంఘనులపై ట్రాఫిక్ పోలీసులు మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తూ వచ్చారు. అయితే ఈ తరహా ఉల్లంఘనుల్లో మార్పురాకపోవడం, నేరగాళ్ళు సైతం ఇదే బాటపట్టడంతో ట్రాఫిక్ కాప్స్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్స్ ‘కవరింగ్’కు పాల్పడిన వారిని పట్టుకుని శాంతిభద్రతల విభాగానికి అప్పగిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులే ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తున్నారు. శుక్రవారం ఈ తరహా నేరం చేసి పంజగుట్టలో చిక్కిన చంద్రాయణగుట్ట యువకుడిపై చీటింగ్ కేసు నమోదైంది.(నెంబర్‌ప్లేట్ కనిపించకుండా ట్యాంపరింగ్..) ఈ–చలాన్ తప్పించుకోవడానికే... సిటీ ప్రధానంగా ఈ నెంబర్ ప్లేట్ల కవరింగ్ అనేక ఈ–చలాన్లను తప్పించుకోవడానికే చేస్తున్నారని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం నగరంలో పూర్తి స్థాయి నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు అమలవుతున్నాయి. అంటే... ఒకప్పుడు మాదిరిగా రహదారులపై ఉండే ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనుల్ని పట్టుకున్నప్పుడు వారికి స్పాట్లో చలాన్ విధించడం, జరిమానా వసూలు చేయడం జరగట్లేదు. కేవలం క్షేత్రస్థాయి సిబ్బంది తమ చేతిలో ఉన్న డిజిటల్ కెమెరాలతో ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలను నెంబర్ ప్లేట్స్‌తో సహా చిత్రీకరిస్తున్నారు. వీటితో పాటు సీసీ కెమెరాల ద్వారా సేకరించిన ఫొటోల ఆధారంగా కమాండ్ అండ్ కంట్రోల్ సిబ్బంది ఉల్లంఘనులకు ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. ఈ విధానంలో వాహనాల నెంబర్, దాని ఆధారంగా సేకరించే చిరునామా కీలకం. తమ వాహనాలకు సంబంధించిన నెంబర్ ప్లేట్లను వి విధ రకాలుగా కవర్ చేయడం, వంచేయడం, విరిచే యడం చేస్తున్న వాహనచోదకులు వాటి రిజిస్ట్రేషన్ నెంబర్లు ట్రాఫిక్ కెమెరాలకు చిక్కుకుండా తప్పించుకుంటున్నారు. దీన్ని అదునుగా భావించి కొందరు నేరగాళ్ళు సైతం నెంబర్ ప్లేట్లు లేకుండా, వాటిని కవర్ చేసి తమ పని పూర్తి చేసుకుపోతున్నారు. గత నెల 31న అబిడ్స్ పరిధిలో సెల్‌ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఓ స్నాచర్ ఈ తరహాలోనే నే రం చేశాడు. ఇలా జరిగిన కొన్ని నేరాలను కొలిక్కి తేవడాని కి పోలీసులు అనేక వ్యయప్రయాసలకు ఓర్చాల్సి వస్తోంది. వెనుక వాటి మూసివేతలే ఎక్కువ... వాహనాల నెంబర్ ప్లేట్స్ ఎదుటి వారికి, సీసీ కెమెరాలకు చిక్కకుండా కవర్ చేయడం అనేది తేలికపాటి వాహనాల కంటే ద్విచక్ర వాహనాలకే ఎక్కువగా కనిపిస్తోందని అధికారులు చెప్తున్నారు. రోడ్లపై ఈ తరహా నెంబర్ ప్లేట్‌ను పోలీసులు గుర్తించి ఆపడానికి ప్రయత్నిస్తే బైక్స్ మాదిరిగా తేలికపాటి వాహనాలు తప్పించుకునిపోలేవు. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఆ తరహా చర్యల జోలికి వెళ్ళట్లేదని ట్రాఫిక్ కాప్స్ అంటున్నారు. ద్విచక్ర వాహనాల్లోనూ 90 శాతం వెనుక వైపు నెంబర్ ప్లేట్‌కే రూపురేఖలు లేకుండా చేస్తున్నారు. సాధారణంగా ఉల్లంఘనల్ని వాహనం వెనుక నుంచే ఫొటోలు తీస్తుండటంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ఇర్రెగ్యులర్/ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్ ఉల్లంఘనగా పిలిచే వీటిపై ఇప్పటికే ట్రాఫిక్ విభాగం అధికారులు అనేకసార్లు స్పెషల్‌డ్రైవ్స్ చేశారు. అయినప్పటికీ వాహనచోదకుల్లో పూర్తి స్థాయి మార్పు రాలేదు. దీంతో ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఉల్లంఘలకు పాల్పడిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయడం మొదలెట్టారు. మాస్క్ పెట్టి మస్కా కొట్టాలని... పాతబస్తీలోని చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ జహూరుద్దీన్ గురువారం తన ద్విచక్ర వాహనంపై పంజగుట్టకు వచ్చాడు. తన రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపింకుండా వెనుక నెంబర్ ప్లేట్‌కు ఫేస్ మాస్క్ తగిలించేసిన ఇతగాడు పంజగుట్ట వైపు నుంచి వీవీ స్టాట్యూ వైపు దూసుకుపోతున్నాడు. ఈ విషయం గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆపి ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఇతగాడు ఉద్దేశపూర్వకంగానే నెంబర్ ప్లేట్ కవర్ చేసినట్లు నిర్థారించి స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. ఆ అధికారులు ఇతడిపై మోసం ఆరోపణలపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎవరైనా నగరవాసులు ఇలాంటి నెంబర్ ప్లేట్లతో కూడిన వాహనాలను గుర్తిస్తే ఆ ఫొటోలు తీసి పోలీసు అధికారిక వాట్సాప్ నెంబర్ 9490616555కు పంపాలని కోరుతున్నారు. -
అతనిపై 4 మ్యాచ్‌లు... మీపై 12 నెలలా?
బ్రిస్బేన్: ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో అతనిపై నాలుగు టీ20 మ్యాచ్‌ల నిషేధ పడింది. అయితే ఇదే తరహాలో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో ఏడాది నిషేధం ఎదుర్కొన్నాడు. ఇక డేవిడ్ వార్నర్ సైతం ట్యాంపరింగ్‌లో భాగం కావడంతో అతనిపై కూడా 12 నెలలు సస్పెన్షన్ పడగా, బెన్‌క్రాఫ్‌పై 9 నెలల నిషేధం విధించారు. అయితే పూరన్‌కు ఎందుకు స్వల్ప శిక్ష పడిందని స్టీవ్ స్మిత్‌ను అడగ్గా.. అలా అతనికి తక్కువ నిషేధం పడితే తనకేమిటి సంబంధం అని ఎదురు ప్రశ్నించాడు. అతనికి ఓ మోస్తరు శిక్ష వేయడంతో తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నాడు. ‘ ప్రతీ ఒక్కరూ డిఫరెంట్.. ప్రతీ బోర్డు డిఫరెంట్. అక్కడ చాలా విషయాలు మిళితమై ఉంటాయి. నాకు కఠినమైన శిక్ష పడిందని నేనేమీ ఫీల్ కావడం లేదు. అది గతం. నేను గతం నుంచి ప్రస్తుతానికి వచ్చా. ఇప్పుడు వర్తమానంపై దృష్టి సారిస్తున్నా. నాకు నికోలస్ తెలుసు. అతనితో చాలా క్రికెట్ ఆడిన అనుబంధం ఉంది. అతనొక టాలెంట్ ఉన్న క్రికెటర్. పూరన్‌కు మంచి భవిష్యత్తు ఉంది. అతను చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటాడు’ అని స్మిత్ పేర్కొన్నాడు. లక్నోలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో అతను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఐసీసీ అతనిపై నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది. బంతి ఆకారాన్ని మార్చినట్లు పూరన్ అంగీకరించడంతో క్షమాపణలు కూడా కోరాడు. సస్పెన్షన్ కారణంగా విండీస్ ఆటగాడు తదుపరి నాలుగు టి20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిలోని లెవెల్–3 నిబంధనను అతిక్రమించడంతో ఆరి్టకల్ 2.14 ప్రకారం నాలుగు సస్పెన్షన్ పాయింట్లను విధించామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. -
బాల్ ట్యాంపరింగ్ ఇలా చేసే వాడిని..!
లండన్: తాను క్రికెట్ ఆడే సమయంలో బాల్ ట్యాంపరింగ్ చేసే వాడినంటూ ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ సంచలన విషయాలు వెల్లడించాడు. ఇందుకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు నుంచి పూర్తిగా మద్దతు ఉండేందంటూ కొత్త వివాదానికి తెరలేపాడు. 2006-13 మధ్య కాలంలో ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన పనేసర్.. ట్యాంపరింగ్ చేయడానికి సన్ స్ర్కీన్ లోషన్స్‌తో పాటు తన ప్యాంటుకు ఉన్న జిప్‌ను ఉపయోగించే వాడినన్నాడు. కొన్ని సమయాల్లో చూయింగ్ మింట్లతో కూడా బంతి ఆకారాన్ని చెడగొట్టడానికి యత్నించేవాడినన్నాడు. ఈ విషయాల్నితన రాసిన ‘ ద ఫుల్ మోంటీ’ పుస్తకం ద్వారా బయటపెట్టాడు. సాధ్యమైనంత వరకూ బంతిని పొడి బారేలే చేయడానికి ఈ విధానాల్ని ఉపయోగించే వాడినని, తాను బంతి ఆకారాన్ని ఎలా దెబ్బతీయాలనే విషయంలో పేసర్ జేమ్స్ అండర్సన్ సహకరించే వాడన్నాడు. ఇలా తాను చేసిన తర్వాత బంతి రివర్స్ స్వింగ్‌కు తోడ్పటమే ప్రధాన కారణంగా చెప్పుకొచ్చాడు. ఆపై అండర్సన్ తరహా పేసర్లకు బంతి నుంచి రివర్స్ స్వింగ్ లభించేదంటూ పనేసర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ తరఫున 50 టెస్టు మ్యాచ్‌లు ఆడిన పనేసర్ 167 వికెట్లు సాధించగా, 26 వన్డేలకు గాను 24 వికెట్లు మాత్రమే తీశాడు. క్రికెట్ లా మేకర్ ఎంసీసీ నిబంధనల ప్రకారం బంతి ఆకారాన్ని కావాలని దెబ్బ తీయడం నేరం. ఐసీసీ 42.3 నియమావళి ప్రకారం ఇలా ఎవరైనా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ తాజా వివాదంపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. -
ఈవీఎంలను హ్యాక్ చేయలేం!
సాక్షి, హైదరాబాద్: ఈవీఎంలను హ్యాకింగ్/ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని ఐటీ నిపుణుడు సందీప్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు కావాలనే పనికట్టుకుని ఈవీఎంలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం)ను డీ–కోడ్ చేయడం కష్టతరమని, వీటిలో ఎలాంటి డివైజ్ డ్రైవర్స్‌ను ఇన్స్టాల్ చేయలేరని సందీప్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వివిధ దశల్లో ఈవీఎంల సెక్యూరిటీని పరిశీలించిన తర్వాతే వినియోగిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ‘కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ముఖ్యమైన వ్యక్తులు.. అభద్రతాభావంతో ఈవీఎంలపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేనో ఎంబేడెడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా క్రిప్టాలజీ, ఎన్క్రిప్టింగ్ మీద 15ఏళ్లుగా పనిచేస్తున్నాను. నా అనుభవం ద్వారా తెలుసుకున్న వాస్తవాలను యావదాంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ప్రభుత్వ పెద్దలు ఆరోపణలు చేస్తున్నట్లుగా ఓ ఈవీఎంను ట్యాంపర్ చేయాలంటే దానికి హార్డ్‌వేర్, కమ్యూనికేషన్ రేడియోస్, సపోర్టింగ్ సాఫ్ట్వేర్ కీలకం. ఒకవేళ ఈవీఎంని నెట్వర్క్ వీడియోస్‌తో అనుసంధానం చేయాలంటే చాలా ఖరీదైన పని. ఈవీఎంలలో ఎలాంటి డివైజ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయలేరు. ఒకసారి ఫర్మ్‌వేర్ కంపైల్ చేసిన తర్వాత ఈవీఎంపైన ఫ్లాష్చేస్తే.. రెండోసారి రీ–ఫ్లాష్చేసే అవకాశం ఉండదు. అదే విధంగా బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ యూనిట్ మధ్య జరిగే కమ్యూనికేషన్ ప్రొపరేటరీ సెక్యూర్ ప్రొటోకాల్ ద్వారానే జరుగుతుంది. ఏజెంట్ సమక్షంలో సమక్షంలో బ్యాటరీ స్విచాఫ్ చేస్తారు. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా కట్ అయిపోతుంది. దీంతో అటోమెటిక్‌గా ఈవీఎంలో మెమరీ అలాగే ఉన్నప్పటికీ.. బయటి వారు యాక్సెస్ చేసేందుకు వీలుండదు. ఈవీఎంలను హ్యాక్ చేయాలని ప్రయత్నించి చాలా మంది విఫలమయ్యారు’అని సందీప్ రెడ్డి వెల్లడించారు. మన ఈవీఎంలను చాలా దేశాల్లో వినియోగిస్తున్నారని.. కానీ కావాలనే కొందరు మన దేశంలో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి వారిపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఓ హ్యాకర్ ఈవీఎంలను హ్యాక్ చేస్తానంటూ సవాల్ విసిరి భంగపడ్డారని సందీప్ తెలిపారు. ఈ ఏడాది కూడా సయ్యద్ షుజా అనే వ్యక్తి యూకే నుంచి ఈవీఎంలను హాక్ చేస్తానని, గతంలో తాను ఈసీఐఎల్‌లో పనిచేస్తున్న సమయంలో హ్యాకింగ్ చేశానని చెప్పుకున్నారు. దీంతో మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్, మరికొందరు మీడియా, రాజకీయ ప్రముఖులు లండన్ వెళ్లొచ్చారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అవాస్తవమని వారు తెలుసుకున్న విషయాన్ని కూడా సందీప్ రెడ్డి గుర్తుచేశారు. వీవీప్యాట్‌కు, బ్యాలెట్ యూనిట్‌కు మధ్య మార్పు జరిగే సమయంలో ట్యాంపర్ (మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్) జరుగుతుందంటూ కొందరు చేస్తున్న వాదన అర్థరహితం అన్నారు. ఏపీ ఎన్నికల సమయంలో 36 చోట్ల ఈవీఎంలు మోరాయించాయని.. అది కూడా ఆపరేటర్ అసమర్థత ద్వారానే జరిగిందన్నారు. ఇందులో ఈవీఎంల తప్పిదమేమీ లేదన్నారు. -
కశ్మీర్ వాసిని యూఎస్ రెసిడెంట్‌గా...
సాక్షి, సిటీబ్యూరో: పాస్‌పోర్టులను ట్యాంపరింగ్ చేస్తూ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సోమవారం చిక్కిన ముఠా ఓ క్లిష్ట సమస్యను తెరపైకి తెచ్చింది. ఈ గ్యాంగ్ నుంచి పోలీసులు దాదాపు 80 పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఎవరు నిందితులు? ఎవరు బాధితులుగా మారుతారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ముఠా సూత్రధారి రహీముద్దీన్‌ను పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించడంతో పాటు ఆయా వ్యక్తులను పిలిచి ప్రశ్నించిన తర్వాతే నిందితులా? బాధితులా? అనేది తేలుస్తామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. తెలిసీ చేస్తే చర్యలు తప్పవు... రహీముద్దీన్ సైదాబాద్‌లోని శాంత ప్యాలెస్‌లో అక్రమ వీసా కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న సంస్థ అని కస్టమర్లకు తెలిసి ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే కొందరు సక్రమ వ్యవహారమే అని భావించి వీసా ప్రాసెసింగ్‌కు ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. మరికొందరు తమకు అర్హత, అవకాశం లేకపోయినా అక్రమ మార్గంలో వీసాలు పొంది ఆయా దేశాలకు వెళ్లాలని భావించిన వాళ్లూ ఉంటారు. ఇలా తమ పాస్‌పోర్టులను రహీముద్దీన్‌కు అప్పగించిన వారు నిందితులుగా మారుతారని పోలీసులు చెబుతున్నారు. ఇతడితో పాటు ఇతర ముఠా సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లలోని డేటా, వీరు రూపొందించిన బోగస్ సర్టిఫికెట్లు పరిశీలిస్తే తెలిసీ ముందుకు వచ్చింది ఎవరనేది గుర్తించడం తేలిక అవుతుందని భావిస్తున్నారు. కశ్మీర్ వాసిని యూఎస్ రెసిడెంట్‌గా... అనేక కారణాలు, నేపథ్యాల్లో జమ్మూకు చెందిన వ్యక్తులకు అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలు వీసాలు ఇవ్వడం లేదు. దీంతో తమను సంప్రదించిన జమ్మూ వాసి వికాస్‌ను రహీముద్దీన్ అండ్ గ్యాంగ్ అమెరికా రెసిడెంట్‌గా మార్చేసింది. ఇతడి పాస్‌పోర్ట్‌ను ట్యాంపర్ చేసిన గ్యాంగ్ ఆఖరి పేజీలో అమెరికా నుంచి అది రీ–ఇష్యూ అయినట్లు మార్చేసింది. దీంతో పాటు అతడికి యూఎస్ రెసిడెంట్ కార్డునూ సృష్టించేసింది. దీని ఆధారంగా అతను వీసా ఇంటర్వ్యూకు వెళ్లగా.. అనివార్య కారణాలతో తిరస్కరణకు గురైంది. మరోసారి ట్యాంపర్ చేస్తూ యూకే రెసిడెంట్‌గా చూపడానికి రహీముద్దీన్ ‘ఏర్పాట్లు’ చేసేశాడు. అలాగే మియాపూర్‌కు చెందని ఓ యువకుడికి ఇదే పంథాలో టర్కీ వెళ్లడానికి జాబ్ వీసా ఇప్పించేశాడు. మొత్తం 450 మందిలో ఇలా దేశం దాటేసిన వాళ్లు ఎవరు? వీసా రాక ఇక్కడే ఉన్నది ఎవరు? అనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయనున్నారు. వీరిపై కేసులు ‘రాసులు’.... ఈ అంతరాష్ట్ర గ్యాంగ్‌కు చెందిన చెందిన వారిలో దాదాపు ప్రతి ఒక్కరికీ గతంలో నేరచరిత్ర ఉంది. సూత్రధారి రహీముద్దీన్‌పై ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదయ్యాయి. 2010లో చాదర్‌ఘాట్, 2012, 2013ల్లో హుస్సేనిఆలం, 2016లో లంగర్‌హౌస్ ఠాణాల్లో ఇవి రిజిస్టర్ అయ్యాయి. చెన్నైకి చెందిన ఇలియాస్‌పై అక్కడి సీసీఆర్బీ టీమ్‌లు 2003, 2007లో కేసులు నమోదు చేసి అరెస్టు చేశాయి. స్టాంపుల తయారీదారుడు జహీరుద్దీన్‌పై గత ఏడాది హుస్సేనిఆలం పోలీసులు కేసు నమోదు చేశారు. రహీముద్దీన్‌పై నమోదైన కేసులు ప్రస్తుతం దర్యాప్తు దశలోనే ఉన్నాయి. తాజా ఉదంతాలకు సంబంధించి ముఠాపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదులతో సైదాబాద్, బేగంపేట, ముషీరాబాద్, చాదర్‌ఘాట్, నాంపల్లి, గోల్కొండ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఈ ముఠాపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి నగర పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. స్టాంపుల తయారీదారులపై స్పెషల్ డ్రైవ్ నగరంలో అనేక మంది రబ్బర్ స్టాంపులు తయారు చేసే వారు ఉన్నారు. రహీముద్దీన్ గ్యాంగ్ పాస్పోర్ట్స్ ట్యాంపర్ చేసి కాన్సులేట్లను మోసం చేయడంలో రబ్బర్ స్టాంపుల పాత్ర కీలకం. ఏ తయారీదారుడూ సంబంధిత శాఖ, సంస్థ నుంచి అధీకృత లేఖ లేనిదే స్టాంపులు తయారు చేయరాదు. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు. దీన్ని పరిశీలించేందుకు నగర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్స్ చేయాలని నిర్ణయించాం.– అంజనీకుమార్, కొత్వాల్ -
ట్యాంపర్ రామారావు మళ్లీ అరెస్టు
సాక్షి, విశాఖపట్నం/భీమునిపట్నం: ట్యాంపరింగ్‌కు పాల్పడిన మాజీ తహసీల్దార్ బీటీవీ రామారావు మరోసారి కటకటాలపాలయ్యారు. అడ్డగోలుగా రికార్డులను ట్యాంపర్ చేసి వందల వేల కోట్ల విలువైన భూములను అన్యాక్రాంతమయ్యేందుకు కారణమైన ఈయన రాజకీయ పలుకుబడితో తనపై సస్పెన్షన్‌ను ఎత్తివేయించుకోవడమే కాదు.. ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి విశాఖలోనే వరుసగా మూడు సార్లు పోస్టింగ్ పొందారు. అయితే ‘మా కొద్దీ అధికారి’అంటూ జిల్లా అధికారులు తిప్పి పంపగా ఎన్నికల వంకతో శ్రీకాకుళంలో పోస్టింగ్ పొందారు. నేడో రేపో బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో మరో కేసులో మరోసారి జైలు పాలయ్యారు. భీమిలి తహసీల్దారుగా పనిచేసిన సమయంలో రికార్డుల ట్యాంపరింగ్‌లతో పాటు పలు అవకత వకలకు పాల్పడగా అరెస్టయిన సంగతి తెలిందే. కాగా తాజాగా మరో కేసులో ఆయన మళ్లీ అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. విశాఖలో ఉంటున్న రామారావును భీమిలి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. ఈ కేసు వివరాలను భీమిలి సీఐ ఎం.వెంకటనారాయణ శుక్రవారం రాత్రి మీడియాకు తెలియజేశారు. విశాఖలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న బడే నరసింహారావు 2007లో చేపలుప్పాడులోని సర్వే నంబర్ 31/7లో 30 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. అడంగల్, వన్–బీ, పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ పొందారు. 2016 వరకు రెవెన్యూ రికార్డులన్నింటిలోనూ ఈ భూమి ఆయన పేరు మీదే ఉండేది. 2016 జనవరి 12న కారి సత్తెన్న పేరిట మారిపోయింది. సత్తెన్న చనిపోయాడంటూ కొద్ది రోజులకు వారి కుమారులు కారి అప్పారావు, ఆనంద్‌ల పేరిట అడంగల్, 1బీలు మార్చారు. వాటిని భీమిలి కోర్టులో సమర్పించి మేజిస్ట్రేట్‌ను కూడా తప్పుదారి పట్టించి 2017 డిసెంబర్లో తమకు అనుకూలంగా ఆర్డర్స్ పొందారు. ఆ వెంటనే ఆ భూమిలో భారీ నిర్మాణాలు చేపట్టడంతో పాటు విద్యుత్ కనెక్షన్ తీసుకుని, వారి పేరిట ఇంటి పన్నులు కూడా చెల్లించారు. అయితే తనకు జరిగిన అన్యాయాన్ని నరసింహారావు స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యల్లేవు. చివరకు అప్పటి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను ఆశ్రయించగా ఎస్డీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విచారణలో బీటీవీ రామారావు తహసీల్దార్‌గా ఉన్న సమ యంలో రికార్డులు ట్యాంపర్ చేసి పేర్లు మార్చేసినట్టుగా నిర్ధారించారు.ఆ మేరకు కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. దాన్ని ఆధారంగా చేసుకుని బీటీవీ రామారావుపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేస్తూ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించారు. గ్రీవెన్స్‌లో వినతితో కదలిక 2018 డిసెంబర్ 27న ఈ స్థలానికి సంబంధించి పూర్తి ఆధారాలతో ఇక్కడ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఉద్దేశ పూర్వకంగా రికార్డులు మార్చిన బీటీవీ రామారావుతో పాటు తన భూమిలోకి చొరబడిన కారి అప్పారావు, ఆనంద్‌లపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంలేదంటూ ఈ నెల 21న గ్రీవెన్స్‌లో కలెక్టర్ కాటంనేని భాస్కర్ దృష్టికి నరసింహారావు తీసుకెళ్లారు. పది రోజుల్లో ఫ్రెష్ అడంగల్, వన్‌బీ ఇచ్చి, ఈ మేరకు తనకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అంతే కాకుండా రికార్డులను ట్యాంపర్ చేసిన రెవెన్యూ అధికారులు, కబ్జాకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు సూచించారు. కాగా క్రైం నంబర్ 339/2018 కింద నమోదైన ఈ కేసులో బీటీవీ రామారావు చేసిన తప్పిదం వల్లనే ఇదంతా జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు రామారావుతో పాటు కారి అప్పారావు, కారి ఆనంద్ తదితరులపై సెక్షన్లు 465, 468, 4 71 కింద కేసు నమోదు చేసిన భీమిలి పోలీసులు శు క్రవారం ఉదయం విశాఖలోని అక్కయ్యపాలెం నందగిరినగర్‌లో ఉంటున్న రామారావు నివాసానికి వెళ్లి అరెస్ట్ చేశారు. భీమిలి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించినట్టుగా సీఐ తెలిపారు. -
ఈవీఎం.. దుమారం!
-
గార్డ్ ఛేంజ్ చేసి మరీ రెచ్చిపోయాడు
సిల్హెట్: బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాదిపాటు అంతర్జాతీయ నిషేధం గురైన ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. మరో రెండు నెలల్లో నిషేధం పూర్తి చేసుకోబోతున్నాడు. మార్చి నెల చివరి వారంతో అతనిపై విధించిన నిషేధం పూర్తి కావొస్తుంది. ఈ క్రమంలోనే విదేశీ లీగ్‌లో పాల్గొంటూ తన ఫామ్‌ను పునికిపుచ్చుకునే పనిలో ఉన్నాడు డేవిడ్ వార్నర్. ఇప్పటికే కెనడా లీగ్ ఆడిన వార్నర్.. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో ఆడుతున్నాడు. బీపీఎల్‌లో సిల్హెట్ సిక్సర్స్‌కు కెప్టెన్‌గా వ్యహరిస్తున్న వార్నర్ తన బ్యాటింగ్ పవర్‌ను చూపించాడు. రంగాపూర్ రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో వార్నర్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా 61 పరుగులు చేశాడు. అయితే ఇందులో కొన్ని బంతులు ఆడటానికి తన బ్యాటింగ్ గార్డ్‌ను మార్చుకుని సాధించడం విశేషం. స్వతహాగా ఎడమచేతి వాట బ్యాట్స్‌మన్ అయిన వార్నర్.. గేల్ వేసిన 19 ఓవర్ నాల్గో బంతికి ఉన్నపళంగా గార్డ్ మార్చుకున్నాడు. అంతకుముందు బాల్‌ను హిట్ చేద్దామని ప్రయత్నించిన వార్నర్ విఫలం కావడంతో కుడి చేతి వాటం బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఫీల్డ్ అంపైర్‌కు తెలిపిన వార్నర్.. రైట్ హ్యాండ్‌తో ఆడిన మొదటి బంతిని సిక్స్‌గా కొట్టాడు. ఆ తర్వాత వరుస రెండు బంతుల్ని రెండు ఫోర్లు కొట్టి మరీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 33 బంతుల్లో 47 పరుగుల్ని లెఫ్ట్ హ్యాండర్‌గా సాధించగా, 3 బంతుల్లో 14 పరుగుల్ని రైట్ హ్యాండర్‌గా సాధించాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్‌కు జతగా లిటన్ దాస్(70; 43 బంతుల్లో 9ఫోర్లు 1 సిక్సర్) రాణించడంతో సిల్హెట్ సిక్సర్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ఆపై లక్ష్య ఛేదనలో రంగపూర్ రైడర్స్ ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి ఓటమి పాలైంది. -
ఓవర్లో ఏడో బంతికి బ్యాట్స్‌మన్ ఔట్!
పెర్త్: బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో ఓ బ్యాట్స్‌మన్ ఔటైన తీరు వివాదాస్పదమైంది. సాధారణంగా ఓవర్‌కు ఆరు స్ట్రైయిట్ బంతులు మాత్రమే పడాల్సిన ఉన్నా అంపైర్ ఏడో బాల్ వేయించడంతో పాటు ఆ బంతికి బ్యాట్స్‌మన్ ఔట్ కావడం వివాదానికి దారి తీసింది. ఆస్ట్రేలియా వేదిక జరుగుతున్న బీబీఎల్‌లో భాగంగా ఆదివారం పెర్త్ స్కార్చర్స్-సిడ్నీ సిక్సర్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ జట్టు 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండో ఓవర్లో ఓపెనర్ మైకేల్ క్లింగర్ ఏడో బంతికి ఔటయ్యాడు. ఓవర్‌కు వేసే బంతుల్ని లెక్కించే క్రమంలో అంపైర్ ఒక్క బంతి ఎక్కువగా వేయించాడు. ఆ బంతికి క్లింగర్ ఔట్ కావడం చర్చకు దారి తీసింది. డ్వార్షూయిస్ వేసిన సదరు ఓవర్ తొలి రెండు బంతుల్ని మరో ఓపెనర్ బెన్‌క్రాఫ్ట్ ఆడి ఒక లెగ్ బై ద్వారా పరుగు తీశాడు. ఆపై మూడో బంతిని క్లింగర్ ఆడి బై ద్వారా రెండు పరుగులు సాధించగా, నాల్గో బంతికి క్లింగర్ పరుగు తీశాడు. ఇక ఐదో బంతికి బెన్ క్రాఫ్ ఆడి రెండు పరుగులు తీయగా, ఆరు బంతికి పరుగు తీశాడు. దాంతో ఓవర్ పూర్తయ్యింది. అయితే మరొక బంతిని అంపైర్ వేయించడంతో క్లింగర్ ఔటయ్యాడు. ఫీల్డ్ అంపైర్ చేసిన తప్పిదాన్ని మ్యాచ్ అధికారులు సైతం గుర్తించకపోవడంతో క్లింగర్ 2 పరుగులకే పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కామెరూన్ బెన్‌క్రాఫ్ట్ 61 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో అజేయంగా 87 పరుగులు సాధించడంతో పెర్త్ స్కార్చర్స్ 18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి గెలుపును అందుకుంది. బాల్ ట్యాంపరింగ్‌తో నిషేధానికి గురై ఇటీవల ప్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టిన బెన్‌క్రాఫ్ట్ బ్యాట్‌తో మెరవడం పెర్త్ స్కార్చర్స్ అభిమానుల్ని అలరించింది. -
ఈవీఎంలపై అనుమానం అక్కర్లేదు
చంఢీగఢ్: ఈవీఎంల (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్)పై ఎటువంటి అనుమానం అక్కర్లేదని, వాటి పనితీరును అత్యంత సాంకేతిక పరిజ్ఞానం గల నిపుణులతో పర్యవేక్షిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎమ్ఈఆర్)నూతన విద్యా సంవత్సర ప్రారంభోత్సవ సమావేశంలో ‘ముందుకు సాగడానికి అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై మాట్లాడారు. ఈవీఎం వ్యవస్థ పనితీరుపై అసలు సందేహ పడాల్సిన అవసరమే లేదని ఆయన స్పష్టం చేశారు. పలు రాజకీయ పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ సీఈసీపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో అరోరా ఈమేరకు వ్యాఖ్యానించారు. ‘ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిందేమిటంటే ఏ యంత్రమైనా పాడవుతుంది. కానీ పాడవడానికి, సరిగా పనిచేయకపోవడానికి మధ్య తేడా ఉంది. మీరు ఒక కారు కొన్నారు అనుకోండి అది ఓ వారం లోపు పనిచేయకపోవచ్చు’అని ఉదహరించారు. ఇవేమీ పట్టించుకోకుండా ప్రజలు ఇష్టమొచ్చినట్లు ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికలను విశ్వసనీయతతో, నిష్పాక్షికతతో, నైతికతతో నిర్వహించడానికి మాకు సాధ్యమైనంత వరకు పనిచేస్తామని వెల్లడించారు. పీజీఐఎమ్ఈఆర్ 2018లో దేశంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో 2వ ర్యాంకు సాధించినందుకు అభినందించారు. సమావేశంలో పీజీఐఎమ్ఈఆర్ డైరెక్టర్ జగత్ రామ్, కాలేజీ ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు.