travelling
-
అందరి చూపు షిల్లాంగ్ వైపే
న్యూఢిల్లీ: జలపాతాలు, ప్రకృతి రమణీయతలకు నెలవై ‘స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్’గా ఖ్యాతిగడించిన మేఘాలయ రాజధాని నగరం షిల్లాంగ్‌లో వచ్చే ఏడాది పర్యటించేందుకు భారతీయులు తెగ ఉవి్వళ్లూరుతున్నారని ప్రఖ్యాత ట్రావెల్ యాప్ స్కైస్కానర్ తన నివేదికలో వెల్లడించింది. వచ్చే ఏడాదికి సంబంధించిన ‘ట్రావెల్ ట్రెండ్స్ రిపోర్ట్’ను బుధవారం విడుదలచేసింది. తరచూ పర్యటనకు వెళ్లే భారతీయుల్లో 66 శాతం మంది 2025 సంవత్సరంలో మరింతగా పర్యటనలు చేయాలని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. పర్యాటకం అనగానే విదేశీయానం చేసే భారతీయులు స్వదేశంలో షిల్లాంగ్‌కు అగ్రతాంబూలం ఇచ్చారు. అజర్బైజాన్ దేశంలోని బాకూ నగరం, మలేసియాలోని లాంగ్కావీ నగరాలను పక్కకునెట్టి షిల్లాంగ్ ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. హాయిగా విశ్రాంతి తీసుకునేందుకు ఆహ్లాదకర వాతావరణం, ట్రెక్కింగ్ వంటి సాహసాలు చేయడానికి అనువైన పచ్చటి కొండలతో అలరారే షిల్లాంగ్‌లో పర్యటించాలని ఎక్కువ మంది భారతీయులు భావిస్తున్నారు. దీంతోపాటే నార్వేలోని ట్రోంసో, ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్, సౌదీ అరేబియాలోని అల్–ఉలాలనూ పర్యటనల కోసం భారతీయులు ఎక్కువగా సెర్చ్‌చేశారు. తమ పర్యాటక ఖర్చులకు తగ్గ ఆనందం లభిస్తుందన్న ‘బెస్ట్ వాల్యూ డెస్టినేషన్ కేటగిరీ’లో కజక్‌స్థాన్‌లోని అల్మటీ తొలిస్థానంలో నిలిచింది. ఇండోనేసియాలోని జకార్తా, మలేసియాలోని సింగపూర్, కౌలాలంపూర్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ దేశాలకు విమానచార్జీలు గత ఏడాదికాలంలో భారీగా తగ్గడమూ ఇందుకు మరో కారణం. ఖర్చులే కీలకం ఏ దేశాల్లో పర్యటించాలనే విషయంలో హోటల్ ఖర్చులను లెక్కలోకి తీసుకుంటామని 65 శాతం మంది చెప్పగా విమానచార్జీలను లెక్కిస్తామని 62 శాతం మంది చెప్పారు. అక్కడి ఆహారం, చిరుతిళ్ల ఖర్చులు సైతం బేరేజు వేసుకుంటామని 54శాతం మంది పేర్కొన్నారు. విమాన ఖర్చులకే ఎక్కువ ఖర్చవుతోందని 86 శాతం మంది చెప్పగా, ఇతర ఖర్చులే ఎక్కువగా ఉంటాయని 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ ఏడాదితో పోలిస్తే 2025లో ఖచి్చతంగా పర్యటించాలన్న బలమైన కాంక్ష ఎక్కువ మందిలో ఉండటం విశేషం. వచ్చేసారి ఎక్కడికి వెళ్లాలనే తుది నిర్ణయంలో ఖర్చులదే అత్యంత కీలక పాత్ర అని స్కైస్కానర్కు సంబంధించిన పర్యాటక నిపుణుడు మోహిత్ జోషి వ్యాఖ్యానించారు. అబూధాబిలో డిసెంబర్లో జరగబోయే ఫార్ములా1 రేసింగ్ వంటి క్రీడలు చూసేందుకు భారతీయులు విపరీతంగా విమానాల్లో వెళ్తున్నారని నివేదిక పేర్కొంది. పాలపుంత వెలుగుల్లోనూ.. జెడ్ జనరేషన్ యువతలో 62 శాతం మంది ఖాళీ సమయాలను విదేశాల్లో ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారు. అందులో ముఖ్యంగా 57 శాతం మంది తాము ఆడిన వీడియోగేమ్‌లో తరచూ చూసిన ప్రపంచ ప్రఖ్యాత స్థలాలను వెళ్లిరావాలని కోరుకుంటున్నారు. రాత్రిళ్లు వినీలాకాశంలో పాలపుంత అందాలను కళ్లారా చూసేందుకూ ఆయా ప్రదేశాలకు వెళ్లేలని అనుకుంటున్నట్లు 53 శాతం మంది చెప్పారు. ఖగోళ వింతలను కెమెరాల్లో బంధించేందుకు ఇష్టపడుతున్నట్లు 56 శాతం మంది చెప్పారు. ధృవకాంతులను చూసేందుకు విదేశీయానం చేయాలనుకుంటున్నట్లు 44 శాతం మంది చెప్పారు. -
కెనడా మోజులో వృద్ధునిగా మారిన యువకుడు
విదేశాలకు వెళ్లి, బాగా డబ్బు సంపాదించి, అక్కడే స్థిరపడాలని చాలామంది తాపత్రయ పడుతుంటారు. ఇందుకోసం సక్రమంగా ప్రయత్నాలు సాగించినవారు సాఫీగా విదేశాలకు వెళుతుంటారు. అయితే అక్రమ పద్దతుల్లో విదేశాలకు వెళ్లాలని ప్రయత్నంచే వారు చిక్కుల్లో పడుతుంటారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)లో 24 ఏళ్ల యువకుడిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అరెస్టు చేసింది. ఈ కుర్రాడు 67 ఏళ్ల వ్యక్తి పాస్‌పోర్ట్‌పై కెనడా వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే విమానాశ్రయంలోని సెక్యూరిటీ సిబ్బందికి అతనిపై అనుమానం వచ్చింది. దీంతో అతనిని విచారించగా అసలు విషయం వెల్లడయ్యింది. నకిలీ గుర్తింపుతో విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడని తేలింది.సీఎస్ఐఎఫ్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం టెర్మినల్-3 చెక్ ఇన్ ప్రాంతంలో అక్కడి సిబ్బంది అనుమానంతో ఒక వృద్ధుడిని విచారించగా, తాను 1957, ఫిబ్రవరి 10 న జన్మించానని, తన పేరు రష్విందర్ సింగ్ సహోటా అని అధికారులకు తెలిపాడు. ఎయిర్ కెనడా విమానంలో కెనడాకు వెళుతున్నట్లు తెలిపాడు. అయితే అధికారులు అతని పాస్‌పోర్ట్‌ను పరిశీలించగా దానిలోని వివరాలు, అతని రూపం భిన్నంగా ఉంది. అతను తన జుట్టుకు, గడ్డానికి తెల్ల రంగు వేసుకున్నాడని విచారణ అధికారులు గుర్తించారు.ఆ వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు చెకింగ్ పాయింట్‌కు తీసుకెళ్లారు. అక్కడ అధికారులు అతని మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా 2000, జూన్ 10 న జన్మించిన గురు సేవక్ సింగ్ పేరుతో ఉన్న మరో పాస్‌పోర్ట్ సాఫ్ట్ కాపీని గుర్తించారు. దీంతో అతని అసలు పేరు గురు సేవక్ సింగ్ అని, అతని వయసు 24 ఏళ్లని తేలింది. తాను సహోటా పేరుతో ఉన్న పాస్‌పోర్ట్‌పై ప్రయాణించేందుకు ప్రయత్నించానని అంగీకరించాడు. విచారణ అనంతరం అధికారులు ఆ యువకుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. -
ద్విచక్ర వాహనంపై ఐదుగురు.. రూ. 17 వేల జరిమానా!
సాధారణంగా మనం ద్విచక్ర వాహనంపై ఇద్దరు లేదా ముగ్గురు రైడర్లను చూసి ఉంటారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో ఒక బైక్‌పై ఐదుగురు కుర్రాళ్లు ప్రయాణిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఐదుగురు కుర్రాళ్లు బైక్‌పై వెళుతుండగా వారిని ట్రాఫిక్ పోలీసులు గమనించి, వారికి భారీ మొత్తంలో చలానా జారీచేశారు. ఈ ఉదంతం చిత్రకూట్ జిల్లాలోని ఖోహ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఓ బైక్‌పై ఐదుగురు కూర్చొని గ్రామంలో ఉల్లాసంగా తిరుగుతున్నారు. ఇంతలో వారికి ట్రాఫిక్ పోలీసులు తారసడ్డారు. చిత్రకూట్ ట్రాఫిక్ టీఎస్ఐ శైలేంద్రకుమార్ సింగ్ ఆ బైక్ నడిపే కుర్రాళ్లను అడ్డుకుని, వారికి రూ.17 వేలు చలానా జారీ చేయడంతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతం గురించి చిత్రకూట్ ట్రాఫిక్ టీఎస్ఐ శైలేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ కార్వీ కొత్వాలి ప్రాంతంలోని ఖోహ్ గ్రామంలో ఐదుగురు కుర్రాళ్లు బైక్‌పై వెళుతూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడాన్ని గమనించామన్నారు. తరువాత వారిని ఆపి, వారి పేరు, చిరునామా తెలుసుకున్నామని, డ్రైవింగ్ లైసెన్స్ ను తనిఖీ చేశామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణిస్తున్న ఈ ఐదుగురు కుర్రాళ్లకు రూ.17 వేలు చలాన్ జారీ చేశామన్నారు. అలాగే ఆ వాహనాన్ని సీజ్ చేశమన్నారు. -
ప్రయాణంతో చలి కాచుకుందాం!
'One must travel to learn' అంటాడు మార్క్ ట్వయిన్. 'To travel is to evolve' అంటాడు పియర్ బెర్నార్డో. ఎప్పటికప్పుడు కొత్త పరిసరాలు తద్వారా కొత్త విషయాలు తెలుస్తుంటేనే బుద్ధి వికసిస్తుంది. దీనికి ప్రయాణాన్ని మించిన గురువు లేడు. భ్రమణ కాంక్షను మించిన సిలబస్ లేదు. వారం, వర్జ్యం, సౌకర్యం చూసుకోకుండా బ్యాక్ ప్యాక్‌తో ట్రావెల్‌ని ప్లాన్ చేసుకునేళ్లను మించిన అదృష్టవంతుల్లేరు. ఆర్ట్ మూవీ ప్లాట్‌కి ఆ లీడ్ లైన్స్ పక్కాగా సూట్ అవుతాయేమో కానీ.. స్కూల్స్, ఆఫీసెస్, టార్గెట్స్, అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వంటి ప్రాక్టికల్ ఫ్రేమ్స్‌లో స్కెడ్యూల్ అయిన లైఫ్‌లో అస్సలు సాధ్యపడవు! కదా..! అందుకేగా వెకేషన్స్ ఉన్నాయి! ఆ అకేషన్ బహానాతో పిల్లలు, పెద్దలు అందరూ వాళ్ల వాళ్ల అభిరుచికి అనుగుణంగా ట్రావెల్‌కి ట్రాన్స్పోర్ట్ వెదుక్కోవడమే! ‘అమ్మో చలిలోనా..’ అంటూ ముడుచుకోకండి. తేమ తుంపరలతో రొమాంటిక్ టచ్‌ని.. హేమంత తుషారాలతో చిలిపిదనాన్ని.. పొగమంచుతో దాగుడు మూతల అల్లరిని.. వణుకుతో ఆకతాయితనాన్ని తలపిస్తూ .. ఎంత గమ్మత్తుగా ఉంటుందని! ప్రయాణానికి ఇంతకు మించిన వాతావరణం ఉంటుందా? పైగా మన దేశంలో ట్రావెల్‌కి అనుకూలమైన సమయం (సెప్టెంబర్ నుంచి ఎప్రిల్ అంటారు) కూడా ఇదే! వీపున బ్యాక్ ప్యాక్ చేర్చి .. తలను క్యాప్‌తో కవర్ చేసి .. చేతులను జర్కిన్‌లో దూర్చి.. పాదాలను షూతో కప్పి చక్కగా దొరికిన కమ్యూట్‌తో కమ్యూనికేట్ అయ్యి కోరుకున్న ప్లేస్‌కు చేరుకోవచ్చు! ప్లేసెస్ ఏంటీ అంటారా? బ్యాగ్ నిండేన్ని! లిస్ట్ చూసుకుని.. సేవింగ్స్ అకౌంట్‌తో మ్యాచ్ అయ్యేలా కస్టమైజ్ చేసుకుని స్టార్ట్ అవడమే! సెలవులంతా కాకుండా.. సంక్రాంతి పండగకల్లా మళ్లీ ఇల్లు చేరాలి అనుకుంటే.. ఆ లిమిటిడెట్ హాలిడేస్కి తెలంగాణ వాళ్లకు ఆంధ్రప్రదేశ్.. ఆంధ్రులకు తెలంగాణ పర్ఫెక్ట్ ప్లేసెస్. తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కనున్న అనంతగిరి, ఆమ్రబాద్, నాగార్జునసాగర్ నుంచి వరంగల్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందిన రామప్ప, ఆదిలాబాద్ కవ్వాల్ ఫారెస్ట్, కాళేశ్వరం, జోడే ఘాట్ వంటివెన్నో చూడొచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి నుంచి కోనసీమ, వైజాగ్, బొర్రా కేవ్స్, అరకులోయ, లంబసింగి, రాయలసీమ మహానంది, లేపాక్షి, యాగంటి, బెలూం కేవ్స్, గండికోట, హార్సిలీ హిల్స్ లాంటి పర్యాటక ప్రాంతాలెన్నో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్క రాష్ట్రాల్లో అయితే బోలెడున్నాయి. ముందు మహారాష్ట్రకి వెళితే.. వెస్టర్న్ ఘాట్స్ అందాలకు ముగ్ధులవొచ్చు. ఈ పశ్చిమ కనుమల ఒళ్లోని స్ట్రాబెరీ తోటల పంచ్గని, పూల వనం కాస్ ప్లాటూ, కృష్ణా నది జన్మస్థానం మహాబలేశ్వర్, లోనావాలా, పుణె, ముంబై, సముద్ర తీరాలు.. రాజ కోటల నిలయం అలీబాగ్.. జనవరిలో అక్కడ జరిగే నారియల్ పానీ మ్యూజిక్ ఫెస్టివల్, ద్రాక్ష తోటలతో.. వైన్ లవర్స్‌కి భూతల స్వర్గమైన నాసిక్, ఔరంగాబాద్, దౌలతాబాద్ రంగుల కళ అజంతా, శిల్పాల ఎర ఎల్లోరా ఎట్సెట్రా అన్నీ పర్యటించాల్సిన ప్రాంతాలే. పుదుచ్చేరికి.. ఫ్రెంచ్ వీథులు, ఫ్రెంచ్ భవనాలు, ఫ్రెంచ్ సంస్కృతి, అరబిందో ఆశ్రమం, అందమైన బీచ్‌లతోపాటు పర్యాటకులను ప్రేమలో పడేసే మరెన్నో రొమాంటిక్ స్పాట్స్ ఉన్నాయిక్కడ. అంతేకాదు ఫ్రెంచ్ ఫుడ్.. వాటర్ స్పోర్ట్స్ మీ టైమ్‌ని క్వాలిటీగా మారుస్తాయి కచ్చితంగా! స్థానిక, వలస పక్షులకు నిలయమైన ఔస్టరీ (Ousteri Lake) లేక్‌ని అస్సలు మిస్ అవకూడదు. గోవాకు మళ్లితే.. సెలబ్రేషన్స్ కాపిటల్ ఆఫ్ ఇండియా ఇది. వార్మ్ వింటర్స్‌కి పర్ఫెక్ట్ అడ్రస్. అందుకే యూరప్ అంతా ఇక్కడే ఉన్నట్టుంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం.. ప్రశాంతమైన బీచులు.. సందడి చేసే నైట్‌క్లబ్‌లు.. పగళ్లను తలపించే రాత్రుళ్లతో నిత్యం ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉంటుంది. లైఫ్‌ని ఒక సెలబ్రేషన్‌గా భావించేవాళ్లకు నచ్చకుండా ఉంటుందా గోవా! చలికాలమైతే అక్కడ పండగలే పండగలు.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి క్రిస్మస్ దాటి హోలీ దాకా! ఈ ఎంజాయ్మెంట్ కావాలనుకుంటే వింటర్లో గోవాను కచ్చితంగా విజిట్ చేయాల్సిందే! అక్కడున్న ఏ బీచ్‌లో అయినా సన్‌రైజ్.. సన్‌సెట్‌ని మిస్ అవకూడదు! కర్ణాటక చేరితే.. చారిత్రక కట్టడాలకు.. అలనాటి వైభోగాల జ్ఞాపకాలకు నిలయంగా ఉంటుందీ రాష్ట్రం. పశ్చిమ కనుమల సోయాగాలు, సముద్ర తీరాలు అదనపు ఆకర్షణలు. ఇదీ వింటర్ డెస్టినేషనే. గోకర్ణ బీచులు, జోగ్ జలపాతాలు, దైనందిన జీవితంలోని ఒత్తిడిని దూరం చేసి మంచు తెరల మధ్య ప్రశాంత వాతావరణంతో సేదతీర్చి.. కాఫీ తోటలతో ఆర్గానిక్ ఆహ్లాదాన్ని పంచే కూర్గ్.. అక్కడి నాగర్హోల్ నేషనల్ పార్క్‌ను చూడకుండా రావొద్దు. ఈ రాష్ట్రంలో.. యునెస్కో హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందిన హంపీ మిస్ అవకూడని ప్రాంతం. దీన్ని చూడ్డానికి అనువైన సమయం డిసెంబర్, జనవరి నెలలు. ఏటా జనవరిలో హంపీ మహోత్సవ్ జరుగుతుంది. తోలు బొమ్మలాట.. నాట్య, సంగీత ప్రదర్శనలు.. క్రీడల సమ్మేళనమే ఈ ఉత్సవం. ఇక్కడి విరూపాక్ష గుడి, మాతంగా హిల్, విఠ్ఠల మందిరం, హజారా రామ గుళ్లను తప్పక దర్శించాలి. ఆ ఆనందంలో మైసూర్‌ని మరవొద్దు. నిజానికి దీన్ని దసరా సమయంలో చూడాలి. కానీ అప్పటి రద్దీని దృష్టిలో పెట్టుకుని వెళ్లని.. వెళ్లలేని వాళ్లు ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. దేశంలోని రాయల్ సిటీస్‌లో ఇదొకటి. మైసూర్ ప్యాలెస్, కళాత్మకమైన పెయింటింగ్స్, మైసూర్ జూ, చాముండేశ్వరీ ఆలయం, జగన్మోహన్ ప్యాలెస్ నుంచి చవులూరించే మైసూర్ పాక్ దాకా దేన్నీ వదిలిపెట్టడానికి వీల్లేదిక్కడ. బెంగళూరు నుంచి మంగళూరు దాకా విస్టడోమ్ ట్రైన్లో జర్నీ ఆస్వాదించి తీరాల్సిందే! తమిళనాడుకు వస్తే.. ఉక్కపోత, వేడికి పుట్టిల్లుగా ఉన్న తమిళనాడు చలికాలంలో పర్యాటకులకు వార్మ్ వెల్కమ్ చెబుతుంది. ఇండియా మొత్తానికి దీన్ని వింటర్ డెస్టినేషన్‌గా పేర్కొనొచ్చు. పశ్చిమ కనుమల్లో భాగమైన నీలగిరి కొండల్లోని మంచు ఛాయలు.. మధుమలై అడవులు.. ఏళ్లుగా కోలీవుడ్‌కే కాదు టాలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్‌తోపాటు బాలీవుడ్‌కీ సౌకర్యవంతమైన ఔట్‌డోర్ షూటింగ్ స్పాట్‌గా ఉంటూ.. సర్కారు బడుల నుంచి కార్పొరేట్ స్కూల్స్ వరకు అన్నిటికీ ఎక్స్కర్షన్లో భాగమైన ఊటీ.. అక్కడి బ్రిటిష్ కాలం నాటి సెయింట్ స్టీఫెన్స్ చర్చ్, కాఫీ తోటలు, పల్లవుల రాజధాని మహాబలిపురం.. అక్కడి శిల్పాలు, గుహలు, బీచ్‌లు, మొసళ్ల ఫామ్, చోళ దేవాలయా తంజావూరు, సముద్రంలో పంబన్ బ్రిడ్జి మీంచి రామేశ్వరానికి రైలు ప్రయాణం, దక్షిణ భారతంలో ఆఖరి ఊరు ధనుష్కోడి, కన్యాకుమారి.. ఎన్నని! పంబన్ బ్రిడ్జి మీంచి రైలు ప్రయాణం ఎంత ముఖ్యమో ఊటీకి టాయ్ ట్రైన్ జర్నీ అంతే ముఖ్యం.. మరువద్దు! గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో.. .. ప్రతి ప్రాంతం ఒక మనోహర దృశ్యమే. చిరాకు తెప్పించే ఉక్కపోత కాకుండా.. ఎముకలు కొరికే చలీ లేకుండా ఈ సీజన్లో ఆహ్లాదంగా ఉంటాయి ఇక్కడి పర్యాటక కేంద్రాలు. బ్యాక్ వాటర్స్‌లో హౌస్ బోట్ షికార్లు.. వెంబనాడ్ లేక్, మారారి బీచ్.. అలెప్పుళ బీచ్‌ల తీరం.. ఆయుర్వేదిక్ స్పాల కేంద్రం అలెప్పీ (నవంబర్‌లో అయితే ఇక్కడ స్నేక్ బోట్ పోటీలను చూడొచ్చు), కళ్లు తిప్పుకోనివ్వని సీనరీ.. టీ తోటలు.. జలజలపారే జలపాతాలతో కశ్మీర్ ఆఫ్ ద సౌత్‌గా పేరున్న మున్నార్.. అక్కడి ఎకో పాయింట్, అనాముడి పీక్, టాటీ టీ మ్యూజియంలో వైవిధ్యమైన తేనీటి రుచులు, హోమ్ మేడ్ చాకొలేట్స్ పర్యాటకులను ఊరిస్తాయి. వాయనాడ్ ఏమన్నా తక్కువా? పశ్చిమ కనుమల్లోని డ్రీమ్ డెస్టినేషన్ ఇది. రెప్పవేయనివ్వని ప్రకృతి, ట్రెకింగ్, వాయనాడ్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీ, ఎడక్కల్ కేవ్స్, వాయనాడ్ ఘనమైన చరిత్ర, అద్భుతమైన సంస్కృతి, డిలీషియస్ ఫుడ్ పర్యటనను ఎక్సైటింగ్‌గా మారుస్తాయి. కుమారకోమ్ గురించీ చెప్పాలి. బ్యాక్ వాటర్స్ ప్రత్యేకత చూడాలంటే కుమార్‌కోమ్ వెళ్లాల్సిందే అంటారు పర్యాటకప్రియులు. చలికాలం వలస పక్షులకు నిలయం ఇది. ఇక్కడి కృష్ణపురం ప్యాలెస్, చంపకుళంలోని బెసిలికా ఆఫ్ సెయింట్ మేరీ మిస్ అవకూడదు. ఇవన్నీ బాగా ప్రాముఖ్యంలో ఉన్న మచ్చుకు కొన్ని పర్యాటక స్థలాలు మాత్రమే. కాస్త ఎక్కువ రోజులు.. ఇంకాస్త ఎక్కువ దూరాలు.. మరికాస్త ఎక్కువ బడ్జెట్‌ను భరించొచ్చు అనుకుంటే ఉత్తరాదిలోని ఈ ప్రాంతాలకూ వెళ్లొచ్చు. ఒక్కసారి లుక్కేసి తర్వాత ఐటినరీ ప్రిపేర్ చేసుకోండి! నిజానికి చలికాలం నార్త్ ఇండియా అంతటినీ వణికిస్తుంది. కానీ రాజస్థాన్ వెచ్చగా ఉంటుంది. ఇక్కడికి వెళ్లడానికి చలికాలమే కరెక్ట్ కాలం. ఏమేం చూడొచ్చంటే.. జైపూర్ రాజస్థాన్ రాజధాని.. పింక్ సిటీగా పేరు. ఈ టైమ్‌లో ఇక్కడ లిటరేచర్ .. కైట్ ఫెస్టివల్స్ ఉంటాయి. హవా మహల్, ఆమేర్ ఫోర్ట్, జల్ మహల్, సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్ వంటివి ఇక్కడి దర్శనీయ స్థలాలు. ఉదయ్‌పూర్ వెనీస్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు దీన్ని. లేక్ ప్యాలెస్, ఫతేహ్ సాగర్ లేక్, జగ్ మందిర్, లేక్ పిఛోలా వంటివన్నీ ఉదయ్‌పూర్‌కి ప్రత్యేక శోభనిస్తూ ప్రపంచవ్యాప్త టూరిస్ట్‌లను ఆకర్షిస్తుంటాయి. ఇక్కడి లేక్స్, ఆరావలి పర్వతాలు.. ఉదయపూర్ వాతావరణాన్ని వెచ్చగా ఉంచి దీని పర్యటనకు చలికాలాన్ని పర్ఫెక్ట్గా మారుస్తున్నాయి. ఏటా చలికాలం ఇక్కడ ఆర్ట్స్, క్రాఫ్ట్స్‌కి సంబంధించిన ఉత్సవం జరుగుతుంది. ఆ టైమ్‌లో కళాప్రియులు ఈ ట్రిప్‌కి ప్లాన్ చేసుకోవచ్చు. రనక్పూర్ జైన్స్కి ముఖ్యమైన ప్రాంతం ఇది. ప్రశాతంతకు నిలయం ఈ పట్టణం. ప్రసిద్ధ చౌముఖ ఆలయం నెలవైందిక్కడే. దీని నిర్మాణ కళ అమోఘం. ఏడాది పొడుగునా భక్తుల రాకతో కళకళలాడుతూంటుంది. ఉదయ్‌పూర్‌కి దగ్గర్లో ఉంటుంది. కాబట్టి ఉదయ్‌పూర్‌కి వెళ్లినప్పుడు ఈ ఊరిదాకా ప్రయాణాన్ని పొడిగించుకోవచ్చు. జైసల్మేర్ ఈ డెజర్ట్ సిటీని చూడ్డానికి డిసెంబర్, జనవరి నెలలే బెస్ట్. ఇప్పుడెలాగూ సంక్రాంతి సెలవులే కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. డెజర్ట్ క్యాంపింగ్, క్యామెల్ రైడ్స్, క్వాడ్ బైకింగ్, డ్యూన్ బాషింగ్, పారాసైలింగ్ .. ఇలా బోలెడు యాక్టివిటీస్‌తో జైసల్మేర్‌లో ఎంజాయ్ చేయొచ్చు. అడ్వెంచరస్ యాక్టివిటీస్‌కి దూరంగా ఉండేవాళ్లు.. డెజర్ట్ ఫెస్టివల్, నెరాసీ (Nerasi) మ్యూజిక్ స్కూల్, కుల్ధారా విలేజ్, సోనార్ ఖిలా వంటి కల్చరల్ రైడ్‌ను ఆస్వాదించొచ్చు. ఫేమస్ లాంగేవాలా పోస్ట్‌కి డ్రైవ్‌ను మిస్ కావద్దు. జోధ్‌పూర్ దీనికి బ్లూ సిటీ ఆఫ్ రాజస్థాన్‌గా పేరు. 7 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్‌తో ఆహ్లాదంగా ఉంటుంది. మెహరంగఢ్ ఫోర్ట్, ఉమైద్ భవన్ ప్యాలెస్, మహామందిర్ టెంపుల్ వంటి జోధ్పూర్ల్యాండ్మార్క్స్ని చక్కగా దర్శించొచ్చు. అక్టోబర్‌లో అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ ఫోక్ ఫెస్టివల్ జరుగుతుంది. వచ్చే ఏడాదికి ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఇసుక ఎడారి సరే ఉప్పు ఎడారీ చూడాలనుకుంటే గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్‌కి టికెట్స్ బుక్ చేసుకోవాలి. నల్లటి ఆకాశంలో తెల్లగా మిలమిల మెరుస్తున్న చుక్కల కింద.. చల్లటి వాతావరణంలో తెల్లటి ఉప్పు తివాచీ మీద కూర్చుని.. క్యాంప్ ఫైర్‌తో చలి కాచుకుంటూ .. గుజరాత్ సంప్రదాయ ఫుడ్‌ను ఆస్వాదిస్తుంటే ఊహల్లోని స్వర్గం ఇదేనేమో అనిపిస్తుంది! అంతేకాదు పీక్ వింటర్ రెండు నెలలు ఇక్కడ కల్చరల్ ఫెస్టివల్ జరుగుతుంది.. రణ్ ఉత్సవ్ పేరుతో. దీన్నే కచ్ ఫెస్టివల్ అనీ పిలుస్తారు. అద్భుతమైన గుజరాతీ సంప్రదాయ ఫుడ్‌తోపాటు స్థానిక హ్యాండీక్రాఫ్ట్స్, డెజర్ట్ సఫారీలు మనసును దోచుకుంటాయి. ఈ వేడుకను వీక్షించడానికి ప్రపంచ నలుమూల నుంచీ లక్షల్లో పర్యాటకులు వస్తుంటారు. అందుకే ముందస్తుగా బుక్ చేసుకుంటే మంచిది. ధోర్డో గ్రామంలో క్యాంపింగ్ మరచిపోయేది కాదు. కురిసే మంచును ఆస్వాదించాలనుకుంటే హిమాలయాల ఓడిలో మంచు ముసుగేసుకున్న ప్రాంతాలకు ప్రయాణమవాల్సిందే. థర్మల్స్, గ్లోవ్స్, షూస్.. కోల్డ్ క్రీమ్స్ మస్ట్! ఆ ప్రాంతాల్లో కొన్ని.. బిన్సర్ ఇది ఉత్తరాఖండ్‌లోని చిన్న హిల్ స్టేషన్. వింటర్లో తప్పక చూడాల్సిన జాబితాలో ఫస్ట్ పెట్టాల్సిన ప్లేస్. మబ్బులను ముద్దాడే కేదార్నాథ్, త్రిశూల్, నందా దేవి శిఖరాలు కళ్లు తిప్పుకోనివ్వవు. ఫొటోగ్రాఫర్స్కైతే ఇంచ్ ఇంచ్ అద్భుతమైన ఫ్రేమే! ఇక్కడి బిన్సర్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీని పిల్లలకు చూపించాల్సిందే. ఇందులో అరుదైన పక్షి, జంతు జాతులను చూడొచ్చు. ఔలీ ఇదీ ఉత్తరాఖండ్‌లోని ప్రాంతమే. దీనికి స్కైయింగ్ డెస్టినేషన్ ఆఫ్ ఇండియాగా పేరు. అద్భుతమైన నందా దేవి, నీలకంఠ, మన పర్వత శిఖరాల మీదుగా స్కైయింగ్ చేస్తూ హిమాలయ అందాలను వీక్షించొచ్చు. చలికాలం వైవిధ్యమైన కళను సంతరించుకుంటుంది. మందంగా పరచుకున్న మంచు మీద స్కైయింగ్ చేయడానికి సాహసవంతులు ఉవ్విళ్లూరుతుంటారు. డల్హౌసీ హిమాచల్ ప్రదేశ్‌లోని డిఫరెంట్ హిల్ స్టేషన్. ఇక్కడి ఇళ్లు.. రోడ్లు.. కూడళ్లలో బ్రిటన్ ఆనవాళ్లు కనపడుతూంటాయి. కురుస్తున్న మంచులో ట్రెకింగ్ చేయాలనుకునే ఉత్సాహవంతులకు ఇది సరైన సమయమూ.. ప్రాంతమూ! నేషనల్ హిమాలయన్ వింటర్ ట్రెకింగ్ ఎక్సెపెడిషన్ని హోస్ట్ చేసేది డల్హౌసీనే! ఈ జాబితాలో సిమ్లా, కులు, మనాలి, కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్ వంటివాటినీ చేర్చుకోవచ్చు. గమనిక: పర్యటనకు కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకోగలరు. -
మాస్క్ మళ్లొచ్చింది.. సింగపూర్‌లో షురూ!
కోవిడ్-19 వైరస్‌కు చెందిన కొత్త వేరియంట్ల కారణంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆగ్నేయాసియాలోని పలు ప్రభుత్వాలు వైరస్ నియంత్రణకు తిరిగి పాత నిబంధనలు అమలుకోకి తీసుకురావాలని నిర్ణయించాయి. విమానాశ్రయాల్లో ప్రయాణికులు మళ్లీ మాస్క్‌లు ధరించాలని అధికారులు కోరుతున్నారు. విమానాశ్రయాల్లో ప్రయాణికుల జ్వరాన్ని తనిఖీ చేయడానికి థర్మల్ స్కానర్లను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చారు. ఫ్లూ, న్యుమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే కోవిడ్ వేరియంట్ల తరహాలోని పలు సూక్ష్మక్రిముల వ్యాప్తిని అరికట్టాలని వివిధ ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైరస్ నియంత్రణకు ముమ్మర చర్యలు చేపడుతోంది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం, సంవత్సరాంతపు, పండుగ సీజన్లలో ప్రయాణాలు మొదలైనవి వైరస్ వ్యాప్తిని మరింతగా పెంచుతాయని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న దేశాలకు, లేదా ప్రాంతాలకు ప్రయాణికులను వెళ్లవద్దని ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇండోనేషియన్లను అభ్యర్థించింది. కాగా గత వారం రోజుల్లో మలేషియాలో కోవిడ్ కేసులు దాదాపు రెట్టింపు అయ్యాయి. దీంతో ఇండోనేషియా అధికారులు కొన్ని సరిహద్దు పోస్టుల వద్ద థర్మల్ స్కానర్లను తిరిగి ఏర్పాటు చేశారు. ఫెర్రీ టెర్మినల్, జకార్తాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్ వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దక్షిణాసియాలోని పలు దేశాల్లో తిరిగి కోవిడ్ నియంత్రణ చర్యలు అమలవుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహమ్మారి విజృంభణ సమయంలో ఆసియాలో కఠినమైన నిబంధనలు అమలయ్యాయి. ఇటీవల సింగపూర్ ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ తన ఫేస్బుక్ ఖాతాలో కోవిడ్-19 నియంత్రణకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలను పునరుద్ధరించాలని చూస్తోందని ప్రకటించడంతో సింగపూర్‌వాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఇది కూడా చదవండి: శ్రీరామ భక్తులకు యోగి సర్కార్ మరో కానుక! -
వీసా లేకుండానే భారతీయులు ఈ దేశాలకు వెళ్లి రావొచ్చు
ట్రావెలింగ్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలితో కలిసి ఇష్టమైన ప్రాంతాలను చుట్టేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. పని ఒత్తిడితో విసిగిపోయి ఉన్న వారికి ఈ విహార యాత్రలు, ప్రయాణాలు ఎంతో ఊరట కలిగిస్తాయి. మన దేశంలో అయితే ఏ ప్రాంతానికి అయినా వెళ్లొచ్చు కానీ విదేశాలకు వెళ్లాలంటే మాత్రం వీసా ఉండాల్సిందే. అయితే వీసాతో పని లేకుండా భారతీయులను మా దేశానికి రండి అంటూ ఆహ్వానం పలుకున్నాయి కొన్ని దేశాలు. అవేంటో చూసేయండి. మలేషియా ఎంత చూసినా తనివి తీరని భౌగోళిక సౌందర్యం మలేషియా. పచ్చని అడవులు, అందమైన ద్వీపాలు,అడవులు.. ఇలా ఎంతో అందమైన పర్యాటక ప్రదేశంగా మలేషియాకు పేరుంది. ఇకపై అక్కడికి వెళ్లాలంటే వీసా అవసరం లేదు. సుమారు 30 రోజుల పాటు అక్కడ సేద తీరవచ్చు. బొలీవియా: ఇక్కడ సముద్రంలో ఉప్పు తయారీ, రంగురంగుల కొండలు తదితర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది. సమోవా: దీనిని 'కార్డెల్ ఆఫ్ పాలినేషియా' అని కూడా పిలుస్తారు, సమోవా అనేది ఉత్కంఠభరితమైన ద్వీపాల సమూహం. ఈ ద్వీప దేశానికి వెళ్లడానికి భారతీయులకు వీసా అవసరం లేదు. శ్రీలంక: భారతీయులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు ఇటీవలె శ్రీలంక అనుమతి ఇచ్చింది. కెన్యా: సముద్రంలో ఉప్పు తయారీ, రంగురంగుల కొండలు తదితర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది. మారిషస్: భారతీయులకు అతి గొప్ప ఆతిథ్యమిచ్చే ఆహ్లాదకరమైన దేశాల్లో మారిషస్ ఒకటి. అందమైన బీచ్‌లు, అడ్వెంచర్లు ఎన్నో ఉన్న ఈ దేశానికి మీకు వీసా అవసరం లేదు. మారిషస్‌ను వీసా లేకుండా, మీరు గరిష్టంగా 90 రోజులు పర్యటించవచ్చు. ఫిజీ: అందమైన దృశ్యాలు, పగడాలు, దీవులకు పెట్టింది పేరు ఫిజీ దేశం. ఈ దేశానికి భారతీయ పర్యాటకుల ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వీసా లేకుండా 120 రోజులు అంటే సుమారు నాలుగు నెలలు హాయిగా గడపొచ్చు. భూటాన్: భారతదేశానికి అత్యంత సమీపంలో, పొరుగు దేశంగా ఉన్న భూటాన్‌కు మీరు వీసా లేకుండానే వెళ్లవచ్చు. ఇది ప్రపంచంలోని సంతోషకరమైన దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.రోడ్డు, విమానం, రైలు ద్వారా కూడా భూటాన్ చేరుకోవచ్చు. బార్బడోస్: బార్బడోస్ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు.ప్రశాంతమైన దీవుల్లో సెలవులను గడపాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్. కాస్ట్లీ హోటళ్లు, తీర ప్రాంతాలు ఇక్కడి స్పెషల్. భారతీయ పౌరులు బార్బడోస్ సందర్శించడానికి వీసా అవసరం లేదు. మీరు ఇక్కడ వీసా లేకుండా 90 రోజుల వరకు గడపవచ్చు. వీటితో పాటు జమైకా, కజికిస్తాన్, ఇండోనేషియా,టాంజానియా, జోర్డాన్,లావోస్ కాంబోడియా,వంటి దేశాలకు కూడా వీసా లేకుండా చుట్టిరావొచ్చు. -
"ట్రావెలింగ్ పార్క్" డ్రైవర్ క్రియేటివిటీకి..నెటిజన్లు ఫిదా!
కొద్ది దూరంలోని గమ్యస్థానాలకు చేరడానికి వినియోగించే ఆటోల గురించి తెలిసిందే. అలాగే ఇటీవల కాలంలో ప్రయాణీకులను అట్రాక్ట్ చేసేలా ఆటోలను డెకరేట్ చేస్తున్నారు కూడా. అయితే ఈ డ్రైవర్ మాత్రం మరింత విభిన్నంగా ఆలోచించి మరీ వైరైటీగా తీర్చిద్దిదాడు. అతడి ఆటోని చూస్తే.. ఆశ్చర్యపోవడం ఖాయం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో..ఆ ఆటో మొత్తం గ్రీన్‌గా ఓ పార్క్ మాదిరి కనిపిస్తుంది. చూడగానే ఇది ఆటోనేనా అనిపిస్తుంది. ఆటోలో మొక్కలను ఏర్పాటు చేసిన సందర్భాలు చూశాం. ఇది మాత్రం అంతకు మించి అన్నట్లు ఉంది. ఏకంగా మొత్తం గ్రీనరీనే..ఏకంగా ఆటోలోని పైనంతా పూల మొక్కలు అలిమేసి ఉన్నాయి. ఇక సైడ్స్ పూలకుండీలు ఇవేగాక తాగునీరు, మోటివేషనల్ బుక్స్, మోటివేషనల్ ప్టోసర్లతో ఎంతో అట్రాక్టివ్‌గా మంత్రముగ్దుల్ని చేస్తోంది. ఆటోలో మిని గార్డెన్‌నే ఏర్పాటు చేశాడు ఆ డ్రైవర్. అతడి క్రియేటివిటీని ప్రశంసిస్తూ..అది జంగిల్ ఆటో అని ఒకరు, గ్రీన్ ఆటో మరొకరూ, కాదు కాదు ట్రావెలింగ్ పార్క్ అని ఇంకొకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by thoughts♡ (@depthoughtsz._) (చదవండి: ఆ పురాతన గోడ ధర వింటే..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!) -
జర్నీలో వాంతులు, వికారం రాకుండా ఉండాలంటే..ఇలా చేయండి!
కొంతమందికి బస్సులో లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు వికారంగా అనిపించడంతోపాటు తలనొప్పి, వాంతులు వస్తాయి. ఇలాంటి పరిస్థితిని మోషన్ సిక్నెస్ అంటారు. ఇది రాకుండా ఉండాలంటే లాంగ్ జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు టీ, కాఫీల వంటివి తాగకూడదు. అలాగే ఖాళీ కడుపుతో కూడా ఉండకూడదు. సులభంగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారాలని తీసుకోవాలి. నోటిలో ఒకటి రెండు యాలకులు పెట్టుకోవాలి. ఇది వికారం సమస్యని తొలగిస్తుంది. ప్రయాణం చేసేరోజు ఖాళీ కడుపుతో అర టీస్పూన్ నల్ల ఉప్పు, నిమ్మకాయ రసం, తేనె కలిపి తాగితే గ్యాస్‌కు సంబంధించిన సమస్యలు దరిచేరవు. ప్రయాణంలో నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లను తింటూ ఉండాలి. అరగ్లాసు నీటిలో చెంచాడు యాపిల్ సిడార్ వెనిగర్ కలిపి పరగడుపున తాగితే వాంతులు రావు. కిస్మిస్లలో జింక్, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి. రాత్రిపూట కొన్ని కిస్మిస్లను తీసుకుని తినాలి. దీంతో మరుసటి రోజు ఉదయం విరేచనం సాఫీగా జరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. దీంతో పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు. రాత్రిపూట కిస్మిస్లను నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం తిన్నా సమస్య నుంచి బయటపడచ్చు..ఒకటి రెండు జామాకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని నీటిలో వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి హెర్బల్ టీ మాదిరిగా తాగాలి. రోజుకు ఇలా రెండు సార్లు తాగితే చాలు, స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పులు రాకుండా ఉంటాయి. షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. చర్మం కాంతిమంతంగా... మృదువుగా తయారవుతుంది. (చదవండి: అప్పుడే జుట్టు తెల్లబడుతుందా! ఇలా చేసి చూడండి!) -
బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ..
-
వామ్మో.. భారతీయులు ప్రయాణాలపై నెలకు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా!
ప్రజలు తీరిక సమయాల్లో విహారయాత్రకు ప్లాన్ చేసుకుని పర్యాటక ప్రాంతాలలో తిరుగుతూ ఉంటారు. తమకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి చిల్ అవుతూ అందులో ఉన్న మజాని ఆశ్వాదిస్తూ ఉంటారు. ఈ క్రమంలో మనదేశంలో ఉన్న పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశాలలో కూడా చుట్టేసి వస్తుంటారు. ఇలా విదేశీ ట్రిప్‌ల కోసం భారతీయులు ప్రతి నెలా దాదాపు 1 బిలియన్ డాలర్లను ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చు కోవిడ్‌కు ముందు ఉన్న స్థాయిల కంటే చాలా ఎక్కువ అని రిజర్వ్ బ్యాంక్ విదేశీ చెల్లింపులపై డేటా వెల్లడించింది. 2022-23 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో ప్రయాణాల కోసం లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) ద్వారా భారతీయులు జరిపిన చెల్లింపులు 9.95 బిలియన్ డాలర్లుగా ఉంది. RBI డేటా ప్రకారం, 2021-22లో ప్రయాణానికి సంబంధించిన ఖర్చు 4.16 బిలియన్ డాలర్లు కాగా, 2019-20కి ముందు కోవిడ్ సంవత్సరంలో 5.4 బిలియన్ డాలర్లుగా ఉంది. భారతీయులు తమ కుటుంబాలు లేదా స్నేహితులతో కలిసి ప్రపంచవ్యాప్తంగా ట్రిప్‌లకు వెళ్తుంటారు. వియత్నాం, థాయిలాండ్, యూరప్, బాలి భారతీయులు ఇష్టపడే కొన్ని ప్రధాన గమ్యస్థానాలుగా చెప్పచ్చు. యూరప్, ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్, దుబాయ్ కూడా ఆ జాబితాలో ఉన్నాయి. సరసమైన ప్రయాణాల పెరుగుదల, సాంకేతిక పురోగతితో, ట్రావెల్ పరిశ్రమ అంతర్జాతీయ గమ్యస్థానాలలో భారీగా వృద్ధి వైపు పరుగెడుతోంది. ముఖ్యంగా ఇప్పుడే ప్రయాణం చేసి తరువాత చెల్లించండి అనే విధానం టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ రేటును ప్రస్తుత 5 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన భారతీయుల విదేశీ ప్రయాణాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్బీఐ డేటా ప్రకారం, ప్రధానంగా కోవిడ్-19 వ్యాప్తి తరువాత పరిమితుల కారణంగా 2020-21లో బయటి ప్రయాణాలపై ఖర్చు 3.23 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 2019-20, 2018-19లో ప్రయాణానికి సంబంధించిన బాహ్య చెల్లింపులు వరుసగా 6.95 బిలియన్ డాలర్లు, 4.8 బిలియన్ డాలర్లుగా ఉంది. చదవండి పెళ్లైన రెండో రోజే విగతజీవులైన నవ దంపతులు.. రిసెప్షన్‌కు ముందే.. -
కరోనా ఎఫెక్ట్: పర్యాటకులు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న ప్రాంతాలు ఇవే!
దసరా, దీపావళి పండగుల సమయంలో ఏం చేద్దామనుకుంటున్నారు..? కుటుంబ సమేతంగా ట్రిప్ వేద్దామని అనుకుంటున్నారా..? ప్రముఖ ట్రావెల్ సెర్చ్ ఇంజన్ ‘కాయక్’ పోర్టల్ డేటాను గమనిస్తే అసలు విషయం తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పోర్టల్‌పై విదేశీ పర్యాటక ప్రాంతాలు, వాటికి ఫ్లయిట్ సర్వీసుల సమాచారాన్ని అన్వేషిస్తున్న వారి సంఖ్య 118 శాతం పెరిగింది. 2019 పండుగల సమయంతో పోలిస్తే రెట్టింపైనట్టు ‘కాయక్’ ఓ నివేదికను విడుదల చేసింది. ఇదే కాలంలో విమాన టికెట్ల ధరలు 62 శాతం పెరిగినా కానీ, పర్యటనలకు వెనుకాడడం లేదని తెలుస్తోంది. వరుసగా రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి కారణంగా దేశ, విదేశీ పర్యటనలకు ఎక్కువ మంది దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఈ విడత పండుగల సెలవుల్లో ఎలా అయినా సరే ఏదైనా ప్రాంతాన్ని చూసి రావాల్సిందేనన్న ధోరణి బలపడుతోంది. ఈ పండుగల సీజన్లో ఎక్కువ మంది గోవా వెళ్లి రావాలని భావిస్తున్నారు. గోవాలోని పర్యాటక ప్రాంతాల గురించి ఎక్కువ మంది కాయక్పై శోధిస్తున్నారు. విమాన టికెట్ల చార్జీలు ఎంతున్నదీ తెలుసుకుంటున్నారు. దుబాయ్, బ్యాంకాక్, లండన్ ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్న అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జర్మనీ, ఖతార్, న్యూజిలాండ్, సింగపూర్, సౌదీ అరేబియా నుంచి ఎక్కువ మంది భారత్‌కు రావాలని అనుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది ఢిల్లీ, ముంబై, చెన్నై, కోచి, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2019తో పోలిస్తే రిటర్న్ టికెట్ ధర 31 శాతం మేర వీరికి పెరిగింది. కాయక్ డేటా.. ► భారత ఎయిర్‌పోర్ట్‌ల నుంచి విమాన సర్వీసుల సమాచారాన్ని శోధిస్తున్న వారి సంఖ్యలో 118 శాతం వృద్ధి (2019తో పోలిస్తే) ఉంది. అంతర్జాతీయ విమాన సర్వీసుల గురించి అన్వేషించే వారిలో 143 శాతం వృద్ధి ఉంటే, దేశీ విమాన సర్వీసుల గురించి చూసే వారు 91 శాతం పెరిగారు. ► 2019తో పోలిస్తే అంతర్జాతీయ విమాన సేవల చార్జీలు 38 శాతం పెరిగాయి. దేశీయ విమాన సేవల చార్జీలు 39 శాతం పెరిగాయి. అయినా కానీ, మార్పు కోసం ఏదో ఒక ప్రాంతాన్ని చూసి రావాలనుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆంక్షలు తొలగిపోవడం సానుకూలిస్తోంది. ► కేవలం విమానాల కోసమే కాదు, హోటళ్ల సమాచారం తెలుసుకుంటున్న వారిలోనూ 2019తో పోలిస్తే వృద్ధి ఉన్నట్టు కాయక్ డేటా చెప్తోంది. 2019తో పోలిస్తే హోటళ్ల సమాచారాన్ని కోరుతున్న వారిలో 34 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఇక దేశీ హోటళ్ల గురించి శోధనలో 98 శాతం వృద్ధి ఉంది. ► అంతర్జాతీయంగా హోటళ్ల ధరలను 2019తో పోల్చి చూస్తే.. 3–4 స్టార్ హోటల్లో డబుల్ రూమ్‌కు ఒక రాత్రి విడిది కోసం చెల్లించే చార్జీ 22 శాతం పెరిగింది. దేశీయ హోటళ్లలో ఇదే చార్జీ 25 శాతం పెరిగింది. ► విదేశీ పర్యటన కాలం 2019తో పోలిస్తే 13 శాతం తగ్గింది. సగటున 24 రోజులకు భారతీయులు ప్లాన్ చేసుకుంటున్నారు. దేశీ పర్యటనలకు వస్తే 2019తో పోల్చి చూస్తే ఒక రోజు పెరిగి ఆరు రోజులుగా ఉంది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
Travel Couple: ప్రేమ పెళ్లి.. సొంత కారవ్యాన్‌లో కుటుంబంతో కలిసి..
ప్రయాణంలో ఏమున్నది? అనే ఒకే ప్రశ్నకు వందల సమాధానాలు దొరుకుతాయి. సేద తీర్చే సెరువున్నది... నీడ కోసం చింత చెట్టున్నది... సిటారు కొమ్మన తేనెపట్టున్నది. వీటికి మించి మనల్ని కొత్తగా వెలిగించే తత్వం దాగున్నది. అందుకే రుచీపాండే, దీపక్ దంపతులు వ్యాన్నే ఇంటిని చేసుకొని లోకసంచారం చేస్తున్నారు... దెహ్రాదూన్(ఉత్తరాఖండ్) కాలేజీలో చదువుకునే రోజుల్లో రుచీ పాండే, దీపక్‌లు మంచి స్నేహితులు. ప్రేమలో పడడానికి ముందే ‘ట్రావెలింగ్’తో ప్రేమలో పడ్డారు. ప్రయాణం అంటే ఇద్దరికీ చెప్పలేనంత ఇష్టం. మొదట్లో దెహ్రాదూన్ నగరం ప్రతి మూలా చుట్టేశారు. ఆ తరువాత పొరుగు నగరాలు. ‘పెళ్లికి ముందు ఎన్నో అనుకుంటాం. పెళ్లి తరువాత అన్నీ ఆవిరైపోతాయి’ అని భారంగా నిట్టూర్చేవాళ్లను చూస్తుంటాం. అయితే ఒకేరకమైన అభిరుచులు ఉన్న రుచీ, దీపక్‌లు పెళ్లి తరువాత కూడా తమకు ఇష్టమైన ప్రయాణాలను మానలేదు. దీపక్‌ది రెండు సంవత్సరాలకు ఒకసారి బదిలీ అయ్యే ఉద్యోగం. ఎక్కడికి బదిలీ అయినా అక్కడి చుట్టుపక్కల కొత్త ప్రదేశాల గురించి ఆరా తీసి రుచీపాండేతో కలిసి ప్రయాణానికి ఛలో అనేవాడు. మొదట్లో టాటా ఇండికా వాడేవారు. ఆ తరువాత సఫారిలోకి షిఫ్ట్ అయ్యారు. ఒకప్పుడంటే తాము ఇద్దరమే కాబట్టి ఈ వాహనం ఓకే. కాని ఇప్పుడు ఇద్దరు పిల్లలు, రెండు పెంపుడు శునకాలు. కరోనా వల్ల హోటల్లో ఉండలేని పరిస్థితి, ఎక్కడ పడితే అక్కడ తినే వీలు లేకపోవడం... వీటిని దృష్టిలో పెట్టుకొని ‘కారవ్యాన్’పై దృష్టి పెట్టారు. గత సంవత్సరం ఫోర్స్ ట్రావెలర్ 3350 కొనుగోలు చేశారు. తమ సౌకర్యాలకు అనుగుణంగా దీన్ని మార్చుకోవడానికి యూఎస్ నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకోవడానికి బాగా ఖర్చయింది. ఇది ఒక ఎత్తయితే ‘వైట్–బోర్డ్ వెహికిల్’ కోసం ఆర్టీవో నుంచి అనుమతి పొందడం అనేది మరో ఎత్తు. ‘ఈ వాహనం మా కుటుంబం కోసమే, కమర్షియల్ వర్క్ కోసం కాదు అని ఉన్నతాధికారులను నమ్మించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది’ అంటుంది రుచీపాండే. విదేశాలకు చెందిన రకరకాల కారవ్యాన్లను చూస్తూ డిజైన్‌పై ఒక అవగాహనకు వచ్చారు. ఈ వీడియోలను నిపుణులైన పనివాళ్లకు చూపిస్తూ వ్యాన్ డిజైన్ చేయించారు. మూడు నెలలు నాన్–స్టాప్‌గా కష్టపడిన తరువాత తమ కలల వాహనం సిద్ధం అయింది. ఖర్చు లక్షలు అయింది ఇందులో సౌకర్యవంతమైన సీట్లు, కిచెన్, బాత్రూమ్, రెండు బెడ్లు, వాటర్ ట్యాంక్, షవర్, గ్యాస్, మైక్రోవేవ్, పైన సోలార్ ప్యానల్స్, కెమెరాలు...ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంటిని మరిపించే సంచార ఇల్లు ఇది. దీన్ని తమ అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవడానికి చేసిన ఖర్చుతో సెకండ్ హ్యాండ్ వ్యాన్ కొనుగోలు చేయవచ్చు. తొలి ప్రయాణం లేహ్, లద్దాఖ్. దీపక్ తల్లిదండ్రులు కూడా వచ్చారు. నచ్చిన చోట ఆగడం, ప్రకృతి అందాలను వీక్షించడం...ప్రయాణంలోని మజాను దీపక్ తల్లిదండ్రులు ఆస్వాదించారు. ‘సాధారణ కారులో సుదూర ప్రాంతాలు ప్రయాణం చేయడం కష్టం. భోజనం నుంచి నిద్ర వరకు రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉండడం, స్మూత్ డ్రైవింగ్ వల్ల మా వ్యాన్‌లో పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేశారు. గ్రామీణప్రాంతాలలో పార్కింగ్ అనేది కష్టం కాదు. అయితే పట్టణ ప్రాంతాలలో మాత్రం హోటల్ పార్కింగ్‌లను ఎంచుకునేవాళ్లం. వ్యాన్లోనే అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల బయట క్యాంప్ ఏర్పాటు చేసుకునే అవసరం రాలేదు’ అంటుంది రుచీ పాండే. గుజరాత్లో 5,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన అనుభవం తమకు ప్రత్యేకమైనది. వీరి భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? ఈ కారవ్యాన్పై నలభై దేశాలు చుట్టి రావాలనేది వారి కల. చదవండి: ఉచితంగా చదువుకోండి.. ఉన్నతంగా ఎదగండి -
కోవిడ్ సెగ: రోడ్డెక్కని 2 లక్షల బస్సులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా కోవిడ్-19 కారణంగా సుమారు 2 లక్షల ప్రైవేట్ బస్సులు మూలన పడ్డాయని బస్, కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీవోసీఐ) వెల్లడించింది. ఇవి రోడ్డెక్కాలంటే ఆపరేటర్లు ఒక్కో బస్‌కు కనీసం రూ.2 లక్షలు ఖర్చు చేయాల్సిందేనని బీవోసీఐ ప్రెసిడెంట్ ప్రసన్న పట్వర్ధన్ తెలిపారు. దేశంలో 10లోపు బస్‌లు కలిగి ఉన్న చిన్న ఆపరేటర్లు 90 శాతం ఉంటారని, వీరికి ఈ వ్యయాలు భారమేనని చెప్పారు. (ఇది చదవండి : వోల్వో-ఐషర్ కొత్త ఇంటర్ సిటీ బస్సులు) ప్రవాస్ 3.0 పేరుతో ఇక్కడి హైటెక్స్‌లో ప్రారంభమైన ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ షోలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సేవల రంగంలో ఇప్పటికీ ఉద్యోగులు పూర్తి స్థాయిలో కార్యాలయాలకు రావడం లేదు. ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో బస్‌లకు డిమాండ్ ఆశించినట్టు లేదు. మరోవైపు స్కూల్ బస్‌లకు కొరత ఉంది. దేశంలో 2021-22లో అన్ని రకాల బస్‌లు సుమారు 20,000 యూనిట్లు అమ్మడయ్యాయి. మొత్తం 19 లక్షల బస్‌లు పరుగెడుతున్నాయి. వీటిలో 17.7 లక్షలు ప్రైవేట్ ఆపరేటర్లవి. మిగిలినవి వివిధ రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల చేతుల్లో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ రెండింతలు అయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ బస్‌ల విషయంలో తయారీ సంస్థలు సరఫరా సమస్యలను ఎదుర్కొంటున్నాయి’ అని వివరించారు. చదవండి : ఝన్‌ఝన్‌వాలా జాక్‌పాట్:టైటన్ మెరిసెన్ -
186 దేశాలు పర్యటించిన తెలుగు ట్రావెలర్
విజయనగరం: విశాఖపట్టణానికి చెందిన రవి ప్రభు అరుదైన ఘనత సాధించారు. ఒక వైపు అమెరికాలోని ప్రముఖ కంపెనీలో పని చేస్తూనే వీలున్నప్పుడల్లా విదేశీ పర్యటనలు చేశారు. చిన్నప్పటి కోరికను సాధించుకోవడానికి తగిన ప్రణాళికలు రచించుకున్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు అడుగులు వేశారు. అమెరికాలోని ప్రముఖ ఐటీ కన్సల్టెంట్ ఏజెన్సీలో కన్సల్టెంట్‌గా పని చేస్తూనే.. తనకు ఎంతో ఇష్టమైన ట్రావెలింగ్‌లో భాగంగా ప్రపంచ దేశాలను చుట్టేశారు. అక్కడున్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ భారతీయ యువతకు.. అక్కడ దేశాల యువతకు తారతమ్యం ఏమిటో తెలుసుకుని విశదీకరిస్తున్నారు. పర్యటనలో భాగంగా సోమవారం విజయనగరం వచ్చిన ఆయనకు జిల్లా యువజన అధికారి విక్రమాధిత్య స్వాగతం పలికారు. స్థానిక నెహ్రూ యువకేంద్రంలో డ్వామా ఏపీడీ లక్ష్మణరావుతో కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా రవిప్రభు వెల్లడించిన పలు విషయాలు ఆయన మాటాల్లోనే... వారి ఐడియాలజీ.. మన యువతకు.. ఎప్పుడు ఎక్కడికెళ్లినా అందరూ నన్ను అడిగే ప్రశ్న ఒక్కటే.. అసలు మీరెందుకు ఇన్ని దేశాలు తిరిగారని. దీనికి నేను చెప్పే సమాధానం ఒక్కటే. యువత ఎన్నో అనుకుంటారు. ఏవేవో కలలు కంటారు. కానీ వాటిని సొంతం చేసుకోవడంలో మాత్రం తడబడతారు. కొంతమంది అనుకున్నది సాధిస్తారు. మరికొందరు విఫలమవుతారు. ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి, ఆశ ఉంటాయి. నాక్కూడా చిన్నప్పటి నుంచి ఒక్కటే ఆశ ఉండేది. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరగాలి. అక్కడ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. అక్కడి ప్రజల జీవన విధానాలను తెలుసుకోవాలి. ఇందుకోసం ముందుగా అమెరికా వెళ్లి ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగంలో చేరా. నా సొంత డబ్బులతోనే ఇంతవరకు 186 దేశాలు తిరిగాను. విదేశాల్లో పర్యటించినప్పుడు చాలా కాన్ఫరెన్స్‌ల్లో పాల్గొన్నాను. అక్కడ విద్యాభ్యాసం తీరు.. నేర్చుకునే విధానాలు వేరు. కొన్ని దేశాల్లోని విద్యార్థుల ఐడియాలజీ బాగుంటుంది. అలాంటి అంశాలను తెలుసుకొని భారతీయ యువతకు అందించాలనే ప్రధాన ఉద్దేశంతోనే నేను ఈ దేశాలన్నీ తిరిగాను. నేను వెళ్లాల్సినవి ఇంకా 9 దేశాలు ఉన్నాయి. త్వరలోనే ఆ దేశాల్లో కూడా పర్యటిస్తాను. (చదవండి: మహానాడు కాదు.. ఏడుపునాడు) -
మార్చిలో విమానయానం జూమ్
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి తదుపరి దేశీ విమానయానం ఊపందుకుంటోంది. గత మార్చిలో దేశీ ప్రయాణికుల సంఖ్య 1.06 కోట్లను తాకింది. అంతకుముందు నెల ఫిబ్రవరిలో నమోదైన 76.96 లక్షలతో పోలిస్తే సుమారు 38 శాతం అధికం. వైమానిక నియంత్రణ సంస్థ డీజీసీఏ తాజా గణాంకాలివి. గత నెలలో దేశంలోని అన్ని ప్రైవేట్ రంగ సంస్థల ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్) 80 శాతం దాటడం గమనార్హం. విమానాల ఆక్యుపెన్సీని తెలియజేసే పీఎల్ఎఫ్ స్పైస్‌జెట్‌లో 86.9 శాతం, ఇండిగోకు 81 శాతం, విస్తారాలో 86.1 శాతంగా నమోదైంది. ఈ బాటలో గో ఫస్ట్ 81.4 శాతం, ఎయిరిండియా 85 శాతం, ఎయిరేషియా ఇండియా 81.3 శాతం చొప్పున పీఎల్‌ఎఫ్‌ను సాధించినట్లు డీజీసీఏ వెల్లడించింది. అయితే కేంద్రం నిర్వహణలోని ప్రాంతీయ సంస్థ అలయెన్స్ ఎయిర్ మార్చిలో 74 శాతం పీఎల్ఎఫ్నే సాధించినట్లు పేర్కొంది. కాగా.. గత రెండేళ్లలో కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రయాణాలపై నిషేధ ఆంక్షలు విధించడంతో విమానయాన రంగం కుదేలైన విషయం విదితమే. -
వైరల్: ట్రాఫిక్‌లో డేంజరస్ బైక్ స్టంట్.. యువకుడికి దిమ్మ తిరిగింది!
బైక్ స్టంట్స్ చేయడం ఎంత ప్రమాదమో అందరికి తెలిసిందే. తమ బైక్ స్టంట్స్ వల్ల ఇతర వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. అయినా కూడా కొందరు పట్టించుకోకుండా రోడ్డుపై స్టంట్స్ చేస్తూ పాపులర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. హీరోలా ఫీల్ అవుతూ రకరకాల స్టంట్లు చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. తాజాగా అలాంటి ఓ బైకర్ చేసిన స్టంట్ తేడాకొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది. చదవండి: వ్యక్తి చుట్టు కుప్పగా హాట్ చిప్స్.. ఫన్నీ వీడియో.. ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ తన ట్విటర్లో పోస్టు చేసిన ఈ వీడియోలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న రోడ్డుపై ఓ యువకుడు అందరిలాగే బైక్‌పై వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఒక్కసారిగా బైక్ ముందు చక్రాన్నిస్టైల్గా పైకి లేపాడు. అలాగే బైక్ నడుపుతూ కొంచెం దూరం వెళ్లి గాల్లోకి లేపిన చక్రాన్ని కిందకు దింపాడు. అయితే అప్పుడే ఏమైందో ఏమో గానీ ఒక్కసారిగా బైక్ బ్యాలెన్స్ తప్పింది. చదవండి: తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఫొటోకు ఫోజులు.. మండిపడుతన్న నెటిజన్లు బైక్ ఊగిపోతూ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టబోయి తప్పించుకున్నాడు. కానీ వెంటనే వెనకాల వస్తున్న ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టాడు. దాంతో బైకర్ గాల్లో ఎగిరి పడ్డాడు. అతను వెనక తగిలించుకున్న బ్యాగ్ గాల్లో ఎగురుతూ పడింది. మరి బైకర్ పరిస్థితి ఎలా ఉందో తెలియదు గానీ ఇక్కడితో వీడియో పూర్తయింది. ఇదంతా కారులో వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. #BeSafe💐 ऐसा मत करना😢😢😢😢 Hero की Heropanti nikal gayi 😢😢😢@ipskabra @arunbothra @ipsvijrk pic.twitter.com/fHZ2mo7Rgb — Rupin Sharma IPS (@rupin1992) October 27, 2021 -
వయస్సు ఏడాదే..సంపాదన ఎంతో తెలిస్తే ముక్కున వేసుకోవాల్సిందే
న్యూయార్క్: ఏడాది వయస్సున్న బుడి బుడి అడుగుల బుబ్జాయి..ముసిముసి నవ్వుల పాపాయి ఏం చేస్తుంది. అమ్ము ఒడిలో సేదతీరుతుంది. కానీ ఈ బుడ్డోడు మాత్రం అలా కాదు. టూరిస్ట్ ప్రాంతాల్ని చుట్టేస్తూ .. సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లకు పోటీ పోటీగా డబ్బులు సంపాదిస్తున్నాడు. అమెరికాలోని ఇడహో ఫాల్స్ కు చెందిన జెస్, స్టీవ్ దంపతులు. ఈ ఇద్దరు దంపతులకు బ్రిగ్స్ డారింగ్టన్ జన్మించాడు. అయితే తల్లి జెస్ గర్భవతిగా ఉన్నప్పుడు కొంతకాలం ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని ఆందోళనకు గురైంది. అదే సమయంలో ఆమెకు మెరుపులాంటి ఐడియా వచ్చింది. అదే బేబీ ఇన్ఫ్లూయెన్సర్. పుట్టబోయే పిల్లల్ని సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ని చేయాలని. వెంటనే బేబీ ఇన్ ఫ్లూయెన్సర్లు ఎవరైనా ఉన్నారా అని సోషల్ మీడియాను జల్లెడ పట్టింది. కానీ ఎవరూ లేరు. అందుకే తనకు పుట్టిన బ్రిగ్స్‌ను సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్గా మార్చేసింది. టూరిస్ట్ ప్రాంతాలకు బ్రిగ్స్‌ను తీసుకెళ్లి తిప్పి చూపించేది. ఇలా అమెరికాలో 16 రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లింది. ఆ పర్యాటక ప్రాంతాలకు వచ్చే సమయంలో పిల్లల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఎలాంటి ఫుడ్ దొరకుతుందో వివరించేంది. అందుకు టూరిజం సంస్థలు బ్రిగ్స్ తల్లిదండ్రులతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ సంస్థ తరుపు ప్రచారం చేసినందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చెలిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో 34,000 మంది ఫాలోవర్స్ సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్గా ఉన్న బ్రిగ్స్‌కు సైతం నెలకు 1000 డాలర్ల(ఇండియన్ కరెన్సీలో రూ. 75 వేలు) స్పాన్సర్ అందిస్తున్నాయి. వీటితో పాటు బ్రిగ్స్‌కి అవసరమైన డైపర్స్, వైప్స్ లాంటివి కూడా ఉచితంగానే వస్తున్నాయి. -
ప్రేమకు తాళం వేస్తున్న ప్రేమికులు ఎందరో!
ప్రేమ... కలకాలం కలిపి ఉంచే బంధం. అందంగా అల్లుకున్న ప్రేమబంధం...రోజు రోజుకీ మరింతగా బలపడాలి. ఎప్పటికీ దూరంకానంత దగ్గరగా ఉంచాలి. బంధించినంత దృఢంగానూ ఉండాలి. అవసరమైతే గుండె గదికి తాళం వేయాలి. ప్రేమకు తాళం వేస్తున్న ప్రేమికులు ఎందరో! ఒక దేశంలో చెట్టుకు తాళం వేస్తే..మరికొన్ని దేశాల్లో వంతెనలకు తాళం వేస్తున్నారు. ఎంతసేపూ మాట్లాడే పిల్లలను నోటికి తాళం వేయమని టీచర్లు గదిమేవాళ్లు. పిల్లలు చూపుడు వేలిని పెదవుల మీద ఆన్చి దొంగ చూపులు చూస్తూ ఉంటారు. టీచర్ దృష్టి తమ మీద నుంచి పక్కకు మళ్లగానే నోటి మీదున్న చూపుడు వేలిని అలాగే ఉంచి పక్కనున్న పిల్లలతో మెల్లగా గుసగుసలాడుతుంటారు గడుగ్గాయిలు. స్కూలు దశలో మొదలయ్యే ఈ అలవాటు పెద్దయినా పోయేటట్లు లేదు. నిబంధనల కళ్లుగప్పి ప్రేమతాళాలు వేస్తూనే ఉన్నారు ప్రపంచంలోని ప్రేమికులు. ప్రేమను పండించుకోవడానికి తాళాలు వేసే అలవాటు సరదాగా మొదలైంది. ఆ అలవాటును మాన్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ప్రపంచంలో ప్రేమికుల తాళాల అడ్డాలు చాలానే ఉన్నాయి. మనదేశానికీ పాకింది. కానీ వెర్రి తలలు వేయడం లేదు. ప్రేమబంధం కలకాలం ఫ్రాన్స్ దేశం, పారిస్ నగరంలో సీయెన్ నది మీద ఓ వంతెన. పేరు పాంట్ ద ఆర్ట్స్. ఈ వంతెన ప్రేమబంధాన్ని కలకాలం నిలబెడుతుందని ఓ నమ్మకం. వంతెన రెయిలింగ్‌కు ఉన్న తాళాలన్నీ ప్రేమికులు ప్రేమతో వేసినవే. ప్రేమికులు తాళం కప్ప మీద తమ పేర్లు రాసుకుని మరీ తాళం వేస్తారు. తాళం చెవిని నదిలోకి విసిరేస్తారు. అంతే... అలా చేస్తే తమ ప్రేమబంధానికి తాళం వేసినట్లేనని వారి నమ్మకం. ఇది సరదాగానే మొదలైంది. కానీ విపరీతంగా ప్రచారంలోకి రావడంతో స్థానికులే కాక పారిస్ పర్యటనకు వచ్చిన వాళ్లు కూడా తాళాలు వేయడం మొదలుపెట్టారు. ప్రపంచప్రేమికుల ప్రేమ బరువు మోయలేక వంతెన చేతులెత్తేసింది. ఇప్పుడు ఇక తాళాలు వేయవద్దు బాబోయ్ అంటూ వేడుకుంటున్నారు పారిస్ నగర నిర్వహకులు. అయినా వారి కళ్లుగప్పి తాళాలు పడుతూనే ఉన్నాయి. వేసేవాళ్లు వేస్తూనే ఉన్నారు. నగర పాలక సిబ్బంది వాటిని తొలగిస్తూనే ఉన్నారు. ‘ఐ వాంట్ యూ’ ప్రభావం ఫ్రాన్స్‌లో జరుగుతోంది కాబట్టి ఫ్రెంచ్ వాళ్ల నమ్మకం అనిపిస్తుంది. ఇటాలియన్ నవల ‘ఐ వాంట్ యూ’తో మొదలైంది. ఇందులో నాయికానాయకులైన రోమన్ ప్రేమికులు తమ ప్రేమను పండించుకోవడానికి వంతెనకు తాళం వేయడాన్ని వర్ణించాడు రచయిత. అంతే దశాబ్దంలోపే పారిస్ వంతెనకు ఏడు లక్షల తాళాలు పడ్డాయి. వెర్రితలలు వేస్తున్న ఈ అలవాటును మాన్పించడానికి ‘లవ్ విదవుట్ లాక్స్’ ప్రచారం మొదలైంది. ‘వంతెన మీద నిలబడి ఒక సెల్ఫీ తీసుకోండి. ప్రేమ ఎల్లప్పటికీ నిలిచి ఉంటుంది’ అనే ప్రచారం కూడా మొదలైంది. కానీ తాళం పడటం ఆగలేదు, తాళాలు వేస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. స్కాట్లాండ్లో... ‘మార్క్ యువర్ స్పాట్’ ఇలాంటిదే. ఈ వంతెన మీద ఏటా ప్రేమికుల కోసం వేడుకలు జరుగుతాయి. వంతెనలకు తాళాలు వేయడాన్ని నిషేధిస్తున్నారు. అయితే ఈ నిషేధం తాళాలకే, ప్రేమకు కాదు. సౌత్ కొరియాలో... సౌత్ కొరియాలోని డియాగులో ఉన్న సుసెయాంగ్ సరస్సు కూడా ప్రేమికుల సెంటిమెంట్‌ను పండించే అడ్డానే. ఈ వంతెన మీద ఉండే రెయిలింగ్‌కు తాళాలు వేసి తాళం చెవిని నీటిలోకి విసిరేస్తారు. మాస్కో ప్రేమ మాస్కోలో వోడూట్డోట్నీ కెనాల్ మీద కట్టిన వంతెన ప్రేమికుల అడ్డా. ఈ వంతెన మీద ఇనుప చెట్లకు నిండా పూలు విరగబూసినట్లు తాళాలుంటాయి. అవన్నీ లవ్లాక్లే. -
చుట్టేసెయ్ చుట్టేసెయ్.. భూమి..
సాక్షి, రాజానగరం: ప్రఖ్యాత రచయిత రాహుల్ సాంకృత్యాయన్ రచన ‘లోక సంచారి’ అతడికి స్ఫూర్తి. మాతృదేశాన్ని చుట్టి రావాలన్నది అతడి సంకల్పం. తన 25వ ఏట ప్రారంభమైన అతడి సంచారం ఎనిమిదేళ్లుగా 17 వేల కిలోమీటర్లు కొనసాగింది. ఇంకా సాగుతూనే ఉంది. తన ద్విచక్ర వాహనాలైన బుల్లెట్, లేదా బైక్‌పై పుణ్యక్షేత్రాలు, చారిత్రక కట్టడాలు తదితర ప్రఖ్యాత స్థలాలను అతడు చుట్టి వచ్చాడు. తాజాగా శ్రీకృష్ణదేవరాయలు పాలించిన విజయనగర రాజధాని హంపీ నగరాన్ని సందర్శించి వచ్చాడు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడమే తన జీవితాశయమని చెప్తాడు రాజానగరం మండలం దివాన్‌చెరువుకు చెందిన 33 ఏళ్ల పెన్నాడ మోహన్. బీఎస్సీ చదివిన అతడు ఉద్యోగం కోసం చూడకుండా వ్యాపారం వైపు అడుగులు వేశాడు. భార్య, ఇద్దరు కుమారులున్న మోహన్.. ‘సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడు పడవోయ్’ అన్న మహాకవి మాటలను ఉన్నంతలో ఆచరించేందుకు ‘లియో ఫౌండేషన్’ ప్రారంభించాడు. దివాన్‌చెరువులో జాతీయ రహదారిని ఆనుకుని ఒక సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తున్న ఆయన ఎనిమిదేళ్లుగా ఏటా దేశంలోని ఏదో ఒక ముఖ్య ప్రదేశానికి వెళ్లి వస్తుంటాడు. తన యాత్రలను ద్విచక్ర వాహనాలపైనే సాగిస్తూ రాత్రి వేళ గుడారం వేసుకుని తలదాచుకుంటాడు. కొన్నిచోట్ల స్థానికుల నుంచి అపూర్వ ఆదరణ లభించేదని చెప్తాడు. ఈ యాత్రానుభవాలతో పుస్తకం తీసుకువస్తా.. తాను చూసిన ప్రకృతి అందాలను, సంస్కృతులను భావితరాలకు తెలియజేసేందుకు మోహన్ కొన్ని పత్రికల్లో వ్యాసాలు కూడా రాశాడు. వాటిలో ‘నేను చూసిన డొక్కా సీతమ్మ’, ‘ఆ రాత్రి నేను కాదేమో’, ‘తలుపులు లేని ఊరు స్యాలియా’ వంటివి బాగా పాఠకాదరణ పొందాయి. ఎనిమిదేళ్లు సాగిన యాత్రపై ‘ప్రయాణంలో నా జీవితం’ అనే పుస్తకాన్ని కూడా తీసుకువస్తానంటున్నాడు. ఇంతవరకూ తన యాత్రలకు కుటుంబ సభ్యులు, మిత్రులు ఇచ్చిన ప్రోత్సహం మరువలేనిదని, అదే స్ఫూర్తితో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని కూడా అధిరోహిస్తానంటున్నాడు మోహన్. -
3 రోజుల్లో లోకం చుట్టిన వనిత
నవంబర్ 18, 2020 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ వారు 3 రోజుల 14 గంటల్లో (87 గంటలు) 7 ఖండాలు చుట్టిన వనితగా అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన డాక్టర్ ఖాలా అల్రొమైతీని ప్రకటించారు. ఆమె ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ ఘనత సాధించింది. గతంలో అమెరికన్ నటి జూలీ బెర్రీ 92 గంటల్లో ఈ రికార్డ్ సాధించారు. ‘మా దేశం చిన్నదే కావచ్చు. కాని మేం కూడా రికార్డులు సాధించగలమని నిరూపించడానికే ఈ ప్రయాణం కట్టాను’ అంటున్నారు డాక్టర్ ఖాలా. ‘లోకం చుట్టిన వీరుడు’ అని సినిమా ఉంది. ఎం.జి.ఆర్ హీరో. ‘లోకం చుట్టిన వీరురాలు’ అని ఎవరూ సినిమా తీయలేదు. ఎందుకంటే లోకం చుట్టే పని పురుషుడిది అని లోకం అభిప్రాయం. సాహసయాత్రలు చేసిన సింద్బాద్, గలీవర్లు పురుషులే. కాని స్త్రీలు చేసిన సాహసప్రయాణాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఇప్పుడిప్పుడే వెలికి తీసి గ్రంథస్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సంతోష పడాల్సిన విషయం ఏమిటంటే అతి తక్కువ సమయంలో లోకం చుట్టిన రికార్డు (ఏడు ఖండాలను తాకిన) ఒక వనితకు సొంతం కావడం. ఆ వనిత పేరు డాక్టర్ ఖాలా అల్‌రొమైతీ. యు.ఏ.ఇ దేశస్తురాలు. ఆమె ఫిబ్రవరిలో దాదాపు కరోనా దుమారం మొదలవుతున్న సమయంలో ఈ రికార్డు సాధించి తాజాగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో ఎక్కింది. నవంబర్ 18, 2020న ఆమె రికార్డును అధికారికంగా ప్రకటించారు. 3 రోజుల 14 గంటలు స్త్రీలను నాలుగు గోడల మధ్య ఉంచే పురుష సమాజం ఇది. ఇక ఇస్లామీయ సమాజాలలో వారికి స్వేచ్ఛ ఉండదనే ప్రచారం ఉంటుంది. కాని అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన వైద్యురాలు డాక్టర్ ఖాలా ఈ లోకాన్ని చుట్టిన వనితగా రికార్డ్ సాధించాలనుకున్నారు. ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు ఈ కరోనా సంగతి తెలియని రోజుల్లోనే 2020 సంవత్సరానికి ‘డిస్కవర్ యువర్ వరల్డ్’ అనే థీమ్ ఇచ్చారు. అది ఒక స్ఫూర్తినిచ్చింది నాకు. ఇక మా దేశంలో అన్ని దేశాల పౌరులు నివసిస్తారు. ముఖ్యంగా దుబాయ్‌లో ఏ దేశం వారినైనా మీరు చూడొచ్చు. వారందరూ రావడం వల్లే మా దేశం ఎంతో కళకళలాడుతుంది. అందుకని వారికి కృతజ్ఞతగా కూడా వారున్న దేశాలను, ఖండాలను చుట్టి రావాలని అనుకున్నారు’ అంటారు డాక్టర్ ఖాలా. ఫిబ్రవరిలో మొదలైన ఆమె ప్రయాణం ఫిబ్రవరి 13, 2020న సిడ్నీ (ఆస్ట్రేలియా)లో ముగిసింది. అంటే అంతకు నాలుగు రోజుల ముందు ఆమె దుబాయ్ నుంచి బయలుదేరిందన్న మాట. ఏడు ఖండాలను తాకి ఆస్ట్రేలియాలో యాత్ర ముగించడానికి ఆమె తీసుకున్న సమయం 3 రోజుల 14 గంటల 46 నిమిషాల 48 సెకన్లు. ఇంతకు ముందు ఉన్న రికార్డు ఏడు ఖండాలను అత్యంత తక్కువ టైమ్‌లో చుట్టి రావాలని ఇంతకు ముందు అనుకున్నది కూడా ఒక స్త్రీనే. ఆమె పేరు జూలీ బెర్రీ. అమెరికన్ నటి. ఆమె తన స్నేహితుడు కేసె స్టివార్ట్తో కలిసి ‘72 గంటల్లో 7 ఖండాలు’ అనే రికార్డు యాత్ర చేసింది. 13 డిసెంబర్ 2017న సిడ్నీలో మొదలుపెట్టి డిసెంబర్ 16న చిలీలో తన యాత్ర ముగించింది. అయితే ఆమె ఆశించినట్టుగా 72 గంటల్లో కాక యాత్ర 92 గంటల్లో ముగిసింది. అయినప్పటికీ అది అత్యంత తక్కువ సమయంలో లోకం చుట్టిన రికార్డుగా గిన్నిస్ బుక్‌లో నమోదైంది. ఈ యాత్రలో జూలీ ఆమె మిత్రుడు దాదాపు 48 గంటలు అసలు నిద్ర లేకుండా ప్రయాణిస్తూనే ఉన్నారు. ఇద్దరికీ టెన్ టు సిక్స్ చేసే పని పట్ల విసుగు ఉండటం వల్లే ఈ యాత్ర చేసి విజయవంతం అయ్యారు. నా కుటుంబం తోడు నిలిచింది ‘యాత్ర మొదలెట్టానన్న మాటే కాని మధ్యలో చాలాసార్లు అనుకున్నాను ఆగి వెనక్కి వెళ్లిపోదామా అని. అన్నీ మనం అనుకున్నట్టుగా ఉండవు. ఎయిర్‌పోర్టుల్లో ఫ్లయిట్లను పట్టుకోవడం అంత సులభం కాదు. కాని నా కుటుంబం నాకు అన్ని విధాలుగా సహకరించి యాత్ర పూర్తి చేసేలా చూసింది’ అన్నారు డాక్టర్ ఖాలా. ‘మాది చిన్న దేశమే అయినా రికార్డ్ సృష్టించిన విశేషాలెన్నో ఉన్నాయి. ప్రపంచంలో ఎత్తయిన భవనం మా దేశంలో ఉంది. లార్జెస్ట్ హైడెఫినేషన్ వీడియో వాల్ మా దేశంలో ఉంది. అత్యంత వేగంగా ప్రయాణించే పోలీస్ కార్ కూడా మాకే సొంతం. మా దేశ అధ్యక్షుడు, ప్రధాని.. ఇద్దరూ తమ పౌరులను గొప్ప పనులు చేయమని ప్రోత్సహిస్తుంటారు. మహిళల ముందంజకు ప్రాధాన్యం ఇస్తుంటారు. వారిని చూసి కూడా నేను స్ఫూర్తి పొందాను’ అంటారు డాక్టర్ ఖాలా. ఖాలా వివాహిత. పిల్లల తల్లి. అయినప్పటికీ ఆమె ఈ అరుదైన రికార్డు కోసం సంకల్పం తీసుకున్నారు. ‘నా సాఫల్యం నా దేశానికి, నా సమాజానికి అంకితం ఇస్తున్నాను. నన్ను చూసి కలలు కనవచ్చని వాటిని సాఫల్యం చేసుకోవచ్చని ఎవరైనా స్ఫూర్తి పొందితే అంతే చాలు’ అన్నారు ఖాలా. పత్రికలు ఈ రికార్డు అనౌన్స్ అయ్యాక ఖాలాను మెచ్చుకుంటూ కథనాలు రాశాయి. ఒక పత్రిక ‘ఆమె లోకం చుట్టింది. మనం ఇంకా పక్క మీద నుంచి లేవడానికే తాత్సారం చేస్తున్నాం’ అని హెడ్డింగ్ పెట్టింది. కదలడం జీవ లక్షణం. ఈ కరోనా తర్వాత ఎంత వీలైతే అంత లోకం చుడదామనుకునేవారు తప్పక ఖాలా వంటి మహిళలను చూసి స్ఫూర్తి పొందుతారు. – సాక్షి ఫ్యామిలీ -
ట్రావెలింగ్ టీచర్
భారతదేశం నుంచి బహుశా ఆమె ఒక్కర్తే ఈ బిరుదుకు అర్హురాలు. త్రివేండ్రంకు చెందిన మన్నా అబ్రహం కువైట్‌లో టీచరుగా పని చేస్తూ అమెరికాకు వెళ్లి 2004లో ప్రపంచంలో అతి పెద్దదైన రింగ్లింగ్ బ్రదర్స్ సర్కస్‌లో ‘ట్రావెలింగ్ టీచర్’గా చేరారు. సొంత విలాసవంతమైన ట్రైన్ కలిగిన ఆ సర్కస్ అమెరికా అంతా తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తుంటుంది. ఆ రైలులో కేటాయించిన ఒక గదిలో ఉంటూ 8 ఏళ్లు మన్నా అబ్రహం సర్కస్ పిల్లలకు పాఠాలు చెప్పారు. చెన్నైలో స్థిరపడిన మన్నా ఇటీవల తన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో రాయడంతో అందరూ ఆమెను వెతుకుతూ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ విలక్షణమైన టీచర్ పరిచయం ఇది. కాలు కుదురుగా ఉండని లక్షణం మన్నాకు లాభించింది. ఆమె ఎలాగైతే లోకాన్ని చుడుతూ ఉండాలని కోరుకున్నారో అలాగే చుట్టే అవకాశం దొరికింది. ఒక భారతీయ మహిళ అమెరికాలో ప్రఖ్యాత సర్కస్ కంపెనీలో 8 ఏళ్ల పాటు ఉండి, వారితో పాటు తిరుగుతూ, వారి పిల్లలకు పాఠాలు చెప్పడం సామాన్యమైన విషయం కాదు. పెద్ద ఘనత. ఆ ఘనతను సాధించిన వ్యక్తి మన్నా అబ్రహం. ఇటీవల ఆమె తన అనుభవాలను ఒక సోషల్ మీడియా గ్రూప్‌లో పంచుకోవడంతో అవి వైరల్ అయ్యాయి. అందరూ ఆ అనుభవాల కోసం చెవి ఒగ్గుతున్నారు. పేపర్ ప్రకటన చూసి త్రివేండ్రంకు చెందిన మన్నా అబ్రహం మొదట చెన్నైలో ఆ తర్వాత కువైట్‌లో టీచర్ గా పని చేశారు. అయితే అక్కడ కూడా ఉండలేకపోవడంతో 2001లో అమెరికా వెళ్లారు. అక్కడ పాఠాలు చెబుతూ ఉండగా ఒక ప్రకటన ఆమె దృష్టికి వచ్చింది. ‘ఒక సర్కస్ కంపెనీకి ట్రావెలింగ్ టీచర్ కావాలి’ అని ఉంది అందులో. అయితే తర్వాత తెలిసింది ఆ సర్కస్ కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్దదైన రింగ్లింగ్ బ్రదర్స్ కంపెనీ అని. ‘మొత్తం మీద సర్కస్‌లో పని అని అప్లై చేశాను’ అని గుర్తు చేసుకున్నారు మన్నా అబ్రహం. అమెరికన్ విద్యా చట్టాల ప్రకారం సంచార ఉపాధిలో ఉండే బృందాల పిల్లలకు కూడా తప్పనిసరిగా విద్య అందాలి. అందువల్ల సర్కస్‌లో ఉండే పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ కావాలి. అలా మన్నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది. ‘నేను చేరింది 2004లో. అప్పుడు నా వయసు 41. నేను పాఠాలు చెప్పాల్సింది సర్కస్‌లో పని చేసే కళాకారుల పిల్లలు లేదా సర్కస్‌లో ప్రదర్శనలు ఇచ్చే పిల్లలు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మొత్తం అన్ని క్లాసులకు అన్ని సబ్జెక్ట్‌లు చెప్పమన్నారు. ఒప్పుకున్నాను’ అన్నారామె. రైలు జీవితం రింగ్లింగ్ బ్రదర్స్ చాలా భారీ సర్కస్. చాలా డబ్బున్న సర్కస్. అందులో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో పాటు రకరకాల పనులు చేసే వందల కొద్ది కళాకారులు ఉండేవారు. వారిని, జంతువులను, సామగ్రిని ఒక చోట నుంచి మరో చోటకు తరలించడానికి సర్కస్ కంపెనీ సొంతంగా ఒక విలాసవంతమైన రైలును కొనుక్కుంది. ‘దాని పొడవు ఒక మైలు ఉండేది’ అన్నారు మన్నా నవ్వుతూ. సర్కస్ యజమాని, మేనేజర్లు, కళాకారులు అందరూ దాదాపు అందులోనే జీవితం గడిపేవారు. ‘నాకు ఒక చిన్న గది రైలులోనే ఇచ్చారు. అందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్. కిచెన్ ఉండేవి. నేను భారతీయ వంటకాలు చేసుకు తినేదాన్ని. వాటి కోసం వివిధ దేశాల కళాకారులు నా రూమ్‌కు వచ్చేవారు’ అంటారు మన్నా. 27 దేశాల జాతీయలు ‘సర్కస్ అంటే ప్రపంచ దేశాల వారు నివశించే ఒక సంత. రింగ్లింగ్ బ్రదర్స్‌లో 27 దేశాల జాతీయులు ఉండేవారు. చైనా, బ్రెజిల్, రష్యా, చిలీ, కంబోడియా... అయితే అందరు పిల్లలకు ఇంగ్లిష్ బోధన భాషగా అర్థమయ్యేది కాదు. నేను ఇతర సీనియర్ విద్యార్థుల చేత వారితో మాట్లాడించి వారికి కొద్దో గొప్పో నా పాఠాలు అర్థమయ్యేలా చేసేదాన్ని. రైలు ఎక్కడ ఆగితే అక్కడ నాకు కేటాయించిన స్థలంలో ఆరుబయట క్లాసులు నిర్వహించేదాన్ని. రైలు వెళుతున్నప్పుడు పాఠాలు ప్లాన్ చేసుకునేదాన్ని. పిల్లల పుస్తకాలు, పరీక్ష పేపర్లు అన్నీ నా అజమాయిషీలోనే ఉండేవి. ఆశ్చర్యం ఏమిటంటే విద్యాశాఖ అధికారులు మధ్య మధ్య ఇన్స్పెక్షన్కు ఊడిపడేవారు... క్లాసులు ఎలా జరుగుతున్నాయా అని’ అన్నారు మన్నా. 48 రాష్ట్రాలు అమెరికాలో పుట్టి పెరిగిన వారు కూడా తమ జీవిత కాలంలో అమెరికా అంతా చూడరు. కాని మన్నా అబ్రహమ్ అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలో 48 రాష్ట్రాలు చుట్టేశారు. ‘మా రైలు వెళ్లని రాష్ట్రం లేదు’ అంటారామె. మంచు దిబ్బల మధ్య నుంచి, ఎడారి దారుల నుంచి రింగ్లింగ్ బ్రదర్స్ సర్కస్ రైలు ప్రయాణించింది. ‘మేము ఆగిన చోట ఉంచి తెలిసినవాళ్లో స్నేహితులో వచ్చి నాకు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూపించేవారు.’ అన్నారామె. వీడ్కోలు వందేళ్ల క్రితం సర్కస్ మొదలైనప్పుడు దానికి ఉండే ప్రాభవం వందేళ్ల తర్వాత ఏ సర్కస్‌కూ లేదు. ఒక రకంగా మన్నా సర్కస్‌లపై చివరి ప్రభావం చూసినట్టు లెక్క. ఆమె రింగ్‌లింగ్స్‌లో 2004–2013 మధ్య పని చేశారు. ఆ తర్వాత ఇండియా వచ్చి చెన్నైలో స్థిరపడ్డారు. 2017లో ఆ సుదీర్ఘ చరిత్ర ఉన్న సర్కస్ మూతపడింది. ‘సర్కస్ ఒక వింత ప్రపంచం. అక్కడే పుట్టుకలు, చావులు, ప్రేమలు, గుండెకోతలు, కలయికలు, వీడ్కోళ్లు... ఎన్నో. అక్కడ ఉన్న 8 ఏళ్లు నేను ఎన్నో విలువైన అనుభవాలు మూటగట్టుకున్నాను. లోకం తిరగగా నాకు అర్థమయ్యింది ఏమిటంటే ప్రతి మనిషి బతకడానికి ప్రయత్నిస్తూ ఉంటాడని. సర్కస్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు అక్కడి ఏనుగుల గుంపు నన్ను కావలించుకొని సాగనంపాయి. అది మాత్రం మర్చిపోలేను’ అంటారామె. మన్నా అబ్రహమ్ తన అనుభవాలను గ్రంథస్తం చేస్తే అదొక విలువైన డాక్యుమెంటేషన్ అవుతుంది. ఆ పని చేస్తారని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
విదేశీ ప్రయాణాలపై నిషేధం పొడిగింపు
ఒటావో : కరోనా వ్యాప్తి నేపథ్యంలో విదేశీ ప్రయాణాలపై విధించిన నిషేధాన్ని కెనడా ప్రభుత్వం పొడిగించింది. యునైటెడ్ స్టేట్స్ నుంచి కెనడాలోకి ప్రవేశించే విదేశీ ప్రయాణికులపై నిషేధాన్ని ఆగష్టు 31 వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం కొత్తగా కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్‌ను ప్రారంభించింది. ఇది ప్రజలు కరోనా బారిన పడితే వారిని హెచ్చరించేందుకు సహయపడుతోంది. ఇది మొబైల్లోని యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉంది అని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తెలిపారు. (కెనడాలో తెలుగు యువకుడు మృతి) కాగా కెనడాకు అమెరికాతో సరిహద్దు ప్రయాణాలపై ప్రత్యేక ఒప్పందం ఉంది. ఇటీవల ఇరు దేశాలు అనవసర ప్రయాణాలపై ఆంక్షలను ఆగష్టు 21 వరకు పెంచేందుకు అంగీకరించాయి. అయితే తాజాగా కెనడాలో కరోనా మహమ్మారి కేసులు, మరణాలు అధికమవుతున్న నేపథ్యంలో విదేశీ ప్రయాణాలపై నిషేధాన్ని మరోసారి పొడిగించేందుకు నిర్ణయించాయి. మరోవైపు దేశంలో కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్పమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ అధికారి శుక్రవారం హెచ్చరికలు జారీ చేశారు. గురువారం నాటికి కెనడాలో మొత్తం కేసుల సంఖ్య1,15,799కు చేరాయి. ఇప్పటి వరకు 8,929 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. (విమానాలు కుప్పకూలి ఏడుగురు మృతి) -
సోలో రైడే.. సో బెటరు!
సాక్షి, హైదరాబాద్: దేశం, రాష్ట్రం అనీ తేడా లేకుండా కరోనా మహమ్మారి విస్తృతి పెరుగుతుండటంతో, దాన్ని నుంచి తప్పించుకునేందుకు ప్రజా రవాణా వాహనాలను పక్కనపెట్టి.. సొంత వాహనాలను వినియోగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వ్యక్తిగత ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ సొంత కార్లు, బైక్‌ల్లో ప్రయాణించేందుకు జనాలు మొగ్గుచూపుతున్నారు. వ్యక్తిగత వాహనాలు లేని వారు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఉన్నా సొంతంగా సెకండ్ హ్యాండ్ వాహనాన్నైనా సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జాతీయ సర్వేలు చెబుతున్నాయి. భౌతిక‘దూరం’పాటించేందుకు.. లాక్‌డౌన్‌కు ముందు ప్రభుత్వ, ప్రైవేటు రంగా ల్లో పనిచేసే వారితో పాటు, దూర ప్రయాణాలు చేసే వారు మెట్రో రైళ్లు, బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్‌లు వంటి ప్రజా రవాణానే వినియోగించేవారు. సొంత వాహనాలు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి ప్రజా రవాణా ద్వారానే ప్రయాణం సాగించే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మెట్రో రైలు సర్వీసులు లేకపోవడం, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో సిటీ బస్సులు నడపకపోవడంతో వ్యక్తిగత వాహనాలే ఎక్కువగా రోడ్డెక్కుతున్నాయి. ఆటోలు, క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉన్నా, కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న కారణంగా వాటిని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య తగ్గుతోంది. జిల్లాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తున్న వాటిల్లోనూ ప్రయాణికుల సంఖ్య 20–35 శాతానికి మించడం లేదు. గతంలో రాష్ట్ర ఆర్టీసీకి రోజుకు రూ.10 కోట్లు ఆదాయం వస్తే.. ఇప్పు డది రూ.2 కోట్లకు పడిపోయింది. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత సామాజిక దూరం పాటిస్తూ, వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని 70 % మంది అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్య రక్షణ కోసం తమ సొంత వాహనాలనే వినియోగిస్తున్న వారి సంఖ్య దేశంలో గతం కన్నా 19.8 % పెరిగిందని జాతీయ సర్వేలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో సొంత వాహనాలు వినియోగిస్తున్న వారు 25% పెరిగారని, అందుకే ప్రధాన కూడళ్ల వద్ద రద్దీ సాధారణం కన్నా అధికంగా ఉంటోందని ట్రాఫిక్ విభాగం చెబుతోంది. సెకండ్ హ్యాండ్ వాహనాలకు గిరాకీ... ఇక దేశ వ్యాప్తంగా సెకండ్ హ్యాండ్ వాహనాలకు గిరాకీ పెరిగింది. లాక్‌డౌన్‌కు ముందున్న ధరల తో పోలిస్తే సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్‌ల ధరలు తగ్గడంతో వీటిని కొనేందుకు అధిక శ్రద్ధ కనబరుస్తున్నారు. మారుతి స్విఫ్ట్,, హ్యుందాయ్ శాంట్రో, స్విఫ్ట్ డిజైర్, హోండా సిటీ, శాంట్రో జింగ్, వంటి కార్ల కొనుగోళ్లకు వినియోగదారులు ప్రాధాన్యమిస్తున్నట్లు కార్స్–24 తన సర్వేలో తెలిపింది. వ్యక్తిగత భద్రత దృష్ట్యా సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేస్తున్నట్లు సర్వే తేల్చింది. ఇక రాష్ట్రం లోని రామ్‌కోఠి, కింగ్ కోఠిలోనూ వీటి కొనుగోళ్లపై అధికులు ఆసక్తి కనబరుస్తున్నారని, ముఖ్యంగా హోండా యాక్టీవా, ప్యాషన్, స్కూటీలు కావాలని అడుగుతున్నారని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు. మెట్రో మొబిలిటీ సర్వీస్ ప్రొవైడర్ల సర్వే... ► దేశ వ్యాప్తంగా లాక్డౌన్ తర్వాత ప్రజా రవాణా తగ్గిన శాతం: 25 ► సొంత వాహనంలో ఇతరులను ఎక్కించుకునేందుకు ఇష్టపడని వారి శాతం: 67.5 ► వాహనాలను వారానికి ఓ సారి శానిటైజ్ చేస్తున్నవారి శాతం: 66 ► ఏసీ వినియోగాన్ని తగ్గించిన వారి శాతం: 26 ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణ దూరం(సగటున).. ► లాక్‌డౌన్‌కు ముందు: 15–30 కి.మీ. ► లాక్డౌన్ తర్వాత: 5–10 కి.మీ. ► (సామాజిక దూరంపై ప్రజల్లో పెరిగిన అవగాహన దృష్ట్యా దూరపు ప్రయాణాలు తగ్గినట్లు తెలుస్తోందని ఈ సర్వే వెల్లడించింది) సెకండ్ హ్యాండ్ వాహనాలపై కార్స్ 24 సర్వే ► లాక్డౌన్ తర్వాత కొనుగోలు పెరుగుదల: 25 శాతం ► లాక్డౌన్ ముందు ఒక కారు ధర (సగటున): 2.60 లక్షలు, తర్వాత ధర(సగటున): 2.25 లక్షలు ► లాక్డౌన్ తర్వాత బైక్ ధర(సగటున): 2535 వేలు -
రైలు ప్రయాణంపై కరోనా ఎఫెక్ట్
-
‘లిఫ్ట్ ప్లీజ్’ అని నగరాలను చుట్టొచ్చాడు!
సాక్షి, హైదరాబాద్: ఆ యువకుడు ‘లిఫ్ట్ ప్లీజ్’ అంటూ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఏకంగా దేశంలోని ప్రధాన నగరాలను చుట్టి వచ్చేశాడు. డబ్బుల అవసరం లేకుండానే రెండు దఫాల్లో సుమారు 12 వేల కి.మీ. మేర పర్యటించి చరిత్ర సృష్టించాడు నగరానికి చెందిన గ్రాఫిక్ డిజైనర్ వంగవేటి కరుణాకర్. 29 రోజుల పాటు సాగిన తన సుదీర్ఘ పర్యటనలో మహోన్నతమైన భారతీయ ఆత్మను సమున్నతంగా ఆవిష్కరించాడు. వైవిధ్యభరితమైన సంస్కృతులు, జీవన విధానాలు ఎన్నెన్ని ఉన్నా అంతిమంగా భారతీయులంతా ఒక్కటేనని నిరూపించాడు. దేశంలో ఎక్కడికి వెళ్లినా అతిథిలా ఆదరించి అక్కున చేర్చుకుంటారని నిరూపించాడు. ట్రావెలింగ్‌పై మక్కువతో ప్రపంచమంతా పర్యటించాలనే చిన్నప్పటి తన కలను సాకారం చేసుకునే తొలి అడుగు పడిందంటున్నాడు కరుణాకర్. ఆయన ఫ్రీ ట్రావెలింగ్ ఎలా సాగింది.. తనకు ఎదురైన అనుభవాలేమిటి? తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అలా మొదలైంది.. ‘లిఫ్ట్ ప్లీజ్’ అంటే ఏ వాహనదారైనా ఐదారు కి.మీ వరకు తీసుకెళ్తాడు. కానీ ఊళ్లకు ఊళ్లు.. రాష్ట్రాలు దాటించడం సాధ్యం కాదు. దేశ సరిహద్దుల వరకు వెళ్లలేం కదా. అటు నేపాల్‌లోని ఖాట్మండూ. ఇటు పాక్ సమీపంలోని అనూబ్‌ఘర్ వరకు కేవలం ఇతరుల సహాయంతో చేరుకోలేం కదా. కానీ అలాంటి సాహసోపేతమైన పర్యటనే చేశాడు కరుణాకర్. ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తుల సహాయంతో రోడ్డు మార్గంలో రకరకాల వాహనాలపై వెళ్లాడు. అలా వెళ్లే క్రమంలో కేవలం ఒక్క కి.మీ. తీసుకెళ్లినవారూ ఉన్నారు. 500 కి.మీ. వరకు దాటించినవారూ ఉన్నారు. నగరంలోని కృష్ణానగర్‌లో ఉన్న తన ఇంటి నుంచి ఓ బైక్ లిఫ్ట్ తీసుకొని బయలుదేరితే దారిలో ట్రక్కు, లారీ, కారు, సైకిల్, ఒంటెబండి.. ఇలా ఏ వాహనంలో చోటు లభిస్తే ఆ వాహనంలో వెళ్లాడు కరుణాకర్. సాహసమే ఊపిరిగా.. ప్రయాణం అంటేనే డబ్బులతో ముడిపడిన విషయం. అవి లేకుండా ప్రయాణం చేయడం సాహసమే. ‘మొదట మా ఊరికి వెళ్లాను. మాములుగా అయితే ఖమ్మం సమీపంలోని మా ఊరికి హైదరాబాద్ నుంచి 6 గంటల సమయం పడుతుంది. లిఫ్ట్ తీసుకొని వెళ్లడంతో 9 గంటలు పట్టింది. కానీ తిరుగు ప్రయాణంలో 5 గంటల్లోనే చేరుకున్నాను. ఈ అనుభవం నాకు గొప్ప దైర్యాన్ని ఇచ్చింది. ఆ స్ఫూర్తితోనే పర్యటన మొదలైంది అని చెబుతున్నాడు కరుణాకర్. అక్టోబర్‌లో 15 రోజుల పాటు రాజస్థాన్ ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణంలో చుట్టూ పొలాల మధ్యలో ఉన్న ఓ ఇంట్లో, ఓ పంజాబీ ఫ్యామిలీ ఆతిథ్యం స్వీకరించడం గొప్ప అనుభూతిగా మిగిలింది. అహ్మదాబాద్‌కు, ఉదయపూర్ మధ్యలో రాత్రి 2గంటల సమయంలో ప్రయాణం చేయాల్సివచ్చినప్పుడు ఓ ఆర్టీఓ అధికారి లిఫ్ట్ ఇచ్చాడు. ఈ ట్రిప్‌లో కార్లు, బైక్‌లు, ట్రక్కులు, ట్రాక్టర్లు, ఒంటెల బండ్లు, సైకిల్, బస్సు, అన్ని రకాల వాహనాల్లో వెళ్లాడు. రెండు దఫాలుగా.. కరుణాకర్ భారత యాత్ర రెండు దఫాలుగా సాగింది. మొదట హైదరాబాద్– రాజస్థాన్ వరకు వెళ్లి వచ్చాడు. 15 రోజుల్లో మొత్తం3,500 కి.మీ చుట్టొచ్చాడు. ముంబై, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, బికనీర్, అనూబ్‌ఘర్, శ్రీగంగానగర్, జైపూర్ మీదుగా తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు.