trivendra singh rawat
-
సీఎం పదవికి రాజీనామా: నాలుగో వ్యక్తి రూపానీ.. ముందు ముగ్గురు ఎవరంటే
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న గుజరాత్లో బీజేపీ కీలక మార్పులకు తెర తీసింది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం తన పదవికీ రాజీనామా చేశారు. పటేల్ సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ అధిష్టానం విజయ్ రూపానీతో రాజీనామా చేయించిందనే వార్తలు వెలువడుతున్నాయి. తదుపరి సీఎం రేసులో ఉన్న వారి పేర్లు చూస్తే ఈ వార్తలు వాస్తవమే అనిపిస్తున్నాయి. గుజరాత్ కొత్త సీఎం రేసులో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, ఎంపీ సీఆర్ పటేల్, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గుజరాత్ నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించబోయేది ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. అయితే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాల్లో ఇలా ముఖ్యమంత్రులతో రాజీనామా చేయించడం బీజేపీకి పరిపాటిగా మారింది. ఇలా అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం పదవికి రాజీనామా చేసిన వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నాల్గవ వ్యక్తి. గతంలో కర్ణాటక, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రుల చేత బీజేపీ అధిష్టానం ఇలానే రాజీనామా చేయింది. రాజీనామాలు చేయించడం ఎందుకు.. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా ప్రాంతాల్లో విజయం కోసం బీజేపీ వేర్వేరు వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత సీఎం పనితీరు, వారిపై ఉన్న వ్యతిరేకత-వివాదాలు, ఆయా రాష్ట్రాల్లో పార్టీకి మేజర్ ఓటు బ్యాంకు ఇలా తదితర అంశాల ఆధారంగా బీజేపీ పావులు కదుపుతోంది. తాజాగా కర్ణాటక, గుజరాత్లో పరిశీలించినట్లయితే.. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ మెజారిటీ ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగానే సీఎంల చేత రాజీనామా చేయించింది. ఈ క్రమంలో యడ్డీ రాజీనామా తర్వాత కర్ణాటకలో తనకు గట్టి మద్దతుదారులైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బసవరాజు బొమ్మైనే ముఖ్యమంత్రిగా నియమించింది. ఇక గుజరాత్లో కూడా పటేల్ సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగా నూతన ముఖ్యమంత్రిగా ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే అవకాశం ఇవ్వనున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. ఇక బీజేపీ ముఖ్యమంత్రులతో రాజీనామా చేయించిన మిగతా రాష్ట్రాలు ఏవి అంటే.. 1. జూలై 2021: కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేసిన యడ్డీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తర్వత.. ఈ ఏడాది జూలై 26 న, బీఎస్ యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. యడ్డీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన, అతడి కుమారుడిపై పెద్ద ఎత్తున ప్రజాగ్రాహం వెల్లడయ్యింది. అంతేకాక పార్టీ రాష్ట్ర విభాగంలోని ఒక నిర్దిష్ట విభాగం యడ్డీని పదవి నుంచి తొలగించాలని బీజేపీ అధిష్టాన్నాన్ని డిమాండ్ చేసింది. యడియూరప్పపై పెరుగుతున్న ఆగ్రహం.. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ యడ్డీ చేత రాజీనామా చేయించింది. 75 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు పరిమితి కారణంగానే 78 ఏళ్ల యడ్డీ చేత రాజీనమా చేయించినట్లు బీజేపీ తెలిపింది. ఆయన స్థానంలో బీజేపీ తోటి లింగాయత్ అయిన 61 ఏళ్ళ బసవరాజు బొమ్మైని ముఖ్యమంత్రిగా నియమించింది. బొమ్మై గతంలో యడ్డీ మంత్రివర్గంలో హోంమినిస్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. (చదవండి: బీజేపీకి షాకివ్వనున్న యడియూరప్ప? బల నిరూపణకు సై) 2. జూలై 2021: ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ రాజీనామా మార్చి 2021 లో త్రివేంద్ర సింగ్ రావత్ తన రాజీనామాను సమర్పించిన తర్వాత తీరథ్ సింగ్ రావత్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తీరథ్ సింగ్ ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడం చేత ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మార్చిలో పదవి చేపట్టినప్పటి నుంచి అమ్మాయిల చిరిగిన జీన్స్‌పైన, ఆధ్యాత్మికతతో కరోనాపై పోరాటం లాంటి తీరథ్ వ్యాఖ్యలు పలు వివాదాలు రేపాయి. కరోనా రెండో ఉద్ధృతి వేళ కుంభమేళా నిర్వహణ తెచ్చిన చెడ్డపేరు, పార్టీలోనూ – పాలనలోనూ గందరగోళం... ఇలా అన్నీ కలిసి ఆయనకు పదవీగండం తెచ్చాయి. ఫలితంగా తీరథ్ ఈ ఏడాది జూలై 2021న తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో పుష్కర్ సింగ్ ధామీ ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. (చదవండి: ఐదు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా..) 3. మార్చి 2021: ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ త్రివేంద్ర సింగ్ రావత్ మార్చి 9 వ తేదీన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2017, మార్చి 18న రావత్ ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకుగాను 57 సీట్లను బీజేపీ గెలుచుకుంది. అయితే పార్టీలోని చాలా మంది నాయకులు రావత్ ముఖ్యమంత్రి పదవిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రావత్ తమ మాట వినలేదని ఫిర్యాదు చేశారు. రావత్ పని తీరును కూడా వారు వ్యతిరేకించారు. ఈ క్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి అధిష్టానం వద్ద తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దాంతో రావత్‌ను పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పిలిచింది. ఈ మీటింగ్ అనంతరం రావత్ తన రాజీనామాను గవర్నర్ బేబీ రాణి మౌర్యకు రాజ్‌భవన్‌లో సమర్పించారు. ఆయన స్థానంలో తీరత్ సింగ్ తెరపైకి వచ్చారు. ఆయన కూడా నాలుగు నెలల్లో రాజీనామా చేయడం గమనార్హం. తాజాగా విజయ్ రూపానీ రాజీనామా చేసిన నాల్గవ సీఎంగా నిలిచారు. చదవండి: అనివార్యతే వేటుకి కారణమైందా? -
అనివార్యతే వేటుకి కారణమైందా?
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దేవభూమి ఉత్తరాఖండ్‌లో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. సుమారు 4 నెలల క్రితం ముఖ్యమంత్రిగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ నుంచి అధికారపగ్గాలు చేపట్టిన తీరత్ సింగ్ రావత్ రాజీనామాతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తీరత్ సింగ్ స్థానంలో పుష్కర్ సింగ్ ధమీని బీజేపీ అధిష్టానం ఎంపిక చేసినప్పటికీ అసలు ఆయనను ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అధిష్టానం ఆశీస్సులతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తీరత్ సింగ్ ఎందుకు పగ్గాలను వదులుకోవాల్సి వచ్చిందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 115 రోజుల ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రాజీనామాకు రాజ్యాంగ సంక్షోభమే కారణం లేక రాష్ట్రంలో ప్రస్తుతం ఆగ్రహంగా ఉన్న పూజారులు, సాధుసంతువులు, భక్తులే కారణమా అనేది నేరుగా చెప్పడం కష్టమైన అంశం. అయితే త్రివేంద్ర సింగ్ రావత్‌ని సీఎం పదవి నుంచి తప్పించడంలో, తీరత్ సింగ్ రావత్‌ను అధికార పీఠంపై కూర్చోపెట్టడంలో రాష్ట్రంలోని పూజారులు, సాధువుల అసంతృప్తే ప్రధాన కారణమని స్పష్టమౌతోంది. రావత్ ముఖ్యమంత్రి అయిన తరువాత పరిస్థితిలో మార్పు వస్తుందని సాధువులు, పూజారులు భావించారు. కానీ, సీఎంగా ఈ 115 రోజుల్లో తీరత్ సింగ్ రావత్ వారు ఊహించిన విధంగా అద్భుతాలు ఏవీ చేయలేకపోయారు. కాగా అనేక వివాదాస్పద ప్రకటనలు చేశారు. పార్టీపై ప్రజల్లోని ప్రతికూలతలు దూరం అవుతాయా? వచ్చే ఏడాది మొదట్లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం మరోసారి అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే అక్కడ ఉన్న సాధువులు, పూజారులు, వారి భక్తులను తమకు అనుకూలంగా మార్చుకోవాల్సిన గత్యంతర పరిస్థితి ఉంది. అందువల్లే దేవభూమిలో ముఖ్యమంత్రి మార్పు ఇప్పుడు అనివార్యంగా మారింది. ఎన్నికల్లోగా పార్టీపై క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతికూలతలను దూరం చేయడంలో తీరత్ సింగ్ వైఫల్యం చెందడంతో పాటు, ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి మరింత నష్టం చేకూర్చాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తీరత్ సింగ్‌ను కొనసాగించడానికి అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిలోగా ఎలాంటి ఉప ఎన్నికలను నిర్వహించలేమని కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్పష్టత ఇవ్వడంతో ఆయనతో రాజీనామా చేయించారని తీరత్ సన్నిహితులు తెలిపారు. కానీ, కమలదళంలో అంతర్గత విబేధాలు, ఫిర్యాదులు, అసంతృప్తి కారణంగానే తీరత్‌ను పక్కనబెట్టారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అందువల్లే పార్టీ హైకమాండ్ సమాలోచనలు జరిపి ప్రజల్లో సరళమైన ఇమేజ్ ఉన్న పుష్కర్ సింగ్ ధమీని ఎంపికచేసింది. ఆయన ధుమ్కా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉండడంతో తీరత్ సింగ్ విషయంలో ఎదురైన రాజ్యాంగ సంక్షోభం మరోసారి ఏర్పడరాదనే ఉద్దేశ్యంతో కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ పేరును ప్రతిపాదనల నుంచి తప్పించారని తెలిసింది. దేవస్థానం బోర్డుపై నియంత్రణ కారణమా...: రాష్ట్రంలో దేవస్థానం బోర్డుపై ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతుండటంపై అర్చక సమాజం ఆగ్రహంగా ఉంది. త్వరలోనే 51 దేవాలయాలను, ఉత్తరాఖండ్ దేవస్థానం బోర్డును ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పిస్తానని ఈ ఏడాది ఏప్రిల్ 9న తీరత్ సింగ్ రావత్ తన పుట్టిన రోజున హరిద్వార్‌లో హామీ ఇచ్చారు. కానీ ఈ నిర్ణయంపై ఎలాంటి పురోగతి లేదు. దీంతో పూజారులు ధర్నా మొదలుపెట్టారు. దేవస్థానం బోర్డు రద్దు చేయాలని కోరుతూ జూన్ 29న చార్ధామ్ తీర్థ్ పురోహిత్ మహా పంచాయత్ సమితి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్లకు సైతం మహా పంచాయత్ లేఖలు రాసి ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. కొంపముంచిన చార్ధామ్ యాత్ర రద్దు ఉత్తరాఖండ్ జీవనాడి అయిన చార్ధామ్ యాత్ర రద్దు వ్యవహారంలోనూ పూజారులు ఆగ్రహంగా ఉన్నారు. యాత్రను రద్దు చేయాలని ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు తీరత్ సింగ్ ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేసింది. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ సాధువుల సమాజానికి ఎలాంటి రక్షణ ఇవ్వలేరనే విధంగా ఒక సందేశం ప్రజల్లో ప్రచారమైంది. ఇలాంటి అనేక కారణాల వల్ల తప్పని సరి పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కమలదళం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ట్రోలింగ్: ‘కరోనాకు కూడా మనలాగే జీవించే హక్కుంది’
డెహ్రాడూన్: భారత్‌లో కరోనా రెండో దశ విరుచుకుపడుతోంది. మహమ్మారి కట్టడికి రాత్రి కర్ఫ్యూ, లాక్డౌన్ వంటి చర్యలు చేపడుతున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు రికార్డ్ స్థాయిలో మరణాలు సంభవిస్తుండటం ఆందోళనకరంగా మారుతోంది. కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కూడా ఓ జీవిలాంటిదని, కరోనా కూడా మనలాగే జీవించే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. తన మనుగడ కోసమే వైరస్ రూపాన్ని మారుస్తున్నదని త్రివేంద్రసింగ్ వెల్లడించారు. ఒక తాత్విక కోణం నుంచి చూస్తే కరోనా వైరస్ కూడా ఒక జీవి. అందరిలాగా దానికి జీవించే హక్కు ఉంది. కానీ మనం (మనుషులు) దాని కంటే తెలివైనవాళ్లమనుకుంటాం. మనం దానిని నాశనం చేస్తున్నాం. అందుకే కరోనా వైరస్ నిరంతరం మారిపోతోంది’ అని త్రివేంద్ర సింగ్ రావత్ వింత వ్యాఖ్యలు చేశారు అయితే మానవులు సురక్షితంగా ఉండాలంటే వారు వైరస్‌ను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా త్రివేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన ప్రకటనపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఓవైపు కోవిడ్ సెకండ్ వేవ్‌తో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే ఇలాంటి మాటలేంటని పలువురు విమర్శలు చేస్తున్నారు. అంతేగాక ఈ వైరస్ సెంట్రల్ విస్టాలో ఆశ్రయం ఇవ్వాలని ఒక వినియోగదారు చురకలంటించాడు. కరోనాకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా ఉండాలని నేషనల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ విమర్శించారు. మరోవైపు గత 24 గంటల్లో భారతదేశంలో 3,43,144 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా.. 4,000 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: వ్యాక్సిన్లతో పాటు ప్రధాని కూడా కనపడుట లేదు 'ఆ సమయంలో నా బిడ్డ ఎంత బాధ అనువించిందో' -
ఉత్తరాఖండ్ సీఎం రాజీనామా
డెహ్రాడూన్: అసమ్మతి వార్తల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వంతో సమావేశం అనంతరం డెహ్రాడూన్‌కు తిరిగివచ్చిన సీఎం రావత్ రాజ్‌భవన్‌లో గవర్నర్ బేబీ రాణి మౌర్యను కలిసి రాజీనామా పత్రం సమర్పించారు. కొత్త సీఎంను ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభాపక్షం బుధవారం సమావేశమవుతుందని వెల్లడించారు. రాష్ట్ర మంత్రి ధన్సింగ్ రావత్, ఎంపీలు అజయ్‌భట్, అనిల్ బలూనీలు రేసులో ఉన్నప్పటికీ.. ధన్ సింగ్‌కే తదుపరి సీఎం అయ్యే చాన్సుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజీనామా సమర్పించే ముందు తన అధికార నివాసంలో మంత్రులు ధన్సింగ్, మదన్ కౌశిక్ సహా పలువురు సన్నిహితులతో రావత్ సమావేశమయ్యారు. రాజీనామా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పాలనను మరొకరు చేపట్టాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. మరొకరికి సీఎంగా అవకాశం కల్పించాలన్న పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తానని, తదుపరి సీఎంకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అకస్మాత్తుగా సీఎం మార్పునకు కారణమేంటన్న ప్రశ్నకు.. అది ‘పార్టీ నాయకత్వం ఒక్కటిగా తీసుకున్న నిర్ణయం. ఇంకా వివరాలు కావాలంటే ఢిల్లీ వెళ్లి అడగండి’అని సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రిగా తాను చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా రావత్ మీడియాకు వివరించారు. భర్త తరఫు వారసత్వ ఆస్తిపై భార్యకు కూడా హక్కు కల్పిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను గుర్తు చేశారు. మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బన్సిధర్ భగత్, ధన్సింగ్ రావత్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అధికార మార్పిడి సజావుగా సాగేందుకు వీలుగా రమణ్ సింగ్, దుష్యంత్ గౌతమ్‌లను పరిశీలకులుగా డెహ్రాడూన్ పంపించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. 2000 నవంబర్‌లో ఉత్తర ప్రదేశ్ నుంచి విడిపడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఇప్పటివరకు కాంగ్రెస్ నేత ఎన్డీ తివారీ మినహా ఏ ముఖ్యమంత్రి కూడా పూర్తిగా ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగకపోవడం ఉత్తరాఖండ్ ప్రత్యేకత. 2017, మార్చి 18న రావత్ ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకుగాను 57 సీట్లను బీజేపీ గెలుచుకుంది. సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌పై అసమ్మతి పెరుగుతోందన్న సమాచారంతో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, పార్టీ నేతల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు రమణ్‌సింగ్, దుష్యంత్ గౌతమ్‌లను పార్టీ నాయకత్వం గత శనివారం రాష్ట్రానికి పంపించింది. వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే.. సీఎం పదవికి రావత్ రాజీనామా చేయడంపై విపక్ష కాంగ్రెస్ స్పందించింది. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజీనామా అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించింది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విషయంలో విఫలం చెందామని ఈ రాజీనామాతో బీజేపీ అంగీకరించిందని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దేవేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని రాష్ట్రపతిని డిమాండ్ చేశారు. -
ఉత్తరాఖండ్ విలయం: పంత్ భావోద్వేగం
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో సంభవించిన ధౌలిగంగా విషాదం యావత్ దేశ ప్రజలను కలచివేస్తోంది. హిమాలయ మంచుకొండలు విరిగిపడటంతో ఒక్కసారిగా ఉప్పొంగిన ధౌలిగంగా.. 170 మంది కార్మికుల ఆచూకీ లభ్యం కాకుండా చేసింది. అనూహ్యంగా సంభవించిన గంగ ధాటికి నది పరివాహంలోని అనేక ప్రాంతాలు భయం గుప్పిట చిక్కుకున్నాయి. ఆదివారం రాత్రి మరోసారి కొండచరియలు విరగడంతో నది ఉధృతి మరింత పెరిగింది. సహాయ చర్యల్లో నిమగ్నమైన సిబ్బంది ఇప్పటి వరకు 10 శవాలను వెలికి తీయగా.. అతికష్టం మీద 16 మంది రక్షించగలికారు. తపోవన్ వద్ద పనిచేస్తున్న 148 మంది, రిషిగంగ వద్దనున్న 22 మంది మొత్తం 170 మంది అచూకీ ఇంకా లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు నది ప్రవాహం మరింత పెరగడం సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, సహాయ సిబ్బందితో మాట్లాడిన మోదీ, అమిత్ షా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. యావత్ దేశ ఉత్తరాఖండ్ ప్రజల కోసం ప్రార్థిస్తోందంటూ మోదీ భరోసా ఇచ్చారు. మరోవైపు ధౌలిగంగా ఘటనపై దేశవ్యాప్తంగా ప్రముఖులు స్పందిస్తున్నారు. వరదలో చిక్కుకున్న కార్మికులు క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నారు. రిషభ్ పంత్ విరాళం.. ఈ క్రమంలోనే టీమిండియా యువ సంచలనం రిషభ్ పంత్ ఉత్తరాఖండ్ జల విలయంపై ఆవేదన వ్యక్తం చేశారు. వరదలో కార్మికులు మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు తొలి టెస్ట్ మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటించాడు. ఈ మేరకు సోమవారం పంత్ ట్వీట్ చేశాడు. ‘ధౌలిగంగా ఘటన చోటుచేసుకోవడం ఎంతో కలచివేసింది. ఈ ఘటనలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. నా వంతు సాయంగా తొలిటెస్ట్ మ్యాచ్ ఫీజును విరాళంగా అందిస్తున్నాను. ఈ మొత్తాన్ని అక్కడి సహాయ చర్యల కొరకు అందిస్తాను.’ అని భావోద్వేగంగా ట్వీట్ చేశాడు. అంతేకాకుండా హిమాలయ రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిందిగా ట్విటర్ వేదికగా పంత్ కోరాడు. కాగా చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలిటెస్ట్‌లో పంత్ ఆడుతున్న విషయం తెలిసిందే. 88 బంతుల్లో 91; (9 ఫోర్లు, 5 సిక్సర్లు) కీలక ఇన్సింగ్స్‌తో కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ పంత్ స్వస్థలమైన విషయం తెలిసిందే. చదవండి : జల విలయం : 170 మంది మృతిచెందినట్లేనా? -
విషాదం: 170 మంది మరణించినట్లేనా?
డెహ్రాడూన్ : ధౌలిగంగా నది ఉగ్రరూపం ఉత్తరాఖండ్ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆకస్మికంగా సంభవించిన జల విలయం ఆరాష్ట్ర ప్రజలను తీవ్రం ఆందోళనకు గురిచేస్తోంది. వరద ఉధృతిలో కొట్టుకుపోయిన 170 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించకపోవడం, కొంతమంది తీర ప్రాంతాలకు కొట్టుకువచ్చిన శవాలుగా మిగిలిపోవడం కలవరానికి గురిచేస్తోంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఐటీబీపీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇతర సిబ్బంది సహాయ చర్యలను ముమ్మరం చేసినప్పటికీ వారి అచూకీ లభ్యంకాకపోవడంతో నది ఉధృతికి కొట్టుకుపోయిన 170 మంది మరణించినట్లుగానే ప్రభుత్వం భావిస్తోంది. నది పరివాహాక ప్రాంతాల్లో జల్లెడపడుతున్నా కొద్దీ శవాలు బయపడుతున్నాయి. ఇప్పటి వరకు 10 శవాలను గుర్తించగా.. మొత్తం 16 మందిని సహాయ బృందాలు కాపాడగలిగాయి. (ఉత్తరాఖండ్‌లో జల విలయం) దీనిపై సోమవారం స్పందించిన ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్.. గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోందన్నారు. రెండో తపోవన్ టన్నెల్స్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామన్నారు. అయితే వారి అచూకీ లభించకపోవడం ఆందోళక కలిగిస్తోందన్నారు. మంచుకొండ విరిగిపడటంతో ఆదివారం అర్థరాత్రి మరోసారి ధౌలిగంగా పరివాహా ప్రాంతాల్లో నీటి మట్టం పెరిగింది. దీంతో అలకనంద, ధౌలీగంగ, రుషిగంగ నదీ ప్రాంతాల్లో విపత్తు సంభవించింది. వరద ఉధృతి భారీగా పెరగడంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ధౌలిగంగకు వరదతో రుషిగంగలో పెరిగిన నీటి ప్రవాహం భారీగా పెరిగింది. నది ఉధృతికి తీరగ్రామాల్లో చాలావరకు ఇళ్లు కొట్టుకుపోయాయి. దీంతో నది తీరప్రాంతాల గ్రామాలను ప్రభుత్వం ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. మరోవైపు ధైలిగంగా ఉధృతితో గంగానదీ తీరప్రాంత రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఉత్తరాఖండ్, గంగానదీ తీర ప్రాంతాల్లో పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరాతీశారు. ఎప్పటికప్పుడు అక్కడి అధికారులను సంప్రదిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అయితే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉండటంతో యావత్‌దేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. వరదలో కొట్టుకుపోయిన వారు సురక్షితంగా బయటపడాలని ప్రార్థనలు చేస్తున్నారు. -
ముఖ్యమంత్రిగా డిగ్రీ విద్యార్థిని
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా 20 ఏళ్లు కూడా నిండని ఓ యువతి బాధ్యతలు చేపట్టనుంది. అయితే ముఖ్యమంత్రిగా ఉండేది మాత్రం ఒక్కరోజే. ఒకే ఒక్కడు సినిమాలో మాదిరి ఆ యువతి విధులు నిర్వహించనుంది. ఎందుకంటే జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకోనుంది. ప్రతియేటా జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అందులో భాగంగా రేపు జరగబోయే బాలికా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం కుర్చీలో బాలిక కూర్చోనుంది. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇంతకీ సీఎం కుర్చీలో కూర్చునేది ఎవరో కాదు హరిద్వార్ జిల్లా దౌలత్‌పూర్ గ్రామానికి చెందిన సృష్టి గోస్వామి. ఈమె బీఎస్సీ డిగ్రీ చదువుతోంది. ఉత్తరాఖండ్ బాలికల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ మేరకు సృష్టిని ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఆదివారం ఉత్తరాఖండ్ వేసవి రాజధాని అయిన గైర్‌సెన్‌లో సృష్టి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌తో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై సమీక్ష నిర్వహించనుంది. ఆయుష్మాన్‌భవ, స్మార్ట్ సిటీ, పర్యాటకతో పాటు ఇతర శాఖల కార్యక్రమాలు, పథకాలపై అధికారులతో సీఎం హోదాలో సృష్టి చర్చించనుంది. ఈ సమీక్షకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని.. నివేదికలు రూపొందించి సమావేశానికి రావాలని ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రేపు ఉత్తరాఖండ్‌లో నవ పాలన సాగనుంది. అయితే సృష్టి గోస్వామి 2018లో ఉత్తరాఖండ్ బాలల అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించింది. 2009లో థాయిలాండ్‌లో జరిగిన బాలికల అంతర్జాతీయ లీడర్షిప్ కార్యక్రమానికి సృష్టి హాజరైంది. -
సీఎం రావత్‌కు అస్వస్థత, ఎయిమ్స్‌కు తరలింపు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. సీఎంకు ఛాతీలో ఇన్ఫెక్షన్ పెరిగినట్లు ఎయిమ్స్ వర్గాలు నిర్ధారించాయి. కాగా, ఈనెల 18న సీఎం రావత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో అప్పటి నుంచి ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే, ఆయనకు జ్వరంగా ఉండటంతో ఆదివారం సాయంత్రం డెహ్రాడూన్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నుంచి నేడు ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు. ఇక కేబినెట్ భేటీలో పాల్గొన్న మంత్రి సాత్పాల్ మహరాజ్‌కు కరోనా నిర్ధారణ కావడంతో జూన్ 1న ఓసారి క్వారంటైన్‌కు వెళ్లిన సీఎం, తన కార్యాలయంలో పనిచేసే ఓఎస్డీకి కరోనా సోకడంతో ఆగస్టు 26న మరోసారి ఐసోలేషన్‌కు వెళ్లారు. -
డెహరాడూన్లో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, న్యూఢిల్లీ: డెహరాడూన్ పౌరులు మొదటిసారిగా శబ్దం లేని, జీరో ఎమిషన్‌తో కూడిన ఎలక్ర్టిక్ బస్సులలో ప్రయాణం చేయబోతున్నారు. ఈ బస్సులను దేశంలో ఎలక్ర్టిక్ ప్రజా రవాణా వ్యవస్థలో అగ్రగామి అయిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ అందిస్తోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేది సింఘ్ రావత్ శుక్రవారం ఈ బస్సులకు పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రావత్ మాట్లాడుతూ “ఈ సంవత్సరంలో 30 ఎకో ఫ్రెండ్లీ బస్సులను ప్రారంభించడానికి ప్రణాళికలు చేస్తున్నాం. ఈ బస్సులు డెహరాడూన్, ముస్సోరీ, రిషికేశ్, హరిద్వార్ కొండ ప్రాంతాల్లో కూడా తమ ప్రయాణాన్ని సాగిస్తాయని" తెలిపారు. (చదవండి: కార్ల మార్కెట్లో ఆ 5 కంపెనీలదే హవా) తొమ్మిది మీటర్ల పొడవు ఉన్న ఈ ఏసీ బస్సులో డ్రైవర్, 25 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో పాటు వీల్ చెయిర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ నియంత్రిత ఎయిర్ సస్పెన్షన్ తో ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణం పొందగలరు. ప్రయాణికుల రక్షణ కొరకు బస్సులో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగులు, వృద్ధులకు ఇబ్బంది లేకుండా బస్సులో హైడ్రాలిక్ వీల్ చెయిర్ ర్యాంప్, ఎమర్జెన్సీ బటన్, యూఎస్ బీ సాకెట్ ఉంటుంది. బస్సులో అమర్చిన లిథియమ్-ఇయాన్ (Li-ion) బ్యాటరీని ఒకసారి చార్జింగ్ ద్వారా దాదాపు 180 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ అత్యాధుని సాంకేతిక ఎలక్ట్రిక్ బస్సులో ఉన్న ప్రత్యేకమైన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ద్వారా ప్రయాణంలో ప్రతిసారి బ్రేక్ వేసినప్పుడు కోల్పోయిన చార్జింగ్‌ను కొంతమేరకు తిరిగి పొందుతుంది. ఇందులో ఉన్న అతి శక్తివంతమైన ఏసీ చార్జింగ్ వ్యవస్థ ద్వారా బ్యాటరీ 3 నుంచి 4 గంటల్లో మొత్తం చార్జింగ్ అవుతుంది.(చదవండి: లాజిస్టిక్స్ కంపెనీలకు వ్యాక్సిన్ల బూస్ట్) ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ప్రతినిధులు మాట్లాడుతూ, దేశంలో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను మరో రాష్ట్రంలో కూడా నడపడం చాలా గర్వంగా ఉందన్నారు. ఉత్తరాఖండ్ జీవావరణాన్ని సంరక్షించడంలో భాగం ఈ ఎలక్ట్రిక్ బస్సులు తమ వంతు పాత్ర పోషిస్తాయన్నారు. సమర్థవంతమైన విద్యుత్ ప్రజా రవాణా వ్యవస్థతో కాలుష్యాన్నితగ్గించే కృషిలో ఒలెక్ట్రా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే ఉత్తరాఖండ్ లో కూడా ప్రవేశపెట్టిన ఈ 30 ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా తమ సేవలు అందిస్తాయని తెలిపారు. ఇప్పటికే ముంబాయి, పూణె, నాగ్ పూర్, హైదరాబాద్, కేరళలో తాము అందుబాటులోకి తెచ్చిన ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే తమ ప్రామాణికతను సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. ఒలెక్ట్రా కంపనీ ఇప్పటికే వివిద రాష్ట్రాలలో 280 బస్సులను సరఫరా చేసింది. దేశ రహదారులపై పౌర రవాణా వ్యవస్థలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే 2 కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశాయి. CO2 ఉద్గారాలను 13000 టన్నుల మేరకు తగ్గించింది. ఇది లక్ష చెట్లు నాటాడానికి సమానం. మనాలి నుండి రోహ్తాంగ్ పాస్ వరకు ఎత్తైన కొండల్లో కూడా ఒలెక్ట్రా బస్సులు ప్రయాణం సాగిస్తున్నాయి. ఒలెక్ట్రా కంపనీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా నమోదయింది. ఎలక్ర్టిక్ బస్సు నిర్మాణ రంగంలో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది అలాగే FAME-II లో భాగంగా మంజూరు చేసిన 5595 బస్సుల్లో 20 శాతం మేరకు ఒప్పందాలను సాధించింది. ఇక గుజరాత్ ముఖ్యమంత్రి విజయ రూపాణి రేపు (శనివారం) ఒలెక్ట్రా ఎలక్ర్టిక్ బస్సుల ట్రయల్ రన్ కు సూరత్ లో ప్రారంభించనున్నారు. సూరత్ మునిసిపల్ కార్పోరేషన్ కు ఒలెక్ట్రా కంపనీ 150 ఎలక్ర్టిక్ బస్సులను దశల వారీగా సరఫరా చేయనుంది. అలాగే సిల్వాసా కు కూడా 25 ఎలక్ర్టిక్ బస్సులను అందిస్తుంది. వీటి ట్రయల్ రన్ వచ్చే వారం చేయబోతున్నారు. ఫేమ్-II లో భాగంగా వివిధ రాష్ట్రాలకు 775 ఎలక్ర్టిక్ బస్సులను ఒలెక్ట్రా దశల వారీగా అందించనుంది. ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ 2000లో స్థాపించబడింది. ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపనీ. 2015లోనే దేశంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన సంస్థ కావడం విశేషం. -
కరోనా: ముఖ్యమంత్రికి నెగటివ్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌కు కరోనా నెగటివ్‌గా నిర్ధారణ కావడంతో ప్రభుత్వ యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. రాష్ట్ర మంత్రి సాత్పాల్ మహరాజ్‌కు వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అయితే, సీఎం త్రివేంద్ర సింగ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో మరో ముగ్గురు మంత్రులతో పాటు సాత్పాల్ మహరాజ్ కూడా పాల్గొన్నారు. దీంతో ముఖ్యమంత్రి రక్త నమూనాలను కోవిడ్ నిర్ధారణకు పంపగా నెగటివ్ వచ్చింది. ఇక కేబినెట్ భేటీలో పాల్గొన్న మిగతా మంత్రులు కోవిడ్ పరీక్షలు చేయించుకోకపోవడం గమనార్హం. డెహ్రాడూన్ జిల్లా ఆరోగ్య విభాగం అధికారులు తాము సాత్పాల్తో కాంటాక్ట్ అయ్యే అవకాశాలు లేవని, తమకు కరోనా రిస్కు లేదని చెప్పారని వెల్లడించారు. అందుకనే పరీక్షలు చేయించుకోలేదని మంత్రులు మదన్ కౌశిక్, హరాక్ సింగ్ రావత్, సుబోధ్ యునియాల్ తెలిపారు. అయినప్పటికీ కేంద్రం మార్గదర్శకాల ప్రకారం జూన్ 1న రెండు వారాలపాటు స్వీ య నిర్బంధంలోకి వెళ్తున్నట్టు చెప్పారు. కానీ, మూడు రోజులు కాగానే గురువారం నుంచి యాధావిధిగా విధులకు హాజరయ్యారు. -
ఆ పుణ్యక్షేత్రాల దర్శన భాగ్యం లేనట్టేనా!
డెహ్రాడూన్: మే 15 నుంచి ప్రముఖ విష్ణ ఆలయం బద్రినాధ్ పుణ్యక్షేత్రం తెరుచుకోనుంది. మే15 ఉదయం 4:30 గంటలకు బద్రీనాధ్ ఆలయ ద్వారాలు తెరవడం జరుగుతుందని ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గత నెలలోనే ప్రకటించారు. ఆరు నెలల తరువాత మంచు కరిగి ఆలయం కనిపించడంతో మళ్లీ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. అయితే ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడితో కలిపి కేవలం 27 మందిని మాత్రమే అనుమతించనున్నారు. (కరోనా క్యాబ్‌లు వచ్చేశాయ్!) కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో భక్తులను ఎవరిని ఆలయంలోకి అనుమతించడం లేదని చమోలీ సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ అనిల్ ఛన్యాల్ తెలిపారు. ‘గాడు గాథ’ సంప్రదాయం ప్రకారం స్వామి వారికి నువ్వుల నూనెతో చేసే కైంకర్యాలను కూడా గత వారం నిర్వహించారు. ఆరు నెలల విరామం తరువాత కేథరినాధ్, బద్రినాధ్ ఆలయాలు తెరుచుకోబడ్డాయి. మంచు కారణంగా ఈ ఆలయాలు ఆరు నెలల పాటు ప్రతి యేడాది మూసివేయబడతాయనే విషయం తెలిసిందే. (కరోనా సాకుతో ఇంత అన్యాయమా?) -
హిమాలయాల చెంత టులిప్ తోట అందాలు!
అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది.. అంటూ హీరోహీరోయిన్లు డ్యూయెట్లు పాడుకోవడానికి ఇకపై మున్సియారీకి రావొచ్చు అంటున్నారు స్థానికులు. అందమైన రంగు రంగుల టులిప్ తోటల్లో హాయిగా విహరించవచ్చని పర్యాటకులను కూడా ఆహ్వానిస్తున్నారు. అల్లంత దూరాన.. హిమాలయాల్లోని పంచాచౌలి శ్రేణి అందాలు కనువిందు చేస్తుండగా.. పూల సువాసనలు ఆస్వాదించే అద్భుత అవకాశం సొంతం చేసుకోవాలని ఊరిస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే... పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం మున్సియారీ ప్రాంతంలో టులిప్ తోటల పెంపకాన్ని చేపట్టింది. పైలట్ ప్రాజెక్టుగా ఎరుపు, పసుపు, గులాబీ రంగు పూలనిచ్చే మొక్కల్ని అటవీ శాఖ అక్కడ నాటింది. ప్రపంచంలోని అతిపెద్ద టులిప్ తోటల్లో ఒకటిగా పేరుగాంచిన మున్సియారీ తోట ప్రస్తుతం విరబూసింది. (కనువిందు చేస్తున్న ఫ్లెమింగోలు..) ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ట్విటర్లో షేర్ చేశారు. తన కలల ప్రాజెక్టు విజయవంతమైందని.. ఈ విషయాన్ని ప్రజలతో పంచుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. పంచాచౌలి శ్రేణుల సమీపంలో మున్సియారీలో పెంచిన టులిప్ తోట ప్రపంచంలోని అతిపెద్ద టులిప్ తోటల్లో ఒకటని... దీని ద్వారా మున్సియారీ ప్రాంతంలో పర్యాటకం బాగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఇక సీఎం షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వేల సంఖ్యలో ఆయన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. టులిప్ తోట అందాలు తమను అమితంగా ఆకట్టుకుంటున్నాయని.. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలంటూ కామెంట్లు చేస్తున్నారు. విదేశీ సొగసులను తలదన్నే అందంతో మైమరపింపజేస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా మున్సియారీ వెళ్లాలనుకుంటున్నారా.. అయితే కరోనా పూర్తిగా కట్టడై లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాతే ట్రిప్‌ను ప్లాన్ చేసుకోండి!(ఇళ్ల ముందు నుంచే కనిపిస్తున్న మంచుకొండలు) I am happy to share the first pics of the successful pilot of my dream project- Munsiyari based Tulip Garden. Set amidst the backdrop of Panchachuli ranges, this garden will be one of the biggest tulip gardens in the world & will transform tourism in Munsiyari region. pic.twitter.com/eCUfnMYilt — Trivendra Singh Rawat (@tsrawatbjp) May 9, 2020 -
5 నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించిన సీఎం
డెహ్రాడున్: ప్రపంచాన్ని విషమ పరిస్థితుల్లోకి నెట్టిన కరోనా ప్రస్తుతం విలయ తాండవం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 7,87,225 కేసులు నమోదు కాగా 37,843 మంది మృతి చెందారు. సుమారు 200 దేశాలు దీని బారిన పడ్డాయి. దీంతో కరోనాతో పోరాడేందుకు ప్రజలు తమకు తోచిన విరాళాలు అందిస్తూ ప్రభుత్వాలకు మద్దతుగా నిలుస్తున్నారు. సామాన్య జనం నుంచి సెలబ్రిటీల దాకా, క్రీడాకారుల నుంచి పారిశ్రామిక వేత్తల దాకా అందరూ మేము సైతం అంటూ ముందుకు వచ్చి తమ ఉదారతను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన ఐదు నెలల జీతాన్ని సీఎం సహాయనిధికి అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. కాగా ఇప్పటికే ఆయన భార్య లక్ష రూపాయలు విరాళమందించగా, కుమార్తెలు రూ.52 వేల సాయం అందించారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. (ఉత్తరాఖండ్ సీఎం విచిత్ర వ్యాఖ్యలు..!) -
ఉత్తరాఖండ్ వేసవి రాజధాని ఏదంటే
-
ఏపీ బాటలో ఉత్తరాఖండ్..
గైర్సైన్ : ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా గైర్సైన్ను ఎంపిక చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఈ విషయాన్ని అసెంబ్లీలో పేర్కొన్నారు. గైర్సైను శాశ్వత రాజధానిగా చేయాలని కొంత కాలంగా పర్వత ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉత్తరాఖండ్ జ్యుడీషియల్ క్యాపిటల్‌గా డెహ్రాడూన్, జ్యుడీసియల్ రాజధానిగా నైనిటాల్ కొనసాగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గైర్సైన్లో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించారు. అధికారుల నివాస భవనాలు సహా పలు భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. గైర్సైన్ ప్రాంత సమీపంలో విమానాశ్రయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. -
డెంగ్యూనా? 650 ఎంజీ పారాసిటమాల్ వేసుకోండి!
డెహ్రాడూన్: ఎక్కడ చూసినా డెంగ్యూ ఫీవర్ హడలెత్తిస్తోంది. ఉత్తరాఖండ్‌ను డెంగ్యూ వణికిస్తోంది. వందలసంఖ్యలో రోగులు డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతూ.. ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 4,800 మందికి డెంగ్యూ ఫీవర్ సోకినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా డెహ్రాడూన్ ప్రాంతంలో డెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ మూడువేల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక తర్వాతి స్థానంలో హల్ద్వానీ ప్రాంతం ఉంది. ఇక్కడ 1100 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ తగ్గడం లేదా.. ఐతే.. ఉత్తరాఖండ్‌ను డెంగ్యూ వణికిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. డెంగ్యూ ఫీవర్ తగ్గకపోతే.. 500 ఎంజీకి బదులు, 650 ఎంజీ పారసిటమాల్ ట్యాబెట్లు వేసుకోవాలని, డెంగ్యూ తగ్గిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు. డెంగ్యూ రాష్ట్రంలో తీవ్రస్థాయిలో పెచ్చరిల్లిందని, ఈ నేపథ్యంలో 650 ఎంజీ పారాసిటమాల్ వేసుకొని.. విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గిపోతుందని రావత్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో డెంగ్యూ కారణంగా ఎనిమిది మంది చనిపోయినట్టు గతవారం ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించగా.. సీఎం రావత్ మాత్రం కేవలం నలుగురే చనిపోయారని చెప్పుకొచ్చారు. -
ఉత్తరాఖండ్ సీఎం విచిత్ర వ్యాఖ్యలు..!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత త్రివేంద్ర సింగ్ రావత్ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. శ్వాసక్రియలో భాగంగా ఆవులు ఆక్సిజన్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌నే వదులుతాయని ఆయన సెలవిచ్చారు. ఆవులను నిమరడం ద్వారా అనేక శ్వాసకోశ సమస్యలను తగ్గించుకోవచ్చని తెలిపారు. అలాగే గోవులకు సమీపంలో నివసిస్తే ట్యూబర్ క్యూలోసిస్(టీబీ) కూడా తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. ఆవు పాలు, మూత్రం సుగుణాలను ఆయన సభికులకు వివరించారు. డెహ్రాడూన్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో రావత్ ఈ వ్యాఖ్యలు చేయగా, అందుకు సంబంధించిన వీడియో శుక్రవారం వెలుగులోకిరావడంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. దీంతో ఈ వివాదంపై సీఎం కార్యాలయం(సీఎంవో)లోని ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. ఉత్తరాఖండ్‌లో సాధారణంగా ప్రజలు నమ్మేదాన్నే సీఎం చెప్పారని తెలిపారు. మరోవైపు అన్ని జీవుల్లాగే ఆవులు కూడా ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ విడిచిపెడతాయనీ, రావత్ వ్యాఖ్యల్లో ఎంతమాత్రం నిజం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. -
పెట్టుబడులకు స్వర్గధామం.. భారత్
డెహ్రాడూన్: దేశంలో ప్రస్తుతం కీలక సామాజిక, ఆర్థిక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, పెట్టుబడులకు ప్రపంచంలోనే అత్యంత అనుకూలంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘డెస్టినేషన్ ఉత్తరాఖండ్: ఇన్వెస్టర్స్ సమ్మిట్–2018’ను ఆదివారం ఇక్కడ ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశంలో మునుపెన్నడూ లేనంతగా సామాజిక, ఆర్థిక మార్పులు సంభవిస్తున్నాయి. వచ్చే దశాబ్దాల్లో భారత్ ప్రపంచ ఆర్థిక చోదక శక్తిగా మారుతుంది’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఆర్థిక లోటు, ద్రవ్యోల్బణం తగ్గాయి. దేశంలో మధ్య తరగతి ప్రజల సంఖ్య, ఆర్థిక వృద్ధి పెరిగాయి. గడిచిన నాలుగేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్న కనీసం 10వేల చర్యల వల్ల దేశంలో వ్యాపార అవకాశాలు గణనీయంగా పెరిగాయి’ అని తెలిపారు. స్వాతంత్య్రం తర్వాత దేశంలో చేపట్టిన అతిపెద్ద పన్ను సంస్కరణ జీఎస్టీ అమలు. దీని ఫలితంగా దేశమంతా ఒకే మార్కెట్‌గా మారిపోయింది’ అని తెలిపారు. ‘మౌలిక రంగం వేగంగా అభివృద్ధి చెందింది. దేశవ్యాప్తంగా దాదాపు 10వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సౌకర్యాలు పెరిగాయి. దేశవ్యాప్తంగా 100 కొత్త హెలిప్యాడ్లు, విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయి. మా దేశంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను కోరుతున్నా. ఇది కేవలం భారతీయుల కోసమే కాదు, ప్రపంచం కోసం కూడా’ అని ప్రధాని అన్నారు. రాష్ట్రాల్లో అద్భుత వనరులున్నాయంటూ ఆయన.. వాటిని సక్రమంగా వినియోగించుకుంటే జరిగే అద్భుత అభివృద్ధిని ఏశక్తీ ఆపలేదన్నారు. అనేక యూరప్ దేశాలను అధిగమించవచ్చన్నారు. ఉత్తరాఖండ్‌లో పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం ఉన్నందున తమ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలను కోరారు. దేశంలోనే ఆధ్యాత్మిక పర్యావరణ జోన్(స్పిరిట్యువల్ ఎకో జోన్)గా అవతరించేందుకు రాష్ట్రంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. దక్షిణ కొరియా మోడల్ ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టినప్పటి తన అనుభవాన్ని వివరించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత జరిగిన మీడియా సమావేశంలో కొందరు విలేకరులు నన్ను తికమకపెట్టేందుకు యత్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు వీరు ఎలాంటి మోడల్‌ను అనుసరించాలనుకుంటున్నారు అని నన్ను అడిగారు. వెంటనే నేను దక్షిణ కొరియాను ఆదర్శంగా తీసుకుంటానని చెప్పా. నా సమాధానం వారికి అర్థం కాలేదు. దక్షిణకొరియా విస్తీర్ణం, నైసర్గిక స్వరూపం దాదాపు గుజరాత్ మాదిరిగానే ఉంటాయి కాబట్టే ఆ దేశాన్ని మోడల్‌గా తీసుకున్నానని వారికి వివరించా’ అని అన్నారు. వ్యవసాయం, అగ్రిబిజినెస్తోపాటు ఆర్గానిక్ వ్యవసాయానికి ఉత్తరాఖండ్‌లో మంచి అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ రంగంలో పెట్టుబడులతో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చన్నారు. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వాణిజ్యవేత్తలు ఎంతో ఆసక్తి చూపుతున్నారన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆదానీ, మహింద్రా గ్రూప్ సంస్థలు, జేఎస్‌డబ్ల్యూ, అమూల్, పతంజలి వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడులు, ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు తెలిపారు. -
అత్యాచారానికి పాల్పడితే మరణశిక్షే
డెహ్రాడూన్ : మైనర్ బాలికలపై నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడే మృగాళ్లకు మరణ శిక్ష విధించాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయనుంది. ఈ మేరకు బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ ప్రకటించారు. కాశీపూర్‌లో శుక్రవారం జరిగిన బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అత్యాచారాలను అరికట్టడానికి ఇకపై కఠిన చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, త్వరలోనే ఈ చట్టాన్ని అమలులోకి తీసుకువస్తామని రావత్ వెల్లడించారు. కాగా, మైనర్ బాలికలపై అత్యాచారం జరిపిన వారికి మరణశిక్ష విధించాలని మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా ప్రభుత్వాలు ఇదివరకే చట్టం రూపొందించిన విషయం తెలిసిందే. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులకు ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తామని ఇటీవల హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ ప్రకటించిన విషయం విధితమే. -
ఎంత సీఎం అయినా ఇంత అన్యాయమా!?
సాక్షి, న్యూఢిల్లీ : అది మధ్యయుగాల నాటి రాచరిక ప్రాంగణం. ఎదురుగా ఎత్తైన రాతి కట్టడంపైనున్న సింహాసనంలో ఆసీనుడైన రాజు ప్రజల బాధలను ఆలకిస్తున్నారు. ఓ పెద్దావిడ రాజుముందు మోకరిల్లి తన బాధలను చెప్పుకోవడం మొదలు పెట్టింది. బాధలను చెప్పుకోవడంలో ఆమె గొంతుకాస్త పైకిలేచింది. అంతే, రాజుకు చిర్రెత్తుకొచ్చింది. పక్కనే ఉన్న భటులను పిలిచి, ఆమెను తీసుకెళ్లి కారాగారంలో పడేయాల్సిందిగా ఆదేశించారు. మాట జవదాటని భటులు రాజుగారు చెప్పినట్లే చేశారు. ఇక్కడ బాధలు చెప్పుకున్న పెద్దావిడ పేరు ఉత్తర బహుగుణ. 57 ఏళ్ల ఆమె ఓ ప్రాథమిక పాఠశాల టీచరు. ఇక రాజెవరంటే అత్యంత శక్తివంతమైన పాలకుడు టీఎస్ రావత్. ఆయన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి. జూన్ 28వ తేదీన టీఎస్ రావత్ నిర్వహించిన ప్రజా దర్బార్‌లో చోటుచేసుకున్న సన్నివేశం ఇది. రావత్ ఆదేశం మేరకు ‘ముఖ్యమైన సమావేశానికి అంతరాయం కల్పిస్తున్నారు’ అన్న ఆరోపణలపై ఉత్తర బహుగుణను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. ఆమె గత పాతిక సంవత్సరాలుగా ప్రాథమిక పాఠశాల టీచరుగా పనిచేస్తున్నారు. అందులో 17 సంవత్సరాలు ఉత్తరాఖండ్ మారుమూల పర్వత ప్రాంతాల్లోనే పనిచేశారు. ఇప్పుడూ చేస్తున్నారు. మరో రెండు, మూడేళ్లలో ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉంది. మూడేళ్ల క్రితం అనారోగ్యంతో ఆమె భర్త చనిపోయారు. ఉద్యోగరీత్య కొడుకు డెహ్రాడూన్‌లో ఉంటున్నారు. ఈ వయస్సులో, మారుమూల కొండ ప్రాంతంలో ఒంటరిగా బతకలేక పోతున్నానని, తనను డెహ్రాడూన్‌కు బదిలీ చేయాలని ఆమె ముఖ్యమంత్రి రావత్‌ను ప్రజాదర్బార్‌లో కోరుకుంది. ‘ఉద్యోగంలో చేరే ముందు నియమ నిబంధనలు ఏమిటో తెలుసుకోకుండానే సంతకం చేశావా?’ అని సీఎం ఎదురు ప్రశ్నించారు. అందుకు ఆమె ‘ప్రవాస జీవితం గడుపుతానని మాత్రం సంతకం చేయలేదు’ అని గడుసుగా సమాధానమిచ్చింది. అంతే సీఎంకు కోపం నసాలానికి ఎక్కింది. ఆమెను తక్షణమే అరెస్ట్ చేయాల్సిందిగా పక్కనే భటుల్లా నిలుచున్న పోలీసులను ఆదేశించారు. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే సీఎం రావత్ భార్య సునీత రావత్ కూడా ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల టీచరు. ఆమె ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు 22 ఏళ్లుగా ‘yì డిజైరబుల్ (కోరుకున్న)’ డెహ్రాడూన్లోనే ఉద్యోగం చేస్తున్నారు. ఉత్తర బహుగుణనేమో గత 17 సంవత్సరాలుగా ‘అన్డిజైరబుల్ (కోరుకోని)’ ప్రాంతంలో పనిచేస్తున్నారు. ఇక్కడ ‘అన్డిజైరబుల్’ అంటే ప్రభుత్వ దష్టిలో దష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉన్న అభివద్థికి నోచుకోని, రవాణా, ఇతర సౌకర్యాలు సరిగ్గాలేని మారుమూల ప్రాంతం అని అర్థం. అలాంటి మారుమూల ప్రాంతాలకు బదిలీపై వెళ్లడం ఇష్టంలేక చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులు కూడా వదులుకుంటుంటారు. కొందరు పదవీ విరమణ కూడా తీసుకుంటారు. ఇది ఒక్క టీచర్లకే కాదు, ప్రభుత్వంలోని అన్ని విభాగాల ఉద్యోగులకు, ఆఖరికి డాక్టర్లకు కూడా వర్తిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో డాక్టర్లు పనిచేసేందుకు వీలుగా ఇదే ఉత్తరాఖండ్ ప్రభుత్వం మెడిసిన్ చదివే విద్యార్థులకు ఫీజు రాయితీని కల్పించింది. మెడిసిన్ పూర్తయిన అనంతరం విధిగా రెండేళ్లు మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తానంటూ బాండ్ రాసిచ్చిన వారికే ఈ ఫీజు రాయితీ అవకాశాన్ని ఇచ్చింది. అందుకనే 2014లో ఇదే షరతుపై 331 మంది డాక్టర్లు నియమితులయ్యారు. ఇలా ఏ ఉద్యోగానికైనా బదిలీలు, అందుకు నియమ నిబంధనలు ఉంటాయి. అదేమి దౌర్భాగ్యమేమోగానీ నేటి కంప్యూటర్ల యుగంలో కూడా నియమ నిబంధనలు సామాన్యులకే వర్తిస్తాయి. రాజకీయ నాయకులకుగానీ, వారి బంధు వర్గానికిగానీ, అనుచర వర్గానికిగానీ వర్తించవు. ఏ రాష్ట్రంలోనైనా డిజైరబుల్ అంటే కోరుకున్న చోట ఐదారేళ్లు పనిచేసిన వారినే సాధారణంగా మారుమూల ప్రాంతాలకు బదిలీ చేస్తారు. అయితే నేడు ఉత్తరాఖండ్‌లో టీచర్ల బదిలీల ప్రక్రియ ఓ పరిశ్రమగా మారిందని, బదిలీల కోసం భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ ఉన్నత విద్యాశాఖాధికారి తెలిపారు. మరి, 22 ఏళ్లుగా డెహ్రాడూన్‌లో పనిచేస్తున్న సీఎం భార్య సునీత రావత్‌ను ఉన్నచోటు నుంచి కదలించక పోవడం ఏమిటీ? మారుమూల ప్రదేశంలో పనిచేస్తున్న బహుగుణను కరుణించక పోవడం ఏమిటీ! ఎంత సీఎం అయినా ఇదెంతటి అన్యాయం? ఇలాంటి విధానాల కారణంగా సమాజానికి మరో అన్యాయం కూడా జరుగుతోంది. మారుమూల ప్రాంతంలో 17 ఏళ్లుగా పని చేస్తున్న బహుగుణ ఎక్కువ సార్లు సుదీర్ఘంగా సెలవులు పెట్టారు. గతంలో భర్త అనారోగ్యం కారణంగా ఏడాదికి పైగా సెలవులో ఉన్నారు. మళ్లీ గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఆమె సెలవులోనే ఉన్నారు. ఆమె సెలవులు కారణంగా ఆమె పనిచేస్తున్న ప్రాథమిక పాఠశాల పిల్లలు టీచరులేని కొరతను అనుభవిస్తున్నారు. ఆమెను కోరుకున్న చోటుకు బదిలీ చేయకపోవడం వల్ల ఇటు విద్యార్థులకు కూడా నష్టం వాటిల్లుతోంది. -
ఆ ప్రిన్సిపాల్‌కు కాంగ్రెస్ మద్దతు!
డెహ్రాడూన్ : తనకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్న ఓ మహిళా ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌తో వాగ్వాదం పెట్టుకుందనే కారణంతో ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్ ఉత్తర బహుగుణను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మారుమూల ప్రాంతానికి బదిలీ చేసిన తనను డెహ్రాడూన్ నగరానికి మార్చాలని కోరుతూ ఆమె సీఎం జనతా దర్బార్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రావత్‌తో ఆమె తీవ్రంగా వాగ్వాదం చేస్తున్నట్టు ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వాగ్వాదం కారణంగానే రావత్ ఆమెపై చర్యలు తీసుకున్నారని అంటున్నారు. అనుమతి లేకుండా సీఎం కార్యక్రమానికి హాజరై ఆయనతో అమర్యాదగా ప్రవర్తించిందనే కారణంతో ప్రిన్సిపాల్ ఉత్తర బహుగుణను ఉత్తరాఖండ్ విద్యాశాఖ సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో ప్రిన్సిపాల్ ఉత్తర బహుగుణకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది. ఈ వ్యవహారంలో సీఎం రావత్, విద్యాశాఖ చర్యలకు నిరసనగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసారు. ఉత్తర బహుగుణ మీద వేసిన సస్సెన్షన్ ఆర్డర్లను వెంటనే వెనక్కితీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రీతం సింగ్ మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి రావత్ రాజులాగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు బీజేపీని ఎన్నుకున్నది వారికి సేవ చేయడానికి మాత్రమే. కానీ ప్రజలు తమ బాధలు చెప్పకోడానికి వెళ్తే సీఎం వారిని దగ్గరకు కూడా రానీయకుండా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఉత్తర బహుగుణ మీద జారీ చేసిన సస్పెన్షన్ ఆర్డర్‌ను ఉపసంహరించుకోవాలి. ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. అలా చేయకపోతే ప్రభుత్వ చర్యలకు నిరసనగా జులై 1 న గాంధీ పార్క్‌లో ఒక రోజు నిరసన చేస్తామ’ని తెలిపారు. అంతేకాక ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చిన సీఎం భార్య సునీత రావత్ బదిలీ వ్యవహారాన్ని ఉటంకిస్తూ ‘మన రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ నీతిని పాటిస్తుంది. తమ కుటుంబ సభ్యులకు, బీజేపీ ఎంపీలకు, నేతలకు ఒకరకమైన నియమాలను...సామాన్య ప్రజలకు ఒక రకమైన నియమాలను అమలు చేస్తుంద’ని విమర్శించారు. -
సీఎంగారి భార్య సంగతేంటి?
తనకు న్యాయం చేయాలంటూ అడిగిన ఓ ఉపాధ్యాయురాలిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్ ఆగ్రహం వెల్లగక్కారు. మీడియా ముఖంగానే ఆమెపై అరిచి.. సస్పెండ్, అరెస్ట్‌కు ఆదేశాలిచ్చారు. సోషల్ మీడియా, జాతీయ ఛానెళ్లలో వీడియో వైరల్ కావటంతో తీవ్ర దుమారం రేగింది. అయితే ఆర్టీఐ చట్టం ద్వారా ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగు చూసింది. డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్ భార్య సునీత రావత్ ప్రైమరీ స్కూల్ టీచర్‌గా పని చేశారు. 1992లో పౌదీ గద్వాల్లో ఆమె తొలుత బాధ్యతలు చేపట్టారు. అయితే నాలుగేళ్లకే ఆమెను డెహ్రూడూన్‌కు బదిలీ చేశారు. ఆపై 22 ఏళ్లు ఆమె అక్కడే విధులు నిర్వహించారు. పైగా 2008లో ప్రమోషన్ కూడా దక్కింది. ఓ సామాజిక వేత్త చొరవతో ఆర్టీఐ యాక్ట్ ద్వారా విషయం వెలుగు చూసింది. ఇక సీఎం ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఉత్తర బహుగుణ(57) విషయానికొస్తే ఉత్తర కాశీలో 25 ఏళ్లుగా ఆమె టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2015లో భర్త చనిపోవటంతో పిల్లలు దగ్గర ఉండేందుకు డెహ్రాడూన్‌కు బదిలీ చేయాలని ఆమె గత కొన్నేళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ, అధికారులు మాత్రం స్పందించటం లేదు. పైగా ఆమె వంతు వచ్చేందుకు ఇంకా చాలా సమయం ఉందంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో విసిగిపోయిన ఆ పెద్దావిడ ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి జనతా దర్బార్‌కు వచ్చింది. అయితే సాయం చేయాల్సిన ముఖ్యమంత్రి కాస్తా ఆ మహిళ మీద కోపంతో విరుచుకుపడ్డారు. దాంతో బహుగుణ ముఖ్యమంత్రిని తిడుతూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ‘సీఎం ముఖ్యమైన సమావేశంలో ఉన్నప్పుడు అంతరాయం కల్గించిందనే నేరం’ కింద పోలీసులు బహుగుణను అరెస్ట్ చేసి, ఆపై బెయిల్ మీద ఆమెను విడుదల చేశారు. అనంతరం మీడియాతో ఆమె తన గోడును వెల్లగక్కారు. ‘న్యాయం చేయమని నేను అక్కడికి వెళ్లాను. నాపై అరిచి ఆధిపత్యం ప్రదర్శించారు. అందుకే బదులుగా నేను అరిచాను. కానీ, కానీ, ఆయన నాపై దొంగ అనే నింద వేశారు. అది మాత్రం తట్టుకోలేకపోయా’ అంటూ బహుగుణ విలపించారు. బహుగుణ వీడియో.. ఆపై ప్రస్తుతం సునీత రావత్ బదిలీ వ్యవహారం వెలుగు చూడటంతో పలువురు సీఎం రావత్ తీరును ఎండగడుతున్నారు. -
ట్రాన్స్ఫర్ చేయమంటే.. అరెస్ట్ చేయండంటూ ఆదేశాలు
-
వైరల్; బదిలీ చేయమంటే...అరెస్ట్ చేశారు
డెహ్రడూన్ : పాపం ఆ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పాతికేళ్లుగా ఒక ఏజెన్సీ ప్రాంత ప్రాధమిక పాఠశాలలో పనిచేస్తుంది. ఓ మూడు సంవత్సరాల క్రితం ఆమె భర్త చనిపోయాడు. వృద్ధాప్యంలో ఒంటరిగా ఉండలేక పిల్లలు నివాసం ఉంటున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయించుకుందామనుకుంది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి విన్నవిద్దామని వచ్చింది. అయితే సాయం చేయాల్సిన ముఖ్యమంత్రి కాస్తా ఆ మహిళ మీద కోపంతో విరుచుకుపడ్డమే కాక ఆమెను అరెస్ట్ చేయండంటూ ఆదేశించారు. వైరల్‌గా మారిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుది. వివరాల ప్రకారం ఉత్తరాఖండ్‌కు చెందిన ఉత్తర బహుగుణ (57) ఉత్తరకాశిలోని ప్రైమరీ స్కూల్లో గత 25 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. మూడేళ్ల క్రితం (2015) ఆమె భర్త మరణించారు. దాంతో ఈ వయస్సులో ఒంటరిగా ఉండలేక పిల్లల దగ్గరకు వెళ్లాలని అనుంకుంది. ప్రస్తుతం పిల్లలు నివాసం ఉంటున్న డెహ్రడూన్‌కు బదిలీ చేయించుకోవాలనుకుంది బహుగుణ. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌కి విన్నవించాలనుకుంది. గురువారం ముఖ్యమంత్రి ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న ‘జనతా దర్బార్’కు వెళ్లింది. అక్కడ ముఖ్యమంత్రితో తాను గత పాతికేళ్లుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్నానని, ఇప్పుడు తనను డెహ్రడూన్‌కు బదిలీ చేయమని సీఎంను కోరింది. కానీ బహుగుణను డెహ్రడూన్ బదిలీ చేయడం కుదరదన్నారు సీఎం. దాంతో బదిలీ చేయడం ఎందుకు కుదరదో తనకు కారణం చెప్పాలంటూ వాదించడం ప్రారంభించింది బహుగుణ. సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి ‘ఆమెను వెంటనే సస్సెండ్ చేసి, అరెస్ట్ చేయండంటూ కేక’లు వేశారు. దాంతో బహుగుణ ముఖ్యమంత్రిని తిడుతూ సమావేశం నుంచి బయటకు వెళ్లి పోయింది. అనంతరం ‘సీఎం ముఖ్యమైన సమావేశంలో ఉన్నప్పుడు అంతరాయం కల్గించిందనే నేరం’ కింద పోలీసులు బహుగుణను అరెస్ట్ చేశారు. కొన్ని గంటల తర్వాత బెయిల్ మీద ఆమెను విడుదల చేశారు. -
మహేశ్ బాబుని కలసిన సీఎం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ కలిశారు. మహేశ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 25వ చిత్రం షూటింగ్ కోసం డెహ్రాడూన్ వెళ్లారు. షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన త్రివేంద్రసింగ్ మహేశ్‌ని మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల భరత్ అనే నేను చిత్రంలో మహేశ్ ముఖ్యమంత్రి పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. తొలుత డెహ్రాడూన్‌లో కాలేజీ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలోని అధిక భాగం యూఎస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ కాగా.. కామెడీ స్టార్ అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్.