udayagiri
-
ఉదయగిరి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. కారణం ఇదేనట!
డబ్బులు ఉన్నాయి కదా అని ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ కొనుక్కుంటే సరిపోతుందా? ఛస్తే సరిపోదు. ఆ విషయమే పాపం ఓ ఎన్.ఆర్.ఐ. కి ఆలస్యంగా తెలిసొచ్చింది. ఇపుడు వెనక్కి వెళ్లలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పార్టీ ఫండ్ కింద కొంత..టికెట్ కోసం కొంత చొప్పున ఈ ఎన్.ఆర్.ఐ. నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు బానే లాగేశారట. విదేశాల్లో సంపాదించుకున్నది జన్మభూమిలో ఉట్టి పుణ్యాన పోగొట్టుకోవలసి వచ్చిందని ఇపుడా నేత భోరు మంటున్నారు. ఎవరా నేత? ఏమా ఏడుపు కథ? టీడీపీ స్థాపించిన కొత్తలో చాలా మంది డాక్టర్లు, న్యాయవాదులను రాజకీయాల్లోకి తెచ్చారు. వారిలో చాలా మంది తమకున్న అద్భుతమైన ప్రాక్టీసులు వదులుకుని రాజకీయాల్లో అడుగు పెట్టి ఆ తర్వాత ఫెయిల్ అయ్యి రాజకీయాలకూ.. తమ వృత్తులకూ పనికిరాకుండా పోయారు.ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఎన్.ఆర్.ఐ.లపై పగ బట్టినట్లు కనిపిస్తోంది. ప్రవాస భారతీయులను పిలిచి అరచేతిలో రాజకీయ వైకుంఠం చూపించిన చంద్రబాబు కోట్లకు కోట్లు గుంజి టికెట్లు అంటగట్టారు. రాజకీయాల్లో అదరగొట్టేద్దామని వచ్చిన ఎన్.ఆర్.ఐ.లకు ప్రచారం మొదలైన తర్వాత అసలు పిక్చర్ కనిపిస్తోంది. తాము అనవసరంగా టికెట్లు కొన్నామని వారు చిందులు తొక్కుతున్నారు. అటువంటి కొద్ది మంది అభాగ్యుల్లో ఉదయగిరి అసెంబ్లీ నియోజక వర్గం టికెట్‌ను కోట్లు పోసి కొనుక్కున్న ఎన్.ఆర్.ఐ. కాకర్ల సురేష్ అనవసరంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చానని తన అనుచరులతో చెప్పుకుని పెడబొబ్బలు పెడుతున్నారు.ఉదయగిరి నియోజకవర్గంలో ఏళ్ల తరబడి టీడీపీ జెండా మోస్తూ వస్తోన్న మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకట రామారావుకు టికెట్ ఇస్తామని చివరి నిముషం దాకా ఊరించిన చంద్రబాబు చివర్లో సూట్ కేసులతో వచ్చిన ఎన్.ఆర్.ఐ. సురేష్‌కు టికెట్ ప్రకటించారు. దీంతో బొలినేని వర్గం ఆగ్రహంగా ఉంది. సురేష్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కనిపించడంలేదు. సురేష్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు బొలిననేని రావడం లేదు. తన వర్గీయులను కూడా వెళ్లద్దని చెబుతున్నారట. నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వేమిరెడ్డి ఉదయగిరిలో ప్రచారానికి వచ్చినపుడు సురేష్‌తో కలిసి తిరిగారు. ఎక్కడా జనం లేకపోవడంతో వేమిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.రోజులు గడుస్తోన్న కొద్దీ ఉదయగిరిలో గెలిచే పరిస్థితులు కనపడకపోవడంతో సురేష్‌లో టెన్షన్ మొదలైందంటున్నారు. ఓడిపోయే సీటును ఎందుకు కొనుక్కున్నామా అని కాకర్ల సురేష్ తలపట్టుకుంటున్నారట. ఇపుడు టికెట్ వద్దంటే డబ్బులు వెనక్కి రావు. గోడకి కొట్టిన సున్నంలా టీడీపీకి చదివించుకున్న కోట్ల రూపాయలకు రెక్కలు వచ్చినట్లే. -
SPSR Nellore: డబ్బు మూటలతో వస్తే కాకర్లకు సీటు ఇస్తారా?
టీడీపీలో టికెట్ల ఆట మొదలైంది. నేతలు ఆయా నియోజకవర్గాల్లో తామే అభ్యర్థులమంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరికి వారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు తనకే టికెట్ ఇస్తారని, తనని కాదని మరొకరికి ఇవ్వరని చెబుతుండడం గమనార్హం. నేతల సంగతి అటుంచితే కేడర్ మాత్రం టికెట్ ఎవరికిస్తారో అర్థంకాక అయోమయ స్థితిలో ఉన్నారు. ఏ నాయకుడి వద్దకు వెళితే మిగిలిన వారు ఏమనుకుంటారోనని అందరికీ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రానున్న నేపథ్యంలో టీడీపీ ఇంకా తమ అభ్యర్థులపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. అయితే టికెట్లు ఆశిస్తున్న వారు మాత్రం ఆయా నియోజకవర్గాల్లో తమకే టికెట్ వస్తుందంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో గెలుపు ధీమా లేకపోయినప్పటికీ టీడీపీ అధిష్టానం మాత్రం ఈ దఫా దండిగా పార్టీ ఫండ్‌తోపాటు ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసే వారికే టికెట్ ఇస్తామంటోందని సమాచారం. పైకం తూకంతోనే టికెట్ల కేటాయింపులు ఉంటాయన్న సంకేతంతో ఉదయగిరి టీడీపీలో అలజడి రేగుతోంది. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉపయోగించి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌కు సాయపడుతున్న తనకే టికెట్ ఖాయం అంటూ ధీమాగా చెబుతున్నట్లు తెలుస్తోంది. కాగా నాలుగైదు రోజులుగా ఉదయగిరి టికెట్ ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్‌కే ఓకే అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాను ఇప్పటికే లోకేశ్‌కు డబ్బు సంచులు అందించానని, టికెట్ తనకే అంటూ ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ బాహాటంగానే చెబుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధిష్టానం డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఇందులో నిజం ఉంటుందని పార్టీ కేడర్ కూడా బలంగా విశ్వసిస్తోంది. మరి ఆ ఇద్దరి పరిస్థితి అలా ఉంటే వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తనకే టికెట్ అని చెబుతుందగా, బీసీ సామాజికవర్గం నుంచి ఈ దఫా తనకే టికెట్ వస్తుందంటూ బీసీ నేత చెంచలబాబు కూడా ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. డబ్బుకే ప్రాధాన్యమా.. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్‌కే అవకాశం ఉంటుందని ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. కాకర్లకు లోకేశ్‌తో సన్నిహిత సంబంధాలతోపాటు ఆశీస్సులు కూడా ఉన్నట్లు సమాచారం. కాకర్ల విదేశాల్లో తనకున్న పరిచయాలతో పార్టీ ఫండ్ కోసం భారీగా వసూలు చేసి ఇచ్చాడనే ప్రచారం ఉంది. ఇప్పటికే లోకేశ్ వద్ద హామీ కూడా పొందినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. లోకేశ్ హామీతోనే సేవా కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నానంటూ కాకర్ల బహిరంగంగానే చెబుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో కూడా అధిష్టానం తనకే టికెట్ ఓకే చేసిందంటూ ప్రచారం ప్రారంభించడంతోపాటు చినబాబు లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా వింజమూరు ప్రాంతంలో భారీగా కార్యకర్తలను పోగేసి విందు ఇచ్చారని తెలుస్తోంది. టికెట్ నాదేనంటూ సందేశమిచ్చి తనకు సాయం చేయాలని కోరడంతో ఇప్పుడు ఉదయగిరి టీడీపీలో టికెట్ల లొల్లి కాక పుట్టిస్తోంది. కాకర్లది కాకమ్మ కబుర్లేనా.. టీడీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మాత్రం సీటు తనదేనంటూ స్పష్టంగా చెబుతున్నారు. చంద్రబాబు కేసుల విషయంలో తాను ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి సాయం చేశానని చెబుతుండడం గమనార్హం. లోకేశ్‌ను తన పలుకుబడితోనే బీజేపీ పెద్దల వద్దకు తీసుకెళ్లానని, తన సత్తా ఏంటో చినబాబుకు తెలుసునని చెబుతున్నట్లు తెలుస్తోంది. డబ్బుల మూటలతో వస్తే కాకర్లకు సీటు ఇస్తారా అంటూ బొల్లినేని బహిరంగంగానే చెబుతున్నారు. కాకర్లదంతా కాకమ్మ కబుర్లేనంటూ బహిరంగ సమావేశంలోనే చెప్పడం గమనార్హం. గతంలో లోకేశ్ యువగళం పాదయాత్రలో కూడా ఉదయగిరి దరిదాపుల్లో కూడా కాకర్లను రానివ్వకుండా చేశానని చెబుతున్నట్లు తెలుస్తోంది. తనను కాదని కాకర్లకు సీటు ఇచ్చే ధైర్యం కూడా చంద్రబాబు చేయలేరని బొల్లినేని చెబుతున్నట్లు సమాచారం. అయోమయంలో కేడర్ ఉదయగిరి టీడీపీలో నాలుగు స్తంభాలాట ప్రారంభమైంది. దీంతో ఆ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఓవైపు బొల్లినేని, కాకర్ల ఉదయగిరి టికెట్ తమదేనంటూ ప్రచారం చేసుకొంటుండగా, మరోవైపు వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తనకు హామీ ఇవ్వడంతోనే పార్టీలోకి వచ్చానని చెబుతున్నారు. చివరకు తనకే టికెట్ ఇస్తారని, ప్రత్యర్థిగా తన సోదరుడే ఉంటారని, అందుకోసమైనా టికెట్ తనకే కేటాయిస్తారంటూ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి బలంగా ప్రచారం చేసుకుంటున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పి.చెంచలబాబుయాదవ్ ఈ ప్రాంతంలో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారని, బీసీ కేటగిరీలో తనకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటుండడం గమనార్హం. టీడీపీ కేడర్ ఆ నలుగురు నేతల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. అయోమయంలో ఉన్న కేడర్ ప్రస్తుతం ఎవరి వద్దకు వెళితే ఎవరు ఏమనుకుంటారోనని నేతలకు దూర దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. -
ఉదయగిరి దుర్గం: క్యాన్సర్‌ను సైతం నయం చేసే ఔషధ మొక్కలు!
రూపంలో శేషాచలం కొండలను పోలి ఉండే ఉదయగిరి దుర్గం ఆయుర్వేద వనమూలికలకు నిలయం. అపార ఆయుర్వేద సంపదకు నెలవైన ఈ దుర్గం ఎంతో ప్రాశస్త్యం పొందినది. నల్లమల, వెలిగొండ, శ్రీశైలం అడవుల్లో లభించని అరుదైన అనేక రకాల ఔషధ మొక్కలు ఈ దుర్గంపై ఉన్నట్లు ఆయుర్వేద పరిశోధకులు గుర్తించారు. ఈ వనమూలికలు ఆయుర్వేద వైద్యానికి ఎంతో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. ఉదయగిరి: సముద్ర మట్టానికి 938 మీటర్ల ఎత్తులో గల ఉదయగిరి దుర్గం సంజీవకొండగా ప్రసిద్ధి పొందినదని స్థానికులు చెబుతుంటారు. ఈ దుర్గంపై ఆయుర్వేద మొక్కలకు కొదువలేదు. ప్రాచీన వైద్యవిధానాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆయుర్వేద వైద్యంతో ఎన్నో రోగాలు నయమైనట్లు ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అందుకే రాజుల కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు వైద్యులకు కూడా అంతుచిక్కని అనేక రోగాలు ఆయుర్వేద వైద్యం ద్వారా నయమవుతున్నాయి. ఈ వైద్యానికి అవసరమైన ఎంతో విలువైన వనమూలికలు ఉదయగిరి దుర్గంపై ఉన్నప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇటీవల ఆయుర్వేద వైద్యంపై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో ఈ వైద్యానికి డిమాండ్ ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యమిస్తూ విలువైన ఆయుర్వేద మందులను తయారు చేస్తూ వైద్యశాలలకు సరఫరా చేస్తోంది. ఆయుర్వేద వైద్యశాలల్లో బెడ్లు కూడా ఏర్పాటు చేసి పసుర్లు, తైలాలతో ప్రాచీన వైద్యసేవలు అందిస్తోంది. దీంతో ఈ వైద్యానికి పూర్వవైభవం తెచ్చేలా అడుగులు పడుతున్నాయి. పరిశోధనలు ఆయుర్వేద సంస్థల ప్రతినిధులు 30 ఏళ్ల క్రితమే ఉదయగిరి దుర్గాన్ని సందర్శించి అనేక ఔషధ మొక్కలను సేకరించారు. అనేక వనమూలికా మొక్కలపై పరిశోధనలు చేశారు. కర్ణాటకకు చెందిన ఆయుర్వేద డాక్టర్ అయ్యంగార్, నెల్లూరుకు చెందిన పి.చెంచలరావు పంతులు ఇక్కడి అడవుల్లో మొక్కలు సేకరించి తమ ఆయుర్వేద చికిత్సాలయాల్లో వినియోగించారని తెలుస్తోంది. ఇప్పటికీ స్థానికంగా ఉన్న అనేక మంది ఆయుర్వేద వైద్యులు కొండల్లో లభించే వనమూలికలను వైద్యానికి ఉపయోగిస్తున్నారు. బ్రిటిష్ కాలంలోనే గుర్తింపు ఉదయగిరి అడవులు, కొండల్లో ఉండే ఔషధ సంపద బ్రిటిష్ పాలకులే గుర్తించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ వనమూలికలపై వారు అనేక పరిశోధనలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఉదయగిరిలో ఒక ఆయుర్వేద వైద్యశాలను ఏర్పాటు చేసి వైద్యసేవలను కూడా అందించారు. మాదాల జానకిరామ్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయుర్వేద ఫార్మసీ ఏర్పాటుకు ప్రయత్నం చేసినా కార్యరూపం దాల్చలేదు. అటవీశాఖ ఆధ్వర్యంలో దుర్గంపల్లి పరిసర ప్రాంతాల్లో వనమూలికల మొక్కల సంరక్షణ కోసం కంచె కూడా ఏర్పాటు చేశారు. అయినా ఆశించిన ఫలితం లేదు. ఉదయగిరి దుర్గంలో ఉన్న అపారమైన వనమూలికా సంపదను సక్రమంగా వినియోగించుకోనేందుకు ఉదయగిరిలో ఆయుర్వేద కళాశాల, వైద్యశాల ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అపార సంపద ఆయుర్వేద వైద్యానికి ఉపయోగించే వనమూలికలు ఉదయగిరి అడవుల్లో, కొండల్లో, దుర్గంపై అపారంగా ఉన్నాయని తెలుస్తోంది. వైఎస్సార్ కడప, ప్రకాశం, శ్రీపొటి శ్రీరాములు నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఉన్న ఉదయగిరి, సిద్ధేశ్వరం, భైరవకోన అడవులు, కొండలు, కోనలు, గుట్టల్లో 162 రకాలకు పైగా ఔషధ మొక్కలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఉదరకోశ వ్యాధులు, పక్షవాతం, కామెర్లు, పైత్యం, పోలియో తదితర వ్యాధులను నయం చేసే వనమూలికలు ఈ ప్రాంతాల్లో దొరుకుతున్నాయి. దీర్ఘకాలిక క్యాన్సర్‌ను సైతం నయం చేసే ఔషధ మొక్కలు ఈ దుర్గంపై ఉన్నట్లు పలువురు పరిశోధకులు పేర్కొన్నారు. -
ఉదయగిరి సమన్వయకర్తగా రాజగోపాల్‌రెడ్డి
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: వైఎస్సార్సీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా మేకపాటి రాజగోపాల్‌రెడ్డిని పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ఆయన మేకపాటి రాజమోహన్‌రెడ్డి రెండో సోదరు డు. ఇతను విద్యాపరంగా డిగ్రీ పూర్తి చేశారు. నలభై ఏళ్లుగా కేఎంసీ కన్స్ట్రక్షన్స్లో కాంట్రాక్టర్‌గా ఉంటూ బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన కుమారులిద్దరికీ కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించారు. 1983లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజకీయ ప్రవేశం చేసిన నాటి నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి కీలకపాత్ర పోషించారు. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీ చేసిన సమయాల్లో కూడా ఈయన కీలకపాత్ర పోషించారు. ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిని ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మేకపాటి కుటుంబం నుంచి ఆదాల రచనారెడ్డి (మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూతురు)ని బరిలోకి దించాలని భావించారు. అయితే ఆమె రాజకీయా లపై ఆసక్తి చూపకపోవడంతో ఆయన చిన్న తమ్ముడు రాజగోపాల్‌రెడ్డికి అవకాశం కల్పించాలని ఇటీవల ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డితో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ క్రమంలో రాజగోపాల్‌రెడ్డిని ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. దీంతో పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం నెలకొంది. సమన్వయకర్త నియామకంతో పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న ఎన్ఆర్ఐ
ఆ నియోజకవర్గంలో చంద్రబాబుకు ఇష్టుడైన లాబీయిస్ట్కే చుక్కలు చూపిస్తున్నాడట ఓ ఎన్ఆర్ఐ. చంద్రబాబు తరపున ఢిల్లీలో లాబీయింగ్ చేసే ఆ మాజీ ఎమ్మెల్యేకే ఇప్పుడు టిక్కెట్ కష్టాలు ఎదురవుతున్నాయట. కొత్త నేతల తాకిడితో ఉక్కిరి బిక్కిరవుతున్న ఆ నేత ఎవరో చూద్దాం. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ఏమి జరుగుతుందో ఊహించడం కష్టమే. కొత్తగా వచ్చే జూనియర్ నేతల వ్యూహాలతో తలపండిపోయిన నాయకులు కూడా ఉక్కిరిబిక్కిరవుతుంటారు. బొల్లినేని రామారావు నెల్లూరు జిల్లా ఉదయగిరికి ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాని ఢిల్లీలో చంద్రబాబు తరపున లాబీయింగ్ చేసే వ్యక్తిగానే నియోజకవర్గంలో చెప్పుకుంటారు. చంద్రబాబు దగ్గర చాలా పలుకుబడి ఉందని చెప్పుకునే బొల్లినేని రామారావును కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఓ ఎన్ఆర్ఐ తన తెలివితేటలతో చిత్తు చేస్తున్నారట. దీంతో బొల్లినేని రామారావు వేసవి ఎండలకు మించి పొగలు..సెగలు కక్కుతున్నారట. ఆయన బాధ చూసి అనుచరులు కూడా ఆందోళన చెందుతున్నారట. ఎన్నికలకు ఏడాది గడువుండగానే ఉదయగిరి టిక్కెట్ కోసం తెలుగుదేశంలో సిగపట్లు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే బొల్లినేనికి సొంత గ్రామం నుంచే చిక్కులు ఎదురవుతున్నాయి. బాగా డబ్బు సంపాదించుకువచ్చిన ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ దెబ్బకు బొల్లినేని దిక్కుతోచని స్థితిలో పడ్డట్లు టాక్. బొల్లినేని రామారావుకి పార్టీ క్యాడర్లో పరపతి తగ్గిపోయింది. ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి జనాల్లో తిరగక పోవడంతో క్యాడర్‌కు దిక్కు లేకుండా పోయింది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కాకర్ల సురేష్ మూడు నెలలు నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చదవండి: అక్కడ చంద్రబాబే నిప్పు రాజేస్తున్నారా..? బొల్లినేని వర్గంతో సంబంధం లేకుండా ఆయన స్వంతంగా కార్యక్రమాలు చేస్తున్నారట. పార్టీలో సరైన నాయకుడు లేకపోవడంతో..బొల్లినేని యాంటీ వర్గం కాకర్లకు సహాయ సహకారాలు అందిస్తోందని.. ఇప్పటివరకు జనానికి దూరంగా ఉన్న బొల్లినేనికి కాకర్ల సురేష్ కార్యక్రమాలతో చెమటలు పడుతున్నాయనీ ఉదయగిరిలో టాక్ వినిపిస్తుంది.. ఎన్ఆర్ఐ కావడం.. కొద్దో గొప్పో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటంతో టీడీపీ నాయకత్వం కూడా సురేష్‌కే మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ గమనించిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావ్.. పార్టీలో పూర్వ వైభవం కోసం అగచాట్లు పడుతున్నారట. మొన్నటికి మొన్న వింజమూరులో కాకర్ల సురేష్ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చెయ్యాలని ప్రయత్నాలు ప్రారంభించగా.. అతని కంటే ముందే బొల్లినేని ఆ ప్లాన్‌ను అమలు చేసి తన ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి లాబీయుస్టాగా ముద్రపడ్డ బొల్లినేనికి ఉదయగిరిలో ఓ జూనియర్ ఎన్ఆర్ఐ టిక్కెట్ విషయంలో గట్టి పోటీ ఇస్తున్నారు. చదవండి: పవన్ అంటే ఆటలో అరటి పండే..! -
‘ఎమ్మెల్యే వీడినా నష్టం లేదు.. ఉదయగిరిలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది’
సాక్షి,నెల్లూరు: ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పార్టీలోని ముఖ్యనేతలు ఏకమౌతున్నారు. ఈ సందర్భంగా నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని మండలాల నేతలు భారీగా హాజరయ్యారు. సమావేశం అనంతరం ఉదయగిరి నియోజకవర్గ మాజీ పరిశీలకులు కొడవలూరు ధనుంజయ రెడ్డి దీనిపై మాట్లాడుతూ.. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలంగానే ఉంది.. ఎమ్మెల్యే పార్టీ వీడినా ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి వైఖరి వల్ల నేతలు పార్టీకి దూరమయ్యారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతో వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయని.. మండల కన్వీనర్ పదవులను చంద్రశేఖర్ రెడ్డి డబ్బులకు అమ్ముకున్నారని మండిపడ్డారు. పార్టీ పదవులను ఎమ్మెల్యే అమ్ముకుని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని.. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. తన పై చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శల మీద న్యాయ పోరాటం చేస్తానన్నారు. -
‘మా కుటుంబానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కళంకం తెచ్చాడు’
సాక్షి, నెల్లూరు: తమ కుటుంబానికి ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కళంకం తెచ్చాడని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. తాము మొదటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే నడిచామని.. భవిష్యత్తులో కూడా నడుస్తామని స్పష్టం చేశారు. ఆర్ధిక ఇబ్బందులు ఉంటే సాయం చేస్తానని చంద్రశేఖర్‌రెడ్డికి చెప్పానని గుర్తు చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి తమ కుటుంబ పరువు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వైఎస్సార్ హయాంలో నా తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరిని అభివృద్ధి చేశాడు. అతనికి దరిద్రం పట్టి క్రాస్ ఓటింగ్ చేశాడు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజక వర్గాలు మాకు రెండు కళ్ళు లాంటివి. సీఎం జగన్ అడిగితే ఉదయగిరిలో చంద్రశేఖర్ రెడ్డి కూతురు రచనా రెడ్డికి ఇంచార్జీ బాధ్యతలు ఇవ్వమని అడుగుతాను. మా కుటుంబం టీడీపీలోకి వెళ్తున్నారని కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. అవన్నీ పుకార్లే’ అని మాజీ ఎంపీ స్పష్టం చేశారు. (చదవండి: అక్కడ సెల్ఫీ తీసుకునే దమ్ము ఉందా: చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్) -
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించిన వైఎస్సార్సీపీ
సాక్షి, నెల్లూరు: ఉదయగిరిలో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్‌ను వైఎస్సార్సీపీ శ్రేణులు స్వీకరించాయి. వైఎస్సార్సీపీ నేత మూలే వినయ్‌రెడ్డి వర్గీయులు బస్టాండ్ సెంటర్లో కూర్చున్నారు. అవినీతి ఎమ్మెల్యే, పార్టీ ద్రోహి మేకపాటి అంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మేకపాటి తన వద్ద డబ్బులు తీసుకున్నది వాస్తవం కాదా అంటూ మూలే వినయ్‌రెడ్డి సవాల్ విసిరారు. మేకపాటికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. పార్టీ ద్రోహి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఉదయగిరి నుంచి చంద్రశేఖర్‌రెడ్డి వెళ్లిపోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా, వైఎస్సార్సీపీ నేతలపై నోరు పారేసుకున్న మేకపాటి.. వారిపై రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారు. మేకపాటి చేసిన సవాల్‌తో వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. చదవండి: కోటంరెడ్డి బ్రదర్స్ కోసం సొంతవాళ్లకే టీడీపీ వెన్నుపోటు.. పాపం అజీజ్! -
నేను బాగానే ఉన్నాను: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు: తాను బాగానే ఉన్నట్లు ఉదయగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గుండెనొప్పి రావడంతో అసుపత్రికి వచ్చినట్లు పేర్కొన్నారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారని, మరో టెస్టు కోసం చెన్నై తరలిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో క్షేమంగా ఇంటికి తిరిగి వస్తావనని అన్నారు. కాగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గుండెనొప్పితో బుధవారం నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. గుండెలో రెండు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు. -
మెట్ట ప్రాంతానికి మణిహారంగా వ్యవసాయ కళాశాల!
ఉదయగిరి కేంద్రంగా వ్యవసాయ విద్యకు బీజం పడింది. మెట్ట ప్రాంతానికి మణిహారంగా వ్యవసాయ కళాశాల మారనుంది. మారుతున్న ప్రపంచీకరణలో తిరిగి వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం పెరుగుతోంది. కంప్యూటర్ కోర్సులు చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా మారిన ఎందరో తిరిగి ఆధునిక వ్యవసాయంపై దృష్టి సారించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ రంగంలో అవకాశాలు మెండుగా ఉండడంతో ప్రస్తుతం విద్యార్థులు సైతం ఇంజినీరింగ్, మెడిసిన్ తర్వాత వ్యవసాయ విద్యకు ఆకర్షితులు అవుతున్నారు. ఉదయగిరి (పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): రాచరిక పాలనకు కేంద్రంగా విరాజిల్లిన ఉదయగిరిలో కాలక్రమేణా కరవు రాజ్యమేలింది. అలనాటి రాజుల స్వర్ణయుగం మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రాబోతుంది. ఉదయగిరి కేంద్రంగా మేకపాటి గౌతమ్‌రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఈ ఏడాది మే నెలలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందు కోసం ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన రూ.250 కోట్ల ఆస్తులను మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రభుత్వానికి అప్పగించి వ్యవసాయ యూనివర్సిటీగా మార్చాలని కోరారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి ముందుగా వ్యవసాయ కళాశాలను మంజూరు చేసి అందుకు అవసరమైన నిధులు కేటాయించారు. ఈ నెల 18వ తేదీ నుంచి వ్యయసాయ తరగతులు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే అగ్రికల్చర్, హార్టికల్చర్ యూనివర్సిటీ మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను అగ్రికల్చర్, çహార్టికల్చర్ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెట్ట ప్రాంత వ్యవసాయానికి మహర్దశ పట్టనుంది. వ్యవసాయ రంగానికి ఈ ప్రాంత విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు వ్యవసాయ విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. ప్రస్తుతం ఉదయగిరికి వ్యవసాయ కళాశాల మంజూరు కావడంతో అగ్రికల్చర్ కోర్సులు ఇక్కడే అభ్యసించే అవకాశం ఏర్పడింది. దీంతో ఉపాధి అవకాశాలు కూడా మరింత మెరుగు పడనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ ఉంది. దాని పరిధిలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు 25 వరకు ఉన్నాయి. ఉదయగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన కళాశాల కూడా దీని పరిధిలోకి రానుంది. త్వరలోనే అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్పు చెందితే ఈ కళాశాలలన్నీ కూడా దీని పరిధిలోకి వచ్చే అవకాశముంది. రూ.250 కోట్ల ఆస్తులు ప్రభుత్వానికి అప్పగింత మెట్ట ప్రాంతంలో విద్యను ప్రోత్సహిస్తే అభివృద్ధి త్వరగా జరుగుతుందనేది మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆలోచన. ఆయన అందుకు అనుగుణంగానే ఆది నుంచి విద్యా సంస్థల అభివృద్ధికి ఎంతో తోడ్పాటునందించారు. 25 ప్రభుత్వ పాఠశాలలను హైస్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు ఉదయగిరిలో డిగ్రీ కళాశాలకు సొంత నిధులు ఇచ్చారు. అనంతరం వందెకరాల విశాల ప్రాంగణంలో మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు. దీని విలువ ప్రస్తుతం రూ.250 కోట్ల వరకు ఉంది. ఈ మొత్తం మెట్ట ప్రాంత ప్రజలకు ఉపయోగపడే వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి అప్పగించారు. మెరిట్స్‌లో ప్రస్తుతమున్న సదుపాయాలు 150 ఎకరాల ప్రాంగణంలో ఈ కళాశాల ఉంది. 5 లక్షల చ.అ. అకాడమీ బ్లాక్స్ ఉన్నాయి. సుమారు 1,350 మంది విద్యార్థులు నివాసముండేందుకు హాస్టల్ భవనాలున్నాయి. 89 మంది స్టాఫ్ ఉండేందుకు క్వార్టర్స్, ఓపెన్ ఆడిటోరియం, ఇంజినీరింగ్ ల్యాబ్, విశాలమైన లైబ్రరీలో 27 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 3 బస్సులు, జనరేటర్లు, క్యాంటిన్, గెస్ట్‌హౌస్, ఎన్ఎస్ఎస్ భవన సముదాయాలు, ప్లేగ్రౌండ్, తదితర వసతులు కూడా ఉన్నాయి. వీటి మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి అప్పగించారు. మరో యాభై ఎకరాల్లో ప్లాంటేషన్ చేసేందుకు అవసరమైన భూములు కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీకి అందుబాటులో ఉన్నాయి. ఈ కళాశాలను దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ ఆమోదం రెండ్రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మెరిట్స్ కళాశాలలో పని చేసే 108 మంది బోధన, బోధనేతర సిబ్బందిని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కింద వ్యవసాయ కళాశాలకు తీసుకుంటూ కేబినెట్ ఆమోదించింది. దీంతో మెరిట్స్‌లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం మేలుచేకూర్చినట్టయింది. కేబినెట్ ఆమోదంపై మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సీఎం జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 18 నుంచి తరగతుల ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా 250 మంది విద్యార్థులకు వ్యవసాయ కళాశాలను మంజూరు చేసింది. ప్రస్తుతం ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈ నెల 18వ తేదీ నుంచి వ్యవసాయ తరగతులు ప్రారంభం కానున్నాయి. నెల్లూరు, కడప, ప్రకాశం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉదయగిరి వ్యవసాయ కళాశాల అందుబాటులో ఉండడంతో ఈ ప్రాంతానికి చెందిన ఎక్కువ మంది విద్యార్థులు ఈ కళాశాలలో చేరేందుకు మక్కువ చూపుతున్నారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ఉదయగిరికి వ్యవసాయ కళాశాల రాకతో వ్యాపార ఆర్థిక కలాపాలు మరింత ఊపందుకోనున్నాయి. తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి ఈ వ్యవసాయ కళాశాలలో 250 మంది విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించి కొంత మంది స్టాఫ్‌ను ప్రభుత్వం కేటాయించింది. ఈ నెల 18 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. మౌలిక వసతులు, వసతి గృహాలు, అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంత అభివృద్ధికి వ్యవసాయ కళాశాల ప్రముఖపాత్ర పోషించే అవకాశముంది. – డాక్టర్ కరుణసాగర్, ప్రిన్సిపల్, వ్యవసాయ కళాశాల, ఉదయగిరి -
ఎమ్మెల్యే కబ్జా పర్వమంటూ కల్లబొల్లి కథనం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ప్రాంతాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సొంత నిధులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నంపై పచ్చ మీడియా విషం కక్కింది. టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో ఆ పార్టీ నేతలు ఏకంగా రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, విలువైన భూములను కబ్జా చేశారు. ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు’గా అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్న ప్రభుత్వ స్థలంలో ఎమ్మెల్యే సొంత నిధులు వెచ్చించి శుభ్రం చేసి పార్కుగా తీర్చిదిద్దుతుంటే ఆ పచ్చ మీడియాకు కబ్జా పర్వంగా కనిపించింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పచ్చ మీడియా బరితెగించి పైత్యం ప్రదర్శిస్తోంది. కంప చెట్లు, పిచ్చి మొక్కలు, జంతు మల, మూత్రాలతో అపరిశుభ్రంగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సొంత నిధులతో సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా పార్కుగా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఆ పచ్చ మీడియా కబ్జాపర్వమంటూ కల్లబొల్లి కుల్లు కథనాన్ని రాసింది. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో రూ.కోట్లాది విలువైన తమ సొంత భూములను ప్రజా అవసరాలకు ప్రభుత్వానికి అప్పగించిన చరిత్ర మేకపాటి సోదరులది. అటువంటిది మార్కెట్ ధర ప్రకారం పట్టుమని పాతిక లక్షల రూపాయల విలువ చేయని ఆ స్థలానికి రూ.2 కోట్ల విలువ కట్టి మేకపాటి కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేయడాన్ని స్థానిక ప్రజలు సైతం మండి పడుతున్నారు. మండల కేంద్రం మర్రిపాడులో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి భూములు కొనుగోలు చేసి గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారు. ఆ తదనంతర కాలంలో వైఎస్సార్ అకాల మరణం చెందడంతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఊరూరా ఆయన విగ్రహాలు ఆవిష్కరించారు. ఇదే సమయంలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన గెస్ట్‌హౌస్ సమీపంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబరు 428/2లో కొంచెం స్థలంలో 2010లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఓదార్పు యాత్రలో జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ తర్వాత ఆ ప్రాంతమంతా కంప చెట్లు, పిచ్చి మొక్కలు, జంతు మలమూత్రాలతో అపరిశుభ్రంగా మారింది. దివంగత సీఎం వైఎస్సార్ వీర భక్తుడు అయిన చంద్రశేఖరరెడ్డి తన గెస్ట్‌హౌస్ పక్కన తానే ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహ ప్రాంతం అపరిశుభ్రంగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ ప్రదేశాన్ని సుందరవనంగా వైఎస్సార్ ఘాట్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి పచ్చదనం పరిఢవిల్లేలా మొక్కలు తెచ్చి నాటారు. తన సొంత నిధులతో పార్కుగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తుంటే ‘వైఎస్సార్ సాక్షిగా భూ కబ్జా’ అంటూ ఎమ్మెల్యేపై దుష్ప్రచారానికి దిగింది. ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా మారిస్తే తప్పా? నిరుపయోగంగా ముళ్ల పొదలతో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆహ్లాదకరమైన పార్కుగా తీర్చిదిద్దడం తప్పా. పార్కులను ప్రభుత్వ స్థలాల్లో కాకుండా ప్రైవేట్ స్థలాల్లో నిర్మిస్తారా?. ఎమ్మెల్యే సొంత నిధులతో పార్కు వాతావరణాన్ని కల్పించే విధంగా చేస్తుంటే పచ్చ విషపు రోత రాతలు రాయడం వెనుక పచ్చ మీడియా సొంత అజెండా ఉందనే అర్థమవుతోంది. వైఎస్సార్ విగ్రహ ప్రాంతాన్ని పార్కుగా మలుస్తున్నారే కానీ.. బిల్డింగులు కట్టడం లేదే. నాటిన మొక్కలు పశువుల పాలు కాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేస్తే కబ్జా అని వక్రభాష్యం చెబుతారా అని స్థానిక ప్రజలు సైతం మండి పడుతున్నారు. సుందరంగా తీర్చిదిద్దుతున్నా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలకు చేసిన మేలు మరువలేనిది. తెలుగువారి గుండెల్లో కొలువై ఉన్నారు. నేను వైఎస్సార్ వీర భక్తుడిని. విగ్రహా ఘాట్‌ను సుందరంగా తీర్చిదిద్దాలనే తపనతో ప్రాంగణాన్ని శుభ్రం చేశాం. గార్డెన్ ఏర్పాటు చేస్తున్నాం. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు సైతం కాసింత సేద తీరే విధంగా పార్కుగా రూపొందిస్తున్నాం. భూ కబ్జాలు చేయాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదు. – మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్యే, ఉదయగిరి -
ఉదయగిరిలో బాలిక కిడ్నాప్ !
ఉదయగిరి (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) : ఉదయగిరి పట్టణంలో సోమవారం ఓ బాలికను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి అడవిలో చెట్టుకు కట్టేశారు. ఆ బాలికను గొర్రెల కాపరులు రక్షించి ఇంటికి చేర్చారు. ఉదయగిరి దిలావర్‌భాయి వీధికి చెందిన రషీద్, నస్రీన్లకు సమ్రీన్, మసీరా అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. స్థానిక నాగులబావి వీధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మసీరా ఐదో తరగతి, సమ్రీన్, ఏడో తరగతి చదువుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి పాఠశాల నుంచి భోజనం కోసం ఇంటికి వచ్చారు. అనంతరం సమ్రీన్ ముందు వెళ్లగా, మసీరా ఇంటి నుంచి ఆలస్యంగా బయలుదేరింది. మార్గమధ్యంలో బైక్‌పై మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు మసీరాను కిడ్నాప్ చేశారు. పట్టణ శివారులోని బండగానిపల్లి వైపు వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పొదల్లో ఓ చెట్టుకు బాలికను కట్టేసి వెళ్లిపోయారు. అటవీ ప్రాంతంలో ఉన్న గొర్రెలకాపరులు బాలికను గుర్తించి కట్లు విప్పి వివరాలు తెలుసుకుని ఇంటికి చేర్చారు. అప్పటికే పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన సమ్రీన్.. చెల్లిని ఎందుకు స్కూలుకు పంపలేదని తల్లిని అడిగింది. దీంతో మసీరా పాఠశాలకు వెళ్లకపోవడం, ఇంట్లో లేకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెదకడం ప్రారంభించారు. అదే సమయంలో బాలిక అటవీ ప్రాంతం వైపు నుంచి ఇంటికి రావడంతో కిడ్నాప్ ఉదంతం బయటపడింది. ఈ నేపథ్యంలో బాలిక బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక నుంచి వివరాలు తెలుసుకున్న ఎస్ఐ జి.అంకమ్మ... నాగులబావి వీధిలోని సీసీ ఫుటేజీలు పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
జైహింద్ స్పెషల్: ఈస్టిండియా కుటిల వ్యూహం
భారతావనిని దోచుకోవడంలో పాశ్చాత్యులు ఒకరిని మించి మరొకరు అన్నట్లు వ్యవహరించారు. ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్నప్పటి నుంచే ఆక్రమణల పర్వం పతాక స్థాయికి చేరింది. జాగీరులను సొంతం చేసుకోవడానికి బ్రిటిష్ వాళ్లు పన్నిన కుట్రకు ఒక ప్రత్యక్ష నిదర్శనం ఉదయగిరి (నెల్లూరు జిల్లా) జాగీర్ ఆక్రమణ. అందుకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఉదయగిరి నవాబుల వారసురాలు సయ్యద్ ఖాదరున్నీసా బేగం సాక్షి ‘జైహింద్’తో పంచుకున్న ఆనాటి జ్ఞాపకాలివి. దోపిడీకొచ్చిన దొర! ‘‘అవి పందొమ్మిదవ శతాబ్దపు తొలినాళ్లు. భారతదేశంలో రాజ్యాలు, సంస్థానాలు, జాగీర్దార్ల మీద ఈస్ట్ ఇండియా కంపెనీ కన్ను పడటం మొదలైంది. ఒక్కొక్క సంస్థానాన్ని ఏదో ఒక నెపంతో కంపెనీ పాలనలోకి తీసుకోవడం అనే కుట్ర చాపకింద నీరులా ప్రవహిస్తోంది. మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలో ఉంది ఉదయగిరి దుర్గం. ఆ దుర్గం నవాబుల పాలనలో ఉండేది. జాగీర్దారుగా అబ్బాస్ అలీఖాన్ ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నారు. ఆ సమయంలో అంటే.. 1803లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉదయగిరి జాగీర్దారుతో ఒప్పందం కుదుర్చుకోడానికి వచ్చింది. చదవండి: జైహింద్ స్పెషల్: గోడలు పేల్చిన అక్షర క్షిపణులు ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున స్ట్రాటన్ అనే అధికారి వచ్చాడు. కంపెనీకి ఉదయగిరి జాగీర్ నుంచి ఏడాదికి 53 వేల రూపాయల పేష్కార్ చెల్లించాలని డిమాండ్ చేశాడు. అంత డబ్బు కంపెనీకి చెల్లించడానికి అబ్బాస్ అలీఖాన్ అంగీకరించలేదు. అంతేకాదు.. వాళ్లతో ఒప్పందాన్ని రద్దు చేసుకునే ఉద్దేశంతో ఐదువేలు మాత్రమే చెల్లించగలనని చెప్పాడు అలీఖాన్. స్ట్రాటన్ దొర చాలా వ్యూహాత్మకంగా అలీఖాన్ చెప్పిన ఆ ఐదువేల మొత్తానికి అంగీకరించాడు. ఆ ఒప్పందం 1837 వరకు కొనసాగింది. ‘కోటలో కుట్ర’ వదంతి! అత్యంత లాభసాటి రాబడి ఉన్న ఉదయగిరి సంస్థానం మీద నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ దృష్టి మరల్చనే లేదు. అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఆ తర్వాత అనుకోకుండా ఒక ప్రచారం తలెత్తింది. ఆ ప్రచారాన్ని సద్దుమణగనివ్వకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ జాగ్రత్త పడింది. అప్పుడు నెల్లూరు కలెక్టర్ పేరు స్టోన్‌హౌస్. ఉదయగిరి పాలకుడు అబ్బాస్ అలీఖాన్, అతడి కుమారులు స్టోన్‌హౌస్‌ను హత్య చేయడానికి పథకం రచిస్తున్నారనే వదంతి ఎలా పుట్టిందో తెలియదు, కానీ స్టోన్‌హౌస్ ఆ వదంతిని ఉపయోగించుకున్నాడు. స్టోన్ హౌస్ కుయుక్తితో ఈ పుకారుకి మరింత ఆజ్యం పోస్తూ మద్రాసు ప్రెసిడెన్సీకి ఉత్తరం రాశాడు. ఉదయగిరి కోటలో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయనే అభియోగం అందులో ఉంది. కుట్ర జరుగుతోందని, ఆయుధాలు, తుపాకీ, మందుగుండు సామగ్రిని సిద్ధం చేస్తున్నారని, అబ్బాస్ కుమారులే ఈ చర్యలను ప్రోత్సహిస్తున్నారనీ..’ రాశాడు. నవాబు నిర్బంధం వివాదాన్ని విచారించే నెపంతో కలెక్టర్ మరితంగా విషయాన్ని క్లిష్టపరుస్తూ 70 మందిని అరెస్ట్ చేయించాడు, మరో 40 మంది మీద నేర విచారణ జరపాల్సిందిగా ఆదేశించాడు. ఇలా రకరకాలుగా జాగీర్దారుల కుటుంబీకులు, సమీప బంధువుల మీద అనేక రకాల కేసులు పెట్టి నానా విధాలుగా బాధలు పెట్టాడు కలెక్టర్. కొందరిని చెంగల్పట్టు జైల్లో, మరికొందరిని సైదాపేట జైల్లో బంధించారు. ఇంట్లో ఉన్న వారికి కానీ, జైల్లో ఉన్న వారికి కానీ ఒకరి సమాచారం మరొకరికి తెలియని స్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే కుటుంబం కకావికలమైంది. ఆంగ్లేయుల మీద పోరాటం సాగించిన ఉదయగిరి దుర్గం చివరి పాలకుడు అబ్బాస్ అలీఖాన్‌ను చెంగల్పట్టు జైల్లో బంధించారు. ఆయన ఆంగ్లేయుల అధికారానికి తలవంచకుండా, వారి ఆధిపత్యాన్ని అంగీకరించకుండా, వారిచ్చిన ఆహారాన్ని స్వీకరించకుండా 21 రోజుల పాటు ఉగ్గబట్టి ప్రాణాన్ని ఆత్మార్పణం చేసుకున్నారు’’ అని తెలిపారు ఖాదరున్నీసా. కలిసిమెలిసి ఉండేవాళ్లు ‘‘ఉదయగిరి జాగీర్దార్ కుటుంబానికి వారసుల్లో ఒకరైన అబ్దుల్ ఖాదర్ సాహెబ్ అఫ్ఫాన్ (ఛాబుదొర) మా పెద్ద తాతగారు. ఆయన 1953లో మరణించారు. ఆయనకు పిల్లల్లేరు. మమ్మల్ని ఆత్మీయంగా చూసేవారు. ఆయన ఉదయగిరి దుర్గానికి పాశ్చాత్యుల కారణంగా ఎదురైన కష్టాలను, స్వాతంత్య్రోద్యమ కాలంలో జరిగిన అనేక ఘట్టాలను మాకు చెబుతుండేవారు. ఉదయగిరి కోట లోపల మసీదులు, ఆలయాలు ఉండేవి. హిందువులు– ముస్లిమ్‌లు తరతమ భేదాలు లేకుండా సోదరభావంతో మెలిగేవారు. మనమంతా భారతీయులం, తెల్లవాళ్లు మనల్ని దోచుకుంటున్నారనే స్పృహ అందరిలో ఉండేది. అప్పట్లో అది సుసంపన్నమైన జాగీరు కూడా. అలాంటి జాగీరుకు బ్రిటిష్ వాళ్ల దృష్టి పడినప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడది పేరుకే కోట అన్నట్లుగా ఉంది. పరాకాష్టకు చెందిన ఇంగ్లిష్ దొరల అరాచకానికి ఆనవాలుగా మిగిలింది. మా పూర్వికులు ప్రజల గుండెల్లో ఇప్పటికీ జీవించే ఉన్నారు. అబ్బాస్ అలీఖాన్ తండ్రి హజ్రత్ ఖాన్ సాహెబ్ వలి ఉర్సు చేసుకుంటాం. మొహర్రమ్ నెలలో ఉదయగిరి దర్గా ఉరుసులో హిందువులు– ముస్లిమ్‌లు కలిసి పాల్గొంటారు’’ అని ఖాదరున్నీసా తెలిపారు. ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
రూ.250 కోట్ల విలువ చేసే ఆస్తులు అప్పగింత.. ఉదయగిరికి మరో మణిహారం
ఉదయగిరికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో రాజులు, శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఇక్కడ స్వర్ణయుగం నడిచినట్లు చెబుతుంటారు. కాలగమనంలో కరువు రాజ్యమేలింది. ఆ తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. మెట్ట ప్రాంతమైన ఉదయగిరికి మరో మణిహారం రానుంది. ఎంఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దాతృత్వంతో ప్రజలకు ఉపయోగపడేలా వర్సిటీని తీర్చిదిద్దనున్నారు. సాక్షి, నెల్లూరు: మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీగా చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా వర్సిటీని నిర్మించి మెట్ట ప్రాంత వ్యవసాయానికి మహర్దశ పట్టించేలా, వ్యవసాయ రంగంపై విద్యార్థుల్లో మరింత మక్కువ పెంచేందుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇక్కడి విద్యార్థులు అగ్రికల్చర్ కోర్సుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇక్కడ వర్సిటీ అందుబాటులో ఉంటే అధిక మంది విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది. అలాగే ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ మాత్రమే ఉంది. దాని పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు సుమారు 25 వరకు ఉన్నాయి. ఉదయగిరిలో ఏర్పాటు కానున్న యూనివర్సిటీకి రాయలసీమ పరిధిలో ఉండే కళాశాలలను అనుసంధానం చేసే అవకాశం ఉంది. మేకపాటి కుటుంబం దాతృత్వం మెట్ట ప్రాంతంలో విద్యను ప్రోత్సహిస్తే అభివృద్ధి తప్పక జరుగుతుందనే ఆశయంతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇప్పటికే ఎంతో ఉదారంగా సాయం చేశారు. మర్రిపాడు మండలంలో నవోదయ పాఠశాల ఏర్పాటుకు సొంత భూములు కేటాయించారు. సుమారు 25 ప్రభుత్వ పాఠశాలలను హైస్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు సొంత నిధులు సమకూర్చారు. ఎంఆర్ఆర్ డిగ్రీ కళాశాలకు సొంత నిధులిచ్చారు. ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు. మేకపాటి కుటుంబం ప్రస్తుతం అగ్రికల్చర్ యూనివర్సిటీకి సుమారు రూ.250 కోట్ల విలువ చేసే ఆస్తులు అప్పగించడంతో వారి దాతృత్వానికి మెట్ట ప్రాంత ప్రజలు సలాం చేస్తున్నారు. మహర్దశ పట్టించేలా.. చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఉదయగిరిలో ఒకప్పుడు వ్యవసాయ రంగానికి సాగునీరు కరువై బతుకు దెరువు కోసం ఎంతోమంది వలస వెళ్లారు. అలా వెళ్లిన వారిలో శ్రీమంతులైన వారు ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉదయగిరికి సాగునీరందించే బృహత్తరమైన పథకాలకు శ్రీకారం చుట్టారు. వెలిగొండ ప్రాజెక్టు, సోమశిల హై లెవల్ కెనాల్ లాంటి ప్రాజెక్టులతో ఉదయగిరి వలస జీవనానికి కళ్లెం వేసి మోడుబారిన భూములు పచ్చని పైర్లతో కళకళలాడేలా చేయాలనే సంకల్పంతో పనిచేశారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. త్వరలోనే ఆ ప్రాజెక్టులు పూర్తయితే వలసవాసులు తిరిగి వచ్చి సాగుబాట పట్టే అవకాశం ఉంది. దీనికితోడు వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుతో ఇక్కడి అన్నదాతలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఔన్నత్యానికి నిదర్శనం మేకపాటి కుటుంబం ఉదయగిరి లాంటి మెట్ట ప్రాంతంలో విద్యను ప్రోత్సహించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. రూ.250 కోట్లు సంబంధించిన ఆస్తులు ప్రభుత్వానికి ఇచ్చి అగ్రికల్చర్ యూనివర్సిటీని స్థాపించమని కోరడం వారి ఔన్నత్యానికి నిదర్శనం. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయనుండడం ఆనందదాయకం. – షేక్ గాజుల ఫారుఖ్‌అలీ, ఉదయగిరి హర్షదాయకం ఈ ప్రాంత రైతులకు ప్రయోజగకరంగా ఉంచేందుకు మెరిట్స్ కళాశాలను అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం హర్షదాయకం. మెరిట్స్ కళాశాల ఉద్యోగులకు అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా ఉద్యోగ భద్రత కల్పించేలా మేకపాటి రాజమోహన్‌రెడ్డి కృషి చేయడం వారి దూరదృష్టికి నిదర్శనం. – డాక్టర్ ఎం.మనోజ్‌కుమార్‌రెడ్డి, మెరిట్స్ కళాశాల ప్రిన్సిపల్ గౌతమ్‌రెడ్డి పేరుతో.. మెరిట్స్ కళాశాల 106 ఎకరాల ప్రాంగణంలో ఉంది. ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ సంబంధించిన అకాడమీ బ్లాక్స్, 600 అమ్మాయిలు, 750 అబ్బాయిలుండేలా హాస్టల్ భవవ సదుపాయాలున్నాయి. 89 స్టాఫ్ క్వార్టర్స్, ఓపెన్ ఆడిటోరియం, ఇంజినీరింగ్ ల్యాబ్, లైబ్రరీ 27 వేల పుస్తక సముదాయం, మూడు బస్సులు, జనరేటర్స్, క్యాంటీన్, గెస్ట్ హౌస్, ఫిజికల్ డైరెక్టరీస్, ఎన్ఎస్ఎస్, భవన సముదాయాలు, ప్లే గ్రౌండ్ తదితర ఆస్తులను వ్యవసాయ యూనివర్సిటీ కోసం ప్రభుత్వానికి అప్పగించనున్నారు. అలాగే సుమారు 50 ఎకరాల్లో ప్లాంటేషన్ చేసేందుకు అవసరమైన భూములను కూడా ఇటీవల అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. రూ.కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి ఇచ్చిన ఎంఆర్ఆర్ ట్రస్ట్ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్మాణం చేయాలని కోరింది. అలాగే ప్రస్తుతం మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉద్యోగ భద్రత కల్పించాలన్న వారి విన్నపానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. -
ఉదయగిరి.. చరిత్రలో ప్రత్యేక స్థానం
ఉదయగిరి.. చరిత్రలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. తిరుమల గిరులను పోలిన ఎత్తైన పర్వతశ్రేణులు, ప్రకృతి సోయగాలు, జలపాతాలతో కనువిందు చేస్తున్న ఉదయగిరి దుర్గం చోళులు, పల్లవులు, రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబుల పాలనలో వెలుగు వెలిగింది. ఎంతో కళాత్మకంగా నిర్మించిన ఆలయాలు, మసీదులు, కోటలు, బురుజుల ఆనవాళ్లు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. తాజాగా యుద్ధ నౌకకు ఉదయగిరి పేరు పెట్టడంతో జాతీయ స్థాయిలో ఖ్యాతి లభించింది. సాక్షి, నెల్లూరు/ఉదయగిరి: జిల్లాలోని ఉదయగిరి పేరు జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. యుద్ధ నౌకకు ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టారు. మాసాయిపేట కొండపై బంగారు, రాగి, వైట్ క్వార్‌ట్టŠజ్ నిక్షేపాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు డ్రిల్లింగ్ పనులు ముమ్మరంగా చేశారు. ఇంకా ఇక్కడ పర్యాటక రంగ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఆ కాలంలో.. క్రీ.శ 10 నుంచి 19వ శతాబ్దం వరకు ఇక్కడ ఎంతోమంది రాజుల పాలన సాగింది. ఇందులో విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఉదయగిరి దుర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. అందమైన కట్టడాలు, విశాలమైన తటాకాలు ఈయన కాలంలోనే నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు కొన్నినెలలపాటు ఉదయగిరి కోటను కేంద్రంగా చేసుకుని పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ అలనాటి రాజులు, నవాబుల పాలనకు గుర్తుగా ఉదయగిరి కొండపై అద్దాల మేడలు, ఆలయాలు, మసీదులు, కోట బురుజులు దర్శనమిస్తాయి. పేరిలా వచ్చింది సూర్యకిరణాలు ఉదయగిరి కొండ శిఖరంపై ప్రసరించి ప్రకాశవంతంగా దర్శనమిస్తుండడంతో ‘ఉదయ’గిరి పర్వతశ్రేణికి ఉదయగిరిగా పేరు వచ్చినట్లు పెద్దలు చెబుతారు. సముద్రమట్టానికి 3,079 అడుగుల ఎత్తులో ఈ ప్రాంతం ఉంటుంది. తిరుమల గిరులను ఉదయగిరి పర్వతశ్రేణి పోలి ఉంటుంది. ఇందులో 3,600కి పైగా ఔషధ మొక్కలున్నట్లుగా శాస్త్రవేత్తల పరిశోధనలో గుర్తించారు. ఉదయగిరి దుర్గం కోటలు, ఎత్తైన ప్రాకారాలు, దట్టమైన చెట్లు, పక్షుల కిలకిలరావాలు, గలగల పారే జలపాతాలతో నిండి ఉంటుంది. ఓ కోటపైన పర్షియా సంప్రదాయ రీతిలో నిర్మించిన మసీదు ఉంది. దేశంతో ప్రసిద్ధి చెందిన చెక్క నగిషీ బొమ్మల తయారీకి ఉపయోగించే దేవదారు చెక్క ఇక్కడ లభ్యమవుతుంది. పర్యాటకాభివృద్ధి కోసం.. ఉదయగిరిని పర్యాటకరంగ పరంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా కలెక్టర్ చక్రధర్‌బాబు గతంలో ఈ ప్రాంతంలో పర్యటించి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయించారు. హార్సిలీహిల్స్, ఊటీ తరహా వాతావరణం ఉదయగిరి దుర్గంపై ఉంటుంది. అక్కడ పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు సుమారు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర పర్యాటక శాఖకు పంపారు. అభివృద్ధి చెందుతుంది ఉదయగిరి సమీపంలో బంగారు, రాగి నిక్షేపాలు నిక్షిప్తమై ఉన్నాయన్న జాతీయ సర్వే నిపుణుల ప్రకటనలతో ఉదయగిరికి ఖ్యాతి లభించనుంది. ఎక్కడో మారుమూల వెనుకబడి ఉన్న ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలు వెలుగుచూడడంతో ఈ ప్రాంత అభివృద్ధిపై ఆశాభావం కలుగుతోంది. మొత్తంగా రెండు, మూడురోజల వ్యవధిలో ఉదయగిరికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం విశేషం. భవిష్యత్‌లో అభివృద్ధి చెందుతుందనే కాంక్ష ఈ ప్రాంతవాసుల్లో బలంగా ఉంది. – ఎస్కే ఎండీ ఖాజా, ఉపాధ్యాయుడు ఉదయగిరికి జాతీయ కీర్తి ఎంతో చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న ఉదయగిరికి జాతీయ గుర్తింపు లభించడం సంతోషం. జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఉన్న ఉదయగిరి దుర్గానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. దీంతో వెనుకబడి ఉదయగిరి ప్రాంతం అభివృద్ధితోపాటు రాష్ట్రంలో ఒక గుర్తింపు తగిన పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందుతుంది. రక్షణ రంగంలో కీలక యుద్ధ నౌకకు ఉదయగిరి పేరు పెట్టడం చారిత్రాత్మకం. – గాజుల ఫారుఖ్ అలీ, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యుడు ఖనిజ నిక్షేపాల కోసం.. ఉదయగిరి మండలంలోని మాసాయిపేట కొండపై ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ జరిగింది. ఈక్రమంలో ఆ కొండపై రాగి, బంగారం, తెల్లరాయి ఖనిజ నిక్షేపాలున్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాథమికంగా గుర్తించింది.. ప్రస్తుతం ఆ ఖనిజాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు డ్రిల్లింగ్ పనులు చేపట్టారు. మొత్తంగా ఐదు ప్రాంతాల్లో 500 నుంచి 1,000 అడుగుల మేర డ్రిల్లింగ్ నిర్వహించి 46 నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. సుమారు రెండు వేల ఎకరాల్లో ఖనిజ నిక్షేపాలున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. అగ్రీ యూనివర్సిటీ మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను అగ్రికల్చర్ యూనివర్సిటీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవల మంత్రి వర్గ సమావేశంలో కూడా తీర్మానం చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్మారకార్ధంగా దీనిని నిర్మించి మెట్ట ప్రాంత వ్యవసాయానికి మహర్దశ పట్టించేలా, వ్యవసాయ రంగంపై విద్యార్థులకు కూడా మక్కువ పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్సిటీ కోసం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సుమారు రూ.250 కోట్ల విలువైన భూములు, ఆస్తులను అప్పగించారు. ఇది ఏర్పాటైతే విద్యార్థులు అగ్రికల్చర్ కోర్సులు చదివేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. యుద్ధ నౌకకు పేరు ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముంబైలో ప్రారంభించారు. పోరాట సామర్థ్యానికి మరింత పదును పెట్టే యుద్ధ నౌకకు ఏపీలోని నెల్లూరు జిల్లా రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టడంతో ఈ ప్రాంత ఖ్యాతి మరింత చరిత్రపుటల్లోకెక్కింది. దీనిపై నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితోపాటు ప్రముఖులు రాజ్‌నాథ్‌సింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. -
రాజ్‌నాథ్‌సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు: మేకపాటి
సాక్షి, నెల్లూరు: ఉదయగిరికి ప్రత్యేక గుర్తింపునిచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను కేంద్ర మంత్రి మంగళవారం ముంబైలో ప్రారంభించారన్నారు. ఇందులో ఒకదానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టడం హర్షణీయమన్నారు. దేశంలోనే అతి పెద్ద యుద్ధ నౌకకు ఉదయగిరి పేరును పెట్టడడం చాలా సంతోషంగా ఉందని, ఇది జిల్లాకే గర్వకారణంగా ఉందన్నారు. ఉదయగిరిలోని అతిపెద్ద పర్వతాలను పరిగణనలోకి తీసుకుని యుద్ధ నౌకకు ఆ పేరు పెట్టడం మంచిపరిణామమని కొనియాడారు. చదవండి: (ఇతర దేశాల కోసం యుద్ధనౌకలు తయారు చేసే స్థాయికి భారత్: రాజ్‌నాథ్) -
ఇతర దేశాల కోసం యుద్ధనౌకలు తయారు చేసే స్థాయికి భారత్: రాజ్‌నాథ్
ముంబై: ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలు సూరత్, ఉదయగిరిలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. మంగళవారం ముంబైలోని మాజగావ్ డాక్స్‌లో అవి జలప్రవేశం చేశాయి. ఈ యుద్ధ నౌకల డిజైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ (డీఎన్డీ) రూపొందించింది. నౌకలు, జలాంతర్గాముల తయారు చేసే ముంబైకి చెందిన రక్షణ రంగ అనుబంధం సంస్థ మాజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) వాటిని తయారు చేసింది. దేశీయంగా తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారని సంస్థ వెల్లడించించి. వీటి రాకతో నావికాదళం మరింత బలోపేతమైందని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ అన్నారు. దేశీయ అవసరాలను తీర్చుకోవడమే గాక మున్ముందు ఇతర దేశాల కోసం యుద్ధనౌకలు తయారు చేసే స్థాయికి భారత్ ఎదుగుతుందని ధీమా వెలిబుచ్చారు. ఆత్మనిర్భర్ భారత్‌లో విక్రాంత్ యుద్ధ విమాన తయారీ ఒక మైలు రాయి అయితే,ఇసూరత్, ఉదయగిరిల తయారీతో మన రక్షణ సామర్థ్యం హిందూ మహా సముద్రం నుంచి ఫసిఫిక్, అట్లాంటిక్ దాకా విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: (బారాత్‌లో తప్పతాగి పెళ్లికొడుకు డ్యాన్సులు.. మరొకరిని పెళ్లాడిన వధువు) ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ సూరత్ యుద్ధనౌక పీ15బి క్లాస్‌కు చెందినది. క్షిపణుల్ని ధ్వంసం చేసే సామర్థ్యం దీని సొంతం. దీన్ని బ్లాక్ నిర్మాణ పద్ధతుల్లో తయారు చేశారు. అంటే విడిభాగాలను వేర్వేరు ప్రాంతాల్లో తయారు చేసి వాటిని ఎండీఎల్‌లో జోడించారు. దీనికి గుజరాత్ వాణిజ్య రాజధాని సూరత్ పేరు పెట్టారు. నౌకల తయారీలో సూరత్‌కు ఘనచరిత్ర ఉంది. 16వ శతాబ్దంలోనే ఇక్కడ నౌక నిర్మాణం మొదలైంది. ఇక్కడ తయారైన వందేళ్ల నాటి నౌకలు ఇంకా చెక్కు చెదరలేదు. ఐఎన్ఎస్ సూరత్ దీనికి ఆంధ్రప్రదేశ్‌లోని ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టారు. 17ఏ ఫ్రిగేట్స్ ప్రాజెక్టులో ఇది మూడో యుద్ధ నౌక. పీ17 ఫ్రిగేట్స్ (శివాలిక్ క్లాస్) కంటే దీన్ని మరింత ఆధునీకరించారు. మెరుగైన రహస్య ఫీచర్లు, అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, ప్లాట్ఫారం నిర్వహణ వ్యవస్థల్ని పొందుపరిచారు. పీ17ఏ కార్యక్రమం కింద మొత్తం ఏడు నౌకలు నిర్మాణంలో ఉన్నాయి. దీని నిర్మాణంలో తొలిసారిగా కొత్త పద్ధతుల్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. -
ఉదయగిరి కొండల్లో బంగారు, రాగి నిక్షేపాలు
సాక్షి, ఉదయగిరి (నెల్లూరు): మండలంలోని మాసాయిపేట కొండపై బంగారు, రాగి, వైట్ క్వార్ట్›్జ నిక్షేపాలు వెలుగులో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అన్వేషణ సాగించి గుర్తించి ముమ్మరంగా డ్రిల్లింగ్ పనులు చేపట్టింది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మ్యాపింగ్ నిర్వహించి కొండలో ఎంత మేర ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకునేందుకు కొంత కాలంగా డ్రిల్లింగ్ పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొండపై ఐదు ప్రాంతాల్లో 500 నుంచి 1000 అడుగుల మేర డ్రిల్లింగ్ నిర్వహించి 46 నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు అందజేశారు. ఈ ప్రాంతంలో సుమారు రెండు వేల హెక్టార్లకు పైగా భూముల్లో బంగారు, రాగి, వైట్‌క్వార్‌ట్ట్జ నిక్షేపాలున్నట్లు గుర్తించింది. సోమవారం హైదరాబాద్ నుంచి అధికారుల బృందంతో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాహనంతో డ్రిల్లింగ్ చేసే ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. 150 మీటర్ల మేర డ్రిల్లింగ్ వేసిన ప్రాంతంలో భూగర్భంలోకి సీసీ కెమెరాలు పంపి సేకరిస్తున్నారు. ఖనిజ నిక్షేపాలతోనైనా ఉదయగిరి మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు.. జూన్ దాటితే మళ్లీ డిసెంబరే) -
గౌతమ్ రెడ్డి ఆశయ సాధనకు మేకపాటి కుటుంబం సిద్ధం
-
చారిత్రాత్మక త్యాగానికి సిద్దమైన మేకపాటి కుటుంబం
-
దాతృత్వాన్ని చాటుకున్న మేకపాటి కుటుంబం
-
గౌతమ్‌రెడ్డి పేరిట అగ్రికల్చర్ యూనివర్సిటీ
సాక్షి, ఉదయగిరి: మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (మెరిట్స్)ను మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజమోహన్‌రెడ్డి కోరారు. అత్యంత విషాదకర సమయం.. తన ముద్దుల కొడుకు, మేకపాటి కుటుంబ రాజకీయ ఆశాసౌధం హఠాన్మరణం తట్టుకోలేక దుఃఖాన్ని పంటి బిగువున బిగబట్టుకున్న వేళ.. ఇంతటి బాధాతప్త సమయంలో కూడా నెల్లూరు పెద్దాయన రాజమోహన్‌రెడ్డి ఉదయగిరి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాల అభివృద్ధిని మరువలేదు. బుధవారం ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన మంత్రి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు సీఎం వైఎస్ జగన్ విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎంతో పెద్దాయన మెట్ట ప్రాంత అభివృద్ధి, పలు విషయాల గురించి మాట్లాడారు. ఉదయగిరిలో వందెకరాల్లో తాను ఏర్పాటుచేసిన ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన రూ.225 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎంతో చెప్పారు. దీనికిగానూ మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని కోరారు. స్పందించిన సీఎం త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే కళాశాల పేరు మార్చడంతోపాటు అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పెద్దాయనకు హామీ ఇచ్చారు. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలతోపాటు గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఒంగోలు మెట్ట ప్రాంతాలకు తాగు, సాగునీరందించే వెలుగొండ ప్రాజెక్టు, సోమశిల హై లెవెల్ కెనాల్, ఫేజ్–1, ఫేజ్–2లను పూర్తి చేసి త్వరగా డెల్టాగా మార్చాలని రాజమోహన్‌రెడ్డి కోరారు. వెలుగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. చదవండి: (పోలీస్ స్టేషన్ల పరిధి మార్పు.. ప్రభుత్వం ఉత్తర్వులు) వీఎస్‌యూలో ఘన నివాళి వెంకటాచలం: మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ)లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి గురువారం ఘన నివాళులర్పించారు. వీఎస్‌యూ వీసీ జీఎం సుందరవల్లి, రెక్టార్ ఎం.చంద్రయ్య, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి తదితరులు గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మంచి వ్యక్తిత్వం కలిగిన గౌతమ్‌రెడ్డి అకాల మరణం చాలా బాధాకరమన్నారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడు, వ్యాపారవేత్త అయిన వ్యక్తి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. అనతికాలంలోనే పలు అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చి అభివృద్దిలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఆయన అకాలమరణం రాష్ట్రానికి తీరనిలోటని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయిప్రసాద్‌రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుజయ్‌కుమార్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. -
మంత్రి మేకపాటి గౌతంరెడ్డిపై స్పెషల్ సాంగ్
-
మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో సీఎం జగన్
-
గౌతమ్ రెడ్డి తల్లిని ఓదార్చిన వైఎస్ భారతి..