veldurthi
-
హల్దీ ప్రాజెక్టులో ఈతకు వెళ్లి.. ఆపై ఏం జరగనట్టుగా..
సంగారెడ్డి: ఈతకు వెళ్లిన ముగ్గురిలో ఒకరు నీటమునిగి మృతిచెందారు. మిగతా ఇద్దరు అసలు ఏం జరగనట్టు ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గొర్రెల కాపారుల ద్వారా తెలుసుకున్న సర్పంచ్ నిలదీయడంతో సమాచారం బయటికొచ్చింది. ఈ ఘటన వెల్దుర్తిలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై మధుసూదన్ గౌడ్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మాసాయిపేట మండలం బొమ్మారానికి చెందిన మెట్టెల నాగరాజు, మెట్టెల శ్రీకాంత్, మెట్టెల సందీప్ ముగ్గురు స్నేహితులు. హకింపేట శివారులోని హల్దీ ప్రాజెక్ట్‌లో ఆదివారం మధ్యాహ్నం ఈతకు వెళ్ళారు. నదిలో దిగిన క్రమంలో నీటి ప్రవాహానికి సందీప్(16) గల్లంతయ్యాడు. ఇది జరిగిన కొద్దిసేపటికి మిగతా ఇద్దరు తమకేమీ తెలియదు అన్నట్లుగా అక్కడి నుంచి గట్టుపై ఉన్న సందీప్ దుస్తులు తీసుకొని ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. రాత్రి పది గంటల సమయంలో కొప్పులపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపారుల ఇచ్చిన సమాచారంతో బొమ్మారం సర్పంచ్ శంకర్ వారిని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెప్పారు. గట్టి నిలదీయగా అసలు విషయాన్ని బయటపెట్టారు. దీంతో సోమవారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు హల్దీ ప్రాజెక్ట్‌లో వెతకగా మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. చివరికి వేరే అమ్మాయితో..
సాక్షి, కర్నూలు: ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పట్టణానికి చెందిన మోహన్ ఉరఫ్ యోహానుపై ఓ యువతి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. అందులోని వివరాలిలా ఉన్నాయి. నాలుగు సంవత్సరాలుగా తాము ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని తెలిపింది. తరువాత గర్భం తీయించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని నమ్మించి బలవంతంగా టాబ్లెట్లు మింగించి గర్భస్రావం చేయించాడని, చివరికి వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని పేర్కొంది. నమ్మించి మోసం చేసిన తన ప్రియుడిని, వేరే అమ్మాయితో పెళ్లికి ప్రేరేపిస్తున్న అతడి కుటుంబ సభ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు ఆమె ప్రియుడు మోహన్, అతనికి సహకరిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపారు. చదవండి: (Nursing Student: ‘నాన్న తాగొద్దు, అమ్మను కొట్టొద్దు, అంతా అన్న చూసుకుంటాడు') -
పాతకక్షలతో టీడీపీ గ్రామ నేత హత్య
వెల్దుర్తి/మాచర్ల: గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తోట చంద్రయ్య (35) గురువారం హత్యకు గురయ్యాడు. పాత కక్షలతో ప్రత్యర్థులు ఆయన్ని కత్తులతో గొంతు కోసి హత్య చేశారు. హతుడు తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రధాన అనుచరుడు. బ్రహ్మారెడ్డి ఒకేరోజు జరిగిన 7 హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో చంద్రయ్య గుడికి వెళ్ళి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఆయన గొంతు కోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పాత కక్షల కారణంగానే చంద్రయ్య హత్య జరిగిందని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. తోట చంద్రయ్య, చింతా శివరామయ్యలకు గతంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం విషయంలో ఘర్షణలు జరిగాయి. ఆ తరువాత చంద్రయ్య టీడీపీలో చురుగ్గా తిరుగుతుండటం, బ్రహ్మారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉండటంతో అతడి వల్ల ప్రాణహాని ఉందనే అనుమానంతో ప్రత్యర్థులు ఈ హత్యకు పాల్పడ్డట్టు భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న మాచర్ల రూరల్ సీఐ సురేంద్రబాబు, వెల్దుర్తి ఇన్చార్జి ఎస్ఐ పాల్ రవీందర్‌లు సంఘటన ప్రాంతానికి చేరుకొని వివరాలు సేకరించారు. జూలకంటి బ్రహ్మారెడ్డి వచ్చే వరకూ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించకూడదంటూ కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని గుండ్లపాడు తరలించారు. చంద్రబాబు పరామర్శ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం గుండ్లపాడు చేరుకుని చంద్రయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రయ్య పాడె మోశారు. ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. చంద్రయ్య కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నాననిచెప్పారు. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి బ్రహ్మారెడ్డికి వచ్చిన స్పందనను చూసి ఆయనకు ఒక మెస్సేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చంద్రాన్ని హత్య చేయించారని ఆరోపించారు. రౌడీ రాజకీయాలు చేసేవారిని జగన్ కంట్రోల్ చేయాలని, లేకపోతే జరిగే పరిణామాలకు జగనే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. మా ప్రాణాలు తీయడం ఎంత సులువో, మీ ప్రాణాలు తీయడం అంత సులువేనని చెప్పారు. నేరస్థులు పరిపాలిస్తున్నారు కాబట్టే పోలీసులను అడ్డం పెట్టుకుని హత్యలు చేయిస్తున్నారని విమర్శించారు. పల్నాడులో ఇప్పటికే పదుల సంఖ్యలో రాజకీయ హత్యలు జరిగాయన్నారు. స్థానిక ఎన్నికల సమయంలో బోండా ఉమా, బుద్ధాపై దాడి చేశారని చెప్పారు. ఆ సమయంలోనే చర్యలు తీసుకొని ఉంటే ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట పడేదని తెలిపారు. దాడులు చేస్తే పదవులు కట్టబెట్టే విష సంస్కృతిని జగన్ చాటుకున్నారని విమర్శించారు. -
ఆర్ఎంపీ వైద్యం వికటించి యువకుడి మృతి
సాక్షి, వెల్దుర్తి(కర్నూలు): ఆర్ఎంపీ వైద్యం వికటించి మండల పరిధిలోని గుంటుపల్లెకు చెందిన యువకుడు వడ్డే మణిదీప్ (17) మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ పెద్దయ్య నాయుడు తెలిపిన వివరాలు.. ఈనెల 22న మణిదీప్ జ్వరం, కాళ్ల నొప్పులతో బాధ పడుతూ వెల్దుర్తిలోని ఆర్ఎంపీ వైద్యుడు వెంకటేశ్వర్లు(అనిల్ క్లినిక్)ను సంప్రదించాడు. అతడు కుడికాలి మక్కికి ఇంజక్షన్ వేసి నయమవుతుందని పంపేశాడు. ఇంటి కెళ్లిన తరువాత కాలు వాపు వచ్చింది. మరుసటి రోజు బొబ్బలు వచ్చాయి. మంగళవారం తండ్రితో కలిసి ఆర్ఎంపీ వద్దకు వెళ్లి ప్రశ్నించగా డోనుకు గానీ, కర్నూలుకు కానీ వెళ్లి వైద్యం చేయించుకోవాలని ఉచిత సలహా ఇచ్చాడు. డోన్‌లోని వాణి పాలి క్లినిక్‌కు వెళ్లగా ఇంజక్షన్ వికటించిందని, కర్నూలుకు వెళ్లాలని అక్కడి వైద్యులు చెప్పారు. కర్నూలుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. తన కుమారుడు మృతికి ఆర్ఎంపీ వైద్యుడే కారణమంటూ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
16వ శతాబ్దంలోనే ప్రపంచ పటంలో..
సాక్షి, వెల్దుర్తి: విజయనగర సామ్రాజ్య ఘనత గురించి ప్రస్తావన వస్తే ఆనాటి ఆలయాల నిర్మాణాలు, శత్రుదుర్భేద్య కోటలు, రక్షణ గోడలు, రాయల పరిపాలనతో పాటు అప్పట్లో విశాలమైన వీధుల్లో ముత్యాలు, కెంపులు, నీలాలు, వజ్రాలు రాశులుగా పోసి విక్రయించిన వైనాన్ని చెప్పుకోవాల్సిందే. ఆ వీధుల్లో అమ్మిన వజ్రాలు ఎక్కువగా ఎక్కడి నుంచి తెచ్చారని తెలుసుకోవాలని ఉందా.. అయితే నాటి రవ్వల కోట వజ్ర వైభవాన్ని గుర్తుకు చేసుకోవాల్సిందే. 16వ శతాబ్దంలోనే ప్రపంచ వజ్ర నిక్షేప పటంలో స్థానం సంపాదించుకున్న నేటి రామళ్లకోటకు ఎంతో ఘన చరిత్ర ఉంది. రాజులు, నవాబులు, బ్రిటీషు వారి కాలంలో పాలనా కేంద్రంగా విరాజిల్లిన ఈ గ్రామం ఎన్నో విశేషాలకు నిలయంగా నిలిచింది. పూర్వం కృష్ణా, తుంగభద్ర నదీ పరీవాహక, సంగమ ప్రాంతాల్లోని దక్షిణ భాగం దాదాపు 300కి.మీ.ల వరకు అపార వజ్ర నిక్షేపాలుండేవి. వాటిలో గుంటూరు జిల్లా కొల్లూరుతోపాటు, వివిధ జిల్లాల్లోని పరిటాల, గొల్లపల్లి, మాలవల్లి, బెల్లంకొండ, బనగానపల్లె, రామళ్లకోట, వజ్రకరూర్, జొన్నగిరి ప్రాంతాలు ప్రసిద్ధి. వజ్రాన్వేషణ సందర్భంగా రవ్వలకొండపై కారి్మకుల రాళ్ల గృహాల ఆనవాళ్లు ఈ ప్రాంతాల నుంచే కోహినూర్, గ్రేట్ మొఘల్ వజ్రాలు వెలికి తీశారని చరిత్ర చెబుతోంది. రవ్వల కోటగా ప్రసిద్ధి కెక్కిన కొండల పక్కనే రవ్వల వెలికితీత గనుల్లో వేల మంది కార్మికులు పని చేసిన చారిత్రక ఆధారాలున్నాయి. వారు నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో కుగ్రామంగా ఏర్పడింది. పదుల సంఖ్యలో బ్రాహ్మణులు, రెడ్డి, కరణాలు, తదితర కులవృత్తుల వారు ఉండేవారు. చాళుక్యులు, చోళలు, కాకతీయుల అనంతరం విజయనగర సామ్రాజ్య స్థాపన తర్వాత శ్రీకృష్ణదేవ రాయల ఏలుబడిలో రామళ్లకోటకు చరిత్రలో ప్రత్యేక స్థానం లభించింది. ఈ ప్రాంతాల నుంచి వెలికితీసిన వజ్రాలు నాడు విజయనగర (హంపి, పెనుకొండ తదతర ప్రాంతాల్లో) వీధుల్లో, అంగళ్లో విక్రయించారని ఇప్పటికీ చెబుతుంటారు. ఆనాటి ఆర్డీఎం నేటి కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) తరహాలోనే నాడు ఆర్డీఎం (రామళ్లకోట డైమండ్ మైన్స్)గా ఇక్కడి వజ్రాల గనులు ప్రసిద్ధి చెందాయి. 1776 నవంబర్ 12న ఈస్టిండియా కంపెనీతో కుదిరిన ఒప్పందం ప్రకారం నాటి నిజాం నవాబు, దత్త మండలంగా పిలువబడిన నేటి రాయలసీమ ప్రాంతం ఆంగ్లేయులు స్వా«దీనం చేశారు. నాటి నుంచి 19వ శతాబ్దం మధ్య వరకు రామళ్లకోటలో బ్రిటీషర్ల పాలన సాగింది. మొత్తంగా గుంటూరు జిల్లాలోని ప్రఖ్యాత కొల్లూరు మైన్స్‌తో కలిపి వివిధ మైన్స్‌లలో (వజ్రాల గనులలో) దాదాపు 60 వేల మంది కార్మికులు ఆనాడు పని చేస్తుండగా ఒక్క రామళ్లకోటలో దాదాపు 30 వేల మంది కారి్మకులు పనిచేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వీరి కాలంలోనే దశాబ్దాల పాటు వజ్రాన్వేషణ అధికమై, కొండలను జల్లెడ పట్టి విలువైన సంపద తరలించినట్లు తెలుస్తోంది. ఆనాడు వజ్రాల కొనుగోళ్లకు యురోపియన్ దేశాల నుంచి వ్యాపారులు వచ్చారు. స్వాతం్రత్యానంతరం 1955 వరకు ఇక్కడ వజ్రాన్వేషణ సాగింది. నేడు ఆ గనులు ఒట్టిపోయి నాటి స్మృతుల ఆనవాళ్లు మాత్రం కనిపిస్తున్నాయి. నవాబుల కాలంలో.. తళ్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనానంతరం రామళ్లకోట ప్రాంతం బహుమనీ సుల్తానులు, గోల్కొండ నవాబుల పాలన కిందకు వచ్చింది. కుతుబ్‌షాహీ, అసంజాహీ (గోల్కొండ) నవాబులు, ఇక్కడి అపార వజ్ర నిక్షేపాలు వెలికి తీసి తరలించుకున్నారు. ఖనిజాల ఖిల్లా వజ్ర నిక్షేపాలకు నిలయమైన నాటి రామళ్లకోట అపార ఖనిజ సంపదకు ఆలవాలమై తన ప్రత్యేకత నిలుపుకుంటోంది. సమీప కొండలు, పొలాల గర్భంలో ఇపుప ఖనిజం, సున్నపురాయి, పచ్చసుద్ధ, సిలికా శ్యాండ్ లభిస్తోంది. స్వాతంత్రానికి పూర్వం నుంచి జోషి కంపెనీ ఇక్కడి ఇనుప ఖనిజాన్ని వెలికితీస్తోంది. పలువురు సైతం మైనింగ్ చేస్తున్నారు. బ్రిటీషు పాలనలో అభివృద్ధి.. 1839–58ల మధ్య కాలంలో బ్రిటీషర్లు కర్నూలు జిల్లాను 8 తాలూకా కేంద్రాలు (నందికొట్కూరు, పత్తికొండ, శిరివెళ్ల, నంద్యాల, మార్కాపురం, రామళ్లకోట)గా విభజించి పరిపాలన సాగించారు. 1886లో రామళ్లకోట తాలూకాలో రామళ్లకోట కేంద్రంగా 106 గ్రామాలు (కర్నూలు కలిపి)ఉండేవి. జనాభా 1,42,855 మంది. ఈ కాలంలోనే రామళ్లకోటలో సబ్ రిజి్రస్టార్ కార్యాలయం, ట్రెజరీ, జైలు (కలిపి కచేరి అనేవారు) నిర్మించబడి, పోలీసు వ్యవస్థ ప్రారంభమైంది. ఈ తాలూకా పరిధి కర్నూలు, సుంకేసుల వరకు భూములు, ఆస్తుల రిజి్రస్టేషన్లు రామళ్లకోటలోనే సాగాయి. అప్పట్లో రామళ్లకోట వాసులు పన్నులకు వ్యతరేకంగా బ్రిటీషర్లతో పోరాడగా వారిని పోలీసు వ్యవస్థతోపాటు, పాలెగాళ్లతో బెదిరించి వసూలు చేశారు. చెక్కుచెదరని దారులు.. బ్రిటీష్ పాలనలో రవాణా సౌకర్యం కోసం కొండ ప్రాంతాల్లో గుర్రాలపై, కాలినడక వెళ్లేందుకు నిర్మించిన దారులు నేటికీ చెక్కు చెదరలేదు. పెద్ద బండ రాళ్లతో పాదచారులు, గుర్రాలు అలుపెరగకుండా ప్రయాణించేలా నిర్మిచారు. ఈ దారుల్లో కొన్ని (సిద్ధినగట్టు, కృష్ణాపురం నుంచి రామళ్లకోటకు, రామళ్లకోట నుంచి కల్లూరు మండలం వైపు) నేటికీ వాడుకలో ఉన్నాయి. ఆంగ్లేయులు నిర్మించిన గుర్రపు ఓణీ రాయల పాలనలో.. శ్రీకృష్ణదేవరాయలు ఈ గ్రాంలో తాత్కాలిక విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఐదు కోట బురుజులు, వాటి పక్కనే కోట వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, గ్రామదేవత కాలమ్మల(మిగతా రెండు గుర్తించడానికి వీలులేకుండా ఉన్నవి) ఆలయాలు ఆనాడు నిర్మితమైనవే. అలాగే వనం శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరుడి ఆలయ నిర్మాణం శిల్ప కళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తోంది. చైత్రమాసంలో నవమి సందర్భంగా బ్రహ్మోత్సవాలు చేపడతారు. అలాగే ముక్కోటి ఏకాదశిని ఘనంగా నిర్వహిస్తారు. ఈనెల 6వ తేదీన ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయం మండపం మధ్యలో ఆకుపచ్చ వర్ణంలోని బండను (గ్రానైట్ రకానికి చెందినది) గ్రామస్తులు సత్యపీఠంగా భావిస్తారు. దానిపై నిలుచుని ఎవరూ అబద్దాలు చెప్పరని ప్రజల విశ్వాసం. అలాగే రాయల నీటి 101 ఆలయాలు, 101 బావుల్లో కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. వనం శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని దిగుడు బావి రెండు వైపులా మెట్లతో నిర్మితమై నాటి కళను సాక్ష్యాత్కరిస్తోంది. అలాగే నాగులబావి (పూర్యం ఈ బావిలో వేకువజామున దేవకన్యలు వచ్చి జలకాలాడేవారని ప్రసిద్ధి), పూలబావి (పూర్వం పూల పంట కోత అనంతరం పూలను బావిలోని నీటితో తడిపిన తర్వాతనే అమ్మకానికి తీసుకెళ్లేవారు), కోట్లబావి, గిలకలబావి, గాడుబావి, పీర్లబావి, దిగుడుబావి, కోనేటిబావి, చేదుడుబావి, పార్వతిగారి బావులు ఇప్పటికీ ఉన్నాయి. ఉట్ల మంటపాలు, రచ్చకట్టలు వైష్ణవ సంప్రదాయంలో స్వామి వారి సేవకు (ఊయల సేవ) ఈ మంటపాలు నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ మంటపాల్లో ఉత్సవాల నాడు స్వామి వారికి సేవలు కొనసాగిస్తున్నారు. అలాగే గ్రామంలో వీధికో మహా వృక్షం, చుట్టూ అరుగు ఉన్నాయి. వీటిలో రావిమాను రచ్చ (వ్యవసాయ, వాణిజ్యాలకు నిలయం), ఎర్రన్న గారి రచ్చ, పోతురాజు కట్ట, తదితర దాదాపు 10కి మించి రచ్చకట్టలు విజయనగరరాజుల కాలంలోనూ, బ్రిటీష్ వారి కాలంలోనూ నిర్మితమైనట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. వనం శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని రెండువైపులా దిగుడు మెట్ల బావి శిథిలావస్థలో చారిత్రక సంపద గ్రామ చరిత్రను తెలిపే పలు సాక్ష్యాలు శిథిలమైపోయాయి. విజయ నగర రాజుల కాలం నాటి పలు ఆలయాలు, బావులు శిథిలమైపోయాయి. ప్రహరీ, కోట బురుజులు కూలిపోయాయి. ప్రస్తుత పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉండే నాటి బ్రిటీషర్లు పాలన సాగించిన రిజి్రస్టార్, ట్రెజరీ, చెరసాల (కచేరి) కూలిపోయింది, విలువైన చెక్క సంపద చెదలు పట్టింది. 1955లో పంచాయతీగా.. రామళ్లకోట గ్రామం వెల్దుర్తి మండలంలోని పెద్ద పంచాయతీల్లో ఒకటి. మండల కేంద్రం నుంచి తూర్పు దిక్కున 11 కి.మీ. దూరంలో ఉంది. ప్రస్తుత జనాభా దాదాపు 5 వేలు. కుటుంబాలు 1000కు మించి ఉన్నాయి. 1227 హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది. కూలీలు ఎక్కువ. 1955 సంవత్సరాన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అక్షరాస్యత 56 శాతం. గ్రామం నుంచి వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ శాఖలలో ఉద్యోగులు, పారిశ్రామిక వేత్తలు ఎంతో మంది ఉన్నారు. రామళ్లకోట ఏరియల్ వ్యూ ప్రపంచ గుర్తింపు తేవాలి ఘన చరిత్ర ఉన్న రామళ్లకోటకు ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు తెచ్చేందుకు పాలకులు, అధికారులు కృషి చేయాలి. విశిష్టత గుర్తుకు తెచ్చేలా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించాలి. గ్రామ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి. చరిత్రకు సాక్ష్యంగా శిథిలావస్థలోని కోటలో వీరభద్రస్వామి బురుజు, స్వామి వారి ఆలయ జీరో్ణద్ధారణ ప్రభుత్వ సాయంతో చేయాలి. – మంచిరెడ్డి శశి, వీరభద్రస్వామి ఆలయ కమిటీ ప్రతినిధి చింతకాయలకు పన్ను కట్టారు గతంలో చింతచెట్లు వనంలా ఉండేవి. రైతులకు ఎంతో కొంత చెల్లించి, ఆ చెట్ల నుంచి వచ్చిన ఫలసా యాన్ని పొంది మా పూరీ్వకులు జీవనోపాధి పొందేవారు. అయితే బ్రిటీషుల పాలన వచ్చిన తర్వాత నుంచి చింతచెట్ల నుంచి చింతకాయలు తీసుకునేందుకు ఒక్కో చెట్టుకు ఇంత పన్ను అన్నట్లుగా ప్రత్యేకంగా పన్నులు కట్టారు. అందుకు మా దగ్గర ఇప్పటకీ ఆధారాలు ఉన్నాయి. – గునారి వీరయ్య, రామళ్లకోట -
వెల్దుర్తి విషాదం.. బస్సు డ్రైవర్ అరెస్ట్
డోన్: కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఈ నెల 11న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ వోల్వో బస్సు డ్రైవర్ జోసెఫ్‌ను అరెస్టు చేసినట్లు డోన్ డీఎస్పీ ఖాదర్‌బాష తెలిపారు. శుక్రవారం డోన్‌లోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.ఈ ప్రమాదంలో బైక్, తుపాను వాహనాన్ని వోల్వో బస్సు ఢీకొట్టడంతో మొత్తం 17 మంది చనిపోయారని గుర్తుచేశారు. ఇందుకు కారణమైన బస్సు డ్రైవర్ కర్ణాటకలోని మంగళూరు జిల్లా బంట్వాల్ టౌన్‌కు చెందిన జోసెఫ్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇదే కేసులో ఇప్పటివరకు 63 మందిని విచారించినట్లు తెలిపారు. ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్, బస్సుల తయారీ సంస్థ అయిన స్కానియాలకు నోటీసులిచ్చామన్నారు. (చదవండి : ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి) -
దళితులంటే చిన్నచూపా?
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ‘మేం దళితులమన్న చిన్నచూపా? ప్రాణాలు పోగొట్టుకున్నా పరిహారం ప్రకటించరా? ఇదెక్కడి అన్యాయం’ అంటూ వెల్దుర్తి ప్రమాద మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటించకుండా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ ఆదివారం వారు కర్నూలు సర్వజనాసుపత్రి మార్చురీ గేటు వద్ద బైఠాయించారు. వారికి మద్దతుగా తెలంగాణ మాలమహానాడు నాయకులు కూడా కూర్చొన్నారు. ఎక్స్‌గ్రేçషియా ఇచ్చే వరకు మార్చురీ నుంచి మృతదేహాలను తీసుకెళ్లేది లేదంటూ భీష్మించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. శనివారం సాయంత్రం వెల్దుర్తి వద్ద తుపాన్ వాహనాన్ని, బైక్‌ను ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ఢీకొట్టడంతో తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురానికి చెందిన 15 మందితో పాటు వెల్దుర్తికి చెందిన ఒకరు మృతిచెందిన విషయం విదితమే. వీరి మృతదేహాలకు ఆదివారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి సొంతూరికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు మూడు, 10 గంటలకు మరో మూడు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేయడంతో వాటిని రామాపురం గ్రామానికి ‘మహాప్రస్తానం’ వాహనాల్లో తరలించారు. అంతవరకు బాగానే ఉన్న బాధిత కుటుంబీకులు.. ఎక్స్‌గ్రేషియాపై అధికారులెవరూ నోరు మెదకపోవడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, తెలంగాణ ప్రభుత్వం మూడెకరాల భూమితో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ ఎవరూ పలకపోవడంతో తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి మాల శ్రీనివాసులు, ప్రచార రాష్ట్ర కార్యదర్శి తుమ్మల రవి, నాయకులు లక్ష్మన్న, కృష్ణ, సుచరిత(వైఎస్ఆర్సీపీ నాయకురాలు) ఆధ్వర్యంలో మృతుల బంధువులు «మార్చురీ దగ్గర ధర్నాకు దిగారు. తమకు ఎక్స్‌గ్రేషియాపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పష్టమైన హామీ ఇస్తేనే మృతదేహాలను తీసుకెళ్తామని భీష్మించారు. నాలుగు గంటల పాటు ఆందోళన ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పరిహారాన్ని ప్రకటించడానికి వీలు కాదని, మృతుల కుటుంబ సభ్యులకు చట్ట ప్రకారం న్యాయం చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపామని కర్నూలు ఆర్డీఓ కె.వెంకటేశ్వర్లు, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి, మాజీ ఎంపీ మందా జగన్నాథం తెలిపారు. నివేదిక పంపితే తమకు న్యాయం జరగదని, ఫలానా చేస్తామన్నది స్పష్టంగా ప్రకటిస్తేనే ఆందోళన విరమిస్తామని బాధితులు చెప్పడంతో అధికారులకు దిక్కుతోచలేదు. మరోవైపు ముందుగా తీసుకెళ్లిన ఆరు మృతదేహాలను కూడా తెలంగాణలోని శాంతనగర్లో నిలిపివేసిన మాలమాహానాడు కార్యకర్తలు.. బాధితులను ఆదుకోవాలని అక్కడ ఆందోళన చేపట్టారు. చివరకు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ కలుగజేసుకొని బాధితులకు అన్ని రకాల న్యాయం చేస్తానని ఫోన్లో సమాచారం ఇచ్చారు. ఇదే సమయంలో మందా జగన్నాథం తెలంగాణ ప్రభుత్వం తరఫున రావాల్సిన ప్రతిపైసా, హామీకి తాను సాక్షిగా ఉంటానని చెప్పడంతో బాధితులు చల్లబడ్డారు. చివరకు మధ్యాహ్నం 1.30 గంట ప్రాంతంలో ధర్నా విరమించడంతో మృతదేహాల తరలింపు ప్రక్రియ పూర్తయ్యింది. -
వెల్దుర్తి ఘటన మృతుల కుంబాలకు డీకే అరుణ పరామర్శ
-
కర్నూలు ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత
సాక్షి, కర్నూలు: కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెల్దుర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగారు. అప్పటివరకూ మృతదేహాలను తరలించేది లేదని మృతులు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆదుకుని, తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ప్రమాదంలో దుర్మరణం చెందిన 16 మంది మృతదేహాలకు వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఇప్పటివరకూ ఆరు మృతదేహాలను తెలంగాణ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురానికి తరలించారు. కాగా మృతుల్లో 15మంది తెలంగాణ వాసులే. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కాగా, వారంతా సమీప బంధువులే కావడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. -
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం..
-
ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి
సాక్షి, కర్నూలు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు, తుఫాన్ వ్యాన్ ఢీ కొనడంతో 15 మంది మృతి చెందారు. బైక్‌ను తప్పించబోయి ప్రైవేటు బస్సు, తుఫాను వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15మంది దుర్మరణం చెందగా..పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వెల్దుర్తి క్రాస్ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. మృతులు గద్వాల జిల్లా శాంతినగర్ మండలం రామపురం గ్రామస్తులుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిగా సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఎలా జరిగింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు అతివేగంతో వెళ్తున్న ప్రైవేట్ వోల్వో బస్సు వెల్దుర్తి వద్ద బైక్‌ను తప్పించబోయి.. గద్వాల వైపు వస్తోన్న తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టింది. ఎదురుగా వస్తోన్న ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో డివైడర్‌ను దాటి అటువైపుగా వస్తోన్న తుఫాన్ వాహనాన్ని వోల్వో బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుఫాన్ వాహనం ప్రయాణిస్తున్న 15 మందిలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న వారిలో ఒకరు మృతి చెందగా,మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో తుఫాన్ వాహనం నుజ్జునుజ్జవ్వడంతో వారిని బయటకు తీయడం ఇబ్బందిగా మారింది.రహదారి అంతా రక్త మరకలతో నిండిపోయింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. పెళ్లి చూపులకు వెళ్లి వస్తుండగా.. పెళ్లి చూపుల కోసం రామపురంకు చెందిన 15 మంది శనివారం ఉదయం తుఫాన్ వాహనంలో గుంతకల్లు వెళ్లారు. నిశ్చితార్థం ముగించుకొని సొంత గ్రామానికి వస్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది. వీరంతా బంధువులేనని, అయితే ఒకే కుటుంబానికి చెందినవారా? కాదా అనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మృతి చెందిన వారిని గద్వాల జిల్ల రామపురంకు చెందిన గోపి, తిక్కయ్య, చింతలన్న, నాగరాజు, చిన్నసోమన్న, భాస్కర్, పగులన్న, రగ్బన్న, విజయ్‌గా గుర్తించారు. మరికొంత మంది పేర్లు తెలియాల్సి ఉంది. సీఎం కేసీఆర్, చంద్రబాబు దిగ్భ్రాంతి కర్నూలు జిల్లాలో వెల్దుర్తి సమీపంలో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పలువురు మృతి చెందడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సంఘటనలో గాయపడి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి అవసరమైన సాయం అందించాల్సిందిగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ను కేసీఆర్ ఆదేశించారు. క్షతగాత్రులకు అత్యున్నత వైద్యం అందించాలని చంద్రబాబు కర్నూలు ఆసుపత్రి వైద్యులకు సూచించారు. వైఎస్ జగన్ సంతాపం కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కర్నూలుకు పయణమైన కలెక్టర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న జోగులాంబ గద్వాల కలెక్టర్ కె.శశాంక, జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ కేపి లక్ష్మీనాయక్ తో కలిసి కర్నూల్ ఆసుపత్రికి బయలుదేరారు. ఒకే గ్రామానికి చెందిన 15 మంది దుర్మరణం చెందడంతో రామాపురంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతులు వీరే కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారు గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. 1)పౌలు(45) 2)చింతలన్న(60) 3)తిక్కన్న(38) 4)నాగరాజు(35) 5)పరుశారముడు(28) 6)విజయ్(26) 7)చిన్న సోమన్న(43) 8)భాస్కర్(41) 9)గోపీనాథ్(21) 10)రాముడు(41) 11)సురేష్(28) 12)మునిస్వామి(35) 13)కటిక మసూం 14)వెంకట్ రాముడు(35) 15)రంగ స్వామి(45) -
ప్రజాసంకల్పయాత్ర 17వ రోజు షెడ్యూల్
సాక్షి, వెల్దుర్తి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 17వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి నుంచి ఆయన శనివారం ఉదయం పాదయాత్రను ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు వెల్దుర్తి, చెరుకులపాడు, పుట్లూరు క్రాస్, తొగరచేడు క్రాస్ వద్దకు చేరుకుంటారు. ఈ యాత్రలో వైఎస్ జగన్ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం కృష్ణగిరి నుంచి పాదయాత్ర పున:ప్రారంభం అవుతుంది. అలాగే సాయంత్రం 6.30గంటలకు రామకృష్ణ పురం చేరుకుంటారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు వైఎస్ జగన్ బస చేస్తారు. ఈమేరకు 17రోజు పర్యటన వివరాలను వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటించారు. -
ఇక ప్లాస్టిక్ రోడ్లు
– ప్రయోగాత్మకంగా వెల్దుర్తి–మల్లేపల్లి మధ్య నిర్మాణం కర్నూలు(అర్బన్): పనికిరాని ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, పాలిథిన్ సంచులు, ఖాళీ వాటర్ బాటిళ్లు, సెలైన్ బాటిళ్లు ఇతరత్రా ప్లాస్టిక్ వస్తువులన్నీ ఇక నుంచి ఉపయోగంలోకి రానున్నాయి. వేస్ట్ ప్లాస్టిక్‌తో రోడ్లను వేసేందుకు పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్లు నిర్ణయించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో వేసిన ప్లాస్టిక్ రోడ్లను పరిశీలించిన సంబంధిత పీఐయూ ఈఈ వెంకటరమణారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్ రోడ్లు వేసేందుకు శ్రీకారం చుట్టారు. పైగా బీటీ రోడ్డుకు అయ్యే ఖర్చు కంటే కొంత తక్కువగా ఉండడం, ఎక్కువ కాలం మన్నిక వస్తుండండతో ప్లాస్టిక్ రోడ్లు వేసేందుకు పీఆర్ సీఈ కూడా అంగీకరించినట్లు ఈఈ తెలిపారు. సోమవారం ఆయన 'సాక్షి'తో మాట్లాడుతూ బీటీ రోడ్డు వేసే సమయంలో వేస్ట్ ప్లాస్టిక్ వస్తువులను చిన్న చిన్న పీసులుగా కట్ చేసి శుభ్రం చేసి తారు, కంకర మిశ్రమంలో కలిపి వేస్తే సాధారణ బీటీ రోడ్డు కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో వెల్దుర్తి సమీపంలోని జాతీయ రహదారి 44 నుంచి మల్లెపల్లి వరకు 3 కిలోమీటర్ల మేర రూ.1.25 కోట్లతో ప్లాస్టిక్ రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఎస్టిమేషన్స్ను సీఈ కార్యాలయానికి పంపించామని, అక్కడి నుంచి అనుమతులు కూడా లభించాయన్నారు. పెద్ద పెద్ద నగరాలు, విదేశాల్లో ప్లాస్టిక్ రోడ్లు ఉన్నాయన్నారు. గతంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్ద కిలోమీటర్ ప్లాస్టిక్ రోడ్డు వేశారన్నారు. ఏపీలో వెల్దుర్తి – మల్లేపల్లి రోడ్డే తొలి ప్లాస్టిక్ రోడ్డు అవుతుందనే భావనను ఈఈ వ్యక్తం చేశారు. -
వ్యక్తి దారుణ హత్య
వెల్దుర్తి (గుంటూరు జిల్లా) బండరాళ్లతో మోది ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. వెల్దుర్తి మండలం దావుపల్లి సమీపంలో శివుని బావి వద్ద గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. హత్యపై శుక్రవారం ఉదయం సమాచారం అందుకున్న మాచర్ల రూరల్ సీఐ ఏ.శివశంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో బండరాళ్లతో మోది హత్య చేశారని గుర్తించారు. మృతుడి వివరాలు తెలియకపోవటంతో డాగ్‌స్క్వాడ్, క్లూస్టీంలకు సమాచారం అందించారు. మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్‌టీం సభ్యుల బృందం మృతదేహాన్ని పరిశీలించి, చొక్కా జేబులో ఉన్న ప్రామిసరీ నోట్ల ఆధారంగా మహంకాళి వెంకట కృష్ణ(42)గా గుర్తించారు. ఇతను ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం తెల్లకట్లకు చెందిన వాడుకాగా, వినుకొండలో నివాసం ఉంటున్నాడు. సంఘటనా స్థలం నుంచి హత్యకు ఉపయోగించిన పరికరాలను క్లూస్‌టీం సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. డాగ్‌స్క్వాడ్‌లో డాగ్ ఘణి మృతదేహం వద్ద నుంచి మాచర్ల–శ్రీశైలం రహదారిలో దావుపల్లి వైపు కొంత దూరం వచ్చి న ల్లమల అటవీ ప్రాంతంలోకి వెళ్లి నీటికుంట వద్ద ఆగింది. వెంకటకృష్ణ హత్యపై అతని అన్న కృష్ణమూర్తికి, బంధువులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలాన్ని గురజాల డీఎస్పీ కె.నాగేశ్వరరావు పరిశీలించారు. ఈయన వెంట గురజాల, మాచర్లరూరల్ సీఐలు ఎంవి సుబ్బారావు, ఏ.శివశంకర్, ఎసై ్సలు రవికష్ణ, సుబ్బారావు ఉన్నారు. వీఆర్వో ముత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వెల్దుర్తిని ముంచెత్తుతున్న వరద
వెల్దుర్తి(మెదక్): మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో రాత్రి కురిసిన వర్షానికి వాగులన్నీ పొంగి పొర్లుతున్నాయి. హల్దీవాగు ఉప్పొంగుతుండటంతో వెల్దుర్తి-మెదక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హల్దీవాగు వంతెన పై నుంచి 5 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. చెరువులు, కుంటలు ప్రమాద స్థాయిలో ఉండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
వెల్దుర్తి(కర్నూలు): కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద గురువారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం నుంచి కర్నూలు వైపు వెళ్తున్న ఐషర్ లారీ చెరుకలపాడు వద్ద ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐషర్ డ్రైవర్ అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన నారాయణ స్వామితోపాటు క్యాబిన్లో ఉన్న మరో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు, 108 వాహన సిబ్బంది వెంటనే సంఘటన స్థలికి చేరుకుని, క్యాబిన్లో ఇరుక్కున్న వారిని రక్షించే ప్రయత్నం చేసినా వీలుకాలేదు. దీంతో వారు అందులోనే ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
అప్పులబాధతో కౌలు రైతు ఆత్మహత్య
వెల్దుర్తి (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం వేమలపాడు గ్రామానికి చెందిన ఈదయ్య(45) అనే కౌలు రైతు శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈదయ్య తనకున్న ఎకరం పొలంతోపాటు 7 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాడు. మిర్చి పంటలో వరుసగా నష్టాలు రావడం, అప్పులు ఇచ్చినవారి ఒత్తిడి పెరగడంతో మనస్థాపానికి గురై శనివారం సాయంత్రం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
వెల్దుర్తి (గుంటూరు) : చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఆటో నడుపుతూ గుట్కా తినడానికి ప్రయత్నించిన యువకుడు ఆటో బోల్తా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాది గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. మాచర్ల మండలం తేరాలకు చెందిన సాయికృష్ణ(22) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆటోలో స్వగ్రామం నుంచి మాచర్ల వెళ్తుండగా.. మండాది గ్రామ సమీపంలోకి చేరుకోగానే గుట్కా తినడానికి ప్రయత్నించాడు. దీంతో ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ సమయంలో ఆటోలో ఉన్న ఓ ప్రయాణికుడు ఆటోలో నుంచి దూకి తన ప్రాణాలు రక్షించుకోగా.. సాయికృష్ణ మాత్రం అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వ వైఖరిపై ఎస్టీయూ నిరసన
వెల్దుర్తి (మెదక్) : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగా రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) ఆధ్వర్యంలో మంగళవారం మెదక్ జిల్లా వెల్దుర్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్.యాదగిరి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి డిప్యూటీ ఈవో, డీఈవో, జేఎల్, డైట్ లెక్చరర్ల పదోన్నతులను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు షరతుల్లేని నగదు రహిత హెల్త్‌కార్డులను అందజేసి కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించి ఖాళీలుగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 22న కలెక్టరేట్ల వద్ద, 29న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం తహసీల్దార్ లావణ్యకు వినతి పత్రం అందజేశారు. -
విద్యుత్ పనులు చేస్తుండగా ఒకరికి షాక్
వెల్దుర్తి (మెదక్) : విద్యుత్ లైన్లు సరిచేస్తున్న ఓ వ్యక్తి షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. మెదక్ జిల్లా వెల్దుర్తికి చెందిన బెస్త మల్లేశం స్థానికంగా జరుగుతున్న కరెంటు పనుల్లో కూలీకి వెళ్తున్నాడు. శనివారం మధ్యాహ్నం స్తంభం పైకెక్కి తీగలు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ముందుగా స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
పేలుడు పదార్థాలు స్వాధీనం
వెల్దుర్తి (కర్నూలు) : వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఓ వాహనంలో తరలిస్తున్న పేలుడు పదార్థాలను గుర్తించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ ట్రాక్టర్లో తరలిస్తున్న 225 జిలెటిన్‌స్టిక్స్, 400 ఎలక్ట్రికల్ పరికరాలు, 15 కిలోల అమ్మోనియంను గుర్తించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మైనింగ్‌కు ఉపయోగించడం కోసం ఎటువంటి అనుమతులు లేకుండా నల్లగొండ నర్సయ్య అనే వ్యక్తి వీటిని తరలిస్తున్నాడని తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో ఇద్దరు వీఆర్వోలకు తీవ్ర గాయాలు
వెల్దుర్తి : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కనుగొట్ల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వీఆర్వోలు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో సోమవారం జరిగిన రెవెన్యూ సదస్సుకు హాజరై సాయంత్రం సమయంలో ఒకే బైక్‌పై ఇద్దరు వీఆర్వోలు తిరుగు ప్రయాణమయ్యారు. కాగా మార్గ మధ్యంలో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో గోవర్ధనగిరి వీఆర్వో కృష్ణమూర్తి, సుదేపల్లి వీఆర్వో హనుమంతు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఆలయంలో చోరీ
కర్నూలు (వెల్దుర్తి) : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఆలయంలోని హుండీని పగులగొట్టి సుమారు రూ.50 వేల నగదును దోచుకెళ్లారు. అమ్మవారి విగ్రహంపై ఉన్న వెండి ఆభరణాలను కూడా దోచుకెళ్లారు. వీటి విలువ రూ.15 వేలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
మామకు తలకొరివి పెట్టిన కోడలు
వెల్దుర్తి, న్యూస్‌లైన్: కుటుంబంలో మగవారు లేకపోవడంతో ఓ కోడలు మామకు తలకొరివి పెట్టి దహన సంస్కారాలు చేసింది. ఈ ఘటన శుక్రవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నెల్లూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రావుల సాయిలు(50) గుండెపోటుతో గురువారం రాత్రి మృతిచెందాడు. సాయిలు భార్య లక్షి నాలుగేళ్ల క్రితం మృతిచెందగా, ఉన్న ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు రెండేళ్ల క్రితం, మరో కుమారుడు ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఇద్దరు కోడళ్లు మాత్రమే ఉండగా, శుక్రవారం జరిగిన అంత్యక్రియల్లో పెద్ద కోడలు మణెమ్మ తలకొరివి పెట్టింది. -
కరువు మండలాలు రెండే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఖరీఫ్‌లో వర్షాభావంతో నష్టపోయిన దౌల్తాబాద్, వెల్దుర్తి మండలాలను కరువు ప్రభావిత మండలాల జాబితాలో చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ద్వారా గత జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జిల్లాలో నమోదైన వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకుంటూ కరువు మండలాల జాబితా రూపొందించారు. రాష్ట్రంలో మొత్తం 119 మండలాలను కరువు ప్రభావిత మండలాల జాబితాలో చేర్చారు. జిల్లా నుంచి రెండు మం డలాలకు జాబితాలో చోటు దక్కింది. లోటు వర్షపాతం, వర్షాభావం, పంటల దిగుబడి 50 శాతానికి పైగా పడిపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వివిధ ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడిన కమిటీ కరువు ప్రభావిత మండలాల జాబితా సిద్ధం చేసింది. జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు దౌల్తాబాద్‌లో మైనస్ 36 శాతం, వెల్దుర్తిలో మైనస్ 22.3 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీనిని పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ, రెవెన్యూ శాఖల నుంచి సేకరించిన వివరాలు క్రోడీకరించి కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే అక్టోబర్‌లో కురిసిన వర్షాలతో చాలా చోట్ల రైతులు పంట నష్టపోయారు. దౌల్తాబాద్, వెల్దుర్తి మండలాల్లోనూ భారీ వర్షాల వల్ల చేతికందే సమయంలో పంటలు నేల పాలయ్యాయి. అటు కరువు, ఇటు అకాల వర్షాలకు నష్టపోయిన రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎంపిక చేసిన మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా పేర్కొంటూ జిల్లా గెజిట్‌లో నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రైతులకు రుణ, ఇతర సదుపాయాలు కల్పించాలనే ప్రభుత్వ ఆదేశాలు ఎంత మేరకు అమలవుతాయో చూడాల్సిందే.