women security
-
ఒంటరి మహిళా ప్రయాణికుల కోసం ‘ఆపరేషన్ మేరీ సహేలి’
సాక్షి, హైదరాబాద్: మహిళా ప్రయాణికుల భద్రతపై దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేకించి ఒంటరిగా ప్రయాణం చేసే మహిళల రక్షణ కోసం ‘ఆపరేషన్ మేరీ సహేలీ’పేరిట ప్రత్యేక రక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. దక్షిణమధ్య రైల్వేలోని 20 ప్రధాన స్టేషన్లలో ఈ బృందాలను రంగంలోకి దించింది. –సాధారణంగా మహిళలు ఒంటరిగా దూరప్రయాణాలు చేయవలసి వచ్చి నప్పుడు కొంత అభద్రతాభావానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి అన్ని విధాలుగా అండగా ఉండి వారి ప్రయాణం పూర్తయ్యే వరకు రక్షణ కల్పి0చే లక్ష్యంతో మేరీ సహేలీ మహిళా భద్రతా సిబ్బంది ప్రయాణికులతో పాటు రైళ్లలో ప్రయాణం చేస్తారు. ఇందుకోసం మహిళా సిబ్బందికి వివిధ అంశాలలో శిక్షణనిచ్చినట్లు ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. మహిళా ప్రయాణికులు రైలు ఎక్కేందుకు, దిగేందుకు సహకరిస్తారు. స్టేషన్ లేఅవుట్పైన అవగాహన కల్పి స్తారు. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరించేందుకు సహాయం చేస్తారు. ఏయే స్టేషన్లలో ఈ సేవలంటే... సికింద్రాబాద్ డివిజన్లో 5 స్టేషన్లు, హైదరాబాద్ డివిజన్లో 2, విజయవాడలో 4, గుంతకల్‌లో 4, గుంటూరులో ఒక స్టేషన్, నాందేడ్‌లో 4 స్టేషన్లలో సహేలీ బృందాలు పని చేస్తున్నట్లు చెప్పారు. 2 నుంచి 24 మంది సభ్యుల బృందానికిమహిళా సబ్ ఇన్స్పెక్టర్ నాయకత్వం వహిస్తారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన 15 రైళ్లతో పాటు, ఇతర జోన్లకు చెందిన మరో 35 రైళ్లలో సహేలీ బృందాలు పని చేస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సహేలీ సేవలను ప్రశంసించారు. -
మహిళల భద్రత, కుటుంబ వివాదాల పరిష్కారం..
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయిలో కీలక భూమిక పోషించేలా గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. కమ్యూనిటీ పోలీసింగ్ తరహాలో ఈ వ్యవస్థను తీర్చిదిద్దాలని నిర్ణయించింది. మహిళల భద్రత, కుటుంబ వివాదాల పరిష్కారం, సామాజిక అంశాలపై చైతన్యం కల్పించడం, ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణ తదితర కీలక బాధ్యతలను నిర్వర్తించేలా ఈ వ్యవస్థను రూపొందించనున్నారు. ఇప్పటికే మహిళా పోలీసుల విధులు, బాధ్యతలపై ప్రభుత్వం మార్గదర్శకాలిచ్చింది. ఈ మేరకు వారికి తగిన శిక్షణ ఇచ్చేందుకు పోలీసు శాఖ ప్రణాళికను రూపొందించింది. రాష్ట్రంలో దాదాపు 15 వేల మంది వరకూ ఉన్న మహిళా పోలీసులకు త్వరలో శిక్షణ కార్యక్రమాన్ని పోలీసు శాఖ చేపట్టనుంది. రాష్ట్రంలోని 21 పోలీసు శిక్షణ కేంద్రాల్లో ప్రస్తుతం ఒక విడతలో 5 వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు వసతులున్నాయి. వాటిని మరింత పెంపొందించి రెండు విడతల్లో 15 వేల మందికీ శిక్షణ పూర్తి చేయాలని భావిస్తోంది. ఒక విడతలో మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారు.. అలా ఆరు నెలల్లో శిక్షణ పూర్తవుతుంది. శిక్షణకు సిలబస్ ఖరారు శిక్షణ కాలంలో మహిళా పోలీసులకు వారి విధులు, బాధ్యతలపై అవగాహన కల్పిస్తారు. ప్రధానంగా పోలీసు చట్టాలు, న్యాయపరమైన అంశాలపై పట్టు సాధించేలా చేస్తారు. కుటుంబ వివాదాలు తమ దృష్టికి వచ్చినప్పుడు, బాధిత మహిళలు ఆశ్రయించినప్పుడు వారికి ఎలా మనోధైర్యం కల్పించాలి.. ఎలా మార్గనిర్దేశం చేయాలన్న అంశాలపై అవగాహన కల్పిస్తారు. సైబర్ నేరాలకు గురికాకుండా, సామాజిక మాధ్యమాల్లోని వేధింపుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను వివరిస్తారు. తద్వారా మహిళా పోలీసులు తమ పరిధిలోని మహిళలు, విద్యార్థినులు, ఇతరులకు మార్గనిర్దేశం చేయగలుగుతారన్నది పోలీస్ శాఖ ఉద్దేశం. అలాగే ప్రభుత్వ పథకాల పర్యవేక్షణపైనా మహిళా పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నారు. మార్చిలో మొదటి విడత శిక్షణ తరగతులు ప్రారంభించాలని భావిస్తోంది. -
ఉండమ్మా తోడొస్తా.. ‘వుమెన్ డ్రాప్ ఎట్ హోం’ పేరిట వినూత్న సేవలు
కాకినాడ: మహిళల భద్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. దిశ బిల్లు, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్ వంటి వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇదే స్ఫూర్తితో జిల్లా పోలీసు శాఖ మహిళల రక్షణకు సంబంధించి కీలకమైన ముందడుగు వేసింది. రాత్రి వేళల్లో గమ్యస్థానాలకు చేరే మహిళల భద్రతకు మరింత భరోసా ఇస్తోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ‘వుమెన్ డ్రాప్ ఎట్ హోం’ పేరుతో వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. చదవండి: Snow Park: రాష్ట్రంలో ఇదే తొలిసారి.. విశాఖలో ‘స్నోపార్క్’ ఏర్పాటుకు సన్నాహాలు దీని ద్వారా రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన మహిళలను వారి గమ్యస్థానాలకు పోలీసులే చేరుస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వాహనం ఏర్పాటు చేశారు. సాధారణ మహిళలతో పాటు, విద్యార్థినులు, ఉద్యోగం చేసే వారు, అనుకోని ఆపదలో చిక్కుకునే వారు, జనసంచారం లేని ప్రాంతాలు, చీకటి రహదారుల్లో ప్రయాణించాల్సిన వారు, నగర శివార్లకు చేరాలనుకునేవారు, కార్యాలయాలు, విద్యాలయాల్లో అధిక సమయం గడపాల్సిన సందర్భాలు ఎదురైనప్పుడు, వసతి గృహాలు, హోమ్‌లలో ఉంటున్న మహిళలు తమ అవసరాన్ని బట్టి ‘వుమెన్ డ్రాప్ ఎట్ హోం’ సేవలను వినియోగించుకోవచ్చు. తద్వారా వారికి ఈవ్ టీజర్లు, ఆకతాయిలు, నేర స్వభావం ఉన్న ఆటో డ్రైవర్లు, రౌడీలు తదితరుల నుంచి రక్షణ లభిస్తుంది. పూర్తి ఉచితంగా అందించే ఈ సేవలకు జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు శ్రీకారం చుట్టారు. తమకు రక్షణ అవసరమని భావించిన మహిళలు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా 5 నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకొని వారిని గమ్యానికి భద్రంగా చేరుస్తారు. ప్రస్తుతం కాకినాడకే పరిమితమైన ఈ సేవలను రానున్న రోజుల్లో ఇతర పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని ఎస్పీ తెలిపారు. మహిళలపై నేరాల నియంత్రణే ఈ సేవల ప్రధాన లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలోనే ప్రథమం రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలకు భద్రత కల్పించే ఈ వినూత్న సేవలు రాష్ట్రంలోనే ప్రథమం. ప్రకాశం జిల్లాలో ఈ తరహా సేవలున్నా డయల్ 100 మాత్రమే వినియోగిస్తున్నారు. కాకినాడలో మాత్రం ప్రత్యేక ఫోన్ నంబర్లు కేటాయించారు. నాగ్‌పూర్, పంజాబ్ పోలీసులు కూడా ఈ తరహా సేవలను మహిళలకు అందుబాటులోకి తెచ్చారు. పోలీసు కంట్రోలు రూమ్ కనుసన్నల్లో.. ► ‘వుమెన్ డ్రాప్ ఎట్ హోం’ సేవలకు వినియోగించే వాహనాల కదలికలను జిల్లా పోలీసు కంట్రోల్ రూము నుంచి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారు. ఇందుకు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని నియమించారు. ► ఆ వాహనంలో ప్రయాణించే మహిళలకు ఓ మహిళా కానిస్టేబుల్ తోడుగా ఉంటారు. ►ఈ వాహనం నడిపేందుకు పోలీస్ డ్రైవర్‌నే నియమిస్తారు. వారు ఆ మహిళలను గమ్యస్థానానికి భద్రంగా చేరుస్తారు. ‘ఉమెన్ డ్రాప్ ఎట్ హోం’ సేవలు అవసరమైన వారు కాల్ చేయాల్సిన నంబర్లు 94949 33233, 94907 63498 మహిళల భద్రతకు మరిన్ని సంస్కరణలు మహిళల భద్రత కోసం మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు సమాలోచనలు జరుపుతున్నాం. నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. త్వరలో రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద రాత్రి వేళల్లో దిగే మహిళల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ‘వుమెన్ డ్రాప్ ఎట్ హోం’ సేవలకు అందే స్పందన, అవసరం ఆధారంగా సేవల విస్తృతికి అవకాశాల్ని పరిశీలిస్తాం. మహిళల భద్రతకు ప్రధాన ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఆదర్శంగా జిల్లాలో ఈ సేవలు ప్రవేశపెట్టాం. ఉద్యోగినులు అధికంగా ఉండే జిల్లాలోని ఇతర అర్బన్ ప్రాంతాలకూ ఈ సేవలను విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నాం. – ఎం.రవీంద్రనాథ్‌బాబు, జిల్లా ఎస్పీ వీలైనంత త్వరగా విస్తరించాలి జిల్లా పోలీస్ శాఖ హర్షించదగ్గ, ఉన్నతమైన నిర్ణయం తీసుకుంది. ఇతర జిల్లాలకుచిది ఆదర్శం. పైలట్ ప్రాజెక్టుగా తొలినాళ్లలో ‘వుమన్ డ్రాప్ ఎట్ హోం’ సేవలు కాకినాడకే పరిమితమైనా వీలైనంత త్వరగా జిల్లాలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించాలి. అవసరానికి అనుగుణంగా వాహనాలు పెంచుతూ సిబ్బంది కేటాయింపునూ పెంచాలి. అన్ని వర్గాల మహిళలకూ ఇది ఎంతో అవసరం. రాత్రి వేళల్లో బిక్కుబిక్కుమంటూ తప్పనిసరి ప్రయాణాలు చేసే మహిళలకు ఓ భరోసా దక్కింది. – మామిడి విజయలక్ష్మి, సీనియర్ న్యాయవాది, తుని ఉద్యోగినులకు ఎంతో మేలు పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన ‘వుమెన్ డ్రాప్ ఎట్ హోం’ సేవలు అన్ని వర్గాల మహిళలతో పాటు ముఖ్యంగా ఉద్యోగినులకు ఎంతో ప్రయోజనకరం. ఆసుపత్రిలో షిఫ్టులకు అనుగుణంగా మహిళా వైద్యులు, ఫార్మసిస్టులు, నర్సులు, ఇతర విభాగాలకు చెందిన మహిళలు నైట్ డ్యూటీలు చేస్తుంటారు. పోలీసుల నిర్ణయంతో వారికి భరోసా దక్కింది. పోలీసులు అండగా ఉన్నారన్న ధైర్యంతో ప్రయాణాల పట్ల ఆందోళన వీడి మరింత నాణ్యమైన సేవలు అందించే అవకాశం దక్కింది. – యండమూరి పద్మమీనాక్షి, ఏపీఎన్జీవో మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, కాకినాడ -
దిశ బిల్లు ఆమోదం కోసం.. కేంద్రాన్ని కోరతాం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ బిల్లు మహిళా భద్రత దిశగా అతిపెద్ద ముందడుగని ‘మహిళా సాధికారికతపై పార్లమెంటరీ కమిటీ’ ప్రశంసించిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. దిశ బిల్లును ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని కూడా కమిటీ తెలిపిందన్నారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్ హీనా విజయ్‌కుమార్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ శనివారం విశాఖపట్నంలో పర్యటించి పోలీసు శాఖలో మహిళా అధికారులు, ఉద్యోగులతో సమావేశమవడంతోపాటు దిశ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిందని తెలిపారు. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ వ్యవస్థను తీసుకురావడం విప్లవాత్మక సంస్కరణగా పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడిందని చెప్పారు. దిశ పోలీస్ స్టేషన్‌కు అనుసంధానంగా క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ వాహనం ఏర్పాటు చేయడం ఎంతో ఉపయుక్తమైన అంశమని వైద్యురాలితోపాటు న్యాయవాది కూడా అయిన ఆమె ప్రశంసించారని తెలిపారు. దోషులను గుర్తించి 21 రోజుల్లో శిక్ష విధించాలనే నిబంధనలను దిశ బిల్లులో పొందుపరచడంతోపాటు అందుకు అవసరమైన దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శమని చెప్పారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో దిశ వ్యవస్థను తన స్వరాష్ట్రమైన మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, పోలీసు అధికారులు పరిశీలించి వెళ్లారని తెలుసుకుని ఆమె సంతోషం వ్యక్తం చేశారన్నారు. ఏపీ ప్రభుత్వం ఆమోదించిన దిశ బిల్లు వెంటనే చట్టంగా మారేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, అందుకోసం కేంద్ర హోం, న్యాయ, మహిళా–శిశు సంక్షేమ మంత్రిత్వశాఖలతో చర్చిస్తామని చెప్పారని తెలిపారు. దిశ బిల్లు, అందులో నిబంధనలు, అంద్జుకు ఏర్పాటు చేసిన మౌలిక వసతుల వ్యవస్థపై పార్లమెంటరీ కమిటీ ప్రశంసలు కురిపించడం మహిళా భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని డీజీపీ పేర్కొన్నారు. -
మహిళల రక్షణకై నిర్భయ స్క్వాడ్: ముంబై
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని సాకినాకలో మహిళపై పాశవికంగా హత్యాచారం చేసిన సంగతి తెసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ముంబై పోలీసులు నగరంలో మహిళల రక్షణ కోసం నిర్భయ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ స్క్వాడ్ టీంలో ఒక మహిళా ఆఫీసర్, పీఎస్ఐ లేదా ఏఎస్ఐ ఉంటారని తెలిపారు.(చదవండి: ముళ్లపందితో పోరులో పులి మృతి ) ఈ క్రమంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక మహిళా భద్రతా సెల్(విమెన్ సేఫ్టీ సెల్) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మహిళల భద్రత సమీక్షించటం కోసం ప్రతినెల మొదటివారం నిర్భయ స్క్వాడ్ సమావేశాన్ని సంబంధిత ప్రాంతీయ అదనపు డివిజనల్ కమిషనర్ ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. మహిళలపై నేరాలు ఎక్కువుగా జరిగే ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు మరింత ముమ్మరం చేస్తామని ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలే తెలిపారు. (చదవండి: నిమిషాల వ్యవధిలో రెండు సార్లు వ్యాక్సిన్.. తట్టుకోలేక) -
వైఎస్సార్సీపీ మహిళా పక్షపాత ప్రభుత్వం: వాసిరెడ్డి పద్మ
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ మహిళా పక్షపాతి ప్రభుత్వమని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలతో బంగారు భవిష్యత్ అందిస్తున్నారని, అన్ని పథకాల్లో మహిళలకే ప్రభుత్వం భాగస్వామ్యం కల్పిస్తోందని తెలిపారు. మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. ప్రతిపక్షాల రాజకీయాల వల్ల మహిళా లోకానికే తీరని అన్యాయం జరుగుతోందని తెలిపారు. గతంలో చంద్రబాబు పాలనలో మహిళలకు ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. చదవండి: సంక్షేమ పథకాలు ఆపేందుకు టీడీపీ కుట్ర మహిళలపై ఎక్కడ అన్యాయం జరిగినా ప్రభుత్వం తక్షణమే స్పందిస్తోందని గుర్తుశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్ ఎప్పుడైనా స్పందించారా? అని ప్రశ్నించారు. లోకేష్, టీడీపీ చర్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వంతో పోలిస్తే రెండేళ్లలో 4శాతం క్రైం రేటు తగ్గిందని, మహిళా సాధికారత అనే పదాన్ని దేశానికి పరిచయం చేసిందే సీఎం జగన్ అని పేర్కొన్నారు. దిశా చట్టాన్ని కేంద్రం ఆమోదించాలి.. అన్ని పార్టీలు సహకరించాలని వాసిరెడ్డి పద్మ తెలిపారు. చదవండి: చిన్నారి చికిత్సకు సీఎం రూ.17.5 లక్షల సాయం -
మహిళా భద్రతపై ‘దిశా’ నిర్దేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా భద్రత కోసం విప్లవాత్మక రీతిలో వ్యవస్థాగత సంస్కరణలు తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ అంశంపై పూర్తి అవగాహన కల్పించడం ద్వారా తాము సురక్షితమైన భద్రత వ్యవస్థలో ఉన్నామని మహిళలకు భరోసా కల్పించేందుకు ఉపక్రమించింది. అందుకోసం ‘దిశ’ మొబైల్ యాప్‌పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు కార్యాచరణను విస్తృతం చేసింది. విపత్కర పరిస్థితులు ఎదురైతే తక్షణం పోలీసు సహాయం పొందేందుకుగాను విద్యార్థినులు, యువతులు, మహిళలు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తున్నారు. దిశ యాప్‌పై ప్రజల్లో స్వయంగా అవగాహన కల్పించాలని ఆయన నిర్ణయించారు. కృష్ణాజిల్లా గొల్లపూడిలో మంగళవారం నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి కూడా ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు. యాప్‌ను డౌన్లోడ్ చేయించనున్న సీఎం గొల్లపూడిలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న ‘దిశ’ యాప్ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు. గొల్లపూడిలోని ఒకటో నంబర్ రోడ్డులో ఉన్న పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందుకోసం పెద్ద తెర, ప్రొజెక్టర్ మొదలైనవి ఏర్పాటు చేస్తున్నారు. దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని, ఆపదలో ఉపయోగించాల్సిన విధానాన్ని విద్యార్థినులు, యువతులు, మహిళలకు ముఖ్యమంత్రి వివరిస్తారు. కొందరు మహిళల మొబైల్ ఫోన్లలో ఆయనే స్వయంగా ఆ యాప్‌ను డౌన్లోడ్ చేయిస్తారు. దశ ‘దిశ’లా మహిళా భద్రత మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరిస్తారు. దిశ చట్టం తేవడంతోపాటు దాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్టమైన వ్యవస్థను రూపొందించింది. మహిళలపై వేధింపులకు పాల్పడితే దోషులను సత్వరం శిక్షించేందుకు క్రిమినల్ జస్టిస్ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చింది. దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేసింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. ఇక ఆపదలో చిక్కుకుంటే తక్షణం పోలీసు సహాయం పొందేందుకు దిశ యాప్‌ను రూపొందించింది. ఇవన్నీ వివరించడం ద్వారా మహిళలు తాము రాష్ట్రంలో సురక్షితమైన వ్యవస్థలో ఉన్నామనే భరోసాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 16 లక్షలమందికిపైగా దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. గొల్లపూడిలో నిర్వహించే అవగాహన సదస్సుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పెద్ద స్క్రీన్ మీద యాప్ పనితీరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా వివరిస్తారని సీఎం కార్యక్రమాల కన్వీనర్ తలశిల రఘురాం ‘సాక్షి’కి తెలిపారు. దేశానికే దిశా నిర్దేశం మహిళా భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థాగత సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. దిశ చట్టం తేవడంతోపాటు ఆ చట్టం సమర్థ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన మౌలిక వ్యవస్థను ఏర్పాటుచేసి ఓ రక్షా కవచాన్ని రూపొందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా దిశా యాప్ అవగాహన సదస్సులో పాల్గొననుండటం పోలీసు వ్యవస్థకు, ప్రజలకు గొప్ప స్ఫూర్తినిస్తుంది. – గౌతం సవాంగ్, డీజీపీ -
మహిళల భద్రతకు సాయుధ దళాలు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత, మహిళల రక్షణ కోసం ‘మిషన్ శక్తి’ పేరుతో కొత్తగా మూడు మహిళా సాయుధ దళాలను ఏర్పాటు చేయబోతోంది. ఆ దళాలకు 1857 నాటి తొలి భారత స్వాతంత్య్ర సంగ్రామ మహిళా యోధుల పేర్లు పెట్టినట్లు ప్రకటించింది. ఆ ముగ్గురు వీరాంగనల శౌర్యసాహసాల విశేషాలు క్లుప్తంగా.. ఉత్తరప్రదేశ్‌లోని బుదాన్, లక్నో, గోరఖ్‌పూర్‌లలో కొత్తగా మూడు మహిళా దళాలు ఏర్పాటవబోతున్నాయి. ‘ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కాన్స్టేబ్యూలరీ’ ఉమెన్ బెటాలియన్లు అవి. ‘పి.ఎ.సి.’లు. ప్రాదేశిక సాయుధ మహిళా రక్షణ దళాలు. మొన్న మార్చి 20 న లక్నోలో జరిగిన రాణి అవంతీబాయి లోధీ వర్ధంతి సందర్భంగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో యు.పి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఈ విషయాన్ని ప్రకటించారు. మహిళలు, బాలికల భద్రతకు, రక్షణకు ఈ మహిళా పి.ఎ.సి.లు పనిచేస్తాయి. ఒక్కోదళానికి ఒక్కో పేరుగా.. రాణి అవంతీబాయి లోధీ, ఉదాదేవి, ఝల్కారీబాయి పేర్లను పెట్టారు. ఈ ముగ్గురూ తొలి స్వాతంత్య్ర సంగ్రామంలోని వీరాంగనలు. 1857–1858 మధ్య బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడి అమరులైనవారు. నాడు పరదేశీయుల నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడిన మహిళా యోధుల పేర్లను నేటి స్వతంత్ర భారతదేశంలో మహిళల్ని అఘాయిత్యాల నుంచి, అత్యాచారాల నుంచి, అకృత్యాల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన మహిళా దళాలకు పెట్టడం.. ‘చరిత్రను మరవొద్దు, మనవాళ్లు ఎలాంటి అఘాయిత్యాలకు గురయ్యారో, మహిళలపై మనం అలాంటి హేయమైన పనులకు పాల్పడొద్దు’ అని చెప్పడమే. రాణీ అవంతీబాయి, ఉదాదేవి, ఝల్కారీబాయి.. బ్రిటిష్‌వాళ్ల గుండెలు గుభేల్మనిపించిన మహిళలు. ఖడ్గాన్ని ఎత్తిపట్టి గుర్రపు స్వారీ చేసుకుంటూ వచ్చి సమరశంఖం వంటి ఒక గర్జన చేస్తే.. అదీ మహిళలు చేస్తే.. బ్రిటిష్ అధికారులు వెనకడుగు వేస్తారా? అయితే స్వాతంత్య్రం కోసం వీరు కనబరిచిన నిబద్ధత, నిబ్బరం తెల్లవాళ్లని తెల్లబోయేలా చేసింది! నిబ్బరం సరే, ప్రతి స్వాతంత్య్ర సమరశీలికీ ఉండేదే. నిబద్ధత ఏమిటి? ఏమిటంటే.. ఆనాడు బ్రిటిష్ వాళ్లపై తిరుగుబాటు చేసిన అనేకమంది స్వదేశీ రాజ్యపాలకులకు లేనిది! అవును. అందరం కలిసి పోరాడదాం అనుకున్నాక కూడా మనవాళ్లు కొందరు జారిపోయారు. కొందరు రహస్యంగా బ్రిటిష్‌వాళ్లతో కలిసిపోయారు. ఆ సమయంలో మహిళా యోధులు గట్టిగా నిలబడ్డారు. ఒత్తిళ్లకు, బెదరింపులకు లొంగిపోకుండా ఖడ్గాన్ని ఝళిపించారు. తుపాకీ ఎక్కుపెట్టారు. తమ చివరి శ్వాస వరకు భరతమాత దాస్య శృంఖలాలను తెగ్గొట్టేందుకు పోరాడుతూనే ఉన్నారు. వారి స్ఫూర్తితో, వారి పేర్లతో ఇప్పుడు ఏర్పాటైన మూడు పి.ఎ.సి.లకు కలిపి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘మిషన్ శక్తి’ అని పేరు పెట్టింది. అంటే.. త్రిదళమహాశక్తి అని. ఆ ముగ్గురు మహిళలు అవంతి, ఉదా, ఝల్కరి గురించి క్లుప్తంగానైనా తెలుసుకోవడం.. మనసును శక్తితో, ధైర్యంతో, ధీమాతో నింపుకోవడం అవుతుంది. అవంతీబాయి లోధీ లోధీలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలోని వ్యవసాయ కుటుంబాల వాళ్లు. వాళ్లింటి అమ్మాయి అవంతి. తర్వాత ఆమె రామ్‌ఘర్ రాణి అయింది. ఇప్పుడా రామ్‌ఘర్ మధ్యప్రదేశ్‌లోని డిండోరి. సంస్థానాధీశులు ఎందరు మెత్తబడినా రాణీ అవంతీబాయి మాత్రం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారిపై ఎత్తిన ఖడ్గాన్ని దించలేదు. వారితో పోరాడుతూనే 1858 మార్చి 20 న అమరనారి అయ్యారు. 1857 మే 10 నుంచి 1858 నవంబరు 1 వరకు ఏడాదిన్నరపాటు సాగిన మొదటి భారత స్వాతంత్య్ర యుద్ధంలో రాణి అవంతి నాలుగువేల మంది సైన్యంతో శత్రువులతో తలపడ్డారు. మంద్లా దగ్గరి ఖేరి గ్రామంలో ఆమె, ఆమె సైన్యం బ్రిటిష్ సేనల్ని పరుగులెత్తించారు. అవమానభారంతో అప్పటికి వెళ్లిపోయిన పరాజిత మూకలు తిరిగి రామ్‌ఘర్ మీద ప్రతీకార దాడులు జరిపాయి. రామ్‌ఘర్‌కు నిప్పుపెట్టాయి. రాణి అవంతిక గెరిల్లా యుద్ధ వ్యూహంతో వారిని ఎదుర్కొన్నారు. బలం క్షీణించిన క్షణంలో శత్రువుకు సజీవంగా చిక్కరాదని తన సైనికుడి దగ్గర ఉన్న ఖడ్గాన్ని లాక్కుని ప్రాణత్యాగం చేసుకున్నారు. ఉదాదేవి ఉదాదేవి భారత ప్రథమ స్వాతంత్య్ర సమర దళిత యోధురాలు. ఆమెతో కలిసి బ్రిటిష్ వాళ్లపై నాడు పోరాడిన దళిత మహిళలంతా చరిత్రలో ‘దళిత వీరాంగన’లుగా గుర్తింపు, గౌరవం పొందారు. బ్రిటిష్ వాళ్లపై భారత ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను గమనించిన ఉదా దేవి ముందుగా తనే బేగమ్ హజ్రత్ మహల్ (అవథ్) ను కలిసి యుద్ధానికి ‘నేను సైతం’ అని నినదించారు. బేగమ్ హజ్రత్ ఉప్పొంగిపోయారు. అప్పటికప్పుడు మహిళలతో ఒక యుద్ధ దళాన్ని ఏర్పాటు చేసి ఉదాదేవికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆమె చేతికి తుపాకీ అందించారు. బ్రిటిష్ వాళ్లు అవ«ద్‌ను ఆక్రమించినప్పుడు ముందు వరుసలో ఉండి వారిని నిలువరించింది ఉదాదేవి మహిళా దళమే! 1857 నవంబరులో సికందర్‌బాగ్‌లో జరిగిన ముఖాముఖి పోరులో తన దళాలకు సూచనలు ఇచ్చాక, ఉదాదేవి ఒక రావి చెట్టు ఎక్కి అక్కడి నుంచి బ్రటిష్ సైనికులపై కాల్పులు జరుపుతూ వారు ముందుకు రాకుండా చేయగలిగారు. ఆకులు కొమ్మల మాటు నుంచి తూటాలు కురిపిస్తున్న వారెవరో కనిపెట్టలేక బ్రటిష్ అధికారి ఒకరు చెట్టుపైకి కాల్పులు జరపమని తన సైనికులకు ఆదేశాలు ఇవ్వడంతో ఆ మూకుమ్మడి తూటాలకు ఉదాదేవి నేలకు ఒరిగారు. అప్పటికే ఆమె తుపాకీ పన్నెండు మందికిపైగా బ్రిటిష్ సైనికుల్ని హతమార్చింది. ఉత్తరప్రదేశ్‌లో నేటికీ ఏటా నవంబర్ 16 న ఉదాదేవి స్మారక కార్యక్రమాలు గౌరవ శ్రద్ధలతో జరుగుతుంటాయి. ఝల్కారీబాయి ఝల్కారీ బాయి.. ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో సిపాయి. ప్రథమ భారత సంగ్రామంలో వీరనారిగా చిరస్మరణీయురాలైన దళిత యోధురాలు. యుద్ధ వ్యూహాలు పన్నగల యువతి. ఆ నేర్పు కారణంగానే క్రమేణా ఆమె లక్ష్మీబాయి ఆంతరంగిక సలహాదారులలో ఒకరు అయ్యారు. బ్రిటిష్ సేనలు ఝాన్సీని చుట్టుముట్టినప్పుడు లక్ష్మీబాయిని తప్పించడానికి ఆమెలా వేషం మార్చుకుని శత్రుమూకలపైకి లంఘించారు. ఆ ధైర్యసాహసాలే ఝల్కారీ బాయిని బుందేల్‌ఖండ్ ఆధునిక జానపద కథలో నాయికను చేశాయి. బ్రిటిష్‌వారితో పోరాడుతూనే 1858 ఏప్రిల్ 4న ఆమె అమరనారి అయ్యారు. ఝల్కారీ సాహసకృత్యం ఒకటి ప్రాచుర్యంలో ఉంది. బాల్యంలోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలో గుర్రపుస్వారీ, కత్తిసాము నేర్చుకుని ఉన్న ఝల్కారీ ఓ రోజు పశువులను మేపుతున్నప్పుడు ఆమెపై ఒక పులి దాడి చేయబోయింది. అప్పుడు ఝల్కారీ తన చేతిలోని కర్రతోనే లాఘవంగా పులిపై లంఘించి పులిని హతమార్చిందని ఇప్పటికీ ఆమె పుట్టిన భోజ్లా గ్రామంలో (ఝాన్సీ) కథలు కథలుగా చెప్పుకుంటారు. భారత ప్రభుత్వం అవంతీబాయి లోధీ జ్ఞాపకార్థం విడుదల చేసినట్లే ఝల్కారీ స్మారక చిహ్నంగా కూడా ఒక తపాలా బిళ్లను విడుదల చేసింది. -
అసలు నా మరో పేరు ఆనంద విహారి
కేరళకు చెందిన నిధి కురియన్ ప్రస్తుతం కోల్‌కతాలో ఉంది. ఆమె తమిళనాడులో పొలంగట్లన నిలబడింది. ఆంధ్రాలో చేపల చెరువులను చూసింది. ‘ఈ దేశం స్త్రీలకు ఎంత భద్రత ఇవ్వగలదో తెలుసుకోవాలి’ అని ఒంటరిగా సొంత కారులో సొంత డ్రైవింగ్ చేసుకుంటూ దేశాటనకు బయలుదేరింది. అర్ధరాత్రి తర్వాత సంగతి పట్టపగలు తిరగడమే స్త్రీకి కష్టం అని చెప్పే ఈ దేశంలో ఇష్టమైన విహారం మనమూ చేయొచ్చు అని తన అనుభవాలను రికార్డు చేస్తోంది నిధి. 33 ఏళ్ల నిధి కురియన్ రాయబోయే పుస్తకం కచ్చితంగా బాగుండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ఎంచుకున్న వస్తువు అలాంటిది. ‘ఈ దేశమూ... ఈ దేశ స్త్రీలూ’... ఈ దేశంలో స్త్రీలు ఎలా ఉన్నారో తను తెలుసుకోదలిచింది. అయితే అందుకు కంప్యూటర్ ఎదురుగా కూచుని గూగుల్ చేయలేదు. కారు తీసుకొని బయలుదేరింది. దానికి ‘ది గ్రేట్ ఇండియన్ సోలో ట్రిప్’ అని పేరు పెట్టింది. సోలో ట్రిప్ నిధి కురియన్‌ది కొట్టాయం. కొచ్చిలో నివసిస్తోంది. ట్రావెల్‌కు సంబంధించిన బ్లాగ్ ద్వారా కొత్త కొత్త ప్రాంతాల గురించి తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఈ చిన్న చిన్న యాత్రల కంటే ఒక భారీ యాత్ర చేయాలని నిశ్చయించుకుంది. దేశం మొత్తం తిరుగుతూ ఆ దేశంలోని ప్రదేశాలలో స్త్రీలు ఎలా ఉన్నారో ఎలా జీవిస్తున్నారో నలుగురితో పంచుకోవాలనుకుంది. పుస్తకం రాయాలనుకుంది. అనేక ఆలోచనల తర్వాత 100 రోజుల్లో 25 వేల కిలోమీటర్లు సొంత కారులో సోలో ట్రిప్ చేయాలనుకుంది. తనకు రెనాల్ట్ కారు ఉంది. ఆ కారులో ఫిబ్రవరి 7, 2021న బయలుదేరింది. తమిళనాడు మీదుగా కొచ్చి నుంచి బయలుదేరిన నిధి తమిళనాడు పాండిచ్చేరి మీదుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించి విశాఖ మీదుగా ఒరిస్సా చేరుకుని ‘పూరి’ దర్శించుకుని ప్రస్తుతం కోల్‌కతా చేరుకుంది. ‘తమిళనాడు పంటపొలాల్లో స్త్రీలను కలిశాను. విశాఖలో చేపల మీద ఆధారపడి జీవించే స్త్రీల కష్టాన్ని చూశాను. ఒరిస్సా ఆవాల చేలలో స్త్రీలు పిలిచి తాము తెచ్చుకున్న ఆహారంలో పెట్టింది తిన్నాను. ఒరిస్సాలోనే ఒక ఊరు ఊరు హస్తకళలు చేయడంలో నిమగ్నం కావడం గమనించాను. స్త్రీలే ఎక్కువగా ఈ కళాఖండాలు చేస్తున్నారు. వారే కుటుంబానికి ఆధారం’ అని చెప్పిందామె. పూరిలో ప్రసాదాలు తయారు చేసి పంచే స్త్రీలతో ఆమె సంభాషించింది. ప్రస్తుతం కోల్‌కతా దారుల్లో అనంతంగా కనిపించే స్త్రీలలో తాను ఒక స్త్రీగా తిరుగుతోంది. ఆ స్త్రీల ప్రతిధ్వని ఏదో ఉంటుంది. ఆ ప్రతిధ్వనిని ఆమె తన పుస్తకంలో రాస్తుంది. టూర్ కాదు ట్రావెల్... టూర్ చేయడం అంటే ఏవో ముఖ్య ప్రదేశాలను చూడటం... ట్రావెల్ చేయడం అంటే జన జీవనంలో భాగమై కలిసి తిరుగుతూ ఆ ప్రదేశాలను అనుభూతి చెందడం అంటుంది నిధి. ‘ఈ ప్రయాణం ఒక ధ్యానం కంటే తక్కువ కాదు నాకు’ అంటుందామె. కొత్త ప్రదేశాలను చూడటం వల్ల మనం లోకాన్ని తెలుసుకుంటాము. స్త్రీలు ప్రయాణాలు చేయాలి. ఒంటరిగా ప్రయాణం చేస్తే మనం మరింత జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంటాం... అంతే కాదు, మన అనుభవాలు మిగిలిన స్త్రీలతో చెప్పగలుగుతాం అంటుందామె. ప్రస్తుతం నిధి తెల్లవారుజామునే తన ప్రయాణం మొదలుపెట్టి సాయంత్రానికి ఆ రోజుకు నిర్దేశించిన గమ్యానికి చేరుకుంటుంది. ఎక్కువగా యూత్ హాస్టల్స్‌లో దిగుతోంది. లేదంటే ముందే బుక్ చేసుకున్న హోటళ్లలో. అయితే ఆమె తన డిక్కీలో ఒక చిన్న సిలిండర్, వంట సామాగ్రి కూడా పెట్టుకుంది. ‘నేను తినడానికి ఈ దేశ యాత్ర చేయడం లేదు. ఏదో అవసరమైనది వండుకుంటా. లేదంటే స్ట్రీట్‌ఫుడ్ తింటా’ అని చెబుతోంది నిధి. ఆమె తన ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో అప్డేట్ చేస్తోంది. ‘నీ ప్రయాణాన్ని నీతోపాటు మేమూ చేస్తున్నాం’ అంటున్నారు ఆమె ఫాలోయెర్స్. నిధి ఇప్పుడు కోల్‌కతా నుంచి ఉత్తర భారతదేశంలోకి వెళ్లనుంది. పంజాబ్, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ల మీదుగా ప్రయాణిస్తూ దేశం తిరుగుతుంది. ఆమె యాత్ర కన్యాకుమారిలో ముగుస్తుంది. నిధిలా తిరిగే అదృష్టం అందరికీ లేకపోవచ్చు. కాని ఆమె యాత్ర సేఫ్‌గా సఫలం అవ్వాలనుకునే హృదయం మనందరికీ ఉందిగా. – సాక్షి ఫ్యామిలీ -
‘మహిళా మార్చ్ 100 డేస్’ ప్రారంభం
ఒంగోలు అర్బన్/ఒంగోలు టౌన్: మహిళల భద్రతతో పాటు మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా మార్చ్ 100 డేస్ కార్యక్రమాన్ని శుక్రవారం ఒంగోలులో ఆమె ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ పోల భాస్కర్‌తో కలిసి మహిళల హక్కులు, వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిన పలు పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 డేస్ మహిళా మార్చ్‌లో దినోత్సవం వరకు 100 రోజుల పాటు మహిళల రక్షణ, సంక్షేమంపై గ్రామ స్థాయి నుంచి అవగాహన కల్పిస్తామన్నారు. ‘రాజమండ్రి ఘటన’పై కౌన్సెలింగ్ రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీ తరగతి గదిలో ఇంటర్ చదువుతున్న మైనార్టీ తీరని బాలుడు ఓ బాలికకు తాళి కట్టడం అందరికీ ఒక షాకింగ్‌లా కనపడిందని, ఈ ఘటనపై ఇరుపక్షాల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తామని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఒంగోలు ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఘటనపై అధికారులతో తాను మాట్లాడినట్లు చెప్పారు. రెస్క్యూ చేసి ఆ బాలికను ఒక హోమ్‌లో ఉంచుతామన్నారు. -
స్త్రీల హక్కులు, భద్రతలో డెన్మార్ నం.1
డిసెంబర్ 10 ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’. ఈ సందర్భంగా గత రెండు వారాలుగా ఐక్యరాజ్య సమితి లింగవివక్ష లేని, సమాన అవకాశాలు కలిగిన ప్రపంచమే లక్ష్యంగా విభిన్న కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా నవంబర్ 25ని ‘మహిళలపై హింసావ్యతిరేక దినోత్సవం’గా గుర్తించింది. అప్పటి నుంచి డిసెంబర్ 10 వరకు స్త్రీపురుష సమానత్వాన్ని చాటుతూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్త్రీల హక్కులూ మానవహక్కులుగా గుర్తించమని చెప్పడమే ఈ కార్యక్రమాల ఉద్దేశ్యం. స్త్రీల హక్కులు మానవ హక్కులే స్త్రీల హక్కులు మానవ హక్కుల్లో ఎందుకు భాగం కాదు? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. నిజానికి వారి శారీరక, మానసిక, భౌతిక అవసరాల రీత్యా స్త్రీలకు కొన్ని ప్రత్యేక హక్కులుండాలని ఐక్యరాజ్యసమితి గుర్తించి వాటిని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా మలిచింది. అయితే వాటికిప్పటికింకా సమాజంలో ఆమోదముద్ర పడలేదన్నది కాదనలేని సత్యం. ఇప్పటికీ అది చేరుకోవాల్సిన లక్ష్యం. స్త్రీల హక్కులు మానవ హక్కుల్లో భాగమేనని గుర్తించిన దేశాలు బహు తక్కువని 2019 లింగ సమానత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 129 దేశాల్లో జరిపిన అధ్యయనంలో సంపూర్ణంగా లింగ సమానత్వాన్ని సాధించిన దేశాలు లేనేలేవన్న విషయం వెల్లడయ్యింది. అయితే స్త్రీపురుష సమానత్వం కోసం కృషి చేస్తోన్న దేశాల్లో కొంతలో కొంత మెరుగైన ఫలితాలను సాధించడం గమనించాల్సిన విషయం. కొన్ని దేశాల్లో కొంత మెరుగు... 2019లో జరిగిన సర్వే ప్రకారం లింగ సమానత్వం వైపు పురోగమిస్తోన్న టాప్ టెన్ దేశాల్లో డెన్మార్క్‌ది తొలిస్థానం. ఫిన్లాండ్ ద్వితీయస్థానంలో; స్వీడన్ మూడవ స్థానంలో ఉన్నాయి. నార్వే నాలుగు, నెదర్లాండ్స్ ఐదు, స్లోవేనియా ఆరు, జెర్మనీ ఏడు స్థానాల్లో ఉన్నాయి. కెనడా ఎనిమిదవ స్థానంలో ఉండగా, ఐర్లాండ్ తొమ్మిదవ స్థానాన్ని, ఆస్ట్రేలియా పదో స్థానాన్ని దక్కించుకున్నాయి. సమానత్వంలో టాప్ డెన్మార్క్... స్త్రీల విషయంలో టాప్ వన్ స్థానంలో నిలిచిన డెన్మార్క్ గురించి ఇప్పుడు మిగిలిన దేశాలు దృష్టి పెట్టాయి. డెన్మార్క్‌లో నాలుగ్గంటలకే సూర్యాస్తమయం అవుతుంది. అంటే డెన్మార్క్‌లో దీర్ఘరాత్రులుంటాయి. అయితే అక్కడ చీకటి అభద్రతకు చిహ్నం కాదు. ఆ దేశంలో మహిళలు పగలే కాదు రాత్రిళ్ళు కూడా అత్యంత సురక్షితంగా ఉంటారు. స్త్రీ పురుష సమానత్వాన్ని సా«ధించేందుకు ఆ దేశంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాదు సంక్షేమ రాజ్యంగా కూడా డెన్మార్క్‌ని పేర్కొంటారు. ఆరోగ్యం, విద్య, ఉద్యోగావకాశాల్లో స్త్రీపురుష సమానత్వాన్ని విస్తృతంగా ముందుకు తెచ్చింది డెన్మార్క్ ప్రభుత్వం. డెన్మార్క్‌లో ఉపాధిరంగంలో ఉన్న మహిళలు అత్యధికంగా ఉన్నారు. స్త్రీ అయినా పురుషులు అయినా ఒకే విధమైన వేతన విధానాన్ని అనుసరించారు. ఆర్థిక రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ నిర్ణయాత్మక పాత్రలో మహిళలకూ సమ ప్రాధాన్యముంది. 2014 ఎన్నికల అనంతరం 30 శాతం మంది మంత్రులూ, 37 శాతం మంది పార్టీ నాయకులూ స్త్రీలే ఉన్నారు. వివిధ కంపెనీల్లో బోర్డు మెంబర్లుగా ఉన్న స్త్రీల శాతం పెరిగింది. ఇక్కడ స్త్రీలు 61 ఏళ్ళకు రిటైర్ అయితే, పురుషులకది 63 ఏళ్ళు. పునరుత్పత్తి హక్కులు... వివాహ వయస్సు, పునరుత్పత్తి హక్కుల విషయంలో డెన్మార్క్ ముందుంది. 2012లో ఇక్కడ స్త్రీలు తొలి బిడ్డను కనే వయస్సు 29. 52 వారాల పేరెంటల్ లీవ్ అమలుచేస్తున్నారు. అత్యధిక శాతం తల్లులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. భర్తలకు ఇచ్చే పిల్లల పెంపకానికి సంబంధించిన సెలవుని సైతం పెంచారు. పిల్లల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత... మహిళా ఉద్యోగుల పిల్లల పెంపకానికి సంబంధించిన విషయాల్లో సైతం డెన్మార్క్ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ప్రభుత్వమే పిల్లల సంరక్షణ బాధ్యతను వహిస్తోంది. వాటి పర్యవేక్షణకు సరిపడే అధికారులను, సిబ్బంది నియామకాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. 2013లో 0–2 ఏళ్ళ మధ్య వయస్సు పిల్లల్లో 67.9 శాతం మందిని ప్రభుత్వం నిర్వహించే చైల్డ్ కేర్ సెంటర్లలో చేర్పించారు. అదే ఏడాది 3–5 ఏళ్ళ మధ్యవయస్సు పిల్లల్లో 97.2 శాతం మందిని చేర్పించారు. మానవ అక్రమ రవాణానిషేధంపై డెన్మార్క్ ప్రత్యేక దృష్టి సారించింది. –అరుణ అత్తలూరి -
అతివలకు అండగా 181
సాక్షి, నెహ్రూనగర్/గుంటూరు: మహిళల సమస్యల పరిష్కారం కోసం 13 జిల్లాల్లోని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా సఖీ (వన్ స్టాప్ సెంటర్) కేంద్రాలు కొనసాగుతున్నాయి. 2016 సెప్టెంబర్ నుంచి మహిళలకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. పోలీసు, వైద్య, న్యాయ, మహిళా శిశు సంక్షేమ విభాగాలతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలతో అనుసంధానమై 181 కాల్ సెంటర్ పనిచేస్తుంది. కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేసే మహిళల వివరాలు ఇక్కడ గోప్యంగా ఉంచుతారు. మహిళలు ఫిర్యాదు చేసే అంశాలు లైంగిక వేధింపులు, గృహ హింస, బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, అక్రమ సంబంధాలు, ఈవ్‌టీజింగ్, బెదిరింపులు, మహిళల అక్రమ రవాణా, సెల్‌ఫోన్ ద్వారా జరిపే నేరాలు, సోషల్ వెబ్సైట్ల ద్వారా జరిపే నేరాలు, మాదకద్రవ్యాలకు లోనై హింసించడం, ఇంటి నుంచి గెంటేయడం, పనిచేసే ప్రదేశంలో మహిళలపై వేధింపులు, తల్లిదండ్రుల నిర్లక్ష్యం తదితర ఫిర్యాదులపై మహిళలు నిర్భయంగా 181కు కాల్ చేయవచ్చు. ఫిర్యాదు తీవ్రతను బట్టి సఖీ కేంద్రంలో సోషల్ కౌన్సెలర్, లీగల్ కౌన్సెలర్లు కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అవసరం అయితే పోలీసుల సహాయం కూడా తీసుకుంటారు. మొత్తం 3,245 ఫిర్యాదులు గుంటూరు నగరంలో 2016 సెప్టెంబర్‌లో 181 కాల్ సెంటర్ ప్రారంభమైంది. ఏపీకి సంబంధించిన 13 జిల్లాల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ప్రారంభం నుంచి 2019 సెప్టెంబర్ వరకు 181కు 3,245 ఫిర్యాదులు అందాయి. వాటిలో సఖీ కేంద్రం ద్వారా పరిష్కరించిన కేసులు 2,304 అని అధికారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళను తన భర్త అనుమానంతో రోజు తాగి కొడుతుండటంతో చేసేదేమి లేక సదరు మహిళ 181కి కాల్ చేసింది. అక్కడ సిబ్బంది సఖీ కేంద్రానికి వారిని తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇవ్వడంతో వారి కాపురం సజావుగా సాగుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు ప్రేమికులు కులాంతర వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండు నెలలు కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత నుంచి కట్నం కోసం ఆ మహిళను అత్త, మామలతో కలిసి భర్త కూడా వేధించడంతో సదరు మహిళ 181 కాల్ సెంటర్ కాల్ చేసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లింది. కాల్ సెంటర్ సిబ్బంది సమస్యను సఖీ కేంద్ర దృష్టికి తీసుకెళ్లగా అక్కడ అత్త, మామ, భర్తకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో ప్రస్తుతం కాపురంలో కలతలు తొలగిపోయాయి. విజయవాడలో ఓ తల్లిని ఓ సుపుత్రుడు నిత్యం తాగి కోడుతూ, తిడుతూ ఉండగా ఓపిక నశించి ఆ తల్లి 181కు కాల్ చేసింది. అక్కడి సిబ్బంది విజయవాడ పోలీసులకు సమాచారం అందించి.. అతడికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు డీ–అడిక్షన్ సెంటర్ ద్వారా తాగుడు మాన్పించేందుకు మందులు వాడారు. ప్రస్తుతం ఆ యువకుడు తాగుడు మానేసి ఉద్యోగం చేసుకుంటూ తల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు మహిళలకు ఏ సమస్య వచ్చినా నిర్భయంగా 181కు 24/7 కాల్ చేయవచ్చు. కాల్ చేసేవారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఆపదలో ఉన్న మహిళలు, చెప్పుకోలేని సమస్యలు ఉన్న మహిళలు 181కి ఏ సంకోచం లేకుండా కాల్ చేసి సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. – సుధారాణి, కాల్ సెంటర్ సూపర్వైజర్ -
సమాజంలో లింగవివక్ష ఉండకూడదు
-
దారి మళ్లింపు
మహిళలు నిర్భయంగా బయటికి వెళ్లిరాలేకపోతున్నారంటే భద్రతా యంత్రాంగంలో లోపం ఉందనే కానీ.. చీకటి వెలుగులలో, రాకపోకల రహదారులలో భద్రతలేని విపరీతాలు ఉన్నాయని కాదు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మహిళల భద్రత కోసం ఉచిత ప్రయాణం అనే ‘దారి మళ్లింపు’ను ఒక పరిష్కారంగా ఎంచుకున్నారు! మాధవ్ శింగరాజు విపత్తులు, విలయాలు వచ్చి.. పట్టాలు దెబ్బతిన్నప్పుడు రైళ్ల రాకపోకల్ని దారి మళ్లిస్తుంటారు. విపత్తులను, విలయాలను ప్రభుత్వాలు దారి మళ్లించలేవు కాబట్టి, ప్రజల ప్రయాణాలనే సురక్షిత మార్గాలలోకి మళ్లిస్తుంటాయి. అది ప్రభుత్వాల బాధ్యత కూడా. అమ్మాయి స్కూలుకు వెళుతోంది. లేదా ఉద్యోగానికి వెళ్లొస్తోంది. వచ్చే పోయే దారిలో లైంగిక వేధింపులు ఎదురౌతున్నాయి. ఆ వేధించేవాళ్ల నుంచి తప్పించడానికి చక్కగా చదువులకు, ఉద్యోగాలకు వెళ్లొచ్చే పిల్లల్ని దారి మళ్లించడం మాత్రం ప్రభుత్వాలు చేయదగిన పని కాదు. వేధించేవాళ్లేమీ మానవులు నిరోధించలేని విపత్తులు, విలయాలు కాదు.. బిక్కుబిక్కుమంటూ వేరే రూటులో స్కూలు బ్యాగు మోసుకుంటూ వెళ్లిరావడానికి, క్యాబ్‌లలో దొంగమొహాలు ఉంటున్నాయని మెట్రోల్లో ఆఫీసుకు ప్రయాణించడానికి! అమ్మాయిల్ని వేధించేవారికి చట్టబద్ధంగా నాలుగు తగిలించి ‘సెట్‌రైట్’ చేసే యంత్రాంగం ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఉంది. అయినా గానీ బాలికలు స్కూళ్లకు, మహిళలు ఉద్యోగాలకు నిర్భయంగా వెళ్లిరాలేకపోతున్నారంటే భద్రతా యంత్రాంగంలో లోపం ఉందనే కానీ.. చీకటి వెలుగులలో, రాకపోకల రహదారులలో భద్రతలేని విపరీతాలు ఉన్నాయని కాదు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మహిళల భద్రత కోసం ‘దారి మళ్లింపు’నే ఒక పరిష్కారంగా ఎంచుకున్నారు! చీకటి పడ్డాక క్యాబ్‌లలో రావడం సురక్షితం కాదు కాబట్టి, పట్టపగలైనా ఒకరిద్దరి మధ్య ప్రయాణించడం సేఫ్ కాదు కాబట్టి.. ఎప్పుడూ రద్దీగా ఉండి, జనం బాగా మసులుతుండే మెట్రో రైళ్లను, కార్పొరేషన్ బస్సులను తమ డే–టు–డే జర్నీకి ఎంచుకునేలా మహిళలందరికీ ఆయన ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించబోతున్నారు! ఆదేశాలు అమల్లోకి వచ్చిన వెంటనే ఢిల్లీ మహిళలు మెట్రో రైళ్లలో, కార్పొరేషన్ బస్సులలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్ లేకుండా ప్రయాణించవచ్చు. ఉచిత ప్రయాణం వల్ల మహిళలపై వేధింపులు తగ్గుతాయా అనే ప్రశ్న కనుక మీరు వేయదలిస్తే కాస్త ఆగండి. అది పూర్తిగా సంబంధం లేని ప్రశ్న. ఉచిత ప్రయాణానికి, సురక్షిత ప్రయాణానికి సంబంధం లేదు కాబట్టి! ఉచిత ప్రయాణమేమీ మహిళల ఒంటి మీది కరెంట్ జాకెట్ కాదు.. ఎవరైనా చెయ్యేస్తే చెయ్యి వేసిన వ్యక్తి షాక్ కొట్టి గిలగిల కొట్టుకుంటూ కింద పడిపోడానికి! మరి ఏడాదికి 700 కోట్ల రూపాయల వ్యయం అయ్యే ఈ ‘స్కీమ్’ వల్ల ప్రయోజనం ఏమిటి? ఏమీ లేదు. మహిళల్ని వేధింపుల నుంచి ‘దారి మళ్లించడం’.. అంతే. లేదా ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం. రోజుకు లక్ష మంది మహిళలకు ఈ ఏడొందల కోట్ల రూపాయల వల్ల రక్షణ లభిస్తుందని కేజ్రీవాల్ అంచనా. అంటే.. రోజూ క్యాబ్‌లలో, ప్రైవేటు వాహనాల్లో వెళ్లొస్తుండే మహిళల్లో లక్షమంది ‘ఉచితం’లోకి మళ్లుతారని. ‘పొలోమంటూ.. ఉన్నవాళ్లు, లేనివాళ్లు ఉచిత ప్రయాణానికి ఎగబడితే మెట్రో రైళ్లు కిక్కిరిసి పోతాయి కదా’ అనే మాటకు ఆయన వేసిన లక్ష లెక్క అది! క్యాబ్‌ల నుంచి కార్పొరేషన్ బస్సులకు షిఫ్ట్ అయ్యే మహిళల సంఖ్య ఎంతో కూడా ఆయన టీమ్ లెక్కేసే పనిలో ఉంది. వారం రోజుల్లో ఆ డేటా అంతా ఇవ్వాలని కేజ్రీవాల్ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు! వచ్చే రెండు మూడు నెలల్లో ఢిల్లీ ప్రభుత్వం మహిళలకు కల్పించబోతున్న ఈ ఉచిత ప్రయాణ సదుపాయం వల్ల ఢిల్లీలో జెండర్ క్రైమ్ రేట్ బాగా తగ్గిపోతుందని ఢిల్లీ మొత్తం మీద కేజ్రీవాల్ ఒక్కరే బలంగా నమ్ముతున్నారు. ఢిల్లీ ప్రస్తుత జనాభా 2 కోట్ల 60 లక్షలు. ఇందులో సగం మంది మహిళలే అన్నది సాధారణమైన విషయం అయితే, ఈ సగంమందిలో లక్షకు 300 మంది ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారన్నది అసాధారణమైన సంగతి. యూ.కె.లో ఈ లెక్క 80గా, ప్రపంచం మొత్తం మీద సగటున 40గా ఉంది. ఢిల్లీ రైళ్లలో, బస్సులలో రోజుకు 60 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వాళ్లలో మహిళలు ముప్పై లక్షల మంది ఉంటారనుకున్నా.. కేజ్రీవాల్ ఉచిత ప్రయాణం కల్పించబోతున్న రక్షణ ఈ ముప్పై లక్షలమందికి కాదు. క్యాబ్‌లు, రిక్షాల నుంచి రైళ్లకు మళ్లే రెండు మూడు లక్షలమందికి (బస్సులను కూడా కలుపుకుని). ఈ రెండు మూడు లక్షల మందిని కాపాడే బాధ్యతలను ఆయన సీసీ కెమెరాలకు అప్పగిస్తే ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసే పని ఉండదు. మిగతా డబ్బును సమృద్ధిగా మహిళల సంక్షేమానికి, సంరక్షణకు ఉపయోగించవచ్చు. అప్పుడు లక్షకు 300గా ఉన్న క్రైమ్ రేటు కూడా తగ్గుతుంది. అయితే ఈ తెలివి కేజ్రీవాల్‌కు లేక కాదు. ‘నిర్భయ’ ఘటన జరగడానికి ఇరవై రోజుల ముందు ఆవిర్భవించి, నిర్భయ వంటి ఘటనలు మళ్లీ జరగక్కుండా ఢిల్లీ మహిళలకు భద్రత కల్పించడమే తమ ధ్యేయమన్న హామీతో నాలుగేళ్ల క్రితం అఖండ విజయం సాధించిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్లీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడ్డాయి. నిజానికి ఈ మాటను మనం ఇంకోలా చెప్పుకోవాలి.. ‘రోజులు దగ్గర పడ్డాయి’ అని! ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేని ఈ తరుణంలో కేజ్రీవాల్ తిరిగి మునుపటి హామీతోనే మోదీని ఎదుర్కోవడం తప్ప వేరే దారి లేని పరిస్థితిని ఈ నాలుగేళ్లలో ఢిల్లీలో మహిళలపై ఏమాత్రం తగ్గుముఖం పట్టని నేరాలు తెచ్చిపెట్టాయి. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకులు పడే పాట్లు ఎలాంటివైనా.. నగరాల్లో, పట్టణాల్లో ఇంటి నుంచి బయటికి వెళ్లిన మహిళ తిరిగి ఇంటికి చేరే వరకు పడే పాట్లన్నిటికీ ప్రధాన కారణం భద్రత లేకపోవడం అనుకుంటాం కానీ, లేకపోవడం కాదు. ‘కల్పించలేకపోవడం’. నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లో బీజేపీనే విజయం సాధించింది! ఆ ఏడుగురు ఎంపీల గెలుపులో కీలక పాత్ర పోషించినది కూడా.. దైనందిన జీవితంలో భద్రతను కోరుకున్న మహిళా ఓటర్లే. మహిళలు నిర్భయంగా, స్వేచ్ఛగా మసలేంత భద్రతను కల్పిస్తామని బీజేపీ ఇచ్చిన హామీ బాగా ప్రభావం చూపింది. మహిళలకు అంతకుమించిన హామీని ఏదైనా ఇస్తే తప్ప కేజ్రీవాల్ మళ్లీ అధికారంలోకి రావడం కష్టం. అందుకే ఆయన ఈ ఉచిత ప్రయాణం వైపు మళ్లినట్లున్నారు. అనుదిన జీవన పోరాటంలో భద్రత తర్వాతే మహిళకు ఏదైనా. ‘ఏమమ్మా.. నీ భద్రత కోసం పెద్ద ప్రాజెక్టును తలకెత్తుకున్నాం. నీ వంతుగా పదో, ఇరవయ్యో ఇవ్వు’ అని ప్రభుత్వమే వచ్చి అడిగినా.. సంతోషంగా పర్సులోంచి ఇంకో పది ఎక్కువే తీసి ఇచ్చే మహిళలకు.. భద్రత పేరుతో డబ్బులు మిగిల్చినా అది వాళ్లకు ఏం సంతోషం.. ఉచిత ప్రయాణానికీ, వేధింపులు తగ్గడానికి ఏం సంబంధం లేదని క్లియర్‌గా తెలిసిపోతుంటే?! ఒంటిపై చెయ్యేసినవాడు తప్పించుకుని పోవడానికి వీల్లేకుండా చెయ్యాలి కానీ, ఒంటిపై చెయ్యేస్తున్నవాడి నుంచి తప్పించడానికికైతే ప్రభుత్వాలు ఎందుకు?! ∙ -
ఢిల్లీ అమ్మాయిగా సవాల్ చేస్తున్నా
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు చెప్పుకుని చివరి రెండు దశల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు అడగాలంటూ ప్రధాని మోదీ విసిరిన సవాల్‌కు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజీవ్ కూతురు ప్రియాంక ప్రతిసవాల్ విసిరారు. ‘ఢిల్లీ అమ్మాయిగా సవాల్ చేస్తున్నా. జీఎస్టీ, నోట్లరద్దు, మహిళా భద్రత, యువతకిచ్చిన హామీలపై ప్రచారం చేస్తూ ఓట్లు అడగండి’ అని అన్నారు. ఢిల్లీలో తన తొలి ఎన్నికల ర్యాలీలో ప్రియాంక పాల్గొని, ఈశాన్య ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు షీలా దీక్షిత్, బాక్సర్ విజేందర్ సింగ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తాను చిన్నప్పటి నుంచి ఢిల్లీలో పుట్టిపెరిగిన దాన్ననీ, ఇక్కడి ప్రతి వీధీ తనకు తెలుసని, మోదీ కేవలం గత ఐదేళ్లుగా మాత్రమే ఢిల్లీలో ఉంటున్నారని ప్రియాంక అన్నారు. ‘నేను ఇదే నగరంలో పుట్టిపెరిగాను. మోదీ తన అధికారిక నివాసం దాటి ఢిల్లీలో ఇంకెక్కడా తిరగరు. నేను ప్రజలను అగౌరవించలేను. మేం బీజేపీలా పొగరుబోతులం కాదు. ఈ ప్రజల వల్లే మేం ఈనాడు ఈ స్థాయిలో ఉన్నాం’ అని పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ నంబర్ 1 అవినీతిపరుడిగా మిగిలిపోయారనీ, ఆయన ప్రధానిగా ఉండగానే పలు కుంభకోణాలు జరిగాయంటూ మోదీ ఇటీవల ప్రచారంలో ప్రస్తావించడం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేయగా, అవినీతిపరుడిని అలా అంటే తప్పేంటనీ, దమ్ముంటే ఆయన పేరు చెప్పుకుని కాంగ్రెస్ ఓట్లు అడగాలని మోదీ సవాల్ విసరడం తెలిసిందే. మతంతో వ్యవస్థల నాశనం.. ర్యాలీలో ప్రియాంక మాట్లాడుతూ మోదీ అన్ని ప్రభుత్వ వ్యవస్థలను, సంస్థలను నాశనం చేస్తున్నారనీ, మతం పేరిట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ హోంవర్క్ చేయడంలో విఫలమైన విద్యార్థి లాంటివారని చురకలంటించారు. పైగా పండిట్ నెహ్రూ జవాబు పత్రం తీసుకున్నారని, ఇందిరాగాంధీ కాగితపు పడవ చేశారు లాంటి సాకులు చెబుతారని అన్నారు. ‘జాతీయవాదం గురించి బీజేపీ, మోదీ మాట్లాడతారు. ఈ దేశ యువతకు మంచి భవిష్యత్తును ఇవ్వడం జాతీయవాదం కాదా?’ అని ప్రశ్నించారు. ప్రచారం సందర్భంగా మాట్లాడుతున్న ప్రియాంక -
అసభ్యకర వీడియో చిత్రీకరణ.. వ్యక్తికి దేహశుద్ది
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా : తమకు తెలియకుండా అసభ్యకర వీడియో చిత్రీకరిస్తున్న ఓ వ్యక్తికి దేహశుద్ధి చేశారు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి మహిళా సెక్యూరిటీ సిబ్బంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళా సెక్యూరిటీ సిబ్బందికి తెలియకుండా చాటుగా ఓ వ్యక్తి వారిని వీడియో తీస్తున్నాడు. అది గమనించిన ఓ మహిళా సెక్యూరిటీ.. మిగితా సిబ్బందికి తెలియజేశారు. ఇంతలోనే ఆ వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేశారు. పరుగెత్తి పట్టుకున్న సిబ్బంది ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అతని ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేసి పోలీసులకు అప్పగించారు. -
లైంగికహింసపై పోరాటానికి నోబెల్
ఓస్లో: ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అంతర్యుద్ధాలు జరుగుతున్న కల్లోలిత ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న లైంగిక హింసపై అలుపెరుగని పోరు జరుపుతున్న ఇద్దరికి ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. కాంగోకు చెందిన వైద్యుడు డెనిస్ మక్వీజ్(63), ఇరాక్‌లోని యాజిది తెగకు చెందిన యువతి నదియా మురాద్(25)లు ఈ ప్రతిష్టాత్మక గౌరవం పొందారు. యుద్ధాల్లో లైంగిక హింసను ఒక ఆయుధంగా వాడుకోకుండా నిరోధించేందుకు ఈ ఇద్దరు ఎంతో పోరాడారని నోబెల్ ఎంపిక కమిటీ ప్రశంసించింది. ఈ అవార్డుల ప్రకటనను అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితి స్వాగతించాయి. ‘యుద్ధ సమయాల్లోనూ మహిళల హక్కులు, భద్రతను గుర్తించి కాపాడితేనే శాంతియుత ప్రపంచం సాకారమవుతుంది’ అని కమిటీ చైర్మన్ బెరిట్ రీస్ అండర్సన్ వ్యాఖ్యానించారు. యుద్ధాలు, సాయుధ దళాల సంఘర్షణల్లో లైంగిక హింస కట్టడికి పోరాడిన మక్వీజ్ జాతీయంగా, అంతర్జాతీయంగా పేరు గడించారని పేర్కొన్నారు. మక్వీజ్, మురాద్ తమ వ్యక్తిగత జీవితాలను పణంగా పెట్టి లైంగిక నేరాలపై పోరాడారని కొనియాడారు. కాంగోలో యుద్ధ సమయాల్లో లైంగిక హింసకు గురైన మహిళలు శారీరక, మానసిక క్షోభ నుంచి కోలుకునేలా మక్వీజ్ గత రెండు దశాబ్దాలుగా సేవ చేస్తున్నారు. 1999లో తాను స్థాపించిన ఆసుపత్రిలో వేలాది మంది బాధితులకు చికిత్స అందించారు. ‘డాక్టర్ మిరాకిల్’గా పిలిచే మక్వీజ్..యుద్ధ సమయాల్లో మహిళలపై దాష్టీకాలను నిర్మొహమాటంగా ఖండించారు. 2014లో ఐఎస్ ఉగ్రవాదుల చేతిలో అపహరణకు గురైన మురాద్..మూడు నెలల తరువాత వారి చెర నుంచి తప్పించుకుంది. ఉగ్రవాదులు లైంగిక బానిసలుగా చేసుకున్న వేలాది మంది యాజిది మహిళలు, చిన్నారుల్లో మురాద్ కూడా ఒకరు. హాలీవుడ్‌ను కుదిపేసిన ‘మీటూ’ ఉదంతం వెలుగు చూసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా లైంగిక నేరాలపై పోరాడి న వారికి నోబెల్ శాంతి బహుమతి దక్కడం విశేషం. వెల్లువెత్తిన అభినందనలు.. మక్వీజ్, మురాద్‌ల ధైర్య సాహసాలను యూరోపియన్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్, జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్ కొనియాడారు. మక్వీజ్‌కు నోబెల్ దక్కిన వార్త వెలువడిన వెంటనే ఆయన ఆసుపత్రి ప్రాంగణంలో సంబరాలు మిన్నంటాయి. మురాద్‌కు నోబెల్ బహుమతి రావడం.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ఇరాక్ పౌరులందరికీ గర్వకారణమని ఆ దేశ అధ్యక్షుడు బర్హాం సలేహ్ అన్నారు. ఉగ్రవాదులకు ఇది చెంపపెట్టు అని, లైంగిక హింసకు గురైన బాధితుల పట్ల ఇరాక్ ప్రభుత్వం మరింత దృష్టిసారిస్తుందని ఆశిస్తున్నట్లు యాజిది ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. మురాద్, మక్వీజ్లు కాకుండా ఈ అవార్డుకు అర్హులు మరొకరు లేరని ఐరాస మానవహక్కుల హైకమిషనర్ మిచెల్ బ్యాచ్‌లెట్ కితాబిచ్చారు. మరోవైపు, కాంగో ప్రభుత్వం మక్వీజ్‌ను అభినందిస్తూనే, ఆయన తన సేవలను రాజకీయం చేశారని విమర్శించింది. బాధితురాలే నాయకురాలై.. నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న ఇరాక్‌కు చెందిన యాజిదీ యువతి మురాద్ నదియా (25)ది పోరాట గాథ. 2014లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉత్తర ఇరాక్‌లోని ఓ గ్రామంపై తెగబడ్డారు. మైనారిటీలైన కుర్దులుండే ఈ గ్రామంపై దాడిచేసి.. కనబడ్డ మగవారిని చంపేశారు. మహిళలు, చిన్నారులను ఎత్తుకెళ్లారు. వారిలో మురాద్ నదియా (25) ఒకరు. వీరిని తీసుకెళ్లిన ఐఎస్ ఉగ్రవాదులు మహిళలు, చిన్నారులని తేడా లేకుండా అందరిపై దారుణంగా, కిరాతకంగా వ్యవహరించారు. లైంగిక బానిసలుగా తమ వద్ద పెట్టుకుని దారుణమైన అకృత్యాలకు పాల్పడ్డారు. మూడు నెలలపాటు వీరి అరాచకాలను భరించిన నదియా.. అతికష్టం మీద తప్పించుకున్నారు. ఐసిస్ నుంచి తప్పించుకుని శరణార్థుల శిబిరానికి చేరుకున్న తర్వాత.. ఆమె జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలైంది. తన లాగా మరెవరూ ఈ కిరాతక కూపంలో ఉండకూడదని నిశ్చయించుకున్నారామె. శిబిరంలో బ్రిటీష్ లాయర్, హక్కుల కార్యకర్త అమల్ క్లూనీ పరిచయం ఆమె ఆశయానికి మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. అదే.. యాజిదీలకు జరుగుతున్న అన్యాయం ప్రపంచానికి వివరించేలా చేసింది. ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై నదియా.. తన గళం విప్పే అవకాశాన్ని కల్పించింది. దీని ఫలితంగానే.. దాదాపు నాలుగున్నర లక్షల మంది బాధితులకు ఐసిస్ నరకకూపం నుంచి విముక్తి లభించింది. ‘ద లాస్ట్ గర్ల్’ తన తోటి యాజిదీలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితుల గురించి ‘ద లాస్ట్ గర్ల్’ పేరుతో నదియా ఒక పుస్తకాన్ని రాశారు. 2017లో ఈ పుస్తకం ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి అమల్ క్లూనీ ముందుమాట రాసి మరోసారి నదియాకు మద్దతుగా నిలిచారు. ఇరాక్‌లో ఐసిస్ దురాగతాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించడం నదియా పోరాట ఫలితమే. ‘నాకు అప్పుడు 21 ఏళ్లు. 2014, జూలైలో నన్ను ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అడ్డొచ్చినందుకు అమ్మ, ఆరుగురు సోదరులను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత నాతో పాటు మేనకోడళ్లను కూడా లైంగిక బానిసలుగా మోసూల్ పట్టణంలో మాలాగే.. ఓ 30 మంది బాధితులు ఉన్న శిబిరంలో పడేశారు. రోజూ ఓ వంద మంది ఉగ్రవాదులు వచ్చేవారు. వారికి నచ్చిన వారిని ఎంపిక చేసుకుని రాక్షసానందం పొందేవారు. చిన్న పిల్లలైన నా మేనకోడళ్లపైనా ఆ దుర్మార్గులు కనికరం చూపలేదు. ఈ అకృత్యాలను తట్టుకోలేక ఓ రోజు వారికి ఎదురు తిరిగాను. దీంతో కోపోద్రిక్తుడైన ఐసిస్ నాయకుడొకడు నన్ను తీవ్రంగా హింసించాడు. మమ్మల్ని చంపేయని అడిగాను. కానీ వాడలా చేయలేదు. ఇలా హింసించడంలోనే ఆనందం ఉందన్నాడు. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను’ అని ఐఎస్‌లో లైంగిక బందీగా ఉన్నప్పటి దారుణాలను నదియా వివరించారు. డాక్టర్ ‘మిరాకిల్’ మక్వీజ్ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో.. రాజకీయ హింస, అధికార, ప్రభుత్వ వ్యతిరేక దళాల మధ్య అంతర్యుద్ధంతో రావణకాష్టంలా మారింది. దశాబ్దాలుగా ఇది కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా లెక్కలేనన్ని కుటుంబాలు అస్తిత్వాన్ని కోల్పోయాయి. ఇది చాలదన్నట్లు రెండు వర్గాలు మహిళలను తమ ఆయుధాలుగా వాడుకుంటున్నాయి. ఈ సంఘర్షణలో లెక్కలేనంత మంది మహిళలు లైంగిక హింసకు గురయ్యారు. అయితే.. లైంగిక హింస బాధితులను ఆదుకునేందుకు డాక్టర్ డెనిస్ మక్వీజ్ రెండు దశాబ్దాలుగా అలుపెరగని ప్రయత్నం చేస్తున్నారు. 1999లో దక్షిణ కివూలో పంజీ హాస్పిటల్‌ను స్థాపించి.. అత్యాచార బాధితులకు అండగా నిలిచారు. తన వద్దకు వచ్చే బాధితులను ఆదుకునేందుకు ఈ డాక్టర్ రోజుకు 18 గంటల పాటు పనిచేసిన సందర్భాలు లెక్కలేనన్ని. తిరుగుబాటుదారులు ఎంత క్రూరంగా అత్యాచారాలు చేసే వారంటే కొందరు మహిళలకు ఒకటి కంటే ఎక్కువసార్లు శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చేది. కాంగో మహిళలకు మక్వీజ్ అందిస్తున్న సేవల గురించి ‘ద గ్లోబ్ అండ్ మెయిల్’ పత్రిక ద్వారా ప్రపంచానికి తెలిసింది. అయితే.. తమ చేతుల్లో అత్యాచారానికి గురైన మహిళలకు డాక్టర్ అండగా నిలుస్తున్నాడనే కక్షతో ఉగ్రవాదులు ఆయన్ను హతమార్చడానికి ప్రయత్నించారు. 2012లో తన ఇంటిపై దాడి చేసినపుడు అక్కడి నుంచి తప్పించుకుని యూరోప్ వెళ్లారు. ఆయన లేని సమయంలో పంజీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు జరగక బాధిత మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆరునెలల తర్వాత తిరిగి వచ్చిన మక్వీజ్‌కు బుకావ్ విమానాశ్రయం 21 మైళ్ల దూరమున్న పంజీ ఆసుపత్రి వరకు ప్రజలు.. ముఖ్యంగా మహిళలు స్వాగతం పలికారు. యూరప్‌లో ఉన్న సమయంలోనే మక్వీజ్.. ఐరాస వేదికగా కాంగో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ప్రపంచానికి వెల్లడించారు. ‘డాక్టర్ మిరాకిల్’గా సుపరిచితుడైన ఆయన.. మహిళలపై లైంగిక దాడిని ‘భారీ విధ్వంసక ఆయుధం’గా అభివర్ణించారు. శాంతి బహుమతి ప్రకటన జరిగినపుడు కూడా ఆయన తన విధుల్లోనే (శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు) ఉన్నారు. అయితే నోబెల్ శాంతి బహుమతికి డాక్టర్ మక్వీజ్ ఆరుసార్లు నామినేట్ కావడం విశేషం. -
క్యాబ్ ప్రయాణికుల భద్రతకు ‘గార్డియన్’
సాక్షి, హైదరాబాద్ : క్యాబ్ ప్రయాణికులను ప్రత్యేకించి మహిళలను మరింత భద్రంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు దేశీ క్యాబ్ సేవల దిగ్గజం ఓలా త్వరలో హైదరాబాద్‌లో సరికొత్త సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. నిర్దేశిత మార్గం నుంచి వాహనం దారితప్పిన లేదా ఆగిన సమయాల్లో ప్రయాణికులను నేరుగా ఫోన్లో సంప్రదించడం, డ్రైవర్ ప్రవర్తనపై ఫిర్యాదులుంటే తక్షణమే సమీప పోలీసుస్టేషన్‌కు సమాచారం పంపే ఏర్పాట్లతో కూడిన రియల్‌టైమ్ ట్రాకింగ్ వ్యవస్థ ‘గార్డియన్’ను ప్రవేశపెట్టనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లర్నింగ్ టూల్స్ ఆధారంగా ట్రాకింగ్ వ్యవస్థ పనిచేయనుంది. స్ట్రీట్ సేఫ్ పేరిట చేపడుతున్న దేశవ్యాప్త రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ఈ వ్యవస్థను ఓలా తీసుకొచ్చింది. ముంబై, పుణే, బెంగళూరు నగరాల్లో ఓలా గతవారమే ‘గార్డియన్’ను ప్రారంభించింది. ఈ నెలాఖర్లోగా ఢిల్లీ, కోల్‌కతా సహా మరికొన్ని నగరాలకూ దీన్ని విస్తరించనుంది. ముందస్తు రక్షణ... రాత్రి వేళల్లో మహిళా ప్రయాణికుల భద్రత పోలీసులు, క్యాబ్ సంస్థలకు తరచూ సవాల్‌గా మారుతోంది. ప్రస్తుతం క్యాబ్‌లు బుక్ చేసుకొనే సమయంలోనే వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, డ్రైవర్ ఫొటో తదితర వివరాలు ప్రయాణికుల స్మార్ట్ఫోన్లలో కనిపిస్తున్నా ప్రయాణ సమయాల్లో డ్రైవర్ల ప్రవర్తనను అంచనా వేయడం మాత్రం కష్టసాధ్యమవుతోంది. రాత్రి వేళల్లో డ్రైవర్ల ప్రవర్తనపై తరచుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఒక మహిళ క్యాబ్‌లో ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా మార్గమధ్యలో డ్రైవర్ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ట్వీట్ చేశారు. ఈసీఐఎల్ ప్రాంతంలోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. దీంతో రాత్రి 10 దాటాక మహిళలు క్యాబ్‌లలో వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాతే బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ముందస్తు రక్షణ వ్యవస్థ మాత్రం ఉండట్లేదు. ఈ నేపథ్యంలో ఓలా ప్రవేశపెట్టనున్న ‘గార్డియన్’వ్యవస్థ ద్వారా వాహనం గమనాన్ని ప్రతిక్షణం ట్రాక్ చేస్తూ ప్రయాణ సమయంలోనే ప్రయాణికుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు అవకాశం లభించనుంది. భద్రతకు భరోసా ... శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, సికింద్రాబాద్, నాంపల్లి,కాచిగూడ రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్ బస్స్టేషన్లు, తదితర ప్రధాన కూడళ్ల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులతోపాటు హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్ వంటి ఐటీ కారిడార్లలో క్యాబ్ సర్వీసులను వినియోగించే సాఫ్ట్వేర్ నిపుణులకు పూర్తి భద్రత కల్పించేందుకు ఓలా ‘గార్డియన్’దొహదపడనుంది. ప్రత్యేకించి మహిళా ప్రయాణికుల భద్రతకు ‘గార్డియన్’బలమైన అస్త్రంగా పనిచేస్తుందని, ప్రజారవాణా రంగంలో తొలిసారి దీన్ని ప్రవేశపెట్టామని ఓలా ప్రతినిధి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఎలా పనిచేస్తుంది... – ‘గార్డియన్’వ్యవస్థ ద్వారా ప్రయాణికులకు, ఓలా సెక్యూరిటీ రెస్పాన్స్ టీమ్ (ఎస్ఆర్టీ)కు మధ్య ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ బృందం ప్రతి వాహనాన్ని నిరంతరం ట్రాక్ చేస్తుంది. – ప్రయాణికులు ఎంపిక చేసుకున్న మార్గంలో కాకుండా డ్రైవర్ వేరే మార్గంలోకి మళ్లినట్లుగా అనుమానం వస్తే వెంటనే ప్రయాణికులకు ఈ బృందం ఫోన్ చేస్తుంది. ఆ మార్గం సరైనదేనా లేక ఏమైనా ఇబ్బందులున్నాయా అని అడిగి తెలుసుకుంటుంది. – అదే సమయంలో డ్రైవర్ల ప్రవర్తనపై ఫిర్యాదులుంటే స్వీకరించి వెంటనే ఆ సమాచారాన్ని పర్యవేక్షక బృందం సమీప పోలీస్ స్టేషన్‌కు చేరవేస్తుంది. – ఓలా సెక్యూరిటీ రెస్పాన్స్ టీమ్ నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ప్రయాణికులకు వెంటనే రక్షణ కల్పిస్తారు. 50 వేల మందికి పైగా ప్రయాణం... గ్రేటర్ హైదరాబాద్‌లో నిత్యం సుమారు 50 వేల మంది ప్రయాణికులు ఓలా సేవలను వినియోగించుకుంటున్నారు. శంషాబాద్ విమానాశ్రయంతోపాటు ఐటీ కారిడార్లలో ఓలా క్యాబ్‌ల వినియోగం ఎక్కువగా ఉంది. 5 వేల మందికిపైగా లీజు పద్ధతిలో ఓలా వాహనాలను నిర్వహిస్తుండగా మరో 20 వేలకుపైగా ఓలాతో అనుసంధానమైన వాహనాలు నడుస్తున్నాయి. ఉబెర్, మేరు వంటి ఇతర క్యాబ్ సంస్థలు ఉన్నప్పటికీ ప్రజారవాణా రంగంలో వినూత్న చర్యలు చేపట్టడం ద్వారా ఈ సంస్థ ఎక్కువగా ప్రాచూర్యంలోకి వచ్చింది. -
విస్తుగొల్పే వాస్తవాలు!
సాక్షి, అమరావతి బ్యూరో: మహిళ అర్ధరాత్రి ధైర్యంగా నడిచి వెళ్లగలిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని మహాత్మా గాంధీ అన్నారు. అయితే రాష్ట్ర రాజధానిలో భాగమైన విజయవాడలో అర్ధరాత్రి కాదు కదా పట్టపగలే మహిళ ధైర్యంగా వెళ్లగలిగే పరిస్థితి లేదు. నగరంలో ఈవ్‌టీజర్లు, రౌడీలు చెలరేగిపోతున్నారు. నగరంలో ప్రధాన ప్రాంతాల్లోనూ మహిళలు ఒంటరిగా సంచరించే పరిస్థితుల్లేవని ఓ మహిళా మిత్ర సభ్యులే తేల్చిచెప్పడం గమనార్హం. వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ‘క్లాప్’ కార్యక్రమంలో నిర్వహించిన సర్వేలో వెల్లడైన విస్తుగొల్పే విషయాలు రాజధానిలో మహిళల దుస్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. ఇదీ ‘క్లాప్’ అమెరికా కాన్సులేట్ కార్యాలయం సహకారంతో విజయవాడలోని వాసవ్య మహిళా మండలి ‘క్లాప్’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. విజయవాడ పోలీస్ కమిషరేట్‌లో అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘మహిళా మిత్ర’ సభ్యులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందులో భాగంగా మొదటి దశలో విజయవాడలో గవర్నర్‌పేట, సూర్యారావుపేట, మాచవరం, సత్యనారాయణపురం, సింగ్‌నగర్, నున్న పోలీస్స్టేషన్ల పరిధిలో మహిళా మిత్ర సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా ఈ పోలీస్స్టేషన్ల పరిధిలో మహిళల భద్రతపై మహిళా మిత్ర సభ్యుల అభిప్రాయం తెలుసుకోవాలని సర్వే నిర్వహించారు. నగర శివార్లలో అధ్వానం విజయవాడ నడిబొడ్డున ఉన్న ప్రదేశాల్లోనే మహిళలకు రక్షణ కరువైందని సర్వేలో తేటతెల్లమైంది. మరీ ఎక్కువగా నగర శివార్లులోని పోలీస్స్టేషన్ల పరిధిలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉందని పోలీసువర్గాలే చెబుతున్నాయి. శివారు ప్రాంతాల్లోనే కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. రౌడీ గ్యాంగ్‌లు, పోకిరీలు నగరంలో ఎక్కడపడితే అక్కడ ఈవ్‌టీజింగ్, వేధింపులకు పాల్పడుతున్నారు. విజయవాడ పోలీసుల అధికారిక లెక్కల ప్రకారమే గతేడాది 2,500 మంది ఈవ్‌టీజర్లను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. సర్వే ఇలా.. ఆరు పోలీస్స్టేషన్ల పరిధిలో 40 ముఖ్య ప్రదేశాలను ఎంపిక చేశారు. ఈ ప్రదేశాల పేర్లతో ప్రశ్నావళిని రూపొందించి మహిళా మిత్ర సభ్యులకు నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. అవి.. ఎలాంటి అనుమతి లేకుండానే వెళ్లగలం, కుటుంబసభ్యుల అనుమతి తీసుకుంటేనే వెళ్లగలం, ఒక్కరమే వెళ్లలేం, అసలు వెళ్లలేం. ఈ నాలుగు ఆప్షన్లల్లో ఏవి ఆ 40 ప్రదేశాలకు సరిపోతాయని మహిళా మిత్ర సభ్యులను ప్రశ్నించారు. అందుకు వారు ఇచ్చిన సమాధానాలు విజయవాడలో మహిళలు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులను తెలిపాయి. ఆ 40 ప్రదేశాల్లో 27 మహిళలకు సురక్షితమైనవి కావని సమాధానమిచ్చారు. కేవలం 13 ప్రదేశాలకు మాత్రమే కుటుంబసభ్యుల అనుమతి లేకుండా ధైర్యంగా వెళ్లగలమన్నారు. ఇంకో 13 ప్రదేశాలకు వెళ్లాలంటే ముందుగా కుటుంబసభ్యుల అనుమతి తీసుకోవాల్సిందేనని చెప్పారు. వీటిలో కంట్రోల్ రూమ్, నెహ్రూ బస్టాండ్, రాజీవ్‌గాంధీ పార్క్, కాళీమాత ఆలయం, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మొదలైన ప్రదేశాలు ఉండటం గమనార్హం. ఈ ప్రదేశాల్లో మహిళలు వేధింపులకు గురవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని స్పష్టం చేశారు. మరో 13 ప్రదేశాలకు కుటుంబ సభ్యులు, స్నేహితులు తోడు లేకుండా వెళ్లలేమని వెల్లడించారు. వాటిలో పాత ప్రభుత్వ ఆస్పత్రి రోడ్డు, లెనిన్ సెంటర్, సింగ్‌నగర్ బ్రిడ్జ్, టైమ్ ఆస్పత్రి రోడ్, అలంకార్ థియేటర్, సదర్న్ హోటల్ రోడ్డు, రమేశ్ ఆస్పతి రోడ్డు మొదలైనవి ఉండటం గమనార్హం. ఈ ప్రదేశాలకు ఒంటరి మహిళలు వెళ్తే ఈవ్‌టీజింగ్, వేధింపుల బారిన పడాల్సిందేనని తేల్చిచెప్పారు. ఒక ప్రదేశానికి తోడు ఉన్నాసరే వెళ్లలేమని పేర్కొన్నారు. సర్వేకి ఎంపిక చేసిన ప్రదేశాలు 40 సురక్షితం కానివి 27 -
'తెలంగాణలో మహిళలకు రక్షణ కరవు'
నర్సాపూర్: తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని డీసీసీ అద్యక్షురాలు, మాజీ మంత్రి సునీతారెడ్డి అన్నారు. శనివారం మెదర్ జిల్లాలోని నర్సాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రధానంగా దళిత మహిళలకు రక్షణ లేదన్నారు. దళిత మహిళలపై అత్యాచారాలు జరిగినపుడు టీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులు బాధితులను పరామర్శించకపోవడం విచారకరమన్నారు. శివ్వంపేట మండలంలోని పోతారంకు చెందిన దళిత మహిళపై అత్యాచారం జరిగి నెలలు గడుస్తున్నా ఆమెకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి సాయం అందలేదని సునీతారెడ్డి విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి నర్సాపూర్‌లో దళిత మహిళపై సామూహిక అత్యాచారం జరిగినా అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు పరామర్శించలేదన్నారు. మహిళలపై అత్యాచారాలు జరిగినపుడు నిందితులను కఠినంగా శిక్షిస్తే ఇలాంటివి పునరావృతం కావని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
మహిళా భద్రత పేరిట పార్టీల హంగామా
సాక్షి, న్యూఢిల్లీ : మహిళా భద్రత అంటూ నానాహంగామా చేస్తున్న పార్టీలు ప్రస్తుత ఎన్నికల్లో వారికి టికెట్ల కేటాయింపు విషయంలో మాత్రం తటపటాయించాయి. మూడు ప్రధాన పార్టీలు కేవలం 19 మందికే టికెట్లు ఇచ్చాయి. అయితే మిగతా పార్టీల కంటే బీజేపీయే ఎక్కువ టికెట్లు ఇచ్చింది. బీజేపీ తరఫున ఎనిమిది మంది, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీల తరఫున ఆరుగురు చొప్పున మహిళా అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదుగురినే బరిలోకి దింపింది. సీపీఐ తరఫున ఒకరు పోటీ చేస్తున్నారు. 2013తో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య తగ్గింది. అప్పట్లో మొత్తం 71 మంది మహిళలు పోటీచేయగా ఈసారి 63 మంది మాత్రమే బరిలో ఉన్నారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా మహిళే. ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బరిలోకి దిగిన ఇద్దరు అభ్యర్థులూ మహిళలే. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల సంఖ్య కూడా తగ్గింది. గత ఎన్నికల్లో 810 మంది పోటీ చేయగా, ఈసారి బరిలో ఉన్నవారి సంఖ్య 673 మాత్రమే. బీజేపీ నిలబెట్టిన 66 మంది అభ్యర్థుల్లో 22 మంది గ్రాడ్యుయేట్లు, 11 మంది పదో తరగతి ఉత్తీర్ణులు,18 మంది పోస్టుగ్రాడ్యుయేట్లు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల్లో తొమ్మిది మంది పోస్టు గ్రాడ్య్యుయేట్లు, 29 మంది గ్రాడ్యుయేట్లు, మరో ఎనిమిదిమంది 12వ తరగతి ఉత్తీర్ణులు. ఇక ఆప్ అభ్యర్థుల్లో 21 మంది పోస్టుగ్రాడ్యుయేట్లు, 24 మంది గ్రాడ్యుయేట్లు, తొమ్మిదిమంది మంది 12వ తగరతి ఉత్తీర్ణులు, ఐదుగురు పదోతరగతి ఉత్తీర్ణులు ఉన్నారు. విశ్వాస్‌నగర్ నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీచేస్తున్న అతుల్‌గుప్తా ప్రస్తుత ఎన్నికల బరిలో ఉన్నవారందరి కంటే విద్యాధికుడు. ఆయన ఎంబీబీఎస్ పూర్తిచేశారు. -
‘స్లైడ్ డోర్’ నష్టాలు భరించలేం
* ఏటా రూ.40 కోట్ల నష్టం వస్తుందని ఆర్టీసీ అంచనా * రీయింబర్స్ చేయాలని ప్రభుత్వానికి విన్నపం సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత కోసం దేశంలోనే వినూత్నంగా బస్సుల్లో స్లైడ్ డోర్ విధానానికి శ్రీకారం చుట్టిన ఆర్టీసీ దానివల్ల వార్షికంగా రూ.40 కోట్ల వరకు ఆదాయం తగ్గుతుందని అంచనాకొచ్చింది. ఆ మొత్తాన్ని భరించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి వివరాలతో ఇటీవల ఒక నివేదిక సమర్పించింది. హైదరాబాద్ సిటీ బస్సుల్లో మహిళల భద్రత కోసం ముందుభాగంలో కొన్ని సీట్ల వరుసల తర్వాత ప్రత్యేకంగా స్లైడ్డోర్ ఏర్పాటు చేసి పార్టీషన్ విధానాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ విభజన డోర్‌ను దాటి పురుషులు ముందుకు రాకుండా ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రత్యేక తలుపు ఏర్పాటు చేయటం కోసం బస్సుల్లో రెండు సీట్లను తొలగించాల్సి వచ్చింది. దీనివల్ల నలుగురు ప్రయాణికులు కూర్చునే స్థలం తగ్గింది. దాంతోపాటు ప్రయాణికులు నిలబడే కొంత స్థలాన్ని కూడా ఆ డోర్ ఆక్రమించింది. దీని ఆధారంగా లెక్కలేసిన అధికారులు సంవత్సరానికి రూ.40 కోట్ల మేర ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని తేల్చారు. సంస్థ ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఇది పెద్ద భారంగా మారుతుందని, ఆ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం రీయింబర్స్ చేయాలని ఆర్టీసీ కోరినట్టు సమాచారం. పనులు ప్రైవేటు పరం.. ఆర్టీసీకి మియాపూర్‌లో ప్రత్యేకంగా బస్ బాడీ వర్క్‌షాపు ఉంది. ఇక్కడ బస్సుల లోపలి భాగాలను తయారు చేసేందుకు అవసరమైన పూర్తి వ్యవస్థ ఉంది. అలాగే ఇదే తరహా పనిలో అనుభవం ఉన్న నలుగురైదుగురు కార్మికులు ప్రతి డిపోలో అదనంగా ఉంటారు. కానీ మహిళల భద్రత కోసం ఉద్దేశించిన సై ్లడ్ డోర్ల ఏర్పాటు పనిని మాత్రం ఆర్టీసీ ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. దీనివల్ల రూ.4 కోట్లనుంచి 5 కోట్లవరకు ఖర్చవుతోంది. ఇది ఇప్పుడు ఆర్టీసీకి అదనపు భారంగా పరిణమించింది. -
మహిళల భద్రతే ప్రధానాంశం
విధానసభ ఎన్నికల్లో మహిళల భద్రతే కీలకాశంగా మారింది. గత ఎన్నికల సమయంలో ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా, అవినీతి నిర్మూలన తదితర అంశాలకు ఆయా రాజకీయ పార్టీలు ప్రాధాన్యమిచ్చాయి. అయితే ఈసారి అందుకు భిన్నంగా ప్రచారం సాగిస్తున్నాయి. న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు మహిళా భద్రత అంశానికే పెద్దపీట వేశాయి. అధికారంలోకి ఎవరు వచ్చినా జాతీయ రాజధాని నగరంలో ప్రధాన సమస్య అయిన మహిళా భద్రతను తొలుత పరిష్కరిం చాలని అనేకమంది స్థానికులు కోరుతున్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదల, అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్ సమస్యలను కూడా పరిష్కరించాలనేది స్థానికుల అభిమతంగా ఉంది. దీంతోపాటు విద్యుత్, నీటి సరఫరా నిరంతరాయంగా జరగాలని వారంతా ఆకాంక్షిస్తున్నారు. నేరరహిత నగరంగా మార్చాలి ఈ విషయమై ప్రశాంత్రావ్ అనే ఉపాధ్యాయుడు మాట్లాడుతూ ‘అత్యాచారాలు, దోపిడీలు, హత్యలు నగరంలో సర్వసాధారణమైపోయాయి. మహిళలనే లక్ష్యంగా చేసుకుని నేరాలు జరుగుతున్నాయి’అని అన్నారు. నగరంలో అనేకమంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారని, వారిలో కొందరు తరచూ లైంగిక వేధింపులకు గురవుతున్నారన్నారు. కొత్త ప్రభుత్వం జాతీయ రాజధానిని నేరరహిత నగరంగా మారుస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. మహిళలు జాగ్రత్తగా ఉండాలి ఇదే విషయమై దీతి గుప్తా అనే మహిళ మాట్లాడుతూ ‘మహిళలు కచ్చితంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చదువు, కర్తవ్య నిర్వహణతోపాటు ఇతర అవసరాల కోసం వారంతా విధిగా బయటికి వెళ్లాల్సి ఉంటుంది. రోజు మార్చి రోజు నగరంలో అత్యాచారాలు జరుగుతున్నా యి. ఇది నన్ను బాగా భయానికి గురిచేస్తోంది’ అని అన్నారు. ఇదే అంశంపై ఆల్ ఇండియా రేడియో ఉద్యోగి ఎస్.ఎస్.రంగా, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ముఖేష్‌శర్మ మాట్లాడుతూ 17 మిలియన్ల మంది నివసిస్తున్న ఈ నగరంలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాల్సి ఉందన్నారు. అత్యాచార కేసుల సంఖ్య ఎంతమాత్రం తగ్గడం లేదు’అని అన్నారు. దీంతోపాటు ప్రజారవాణా వ్యవస్థ,మౌలిక వసతులను మెరుగుపరచడం వంటి కీలకాంశాలపైనా ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. జాగరూకతతో ఉంటా: షాలిని ఇదే విషయమై నగరంలో ఉంటున్న బీహార్‌కు చెందిన షాలిని అనే విద్యార్థిని మాట్లాడుతూ అభద్రతా భావం కారణంగా బయటికి వెళ్లినపుడు జాగరూకతతో ఉంటానని తెలిపింది. రాత్రిపూట ఇంకా జాగ్రత్తగా ఉంటానంది. పారిశుధ్యంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతయి నా ఉందని మరికొందరు ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. దుర్గంధంతో ఇబ్బందులపాలు ఈ విషయమై దీతి గుప్తా మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో దుర్గంధం తీవ్రంగా ఉందని, ఈ కారణంగా నగరవాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగం ఎంతో చేయాల్సి ఉందన్నారు. లేకపోతే పరిస్థితులు చేయిదాటిపోతాయన్నారు. ఇక అవినీతి గురించి కొంతమంది మాట్లాడినప్పటికీ అత్యధికులు మాత్రం మహిళా భద్రత అంశాన్నే ఎక్కువగా ప్రస్తావించారు. అత్యధిక శాతం మంది ఓటర్లు ఈ అంశం గురించే మాట్లాడుతున్నారనే విషయాన్ని బీజేపీ, ఆప్‌లు కూడా అంగీకరించాయి. ఈ విషయమై బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ ఖురానా మాట్లాడుతూ అది నిజమేనన్నారు. ఇదే అంశంపై ఆప్ నాయకురాలు అతిషి మర్లేనా మాట్లాడుతూ అనేకమంది నగరవాసులలు మహిళా భద్రత, నిరుద్యోగం అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారన్నారు. అయితే ఈ సమస్యకు ఏ పార్టీ చక్కని పరిష్కారమిస్తుందనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజే పీ, ఆప్లపైనే ప్రజల దృష్టంతా ఉంది. కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరూ ప్రస్తావించడమే లేదు. ఆప్.. సరిగ్గా సరిపోతుంది ఢిల్లీలో పరిపాలనకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీయే చక్కగా సరిపోతుందని గుప్తా అనే స్థానికుడు అభిప్రాయపడ్డారు. స్థానిక సమస్యలపై ప్రధానమంత్రి దృష్టి సారించడం సాధ్యం కాదని, అందువల్ల ఆప్ మాత్రమే ఈ పనిచేయగలుగుతుందన్నారు. ధరల్ని నియంత్రించింది ఈ వాదనతో శర్మ అనే ఉపాధ్యాయుడు ఏకీభవించారు. ‘ఆప్... నాకు ఎంతో దగ్గరగా ఉంటుంది. నాకే కాదు అందరికీ దగ్గరగా ఉంటుంది. ఆ పార్టీ నాయకులు సామాన్యులనే ఇష్టపడతారు. అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ ధరలతోపాటు అవినీతిని విజయవంతంగా నియంత్రించగలిగింది’అని అన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చినా చేయగలుగుతుందన్నారు. బీజేపీయే బెటర్ అయితే ఈ వాదనతో రంగా అనే స్థానికుడు ఏకీభవించలేదు. జాతీయ రాజధానికి బీజేపీయే ఉత్తమమని అభిప్రాయపడ్డారు. పైగా కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలో ఉన్నారన్నారు. ఈసారి ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. ఆటోరిక్షా నడుపుకుని జీవితం సాగించే 57 ఏళ్ల రాంకిషన్కూడా కమలానికే మొగ్గుచూపారు. నిరుపేదలను ఆ పార్టీ మాత్రమే అర్థం చేసుకోగలుగుతుందన్నారు. కాగా వచ్చే నెల ఏడో తేదీన విధానసభ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. -
మహిళా భద్రత చట్టం ముసాయిదా బిల్లులో మార్పులు?
* పలు సూచనలు చేస్తూ మళ్లీ డీజీపీ, నగర సీపీకి పంపిన రాష్ట్ర హోంశాఖ * పురుషుడి జేబులో ఎవరైనా మహిళ ఫొటో ఉన్నానేరమనడంపై అభ్యంతరం * నిర్భయ చట్టంలాగే, దీనిపైనా విస్తృత చర్చ జరగాల్సిందేనన్న కమిటీ సభ్యులు సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతపై తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు రూపొందించిన చట్టం ముసాయిదా బిల్లుపై వారిస్థాయిలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఈ చట్టంలో కొన్ని నిబంధనల పట్ల రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ చట్టంపై నిర్భయ చట్టంలాగే విస్తృతస్థాయి చర్చ జరగాలని రాష్ట్ర మహిళా భద్రతా కమిటీకి చెందిన కొందరు సభ్యులు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే చట్టం ముసాయిదాలో కొన్ని మార్పులు సూచిస్తూ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డిలకు రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం ఈ బిల్లును పంపించింది. రాష్ట్ర మహిళా భద్రత కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా రాష్ట్రంలో కొత్తగా మహిళా భద్రతా చట్టం ముసాయిదాను సీపీ మహేందర్‌రెడ్డి రూపొందించారు. ఈ మేరకు ఆది వారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుపై కూడా చర్చించారు. కాగా, ఈ ముసాయిదాలో కొన్ని అంశాలు స్పష్టంగా లేవని, దీనివల్ల న్యాయపరంగా చిక్కులెదురవుతాయని రాష్ట్ర హోంశాఖతోపాటు కొందరు కమిటీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిసింది. ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపుల విషయాల్లో ఎవరు నేరస్తులవుతారు? దానికి తగిన ఆధారాలేమిటనే విషయంలో స్పష్టత లేదని వారు అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ చట్టం ప్రకారం.. పురుషుడి జేబులో ఎవరైనా మహిళ ఫొటో ఉన్నా.. అతన్ని నేరస్తుడిగా పరిగణిస్తారనే నిబంధనపై రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారని తెలిసింది. నిజానికి కొందరు తమకిష్టమైన సినీ హీరోయిన్ల ఫొటోలు పెట్టుకుంటారని, మరికొందరు ఫేస్ బుక్‌లో తమకు నచ్చిన వారి ఫొటోను పెట్టుకుంటారని, వీరందర్నీ నిందితులుగా ఎలా పేర్కొంటారని, అలా చేయడం వలన వాళ్లు తప్పు చేసినట్లుగా ఎలా గుర్తిస్తారని అడిగినట్లు సమాచారం. ఇలాంటివే మరికొన్ని సున్నిత అంశాలున్నాయని వీటిపై లోతుగా అధ్యయనం చేయాలని పలువురు అధికారులు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈవ్‌టీజింగ్‌పై తమిళనాడులో అమల్లో ఉన్న చట్టాన్ని ఆధారంగా చేసుకుని మహిళాభద్రత చట్టం రూపొం దించడం బాగానే ఉందనీ, దీనికి ముందు జాతీయస్థాయిలో నిర్భయ చట్టంలాగే దీనిపైనా చర్చ జరగాలని వారు సూచిం చినట్లు సమాచారం. దీంతో న్యాయపరంగా సమస్యలు తలెత్తవని, మరోవైపు మరింత కట్టుదిట్టమైన చట్టాన్ని తీసుకురావడానికి ఆస్కారం ఏర్పడుతుందని వారన్నట్లు తెలిసింది. కాగా, రాష్ట్ర హోంశాఖ వెనక్కి పంపించిన తాజా చట్టం ముసాయిదాపై డీజీపీ, సీపీ అవసరమైన మార్పులు చేర్పులు చేసి తిరిగి రాష్ట్ర న్యాయశాఖ పరిశీలనకు పంపిస్తారనీ, అనంతరం సీఎం కేసీఆర్ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీన్ని కేంద్ర హోంశాఖ ఆమోదం కోసం పంపిస్తారని అధికారవర్గాలు తెలిపాయి. -
మహిళలను వేధించేవారి కళ్లు పీకేస్తాం
హైదరాబాద్: ఈనెల 11, 12న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ప్రతినిధుల సభ, పరేడ్స్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. త్వరలో 4 వేల నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. బడ్జెట్ తర్వాత హైదరాబాద్ లోని ఉండనని, ప్రజల మధ్యలోనే ఉంటానని వెల్లడించారు. నాలుగేళ్లలో ప్రతి ఇంటికి మంచినీరు అందించకపోతే మళ్లీ ఓట్లు అడగనని స్పష్టం చేశారు. మహిళల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్నారు. మహిళలను వేధించేవారి కళ్లు పీకేస్తామని కేసీఆర్ హెచ్చరించారు.