కెరమెరి(ఆసిఫాబాద్): ‘అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి..కనిపించే దైవమే ఆ కనులలో సన్నిధి’అని ఓ చెల్లి తన సోదరుడి గురించి పాట పాడడంలో ఎంతో అర్థం ఉంది. తనను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే అన్నయ్యలంటే ప్రతీ చెల్లికి అభిమానమే. సోదరీసోదరుల ఆత్మీయతకు అద్దం పట్టేదే రక్షా‘బంధనం’. ఇంటి ఆడపడుచు మహాలక్ష్మి స్వరూపంగా, పరాశక్తికి ప్రతీకగా భావించే సంస్కృతి మనది. కష్టసుఖాల్లో మేము మీకు అండగా ఉన్నామన్న భరోసాను సోదరులు అక్కా చెల్లెళ్లకు కల్పించడమే రాఖీ బంధం. అన్నాచెల్లెళ్ల ఆత్మీయ చిహ్నానికి, వారి మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని నేడు ఉమ్మడి జిల్లాలో ఘనంగా జరుపుకోనున్నారు. అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి మిఠాయి తినిపిస్తారు. తర్వాత వారు కానుకలు ఇస్తారు. ఇది వారి ప్రేమ, అనురాగానికి వారధిగా నిలుస్తుంది. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు ఆత్మీయులకు పోస్టు ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా రాఖీలను పంపారు. భారతీయ ధర్మశాస్త్రాల్లో తెలిపిన రక్షాబంధన్ రోజున సోదరునికి తిలకధారణ గావించి అక్షింతలతో ఆశీర్వదించి రక్షణ కవచాన్ని కడుతుంది. ఇది దేవతారక్షగా కాపాడుతుందని వారి నమ్మకం.
దేవతల కాలం నుంచి..
శ్రీరామునికి కౌసల్య రాఖీ కట్టిందని, రాక్షసుడు విష్ణు భక్తుడైన బలికి మహాలక్ష్మి రాఖీ కట్టి మృత్యువు నుంచి కాపాడిందని, శకుంతల తన గారాల కొడుకు భరతునికి శత్రుభయం లేకుండా తాయిత్తు కట్టిందని కథలు ఉన్నాయి. దేవేంద్రుడు సకల రాక్షసుల మధ్య 12 ఏళ్లు మహాయుద్ధం జరిగింది. ఈ సందర్భంలో రాక్షస రాజు ముల్లోకాలను జయించాడు. పరిస్థితిని గుర్తించిన బృహస్పతి ఇంద్రునికి విజయం కలగాలని ఇంద్రాణితో రక్ష కట్టించాడు. ఇది శ్రావణపౌర్ణమి రోజు వేద పండితుల మంత్రోచ్చారణలో జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.
రాజుల కాలం నుంచి..
రాజుల కాలం నుంచి రక్షాబంధం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అలెగ్జాండర్ ప్రేయసి రుక్సానా పురుషోత్తమునికి రక్షా సూత్రం కట్టినందుకే అతన్ని విడిచిపెట్టాడు. హుమాయూన్ చక్రవర్తి రాణి కర్ణావతి రాఖీ పంపించి అతడి రక్షా పొందింది. ఛత్రపతి శివాజీ భవానిదేవి ప్రసాదించిన ఖడ్గాన్ని పొంది వేద ధర్మరక్షణలకు ప్రతిన చేస్తూ రక్షా ధరించారనే కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రా వణపౌర్ణమిన రాఖీ కట్టడం వల్ల తల్లీబిడ్డకు, భార్యభర్తలకు తొలి దశ ఏర్పడింది. మలిదశలో సోదరీ సోదరునికి రక్షా కట్టడం జరిగింది. ఈ కాలంలో ప్రతీ మహిళా తనకు పరిచయం ఉన్న పురుషునికి సోదరభావంతో రాఖీ కట్టడం, రాఖీ పంపడం, రాఖీని అందుకున్న పురుషుడు ఆమెను సోదరిగా బహుమతులివ్వడం ఆనవాయితీగా వస్తోంది.
ఏటా శ్రావణమాసంలో వచ్చేపౌర్ణమి తిథి రోజు రాఖీ జరుపుకుంటారు. శాస్త్రప్రకారం భద్రకాలం ముగిసిన తర్వాత రాఖీ కట్టాలి. ఈ తిథుల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమి తిథి సోమవారం తెల్లవారుజాము 3:04 గంటలకు ప్రారంభమై రాత్రి 11:55కు ముగుస్తుంది. అయితే ఆ మధ్యలో భద్రకాలం ఉదయం 5:53 నుంచి మధ్యాహ్నం 1:32 గంటల వరకు సోదరులకు రాఖీ కట్టకూడదని పండితులు చెబుతున్నారు. మిగిలిన సమయంలో రాఖీలు కట్టవచ్చని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment