కైలాస్‌నగర్: ‘తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తాం. తమ లేఅవుట్‌కు అధికారికంగా అన్ని అనుమతులున్నాయి. ఇంటి నిర్మాణానికి అవసరమైన అన్ని వసతులు సమకూర్చాం’ అని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రచారం చేశారు. దీంతో జిల్లా కేంద్రంలోని పలు లేఅవుట్లలో వందలాది మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్‌ల శాఖ ద్వారా వాటికి రిజిస్ట్రేషన్లూ పొందారు. మున్సిపాలిటీ నుంచి అనుమతులు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు తాజాగా మున్సిపల్ అధికారులు ఝలక్ ఇచ్చారు. తాత్కాలిక (టెంటెటివ్) లేఅవుట్లలోని ప్లాట్లలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు పూర్తిగా నిలిపివేశారు. ఇదివరకు జారీ చేసిన వాటిలో పలు అనుమతులు రద్దు చేశారు. నిబంధనలకు విరుద్ధమైన ఆ లేవుట్లలోని రిజిస్ట్రేషన్లనూ రద్దు చేయాలంటూ రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాశారు. దీంతో ‘రియల్’ వర్గాల్లో తీవ్ర కలవరం రేపుతోంది. అందులో ప్లాట్లను కొనుగోలు చేసిన వారిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ నిబంధనలు తప్పనిసరి
ఏదైనా లేఅవుట్‌లో ప్లాట్లు విక్రయించాలంటే సంబంధిత డ్రాఫ్ట్‌తో మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. లేఅవుట్‌లో ప్రజల నివాసానికి అవసరమైన విద్యుత్, తాగునీరు, డ్రైనేజీలు, రోడ్లు తదితర మౌలిక వసతులు కల్పించాలి. పార్కులు, ఆలయాలు, పాఠశాలల కోసం 10 శాతం స్థలాన్ని ఖాళీగా వదిలేయాలి. 15శాతం స్థలాన్ని మున్సిపాలిటీకి మార్టిగేజ్ చేసి ఇవ్వాలి. ఈ నిబంధనలతో కూడిన డ్రాఫ్ట్ లేఅవుట్‌కు అధికారులు అనుమతులు కల్పిస్తే అందులోని ప్లాట్లు విక్రయించాల్సి ఉంటుంది. అనంతరం తమ లేఅవుట్ అన్ని వసతులతో సిద్ధంగా ఉందని చెబుతూ ఫైనల్ లేఅవుట్ అనుమతి కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీనికి అనుమతులు వచ్చాక ఆ లేఅవుట్‌లోని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు ఇంటి నిర్మాణాలకు అనుమతులు పొందే అవకాశముంటుంది.
గతంలో ‘మామూలు’గా తీసుకుని..
జిల్లా కేంద్రంలోని పలు లేఅవుట్లలోని ప్లాట్లలో భవన నిర్మాణ అనుమతులు నిబంధనలకు విరుద్ధంగా జారీ చేశారు. గతంలో పనిచేసిన టౌన్ ప్లానింగ్, కమిషనర్ స్థాయి అధికారులు ‘మామూలు’గా తీసుకుని తాత్కాలిక అప్రూవుడ్ లేఅవుట్లలోని ప్లాట్లకు యథేచ్ఛగా నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చేశారు. జిల్లా కేంద్రంలో 16 లేఅవుట్లకు సంబంధించి టెంటెటివ్ అప్రూవుడ్ లేఅవుట్‌ల ప్రతిపాదనలు మున్సిపాలిటీకి అందాయి. అందులో 13 అప్రూవుడ్ దశలోనే ఉండగా ఫైనల్ అనుమతులు ఇంకా దేనికీ లభించలేదు. మరో మూడు లేఅవుట్లు అధికారుల పరిశీలనలో ఉన్నాయి. ఇలాంటి వాటిలోని ప్లాట్లలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం, రిజిస్ట్రేషన్లు చేయడం నిబంధనలకు విరుద్ధమని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. అయితే గతంలో పనిచేసిన కొంతమంది అధికారులు ఆ నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా అక్రమంగా అనుమతులు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో రూ.కోట్లు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి.
‘రియల్’ వర్గాల్లో గుబులు
తాత్కాలిక అప్రూవుడ్ లేఅవుట్లలోని ప్లాట్లలో ఇళ్ల నిర్మాణాలకు బల్దియా అధికారులు అనుమతులు నిలిపివేయడం, ఇదివరకు నిర్మించిన ఇళ్లకు సంబంధించిన అనుమతులను రద్దు చేయడంతో ‘రియల్’ వర్గాల్లో గుబులు మొదలైంది. ఫైనల్ లేఅవుట్ అప్రూవుడ్ రావాలంటే అన్ని సౌకర్యాలను లేఅవుట్‌దారుడే సమకూర్చాల్సి ఉంటుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇది ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీనిపై దృష్టి సారించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment