ఆ నాలుగేనా..? | - | Sakshi
Sakshi News home page

ఆ నాలుగేనా..?

Published Thu, Dec 19 2024 9:18 AM | Last Updated on Thu, Dec 19 2024 9:18 AM

ఆ నాలుగేనా..?

ఆ నాలుగేనా..?

● రిమ్స్‌లో ఔట్‌సోర్సింగ్‌ మాయాజాలం ● ఐదేళ్లుగా అవే ఏజెన్సీలు ● వేరే వాటిని అడుగుపెట్టకుండా ఎత్తులు ● కొత్త పోస్టులు మంజూరైతే చాలు.. టెండర్లు లేకుండా వీరికే! ● పోస్టులను రూ.లక్షల్లో అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ● ‘జిల్లా కమిటీ’ పర్యవేక్షణ నామమాత్రమనే విమర్శలు

సాక్షి,ఆదిలాబాద్‌: సాధారణంగా ఒక ప్రభుత్వ శాఖ లో ఔట్‌సోర్సింగ్‌ పోస్టులు మంజూరైన పక్షంలో వాటి భర్తీ కోసం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎంప్యానల్మెంట్‌ జాబితాలోని ఏజెన్సీలను ఆ పోస్టుల నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకునేలా ఆహ్వానించాలి. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఏజెన్సీని గుర్తించి వర్క్‌ ఆర్డర్‌ అందించాలి. ఆ శాఖలో ఇది వరకు ఓ ఏజెన్సీ ఇతర పోస్టులను నిర్వహిస్తున్నప్పటికీ కొత్త పోస్టుల పరంగా తిరిగి టెండర్లు నిర్వహించి అర్హత సాధించిన ఏజెన్సీకే అప్పగించాలనేది నిబంధన. అయితే రిమ్స్‌లో ఐదేళ్ల క్రితం ఓ నాలుగు ఏజెన్సీలకు పోస్టుల నిర్వహణను అప్పగించారు. తిరిగి కొత్త పోస్టులు మంజూరైనా అందులోనే ఓఏజెన్సీకి అప్పగించడంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆ ఏజెన్సీలకే పెద్దపీట..

రిమ్స్‌లో 2019 నుంచి నాలుగు ఏజెన్సీలు మాత్రమే వివిధ ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల నిర్వహణ చేస్తూ వస్తున్నాయి. కొత్త పోస్టులు మంజూరైన ఆ ఏజెన్సీలకే టెండర్లు లేకుండానే అప్పగిస్తున్నారు. గత సెప్టెంబర్‌లో స్టాఫ్‌నర్సు పోస్టులను ఈ విధానంలో భర్తీ చేయగా అందులో ప్రధానంగా పాత మూడు ఏజెన్సీలకు పంచడమే దీనికి నిదర్శనం. శ్రీ మహాలక్ష్మి మ్యాన్‌ పవర్‌ అండ్‌ ప్లేస్మెంట్‌ సర్వీసెస్‌, ఎలైన్‌ సాఫ్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జీపీ ఇన్ఫోటెక్‌ ఏజెన్సీలకు ఆ స్టాఫ్‌ నర్స్‌ పోస్టులను ఎలాంటి టెండర్‌ నిర్వహించకుండానే అప్పగించారు. మహాలక్ష్మి ఏజెన్సీ అయితే ఏకంగా వందలాది పోస్టులను ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తూ వస్తుంది. ఇక ఎలైన్‌సాఫ్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏజెన్సీ వెనక రిమ్స్‌ ఉన్నతాధికారి భాగస్వామ్యం ఉందనే విమర్శలూ లేకపోలేదు. జీపీ ఇన్ఫోటెక్‌ ఏజెన్సీ కూడా రిమ్స్‌లో పెద్ద ఎత్తున ఔట్‌సోర్సింగ్‌ పోస్టులు నిర్వహిస్తుంది. ఇక దుర్గం ఎస్సీ లేబర్‌ కాంటాక్ట్‌ కోఆపరేటీవ్‌ సొసైటీ లిమిటెడ్‌ రిమ్స్‌లో కొన్ని పోస్టులను నిర్వహణ చేపడుతుంది. జిల్లా ఔట్‌సోర్సింగ్‌ ఎంప్యానల్మెంట్‌లో 2019లో 17 ఏజెన్సీలు అర్హత సాధిస్తే ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ పోస్టులు మంజూరైనప్పుడు కేవలం కొన్ని ఏజెన్సీలకు మాత్రమే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు బాహాటంగా వ్యక్తమవుతున్నాయి.

సగం పోస్టులు రిమ్స్‌లోనే..

జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల్లో కలిపి ఔట్‌సోర్సింగ్‌ పోస్టులు మొత్తంగా 1,250 వరకు ఉండగా, అందులో 500కు పైగా రిమ్స్‌ ఆస్పత్రి, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలోనివే. ఈ పోస్టులను గత ఐదేళ్లుగా ఆ ఏజెన్సీలే నిర్వహిస్తూ వస్తున్నాయి. రిమ్స్‌లో టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌కు సంబంధించిన అనేక పోస్టులను మహాలక్ష్మి ఏజెన్సీ నిర్వహిస్తూ వస్తుంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు కొత్త ఎంప్యానల్మెంట్‌ను గుర్తించాలి. ఆయా శాఖల్లో పోస్టుల నిర్వహణకు సంబంధించి వర్క్‌ ఆర్డర్‌ను అర్హులైన ఏజెన్సీలకు అప్పగిస్తూ మార్పులు చేర్పులు చేస్తూ ఉండాలి. అయితే ఏళ్లుగా అవే ఏజెన్సీలను కొనసాగిస్తున్నారు. ఆ శాఖ ఉన్నతాధికారులను ఏజెన్సీ నిర్వాహకులను మచ్చిక చేసుకుంటున్నారు.

బాహాటంగా బేరసారాలు..

ఇటీవల రిమ్స్‌లో స్టాఫ్‌నర్స్‌ ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల నియామకంలో ఏజెన్సీలు బాహాటంగా బేరసారాలకు దిగాయి. ఒక్కోపోస్టుకు రూ.2లక్షలకు పైగా వసూలు చేశారనే విమర్శలు వ్యక్తమయ్యా యి. ఓ అభ్యర్థిని అంతమొత్తం ఇచ్చుకోలేని పరిస్థితిలో స్థానిక ఎమ్మెల్యేను ఆశ్రయించడం, ఆ ఎమ్మెల్యే ఈ విషయంలో రిమ్స్‌ ఉన్నతాధికారిని చివాట్లు పెట్ట డం జరిగాయి. అయినప్పటికీ వ్యవహారంలో మా ర్పు రాలేదని తెలుస్తోంది. ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీలో ఏజెన్సీలు తమ అక్రమ పంథా కొనసాగిస్తుండగా, అధి కారులు దానికి వంతు పాడటం వెనుక ఏదో లోపాయికార ఒప్పందం ఉందన్న విమర్శలు లేకపోలేదు.

రిమ్స్‌లో ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలకు ఉన్న పోస్టుల సంఖ్య..

ఏజెన్సీ పోస్టుల సంఖ్య

శ్రీమహాలక్ష్మి మ్యాన్‌పవర్‌ 325

ఎలైన్‌సాఫ్ట్‌ 63

జీపీ ఇన్ఫోటెక్‌ 86

దుర్గం కోఆపరేటీవ్‌ 24

ఎంప్లాయ్‌మెంట్‌ అధికారిదే బాధ్యత..

రిమ్స్‌లో ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల నిర్వహణలో ఇతర ఏజెన్సీలకు కూడా మున్ముందు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు ఉన్న ఏజెన్సీలను మార్చే విషయంలో రిమ్స్‌ అధికారుల పాత్ర ఏమి ఉండదు. ఎంప్లాయ్‌మెంట్‌ అధికారిదే ప్రధాన బాధ్యత. కలెక్టర్‌ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడం జరుగుతుంది.

– జైసింగ్‌ రాథోడ్‌, రిమ్స్‌ డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement