మరో చాన్స్
● ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుకు అవకాశం ● మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాల్లో స్వీకరణ
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. లబ్ధిదారుల ఎంపిక నిమి త్తం జిల్లాలో ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తుదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. అయితే ఇళ్లు పొందేందుకు అర్హులై ఉండి వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేని వారిలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం వారికి మరో అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపాల్టీలోని ప్రత్యేక ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ నిర్ణయంపై అర్హులైన వారిలో హర్షం వ్యక్తమవుతుంది.
జిల్లాలో 1,97,448 దరఖాస్తులు
ఏడాది క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా అభయహస్తం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూతతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులను స్వీకరించింది. గతేడాది డిసెంబర్ 28నుంచి ఈ ఏడాది జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం కింద ఈ కార్యక్రమం కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 1,97,448 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 17 గ్రామీణ మండలాల పరిధిలో 1,66,295 మంది, ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 31,153 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దరఖాస్తుదారులకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించింది. పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది ఈ నెల 9 నుంచి తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి అర్హులైన వారి వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు సర్వే పూర్తి చేసేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.
వారికి మరో అవకాశం
గతంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేని పేదలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. సొంతింటి స్థలం కలిగి, ఇళ్లు లేని నిరుపేదలు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఎంపీడీవో కార్యాలయాల్లో, పట్టణ పరిధిలోని ప్రజలు ము న్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజాపాల న కేంద్రాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్ర స్తుతం ప్రజాపాలన వెబ్‌సైట్ అందుబాటులో లేకపోవడంతో కేవలం దరఖాస్తులను మాత్రమే స్వీకరించనున్నారు.
అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు
ఇందిరమ్మ ఇళ్లకు అర్హులై ఉండి గతంలో దరఖాస్తు చేసుకోలేని నిరుపేదలు తమ వివరాలతో ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రజాపాలన వెబ్‌సైట్ అందుబాటులో లేకపోవడంతో మ్యానువల్‌గా స్వీకరించి భద్రపరుస్తాం. ప్రభుత్వం ఎప్పుడు వెబ్‌సైట్ ఓపెన్ చేసి అనుమతిస్తే అప్పుడు వాటి వివరాలను ఆన్‌లైన్ చేస్తాం.
– జి.జితేందర్‌రెడ్డి, జెడ్పీసీఈవో
Comments
Please login to add a commentAdd a comment