తెగిన గాలిపటంలా రైతుల జీవితాలు
● మాజీ మంత్రి జోగు రామన్న
● జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ రాస్తారోకో
ఆదిలాబాద్‌టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో ప్రజ లు, రైతుల పరిస్థితి తెగిన గాలిపటంలా మారిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న అన్నారు. అన్నదాతపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం నుంచి ర్యాలీగా బయల్దేరి బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించారు. రాస్తారోకో చేపట్టారు. గాలి పటాలపై డిమాండ్లు రాసి వినూత్న నిరసన తెలిపారు. సీఎం చిత్రపటాన్ని దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నదాతల పరిస్థితి తెగిన గాలిపటంలా మారిందని విమర్శించారు. రైతు రుణమాఫీ చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. రైతులు, సామాన్య ప్రజానీకానికి బీఆర్‌ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇజ్జగిరి నారాయణ, గండ్రత్ రమేష్, సేవ్వా జగదీష్, చందల రాజన్న, పరమేశ్వర్, కుమ్ర రాజు, అప్కామ్ గంగయ్య, అడపా తిరుపతి, బట్టుసతీష్, యూనుస్ అక్బాని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment