● రూ.12వేలు అందించనున్న సర్కార్ ● ‘ఆధార్’ అనుసంధానాని
కైలాస్‌నగర్: గ్రామీణ ప్రాంతాల్లో జీవించే భూమి లేని వ్యవసాయ కూలీలకు చేయూతనందించేలా రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని ప్రకటించింది. ఈ నెల 26నుంచి దీన్ని అమలు చేయాలని భావించి రూ.6వేల చొప్పున రెండు విడతల్లో ఏడాదికి రూ.12వేల ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది. ఉపాధిహామీ జాబ్ కార్డు ఉండి, గత ఆర్థికసంవత్సరంలో కనీసం 20 రోజుల పనిదినాలు పూర్తి చేసిన వారిని అర్హులుగా ప్రకటించింది. అయితే జిల్లాలో సుమారు 20వేల మంది కూలీల జాబ్‌కార్డులకు సంబంధించి ఆధార్ సీడింగ్ ప్రక్రియ జరగలేదు. అలాంటి వారి వివరాలతో కూడిన జాబితాను ప్రభుత్వం జిల్లాకు పంపించి ఆధార్ సీడింగ్ చేయిస్తోంది.
జిల్లాలో 3,49,368 జాబ్‌కార్డులు
గ్రామీణ ప్రాంతాల్లో వలసలను అరికట్టి కూలీలకు 100రోజుల పాటు వారి గ్రామాల్లోనే పని కల్పించా లనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2005లో ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిని ప్రారంభించిన నుంచి ఇప్పటివరకు జిల్లాలో అధికారులు 1,71,505 కుటుంబాలకు చెందిన 3,49,368 మందికి జాబ్‌కార్డులు జారీ చేశారు. ఇందులో 84,805 కుటుంబాలకు సంబంధించి 1,55,269 మంది కూ లీలకు పని కల్పించారు. ఇక గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 5,507 కుటుంబాలకు గాను 14,285 మందికి కొత్తగా జాబ్‌కార్డులు జారీ చేశారు. ఏటా కొత్తగా జాబ్‌కార్డులను జారీ చేస్తూ ఆసక్తి కలిగిన కూలీలకు వివిధ పనులు కల్పిస్తున్నారు.
అర్హులందరికీ లబ్ధి చేకూర్చేలా..
వ్యవసాయ కూలీల గుర్తింపునకు ఉపాధిహామీ జా బ్‌కార్డును కీలకంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా పనిచేసే కూలీలు, జాబ్‌కార్డుల వివరాలు కోరింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గ్రా మీణాభివృద్ధిశాఖ అధికారులు 1,71,505 జాబ్‌కార్డులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. వాటిని పరిశీలించిన రాష్ట్రస్థాయి అధి కారులు ఇందులో సుమారు 20వేల కూలీల ఆధార్ సీడింగ్ కానట్లు గుర్తించారు. ఈ నెల 26నుంచి పథకం అమల్లోకి వస్తే అర్హులకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో వారి జాబ్‌కార్డుల ఆధార్ సీడింగ్ చేపట్టాలని ఆదేశిస్తూ గ్రామపంచాయతీల వారీగా కూలీల వివరాలతో కూడిన జాబితాను జిల్లాకు పంపించారు. పొరపాట్లు సవరించి కూలీల జాబ్‌కార్డులకు తప్పనిసరిగా వారి ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను జత చేయాలని ఆదేశించింది.
ప్రక్రియలో నిమగ్నమైన ఉద్యోగులు
ప్రభుత్వం నుంచి అందిన జాబితాను పరిశీలించిన అధికారులు వివిధ కారణాలతో ఆధార్ సీడింగ్ కానట్లు నిర్ధారించారు. మరణించిన, శాశ్వతంగా వలసవెళ్లిన కూలీల పేర్లు తొలగించకపోవడం, ఆధార్‌కార్డు, జాబ్‌కార్డులోని వివరాలు సరిపోలకపోవడం, జెండర్‌లో తప్పుగా నమోదు కావడం లాంటి అంశాలను గుర్తించారు. వాటిని సవరించడంలో డీఆర్‌డీఏ అఽధికారులు దృష్టి సారించారు. గ్రామాలవారీగా అందించిన వివరాల ప్రకారం ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు తమ పరిధిలోని ఇంటింటికి వెళ్లి కూలీల జాబ్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు సేకరిస్తున్నారు. వాటిని తమ మండల పరిధిలోని కంప్యూటర్ ఆపరేటర్లకు అందజేస్తున్నారు. వారు పంపించిన వివరాలను జిల్లా కార్యాలయంలోని ఉద్యోగులు ఎన్‌ఐసీ వెబ్‌సైట్‌లో ఆధార్‌సీడింగ్ చేస్తున్నారు. ఇందుకు ఆ శాఖ అఽధికారులు, ఉద్యోగులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పండుగ, సెలవు రోజులైనప్పటికీ గత శనివారం నుంచి రాత్రీపగలు తేడా లేకుండా ఆధార్‌సీడింగ్‌లో నిమగ్నమయ్యారు. ఇదివరకు జరిగిన పొరపాట్లను సవరించి పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు.
ఈజీఎస్ అమలయ్యే మండలాలు : 17
జిల్లాలో జాబ్‌కార్డులు : 1,71,505
నమోదు చేసుకున్న కూలీలు : 3,49,368
ఉపాధి పొందుతున్న కూలీలు : 1,55,269
మండలం కుటుంబాలు కూలీలు
ఆదిలాబాద్ 11,376 23,527
బజార్‌హత్నూర్ 7,534 16,261
బేల 11,508 21,874
భీంపూర్ 8,414 17,762
బోథ్ 15,050 31,189
గాదిగూడ 6,655 14,623
గుడిహత్నూర్ 9,338 20,679
ఇచ్చోడ 10,696 22,710
ఇంద్రవెల్లి 12,601 25,055
జైనథ్ 14,905 28,781
మావల 3,352 5,272
నార్నూర్ 9,712 21,251
నేరడిగొండ 8,290 16,865
సిరికొండ 5,848 11,555
తలమడుగు 10,585 21,398
తాంసి 6,067 11,685
ఉట్నూర్ 19,574 38,881
జిల్లా కేంద్రంలో ఉపాధి కూలీల ఆధార్ సీడింగ్‌లో నిమగ్నమైన డీఆర్డీఏ అధికారులు
90శాతం సీడింగ్ పూర్తి చేఽశాం
ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం సంబంధిత కూలీల వివరాలన్నింటినీ గ్రామాలవారీగా సమగ్రంగా సేకరిస్తున్నాం. పొరపాట్లకు తావివ్వకుండా వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి వారి జాబ్‌కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేస్తున్నాం. సెలవు రోజుల్లోనూ రాత్రీపగలు పనిచేస్తూ ఇప్పటివరకు 90శాతం ప్రక్రియ పూర్తి చేశాం. రెండు, మూడు రోజుల్లో వందశాతం పూర్తిచేసి అర్హులందరికీ అన్యాయం జరగకుండా చూస్తాం. భూమి కలిగినవారూ ఉపాధి పనులకు వస్తుంటారు. అలాంటి వారి గుర్తింపు ప్రభుత్వమే రాష్ట్రస్థాయిలో నిర్ణయిస్తుంది.
– రాథోడ్ రవీందర్, డీఆర్డీవో
Comments
Please login to add a commentAdd a comment