నేటి నుంచి గ్రామసభలు
● క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల గుర్తింపు ● 21 నుంచి 25 వరకు డాటా ఎంట్రీ ● 26 నుంచి నాలుగు పథకాల అమలు
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి పథకాలకు లబ్ధిదారుల ఎంపిక చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. అర్హులైన వారి ముసాయిదా జాబితా తయారీ కోసం గురువారం నుంచి ఈ నెల 20 వరకు జిల్లా వ్యాప్తంగా వార్డు, గ్రామసభలు నిర్వహించనున్నారు. వార్డులు, గ్రామాల వారీగా ముందుగానే టామ్ టామ్ వేయించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పరిశీలనతో లబ్ధిదారుల జాబితా తయారుచేసి కలెక్టర్‌కు పంపించనున్నారు. ఈ ప్రక్రియ పర్యవేక్షణకోసం జిల్లాస్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. డాటా ఎంట్రీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
20 వరకు గ్రామసభలు
నాలుగు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ముసాయిదా జాబితా తయారీ కోసం ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలోని వార్డుల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. ఆయా పథకాల కోసం అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి వివరాలను ఈ గ్రామసభల్లో అధికారులు చదివి విన్పించనున్నారు. 21 నుంచి 25వ తేదీ వరకు వరకు డేటా ఎంట్రీ చేసి 26 నుంచి పథకాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
రైతు భరోసా
వ్యవసాయ శాఖ ద్వారా రైతు భరోసా అమలు చేయనున్నారు. దీని కింద రెండు విడతల్లో కలిపి ఎకరాకు ఏడాదికి రూ.12వేల ఆర్థికసాయాన్ని డీబీటీ పద్ధతిలో అందించనున్నారు. భూభారతి (ధరణి) పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతుభరోసా సహాయం అందించనున్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతుభరోసా నుంచి తొలగిస్తారు. భూభారతి (ధరణి) పోర్టల్‌లో నమోదై ఉన్న, వ్యవసాయానికి యోగ్యంకాని భూములను గుర్తించనున్నారు. తహసీల్దార్, మండల వ్యవసాయాధికారి ఆధ్వర్యంలో రెవెన్యూ గ్రామం వారీగా ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. ప్రతీ గ్రామానికి ఓ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ఏఈవో టీంగా వ్యవహరించనున్నారు. ఆర్‌వోఆర్ పట్టదారు పాసుబుక్కుల జాబితాను భూభారతి (ధరణి) పోర్టల్ నుండి ప్రింటవుట్ విలేజ్ మ్యాప్, గూగుల్ మ్యాప్‌తో సహా గ్రామాన్ని సందర్శించి ఈ జాబితాలో వ్యవసాయ యోగ్యంకాని భూముల జాబితాను తయారుచేస్తారు. తహసీల్దార్, మండల వ్యవసాయాధికారి సంయుక్తంగా జాబితాలోని సర్వే నంబర్లను సందర్శించి వ్యవసాయ యోగ్యంకాని భూములను గుర్తిస్తారు. జాబితాను గ్రామసభలో ప్రదర్శించి, చదివి వినిపించి, చర్చించిన తరువాత ఆమోదిస్తారు. వ్యవసాయ యోగ్యంకాని భూముల పట్టికను పోర్టల్‌లో సంబంధిత అధికారి నమోదు చేసి డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా...
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా అమలు చేయనున్న ఇందిరమ్మ ఆత్మీయభరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబానికి రెండు విడతలుగా ఏడాదికి రూ.12వేల ఆర్థికసాయం అందించనున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకుని, 2023–24 సంవత్సరానికి కనీసం 20 రోజులు ఉపాధి పనులు చేసి ఉన్నవారు దీనికి అర్హులు. ముసాయిదా అర్హుల జాబితా పంచాయితీ/ గ్రామాల వారీగా ఇప్పటికే అందజేశారు. గ్రామసభలు నిర్వహించి ఆ జాబితాను చదివి విన్పించి అర్హులను ఎంపిక చేయనున్నారు. ఒకవేళ గ్రామసభలో అభ్యంతరాలు వస్తే ఎంపీడీవో వాటిని స్వీకరించి పరిశీలించాక పది రోజుల్లో వాటిపై తగు చర్యలు చేపట్టనున్నారు.
ఇందిరమ్మ ఇళ్లు
ఇందిరమ్మ ఇళ్ల కోసం అందిన దరఖాస్తులపై ప్రభుత్వం ఇటీవల సర్వే నిర్వహించి వివరాలు ప్రత్యేక యాప్‌లో నమోదు చేశారు. వివరాలను ఎంపీడీవోలు సూపర్ చెక్ చేసి అందులో ఏమైనా లోపాలను గుర్తిస్తే కలెక్టర్ లాగిన్‌కు పంపిస్తారు. సిస్టమ్ రూపొందించిన అర్హులైన లబ్ధిదారుల జాబితాను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లాగిన్లో ఉంచుతారు. ఈ జాబితాను గ్రామసభ/వార్డు సభల ముందు ఉంచి అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు.
రేషన్ కార్డులు..
దీర్ఘకాలం తర్వాత ప్రభుత్వం ఎట్టకేలకు పే దలకు రేషన్‌కార్డులను అందించేందుకు సి ద్ధమవుతోంది. వాటి జారీకి సంబంధించిన విధి విధానాలను స్పష్టం చేసింది. కుల గణన సర్వే ఆధారంగా తయారు చేసిన జాబితా ప్రకారం క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. మండల స్థాయిలో ఎంపీడీవో, మున్సిపల్‌లో కమిషనర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) /డీసీఎస్‌వో పర్యవేక్షిస్తారు. గ్రామసభలో జాబితాను చదివి అర్హులను ఎంపిక చేస్తారు. ఈ సభల్లో ఆమోదించబడిన లబ్ధిదారుల అర్హత జాబితాను మండల / మున్సిపల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్‌లో నమోదు చేసి కలెక్టర్ ఆమోదం కోసం పంపుతారు.
Comments
Please login to add a commentAdd a comment