సాక్షి, ఆదిలాబాద్: జీవన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి 2019 మార్చి నుంచి ఎమ్మెల్సీలుగా ఈ నియోజకవర్గం నుంచి వ్యవహరిస్తున్నారు. జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, రఘోత్తంరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. వీరి పదవీకాలం త్వరలోనే ముగియనుండగా ఈ రెండు స్థానాల నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రధానంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబర్చుతూ ఆయా పార్టీల ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
బీజేపీ అభ్యర్థులు ఖరారు..
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పరంగా రాజకీయ పార్టీల్లో బీజేపీ ముందుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన సి.అంజారెడ్డిని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెద్దపల్లి జిల్లా బంధంపల్లికి చెందిన మల్క కొమురయ్యను ప్రకటించారు. ఈ ఇరువురు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. బీజేపీ నుంచి పోటీ చేయాలని మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు, ఆదిలాబాద్‌కు చెందిన గటిక క్రాంతికుమార్‌తో పాటు ఇతర నేతలు విస్తృతంగా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు.
బీఆర్‌ఎస్ నుంచి..
కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, కరీంనగర్‌కు చెందిన డాక్టర్ బీఎన్ రావు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బీఎన్ రావు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తన ఫౌండేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ పార్టీ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం ఎవరికి అవకాశం కల్పిస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది.
కాంగ్రెస్ నుంచి పోటీకి ఆసక్తి..
కరీంనగర్‌కు చెందిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వేం నరేందర్‌రెడ్డి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం ఉమ్మడి నాలుగు జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల్లో తాను పర్యటించడమే కాకుండా తన అనుచరుల ద్వారా ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రైవేట్ టీచర్స్‌తో అన్నిచోట్ల సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ రాజీనామా చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పులి ప్రసన్న హరికృష్ణ కూడా ఈ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఉద్యోగ భద్రత కోసం సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తూ ఆ పార్టీ ముఖ్య నేతలను కలిశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన రిటైర్డ్ డీఎస్పీ మదనం గంగాధర్, కరీంనగర్‌కు చెందిన వెల్చల రాజేందర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి అవకాశం లభిస్తుందా అనేది ఆసక్తి నెలకొంది.
ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. త్వరలోనే ఈ ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ శాసన మండలి నియోజకవర్గం పట్టభద్రుల నుంచి టి.జీవన్‌రెడ్డి, టీచర్స్ నుంచి కూర రఘోత్తంరెడ్డి పదవీ కాలం వచ్చే మార్చి చివరి వారంతో పూర్తి కానుంది. అంతకుముందే కొత్త ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే నిర్వహిస్తారా? లేనిపక్షంలో వాటి తర్వాత నిర్వహిస్తారా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశవాహుల ప్రయత్నాలు మాత్రం ముమ్మరం అయ్యాయి. దీంతో ఈ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో అభ్యర్థుల సందడి మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment