తప్పుడు ప్రచారం మానుకోవాలి
ప్రభుత్వ పథకాలపై
● జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
నేరడిగొండ: ప్రభుత్వ పథకాలపై బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం మానుకోవాలని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు రూ.లక్ష రుణమాఫీ కూడా సరిగ్గా చేయలేకపోయిందన్నారు. దళితబంధు, బీసీ బంధు, గిరిజన బంధు అనుకుంటూ దశాబ్ద కాలం పాటు కాలయాపన చేసిందన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు ఉచిత కరెంటు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రెండు లక్షల రైతు రుణమాఫీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు వంటివి అందజేస్తూ పేదల శ్రేయస్సు కోసమే పనిచేస్తుందన్నారు. ఇవి చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ప్రచారానికి తెరలేపారన్నారు. అమాయక రైతులు, ప్రజలను తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టడం మానుకోవాలన్నారు. లేకుంటే ప్రజలే తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ పదేళ్లు గడీల పాలన సాగించారన్నారు. వారి వెంట బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, ఆదిలాబాద్ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment