వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
డుంబ్రిగుడ: మండలంలోని అరకు– పాడేరు జాతీయ రహదారి కించుమండ సమీపంలోని బిల్లాపుట్టు వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదబయిలు మండలం గంపరాయి గ్రామానికి చెందిన అడప నాగభూషణ్(34) అరకులోయలోని గురుకుల పాఠశాలలో పీడీగా విధులు నిర్వహిస్తున్నారు. మృతుడి పిన్ని అనారోగ్యంతో మృతి చెందిన సమాచారాన్ని బంధువుల ద్వారా తెలుసుకున్నారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ వద్ద సెలవు తీసుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అరకు–పాడేరు ప్రధాన జాతీయ రహదారిలోని కించుమండల సమీపంలో గల బిల్లాపుట్టు వద్ద ద్విచక్ర వాహనాన్ని చింతపల్లి నుంచి అరకులోయ వైపు వస్తున్న టూరిస్టు కారు బలంగా ఢీ కొట్టింది. ఎగిరిపడిన మృతుడు డివైడర్‌ని బలంగా ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతగిరి(అరకులోయటౌన్): రోడ్డు ప్రమాదంలో శనివారం ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట కందాలవీధికి చెందిన పొట్నూరు దివాకర్(20) అనంతగిరి నుంచి స్కూటీపై ఎస్.కోట వెళ్తుండగా ఎస్.కోట నుంచి అరకులోయ మీదుగా కించుమండ వెళ్లే పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు డముకు సమీపంలో 5వ నెంబర్ హెయిర్‌పిన్ బెండ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మృతుడు బస్సు వెనుక టైరు కింద పడడంతో అతడి తల మీద నుండి వాహనం వెళ్లడంతో గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జయ్యింది. మృతుడు ఎస్.కోటలోని టెంట్ హౌస్‌లో కూలీపని చేస్తుంటాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అనంతగిరి ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment