కనకమ్మకు నీరాజనం
యలమంచిలి రూరల్: పట్టణంలోని ధర్మవరం కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా రెండో గురువారం పూజలకు భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన అర్చకుడు వెలవలపల్లి కోటేశ్వరశర్మ.. అమ్మవారికి తొలిపూజ నిర్వహించిన అనంతరం తెల్లవారుజాము 3 గంటల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి అనుమతించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. పలువురు మహిళలు అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు కుంకుమలతో పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కొటారు సాంబ, తాటిపాకల మాణిక్యాలరావు, కొటారు సూర్యప్రకాష్ తదితరులు భక్తులకు అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. సుమారు 2వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
●కశింకోటలోని కనకమహాలక్ష్మి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మార్గశిర మాసం రెండో గురువారం పురస్కరించుకుని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో మహిళలతో పాటు భక్తులు తరలి వచ్చారు. ఉదయం నుంచి బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment