సాగునీటి ఎన్నికలు.. ప్రభుత్వానికి రూ.కోట్లు
● నీటి తీరువా వసూలుతో ఆదాయం ● పన్నుతోపాటు 6 శాతం వడ్డీ విధింపు ● ఏకగ్రీవమైనా 2,060 మంది రైతులకు పన్ను ● ఒక్కో రైతుకు రూ. 20 వేల నుంచి రూ.40 వేల పన్ను బకాయి ● చెల్లించకుంటే పోటీకి అనర్హులు
నాతవరం: సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణతో రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆదాయం సమకూరనుంది. తాజాగా జారీ చేసిన ఎన్నికల నియమావళి ప్రకారం పోటీ చేసే రైతులంతా 2010 నుంచి నేటి వరకు నీటితీరువా చెల్లించాల్సి ఉంది. వీరు 2009 వరకు మాత్రమే నీటి తీరువా చెల్లించారు. ఇప్పుడు పన్ను చెల్లించకుండా నామినేషను దాఖలు చేస్తే తిరస్కారానికి గురవుతారు. వారికి ఉన్న సాగు భూమిని బట్టి పన్ను విధిగా చెల్లించాలి. భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల కింద భూమికి ఎకరానికి ఏడాదికి రూ.200 చెల్లించాలి. చిన్నతరహా ఆయకట్టు భూమికి ఏడాదికి రూ.100 చెల్లించాలి. రైతులు భూమికి చెల్లించే అసలు పన్నుకు 6 శాతం వడ్డీ కలిపి మొత్తం 15 ఏళ్లకు కట్టాలి.
మూడు మినహా మిగతా వాటికి ఎన్నికలు...
జిల్లాలో భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు 303 ఉండగా, వాటిలో మూడింటికి ఎన్నికలు జరగడం లేదు. మాకవరపాలెం మండలంలో రెండు చెరువులు అన్‌రాక్ కంపెనీలో కలిసిపోవడంతో అక్కడ భూముల రైతులు లేరు. రెవెన్యూ రికార్డులో మాత్రమే చిన్న తరహా ప్రాజెక్టులు ఉన్నాయి. రావికమతం మండలం మేడిచర్ల చిన్న తరహా ప్రాజెక్టు మధ్య తరహా ప్రాజెక్టులోకి కలిసిపోవడంతో అక్కడ ఎన్నికలు లేవు. ఈ నెల 14న జిల్లాలో 300 మేజరు, మీడియం, మైనర్ ప్రాజెక్టులకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తారు. మొత్తం 2,060 ప్రాదేశిక సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
జిల్లా నుంచి రూ.25 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు ఆదాయం....
ఎన్నికల్లో పోటీ చేసినా ఏకగ్రీవమైనా కచ్చితంగా నీటి తీరువా చెల్లించాలి. ఈ ఎన్నికల్లో అధికంగా భూములు ఉన్న పెద్ద రైతులు మాత్రమే పోటీ చేస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మేజరు ప్రాజెక్టు పరిధిలో ఒక రైతుకు ఐదెకరాలు ఉంటే 15 ఏళ్లకు సంబంధించి పన్ను రూ.17 వేలకు పైగా చెల్లించాలి. అంటే సరాసరి ఎన్నికల్లో పోటీ చేసే రైతు ఒక్కంటికి భూమిని బట్టి తక్కువలో రూ.20 వేలకు పైగా పన్ను చెల్లించాలి. మొత్తం 2,060 ప్రాదేశిక సభ్యులు రెండు పార్టీల నుంచి ఇద్దరేసి పోటీ చేస్తే కనీసం 4,120 మంది రంగంలో ఉంటారు. వారికి ఇద్దరేసి చొప్పున ప్రతిపాదించాలి. వారు కూడా నీటి తీరువా బకాయి చెల్లించాల్సి ఉంటుంది. ఆ లెక్కన అనకాపల్లి జిల్లా నుంచి ప్రభుత్వానికి రూ.25 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు ఆదాయం లభించే అవకాశం ఉంది.
నిధులు ఇవ్వకుండా ఎన్నికల నిర్వహణ
ఎన్నికలు నిర్వహించేందుకు ముందుగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. ఇంతవరకు ఒక్కపైసా ఇవ్వకపోవడంతో అధికారులు అప్పులు చేసి ఎన్నికల సామగ్రి కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు 668 గెజిటెడ్ అధికారులు, 1,530 మంది ఇతర సిబ్బందిని నియమించారు. వీరికి ఎన్నికల నిర్వహణకు అదనపు అలవెన్సు ఇస్తారు లేదో తెలియని పరిస్థితి ఉందని ఒక జిల్లా అధికారి వాపోయారు.
ఏకగ్రీవమైనా పన్ను కట్టాలి
నీటి సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవమైనా పోటీ చేసే అభ్యర్థి ముందుగా తన భూమికి నీటి తీరువా అసలుకు 6 శాతం వడ్డీతో చెల్లించాలి. లేకపోతే నామినేషను తీసుకోవడం జరగదు. ఆ విషయాన్ని ముందుగా తెలియజేశాం. జిల్లాలోనే తాండవ రిజర్వాయరు మేజరు ప్రాజెక్టు, ఇక్కడ ఎకరానికి రూ.200 పన్ను చెల్లించాలి.
– ఎ.వేణుగోపాల్, తహసీల్దార్, నాతవరం మండలం
Comments
Please login to add a commentAdd a comment