తాటిపర్తి ఆశ్రమ విద్యార్థిని మృతి
● వార్డెన్, హెచ్‌ఎంల నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రుల ఆరోపణ ● ఆరోగ్యం బాగోలేదని ముందుగా సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం ● పాఠశాల ఎదుట బంధువులతో కలసి ఆందోళన
మాడుగుల: తాటిపర్తి గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని అనారోగ్యంతో చోడవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. తమ కుమార్తె అనారోగ్యం విషయాన్ని ముందుగా తెలియజేయలేదని, ఆమె మృతికి వార్డెన్, హెచ్‌ఎం కారణమంటూ బంధువులతో కలిసి బాధిత తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీఎస్పీ శ్రావణి, ఐటీడీఏ డీడీ ఎల్.రజని, తహసీల్దార్ రమాదేవి, స్థానిక పోలీసులు రంగంలోకి దిగి వివాదం సద్దుమణిగేలా చేశారు. బాధిత తల్లిదండ్రులు పెంటన్నదొర, సన్యాసమ్మ, బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అయినాడ పంచాయతీ చీమలాపల్లి గ్రామానికి చెందిన ముర్ల సత్యవతి(14) మాడుగుల మండలం తాటిపర్తి గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆమెకు ఆరోగ్యం బాగా లేదని గురువారం ఉదయం హాస్టల్ నుంచి ఫోన్ వచ్చిందని తండ్రి దొర తెలిపారు. వెంటనే ఆయన హాస్టల్‌కు వెళ్లి సత్యవతితో మాట్లాడగా కాలు నొప్పి ఎక్కువగా ఉందని చెప్పడంతో చోడవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సత్యవతి మృతి చెందింది. తమ కుమార్తె అనారోగ్యం విషయాన్ని వార్డెన్ మహేశ్వరి, హెచ్‌ఎం ఎస్.రమాదేవి ముందుగా సమాచారం ఇవ్వకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతరం సీపీఎం నాయకులు ఇరటా నరసింహమూర్తి, కార్లి భవాని, బాధిత తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి పాఠశాల ఎదుట సత్యవతి మృతదేహంతో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, ఐటీడీఏ డీడీ ఎల్.రజని, చోడవరం ఇన్‌చార్జి సీఐ కె.అప్పలరాజు, స్థానిక తహశీల్దార్ రమాదేవి, ఎంఈవో బి.దేముడమ్మ సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. విద్యార్థిని మృతిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ విషయమై, హెచ్‌ఎం రమాదేవి, వార్డెన్ మహేశ్వరిని సంప్రదించగా.. సత్యవతి పాఠశాలలో చాలా చురుకుగా ఉండేదని, బుధవారం తెలుగు పరీక్ష కూడా రాసిందని, గురువారం కాలు నొప్పిగా ఉందని తమకు చెందన్నారు. వెంటనే సచివాలయం ఏఎన్‌ఎం దగ్గరికి పంపించగా.. అక్కడ నొప్పికి సంబంధించిన ఇంజక్షన్ వేశారని, కొద్దిగా నొప్పి తగ్గడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామన్నారు. బాగా చదువుతున్న విద్యార్థిని మృతి చెందడం తమకు కూడా బాధగా ఉందని, ఆమె ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని వారు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment