● విద్యా రంగంలో సహకారంపై చర్చలు
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని పలు విభాగాలను అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ ఆచార్యులు సందర్శించారు. గ్రాడ్యుయేట్ స్టడీస్ విభాగం డీన్ టింగ్, పబ్లిక్ హెల్త్ విభాగం ప్రొఫెసర్ విజయ్ గొల్ల శుక్రవారం ఏయూ స్టార్టర్ ఇంక్యుబేషన్ సెంటర్, కంప్యూటర్ సైన్స్, విద్యా విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రెండు విశ్వవిద్యాలయాల మధ్య సంయుక్తంగా పనిచేసే అంశాలపై, అంటే కోర్సుల నిర్వహణ, పరిశోధన రంగం మొదలైన వాటిపై ప్రాథమిక చర్చలు జరిపారు. విద్యా విభాగంలో విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆచార్య టింగ్ మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి రావాలని ఏయూ విద్యార్థులను ఆహ్వానించారు. ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తామని తెలిపారు. ఏయూతో కలిసి పనిచేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అనంతరం విద్యార్థుల సందేహాలకు సమాధానమిచ్చారు. ఆటిజం సమస్యను పరిష్కరించేందుకు ఏఐ, ఎంఎల్ సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఏయూ విద్యా విభాగాధిపతి ఆచార్య టి.షారోన్ రాజు మాట్లాడుతూ ఎంఈడీ, బీఈడీ కోర్సులతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అమెరికా ఆచార్యులను సత్కరించారు. రీసెర్చ్ డెవలప్‌మెంట్ డీన్ కె.బసవయ్య, విభాగాచార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment