అలరిస్తున్న నాటిక ప్రదర్శనలు | - | Sakshi
Sakshi News home page

అలరిస్తున్న నాటిక ప్రదర్శనలు

Published Mon, Dec 23 2024 1:29 AM | Last Updated on Mon, Dec 23 2024 1:30 AM

అలరిస్తున్న నాటిక ప్రదర్శనలు

అలరిస్తున్న నాటిక ప్రదర్శనలు

అనకాపల్లి : స్థానిక జార్జీక్లబ్‌ ఆవరణలో రెండో రోజైన ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలను క్లబ్‌ ప్రధాన కార్యదర్శి బుద్దకాశీ విశ్వేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక ప్రశాంతతకు నాటికలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.మారుతున్న కాలానికి అనుగుణంగా నాటికలను ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు. ఆదివారం ప్రదర్శించిన నాటికల విశేషాలు ఇలా ఉన్నాయి..

వర్కుఫ్రమ్‌ హోమ్‌ నాటిక... ఇతివృత్తం

ప్రతి మనిషిలోను ఏదో ఒక ప్రతిభ దాగి వుంటుంది. తమ మనసుకి వచ్చిన పనిలో మమేకమైనప్పుడు అది మొగ్గతొడిగి వెల్లివిరుస్తుంది. ఆ ప్రతిభే మరోసారి చిక్కుల్లోకి నెట్టి, పరీక్షిస్తుంది, ఆ చిక్కుల్ని అధిగమించి ఆప్రతిహతంగా దుసుకుపోయేవాడే విశ్వాన్ని సైతం ఒడిసిపట్టగలడు. ఆనుకున్నది సాధించగలడు. సాధారణ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సుధీర్‌ పంటల్లోను నిష్టాతుడు, అతివలకన్నా అద్భుతంగా రుచికరవైన పంటలు చేసే ప్రావీణ్యం అతని సొంతం. గమ్మత్తేమిటంటే వంట చేయడమంటే ఆసక్తి లేని సౌమ్య అతనికి ఆర్ధాంగిగా రావడం. కాఫీ కలపడం కూడా నేర్చుకోని భార్యతో కొత్త కాపురం మొదలెడతాడు. దానికితోడు తన పెళ్లి కుదిర్చిన స్నేహితుడు కిరణ్‌ సరదాగా చేసిన పని అతన్ని కష్టాల్లోకి నెడుతుంది. అయినప్పటికీ ‘వర్కు ఫ్రమ్‌ హోమ్‌’కు పర్మిషన్‌ తీసుకుని ఒకపక్క వంట, మరోపక్క ఉద్యోగంతో సతమతమవుతుంటాడు. అదేంపట్టని భార్య సౌమ్య భర్త వంట ప్రావీణ్యాన్ని బంధువులకు చేరవేస్తూ బిజీగా ఉంటుంది. వారంతా వీరి కొత్త కాపురాన్ని పరామర్శించే పేరుతో వచ్చి పోతుండడంతో వారికి మర్యాదలు చేయలేక, మరో వైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించలేక ఒత్తిడికి లోనవుతాడు. చివరికి సాహసించి, జాబ్‌కి రిజైన్‌ చేసి ‘సౌమ్య లక్ష్మీ హోమ్‌ ఫుడ్స్‌’ పేరుతో కొత్త స్టార్టప్‌ ప్రారంభిస్తాడు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అద్యంతం చక్కని హస్య సన్నివేశాలతో సరదాగా సాగి స్ఫూర్తిదాయకంగా ముగుస్తుంది. మూలకథ..కె.కె.భాగ్యలక్ష్మి, నాటకీకరణ..అద్దేపల్లి భరత్‌కుమార్‌, దర్శకత్వం డి.మహేంద్ర, నటీనటులు పాల్గొన్నారు.

మా ఇంట్లో మహా భారతం..

రామచంద్రరావు, అన్నపూర్ణమ్మ దంపతులకు చదువు, ఉద్యోగం లేని ముఫ్పై ఆరెళ్లు వాసు అనే కొడుకు ఉన్నాడు. నలభై ఎకరాలు వున్నా ఉద్యోగం లేని వాసుకి ఎవరూ పిల్లనివ్వక పెళ్లి కాదు. రామచంద్రరావు తండ్రి హరిశ్చంద్రరావు గానా బజానాలకు, రామచంద్రరావు రాజకీయాలకు అరవై ఎకరాలు ఖర్చయి, నలభై ఎకరాలు మిగులుతుంది. అది కూడా ఎక్కడ ఖర్చు అవుతుందోనని బలవంతం చేసి వాసు పేరున రాయిస్తుంది అన్నపూర్ణమ్మ. దూరపు బంధువైన బాలయ్య అనే పెళ్లి బ్రోకర్‌ ద్వారా నవీనా అనే అందమైన అమ్మాయి రెండు అపార్టుమెంట్స్‌, ఐదెకరాలు అంటు మామిడి తోట, కాలేజీలో ఉద్యోగం ఉంది.. పెళ్లి చూపులు మీ ఇంటనే జరగాలని పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. పెళ్లి చూపులలో వాసుతో ఏకాంతంగా మాట్లాడి ఆస్తి వాసు పేరు ఉందని తెలుసుకుని, ఎవరికీ తెలియకుండా తన పేరున రాయించుకోని వాసుని పెళ్లి చేసుకుంటుంది. వాసులాగే నవీనాకు కూడా మందు దమ్మూ కొట్టే అలవాటుంది. ఇంటి పరువుపోయి అప్పులవాళ్లు ఎగబడతారని తెలుసుకున్న రామచంద్రరావు విజయనగరంలో వున్న అపార్ట్‌మెంట్స్‌, అంటు మామిడి తోట అమ్ముదామంటాడు. ఆ అపార్ట్‌మెంట్స్‌లో నేను పాచిపనులు చేస్తాను.. అంటు మామిడితోటలో అంట్లు నేనే కట్టాను. కాలేజీలో ఉద్యోగం కసువులు పూడ్చే పని... అని ఆమె చెప్పడంతో మోసం జరిగింది.. బయటకు వెళ్లమంటారు. పెళ్లి బ్రోకర్‌ బాలయ్య రాగా, నీ కమీషన్‌కు ఆశపడి మా కులం గాని అమ్మాయిని మాకు కోడలిగా చేసి మమ్మల్ని మోసం చేస్తావా అని నిలదీస్తారు. కులందేముంది గుణం ముఖ్యం, విజయనగరంలో ఆ అమ్మాయికున్న మూడు సెంట్లు పాక యాభై లక్షలకు బేరం కుదిరి ముఫ్పై లక్షలు అడ్వాన్స్‌ ఇచ్చాడు. ఆ అమ్మాయి మా కుటుంబానికి అప్పులున్నాయి అవి తీర్చమంటే డబ్బు తీసుకుని వచ్చానని చెప్పగా ఆ అమ్మాయి మంచితనానికి అందరూ అభిమానం చూపుతుండగా నవీన వాంతి చేసుకుంటే ఆమె గర్భవతి అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు పుట్టబోయే బిడ్డను డాక్టర్‌నో, ఇంజనీర్‌నో చేస్తామంటారు. కానీ నవీన దేశానికి తిండిపెట్టే అన్నదాతను చేస్తాను నా బిడ్డను అని చెబుతుంది. ఈ కార్యక్రమంలో నాటకోత్సవాల కన్వీనర్‌ కె.ఎం.నాయుడు, క్లబ్‌ అధ్యక్షుడు జోగినాయుడు, కోశాధికారి విల్లూరి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

జార్జిక్లబ్‌లో రెండోరోజు నాటిక పోటీలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement