వన నర్సరీల ద్వారా 5 కోట్ల మొక్కల పంపిణీ లక్ష్యం
కె.కోటపాడు : రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ ఫారెస్ట్ ద్వారా 5 కోట్ల మొక్కలను పంపిణీ చేసేందుకు వన నర్సరీలలో పెంచుతున్నట్లు అడిషనల్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాహుల్ పాండే అన్నారు. మండలంలో కొత్త అగ్రహారం, సింగన్నదొరపాలెం, కొత్తూరు, బత్తివానిపాలెం గ్రామాల్లో సోషల్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో పెంచుతున్న పలు రకాల మొక్కలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాహుల్ పాండే మాట్లాడుతూ మొక్క నాటేందుకు అనువైందిగా ఉండాలంటే నర్సరీలలో తప్పనిసరిగా కనీసం ఏడు నెలల పాటు పెంచాలని తెలిపారు. వచ్చే ఏడాది వర్షాలు ప్రారంభమయ్యేందుకు అనువైన కాలం అయిన జూలై నుంచి నర్సరీలలో గల మొక్కలను పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. వర్షాలు ఒక వేళ ముందుగా పడితే ఈ నిర్ణయాన్ని పునరాలోచన చేసి ముందుగా పంపిణీ చేసే పరిస్థితి ఉంటుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2024–25 కాలానికి ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్, కంపా, సేల్ ఆఫ్ సీలింగ్స్, ఎన్‌టీపీసీ నిధులతో పెంచుతున్న 5 కోట్ల మొక్కలను అందించనున్నట్టు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే కంపా నిధులతో 50 లక్షల మొక్కలను పెంచుతున్నట్టు రాహుల్ పాండే తెలిపారు. రైతులకు ఉచితంగా నర్సరీల్లో గల మొక్కలను ఇవ్వడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాల్లోను, రోడ్ల కిరువైపులా మొక్కలు నాటేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సింగన్నదొరపాలెం, కొత్తూరు, కొత్త అగ్రహారం నర్సరీలలో పెంచుతున్న కాము, వేప, నేరేడు, పనస, కానుగ, తురాయి, ఎర్ర చందనం, టేకు తదితర మొక్కలనుపరిశీలించి మొక్కల సంరక్షణపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట సోషల్ ఫారెస్ట్ డీఎఫ్‌వో జి.లక్ష్మణ్, ఫారెస్ట్ రేంజ్ అధికారి చంద్రశేఖర్, డీఆర్‌వో ఎ.నూకరాజు, వన సేవకుడు చిరికి గోవింద పాల్గొన్నారు.
వచ్చే ఏడాది జూలై నుంచి మొక్కల పంపిణీకి చర్యలు
అడిషనల్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాహుల్ పాండే
కె.కోటపాడు మండలంలో నాలుగు వన నర్సరీల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment