‘గోవాడ సుగర్స్’లో సమ్మె విరమణ
చోడవరం : కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని గోవాడ సుగర్స్ యాజమాన్యం హామీ ఇవ్వడంతో కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెను శనివారం విరమించారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులంతా గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో శుక్రవారం నుంచి విధులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. రెండో రోజు శనివారం కూడా కార్మికులంతా విధులను బహిష్కరించారు. దీంతో కార్మికుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ వి.వి. సన్యాసినాయుడు హామీ ఇచ్చారు. కార్మికులకు రావలసిన జీతభత్యాలు నేటి వరకూ చెల్లించలేదని, రెండేళ్లుగా కార్మికులకు ఇవ్వాల్సిన ఓటీల డబ్బులు ఇవ్వలేదని, గతేడాది నుంచి డీఓలు ఇవ్వలేదని, ఇవన్నీ వెంటనే చెల్లించాలని కార్మిక సంఘం అధ్యక్షుడు కె.వి.వి.భాస్కరరావు డిమాండ్ చేశారు. వీటిని ఒక్కొక్కటిగా అవకాశం ఉన్నంతమేర చెల్లింపులు చేస్తామని, క్రషింగ్ సీజన్ ప్రారంభమవ్వడంతో వెంటనే కార్మికులంతా విధుల్లోకి చేరాలని ఎండీ కోరారు. ఆయన హామీ మేరకు సమ్మెను విరమించి విధుల్లోకి వెళతామని యూనియన్ అధ్యక్షుడు భాస్కరరావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment