కలెక్టర్ గారూ.. మా ఊరు రండి..
● రోడ్డుకు తక్షణం ఫారెస్టు అనుమతులు ఇవ్వాలి ● చలిసింగం గిరిజనుల వినూత్న నిరసన ● గుర్రాలతో మూడు కిలోమీటర్ల ర్యాలీ
చోడవరం: రావిమతకం మండలం చీమలపాడు పంచాయతీ శివారు చలిసింగం గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆదివారం ఆ గ్రామ గిరిజనులు సీకాయపాడు గ్రామం వరకు మూడు కిలోమీటర్ల పొడవునా గుర్రాలతో ప్రజా సంఘాల నాయకులు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని రావి కమతం మండలం, చీమలపాడు పంచాయతీ చలిసింగం రెవెన్యూ గ్రామంలో 110 గిరిజన కుటుంబాలకు చెందిన 380 మంది జనాభా కొండ శిఖర గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల ప్రతి మూడు కుటుంబాలకు ఒక గుర్రం చొప్పున పెంచుకుంటున్నారు. ఈ గ్రామానికి రేషన్ డిపో ఉంది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కొండ దిగువన ఉన్న సీకాయపాడు గ్రామం వద్ద రేషన్ డిపోను ఏర్పాటు చేశారు. ఈ డిపో నుంచి గుర్రాల సహాయంతో రేషన్ సరుకులు చలిసింగం గ్రామానికి తెచ్చుకుంటున్నారు. ఈ గ్రామంలో ఎంపీపీ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం కూడా ఉంది. ఈ గ్రామస్తులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించాలంటే కొత్తకోట సంతకు గుర్రాల సాయంతో తీసుకెళ్లాలి. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా డోలి కట్టి తీసుకెళ్లాల్సిందే. గ్రామానికి రహదారి నిర్మాణానికి 2018–19లో రూ.3 కోట్లు నిధులు మంజూరు చేశారు. అప్పట్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నిధులు చెల్లుబాటు కాలేదు. కాగా 2023–24 లో సీకాయపాడు నుంచి చలిసింగం గ్రామం వరకు 3 కిలోమీటర్ల బీటీరోడ్డు నిర్మాణానికి రూ. 2 కోట్ల 65 లక్షలు నిధులు మంజూరు చేశారు. అప్పటి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఈ ఏడాది జనవరి 24 ఈ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రహదారి నిర్మాణానికి ఫారెస్టు అనుమతులు లేకపోవడంతో పాటు ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పనులు ప్రారంభించలేదు. నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు కావస్తున్నా సరే ఈ రోడ్డు నిర్మాణం ప్రారంభం కాలేదు. కలెక్టర్ డి.ఎల్.సి. సమావేశం ఏర్పాటు చేసి, ఫారెస్టు అనుమతులు ఇవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి తక్షణమే ఫారెస్టు అనుమతులు ఇప్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్యలపై వచ్చే ఏడాది జనవరి 8న అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట డోలీలు, గుర్రాలతో ర్యాలీ నిర్వహించి కలెక్టరు దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్తులు తెలిపారు. ఈ నిరసనలో ఏపీ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.గోవిందరావు, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు చీపురు శంకర్రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment