అన్నక్యాంటీన్ సెక్యూరిటీ గార్డు వీరంగం
● మద్యం మత్తులో డైనింగ్ టేబుల్ ధ్వంసం ● భయాందోళనలకు గురైన ప్రజలు
అన్న క్యాంటీన్‌లో ధ్వంసమైన టేబుల్
యలమంచిలి రూరల్: కూటమి ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడానికంటూ గొప్పగా ప్రారంభించిన అన్నక్యాంటీన్‌ల నిర్వహణ అధ్వానంగా ఉంటోంది. యలమంచిలి పట్టణంలోని ప్రధాన రహదారికి ఆనుకుని ఏర్పాటు చేసిన అన్నక్యాంటీన్‌లో కాపలాగా నియమించిన సెక్యూరిటీ గార్డే బుధవారం సాయంత్రం పూటుగా మద్యం సేవించి వీరంగం సృష్టించాడు. ఇక్కడ డ్యూటీలో ఉన్న మహలక్ష్మీనాయుడు మద్యం మత్తులో లోపలకు వెళ్లి డైనింగ్ టేబుల్‌ను విరగ్గొట్టాడు.అక్కడ కనిపించిన వారందర్నీ భయాందోళనలకు గురిచేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొందరు మహిళలు భయంతో అక్కడ్నుంచి వెళ్లిపోయారు.ఈ ఘటనపై స్థానిక టీడీపీ నాయకుడు ఆడారి ఆదిమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఘటనకు బాధ్యుడైన గార్డు జనసేనకు చెందిన వ్యక్తి కావడంతోనే తెలుగుదేశం నాయకులు ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.అన్నక్యాంటీన్ నిర్వహణను గాలికొదిలేస్తున్నారని, ఇంటర్నెట్ బిల్లు కూడా చెల్లించలేదని,ఉదయం కాపలాగా ఉండాల్సిన గార్డును పూర్తిగా తొలగించారని,క్యాంటీన్‌కు కాపలాగా ఉండాల్సిన ఉద్యోగే మద్యం తాగి వచ్చాడని దీనిపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఆదిమూర్తి తెలిపారు.ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని పట్టణ ఎస్‌ఐ కె.సావిత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment