కన్సార్టియం పోర్టులకు తలనొప్పిగా డీసీఐ | - | Sakshi
Sakshi News home page

కన్సార్టియం పోర్టులకు తలనొప్పిగా డీసీఐ

Published Thu, Jan 2 2025 2:01 AM | Last Updated on Thu, Jan 2 2025 2:01 AM

కన్సా

కన్సార్టియం పోర్టులకు తలనొప్పిగా డీసీఐ

దీన్‌దయాళ్‌ పోర్టులో డ్రెడ్జర్‌ పనులు

డేళ్ల కిందట డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌(డీసీఐ) ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పుడు ఉద్యోగులు ఐక్యంగా పోరాడారు. వీరికి విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ) అండగా నిలిచింది. మరో మూడు పోర్టులతో కలిసి డీసీఐ బాధ్యతను స్వీకరించింది. విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) 19.47 శాతం, జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్టు ట్రస్ట్‌ 18 శాతం, పారాదీప్‌ పోర్టు ట్రస్ట్‌ 18 శాతం, దీన్‌దయాళ్‌ పోర్టు ట్రస్ట్‌ 18 శాతం వాటాలతో కన్సార్టియంగా ఏర్పడి డీసీఐకి మద్దతుగా నిలిచాయి. దీంతో ప్రైవేటీకరణ నిర్ణయం నిలిచిపోయింది. ఆ తర్వాత డీసీఐ లాభాల బాటలో నడిచింది. మూడేళ్ల కిందట ఎండీ, సీఈవో నియామకంలో అవకతవకలు జరిగిన విషయం వెలుగులోకి రావడంతో విజిలెన్స్‌ విచారణ జరిపి ఎండీని తొలగించారు. ఆ తర్వాత కొత్త ఎండీ పదవీకాలం కూడా పూర్తయింది. అప్పటినుంచే డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ పతనం ప్రారంభమైంది. కొత్త ఎండీ, సీఈవోను నియమించకుండా పోర్టు డిప్యూటీ చైర్మన్‌ దుర్గేష్‌కుమార్‌ దూబేకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు కొంతమంది అధికారు లు డీసీఐని ప్రైవేట్‌కు విక్రయించేందుకు కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్సార్టియం పోర్టులు కేంద్రానికి ఫిర్యాదు చేయడం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది.

డీసీఐపై కేంద్రానికి లేఖలు

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌కు కన్సార్టియం పోర్టులుగా వ్యవహరించడం ఇబ్బందికరంగా మారిందంటూ ఇటీవల దీన్‌దయాళ్‌ పోర్టు, పారాదీప్‌ పోర్టులు మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తూ ఫిర్యాదు చేశాయి. తాజాగా డీసీఐకి కాంట్రాక్ట్‌ ఇచ్చిన మంగళూరు పోర్టు కూడా ఇదే బాట పట్టింది. డ్రెడ్జర్లకు సరిగా మరమ్మతులు చేయకపోవడం, పాత డ్రెడ్జర్లనే వాడుతుండటం వల్ల పనులు సక్రమంగా జరగడం లేదని ఈ పోర్టులు ఫిర్యాదు చేశాయి. డీసీఐకి అప్పగించిన పనుల విషయంలో అధికారుల తీరు సరిగా లేదని ఆరోపించాయి. దీన్‌దయాళ్‌ పోర్టు 2024 నుంచి 2027 వరకు నేవిగేషన్‌ చానెల్‌ డ్రెడ్జింగ్‌ పనుల కాంట్రాక్టును రూ.445.52 కోట్లకు డీసీఐకి అప్పగించింది. 10 మీటర్ల లోతు చొప్పున మొత్తం 7,400 క్యూబిక్‌ మీటర్ల మేర డ్రెడ్జింగ్‌ చేయాలని ఒప్పందం కుదిరింది. కానీ డీసీఐ కేవలం 8 మీటర్ల మేరకే తవ్వకాలు చేసిందని పోర్టు అధికారులు ఆరోపించారు. దీనివల్ల భారీ నౌకలను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడి, పోర్టుకు నష్టం వాటిల్లిందని మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇదే విధంగా డీసీఐ తమ పోర్టుల్లోనూ వ్యవహరించిందని మిగతా పోర్టులు ఆరోపించాయి. ఇలాంటి కారణాల వల్ల ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆ పోర్టులు స్పష్టం చేస్తున్నాయి.

పాత డ్రెడ్జర్లతో పనులా.?

పారాదీప్‌ పోర్టులో డీసీఐ రెండు కాలం చెల్లిన డ్రెడ్జర్లతో పనులు నిర్వహించి అస్తవ్యస్తంగా చేసింది. 2025 జనవరి నాటికి 7.5 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల మేర డ్రెడ్జింగ్‌ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 4.8 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు మాత్రమే పూర్తయింది. మరో డ్రెడ్జర్‌ను అందుబాటులోకి తెస్తే పనులు వేగవంతం చేయవచ్చని పోర్టు అధికారులు సూచించినప్పటికీ, డీసీఐ అధికారులు స్పందించడం లేదు. డీసీఐ తన ఉన్న పది డ్రెడ్జర్లతో ప్రధాన పోర్టుల పనులన్నీ పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, అవి పాతబడిపోవడంతో లక్ష్యాలను చేరుకోలేకపోతోంది. డ్రెడ్జర్ల మరమ్మతులు, కొత్త వాటి కొనుగోలుపై అధికారులు శ్రద్ధ చూపడం లేదు. కొన్ని సందర్భాల్లో డీసీఐ టెండర్లు పొంది, వాటిని వేరే సంస్థలకు సబ్‌ టెండర్లుగా ఇవ్వడం వల్ల ఆదాయం కోల్పోతోంది. దీంతో డీసీఐ నష్టాలను చవిచూస్తోంది.

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ తీరుపై పోర్టుల ఆగ్రహం

పనితీరు బాగోలేదంటూకేంద్రానికి ఫిర్యాదులు

మరోవైపు సంస్థ ప్రైవేటీకరణకు తెరవెనుక ప్రయత్నాలు

కీలకంగా వ్యవహరిస్తున్న కెప్టెన్‌ స్థాయి అధికారి?

రోజురోజుకూ డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ పనితీరు దిగజారుతుండటంపై కన్సార్టియం పోర్టులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేట్‌పరం కాకుండా డీసీఐని నిలబెట్టేందుకు ముఖ్య పాత్ర పోషించిన నాలుగు పోర్టుల పనుల్లో కూడా డ్రెడ్జింగ్‌ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సంస్థలో ఉన్న కొందరు అధికారులు తమ స్వార్థం కోసం డీసీఐని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రెడ్జింగ్‌ వ్యవహారం పెద్ద సమస్యగా పరిణమించిందని కన్సార్టియం పోర్టులు కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తూ లేఖలు రాయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. – సాక్షి, విశాఖపట్నం

ప్రైవేట్‌ సంస్థకు డేటా విక్రయం?

డీసీఐని ప్రైవేట్‌ కంపెనీకి కట్టబెట్టేందుకు కొందరు ఉన్నతాధికారులు కుట్ర పన్నుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డీసీఐ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఒక అధికారి ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేసి గుజరాత్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థలో చేరినట్లు తెలుస్తోంది. డీసీఐకి సంబంధించిన సాంకేతిక వ్యవహారాలు, ఇతర లావాదేవీలు, ఒప్పందాలు, ముఖ్య సమాచారాన్ని ఆ ఉద్యోగి ఆ సంస్థకు విక్రయించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసినప్పటికీ గతంలో ఎండీగా వ్యవహరించి ప్రస్తుతం ఉన్నతాధికారిగా ఉన్న ఒక కెప్టెన్‌ స్థాయి అధికారి కనీసం పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈయన వ్యవహార శైలిపై డీసీఐ ఉద్యోగ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అధికారి ఈ కుట్రలో కీలక భాగస్వామి అని, మొత్తంగా డీసీఐని ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టి తానే సర్వాధికారిగా వ్యవహరించేలా కుయుక్తులు పన్నుతున్నట్లు సమాచారం. పోర్టులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టేందుకు కేంద్ర షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
కన్సార్టియం పోర్టులకు తలనొప్పిగా డీసీఐ 1
1/1

కన్సార్టియం పోర్టులకు తలనొప్పిగా డీసీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement