గొలుగొండలో తుప్పులు, చెట్లతో నిండి ఉన్న చెరుకు తూనిక కేంద్రం (కాటా షెడ్డు)
సాక్షి, అనకాపల్లి : జిల్లాలో మూత పడిన ఏటికొప్పాక, తాండవ, తమ్ముపాల సహకార షుగర్ ఫ్యాక్టరీలు పరిధిలో ఉన్న కొన్ని తూనిక కేంద్రాలు అసాంఘిక కార్యకలాపాలకు, మందుబాబులకు ఉపయోగపడుతున్నాయి. మరికొన్ని చెట్లు, తుప్పలు పేరుకుపోయి బోసిపోయి ఉన్నాయి. జిల్లాలో ఈ మూడు షుగర్స్ పరిధిలో సుమారుగా 52 కాటా సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా 2 లక్షల టన్నుల చెరకు షుగర్ ఫ్యాక్టరీలకు పంపించేవారు. సగటున ఒక్కో కాటా సెంటర్ నుంచి 5 వేల నుంచి 10 వేల టన్నుల చెరకు తూనికలు జరిగేవి.
రైతులతో కళకళలాడేది. 2014–19 నాటి చంద్రబాబు సర్కార్ నిర్వాకం కారణంగా జిల్లాలో రాష్ట్రంలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ అయిన ఏటికొప్పాక, తాండవ, తుమ్మపాల ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. అప్పటి చంద్రబాబు సర్కార్ చెరకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం, షుగర్ ఫ్యాక్టరీల బకాయిలు చెల్లించకపోవడంతో చెరకు రైతు రోడ్డు పడ్డాడు. చెరకు సాగు చేసే రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు కల్పించకపోవడంతో చెరకు సాగు చేయాలంటే భయపడుతున్నారు. పెరిగిన పెట్టుబడులు చూసి రైతులు సాగు చేయడం పూర్తిగా మానుకున్నారు.
రోడ్డున పడ్డ రైతులు, 15 వేల కార్మికులు..
చెరకు ఎక్కువగా పడించే జిల్లాల్లో అనకాపల్లి జిల్లా పెట్టింది పేరు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సామర్థ్యం ఉన్న షుగర్ ఫ్యాక్టరీల్లో ఏటికొప్పాక అత్యంత పురాతన, ఎక్కువ సామర్థ్యం కలది. ఆ తరువాత గోవాడ, తాండవ, తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీలుంటాయి. వీటిలో గోవాడ షుగర్స్ తప్ప మరే ఫ్యాక్టరీలు క్రషింగ్‌ల్లో లేవు. దీంతో జిల్లాలో సుమారుగా 2 లక్షల టన్నుల చెరకు తగ్గింది. దాదాపుగా 15 వేల మంది కార్మికులు, ఉద్యోగులు, సుమారుగా ఒక లక్ష మంది రైతులు రోడ్డున పడ్డారు. అనకాపల్లి జిల్లాలో పరిధిలో అనకాపల్లి రూరల్, కశింకోట, మునగపాక, సబ్బవరం, చోడవరం మండల పరిధిలో 7 వేల మంది రైతులు చెరకు సాగు చేసి బెల్లం తయారీ చేస్తారు. మిగతా రైతులంతా ప్రత్యామ్నాయ పంటలైన వరి, అపరాలు, సరుగుడు వంటి పంటలు వేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment