‘ఖైదీలు జైలు నిబంధనలు పాటించాలి’
ఆరిలోవ(విశాఖ): జైలు నిబంధనలను ఖైదీలు తప్పనిసరిగా పాటించాలని విశాఖ జిల్లా సెషన్స్ జడ్జి ఆలపాటి గిరిధర్ తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని ఆదివారం జిల్లా న్యాయమూర్తితో పాటు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సందర్శించారు. జైల్లో శనివారం జరిగిన వార్డర్ల ఆందోళనపై ఆరా తీశారు. అనంతరం ఖైదీలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి, సీపీ మాట్లాడుతూ జైలు లోపలకి గంజాయి, మొబైల్ ఫోన్‌లు, బీడీలు తదితర నిషేధిత వస్తువులు తీసుకురావడం, వినియోగించడం చేయకూడదన్నారు. రౌడీ షీట్లు ఉన్న ఖైదీలు మంచి ప్రవర్తనపై విడుదలవ్వాలని సూచించారు. అలాంటివారికి నైపుణ్యం ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. జైళ్ల శాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఈ–ములాఖత్, ఫిజికల్ ఇంటర్వ్యూలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగించుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment