నేటి నుంచి ఏపీఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణ
కశింకోట : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సర వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై మంగళవారం నుంచి మూడు రోజులపాటు ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించనున్నట్టు ఏపీఈపీడీసీఎల్ కశింకోట డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.రామకృష్ణ సోమవారం ఇక్కడ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారులు పాల్గొనాలన్నారు. ఈ నెల 7,8 తేదీల్లో విజయవాడ బృందావన్ కాలనీలో ఉన్న ఎ కన్వెన్షన్ సెంటర్, 10న కర్నూలులోని కమిషనర్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాలులోను ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యక్ష హాజరు ద్వారా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ నియంత్రణ మండలి అన్ని డిస్కంల టారిఫ్ ఫైలింగ్‌కు సంబంధించిన సూచనలు, అభ్యంతరాలను మూడు రోజులు వింటుందన్నారు. విద్యుత్ ధరలపై సందేహాలు, సలహాలు, సూచనలను విద్యుత్ వినియోగదారులు ప్రజాభిప్రాయ సేకరణలో ఇవ్వవచ్చునన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కశింకోట ఎపీఈపీడీసీఎల్ డివిజన్ కార్యాలయంలో గాని, అనకాపల్లి విద్యుత్ ఆపరేషన్ సర్కిల్ కార్యాలయ సూపరింటిండెంటింగ్ ఇంజినీర్ వారి కార్యాలయంలో గాని సంప్రదించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రతి రోజూ ముందుగా వినియోగదారుల అభ్యంతరాలు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతితో నమోదు చేసుకొని వాటిని వినడం జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment