ప్రధానికి ఘనంగా స్వాగతం పలకాలి
● అధికారులతో మంత్రులు, కలెక్టర్ సమీక్ష
తుమ్మపాల : రాష్ట్ర అభివృద్ధికి నిధులు, ప్రాజెక్టులు అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజలు పెద్దఎత్తున హాజరై ఘనస్వాగతం పలకాలని, రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేయాలని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జిల్లాకు సంబంధించిన ఏర్పాట్లను హోంమంత్రి వంగలపూడి అనిత, ఆహార,పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం మద్యాహ్నం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు రూ.90 వేల కోట్లు ప్రాజెక్టులు మంజూరు చేసి, గ్రీన్ ఎనర్జీ, బల్క్ డ్రగ్ పరిశ్రమలకు ఈ నెల 8న ప్రధాని శంకుస్థాపన చేయనున్నారన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలకడానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని, రాష్ట్రప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేయడానికి ప్రజలు తరలిరావాలన్నారు. ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో బహిరంగ సభకు వచ్చే ప్రజలందరు తిరిగి సురక్షితంగా వారి గ్రామానికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సభకు ప్రజలను తరలించే ఆర్టీసీ బస్సులు పర్యవేక్షణకు సంబంధించి కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ మండలాల నుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్ నియంత్రణపై ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవాలని, రూట్‌మ్యాప్ తయారు చేసుకోవాలని, విశాఖపట్నం అధికారులతో సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ బాధ్యతలు కేటాయించిన సిబ్బంది ప్రజలను సమీకరించి జాగ్రత్తగా తీసుకురావాలన్నారు. ప్రతి బస్సుపై మండలం, గ్రామం, బాధ్యుని ఫోన్ నెంబరు ఏర్పాటు చేయాలని తెలిపారు. కలెక్టర్ విజయకృష్ణన్ కార్యక్రమ ఏర్పాట్లను వివరించారు. జిల్లా నుంచి 840 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని, 42 వేల మందిని సమీకరించడం జరుగుతుందని, ప్రతి బస్సుకు ఇద్దరు సిబ్బందిని బాధ్యులుగా నియమించడం జరిగిందని, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పర్యవేక్షణ బృందాలను నియమించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయకుమార్, పంచకర్ల రమేష్ బాబు, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, లోకం నాగమాధవి, డీఆర్వో వై. సత్యనారాయణరావు, ఆర్డీవోలు షేక్ ఆయిషా, రమణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment