నేడు కనకమహాలక్ష్మి జాతర
● భారీగా ఏర్పాట్లు ● లక్షమందికి పైగా తరలివస్తారని అంచనా ● విద్యుత్ దీపాలతో కాంతులీనుతున్న పట్టణం ● 100 మందితో పోలీసు బందోబస్తు
యలమంచిలి రూరల్: భక్తజన కల్పవల్లిగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రసిద్ధి చెందిన యలమంచిలి ధర్మవరం కనకమహాలక్ష్మి అమ్మవారి జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు.ప్రతి ఏటా మార్గశిరమాసోత్సవాలు ముగిసిన తర్వాత అమ్మవారి జాతరను నిర్వహించడం ఆనవాయితీ. ఈ జాతరకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి లక్ష మందికి పైగా జనం వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.ఇందుకనుగుణంగా ధర్మవరంలో అమ్మవారి ఆలయం వద్ద ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించారు.
భారీ పోలీసు బందోబస్తు
జాతరకు తరలివచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా యలమంచిలి పట్టణంలో ఎలాంటి గొడవలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.యలమంచిలి సీఐ ధనుంజయరావు ఆధ్వర్యంలో ఎనిమిది మంది ఎస్‌ఐలు,15 మంది ఏఎస్‌ఐలు,సుమారు 100 మంది పోలీసులు బందోబస్తులో భాగస్వాములు కానున్నారు.పరవాడ డీఎస్పీ కె.వి.సత్యనారాయణ బందోబస్తును పర్యవేక్షించనున్నారు.ముఖ్యంగా పోకిరీల వేధింపులు,చైన్ స్నాచింగ్‌లు వంటివి జరగకుండా మఫ్టీలో పోలీసులు నిఘా ఉంచనున్నారు.జాతరలో అల్లర్లకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని యలమంచిలి సీఐ ధనుంజయరావు స్పష్టం చేశారు.
విద్యుత్‌దీప కాంతుల్లో అమ్మవారి ఆలయం
భారీ విద్యుత్ దీపాల సెట్టింగ్‌లు
జాతరను పురస్కరించుకుని అమ్మవారి ఆలయం,చుట్టుపక్కల రహదారులు,యలమంచిలి ప్రధాన రహదారికిరువైపులా విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా భారీ సెట్టింగులు ఏర్పాటు చేశారు. దేవతామూర్తుల రూపాలతో విద్యుత్ దీపాలతో ఏర్పాటుచేసిన కటౌట్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.అమ్మవారి జాతరలో భాగంగా స్థానిక రాజీవ్ క్రీడామైదానంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జెయింట్‌వీల్,రంగులరాట్నం,డ్రాగన్ ట్రైన్,రియల్ డ్యాన్స్,పిల్లలకోసం గుర్రపు స్వారీ,ప్రత్యేక ఆటలు వంటివి ఇక్కడ సిద్ధం చేశారు.ఇవికాకుండా కోలాటాలు,స్టేజీ ప్రోగ్రాంలు, బుర్రకథ, హరికథ, సంప్రదాయ నృత్యప్రదర్శనలు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి.పలువురు వీఐపీలు, ప్రముఖులు,వ్యాపారులు,ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకోనుండడంతో అందుకు తగినట్లుగా ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది.జాతరను విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులు శనివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోరారు. ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ కొటారు సాంబ,కొటారు నరేష్,మడగల సత్యనారాయణ,పిల్లా రాము,ప్రసాద్,అల్లిమళ్ల రాజు,పలువురు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment