భవిష్యత్తుకు భరోసా ఏదీ బాబూ?
అనంతపురం కార్పొరేషన్: ఎన్నికలకు ముందు ఇబ్బడి ముబ్బడిగా హామీలు గుప్పించి ప్రజల భవిష్యత్తుకు తనది గ్యారెంటీ అంటూ గొప్పలకు పోయిన చంద్రబాబు.. ప్రభుత్వం ఏర్పాటు చేసి 8 నెలలు కావస్తున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ లేకుండా చేశారని రాప్తాడు నియోజవకర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫీజు పోరుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి, మాట్లాడారు. ఈ నెల 5న జిల్లా కేంద్రంలో జరిగే ఫీజు పోరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు, పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కేంద్రం విడుదల చేసిన బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందన్నారు. చంద్రబాబు చెప్పిన బుల్లెట్ రైలుకు, గోదావరి పరకచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఎటువంటి కేటాయింపులు జరగలేదన్నారు. 16 మంది ఎంపీలున్న టీడీపీ కన్నా..12 మంది ఎంపీలున్న జేడీయూ తన రాష్ట్రానికి (బిహార్)కు నిధులు రాబట్టుకోవడంలో సఫలమైందన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు 45.72 మీటర్లు కాగా, 41.1 మీటర్లకే పరిమితం చేశారని, పనులకు రూ.5,936 కోట్లు కేటాయిస్తున్నామని కేంద్రం బడ్జెట్‌లో స్పష్టం చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు 45.72 మీటర్లకు చేస్తే 600 గ్రామాలకు తాగునీరు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాకారమవుతుందన్నారు. అలాగే కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు,. 960 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి, విశాఖ నగరానికి తాగునీరు కూడా ఇవ్వొచ్చునన్నారు. రాయలసీమకు 80 టీఎంసీల నీటిని మళ్లిస్తామంటూ చంద్రబాబు చెప్పినవన్నీ కట్టుకథలేనని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత లక్షలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించారన్నారు. నీతి అయోగ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చంద్రబాబు మాట్లాడిన తీరు చూస్తే తాము సంపదను సృష్టించిన తర్వాతనే సూపర్ సిక్స్ ఇస్తామని ప్రజలను దగా చేసే కుట్రకు తెరలేపారనేది స్పష్టమవుతోందన్నారు. ఇటీవల అసెంబ్లీలో రాష్ట్ర అప్పులు రూ.6 లక్షల కోట్లు అని ప్రకటించి... గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు అని ఎల్లోమీడియా, పురంధరేశ్వరితో చంద్రబాబు చెప్పించి తన నైజాన్ని బయటపెట్టుకున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివిధ పథకాలతో ప్రజలకు మేలు చేశాన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలంటే బడ్జెట్‌లో రూ.1.50 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉందని, ఆ దిశగా ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఎస్‌కే లింగారెడ్డి, చిరంజీవి, మీనుగ నాగరాజు, నీరుగంటి నారాయణ రెడ్డి, గంగుల సుధీర్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, నరసింహారెడ్డి, ఈశ్వరయ్య, నిఖిల్‌యాదవ్, రాజశేఖర్‌రెడ్డి, మన్‌ప్రీత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫీజు పోరును జయపద్రం చేద్దాం
బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం
రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment