కుక్కల దాడిలో చిన్నారులకు గాయాలు
రాయదుర్గం టౌన్: మండలం మల్లాపురం గ్రామ బీసీ కాలనీలో వీధి కుక్కలు దాడి చేయడంతో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులు స్నేహ, లతపై రెండు కుక్కలు దాడి చేశాయి. స్థానికులు వెంటనే కుక్కలను తరిమి కొట్టారు. గాయపడిన చిన్నారులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించారు. కాగా, అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.
కొండపై వృద్ధుడి మృతి
శింగనమల: కొండపైకి ఎక్కుతూ ఓ వృద్ధుడు గుండెపోటుకు గురై మృతి చెందాడు. వివరాలు... మాఘమాసాన్ని పురస్కరించుకుని అనంతపురానికి చెందిన గొంది ప్రకాష్(67), తన భార్య రామసుందరి, తమ్ముడి కుమారుడు గొంది సుబ్రహ్మణ్యంతో కలసి ఆదివారం సాయంత్రం 4 గంటలకు శింగనమల సమీపంలోని రుష్యశృంగుని కొండపై ఉన్న ఆలయంలో పూజకని వచ్చారు. కొండపైకి దాదాపు 2 కిలోమీటర్ల ఎక్కిన తర్వాత గొంది ప్రకాష్ గుండెపోటుకు గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో విషయం తెలుసుకున్న కానిస్టేబుళ్లు నరేష్‌కుమార్, రామాంజనేయులు, 108 సిబ్బంది కేశవ, సాకే శివ వెంటనే అక్కడకు చేరుకున్నారు. అంబులెన్స్‌ను కొండ దిగువన పైకి వెళ్లి పరీక్షించే లోపు గొంది ప్రకాష్ మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని కిందకు దించి, కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఆంధ్ర వెటరన్స్ ఘన విజయం
అనంతపురం: పీవీకేకే ప్రసాద్ స్మారక సౌత్ జోన్ వెటరన్ క్రికెట్ టోర్నీ విజేతగా ఆంధ్ర వెటరన్స్ జట్టు నిలిచింది. ఆంధ్ర, తమిళనాడు జట్ల మధ్య ఆదివారం ఆర్డీటీ క్రీడా గ్రామంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి తమిళనాడు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆంధ్ర జట్టు 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఏజీ ప్రవీణ్ 38 పరుగులు, జి.ఎలజెర్ 32 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన తమిళనాడు జట్టు 19.3 ఓవర్లలో 106 పరుగుల వద్ద చతికిలబడింది. ఆంధ్రా బౌలర్లు ఎస్‌ఎస్ భరత్ కుమార్ 5 వికెట్లు తీసి తమిళనాడును కోలుకోలేని దెబ్బ తీశాడు. 82 పరుగుల తేడాతో ఆంధ్ర వెటరన్స్ జట్టు విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment