వ్యక్తి దారుణ హత్య
రాప్తాడు రూరల్: ధర్మవరం రూరల్ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన దేవరకొండ ఎరికల కాశీ (40) అనంతపురం నగర శివారులో దారుణ హత్యకు గురయ్యాడు. కక్కలపల్లి సమీపంలోని టమాట మండీలో గుమాస్తాగా పని చేస్తున్న ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. సొంతంగా ఓ వాహనాన్ని సైతం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అనంతపురం నగర శివారులోని 44వ జాతీయ రహదారి సమీపంలో సంగమేశ్వర ఫంక్షన్ హాల్ పక్కన చింతవనంలో హతమై కనిపించాడు. సమాచారం అందుకున్న అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు, సీఐ శేఖర్, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం ఘటన జరిగినట్లుగా ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. తలపై బండరాళ్లతో మోది హత్య చేసినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. కాగా, మృతదేహం పరిసర ప్రాంతాల్లో ఖాళీ మందుబాటిళ్లు, వాటర్ బాటిళ్లు, స్నాక్స్ పార్శిల్ తెచ్చుకున్న కాగితాలు పడి ఉండడంతో... కాశీతో పాటు ఇక్కడ డిన్నర్ చేసుకున్నవారే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. రెండు నెలలుగా ఇంటికి సైతం వెళ్లకుండా టమాట మండీలోనే ఉన్నట్లుగా తెలిసింది. ఈ క్రమంలో కుటుంబంలో ఏవైనా గొడవలున్నాయా? లేదా ఆర్థిక లావాదేవీలా? వివాహేతర సంబంధాలు ఏమైనా కారణమా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగుతోంది. ఘటనపై అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
44వ జాతీయ రహదారి సమీపంలోని చింత తోపులో ఘటన
మృతుడు ధర్మవరం మండలం
మల్కాపురం వాసి
ఘటనాస్థలాన్ని పరిశీలించిన
అనంతపురం రూరల్ డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment