సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌లో 2021–22 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జాతీయ ప్రాజెక్టు పోలవరానికి ఏ మేరకు నిధులు కేటాయిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. పోలవరాన్ని 2022 ఖరీఫ్ నాటికి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. ఈ సీజన్‌లో అంటే గోదావరికి వరదలు వచ్చేలోగా పూర్తి చేయాల్సిన పనులకు రూ.10 వేల కోట్లు అవసరమని అంచనా వేసింది. ఆ మేరకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. పోలవరానికి బడ్జెట్ ద్వారా నిధులు కేటాయించడంతోపాటు ‘రివాల్వింగ్ ఫండ్’ ఏర్పాటు చేయాలని విజæ్ఞప్తి చేసింది. అవసరమైన మేరకు నిధులు విడుదల చేస్తే దశాబ్దాల కల పోలవరం సాకారమయ్యేందుకు మార్గం సుగమం అవుతుందని నీటిపారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
మూడుసార్లు బడ్జెట్‌లోనే..
రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వంద శాతం ఖర్చును భరించి తామే పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు 2014–15, 2015–16, 2016–17లో బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తూ వచ్చింది. అయితే పోలవరం నిర్మాణ బాధ్యతను టీడీపీ హయాంలో గత సర్కారుకు అప్పగించిన సమయంలో అంటే 2016 సెప్టెంబరు 8న నిధుల మంజూరుపై మెలిక పెట్టింది. నాబార్డు (జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు) వద్ద ఏర్పాటు చేసే ఎల్‌టీఐఎఫ్ (దీర్ఘకాలిక నీటిపారుదల నిధి) నుంచి రుణం తీసుకుని ఎన్‌డబ్ల్యూడీఏ(జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) ద్వారా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా విడుదల చేస్తామని పేర్కొంది. దీంతో 2017–18 నుంచి 2020–21 వరకూ ఏ బడ్జెట్‌లోనూ పోలవరానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. నాబార్డు నుంచి రుణం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన నిధులను రీయింబర్స్ చేస్తూ వస్తోంది.
ఇప్పటికి రూ.10,741.76 కోట్లే విడుదల..
పోలవరం ప్రాజెక్టుకు 2014 ఏప్రిల్ 1కి ముందు అంటే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు రాష్ట్ర ప్రభుత్వం రూ.5,135.87 కోట్లను ఖర్చు చేసింది. 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.55,656.87 కోట్లుగా సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) టీఏసీ (సాంకేతిక సలహా మండలి) ఆమోదం తెలిపింది. రివైజ్డ్ కాస్ట్ కమిటీ రూ.47,725.74 కోట్లుగా పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని నిర్ధారించింది. సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన ప్రకారం తీసుకుంటే పోలవరం నీటిపారుదల వ్యయం రూ.51,532.23 కోట్లు ఉంటుంది. కాగా 2014 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు రూ.12,295.93 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో రూ.10,848.38 కోట్లను కేంద్ర ప్రభుత్వం పీపీఏకు విడుదల చేయగా రూ.10,741.76 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదలయ్యాయి. ఇంకా రూ.1,554.17 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉంది. కేంద్రం రీయింబర్స్ చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే నీటిపారుదల వ్యయం రూపంలో పోలవరానికి ఇంకా రూ.35,654.60 కోట్లను కేంద్రం మంజూరు చేయాల్సి ఉంటుంది.
బడ్జెట్ ద్వారా కేటాయించాలని ప్రతిపాదన..
పోలవరాన్ని 2022 ఖరీఫ్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని పనులు చేస్తున్నామని, గోదావరికి వరద వచ్చేలోగా పూర్తి చేయాల్సిన పనుల కోసం రూ.పది వేల కోట్లను జూన్‌లోగా విడుదల చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. పునర్విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి బడ్జెట్ ద్వారా నిధులు కేటాయించాలని విజæ్ఞప్తి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లకు ఇదే అంశంపై పలు మార్లు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రివాల్వింగ్ ఫండ్ రూపంలో నిధులను మంజూరు చేస్తే పోలవరం పనులకు ఇబ్బందులు లేకుండా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయవచ్చని, తద్వారా అంచనా వ్యయం పెరగకుండా అడ్డుకట్ట వేయవచ్చని ప్రతిపాదించారు.
నిధులిస్తే నిర్విఘ్నంగా..
Published Sun, Jan 31 2021 4:24 AM | Last Updated on Sun, Jan 31 2021 4:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment