బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జగన్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు ప్రవేశపెడుతోంది. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతోంది. ఎప్పటికప్పుడు ఆధునిక విధానాలను అనుసరించి ఈ స్కూళ్లు పోటీలో నిలిచేలా నిరంతర కసరత్తు చేస్తోంది. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, బ్యాగులు, షూలు ఇలా అన్నీ సమకూర్చుతూ మరోపక్క బోధనా పద్ధతుల్లో కూడా వినూత్న పద్ధతులు పాటించేలా సంస్కరిస్తోంది. గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఈ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మునుపటి ప్రభుత్వ స్కూళ్లు కావని తల్లితండ్రులూ గుర్తిస్తున్నారు.
తరగతిలోనే బోధనకు సన్నాహాలు
ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలోని 380 పాఠశాలల్లో దాదాపు రూ.64 కోట్ల ఖర్చుతో 19,982 మందికి ట్యాబుల పంపిణీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ట్యాబు ద్వారా బైజూస్ కంటెంట్ విద్యార్థులకు బోధించేందుకు పాఠశాలలోని ప్రతి తరగతి గదిలో ఐఎఫ్ ప్యానెల్, స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు సులభంగా బోధించేందుకు మార్గం ఏర్పడుతోంది. ప్రతి ట్యాబ్ కూడా మూడేళ్ల వారంటీతో కొనుగోలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులు ట్యాబ్‌లు ఉపయోగించే క్రమంలో ఏదైనా పొరపాటున స్క్రీన్ డ్యామేజీ జరిగితే ప్రభుత్వమే బాగు చేయించాలని సంకల్పించింది.
ప్రతినెలా పాఠశాలల సందర్శన
విద్యార్థులకు అందజేసిన ట్యాబులు దుర్వినియోగం కాకుండా డీఈఓ, డీవైఈఓ, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. డిజిటల్ అసిస్టెంట్లు ప్రతినెలా కనీసం ఒక్కసారి ప్రతి పాఠశాలనూ సందర్శిస్తారు. ట్యాబ్‌ల పనితీరు చెక్ చేస్తారు. ట్యాబ్ రిపేరు బాధ్యతలు కూడా చూస్తారు. వెల్పేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కూడా ప్రతివారం పాఠశాలను సందర్శిస్తారు. ప్రతి శుక్రవారం ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుడి ట్యాబులకు వైఫై కనెక్ట్ చేసి వినియోగ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు.
ట్యాబ్ దుర్వినియోగం చేయకుండా ప్రతీఒక్కరు సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. యూట్యూబ్, కెమెరా, ఇతర యాప్‌లు ఓపెన్ కాకుండా టెక్టోరో అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ సహాయంతో చర్యలు చేపట్టింది. మూడు యాప్ వైఫై, బైజూస్, (డిక్షనరీ)ను అందుబాటులో ఉంచింది. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌చేయడానికి ఎంఆర్సీ సిబ్బంది, సీఆరీ్పలకు, పాఠశాల హెచ్‌ఎంలు, యాక్టివ్ టీచర్లు, డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ ఇస్తోంది. వీరంతా పాఠశాల స్థాయిలోనే అప్‌డేట్ ప్రక్రియ చేపడుతున్నారు. ఈ క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే హెల్ప్ లైన్లు కూడా సిద్ధం చేశారు.
చురుగ్గా ఏర్పాట్లు
సర్కారు బడుల్లో చదుకునే విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలనేది రాష్ట్ర ప్రభుత్వ బలమైన సంకల్పం. ఒక్క తెలుగు మాధ్యమంతో వీరు కార్పొరేట్ స్కూలు పిల్లలతో పోటీ పడలేరని గ్రహించి ఆంగ్ల మాధ్యమాన్ని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకునేలా బై–లింగ్విన్ పద్ధతిలో పుస్తకాలను ముద్రించింది. అంతేకాదు ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్ ఇన్‌స్టాల్ చేసిన ట్యాబులను అందజేస్తోంది. ఒక్క సంవత్సరం మొక్కుబడిగా ఇచ్చి చేతులు దులుపుకోలేదు. వరుసగా రెండో ఏడాది కూడా ట్యాబుల పంపిణీకి విద్యాశాఖ చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది జిల్లాలోని విద్యార్థులు, టీచర్లకు కలిపి 23,099 ట్యాబులను పంపిణీ చేసింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.67.23 కోట్లు ఖర్చు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment