మంత్రి కారుమూరి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు
ఇరగవరం: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు ఆకర్షితులై, వారు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు గ్రామంలో సోమవారం మంత్రి సమక్షంలో జనసేన, టీడీపీలకు చెందిన 200 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరిలో 15 కుల సంఘాల వారు, మహిళలు అధిక సంఖ్యలో చేరగా, వీరికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వనించారు.
ఈ సందర్భంగా తూర్పువిప్పర్రు గ్రామంలో శెట్టిబలిజ రామాలయం వద్ద ఉన్న శెట్టిబలిజ నాయకుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి శెట్టిబలిజ కులంలో మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయానికి కార్యకర్తలు సమష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రూ.25 లక్షల విలువైన వైద్యం అందేలా మార్పులు చేస్తూ అందించిన ఆరోగ్యశ్రీ కార్డులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు.
సంక్షేమ పాలనకు మెచ్చి..
పెదవేగి: ఏలూరు జిల్లా పెదవేగి మండలం కూచింపూడిలో టీడీపీ, జనసేన పార్టీలకు భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పాలనకు, దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులైన సుమారు 200 మంది టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి సమక్షంలో సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు.
ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ బాణాసంచాతో ఘనస్వాగతం పలికారు. పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. చేరికల కార్యక్రమానికి ముందు కూచింపూడి మెయిన్ రోడ్డు నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాతా రమ్య, పెదవేగి సొసైటీ చైర్మన్ పెనుమాక వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీని ఎదుర్కోలేకే..
భీమవరం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, వైఎస్సార్‌సీపీకి ఉన్న ప్రజాబలాన్ని ఢీకొట్టడం ప్రతిపక్ష పార్టీలకు సా«ధ్యమయ్యే పనికాదని గ్రహించడం వల్లే మొత్తం పార్టీలన్నీ మూకుమ్మడిగా దాడికి సిద్ధమవుతున్నాయని ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ గ్రామానికి చెందిన క్షత్రియ యూత్ ఉద్దరాజు రాజేష్‌వర్మ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే శ్రీనివాస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
సీఎం జగన్ గత ఐదేళ్లుగా జనరంజకమైన పాలన అందించడంతో అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని, దీంతో రానున్న ఎన్నికల్లో మరోసారి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడం ఖాయమైందని చెప్పారు. జగన్ ప్రజా బలాన్ని చూసి భయపడిన ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒంటరిగా పోటీ పడలేక మూకుమ్మడిగా పోటీకి రావాలని చూస్తున్నాయని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన వంటి పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తే తమ పార్టీ కార్యాలయాలను మూసేసే పరిస్థితి ఏర్పడుతుందని గ్రహించడం వల్ల చంద్రబాబు గతంలో గెల్చుకున్న 23 స్థానాలైనా దక్కించుకోవడానికి పొత్తుల కోసం పాకులాడుతున్నారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు.
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ 175 సీట్లు గెలిచి తీరుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నరసాపురం పార్లమెంట్ అ«భ్యర్థి గూడూరి ఉమాబాల, రాష్ట్ర యువత నాయకుడు గ్రంధి రవితేజ, ఎంపీపీ పేరిచర్ల విజయ నర్సింహరాజు, పార్టీ పట్టణ అధ్యక్షుడు తోట భోగయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు తదితరులున్నారు. పార్టీలో చేరినవారిలో ఉద్దరాజు అప్పలరాజు, కూనపరాజు దుర్గరాజు, ముదునూరి శివనాగరాజు, అల్లూరి వెంకట కృష్ణంరాజు, పి.చల్లారావు, సుబ్రమణ్యం, కూనపరాజు వాసురాజు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment