జీఎస్టీపై ఒక శాతం సర్‌చార్జీ ఆలోచన దారుణం
బాబు పాలనలో మండుతున్న నిత్యావసర ధరలు
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని ఆగ్రహం
రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఇది చాలదన్నట్లు జీఎస్టీపై కొత్తగా ఒక శాతం అదనపు సర్‌చార్జి పెంచడానికి రంగం సిద్ధంచేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ మండిపడ్డారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఒక శాతం అదనంగా జీఎస్టీ పెంచుకోడానికి అనుమతివ్వాలని నిస్సిగ్గుగా కోరడం దారుణమని ఆక్షేపించారు. సంపద సృష్టించడమంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఎడాపెడా హామీలు గుప్పించిన చంద్రబాబు.. సంపద సృష్టించి వీటిని అమలుచేస్తామని చెప్పారని.. కానీ, ఇలా ట్యాక్స్‌లు పెంచుకుంటూ పోవడమే సంపద సృష్టించడమవుతుందా అని భరత్ ప్రశ్నించారు.
స్మార్ట్ మీటర్ల పేరుతో రూ.11వేల కోట్ల భారం..
ఇక విజయవాడ వరదలు వచ్చాయని రాష్ట్ర ప్రజలంతా ఒక శాతం ట్యాక్స్ కట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని మార్గాని మండిపడ్డారు. నిజానికి.. వరదల పేరు చెప్పి కొన్ని రూ.వందల కోట్ల విరాళాలు వసూలుచేశారని, ఆ డబ్బు ఎలా పక్కదారి పట్టించారో అందరికీ తెలుసునన్నారు. ఇప్పుడు మరోసారి ట్యాక్స్ పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. ఇక వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో ఉరితాళ్లు వేయవద్దని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్ల పేరు చెప్పి ప్రజలపై రూ.11 వేల కోట్ల భారాలు రుద్దేందుకు రంగం సిద్ధంచేస్తున్నారని చెప్పారు. అలాగే, నవంబరు 15 నుంచి యూనిట్‌కు రూ.1.58 పెంచేందుకు సిద్ధం చేశారని ఆయనన్నారు. ఉచిత ఇసుక ఎక్కడాలేదని.. టీడీపీ ఎమ్మెల్యేలు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారని భరత్‌రామ్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment