పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన నేడు వైఎస్సార్‌సీపీ కీలక సమావేశం
సూపర్ సిక్స్‌తో సహా కూటమి ప్రభుత్వం హామీల ఎగవేతపై చర్చ
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలపై సమీక్ష
ధాన్యం సేకరణలో రైతులను దగా చేస్తున్న వైనంపైనా చర్చ
పేదలకు నష్టం చేస్తున్న ప్రభుత్వ విధానాలను ఎండగట్టేలా కార్యాచరణకు రూపకల్పన
ప్రజల పక్షాన పోరాటానికి నేతలకు మార్గనిర్దేశం చేయనున్న జగన్
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్‌తో సహా హామీల ఎగవేత, సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై విస్తృతంగా చర్చించి, ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందించడమే అజెండాగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కీలక నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో–ఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ కమిటీల ఏర్పాటు, వాటి భర్తీపై సమావేశంలో నేతలకు వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు, కరెంటు ఛార్జీలు భారీగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న తీరుపై ఆందోళనలు చేపట్టడంపై సమావేశంలో చర్చిస్తారు.
సూపర్ సిక్స్తోసహా ఎన్నికల హామీలు ఎగ్గొట్టిన వైనం, ధాన్యం సేకరణ సక్రమంగా లేకపోవడం, సేకరిస్తున్న ధాన్యానికి కూడా మద్దతు ధర ఇవ్వకపోవడం, అటు మిల్లర్లు ఇటు దళారులు కలిసి రైతులను దోచుకుంటున్న వైనంపై పోరాటం చేసే విషయంపై చర్చించనున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక రాష్ట్రంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు, ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేయడం, పేదలకు అత్యంత నష్టం చేకూరుస్తున్న ప్రభుత్వ విధానాలపై చర్చించి, వాటిని ఎండగట్టేందుకు సమావేశంలో కార్యాచరణ రూపొందించి, నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment